కాలపుఁ జక్ర మాగ దిలఁ గాల తిరోగమనమ్ము కల్లయే
కాలుఁ డెఱుంగఁ డెట్టి మమకారము నెన్నఁడు నేరి పైననుం
గ్రాలిన కీర్తిమంతులును గావలెఁ దప్పక కీర్తి శేషులే
కాలము దాఁపరింప నవకాశము శూన్యము దాఁట మిత్తినిన్ 26
ఏలిన చక్రవర్తు లెట కేఁగిరి కాంచము నేఁడు వారినిన్
వ్రాలిరి నైగమజ్ఞులును బండిత పామర సత్కవీంద్రులుం
గూలిరి తాపసేంద్రులును ఘోర నిశాటులు దైవ భక్తులుం
దూలిరి భాగ్యవంతులును దుష్టులు శిష్టులు భోగలాలసుల్ 25
అణుగత కేంద్ర శాస్త్రమున నంచిత రీతినిఁ బట్టభద్రుఁడై
గుణతర మాంధ్రభాష నల కోవిదుఁ డయ్యెను మాతృ భాషకుం
దృణ ఋణ మేని తీఱు నను తృప్తిని వ్రాసెను బెక్కు కావ్యముల్
గణుతి వహించెఁ బండిత జగమ్మునఁ దత్కవి కంజలించెదన్ 24
సకల జనవ్ర జావనుఁడు శార్ఙ్గి రమా ధవుఁ డచ్యుతుండు నా
ర్త కరి విషాద మోచనుఁడు తామరసాక్షుఁడు సుప్రసన్నుఁడై
వికసిత సౌఖ్య సంపదలఁ బేర్మిని నిత్యము కాచుఁగావుతన్
సకరుణ పాపినేని కుల చంద్రుని సద్గుణు రామరావునున్ 23
సిరు లిడు లచ్చి! కడలి కూఁ
తుర! చల్లని తమ్మికంటి! తోరపు దయతో
నరయుమ మూడు జగమ్ముల
హరి యింతి! యివే గ్రహింపుమా దండములన్ 22
ఆత్మాత్మానందంబౌ
యాత్మాత్మై కాబలా సమాగమ కృత హ
ర్షాత్మక సుజ్ఞానం బ
ధ్యాత్మక మరయంగ నిక్క మవని జనులకున్ 21
[రెండాత్మలకు నానంద మయిన యాత్మ (తాను) యాత్మ స్త్రీ
సమాగమము వలన జనించిన హర్షముతోకూడిన యాత్మ యొక్క
యెఱుక వేదాంత జ్ఞానము నిజము నెంచ నవని జనులకు]
కోరి నంతఁ జూపును దారి గూగులమ్మ
కొంప నెల్ల నియంత్రించు గూగులమ్మ
గొప్ప భాండార మెన్నఁగ గూగులమ్మ
గూగులమ్మ మయం బయ్యె క్షోణి తలము 20
దోఁచుట తథ్యం బెన్నఁడు
దోఁచెడి దొర లెన్న వేఱు తొలఁగవు సుమ్మీ
యీ చిక్కు లకట భూమిం
గాచెడి వారెవ్వ రైనఁ గలలో నైనన్ 19
నయాగరా సోయగాలు :
చెనకుచు గెంతు చుండి వెసఁ జేరితి వాపమ! కోన యాగరా
యనినను నాగ కింతయును నాడుచుఁ బాడుచు నేఁగి యేఁగి క్రిం
దను బడి పాఱి పాఱి కడు దవ్వుల కేఁగితి వో నయాగరా
ఘనముగఁ బేరు సార్థకము గాఁగఁ దటాకమ వైతి వింపుగా 18
కాంచఁగ నెచ్చ టా యమెరికా కనుమా నిజ మంద భాగ్యమున్
సంచిత నీర మంతయును జల్లగ నా కెనడా గ్రహించెనే
యంచిత పుణ్య సత్ఫలము నందెను వింతగ దేశరాజమే
చంచలముల్ గదయ్య సిరి సంపద లెల్ల ధరా తలమ్మునన్ 17
ఉదకైకాస్తర నిద్రి తోదకము స్వప్నోర్వీ ప్రపాతార్తినిం
బద సంపాతము సెంద నిమ్న తల సంప్రాప్తంబు దీపింపఁగా
నిదురన్ వీడ జలాస్తరం బచట సందీప్తంబునై తోఁచెనే
నదియై తిర్గి పరాగ్ర దేశమున నానందంబు వాటిల్లఁగన్ 16
ఒకచో రోదన మయ్యె వింతగను నీరోద్రిక్త ఘోషౌఘమే
యొకచో సంతస మయ్యె నింపుగను నీరోత్సాహ నాదమ్ములే
నొకచోఁ దోఁచె నభోనదీ నిభము భావోద్రేక సంధాయియై
యొకచోఁ గన్పడె నాగ లోక నది నా నుగ్రాకృతిన్ వింతగా 15
తెల్లని చంద్రికల్ విరిసెఁ దేటఁదనమ్మున వెల్గ నుర్గులే
చల్లని తుంపరల్ విరివి సద్గతి సేరఁగ సంభ్రమించుచున్
వెల్లువలై విలాసముగ వేగమ పాఱఁ దొడంగె దిక్కులం
దుల్లము లెల్లఁ బొంగ రహి నుర్వి జనాలికి వింత వింతగాన్ 14
జంటలు జంటలై జనము సల్లపనమ్ములు మింటి నింపుగా
నంటఁగ సంతసమ్మున విహార వినోదము లందుఁ దేలుచున్
గుంటల గుట్ట లందుఁ బలుకుల్ పస మీఱఁ బరస్పరమ్ము వా
ల్గంటులు పూరుషోత్తములు హ్లాదము తోడఁ జరింపఁ జాగిరే 13
వాణీ వల్లభు సంస్మరింతు హరినిం బ్రార్థింతు నారాయణున్
వేణీ బద్ధ సురాపగా ధవుని సక్ష్వేళైక కంఠోన్నతుం
బ్రాణి ప్రాణ మరుద్వ్ర జాపహరణ ప్రాశస్త్య పాలాక్షునిం
బాణి ద్వంద్వము మోడ్చి వేఁడెదను సద్భక్తిం దమిన్ నిత్యమున్ 12
వంశ వర్ధను లయి కడు వఱలు చుండి
తల్లి దండ్రుల కొసఁగి ముదమ్ము మిగుల
నాయురారోగ్యములతోడ నలరి సతము
వర్ధిలఁ గలరు గాక లవ కుశు లవని 11
సంసారాంబుధి దాఁట న
హింసా మార్గమ్ము నూని యిలలో భక్తిం
గంసారి పదాబ్జ యుగళ
సంసేవన మాత్మఁ జేయ సాధ్యము సుమ్మీ 10
సర్వానంద మయ మయి య
ఖర్వ సుఖాతిశయ భాగ్య కారి యయి లస
త్పర్వప్రకర యుతంబౌ
శర్వాణీ క్రాంతి యుగళ సంసార మిలన్ 9
శ్రీ వాణీ కరుణా రసార్ణవ గృహశ్రీ నిత్య సంవాసులై
వే వర్ధిల్లఁగఁ బుత్ర పౌత్ర తతులున్ విద్యా విశేషమ్ములున్
దేవీ దత్త వరప్రభావ గరిమన్ దీపింప నన్యోన్యమై
మీ వైవాహిక జీవితం బడరు సంప్రీతిన్నిరాటంకమై 8
శ్రీ వక్షో గళ పన్నగాస్తరణసచ్చిద్భూషణార్యద్వయిన్
శ్రీవిశ్వావన నాశ కార్య చయ సంశ్లేషైక మగ్నాత్ములన్
దేవవ్రాత నిరంత రార్చిత మహా దివ్యాంఘ్రి భాస్వంతులన్
దేవీ సంయుత చిద్విలాస నిజ సందీప్తాంగులం గొల్చెదన్ 7
కాల మాసన్న మైనట్టి కాల మందు
మరణ మాసన్న మౌ నిల మానవున క
కాల మరణంబ యని పలుకంగ జనులు
వింతలకు నెల్ల మించిన వింత యగును 6
కనియెన్ భూసురుఁ డేఁగి యంబర తలాక్రాంతైక శృంగస్రవే
ద్ధ నిరాటంక ఝరీ తరంగ మురజధ్వానానుకూ లైక న
ర్తన సంఫుల్ల కలాప భాసిత మయూరవ్రాత సంచారమున్
ఘన మత్తేభ కరోగ్ర కంపిత మహాక్ష్మాజమ్ము శీతాగమున్ 5
రామ మందిరమ్ము రాజ దర్పమునకుఁ
జిహ్నమై పుడమిని జెలఁగ రాదు
లక్ష్మణుండు లేక రాముని నెఱుఁగము
చిన్న తనము నందుఁ జెంత నెపుడు 4
ఏన్నూరేండ్లకు నెక్కుడు
నిన్నుంచి కుటీర మందు నీరజనాభా!
మిన్నంట వగపు రామా!
కన్నారమె యాలయమునఁ గాకుత్స్థ వరా! 3
కుక్షుల్ నింపఁగఁ జంపు చుండ వనిలో ఘోరమ్ముగా విప్రులన్
రక్షోవ్రాతము జిక్కి దానికి మహారణ్యప్రదేశమ్ములం
రక్షాదక్షులునై నిరంతరము నిద్రా హీనులై పాండవుల్
సుక్షాత్రాన్వయ జాతు లారసిరి సంక్షోభమ్ము దీనమ్ముగా 2
నూత్నాంగ్లేయపుఁ టేఁడు వచ్చినది సంతోషమ్ము మిన్నంటఁగన్
యత్నా లెల్ల ఫలింప విశ్వమునఁ బౌరౌఘమ్ము పెంపొందఁగన్
రత్నాభంబు వెలుంగ ధాత్రి ద్విసహస్రస్వబ్దముల్ సాగఁగం
గృత్నుస్ఫూర్తి విరాజిలం దగఁ జతుర్వింశద్స మారబ్ధినిన్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి