దైవ లీలల నెఱుఁగంగఁ దరమె కోర
కుండ సమకూరు విత్తము మెండుగాను
వింత మంద భాగ్యున కిల సంతతమ్ము
కోరనిది దక్కు దక్కదు కోరి కొలువ 1
పోరున గెల్త్రు శత్రువుల మూరు సమంచిత భోగ భాగ్యముల్
దూరము లౌను రోగములు దుఃఖము లింపుగ నెందు నెన్నఁడే
నారయఁ బద్మనాభ శర ణాగత కోటికి దుర్లభం బిలం
గోరిన దేది? దక్కదఁటఁ గోరనిదే, లభియించుఁ గొల్చినన్ 2
ఏండ్ల తరబడి జరుగుఁ బె
క్కిండ్ల నరయ నివ్విధంబ యిహ లోకమునం
బెండ్లము తోడుత వెన్నుని
పెండ్లమునకు మ్రొక్కు పతికిఁ బెన్నిధు లబ్బున్ 3
గుండ్ల విరోధి సోదరుఁడు కోపము సంతస మంద నాత్మలో
బండ్లగు నోడ లొక్క త్రుటి బండ్లు సెలంగును గొప్ప యోడలై
పండ్లు జలమ్ము పుష్పములు భక్తి నొసంగి రమామనో ధవుం
బెండ్లముఁ జేరి మ్రొక్కు పతి పెన్నిధులన్గని పొందు సేమమున్ 4
[పెండ్లముఁ జేరి = చేరి పెండ్లమును]
ఒక్క రొక్కొక్క నామమ్ము నుచ్చరించి
కొలుచు చుండ మోక్షమ్మును గోరి వింత
నెంచ దేవుఁ డొక్కఁడె నామ మేది యైన
బింబము లనేకములు ప్రతిబింబ మొకటె 5
లసదంతఃకర ణాలయస్థిత పరబ్రహ్మంబ యవ్యగ్రమై
వసియించున్ స చరాచరప్రచుర జీవస్వాంత బింబౌఘ మం
ద సమీక్షించుచుఁ బ్రాణి కర్మములు నిర్వ్యాపార మేపారఁగన్
వసుధన్ బింబము లెన్ని యున్నఁ బ్రతిబింబం బొక్కటే దోఁచెనే 6
అకలంక విశా లానన
వికసిత మందస్మిత పరివేష్టిత వనితా
నిక రాసితప్రవిమలాం
బకములఁ గని చేఁపలనుచు వ్రాసిరి సుకవుల్ 7
వికచ సరోరుహాస్య గణ విస్తృత చంచల రమ్య లోచన
ప్రకరములన్ ఝషాలిగను వర్ణన మింపుగఁ జేసి పిమ్మటన్
సకల సరోవరేద్ధ జల సంచరితప్లవ చారు నూత్న శా
బకములఁ జూచి చేఁపలని వ్రాసిరి కైతల లోన సత్కవుల్ 8
పడతి పాంచాలి మానమ్ము వఱలి కావ
దారుణమ్ముగ నిసి యందుఁ బోరి పోరి
కాంచ వలలుండు, దగ నాలకించి పలుకఁ,
గీచకుని శాంతి పర్వానఁ, గ్రీడి, సంపె 9
[కాంచ కీచకుని శాంతి; ఆలకించి క్రీడి పలుక]
[శాంతి=నాశము; పర్వాన = పండుగ నాఁడు]
నారులఁ బూజ్య యౌ ద్రుపద నందన కింపుగఁ గాఁగఁ పండుగే
వీరుల కెంచ దుర్జయుఁడు భీముఁడు నర్తన శాల నుగ్రుఁడై
దూరము గా మనోవ్యథయె తోరము వొందఁగ నాలకింపు మో
భారత! శాంతి, పర్వమునఁ బార్థుఁడు సంపెను గీచకాధమున్ 10
[పర్వము = పండుగ; పార్థుఁడు = పృథా తనయుఁడు]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి