శరణు కోరిన వారికిఁ జారు నేత్ర
యభయ మీయ కున్న దురిత మగు నటంచు
క్షత్రియాన్వయ సద్ధర్మ సంత తాను
సారి యనెను సుభద్రతో సవ్యసాచి 60
నేరక దోష మిచ్చితిని నే నభయమ్మును వేఁడి నంతటన్
శౌరికి వాసుదేవునకు శత్రువు నైతిని దైవికమ్ముగాఁ
దోరపు టాగ్రహానలముతో గయుఁ గాల్పఁ బ్రతిజ్ఞ సేసెఁ గం
సారి యటంచు ఫల్గుణుఁడు సాధ్వి సుభద్రకుఁ జెప్పె నప్పుడున్ 59
మన కెదల విచారింపఁగఁ
బని యుండునె రుక్మిణి కయి బలిమినిఁ దీర్చున్
దనుజారి వాసుదేవుఁడు
మన కుండిన మంచిదగు సమస్యలు సతమున్ 58
[కుండిన=కుండిన పురము]
మనుజులు గాక యిప్పగిది మ్రానులు వొందునె ధాత్రిఁ గష్టముల్
వనరిన లాభ ముండునె విపన్నిచయమ్ములు మిక్కుటమ్ములై
యొనర నతిక్రమింప ధృతి నుద్భవ మందు నుపాయముల్ వెసన్
మనకు సమస్యలుండిననె మంచిదగున్ గద సర్వవేళలన్ 57
జెట్టులకు వింతయే తాఁపు లెట్టి వేళఁ
జుట్టి ముష్టులఁ గొట్టరె యెట్టి వారు
మల్ల రంగ మందు నుదరి మల్ల యుద్ధ
మాడువారిని దన్నుటే న్యాయ మగును 56
వీడులందుఁ జరించుచుండి వివేక హీనత నిత్యమున్
గోడు లక్కట బెట్టిదమ్ముగఁ గూర్చి పౌర జనాలికిన్
వీడి ధర్మము నాత్మ నందక భీతి కల్లల నూరకే
యాడు వారినిఁ దిట్టి దన్నుటె న్యాయమౌ గద యెంచినన్ 55
నేఁ డట్టి పండిత కులం
బేడ నయినఁ గాంచఁ గలమె యిద్ధరలో నీ
వోడకు వారి నివాసపు
గాడిద పదపూజ యిడును గావ్యరసమ్మున్ 54
వాడల వాడలం దిరిగి వారక పామర సంచయమ్ముతోఁ
గూడి సతమ్ము నిక్కముగఁ గోల్పడి తీవు వివేక మక్కటా
కూడదు పల్క నిప్పగిదిఁ గ్రూరత నేర్చితి తిట్టు కైత లే
గాడిద కాళ్లు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా 53
బృందారకు నుంచఁ దిరిగి
కొందల మందంగ నేల కుడ్యశ్రేణీ
బృందము శిథిలం బైనన్
హైందవ మందిరముఁ గూల్చు టఘ దూరంబౌ 52
మందులు దేవుఁ డొక్కడని మానవ జాతికి నేర రక్కటా
యెందును బేళ్లు భిన్నములె యిద్ధర నెంతటి వారి కైననుం
దొందర గల్గ భక్తులకు దుష్ట మనమ్ముల హాని సేసినన్
హైందవ మందిరమ్మునకు హాని యొనర్చుట పుణ్య కార్యమౌ 51
ఉత్తముండు విఖ్యాత పరోపకారి
పుణ్య చరితుండు విజ్ఞుండు పురుషు లందు
నరయ నధిక దేజస్వంతుఁ డవని లోన
నర్ధరాత్రి దివాకరుఁ డస్తమించె 50
గర్ధ మాత్మ కనర్థ మిచ్చును గష్ట మైనను మర్మమే
వర్ధిలం దగు మంతనమ్ముల ప్రాప్తి కెంచఁ బరస్పర
స్పర్ధ లేల తొలంగు కాదిది భావ్య మిప్పుడె, రమ్ము నీ
వర్ధరాత్రి, దివాకరుం డదె యస్తమించెను జూడుమా 49
రంగు రంగుల మేనుల దొంగిలింప
మర్త్య మానసమ్ముల నెల్ల మత్స్య సంచ
యమ్ము లందందుఁ దిరుగాడి యలల తోడ
నుదధి గర్భమ్ముననుఁ దోఁచె నుడుగణంబు 48
వారిజ లోచనాననలు భారకు చాప్త కృశావలగ్నలుం
దారక సన్నిభజ్వలిత తారక యుగ్మలు మర్త్యసంచ యా
క్షీ రమణీయ తచ్చలన చిత్ర వరిష్ఠ తరంగిణీ మిల
ద్వారిధి గర్భ మందుఁ గనుపట్టెను దారక లద్భుతంబుగన్ 47
కానము క్షమా గుణము లవ
మీ నరకాయమ్ము నందు నిలలో రామా!
మానవ రూప విరాజిత
వానరు లొక్కటిగ నెపుడు వర్ధిలఁ గలరో 46
కానము నేఁడు శాంతి ధరఁ గంజదలాక్ష! దయాపయోనిధీ!
దానవ తత్త్వ మెల్లెడల దారుణ రీతిని సంతరించెనే
మానవతా గుణమ్ము మటు మాయము రక్ష నొసంగ దేవ! రా
వా నరు లెల్ల రొక్కటిగ వర్ధిలు కాలము వచ్చు టెన్నఁడో 45
అండ నొసఁగ నుండి యొండెద్ధి కోరక
దండి భక్తి యొండు దక్క యెడఁద
వసుథ లోనఁ గూర్మి వాసుదేవుండె గో
పుండె నరుల కొసఁగుఁ బూర్ణ సుఖము 44
ఉండ ధనమ్ము లే దనుచు నోడకు మయ్య దరిద్ర దుఃఖముం
జెండక చేయి చాఁపుదురె సిగ్గొక యింతయు లేక యేరు నీ
కుండిన లేక యున్న ధృతి యుండఁగ నుండుమ యింటిపట్టునం
బుండె కదా సమస్త సుఖముల్ గలిగించును మానవాళికిన్ 43
[పుండు = గుట్టు]
యుక్తి వికసింప నది సం
సక్తము వీక్షింపు మంచు మత్కుణ మదిగో
రక్తినిఁ జూచుచు నున్నది
రక్తముఁ బీల్చెద నని పతి రమణినిఁ బిలిచెన్ 42
యుక్తము కాదె భర్తృవచనోత్కర మింపుగఁ బాలనమ్ము నా
సక్తి నొనర్ప భార్యలకు సంశయ మేల సరోరుహాక్షిరో
భుక్త ముదమ్ము సేకురఁ గపోలఫలమ్ము త్వదీయ చారు సం
రక్తము పీల్చెదం దరుణి రమ్మని పిల్చె ప్రియుండు ప్రేమతో 41
[సంరక్తము = ఎఱ్ఱ నైనది]
నరపశు భేదమ్ము నిరం
తరమ్ము పాటింపకున్న ధర్మమె చెపుమా
ధర నిజ భార్యా ప్రణయము
పరభా ర్యాసంగమమును వద్దనఁ దగునా 40
[పర భార్యా + అసంగమము]
పర లోకమ్మున నీకు శిక్ష పడు దౌర్బల్యమ్మునున్ వీడుమా
నరలోకాధిప మిన్నకుంటి విట నన్యాయమ్ము వీక్షించుచున్
ధరలో దుష్టుని బుద్ధిమంతు లగు సద్ధర్మాత్ము లత్యుగ్రులై
పరభార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే 39
వనజాక్షున కేల ధనము
మనమ్ముల వఱలెడు నా రమా సతి పతిపై
ననుమాన మేల భక్త్యిం
ధనమున గడియింప వచ్చు దైవకృపాప్తిన్ 38
అనయము ధర్మ మార్గమున నంచిత రీతిని సంచరించుచున్
వినయము భక్తి సూపుచును బెద్దల యందుఁ జరించు నట్టి యా
మనుజుల యందు సంతతము మానని స్వీయ లసన్మహా తపో
ధనమున దైవ సత్కృపను దప్పక పొందఁగ వచ్చు మానవా 37
రంజన మణఁగ నరేభం
బంజలి ధర్మజుఁడు నిల్చి యనుజవరుల తో
డం జని శకుని భృశము వేఁ
పం జరమునఁ గుంజరమ్ము బంధింపఁ బడెన్ 36
[వేఁపన్ + చరమున = వేపం జరమున; చరము = జూదము]
కంజదళాక్ష రక్షితము కాదిల మానవ రక్షితమ్ము దా
నంజలి మోడ్చి మ్రొక్కినను హస్తినిఁ బట్టెడు వేడ్కఁ ద్రవ్వఁగా
మంజుల ఖాత మొక్కటి సమంచిత రీతినిఁ గాన లోన భూ
పంజర మందుఁ గుంజరము బంధిత మయ్యెను సత్యమే కదా 35
ఇంతు లిద్ద ఱచట సంతస మేపార
మాట లాడుచుండ్రి బోటి యొకతె
కుంతి రెండవది శకుంతల వీక్షింపఁ
గుంతి తల్లి యగు శకుంతలకును 34
ఇంతుల లోన సుందరి మునీశ్వరు మోహితుఁ జేసి తాపసిన్
సంతు నొసంగెఁ గాపురము సల్పి చిరమ్ము వనాంతరమ్ములం
గంతుని కోడఁ జేసి తగఁ గౌశికు మేనక గాత్ర లిప్త స
త్కుంతియె తల్లి యయ్యెను శకుంతల కంచు వచింత్రు పండితుల్ 33
[కుంతి = ఒక గంధ ద్రవ్యము]
జయము నొనగూర్చు భక్త ని
చయమునకు నిరంతరమ్ము సమ్మద లీలన్
భయకర దుస్సహ రాక్షస
లయకారుఁడు సౌఖ్యమిచ్చు లచ్చి మగండై 32
భయ దురి తాపహార సిత పన్నగ తల్ప విలాస సుస్రవ
ద్వియదమ లాపగా చరణ భీకర చక్ర ధరారవింద వ
న్నయనుఁడు బ్రహ్మ రుద్ర సుర నాథ సురాళి సమేత తీక్ష్ణ కా
ల యమున కాదిదైవతము లచ్చిమగం డతఁ డిచ్చు సౌఖ్యముల్ 31
భక్త జనావళి పై నను
రక్తి వహించి కడు దుస్తర మయిన కామా
సక్తిని, వహించి హరిపై
భక్తిని విడు మయ్య నరుఁడ స్వర్గము దక్కున్ 30
శక్తి కొలంది పూజలను జక్కఁగఁ జేయుచు సంతతమ్మునున్
రక్తి వహించి ధర్మ పరిరక్షణ మందు సమంచితమ్ముగన్
భుక్తికినై నిరంతరము భూత గణాంతక చేష్ట లందు నీ
భక్తిని వీడుమా నరుఁడ! స్వర్గము మోక్షము లందఁ గోరినన్ 29
ఉరమందు నొక్క పుట్టము
తరుణీ మణి కటినొకండు తనరుచు నుండం
బురి పుట్టంబన్యమ్ముల
బరు వని వల్వలను విడుచు భామకు స్తవముల్ 28
కరములఁ గంకణమ్ములును గాళుల గజ్జెలు మ్రోగుచుండఁగా
నురమునఁ బైడి హారము సముజ్జ్వల కాంతుల నీనుచుండఁగా
మురిపము లొల్కు చిన్ని నగు మోమున నాడెడు చంటిపాపకున్
బరు వని వల్వలన్ విడుచు భామినిఁ గాంచి ప్రశంస లిచ్చిరే 27
మారునకు వశుం డయి వెస
రా రమ్మని పిలువ రాజు రయముగఁ దన దే
వేరి తమినిఁ జింత ఫలము
సా రంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్ 26
[ఫలము+ చారు+ అంగము = ఫలము సా రంగము ; అంగము = విధము]
పారావార పరీత భూ వలయముం బాలింప సామర్థ్యునిం
దారా నాథ సమాన సుందరుఁ గులోద్ధారున్ మహా వీరునిన్
నారీ రత్న శకుంతలా రమణి స్వర్ణద్యోత రాజద్వపు
స్సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్ 25
మరలింప నెంచి మనసుల
సురధారను గోరుదురు వసు జనులు సతమున్
ధరలోఁ గవిత్వ నామక
సురధారను గోరుచుంద్రు సుకవులు సతమున్ 24
పరమార్థ ప్రద లోక సత్కవి సుసంభావ్య ప్రమాణ ప్రభా
చిర దీప్తాంచిత వృత్త సంయుత మహా శిల్పాఖ్య విఖ్యాత స
త్వర సంతోషద సుంద రోన్నత కవిత్వ ప్రస్పు టాత్యంత భా
సుర ధారా పరిపాక మబ్బవలె నంచున్ గోరువారే కవుల్ 23
సుస్థిర ప్రజ్ఞ మరలి రా శుభముగ నిజ
గృహమునకు హర్ష మడర వీక్షించి తత్క్ష
ణమ్ము నెదురేగి యొసఁగి పాద్యమ్ముఁ బ్రీతి
స్వస్తి భర్తకుం బలుకుట సాధ్వి కొప్పు 22
[స్వస్తి = స్వాగతము]
అరయ మొకింత సంశయము నందుఁ దలంచుచు డెంద మందు న
క్షరు నరవిందలోచను రుజా పరితప్తుని నార్తి తోడుతం
గర మనురక్తి సేవలను గాంత యొనర్చుచుఁ గోల్కొనంగ వే
సరి యన నొప్పు భర్తకును స్వస్తి వచించుట సాధ్వి కియ్యెడన్ 21
పైనఁ గాంచినఁ గనఁబడుఁ బరిమల యుత
మైన చక్కఁ దనము హ్లాద మొసఁగఁ
గర కమలము లంటి కమనీయముగ నీర
జమునఁ గ్రిందఁ గనుము చల్లఁదనము 20
సముచిత రీతి శోధనము సల్పిన బాహ్యము నంతరమ్ము లం
దు మనుజు లుంద్రు నిక్కముగఁ దోఁచుచు రెండు విభిన్న భంగులం
గుమతులు గాంచు వాని దగు కోప పరీవృత ఘోర తీక్ష్ణ నై
జమునకుఁ గ్రింది భాగమునఁ జల్లఁదనం బఁట చూచితే కవీ 19
చదువు లబ్బవు పొలములు క్షయము లౌను
సంతు సిక్కదు శకటము లంతము లగుఁ
దఱుగుఁ బశువులు మదిలోనఁ దలఁప వేని
పశుపతినిఁ గొల్వ సకల సంపదలు దొలఁగు 18
అరుగక చెంత సంతతము నంజలి నచ్చట నుంట యొక్కటే,
పెరుగును భక్తి తత్పరత పెల్లుగ సంతస మందు డెందమే
దురితము లెల్ల ముక్క లగు దుఃఖము లాఱును వెల్గుఁ గొల్లలై
తిరమగు సంపదల్ పశుపతిన్ దరిసించిన, లుప్తమౌ నయో 17
కాదన లేక స్వజన సం
చోదితుఁడై పల్కు నట్లు సూ మూర్ఖపు టా
వాదనల నెల్ల వినుమా
రాదఁట కోరిన చదువు సరస్వతిఁ గొలువన్ 16
కలినిఁ బ్రయత్న మించుకయుఁ గైకొన కున్న ఫలింప నేర్చునే
తలఁపుల నుంచ దైవమును దద్ధిత వాంఛలు మానవాళికిన్
వెలుపల నుంచ దీప మది వెల్గుచు నుండునె యాఱకుండఁగాఁ
గొలిచినచో సరస్వతినిఁ గోరిన విద్యలు రావు రూఢిగన్ 15
కష్టముల కోర్చి జపియించు నష్ట ధర్ము
లకును బుష్టి నిడు వరముల నిడు వాని
దుష్ట రాక్షసులకు నైనఁ దుష్టి నంది
ముక్తి నిడు దైవమును రోసె ముని గణంబు 14
[రోయు = వెదకు]
రిక్త వచశ్చయమ్ములను లీలగఁ బల్కుట యందుఁ గాక స
చ్ఛక్తుల మిన్న యైన సుర సత్తము స్వీయ మనఃప్రభా తప
శ్శక్తులు ధార వోసి సువిశాల జగత్రయ మందు నెల్లెడన్
ముక్తి నొసంగు దేవుని ముముక్షువు లెల్లరు రోసి రేలనో 13
[రోయు = వెదకు]
వాదము లేల రణమ్మున
నీదు పరాక్రమము సూపు నెగ్గఁ దలఁచినన్
నా దొడ్డ యెలుంగున నన
నాదము మోద మిడె భీషణమ్ముగ మ్రోఁగన్ 12
వీత భయాంతరంగు లయి విశ్వ రణం బొడఁగూడు శంక నే
రీతిని లెక్క సేయక కురింప శతఘ్నులు నింగి నిర్దయన్
భీతి నొసంగి యెల్లరకుఁ బెల్లుగ రోతను, వీడి సాంతముం
బ్రీతినిఁ, గూర్చె నాద మది భీషణమై నినదింప నెల్లెడన్ 11
సు విశాల బోధి దివ్య త
రువు చెంతను బోధ మంది రుచిరము నే కై
క విశుద్ధ భూత దయనే
యవనిన్ బోధించె బుద్ధుఁ డద్వైతమ్మున్ 10
[అద్వైతము = ఏకైకము( రెండవది లేనిది]
పరమాత్మాత్మలు గాంచ నొక్క టని యద్వైతంబు నిష్కర్షగాఁ
బరఁగం జేసెను మానవావలికి సంప్రాప్తింప మోక్షంబు దా
నర లోకమ్మున నాది శంకరుఁడు ధ్వాంతఘ్నస్వ తేజుండునై
పరమోత్కృష్ట మటంచు బుద్ధుఁ డనె నద్వైతంబు బోధించుచున్ 9
[బుద్ధుఁడు = విద్వాంసుఁడు]
మెప్పులకు గాక తొలఁగంగ ముప్పు లెల్ల
గొప్ప వాఁడ వైనను గోరి యిప్పు డెడఁద
ముక్తి రాముని దర్శించి భక్తిఁ జేయ
నొప్పు శంకర! పూజ లయోధ్య లోన 8
రయమ్మునం బ్రయాణ మిద్ధరం జెలంగ నింపుగా
సయోధ్య చారివై యెడంద సంతసమ్ము మీఱఁగా
దయాళు ఫాలనేత్రుఁ డేడ దర్శనమ్ము నీయ లేఁ
డయోధ్య లోని మందిరమ్ము నందు శంభుఁ గొల్వుమా 7
[సయోధ్య చారివై = సమాన సమూహములో నున్నవానిగఁ జరించు వాఁడ వయి]
భువి జను లానందింపఁగఁ
బ్రవర్థమానము లయి వెసఁ బంచాహమ్ముల్
దివిరి చని నంత నింకను
నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్ 6
వివరింతుం దగ విన్మ పండుగను సంవేద్యమ్ము నింపారఁ దొ
ల్దివ మందింపుగ భోగి పండుగయు నా రెండింట సంక్రాంతి నా
దివమే వర్ధిల నా తివం బ్రభలతోఁ దీర్థంబు దీపింపఁగా
నవులన్ నాల్గవ నాఁడు ముక్కనుమ యౌ నాంధ్రావనిం దచ్చతు
ర్నవ రాత్రోత్సవ మెన్నినాళు లనఁగా నాల్గే కదా మిత్రమా 5
[చతు ర్నవ రాత్రము = నాలుగు క్రొత్త రాత్రులతోఁ గూడునది]
మతి నుంచి తరులు సుర లని
వితండ వాదము లొనర్చి వింతగ నకటా
విత తార్తుల రక్షణ మా
పి తరుల స్మరియించెదరు వివేక విహీనుల్ 4
గతి బ్రతుకంగ నిచ్చి మమకారము మీఱ వహించి పెంచఁగా
సతము కృతఘ్ను లౌట యపచార మొనర్చుట మానవత్వమే
పితరుల దైవ సన్నిభుల విస్మృతి నొంది వహింప కించు కేఁ
పితరుల సంస్మరించుట వివేక విహీనుల కార్యమే కదా 3
[ఏఁపు + ఇతరుల =ఏఁ పితరుల]
తేటగీతి గర్భితోత్సాహము:
ఉత్సాహము:
సత్త సాటఁ బౌరుల కట శక్తి కలదు మిథ్యయై
జిత్తు లందు నేత లెపుడు సిక్క రెందు నేరికిన్
మత్తు నందు ముంతు రనెడు మాట కల్ల కాదు సూ
యుత్తరాంధ్ర లోనఁ బ్రగతి యుత్త దయ్యెఁ బ్రభుతచే 2
తేటగీతి:
సత్త సాటఁ బౌరుల కట శక్తి కలదు
జిత్తు లందు నేత లెపుడు సిక్క రెందు
మత్తు నందు ముంతు రనెడు మాట కల్ల
యుత్తరాంధ్ర లోనఁ బ్రగతి యుత్త దయ్యె 1
[అయినను నుత్తదయ్యె!]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి