డెందము పులకరించును నంది వాహ
నుఁ గని నంత నుప్పొంగును మగువ! ముదము
సందియం బేల మాధవి! యిందు నాదు
శ్రీసతీ! మనోహారి యౌ శ్రీగళుండు 61
ఆతత సత్తపో నియమ మద్రి తటమ్మున నూని చేసి సం
ప్రీతి మనోరథం బది ఫలింపఁగ భర్తగఁ బొంది నట్టి యా
నాతుక గౌరి శీత నగ నందన గోరిన వాఁడు మంగళ
శ్రీ తరుణీ మనోహరుఁడు శ్రీగళుఁడే యన శంక యేలనో 60
సమ్మతి గైకొని చేరి వ
నమ్మన్నను గొల్చుచుండ నలినదళాక్షున్
నెమ్మి సలక్షణు లక్ష్మణు
తమ్ములఁ గని యీసుఁ జెందె దాశరథి వెసన్ 59
[దాశరథి = భరతుఁడు; ఈసు = ఈర్ష్య; తమ్ముల: గౌరవార్థ బహువచనము]
కొమ్మను గూడి యుండగను గూర్మిని నెల్లలు మీఱఁగా నృశం
సమ్ము వనాంతరమ్మునను మన్మథ చోదిత దుస్సహంపు స్వాం
తమ్మున రాక్షసీ వనిత దగ్గఱ శూర్పనఖా కృతోగ్ర వృ
త్తమ్ములఁ జూచుచున్ దశరథప్రథమాత్మజుఁ డీసుఁ జెందెరా 58
[ఈసు = కోపము]
రక్షకులు లేక యొంటరి రమణి భీత
చిత్త చిక్కి మార్గమున నిశీథ మందు
నళిన నేత్ర యత్తఱిని సన్నని యెలుఁగునఁ
గూసెఁ గావు కావు మనుచుఁ గోకిలమ్మ 57
మా కుల మెల్ల వర్ధిలఁగ మానవ! నీ దయఁ జూపి నిత్యమున్
వీఁక వహించి పాడఁగను వీనుల విందుగ మెత్తు రింపుగా
లోకులు నాదు పాటలను రుచ్యము లౌ నిల రిత్త లెన్నఁడేఁ
గోకిల కావు కావు మని కూసె రసజ్ఞులు మోద మందఁగన్ 56
[కావు = కాఁ జాలవు; కావు మని = కాపాడు మని]
వెలవెలఁ బోవ సనాతను
లిలలోఁ గుల మెన్న కెడఁద నిసుమంతయు నౌ
దలఁ దాల్ప కనుష్ఠానము
పలలముఁ దిని త్రేన్చి రెల్ల బ్రాహ్మణు లెలమిన్ 55
ఎఱ్ఱని పాఱుఁడై యసురుఁ డెంతయొ భక్తిని నిల్వలుండు వే
గొఱ్ఱెగఁ జేసి సోదరునిఁ గూరను వండి కడింది వంచనన్
వెఱ్ఱుల కన్న మద్దినము వెట్టినఁ దృప్తిగ నారగించుచున్
గఱ్ఱని త్రేన్చి రా తగరు కండల కూరను మెక్కి బ్రాహ్మణుల్ 54
నేత లాడెడు మాటల నిజము గనము
నేతి బీరకాయల లోన నేతిఁ గనము
ప్రాస యతులకుఁ బడరాని పాట్లు పడు కు
కవుల కవనమ్ములో నీతి గాన రాదు 53
ప్రాతఃకాల రవి ప్రభా సదృశ దుర్వా రోజ్జ్వల స్కంధులై
శ్రోతృ శ్రేణికి నర్థ వంత పదముల్ సొప్పించి పద్యమ్ములం
జేతో మోదము గూర్తు రత్యధిక సంశ్రేయంబు నీక్షించి దు
ర్నీతిం జూపిన వారు లేరు కవులై నిర్మించి కావ్యమ్ములన్ 52
చెంగున గెంతుచు చేయుచు
వెంగలి చేష్టలు తరువున వ్రేలాడుచు ను
త్తుంగ శిఖ నుండి దుముకుచు
భంగపడఁగ నరుఁడు హరియె పక్కున నవ్వెన్ 51
[హరి = కోఁతి]
భృంగముఁ బోలు దీ వనుచుఁ బెల్లుగ నార్చుచు సంబరమ్మునన్
రంగము నందుఁ బోరుచును గ్రాలుచు మేదినిఁ గూల మేని యా
రంగు కడింది మాయగను గ్రన్నన మల్లుని చేత వింతఁ దా
భంగపడంగ నర్జునుఁడు పక్కున నవ్వెను గృష్ణుఁ డాజిలో 50
[అర్జునుఁడు = తెల్లనివాఁడు; కృష్ణుఁడు = నల్లని వాఁడు]
చూడ మటుమాయ మైనన్
వాఁడి ములికులెల్ల నంత వర తూణములన్
వేడబపుఁ గిరాతుని ముం
దోడిన పగతునిఁ గని భయ మొందె విజయుఁడే 49
ఓడిన నొక్క చోట విసు గొందక గెల్త్రు మఱొక్క చోట నం
చోడ కెడందఁ బొందఁ గలఁ డొప్పుగ నెప్పుడు గొప్ప వాది నా
నాఁడు మఱొక్క యున్నతపు న్యాయ మహాలయ మేఁగు నంచు వాఁ
డోడిన, వైరిఁ గాంచి భయ మొందెను గెల్చినవాఁడు వింతగన్ 48
కదియఁ జలి కాల మిత్తఱి
ముద మూనుచు సంచరింప భూజము లందున్
వదలఁ జలి వెతలు కోఁతికి
మదగజయానకును ఱవిక మాత్రము చాలున్ 47
పదపడి చీర లీయఁ దగుఁ బన్నుగ దక్షిణ లిచ్చి వేడ్కతో
ముదము వహింతు రెల్ల పువుఁ బోడులు భూరి మహోత్సవమ్ములన్
సుదతుల కెల్ల నొక్కొకటి చొప్పున దాన మొసంగ నిత్తఱిన్
మదగజయానకున్ ఱవిక మాత్రము చాలును జీర యేటికిన్ 46
అబ్బురమ్ములు మేదిని నమరు లుంట
యింద్రుఁ డేడ కవ్వడి కఁట యెట్లు తండ్రి
గాలి యముని నశ్వినులను గాంచు టెట్లు
కల్పన యటంచు భారత గాథ నంద్రు 45
అల్ప మనంగ రాని విధ మచ్యుతుఁ డింపుగ నాత్మలోన సం
కల్పము నూనె భూభరము కయ్యము నందు నడంప భోగి రా
ట్తల్ప విరాజమాన గిరిధారి నితాంత జగద్విరాట్బృహ
త్కల్పన యంచుఁ జెప్పుకొనఁగాఁ దగు భారత గాథ చిత్రమే 44
ప్రజల నేలుచు జనకుని పగిది నిత్య
మార్యపుత్రా యని కడు ధైర్యానురాగ
ము లడరఁ బిలుచు చుండంగ ముద్దుగఁ దన
భార్య భర్తగా వఱలెను భారతమున 43
ఆర్య జ నాశ్రితుండు వసుధామర వంశ వరోద్భవుండు నౌ
దార్య గుణాధి కోత్తముఁడు దాత సదా రుచిరవ్రతాది స
త్కార్యుఁడు ధర్మచారిణిగఁ దద్దయుఁ బ్రాణ సమానురాలు గా
భార్యయె భర్తగా వఱలె భారత మందున భాగ్యరాశిగన్ 42
భోజ్యము సతమ్ము శిక్షా
రాజ్యఖిలము దుష్టుల కని ప్రజలకు సుఖముల్
భాజ్యము లని తలఁచినచో
రాజ్యముఁ బాలించు టెట్లు రాముఁ గొలువకే 41
ఈ జ్యోతిర్వల యాంశు సాక్షిగ మనస్సేపారఁగా నమ్మినం
బూజ్యంబౌ నిరతమ్ము ధర్మ మని సంపూర్ణమ్ము స్వార్థం బెదం
ద్యాజ్యార్హం బని రామ రాజ్యమును సంస్థాపింప నూహించినన్
రాజ్యం బే గతి నిర్వహించెదరు శ్రీరామప్రభుం గొల్వకే 40
కలఁచి వైతురు సభ్యులు గ్రామ సభను
రచ్చ లొనరింత్రు నేతలు రాష్ట్ర సభను
గాఁకఁ గలిగింత్రు మంత్రులు లోకసభను
బ్రక్షుభిత మొనరింత్రు సభను సుకవులు 39
అక్షయ రీతి వ్యాకరణ మత్యధికమ్ముగ నైపుణమ్మునన్
లక్షణ లక్ష్య యుక్తముగ రౌద్ర తరమ్ముగఁ జాటి చెప్పుచున్
సక్షమ మేక ధాటిగను జారుతరమ్ముగ వాదులాడుచుం
బ్రక్షుభిత మ్మొనర్తురు సభాస్థలి నెల్ల కవీంద్రు లుద్ధతిన్ 38
విద్యాభివృద్ధి కొఱకై
వేద్యంబ ధనవ్యయమ్ము విద్యార్హంబౌ
యుద్యోగం బార్జించుట
విద్యావంతున కిడుమలు వేవేలు గదా 37
ఉద్యోగమ్ముల వంత వర్ధిలు నిరుద్యోగమ్ము నిర్వేదముల్
సద్యోజాతము లై చెలంగుఁ దనరున్ సంతాపముల్ నిత్యమున్
విద్యా హీనుఁడు దుష్టుఁ డేలు తఱి దుర్భేద్యమ్ముగా ధిఙ్మహా
విద్యావంతుఁడు సర్వ కాలములఁ బ్రాప్తిం బొందుఁ గష్టమ్ములే 36
మమతలఁ బెంచెడు విధముగ
సముదమ్ము సతము వచింపఁ జను నిత్యాన
ర్థము లైన యీ వృథా కథ
నములన్ వద్దన్న నలిగి ననుఁ దిట్టిరయో 35
తమకం బేలను మూడుపొద్దు లిటులం దానమ్ములం దాలకిం
పుమ నా మాటలు మాను మిన్నెఱి తలంపుల్ నా వచింపంగ వా
రు మరల్పంగఁ దలంచి నన్ను, జెడు నారోగ్యమ్ము చన్నీటి స్నా
నములన్ వద్దని చెప్పఁ, గోపమున నిందావాక్యముల్ వల్కిరే 34
తాడో పేడో తేల్చిన
నీడేఱునె నీదు కోర్కు లెవ్విధి నైనన్
వీడుమ మాటలలోఁ బో
రౌ డీ పూజలను విఘ్నరాజు గ్రహించెన్ 33
[పోరు + ఔ = పోరౌ]
కాడయ్యెం గద యిప్పుడీ పురమె యొక్కండైనఁ జింతింపఁడే
యీడేరంగ మనోర థోత్కరము లిస్సీ మద్య మాంసమ్ములం
బాడిం దప్పి యొనర్చుచుండ నిటులన్ వారింపఁగా విప్ప రే
రౌ డీ మూకల పూజలం గొనియె నౌరా విఘ్నరా జెల్లెడన్ 32
[ఏరు+ ఔడు+ఈ = ఏ రౌ డీ; ఔడు = క్రింది పెదవి]
మై బల మల్ప మయిన మే
దో బలమున మిన్న యంచుఁ దోయజ నయనల్
లోఁ బురుషులను గణింపరు
పూఁబోఁడిగ మగతనమును బోలుట వెఱఁగౌ 31
మా మై బల మల్ప మయిన
మా మేదో బలము మిన్న మగవారలకున్
నా మది వారి గణింపరు
స్త్రీ మూర్తిగ మగతనమును జిమ్ముట వెఱఁగౌ 30
కావన్ వచ్చిన వారినిం దఱిమి యా కౌరవ్యులే యాలకై
రా వేగమ్మున సంగ రావనిని భద్రం బెంచి వైరాటికిన్
లా వొప్పంగ బృహన్నలా వనిత సారథ్యమ్ము సేపట్టఁగా
బూవుంబోఁడి బెడంగుతో మగతనమ్ముం జిమ్ము టాశ్చర్యమే 29
కాలఘనశ్యాముఁ గనఁ గు
చేలుం డురుదెంచిన సరసీరుహ నేత్రల్
బాలార్క నిభుని నలిఁగిన
చేలంబుల వానిఁ గాంచి సిగ్గిలి రతివల్ 28
కాలాతీతముఁ గాంచ నట్టి నరునిం గందర్ప సంకాశునిన్
బాలా దర్శన మాత్ర సంజనిత సంభ్రాంతత్రపాస్యాబ్జునిం
లోలోద్వేగ నిమిత్త సంజనిత కల్లోలచ్యు తాచ్ఛాదముల్
చేలంబుల్ గలవానిఁ గాంచి మగువల్ సిగ్గిల్లి పో నెంచిరే 27
మాట లాడుచు నవ్వుచు మేటి సఖుల
తోడ దాఁటంగ నది నొకనాఁడు మురిసి
నావ లోఁ జనఁ జేజాఱ నా నుడిమర
పాల సంద్రానఁ జేవాణి ప్రభవ మందె 26
మెచ్చి నరాలి వర్తనము మేదిని నారసి దేవదేవుఁడే
యిచ్చెను బ్రీతినిన్ మెదడు నింపుగఁ బోలఁగ నిర్మలాంబుధిన్
ముచ్చట లాడ నెల్లరును మోదము నిండ నెడంద లందు వే
త్రచ్చిన క్షీరవార్ధి యుదరంబునఁ బుట్టెను బల్కు జంత్రమే 25
నర వరేణ్యుండు కరుణా వననిధి సద్వ్ర
తుండు దాంతుండు విష్ణు భక్తుండు పరమ
ధార్మి కోదార సన్నుత దాత కాదు
శ్రీరహితుఁ డంచు వీనికిఁ జేసెద నతి 24
వారము వారముం బుడమి వారక తా నవతార మెత్తుచున్
ధారుణి ధర్మ రక్షణముఁ దప్పకొనర్చుచు నుండు నంచునున్
నీరజ పత్రలోచనుఁడు నిత్యుఁడు శ్రీదుఁడు శ్రీ ధవుండుఁ దా
శ్రీ రహితుండు వీఁ డనుచుఁ జేతులు మోడ్చి నమస్కరించెదన్ 23
[శ్రీ రహితుండు = విషము లేనివాఁడు]
అరయుచు నిత్య మకట నీ
వు రాక యున్న నెద లోనఁ బొగులుచుఁ గన వే
లర నీదు రాకకై యర
మర లోనం గలదు నాతి మాన్యతఁ గనుచున్ 22
అరవిందాంబక! దుష్ట తర్జితను బద్ధాత్మీయ కేశైక వ
స్త్ర రమానాథ! దయారసాంబునిధి! సంరక్షింప వీక్షింపవే
నరకప్రాయపు దుష్ట కౌరవ సభన్ నారాయణా! పూజి తా
మర లోనున్నది నాతి యోర్తు దివిషన్మాన్యప్రభావమ్మునన్ 21
[పూజిత + అమర: పూజింపఁ బడిన యమరుఁడు (ఇక్కడ కృష్ణుఁడు) గలది.]
ఎందుం గని విని యెఱుఁగని
చందంబు ప్రబలఁ గడింది క్షామము దేశం
బంద విపత్తును గించి
త్స్పందన లేనట్టి జనులు వ్యర్థులు గనఁగన్ 20
అందముఁ జూచి మెచ్చ జననాంధున కెవ్విధి శక్య మిద్ధరన్
బృందపుఁ గేఁకలం జెవిటి భీతిని సంతస మేని నందునే
ముందున కేఁగి తిట్టినను మూఁగ యెఱుంగునె మాఱుపల్క నే
స్పందన లేని వ్యక్తులకుఁ బంపుట వ్యర్థము పద్యముల్ కవీ 19
పరమార్థమ్ము వలుకు నవ
సరమ్మున వచించి నట్టి సంయమి పలుకుల్
కరము దురవగాహమ్ములు
గురు వచనము శిష్యుల కొనఁగూర్చు నిడుమునే 18
సరళ విదూర శబ్ద చయ సంకుల వాక్యము క్లిష్ట భావమున్
గురు వరుఁ డప్డు పల్కచు నకుంఠిత మియ్యది మీ కిఁకన్ నిరం
తరమును సాధ నార్హమని తా వచియింపఁగ నేకధాటి నా
గురు వచనంబు విన్న నొనఁగూడును గష్టము శిష్య పంక్తికిన్ 17
[గురు వచనము = భారమైన వచనము]
ఊహల సెలంగు చుండిన నొదవు నెద్ది
యక్కట నరున కెందును నల్ప మయినఁ
జల్పక ప్రయత్న మింపుగ గెల్పు పడతి
పొందు దక్కదు కోరిన మందునకును 16
మందిరమై చెలంగఁ దన మానస మింపుగఁ గొల్వ నింది రా
నంద వివర్ధునిం దమిని నందకిశోరునిఁ బొందఁగా నగున్
డెందము నందు నిత్యము కడింది తలంపులు నిండ స్వర్గపుం
బొందు లభింప దయ్యె సతి పొందును గోరిన మంద బుద్ధికిన్ 15
ఆస్తికు నడుగఁ బల్కునె యాతఁ డిట్లు
నాస్తికు నడుగ వాఁ డిట్లనంగ నేర్చు
గొంక కిసుమంతయు నెడంద శంక యేల
నాకు నచ్చని వాఁడు వినాయకుండు 14
ఈ కలి కాలమందుఁ గన నెవ్వరి నమ్మఁగ రాదు మిత్రతం
బ్రాకట మైన రీతిఁ గొలువంగ నరాళికి సత్యసంధుఁడై
వీఁకను నాయకుం డొసఁగుఁ బృథ్విని రక్షణ మెల్ల వేళలన్
నాకు వినాయకుండు గడు నచ్చని వాఁడని మ్రొక్కఁ బోనిఁకన్ 13
[వి నాయకుఁడు = నాయకుఁడు లేని వాఁడు]
దుర్జన దుర్యోధనుఁ డా
కర్జము మెచ్చ వలలు పడగను గ్రుద్ధుండై
దుర్జయు నా విజయు విడిచి
యర్జును నిర్జించె శకుని యాహవ మందున్ 12
ఆహవ దుర్నిరీక్ష్యుని మహాతిరథప్రము ఖాగ్రగణ్యునిన్
బాహు పరాక్రమప్రవరుఁ బాండవ మధ్యము సవ్యసాచినిన్
మోహునిఁ జేసి ధర్మజుని మూరుచు మాయల నక్ష నామ ఘో
రాహవ మందునన్ శకుని యర్జును నోడఁగఁ జేసె నుగ్రుఁడై 11
లీల నిట యౌగపద్యము
రాలఁగ వదనమ్ము నుండి శ్రమ నెల్లం బే
రోలగము నందుఁ బద్యము
శైలీరమ్యతను వీడి సంతుష్టి నిడున్ 10
[శైలీ రమ్యతను = శైలీ రమ్యతచే; శ్రమ నెల్లను వీడి]
ఈ లా గెవ్వరు పల్క నేరరు గదా యే మయ్యె నీ ప్రజ్ఞయే
యేలా పల్కెదు వీ విధంబు నిది కాదే పద్య రాజం బహో
యాలోకింపఁగ నీ వెడంద నొక పర్యాయమ్ము వీక్షింపుమా
శైలీ రమ్యత లేని పద్యమె? మనస్సంతుష్టిఁ జేకూర్చెడిన్ 9
కాక - తాత - పాప - మామ ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
మహాభారతార్థంలో
త్రిదశ నాయకా కరుణా పరీత హృదయ
సుర నుతా తరు ణోజ్జ్వల సూర్య సదృశ
పాప హర మా మనోహర పంకజాక్ష
నంద నందన కావుమ నన్ను గృష్ణ 8
అణఁగని కాకలీ ధ్వని యు తాతత మామక పాప దూర భా
షణములు ధార్తరాష్ట్ర విను సంగర మెన్నఁడు దోషకారియే
రణము విసర్జనీయము నిరంతర మెల్లర కెంచి చూడ దా
రుణ మది మానవాంతకము రోషము నూనక యాలకింపుమా 7
మేను వడఁకంగ నత్తఱి మిక్కుటముగఁ
బతగ రాజొకండు మిగుల వగచు చుండె
మూరి కప్ప యొకం డాడె నీర మందు
నొకని నేడ్పించె మురిపించె నొకని వాన 6
వికసిత చిత్తుఁ డయ్యెఁ గడు వృష్టి గనంబడ డెంద మందు నొ
వ్వకయుఁ దలంచెఁ బైరునకుఁ బ్రాణ మొసంగిన దంచుఁ దండ్రియే
వికల మనస్కుఁ డయ్యెఁ దన పేర్మి సుతుండు ప్రయాణ మాగఁగా
నొకనికి ఖేదమిచ్చె మఱి యొక్కనికిన్ ముద మిచ్చె వర్షమే 5
వీరు వారను భేదమ్ము వీడి యకట
దారుణమ్ముగఁ జెలరేగి తనువు నందు
మూరి నిత్యమ్ము నిర్దయ మారు మేటి
జ్వరము పీడింపఁ జన్నీటి స్నాన మొప్పు 4
ఖర ఖద్యోత కరప్రభా జ్వలిత మార్గక్షిప్త మూర్ధుండు దు
స్తర తప్తాంగుఁడు సేర నొప్పుఁ గద వృక్షచ్ఛాయ నింపారఁగా
విరహాగ్నిం దగ నార్ప నెంచిన మహోద్విగ్నప్రకోపాంగజ
జ్వర తప్తాంగుఁడు స్నాన మాడఁగ వలెం జన్నీట ముప్రొద్దులున్ 3
వరుని రేఖ లరయ వసుధ నల్పాయుష్కుఁ
డనిన వినక యుంటి వకట సుంత
పట్టు విడువ కున్నఁ బట్టి కిప్పట్టునఁ
బెండ్లి సేయఁ దగును బ్రేతమునకు 2
పెండ్లి కుమారుఁ గూర్చి వెస వేఁడఁగ నెల్లరు భక్తి వేల్పు పే
ర్దండ్ల దయా రసం బడరఁ గ్రన్ననఁ బ్రాణము తేరు బొందిఁ బూఁ
బోండ్ల తుటంపుఁ బేరఁటము మూరక మున్న గతించె నక్కటా
పెండ్లినిఁ జేయఁగాఁ దగును బ్రేతమునుం బ్రియమారఁ బిల్చియున్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి