అమి తానురాగముం జూ
ప మగండు నిజాత్మజు లనవరతము గొలువం
బ్రమదం బేపారఁగ నా
యమ లోకము శాంతి సుఖము లంది రహించెన్ 62
[ఆయమ = ఆమె]
అమరాధీశుఁ డజాతశత్రునకు నత్యంతానురాగమ్మునన్
యమలోకమ్మును జూపుఁ డొక్కపరి యంచాదేశ మీయంగ నా
యమ రాజాత్మజు భాస్కరాత్మజుని లోకాలోకనం బేర్పడన్
యమలోకంబున శాంతి సౌఖ్యములు హృద్యం బౌచు దీపించెడిన్ 61
విత్త మందు సతము వీడి దురాశను
క్షిప్రము దయతో సుఖప్రదంపు
జీవనమ్ము కొఱకు శిష్యోత్కరమునకు
శిక్ష నొసఁగు వాఁడె క్షేమకరుఁడు 60
సక్షమ రాజ ధర్మమును జారు తరమ్ముగ నిల్పి నిష్ఠ నే
పక్షము నూన కుండక యపార బలమ్మున సంతతమ్మునున్
రక్షణ మీయఁ బౌరులకు రమ్య తరమ్ముగ దుష్ట కోటికిన్
శిక్ష నొసంగు వాఁడె కద క్షేమ కరుం డయి పూజ్యుఁడౌ భువిన్ 59
అంతశ్శత్రుచయ మణఁచి
దాంతుం డయి వీడి యెల్ల దర్పమ్మును నా
సంతాపముఁ ద్రుంప రమా
కాంతా రమ్మనెను యోగి కైవల్య రతిన్ 58
అంతా మాయ యటంచు నెంచి మది నిత్యానంద చేతస్కులై
యెంతే నిష్ఠఁ జరించు వారలరు లేవే కోర్కు లెన్నంగ వే
దాంతజ్ఞానులు సత్తపోధనులు మీ యావాస మెచ్చోటు నాఁ
గాంతారమ్మనె యోగిపుంగవుఁడు మోక్షప్రాప్తి వాంఛించుచున్ 57
బలవంతుఁడు మేధావియు
నిలలో నరుఁ డెన్నఁ డైన నే భేదమ్ముం
దలఁపండు చిన్న పెద్దల
నెలుకం దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా 56
కలవర మంద దెన్నఁడును గాపుర ముండు గృహమ్ము లందు నా
కఁలి కలుగంగ దాని కెలుకల్ దగు నోగిర మౌను మెక్కఁగాఁ
బులుల కులంపుఁ బిల్లి పలు పోకల జిత్తులమారి కాంచఁ జి
ట్టెలుకను మ్రింగువాఁ డతని కేనుఁగు, గొప్ప యనంగ నొప్పునే 55
[ఏనుఁగు = పెద్దది; ఎలుక పిల్లికిఁ బెద్ద గొప్ప కాదని భావము]
మిత్ర శత్రు పక్షమ్ములు మీఱి వాద
నలు సలుపుచుండ నుప్పొంగఁ జలము పగలు
కుడి యెడమ లందుఁ జెలరేఁగఁ గులుకు వగలు
చప్పటులు రేగెఁ గనరాదు సంతసమ్ము 54
తర్షంబాత్మ జనింపఁగా జయమునుం దథ్యంబుగాఁ బొంద నా
మర్షం బుద్భవ మయ్యె నోటమియె సంప్రాప్తింప విన్నంత నా
ధర్షం బత్తఱిఁ బిక్కటిల్ల ఘన సంత్రాసమ్ముతో వారికిన్
హర్షధ్వానము లెన్నొ రేఁగె సభలో నానందమే మృగ్యమౌ 53
తన్ను గాదన్న విషయమ్ము నెన్నకుండ
మానసమ్మున నుప్పొంగి మానధనుఁడు
వాని వెఱ్ఱిని వీక్షించి వాలుఁగంటి
నవ్వెఁ బొరుగింటి దనుచు సంతసముఁ జెందె 52
మగువల పోక నేరకయె మానవుఁ డక్కట మోసపోయెఁగా
మొగమును నింత సేసికొని పున్నమి చందురు మించునట్లుగా
సొగసరి హాస కారణము చోద్య మెఱుంగక ప్రేమఁ జాటఁగా
నగెఁ గద ప్రక్కయింటి చెలి నన్గని యంచు ముదంబుఁ జెందెలే 51
బెట్టిదముగ బీద యయిన
గుట్టుగఁ గాపురము సేయ గుణ మగుఁ జుమి యె
ప్పట్టున నట్టి నర వరుఁడు
చుట్టఱికం బున్న యెడకుఁ జొరరాదు సుమీ 50
పట్టిన పట్టు వీడకనె పంతము తోడుత వేళ సిక్కఁగా
దిట్టతనమ్మునం గడిఁది తెంపున హాని నొసంగఁ జూతురే
తట్టినఁ దట్ట కున్న నెద దాయలు మెత్తని దాయ లెన్నఁగాఁ
జుట్టఱికంపుఁ బెంపు గల చోటికి నేఁగుట కీడగుం జుమీ 49
పలుక నేల వేయి వాని పాండిత్యంపుఁ
జొప్పు మే మెఱుఁగమె గొప్ప లెల్లఁ
జెప్పఁ దలఁతు వేల తప్పొప్పులు గణింప
భ్రాంతిఁ జెందు వాఁడె పండితుండు? 48
అంతేవాసుల సందియమ్ములను సద్యస్స్ఫూర్తి దీపింపఁగా
సంతోషమ్మునఁ దీర్పఁ గల్గు ఘనమౌ సామర్థ్య మేపారఁగా
వింతల్ శంకలు దోఁపఁ గావ్యరచనా విస్ఫూర్తిఁ గాకున్నచో
భ్రాంతిం జెందెడువాఁడె పండితుఁడు సంభావింప యోగ్యుం డగున్ 47
దేవ లోకాధి నాథుఁడు దేహి యనఁగ
నొసఁగెఁ గవచ కుండలముల నొలుక నెత్రు
దాన గుణ మందు విజయమ్ము దనర దాన
కర్ణుఁడు త్రిలోక విజయుఁడై కాంచె యశము 46
పూర్ణ సుధాక రాననుఁడు భూరి పరాక్రముఁ డాజి సత్కళో
త్తీర్ణుఁడు దుర్నిరీక్ష నిజ తేజుఁడు పార్థుఁడు కాల మేఘ వ
ద్వర్ణుఁడు గాండివాఖ్య గుణి ధారి నరుండు తృణీకృతాంగ రా
ట్కర్ణుఁడు మూడు లోకములఁ గాంచె యశమ్ము జయమ్ము నందుటన్ 45
అస్త్ర విహీనాంభోనిధి
వస్త్ర మొసఁగు శాంతి సౌఖ్య పరితోషమ్ముల్
శాస్త్రం బొల్ల దిటు లనన్
శస్త్రచ్ఛిన్నాంగరాశి సంబరము నిడెన్ 44
సస్త్రీ పుం శిశు భద్ర మెంచి నిజ దేశం బందుఁ గావింపఁగా
శస్త్రవ్రాత సమేత సంగరము వే సాధింప గెల్పింపుగా
నిస్త్రాణార్దిత వైరి మర్గ మవనిన్ నిశ్చేష్టతన్ నిల్వఁగా
శస్త్రచ్ఛిన్నశరీరముల్ గనులకున్ సంతోషముం గూర్చెడిన్ 43
మున్ష మెదలఁ దల్పరు వే
పున్షము కాలము జనులను మూరి కరుణఁ గా
వన్షము కాలమ్మున నిడఁ
బెన్షను వచ్చిన నొకండు వేదనఁ జెందెన్ 42
[మును + షము = మున్షము; షము = ముగింపు]
పెన్షము దన్క నింపొదవ వృద్ధులు వీడఁగఁ గొల్వు వారిఁ బ్రా
పన్షము కాల మంతయును బాలకు లిచ్చెడు విత్త రాశి ని
ల్పన్షము నందు దార నిలఁ బన్నుగ నెల్లరు నంద్రు దానినే
పెన్షను వచ్చె నంచుఁ గడు వేదనఁ జెందుట యుక్తమే సుమా 41
[పెను+షము = పెన్షము; షము = అంతము]
పొంతనమ్ము లేని గిరల వంత నొసఁగు
దేమి యెక్కడి దీ భాగ్య మెక్కడి దక
టా నగర మెక్క డీ హైద రన్న మాట
భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు 40
ఏది యెడంద నిష్ట పడు నిమ్ముగ నయ్యది యొప్పు రీతిఁ దా
నా దెస నల్లుఁ గట్టు కథ లంచిత రీతిని నమ్ము నట్లుగా
వాదు లొనర్చు సంతతము వారక పంతము నూని కావునన్
హైదరబాదు భాగ్యనగ రాఖ్యనుఁ బొందుట సత్య దూరమౌ 39
ఏణాంక శిరస్సూనుఁడు
ప్రాణప్రద మోదకములు భాసింప లస
త్పాణితలం బందున్ శ
ర్వాణీసుతుఁ డెలుకపైఁ బ్రపంచముఁ జుట్టెన్ 38
ప్రాణివ్రాతము వొందు విఘ్నముల విధ్వంసంబు గావింప శ
ర్వాణీపుత్రుఁడు స్వీయ భక్తజన గాత్రస్తోత్ర గానస్రవ
ద్వాణీ మోద మనస్కుఁ డేక విలసద్దంష్ట్రుండు వీక్షింపఁగా
వాణీనందనుఁ డాఖువాహనముపైఁ బల్మాఱుఁ దిర్గెన్ భువిన్ 37
తరుణి వచింపఁగఁ గీచకు
గిరలను దుర్భరములను సఖీ యకటా నీ
కరుదెంచె నెంత దుఃఖము
హర శంకర యనుచు భార్య నాశ్లేషించెన్ 36
పరమ పతివ్రతా మణిని బన్నుగఁ గంటిని జానకీ సతిన్
వర హరి యట్లు దెల్పఁగ నవారిత రక్తిని మానసమ్మునం
బరమ ఖరాసు రాపహృత భార్య నిజాంగన జాడ దెల్పితే
హర హర శంకరా యనుచు నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో 35
స్వః ప్రతిమా వసుమతిని న
భఃప్రభువును మించ భూమి పతులుం గరుణన్
స్వః ప్రాశస్త్యము నెన్నక
స్వఃప్రాంతము వీడి నపుడె సౌఖ్యము దక్కున్ 34
స్వః ప్రేమాతిశయమ్ము మానవులకుం బాటిల్లినం గల్గునే
స్వః ప్రాప్తమ్ము రమాధి నాథునకుఁ బూజల్ భక్తి నీకున్నచో
వాః ప్రక్షిప్త వసుంధరా తలమునున్, వాంఛించి డెందమ్ములన్
స్వఃప్రాంతమ్మును, వీడి యేఁగి నపుడే సౌఖ్యంబు లభ్యం బగున్ 33
భానుఁ డెంచు చుండఁ దాను దురా సదుఁ
డంచు మతిని నేరి కైన నింగి
కెగిరి భక్ష నార్థ మెంతొ రయమ్మున
వాయుసుతుఁడు గొట్టె భాను మతిని 32
ఇట్టి దురాగతమ్ము జను లెచ్చట నైనను గాంచ నేర్తురే
నెట్టనఁ బోయి ద్రోవదిని నీరజ నేత్రను శంక లేకయే
పట్టి శిరోజ సంచయము వాక్ఛర జాలము తోడ నక్కటా
కొట్టెను భీమసేనుఁడు సఖుల్ గన భానుమతీ! సతిన్ సభన్ 31
భక్తి నెదలఁ గొలుచు నట్టి భక్త జనుల
నెల్ల నిత్యమ్ము కాపాడి యిహము నింకఁ
బరము నీయ దక్షారామ పట్టణ వర
మగును దక్షిణకాశి భద్రా చలమ్మె 30
[చలమ్మె = ద్వేషమే]
దక్షిణ గంగ నాఁ బరఁగు ధాత్రిని గౌతమి తన్నదీ తటిన్
దక్ష పు రోపవాటికను ద్ర్యంబకు భద్ర శిలేద్ధ లింగ రా
డక్షయ కాంతి వెల్గుచును నంచిత మోక్ష మొసంగ నుండుటన్
దక్షిణ వారణాసి బిరుదమ్ము వహించును భద్రశైలమే 29
[భద్ర శైలము = భద్ర శిల గల క్షేత్రము]
ఏ విధి నూహించితివో
నే వాడను నీదు సొమ్ము నిర్ద్వంద్వముగా
నే వచియించుచు నుంటిన్
నీ విచ్చిన భిక్ష యిద్ది నీకే విందౌ 28
[విచ్చిన = విడఁదీసిన]
నీవు తలంచి తేని నను నీ గురు వర్యుని గా మనమ్మునం
దావక దక్షిణాంగుటము దక్షిణ గాఁగ నొసంగుమా వెసన్
నా విని యేకలవ్యుఁ డనె నా దగు నంగుట మీయ కుందునే
నీ విడి నట్టి భిక్ష యిది నీకె యొసంగెద నిప్డు విందుగాన్ 27
సంతసింప నుర్వి జను లనంతముగను
జక్క నుదయించి నభమునఁ జంద్రుఁ డడరి
యినుఁడు గనఁబశ్చిమాద్రి నింకెక్క డున్న
దగ్ని హిమమును వెదచల్లె నాకసమున 26
కని విని నేర నట్టి విధిఁ గ్రమ్మఁగ మేఘము లబ్బురమ్ముగాఁ
జినుకులు పెర్గి వే కురియఁ జెన్నుగ నత్తఱి వర్ష పాత మం
దనిలము వేగ చల్లఁబడ నంతట మిక్కిలి దూర మెంతొ కా
ననలము నుండి లేచి హిమ మంబర మెల్లనుఁ గ్రప్పె వింతగన్ 25
మెండుగఁ బ్రబల నిజ యశః
కండూతి వలదని యన్నఁ గంసారి కరో
ద్దండారి విఘాతమ్మును
బాండు సుతుల పూజను శిశుపాలుఁడు పొందెన్ 24
[వలదని యన్నఁ బాండు సుతుల పూజను గంసారి కరోద్దండారి
విఘాతమ్మును శిశుపాలుఁడు పొందెన్]
నిండు సభాంతరమ్మున వినీతిని భీష్ముఁడు సెప్పి చూచినన్
వెండియు నొల్లకున్న నెద ద్వేషమునూని కడింది సంతతం
బండగ నిల్చి నట్టి పరమాత్మునిఁ గృష్ణు స భక్తి, నెన్నకే,
పాండవు లెంచినారు, శిశుపాలునిఁ బొందఁగ, నగ్రపూజకున్ 23
[సంతతం బండగ నిల్చి నట్టి పరమాత్మునిఁ గృష్ణు నగ్ర పూజకున్ స భక్తి
పాండవు లెంచినారు; నెన్నకే శిశుపాలునిఁ బొందఁగ (అగ్రపూజ)]
మానవ గణ హత్యా దోష మూనరే గ
ణింప వీరవరేణ్యులు సంప నడరి
సాహసమ్మున నిర్దయఁ జంప ధర్మ
కలినిఁ బాపపుణ్యముల లెక్కలు గుదురునె 22
[కలి = యుద్ధము]
అల యింద్రుం డమరావతీ పురినిఁ జోద్యం బంది వీక్షింపగాఁ
గలలో నైనను గాన రాని గతి సాక్షాత్కారముం జేయఁగా
విలయాకారము నూని క్షామ మిల గంభీరంపు టుగ్రంపు టాఁ
కలి కాలమ్మునఁ బాప పుణ్యముల లెక్కల్ తాఱుమాఱౌఁ గదా 21
ఆతతమౌ యాదరణ స
మేతము నధికార ముండ మితి హీనముగా
నే తఱిఁ గన నల్పముగా
జీతము లేనట్టి కొల్వు శ్రేష్ఠమ్ము గదా 20
ప్రీతిని గూర్ప నిత్యము వివేకము తోడుత బిడ్డ లుండఁగా
జీతము ముట్టి నంతటనె చేతి కొసంగెడు నాథుఁ డుండఁగా
నాతికి సంతసమ్మున ఘనమ్ముగఁ జేయఁగ భర్త కింపుగా
జీతము లేని కొల్వు గడు శ్రేష్ఠము గాదె తలంచి చూచినన్ 19
భండ నాంత రోపద్రవ ఖండి తాంగ
వీర వీక్షణ ఫలితము భరత భూమి
శూర వరలోక గణ్యు నశోకు వీత
శస్త్రమే శాంతి చిహ్నమై సన్నుతిఁ గనె 18
అస్త్ర విహీను సన్నుత మహాత్ము నిజేక కటిస్థ శుద్ధ స
ద్వస్త్రుని భవ్య గాంధి కుల వర్యు దురాక్రమ ణారి వర్గ భృ
చ్ఛస్త్ర విఘాత లాఘవము సత్య వరాగ్రహ సిద్ధ సుప్రభా
శస్త్రమె శాంతి చిహ్నముగ సన్నుతి కెక్కెను భారతావనిన్ 17
ఆంధ్ర కవితా పితామహు నల్లసాని
పెద్దనను మదిఁ దలపోసి విశ్వ మందు
సాటి యంచుఁ బండితు లెల్ల సమ్మతింప
గండపెండెరముం దాల్పఁ గలరె కవులు 16
పిలిచి యొసంగ నియ్యకొని వే ధరియింపఁ దలంతు రెవ్వ రే
నిల వెలఁ బోసి కొం టరుదె యెన్నఁడు నెందును నైన గొప్ప వీ
రులకు నొసంగు భూషణము లో వరియింతురె యంచు నెంచుచుం
దలఁపరు గండపెండెరముఁ దాల్పఁగ సత్కవు లెన్నఁడేనియున్ 15
అంచితముగఁ బద్యమ్ముల
నుంచిన యట్టి పద తతిని నొప్పగు వరుసం
బంచుట కిదియె ప్రమాణము
కాంచనము నొసంగియుఁ గొనఁ గలమె లవణమున్ 14
[పద విభజన: కాంచనము గొనఁగలమె లవణమున్ ఒసంగియు]
విందులు భూషణమ్ములు వివేక విహీనుఁడ పెక్కు లిచ్చినన్
సుందరి నీ వశం బగునె చూపిన నాశలు మిక్కుటమ్ముగన్
మందమతీ తలంపకు శ్రమమ్మును సద్గుణవంతురాలినిం
గొంద మటన్న వీలగు నొకో లవణమ్ము సువర్ణ మిచ్చినన్ 13
[లవణమ్ము(న్)= లావణ్యము గల దానిని]
స్వప్నాంతం బైనను దా
స్విప్న తనుండు నయి నడర భీతి యెడఁద లో
నప్ను శిరుఁడు సతి తోడుత,
స్వప్నంబున, హరినిఁ గాంచి శంభుఁడు వడఁకెన్ 12
[హరి = సింహము; అప్ను = జలము]
తృప్నువు గాక స్వీయ సు సతీ సహితమ్మున నుంటి నక్కటా
క్షిప్ను లలామ యౌ ననుచు క్షిప్రము పార్వతి నేరి నంతటన్
స్విప్న శరీరుఁడై యెఱిఁగి విశ్వవిమోహన మోహినీ సతిన్
స్వప్నములోన విష్ణువును శంభుఁడు గాంచి వడంకె భీతుఁడై 11
[తృప్నువు = తృప్తిశీలుఁడు; క్షిప్ను లలామ = మిక్కిలి తిరస్కరించు సతి;
స్విప్నము = చెమట తోఁ గూడినది]
సువిదితమే యెల్లర కిది
యవధానం బనెడు విద్య యాంధ్ర జనులదే
భువి భేదోపాయ విలస
దవధానం బనెడు విద్య యాంగ్లేయులదే 10
స వినోదస్థితిఁ జేసి వర్తకము సంస్థాపించి సామ్రాజ్యమున్
సువిశాలమ్మును భేద దండ గతులం జోద్యంబుగా నూని వా
రవిరామంబుగ నాంగ్ల నామ పర భాషానంత విన్యస్త వా
గవధానం బను విద్య నాంధ్రులకు నా యాంగ్లేయులే నేర్పిరే 9
దుర్వ్యసనమ్ముల నూనక
దుర్వ్యయములు లేని వృత్తి దుర్భర మైనన్
నిర్వ్యథన సుదూరీకృత
దుర్వ్యాపారమ్ముఁ జేయుదురు మోదమునన్ 8
దుర్వ్యాసంగము లెన్న కెన్నఁడును సంతుష్టాంత రంగమ్మునన్
దోర్వ్యాపారము నెద్ది యైన నిలలో దుస్సాధ్యమం చెంచినన్
నిర్వ్యాపారము కన్న నుత్తమ మగున్ నిక్కంబుగా నాఁపినన్
దుర్వ్యాపారము లాభదాయకము సంతోషమ్మునం జేసినన్ 7
అన్నుల మిన్నయె చెన్నుగఁ
దన్ను బొగడఁగ జను లెల్లఁ దమకము తోడం
గ్రన్నఁ బరాజితుఁ జేయఁగ
నన్నయ! గార మ్మొలుకఁగ నాట్యముఁ జేసెన్ 6
[నన్ను + అయ]
కన్నుల పండువౌ నటులఁ గాంచన భూషిత సుందరాంగియే
పన్నుగఁ జూపి నాట్య వర భంగిమ లెల్ల మనోహరమ్ముగా
నన్నలినాక్షి మంటపము నందునె నాట్య మయూరి వోలెఁ దా
నన్నయ! గార మొల్కు గతి నాట్యముఁ జేసె జనమ్ము మెచ్చఁగన్ 5
[తాను + అన్ను+ అయ = తా నన్నయ; అన్ను = స్త్రీ]
భరత వర్ష చరిత్రను భారత మని
పరిగణింప నాధునికులు పంత మూని
యెఱుగ కున్నఁ బురాణము లింత యేని
వ్యాస కృతము గాదందురు భారతమును 4
ధీ సముఁ డీ ఋషీంద్రునకు దేవ జగమ్మున నైన నుండునే
వ్రాసిననుం బురాణములు పన్నుగఁ బెక్కులు తృప్తి నందఁడే
వ్యాస మహర్షి కన్యునకు నారయ శక్యమె వ్రాయ నిట్టు ల
వ్యాస కృతమ్ము గాదనుచు భారతమున్ గణియింత్రు పండితుల్ 3
తారా పథ మంట ముదము
ధారాళముగ వెనువెంటఁ దనరి చరింపం
గోరక యే యాతని పరి
వారమునకు మూడు వచ్చె భానుని దినముల్ 2
భారము మిక్కుటం బయిన వారక వచ్చెను రాత్రి గోపనం
బారయ భాగ్య హీనునకు నక్కట దుర్విధి నెన్న శక్యమే
యేరికి రాని భంగి మనుజేంద్రుని యానతి నబ్బరమ్ముగన్
వారము లోన వచ్చె రవి వారము మిత్రమ మూడు మార్లుగన్ 1
[రవి వారము = రవి తడవ]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి