దుష్కరప్రాస నొసఁగక పుష్కల దయ
యంతరంగమ్మునం జూపి నంత నేను
సంతసించి భృశమ్ము కీర్తింతు నెమ్మిఁ
దన్నెదను సమస్యాక్లేశ మున్న యెడల 62
[తన్ను+ఎదను=తన్నెదను; సమస్యా+అక్లేశము= సమ స్యాక్లేశము]
అవలీలం జెలరేఁగి పూరణము నీ కందింతు శీఘ్రమ్ముగా
భువిలో నెందఱిఁ గాంచఁ బృచ్ఛకుల నంభోరాశి గంభీరులన్
శివ మేపార భృశమ్ముగా నిలుమ నిశ్చింతన్ మదిన్నేల నే
నవమానించెదఁ బృచ్ఛకా నిను సమస్యాక్లేశ మున్నన్ వడిన్ 61
పద్మ నాభుని పయిన విశ్వాస ముంచి
యంతరంగమున స భక్తి నర్చ లొసఁగ
బ్రతుకు మొక్కకుఁ జేకూర్చి పన్నుగ నొక
పబ్బు కల్గించు సుఖము కైవల్య మన్న 60
[పబ్బు = నిలువు కొయ్య]
ధారాళమ్ముగ వారి ధారలను నిత్యం బింపుగాఁ బోయుచున్
నారీ రత్నము లట్ల సంతతము సంతానమ్ము వోలెం దగన్
గారాబమ్ముగఁ దీఁగలం గన నగుం గల్పించి బోటింపుగన్
వారాంతంబునఁ బబ్బు కేఁగ వలెఁ గైవల్యంబు సిద్ధింపఁగన్ 59
[పబ్బు = నిలువు కొయ్య; తీఁగలు ఫలించుటయే వానికిఁ గైవల్యము. ]
తాప మొసంగెడు తర్కము
లాప కిటులఁ జాగు చుండ ననవరతమ్ముం
జూపఱుల కిచట కన్నను
జేపల యంగడిని శాంతి చేకూరుఁ గదా 58
పాప యొకర్తె యేఁగె నని వంతను జెందఁగ నేల శాంతికై
యోపిక తోడ మార్గణము నుత్తమ రీతి నొనర్ప నొప్పునే
చేపల కూర యన్న మఱి చెప్ప నశక్యపు టిష్ట మౌఁ గదా
చేపల బేరసారములఁ జేసెడి తావున శాంతి లభ్యమౌ 57
మంజుల పద్య సరోరుహ
పుంజమ్ముల నెల్ల వారి ముద మారంగన్
రంజిల్లఁ జేయు వఱకును
గుంజీల్ దీయింత్రు కవుల గుంటూరు జనుల్ 56
పుంజీభూతము లైన దోషము లహో పుంఖాను పుంఖమ్ము లుం
డం జోద్యమ్ముగ స్వీయ పద్యముల నా గండమ్ము నెట్లైన దా
టం జింతించెడు వారి నెల్లరను వీడం జాల కత్యుగ్రులై
గుంజీల్ దీయఁగఁ జేయుదుర్ కవుల నా గుంటూరు వాసుల్ గటా 55
స్వీయ పాండిత్య గరిమ విశేషమునకు
లోక విఖ్యాత పండిత లోక పరమ
మాన్య కావ్య సంచయ సద్విమర్శవాది
కవిత వ్రాయని కవి పురస్కార మందు 54
రవి వంశోద్భవ రామ భక్తునకునాహ్లాదమ్ము సేకూర్పఁగా
ధ్రువ తారా సదృశమ్ము శాశ్వత యశో ధుర్యమ్ము నిత్యమ్ము స
త్కవియౌ బమ్మెర పోతరాజునకు భక్తత్రాణ పద్మాక్షు స
త్కవితల్ వ్రాయఁగ, లేనివానికె, పురస్కారంబు దక్కున్ గదా 53
చిన్న తనము నందుఁ జదువు సున్న గాఁగ
గీత లోని సుద్దులు కొన్ని ప్రీతిఁ బల్క
నెన్న నిక్కమ్ము భూ దేవి కున్న యట్టి
ఓర్పు సన్యాసులకు నుండు నొక్కొ కనఁగ 52
వికటంబై చనఁ బ్రేమ దారుణముగన్ విచ్ఛిన్నచేతస్కులై
యకలంకాత్ములు కొంద ఱిద్ధరను సన్యాసమ్ము కాంక్షింపఁగా
సకలాతంకము లుప్పతిల్ల నిల సంసారమ్ము సాగింపఁగా
నకటా యోరుపు లేని మానవులె సన్యాసంబుఁ గైకొంద్రు పో 51
దైవ లీలల నెన్నంగఁ దరమె నరుల
కౌర! కాకులు దూఱని ఘోర కాన
నమ్ము నందొక్క మద కుంజరమ్ము చంపి
దోమను మనువాడి కరి ముద్దుల నొసంగె 50
ధామము కొండ సాను వట దాన జలమ్ము స్రవించు నిత్యమున్
సామజ రాజు చుట్టు నిభ సంఘము తిర్గుచు నుండు రక్తినిం
బ్రేమ సెలంగ డాయఁగఁ గరేణువు నత్తఱి నెమ్మిఁ దోలి పె
న్దోమను బెండ్లియాడి కనుదోయిని ముద్దిడెఁ గుంజరం బహో 49
ఒడి, గుడి, తడి, మడి దత్తపది.
ఒడి యక తొలం గుఁడి తఁ డి ను
మడి గుణవంతుండును బరమ రఘూత్తమ భ
క్తుఁడు గాంచఁగ వచ్చెను గో
రఁ డన్య మెద్ది మది బాల రామాలయమున్ 48
వంచకు లుందురు చెంతను
బొంచి సతమ్మును భృశమ్ము పొగడుచు నిన్నున్
వంచనకే, దూరం బయి
మంచికి, నుంకిడిన క్షతి క్రమమ్ముగ మనకౌ 47
ముంచుచు మంచి మాటలను మోహము నందు సతమ్ము నిల్పుచున్
వంచన సేయు వారలను బంచన నుంచిన విస్వసించి నీ
వెంచి మనమ్ము నందు నిజమే యని యక్కట కృత్రిమంపు టా
మంచికి నుం కొసంగిన గ్రమమ్ముగ దేశము నాశ మయ్యెడిన్ 46
వనితకుఁ దో డది యవసర
మని యెంచి యెడంద వీడి యనుమానంబే
మనసారఁ గదిసి తన్వల
చిన దానిన్ వృద్ధుఁ డెలమిఁ జేపట్టె నహో 45
వనితా రత్నము లుందు రింపుగను గాపాడంగఁ గాకున్న నిం
కను నాశం బొనరింప నాగ్రహమునం గక్షా విలగ్నాత్మలై
తనరం జేయఁగ నెంచి యాత్మ కథ సత్కారమ్మునం దన్ను జూ
చిన దానిన్ వరియించి వచ్చె ననుచుం జేపట్టె వృద్ధుం డ హో 44
ఆరయ జగదేక పతినిఁ
జారు గుణగణ విలసితుఁడు సత్క్రైస్తవుఁడౌ
పూరుషుఁ డొకండు వేగమ
చేరె నయోధ్యకుఁ గొలువఁగ జీసస్ రామున్ 43
[జీసస్ రామున్= "జీసస్" యనెడు రాముని]
ఔరా భారత దేశ పౌర జన నిత్యైశ్వర్య మే పాటిదో
శ్రీ రాముం డిట నింపుగా వెలసెఁ దా సీతా సతీ యుక్తుఁడై
యా రాజన్యుని నాశతోఁ గదిసె నాహా సంత తాశావహుం
డౌ రా జీ ససు వచ్చె నల్లదె యయోధ్యా రాము సేవింపఁగన్ 42
[రాజు+ఈసు+అసువు+అచ్చె; ఈ ససువు= ఈసుతోఁ గూడిన ప్రాణి; అచ్చు=
ప్రతిబింబము; నల్లదె=కళంక మైనదే]
శాస్త్ర నిచయ నైపుణ్యుఁడు
నిస్త్రింశము నూని చెలఁగ నెమ్మి పరమ ది
వ్యాస్త్రప్రభా సుయోజిత
శస్త్రము విడి నట్టి జోదు చంపెఁ బలువురన్ 41
వస్త్ర చయమ్ముఁ జుట్టి ఘన వాలము చుట్టును నిప్పు పెట్టఁగా
శాస్త్ర విరుద్ధ మెన్నగను జయ్యనఁ గాల్చి గృహాలి నెల్ల నా
యస్త్ర భయైక వర్జితుఁడు నంజని పట్టియె తిర్గి లంకలో
శస్త్రము వీడి యోధుఁ డొక సంగర మందునఁ జంపె వేవురన్ 40
మానక యొనర్చి వెస నొక
మానిని యేనుంగుఁ బోలు మనుజు నొకనిఁ బం
తానం గడుచిత్రమ్ముగఁ
బీనుఁగును రమించి కాంత పిల్లలనుఁ గనెన్ 39
కానము కారణమ్ములను గాంతల ప్రేమకు నెంత నేర్చినన్
మానుగఁ బ్రేమ గ్రుడ్డి దను మాటను నిక్కము సేయ నెంచియో
సూనృత యైన లోక నుత సుందరి సుందరుఁ డైన యట్టి మ
న్పీనుఁగునున్ రమించి యలివేణి యొకర్తుక పిల్లలం గనెన్ 38
[మన్పీనుఁగు = మనుపీనుఁగు, జీవచ్ఛవము]
పౌరానీకమ్మునకున్
ధారాళమ్ముగఁ బ్రసారితమ్ములు ధరలో
నా రామాయణ భారత
ధారావాహికలు జ్ఞాన దానముఁ జేయున్ 37
పారావార గభీర పండితుల సంభావ్యార్హ హృద్వాక్సుధా
ధారావాహిక లంబుజాక్షులకు నందం జేయు సంస్కారమున్
నారీ నామ చకోరకమ్ములకు నెన్నన్ నిర్మ లాంభస్సుధా
ధారావాహిక లంబుజాక్షులకు నందం జేయు సంస్కారమున్ 36
[అంబుజాక్షులు = 1. పద్మనేత్రులు, 2. పద్మనేత్రలు]
భండనమ్ములోఁ బగవారి బలము లెల్ల
వీఁగు నంత వఱకుఁ జక్క వేచి వేచి
చిక్క సమయమ్ము సెలరేఁగఁ జేవ తోడఁ
దగ్గు వారలకే శాంతి దక్కు చుండు 35
నెగ్గెడు నాశ సన్నగిల నీల్గుచు నుండ స్వ పక్ష వీరులే
మ్రగ్గుచు నుండ ఘోర సమరమ్మున విజ్ఞత నాలకించి వే
ప్రెగ్గడ పల్కు లింపుగ వివేకముతోఁ బ్రతికూల వేళలం
దగ్గెడు వారికే సుఖము దక్కును గాదె ధరాతలమ్మునన్ 34
కాక - తాత - నాన – మామ పై పదాలతో రామాయణార్థంలో స్వేచ్ఛాఛందంలో
వితతము కాకమ్మేఁపఁగ
సత తాతత సద్గుణ నిధి సచ్చారిత్రం
బతి రత భామా మణినిన్
సతి నా నర వరుఁడు వాయసపుఁ గను గాల్చెన్ 33
అవని సజ్జన సాంగత్య మలవడంగ
గౌరవింతురు దుర్జను బౌర వర్యు
లెలమి సజ్జను తోడుత నేల ననఁగఁ
బరిమళింపదె దారమ్ము విరుల తోడ 32
ద్వారము లందుఁ గట్ట వలెఁ బన్నుగ దండల నుత్సవమ్ములన్
వారక చింద నందములు వావిరి నెన్నఁగ సౌధ రాజమే
జేరిన మాల లందు విలసిల్లుచు నింపుగఁ గుంద మింక మం
దారము గూడ వాసనల ధన్యత నొందును బూల తోడుగా 31
మేలుగ నారణ్యమ్మునఁ
గాలు తనయుఁడు విను నట్లుగ స్వ దర్పమ్ముం
జాలక మార్కొన నక్కట
వాలిని రావణుఁడు సంపె వ్యాసుని కృతిలో 30
వీలుగ మించు పందెమున వేగమ మిత్రమ సమ్మతించినన్
మేలుగ నెల్ల వారికిని మేదినిఁ దెల్లము గాఁగ నీదు వా
చాలత నీ వనూహ్యపు టసత్యము పల్కు మనంగ నిట్లనెన్
వాలినిఁ జంపె రావణుఁడు వ్యాసుఁడు వ్రాసిన నాటకమ్మునన్ 29
తెలుఁగు నేలను రెండు ముక్కలుగఁ జేయఁ
జలము నూన నాంధ్రులు రిపు సమితి గాఁగ
బ్రతుకు పై నాశ గలదేని రామ! రామ!
తెలుఁగు నాంధ్ర భాష యనఁగ వలదు సుమ్ము 28
లలితము లైన శబ్దములు రాసులు గాఁ దనరంగఁ దెన్గునం
గలఁత వహింపఁ బండితులు కావ్యము లందు ననేక రీతులం
జెలఁగఁగ నన్య దేశ పద చిత్రము లక్కట నేఁడు వింత తం
తెలుఁ గన నాంధ్ర భాష యని తెల్పుట శాస్త్ర విరుద్ధమే సుమా 27
[తంతు + ఎలుఁ గన = తం తెలుఁ గన]
కారుణ్య మడర విగతా
హారుల నారయ జనులకు నత్యధికముగన్
ధారుణి సద్యో విగత
క్రూరమతు లగుదురు పరులకున్ దాన మిడన్ 26
ఘోరత రాపరాధములు కుత్సిత బుద్ధి నొనర్చు వారిలో
మూరునె సద్దయా గుణము ముచ్చట కైనను గొంచె మైననుం
గ్రూరులు గారు దాన మిడు గొప్ప మనస్కులు నిక్క మెంచ న
క్రూరమతుల్ గదా పరులకుం దమ సంపద లిచ్చు వారిలన్ 25
ఇల లోన మాని దురిత
మ్ములు నిశ్చల మైన భక్తిఁ బురుషోత్తమునిన్
నలినాక్షుఁ బోక చెడు పో
కలు సేవించిన లభించుఁ గైవల్యంబే 24
అల వైకుంఠ నివాసు మాధవుని భక్తాధీనునిన్ దీన వ
త్సలు రక్షో గణ భంజనప్రవరునిన్ దాక్షిణ్య చూడామణిన్
బలభద్రానుజు నంద నందనుని సద్భక్తిన్ సమర్పించి కా
న్కలు సేవింపుఁడు పుణ్య కార్య మదియే కైవల్య సంప్రాప్తికిన్ 23
పుట్టి రక్షోగణ పతికిఁ బుడమి సంత
త హరి విద్వేషి కయిన నేమి హరి నెడఁదఁ
బద్మ నాభు నిరంతర భక్త దుఃఖ
హరుని పదముల నమ్మెఁ బ్రహ్లాదుఁ డెపుడు 22
అరిషడ్వర్గము నుత్తరించి తగ నిత్యానంద చిత్తుండునై
పరివేష్టింపఁగ రాక్షసార్భకులు సంభావించి ప్రీతాత్ములై
హరి నామస్మరణవ్రతస్థితుఁడు కోపాటోప దైత్యాలి సం
హర పాదద్వయ చింతనామృతముఁ బ్రహ్లాదుండు గ్రోలెన్దమిన్ 21
కర్దమ మందుం గాలిడి
దుర్దశ వడయంగ నేల దూఱఁగ నేలన్
నిర్దయఁ బురుషుల నిట్లని
"నిర్దాక్షిణ్య హృదయు లఁట" నీరజ నేత్రల్! 20
దోర్దండద్వయ సత్త్వ దర్పితు లసంతుష్టుల్ దురుద్దేశులున్
వార్దుశ్శీలు రసత్య భాషణులు దుర్వారాగ్రహావేశులున్
దుర్దాంతుల్ మగవారు నిక్కముగ నిర్దోషమ్ము లే మీ గిరల్,
నిర్దాక్షిణ్య మనస్కు లౌదురు గదా, నీరేజ పత్రేక్షణల్! 19
ఆఖ్యానము లెన్ని వినము
ముఖ్య పురాణమ్ము లందుఁ బూరుషు లందున్
విఖ్యాతులు పేడు లగుట
సఖ్యముఁ జేయంగఁ దగును శండుని తోడన్ 18
సౌఖ్యము వొందు నర్జునుఁడు చారు బృహన్నల నామ కాప్రమే
యాఖ్య విరాట రాడ్వర నిజాత్మజ కొజ్జగ నొప్ప భావినిన్
ముఖ్య ధనుర్ధ రైక వృషభుండు సుభద్రకు శంక యేలనో
సఖ్యముఁ జేయఁగాఁ దగును శండుని తోడ సుపుత్ర లబ్ధికై 17
దొడ్డగను స్థితప్రజ్ఞుం
డొడ్డోలగ మందు నుండ నుత్తమ రీతిం
జెడ్డం గన విన నొనరుప
గ్రుడ్డి చెవిటి కుంటియై నరుఁడు జన్మించున్ 16
సింధు గభీర చిత్తుఁడును స్వీయ కృతాఖిల పుణ్యహీనమే
సంధిలఁగన్ ఋణాను గత జన్మ పరంపర లందు బల్మినిన్
బంధితుఁడై పురాకృత వివర్ధిత పాప ధురం ధరార్థమై
యంధుఁడు పంగువున్ బధిరుఁడై మనుజుండు జనించు భూమిపై 15
పాప మంట దొకింతయుఁ బన్నుగ నెద
ధైర్య మూని మిక్కుటముగ దయను గాచి
వనిని మృగ రాశి మృగ రాజు బారి నుండి
పొట్టలం గొట్టు వానికిఁ బుణ్య మబ్బు 14
పుట్టఁగ మర్త్య జన్మమున మోక్షము నందఁగ బీదవారినిం
దొట్టి క్షుధార్త సంతతికి దొడ్డ మనమ్మున సంతతమ్మునున్
గుట్టుగఁ బెట్టి యన్నమును గోరిన వారికిఁ బ్రీతి నింపఁగాఁ
బొట్టలు గొట్టు వానికి నమోఘముగా లభియించుఁ బుణ్యముల్ 13
[కొట్టు = అంగడి]
నిరతి లేని నరుండు మౌని యగు నేల
ప్రేమి గాని వాఁ డగును వివేకి యేల
చదువ నట్టి జనుఁ డగును జ్ఞాని యేల
యోగి గాని నాయకుఁ డగు యోగ్యుఁ డేల 12
త్యాగ మెఱుంగు వారు నిజ ధర్మము నేరిన యట్టి వారలున్
భోగులు కాని వారు మఱి బొంకులు పల్కని యట్టి వారు వై
రాగులు కాని వారును బ్రలాప రతాత్ములు ద్వేష పూరి తో
ద్యోగులు గాని నాయకులె యోగ్యులు భారత భూమి నేలఁగన్ 11
ఆహా నిక్కం బిది సం
దేహము వలదు మది లోన స్థిర మతి నూనన్
బాహాటముగ నశించిన
మోహమె కద మానవునకు ముక్తి నొసంగున్ 10
గేహక్షేమ విహీన దుర్భర ఘన క్లేశార్త భూతాలికిన్
సాహాయ్యం బొనగూర్చి యిచ్చుటయు రక్షన్, సంత తామేయ దు
ర్దేహాశా విలయమ్ము, నింద్రియ చ యాధీ నావహీనమ్ము, ని
ర్మోహమ్మే హితమౌను మానవునకున్ ముక్తిం బ్రసాదింపఁగన్ 9
ముని వరేణ్య సంచయ సూక్తములు పవిత్ర
ములు సనాతనములు సత్యములు సతము ధ
రణిని వేదము లెన్న నెల్లరకుఁ దక్క
నాస్తికునకు వేదమె ప్రమాణమ్ము సుమ్ము 8
చోదిత మేదినీ మనుజ శోధిత నిత్య నిరూపి తార్థ సం
వేదిత వీత సంశయ వివిక్త వివేక సమృద్ధ సర్వదా
వాద విహీన సర్వ జన భావ సమావృత పండితప్రజా
వేదమె సత్ప్రమాణమని వెల్లడి సేసెను నాస్తికుం డహో 7
[వేదము = జ్ఞానము]
బాగుగఁ గూసెను గోయిల
రాగము సెలరేఁగఁ జిగురులం దిని తనియన్
దాఁగుచుఁ గొమ్మల లోనం
దీఁగలు లేనట్టి వీణ తీయగఁ బలికెన్ 6
తూఁ గన నేర కింతయును దొయ్యలిఁ గానక తిర్గి తిర్గి లో
వేఁగుచు నుండఁ దాపమున వృక్షపు మూలము నందు జానకిం
దాఁ గని హన్మ వొంగఁగ ముదం బెద పాడెను హర్ష రాగముల్
తీఁగలు లేని వీణ గడుఁ దీయగ మ్రోగెను మీటి నంతటన్ 5
నీమము తోడుత నిత్యము
క్షేమం బొడఁగూడు నయ్య సేవింపు పరం
ధామునిఁ దమి దూరీకృత
కామమె మోక్షోపలబ్ధి కారణము గదా 4
ఏమఱ కెంచి మోక్షమును నెంతయు నిష్ఠను దుష్ట చింతనా
గ్రామ విహీన చిత్తత నిరంతరమున్ భగవద్విశేష వ
న్నామము లుచ్చరింపుఁడి ఘనమ్ముగ వీత ఫలాను రక్తి ని
ష్కామమె మోక్ష కారణము కాముకులై తరియించుఁ డెల్లరున్ 3
దారుణ రీతి నొసంగ న
పారము బాధలు నరుల కవని రోగమ్ముల్
మూరిన దేహం బందు రు
జారులు లేకున్న నగునె శాంతి సుఖంబుల్ 2
[రుజ+అరులు=రుజారులు, మందులు]
ధీరత నిల్వ సైనికులు దేశ సమగ్ర సు రక్షణార్థమై
తోరపు టప్రమత్తతను దూరము గావు విపత్తు లెన్నఁగా
నేరఁగ దుష్ట వైరి జన నిష్ఠుర కార్యము లెల్ల నిత్యముం
జారులు లేనిచో భువిని శాంతి సుఖంబులు సంభవించునే 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి