15, డిసెంబర్ 2024, ఆదివారం

దొడ్డవర సోమేశ్వరోదాహరణము

దొడ్డవర సోమేశ్వరోదాహరణము

ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు, బోట్లకుఱ్ఱు దొడ్డవరము.

 

 

 

 

ఇష్ట దేవతా ప్రార్థనము.

 

 

 

 

శా.

శ్రీకంఠుండు శ్రితార్తి నాశకుఁడు సుగ్రీవుండు స్కందుండునున్

కాకో లాభరణుండు నక్షతుఁడు గంగా నాథుఁ డవ్యక్తుఁడున్ 

నాకే శాది సురాలి పూజితుఁ డుమా నాథుండు కాలాత్ముఁడున్ 

శోకఘ్నుండు శివుండు దొడ్డవర భాక్సోమేశ్వరుం డగ్ర్యుఁడున్  

1.      

 

 

 

మ.

జిత కందర్పుఁడు పార్వతీ ధవుఁడు కాశీనాథుఁ డుగ్రుండునున్

శ్రిత రక్షా ఘన కార్య దక్షుఁడు సుసంసేవ్యుండు సూక్ష్ముండునున్

జిత ఘోర త్రిపురుండు హంసుఁడు స్వయంశ్రేష్ఠుండు సారంగుఁడున్

స్తుతుఁ డా దొడ్డవరంపు క్షేత్రపతి యో సోమేశ్వరా కావుమా    

2.     

 

 

 

 

ఉదాహరణము ప్రారంభము.

ప్రథమా విభక్తి.

 

 

 

 

చం.

వెలసెను సోమ శంకరుఁడు పేరిమి యల్లుఁడు పోచి రాట్కుల

స్థుల కిల వర్ష వర్షముల సుక్రతు దుర్గల పెండ్లి సల్పఁగా

నలరుచు దొడ్డ దొడ్డవర మందు సభక్తి జనోత్కరమ్ము స

ల్లలితముగా నుతింపఁగ లలాట సునేత్రుఁడు గావ లోకులన్

3.     

 

 

 

కళిక.

(తురగవల్గన రగడ.)

వెండి కొండ పైన గౌరి యుండ నాట్య మాడు వాఁడు

మండు నగ్ని మించు నట్టి చండ విషముఁ గొన్న వాఁడు

మూడు పురులు కలఁత లీయ నాఁడు గూల్చినట్టి వాఁడు

మూడు కన్ను లున్న యట్టి వాఁడు వెండి కొండ ఱేఁడు

శిరము పైన గంగ యుండఁ గరము వెలుఁగునట్టి వాఁడు

మరుఁడు మూరి వేయ పుష్ప శరము కాల్చినట్టి వాఁడు

యలరి కాశి లోన గౌరి కొలువ నిలిచి నట్టి వాఁడు

నిలిచె దొడ్డవరము నందుఁ  గొలుచు వారిఁ గాచు వాఁడు

4.     

 

 

 

ఉత్కళిక.

అక్షయముగ నలర నోజ  లక్ష పత్ర రమ్య పూజ

లేట యేట వీటఁ జెలఁగఁ గోటి సిరుల యూట సెలఁగ

దొడ్డవరము దొడ్డపురము గడ్డ పైనఁ గాలు చిరము

నిలిపి కావ నిలిచె వాఁడు  వెలసెను హరుఁ డలరి ఱేఁడు

5.     

 

 

 

 

ద్వితీయా విభక్తి.

 

 

 

 

ఉ.

కాన నశక్యమై తనరు కన్నును గల్గిన వాని గొంతులోఁ

బానము సేయ నంజు గలవానిని గంగను మోయు వానినిన్

దీనులఁ గాచు వానినిఁ బ్రదీప్తపుఁ దెల్లని మేను వానినిన్

మానిని పార్వతీ సతిని మానుగఁ దాల్చిన వాని నా హరున్  

6.     

 

 

 

కళిక.

(హరిగతి రగడ)

మేనున బూదినిఁ జక్కఁగ నలమిన వానిని నాట్యము సేసెడి వానిని

నేనుఁగు లూతను సర్పముఁ గాచిన వానినిఁ దిన్ననిఁ గాచిన వానినిఁ  

బట్టణ దైత్యుల నాశము సేసిన వానిని మారునిఁ గాల్చిన వానినిఁ

బట్టికి నేనుఁగు శిరమును గూర్చిన వానిని బాణునిఁ గాచిన వానిని

భామిని మోహిని మోహమున పడిన వానినిఁ బిమ్మటఁ దేరిన వానిని

వాముని క్షేమము భక్తుల కొసఁగెడి వానిని  వేగమ పొంగెడు వానిని

మానుగ దొడ్డవరమ్మున వెలసిన వానిని భోగము లిచ్చెడు వానినిఁ

మానక నెమ్మిని మోక్షము లిచ్చెడు వానినిఁ గొల్తుము నిత్యము వానిని  

7.     

 

 

 

ఉత్కళిక.

కైలాస గిరీంద్రమ్మున నిత్యము

శైలాత్మజ పూజ లొసగఁగ ముదము

ముని పుంగవు లర్చింపఁగ భక్తిని

నినదమ్ములు సెలరేఁగఁగ మింటినిఁ  

బదములు గడుగఁగ గంగా సతియే

ముదముగఁ గట్నము లిడ గిరి పతియే

దొడ్డవరమ్మున వెలసిన వానిని

నడ్డెఱుఁగని వానిఁ గొలుతుము హరుని

8.     

 

 

 

 

తృతీయా విభక్తి.

 

 

 

 

ఉ.

ఎవ్వని చేత దక్షు స్తువి యెల్ల నశించెనొ యట్టి వానిచే

నెవ్వని చేత రావణుఁ డహీన బలాన్వితుఁ డయ్యె వానిచే

నెవ్వని చేఁ గుబేరుఁడు ధనేశుఁడు గీర్తి గడించె వానిచే

నివ్వర ఖేట దొడ్డవర మింపుగ నందెను ఖ్యాతి నీశుచే

9.     

 

 

 

కళిక.

(ద్విరదగతి రగడ)

రఘురాముఁ డెవనిచే రాజిల్లె వానిచే

నఘము లెవ్వానిచే నాశ మగు వానిచే

దక్షపతి నెవ్వండు శిక్షించె వానిచే

యక్షపతి నెవ్వండు రక్షించు వానిచేఁ

దిన్నాఖ్యు నెవ్వండు దివి నిల్పె వానిచేఁ

గన్నుంచె నెవ్వండు కాల్పంగ వానిచే

దొడ్డ వరములఁ బొందుఁ దోరమ్ము వానిచే

దొడ్డవర మనిశమ్ము తూర్ణమ్ము శంభుచే

10.   

 

 

 

ఉత్కళిక.

సిరు లొల్క నిత్యమ్ము ‌।  తరు లడర నిరతమ్ము

వైనతేయము పాఱ ।  గాన లహరుల యేఱు

వాడ వాడల గుడుల । వేఁడగను దైవముల

చెడ్డఁ గన దభవుచే । దొడ్డవరము హరుచే

11.    

 

 

 

 

చతుర్థీ విభక్తి.

 

 

 

 

ఉ.

పుట్టుటకై వరాల కయి మూరుటకై మఱి మేటి కూటికై

పెట్టుటకై పొలాల కయి వీడులకై శకటమ్ము లుంటకై

కట్టెలకై సుఖాల కయి కానలకై పశుకాయ వృద్ధికై

పట్టరె మేటి దొడ్డవర వాసులు దీక్షలు శూలపాణికై             

12.   

 

 

 

కళిక.

(వృషభగతి రగడ)

 

నమక చమకమ్ములు పఠింతురు నందివాహన భూతపతికై

క్రమముగా నభిషేకములు వీఁక నొనరింత్రు పరమ శివునకై

కార్తికపు టుపవాసము లలరు నార్తి నిచ్చలు శంకరునకై

కీర్తనలు సంతతము భక్తిని వర్తిలుచు నుండును హరునకై

లక్ష దళముల పూజ దివసం బక్షయముగ జరుగు శివునకై

భక్ష ణోత్సవ ముండు రాత్రికి భాగ ముంచి యుమా ధవునకై

దొడ్డ మనసుల లోన నుంతురు తోరముగ భక్తి నభవునకై

దొడ్డవర మందు నివసింతురు ధూర్జటి ద యాలోకములకై

13.   

 

 

 

ఉత్కళిక.

తుల్య మరయని త్రోవ వర కై । వల్య మారసి పరమ శివు కై

వశము గాఁగ జపమ్ము కొఱకై ।  భృశము తనరఁగఁ గృషియె దివికై

భవ్య నుతు లలవడ భవునకై ।  సవ్య కృతు లుంచఁగ శివునకై

దుడ్డు లుంతురు త్రుటి హరునకై ।  దొడ్డవర మందుఁ బరమునకై

14.   

 

 

 

 

పంచమీ విభక్తి.

 

 

 

 

చం.

నరులకు నెంచ దేని వలనన్ ధరఁ దోఁచును ముక్తి మార్గముల్

నరులకుఁ గల్గు దేని వలనన్ హృదయమ్మున భక్తి భావమే

నరవరు లెల్ల దేని వలనన్ భువి నేలుదు రట్టి శక్తినే 

హరు వలనన్ ధరాతలము నందలి దొడ్డవరమ్ము వొందెనే

15.   

 

 

 

కళిక.

(హంసగతి రగడ)

పరఁగు సౌఖ్యమ్ము లెవ్వాని వలనఁ । బరఁగు సంతాన మెవ్వాని వలన

వఱలు యోగమ్ము లెవ్వాని వలన ।  వఱలు నైశ్వర్య మెవ్వాని వలన

వర మోక్ష మడరు నెవ్వాని వలన । వర భక్తి కల్గు నెవ్వాని వలన

దొడ్డ గుణ మడరుఁ దద్ద్రుహిణు వలన । దొడ్డవర ముబ్బుఁ దద్ద్రుహిణు వలన

16.   

 

 

 

ఉత్కళిక.

 

భక్తిభావమ్ము । రక్తినాశమ్ము । శుద్ధహృదయమ్ము। నిద్ధచరితమ్ము

మించి నిత్యమ్ము । నెంచఁబడుఁ జుమ్ము । దొడ్డపురి వలన ।దొడ్డ హరు వలన

17.   

 

 

 

 

షష్ఠీ విభక్తి.

 

 

 

 

ఉ.

మ్రొక్కుదు రింపుగా నమర పూజిత శంభునకుం ద్రిశూలికిన్

మక్కువ తోడ నిత్తు రసమాన దయానిధికిం గపర్దికిన్ 

మ్రొక్కులు పార్వతీ పతికి బూచుల రాయనికిం గపాలికిన్  

మిక్కిలి కంటివేల్పునకు మేదిని దొడ్డవరంపుఁ బూరుషుల్

18.   

 

 

 

కళిక.

(ద్విరదగతి రగడ)

చిత్త శుద్ధియ చాలుఁ జిత్రముగ శివునకున్

బత్తి యొక్కటి సాలు భర్గునకు హరునకున్

క్షీరాభిషేకమ్ము గారమ్ము హంసునకు 

నీరాభిషేకమ్ము నెమ్మి నిడు రుద్రునకు 

కాటి నిలువఁగఁ బ్రీతి మేటి నటరాజునకు

పాటలఁ బొగడఁ బ్రీతి పార్వతీ నాథునకు

కడు దొడ్డ హర్షమ్ము కాశీపురేశునకు

నడువ దొడ్డవరమున నడిరేయి  సోమునకు

19.   

 

 

 

ఉత్కళిక.

సంతతము నాడుచును । బంతమునఁ బాడుచును

భృత్యుల మని తలంత్రు । నిత్యమ్ము నర్పింత్రు

మాటి మాటికి నుతులు । మేటివౌ కీర్తనలు

దొడ్డవౌ వరములకు । దొడ్డవర సోమునకు

20.   

 

 

 

 

సప్తమీ విభక్తి.

 

 

 

 

ఉ.

ఎవ్వని యందు నిల్పిన నహీనపు భక్తిని సౌఖ్య మబ్బునో

యెవ్వని యందు నమ్మకము నిమ్ముగ నుంచిన మేలు గల్గునో

యెవ్వని యందుఁ జిత్త మిడ నింపుగ మోక్షము నంద వచ్చునో

యవ్వర సోమునం దిడుదు రందఱు దొడ్డవరమ్ములో నెదల్

21.   

 

 

 

కళిక.

(హంసగతి రగడ)

నిత్యమ్ము తమి నుంచి సత్య మందు

నత్యంత మిడి భక్తి నాత్మ యందుఁ

విత్తమున రతి వీడి బత్తి యందు

జిత్తమ్ముఁ బోనిచ్చి చెడ్డ యందు

లగ్నమ్ము కానీక రమణు లందు

నగ్నిఁ గని విహరింత్రు  యభవు నందు

దొడ్డ రక్తిని నుంచి  ధ్రువుని యందు

దొడ్డవర జను లుంద్రు గడ్డ యందు  

22.   

 

 

 

ఉత్కళిక.

ఎద లందు రక్తిపద మందు భక్తి  

పొలమందు సొంపునిలు నందు నింపు

పను లందు ఘనులు జను లెల్ల ఘనులు

దొడ్డ గుణ మందుదొడ్డ పురి యందు

23.   

 

 

 

 

సంబోధన ప్రథమా విభక్తి.

 

 

 

 

ఉ.

చెడ్డను దల్ప మెన్నఁడు విశేషపు భక్తి నుతింతు మీశ్వరా! 

యడ్డము లెన్ని వచ్చిన మహా ధృతి నిన్ను స్మరింతు మక్షరా! 

పడ్డఁ జలింప మింతయును బన్నుగ నిన్నెద గొల్తు ముగ్రుఁడా!

దొడ్డవ రాధినాథ! హర! ధూర్జటి! సోమమహేశ్వరా! శివా!

24.   

 

 

 

కళిక.

(హరిగతి రగడ)

దక్షుని యజ్ఞము నుమకై నాశము దక్షతఁ జేసిన యక్షర! విషధర!

శిక్ష నొసంగియు దక్షున కంతట రక్షణ మిచ్చిన యక్షత! శశిధర!

సుర గంగ భరమ్ము శిరమ్మున భాసురముగ నూని వెలింగిన యీశ్వర! 

పురముల మూటిని శరమునఁ గూల్చిన పురహర! గిరిజానాథ! నటేశ్వర!  

చంద్రునిఁ గావఁగ నెత్తిని నుంచిన చంద్రధరా! కావుమ ఫణిభూషణ! 

యింద్రుని మొదలుగ దేవత లెల్లరు హిత మరసి నుతింత్రు నిను దయాగుణ! 

దొడ్డవరమ్మున వెలసితి వెన్నఁడొ దొడ్డగఁ గొల్వగఁ బూర్వులు భార్గవ!

దొడ్డవర జనుల భాగ్యము శంకర! దొడ్డది రక్షణ మిడుమా శంభువ!

25.   

 

 

 

ఉత్కళిక.

భీమేశ్వరుఁ డను బ్రియతర నామము

రామేశ్వరుఁ డను రమ్యపు నామము

కామేశ్వరుఁ డను కమ్మని పేరును

వే మనము లలర వెలయఁగ వీరును

సోమేశ్వరుఁ డను సురుచిర నామము

ప్రేమ సెలంగఁగఁ బెట్టిరి నీమము

తో దొడ్డవర సుతులు హర! పశుపతి!  

సాదరము శివా! యఘహర! గిరిపతి!

26.   

 

 

 

 

సార్వ విభక్తికము.

 

 

 

 

శా.

దేవా యుగ్రుఁడ వీవు నిన్ను మదిఁ బ్రీతిం గొల్తు మింపారఁగన్

సేవల్ నిత్యము నంది సాంబశివ మాచే నిగ్రహానుగ్రహా

నీవే మా కయి వేగ మా వలన నే నేరమ్ములం జూడకే

రావే నీకు నెడంద లం దిడ నతుల్  రక్షింప  దుర్గాధవా!

27.   

 

 

 

 

అంకితాంకము.

 

 

 

 

ఉ.

విశ్వసృజుండు విక్రముఁడు వింతగ నేరరె యాది నంతముం

బశ్వధినాథ నీ మహిమ వారిధి నేరుట నాకు నెట్లు కా

మేశ్వర నామధేయుఁడను మించి స్మరించుచు నిన్ను వ్రాయఁగా

నీశ్వర యీ యుదాహరణ మింపుగఁ గైకొని కావు మక్షరా!

28.   

 

 

 

 

పోచిరాజు కామేశ్వర రావు నామ ప్రణీత దొడ్డవర సోమేశ్వ రోదాహరణ కావ్యము సమాప్తము.

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి