3, ఆగస్టు 2024, శనివారం

కీ.శే. కన్నేపల్లి వరలక్ష్మి స్మృత్యంజలి :

కం.

వరలక్ష్మీ నా మాంగన  

వరలక్ష్మీ వృత్త రాశి వఱలుచు నుండన్ 

వరలక్ష్మీ శతకమ్మును 

వరలక్ష్మీ భక్తి వ్రాసె వనితా మణియే   

1.      

 

 

 

ఉ.

సక్షమ నక్షరార్చనను జక్కని శైలినిఁ బ్రస్ఫుటమ్ముగా

నక్షర సక్రమమ్మున సమంచిత  శబ్దము లర్హ రీతినిం

శిక్ష నొసంగ బాలురకుఁ జేర్చుచు నీ వరలక్ష్మి వ్రాసెఁ దా

నీ క్షితి వాసి కెక్కఁ దరళేక్షణ రమ్యతరమ్ముగా నహో     

2.     

 

 

 

కం.

పౌత్రిని సాయి సహస్రా

యాత్రమ్ముగ నేరు మంచు నంచిత నీతుల్

సూత్రమ్ములు వచియించుచుఁ

జిత్రమ్ముగఁ గొన్ని సెప్పెఁ జిఱు శతకములో    

3.     

 

 

 

ఉ.

జొన్నలగెడ్డ వంశమును శోభిత వంశముఁ గన్నెపల్లినిన్ 

మిన్నఁగ వృద్ధి సేయు గతి మేదిని వర్తిలి సంతతమ్ము దా

నన్నుల మిన్న కావ్య రచ నావనిఁ బెన్నిధియై మెలంగుచుం

జెన్నుగఁ జిత్ర బంధములఁ జేర్చెను నొవ్వక పద్యకోటినిన్    

4.     

 

 

 

శా .

వాణీ దత్త వరప్రసాదమున విద్వల్లోక దివ్య ప్రభా 

మాణిక్యం బయి  యాంజనేయ మహిమా మాధుర్య రాజత్కథా 

శ్రేణీ వర్ణిత కావ్య కర్త్రి యయి కీర్తిం బొందె నింపారఁగా   

వీణా పాణి సమైక్య సాధనకు నువ్విళ్లూరఁగా నేఁగెనే    

5.     




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి