7. సమస్య: అధ్యాపకుఁ డనఁగ నెవ్వఁ డజ్ఞాని గదా
విద్యయన బ్రహ్మ విద్యయె
మిధ్య డుకృంకరణులన్ని
మేటిగ జెప్పన్
విద్యాధికుడని యన్యుని
నధ్యాపకుఁ డనఁగ నెవ్వఁ డజ్ఞాని గదా
8. సమస్య: పాపకర్ములు దుష్టులు భాగవతులు.
ఆచరించిన యఘముల కార్తి జెంది
మలినములనన్ని మనమున మట్టు వెట్టి
విషయ వాంఛల విడనాడి విష్ణు గొలువ
పాపకర్ములు దుష్టులు
భాగవతులు.
9. సమస్య: ఏనుఁగు, చిట్టెలుకఁ గాంచి యెంతొ భయపడెన్.
కానగ చోద్యంబాయెను
సానువునకదలుచునంకు సంబునుకేలం
బూనియు నడుపుచు మావటి
యేనుఁగు, చిట్టెలుకఁ గాంచి
యెంతొ భయపడెన్.
10. సమస్య: దేవుఁడే లేఁ డనెడువాఁడు దేవుఁ డయ్యె.
మొదల నాస్తికుడే శైవ ముఖ్యు డాయె
తుదిని కనులుముక్కంటికి దోచి యిచ్చి
భక్త కన్నప్ప మనకిల పరమ గురుడు
దేవుఁడే లేఁ డనెడువాఁడు దేవుఁ డయ్యె.
11. కాంతా రమ్మనెను మోక్షకాముకుఁడు తమిన్.
11. కాంతా రమ్మనెను మోక్షకాముకుఁడు తమిన్.
సంతత ఘన జప తపముల
నంతే వాసులను గూడి యలసియు సొలసిన్
సంతాప మనము నన్శ్రీ
కాంతా రమ్మనెను మోక్షకాముకుఁడు
తమిన్.
12. రామునకె చెందు నెల్లప్డు రాధ వలపు.
కంజదలనేత్రు సుందరా కారుఁ గృష్ణు
గరుడగమను ఘోరతరబకాసురారుఁ
గంససంహారు నాగోపికామనోభి
రామునకె చెందు నెల్లప్డు
రాధ వలపు.
13. అను భవమ్మనరానిది యనుభవమ్ము.
దైవ విత్తకనక సముదాయముల య
పహరణకు పూను కొన్నట్టి పాప నరున
కిల నొనర్చు శునకజన్మ మిది శుభతర
మను భవమ్మనరానిది యనుభవమ్ము.
14. ధర్మమార్గముఁ దప్పడు, దానవుండు.
దేవ దేవునిఁ జింతలఁ దినముఁ గడపు
పాప కర్మలు విడనాడి భాగవతుడు
ధర్మమార్గముఁ దప్పడు, దానవుండు.
భిన్న మార్గమునఁ జరించు భీకరముగ
15. భీముఁ డతిభీకరమ్ముగ భీముఁ జంపె.
ఏక చక్రపు రంబున కెగ్గు సేయ
భీమ కాయుడు రక్కసుఁ భీకరనర
మారకుఁ బకుని, కౌంతేయ మధ్యముండు
భీముఁ డతిభీకరమ్ముగ భీముఁ జంపె.
16. రామకథ విని మురిసెను రాక్షసుండు.
వాలిఁ జంపి సుగ్రీవాది వానరులను
గూడి జలధి సేతువు సమగూర్చి దాట
సాధు తర భాషణుడు విభీష ణుడు గూర్మి
రామకథ విని మురిసెను రాక్షసుండు.
17. శిశుపాలునిఁ జంపినట్టి శివునకు జేజే.
కుశలముగ చక్రి కినుకకు
వశుడై వేగ శిశుపాలు వధియించె నటన్
వశమే తప్పులు గాయన్
శిశుపాలునిఁ జంపినట్టి శివునకు జేజే.
(శివుడు = శుభము నిచ్చు వాడు)
18. కొఱవితోడను దల గోకికొనుట మేలు.
మొండి తనము కర్కశమును మోటుదనము
పుష్క లమ్ముగ గలిగినఁ బురుషుఁ గడుదు
రాత్ము బుద్దులు మాపగ రాదుఁ దలుప
కొఱవితోడను దల గోకికొనుట మేలు.
19. ఏకదంతుని వాహన మెలుక, కాదు
ఏకదంతుని వాహన మెలుక, కాదు
పొగడ శక్యంబు నేరికిం బుడమిఁ దాన
నింధ్యుడతులిత భక్తుడు నిత్య శుభ ప్ర
దాయి కనుగుంజెలుడుఁ బ్రీతిఁ దలతు
నతని.
20. భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్.
తీక్షణ పిపాసి కేసరి
కుక్షిన తాపమొ దవంగ గోవుం గనియెన్
వీక్షించి పైకురికిఁ దా
భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్.
21. వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె
పడతి దేవకి ముదముగఁ బడసె సుతుని
వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె
సుతుల నార్వుర చలమూని సుంత యైన
కరుణ లేక కారణమది కంస వధకు
22. ఆడువారు బొంకు లాడువారు.
ఆట లన్ని నీతి కాలవాలంబన
నొప్పు పగలు వీడి యుండ వలయు
గాని యిపుడు విజయ కాంక్ష యధికము నే
డాడువారు బొంకు లాడువారు.
23. రాములందు గొప్ప రాముఁ డతఁడు.
పరసు రాము డంత పడతిఁ దల్లినిఁ జంపె
మదమున పరసతుల మరగెను బల
రాముడిట దశరధ రాముడు గుణరాశి
రాములందు గొప్ప రాముఁ డతఁడు.