ప్రబల రచనా ధురంధర | నిబిడీ కృత మోద భరిత నిర్మల చిత్తున్ || స్తబక నిభ కవన చయ రత | విబుధ వర విధేయ సత్కవి జనాసక్తున్ ||
21, డిసెంబర్ 2025, ఆదివారం
Homage to R K Sing
సీ. రామ కిషోర సింహామల నామ సత్కార్య దురంధర గణ్యుఁ డఖిల
భారత పరమాణు భవ్యత రోద్యోగ సహకార సదన సంచయ విశాల
నిర్మాణ సంస్థకుఁ గర్మాధికారియై విజయమ్ము సాధించి వినుతి కెక్కె
కార్య దీక్షా రత కారణ జన్ముండు మను జోపకార సన్మానసుండు
తే.గీ. ని పురమునకు మూల స్థంభ మయ్యె
లలిత వృత్తికి భాసిల్లె లక్షణముగ
గెలిచి జనుల మానసములు కీర్తి వడసె
భువిని వెలసిన వర పుణ్య పురుషుఁ డతఁడు 2.
సీ. ధరలోన జన్మించి పరమ దంపతులకు దివ్యంపు బీహారు దేశ మందు
నరుదైన భాగ్య నగరములో నొనరించి యింపైన యుద్యోగ మెసక మెసఁగఁ
బరివారమున కెల్ల భవనమ్ములను గట్టి యలవోక విభజించి యందఁ జేసి
రాజధాని కరిగి రమ్య సేవ లొసఁగి మాతృభూమి ఋణము ప్రీతిఁ దీర్చి
ఆ.వె. పుడమి లోనఁ బనులు తడయక పూరించి
నాక లోక మందు రాక కెదురు
చూచు చుండ నెల్ల సురలు వారి కొసఁగ
ముదము వీడితె మము పుణ్య పురుష1 1.
1, డిసెంబర్ 2025, సోమవారం
సమస్యాపూరణ_డిసెంబర్ 2025
పూల గుత్తుల నర్పించి మూర ముదము
భాగవతులు సేరి యయోధ్య భక్తి తోడఁ,
గ్రొవ్వు వత్తుల వెలిఁగించి కొలువఁ గ్రీస్తుఁ
గ్రైస్తవులు, ప్రణమిల్లిరి రామునకును 62.
దుస్తర జన్మ సాగరము తూర్ణము దాఁటఁ దలంచి యాత్మలన్
నిస్తుల నిష్ఠ నూని యనునిత్యము కోరుచు సర్వ మానవ
స్వస్తిని భారతీయ హరి భక్తులు, తక్కఁ దురుష్కు లింకనుం
గ్రైస్తవు లెల్లఁ, జేరి రఘు రామునకున్బ్రణమిల్లి రార్తితో 61.
మఱవకుఁ డీ మర్మమ్మును
వెఱవకుఁ డాహ్వానిత జన విసరం బెల్లం
దఱచుగఁ, గమ్మని నేతిని
నఱిసెల రుచి కొఱకు వ్రేల్వుఁడా, ముద మందున్ 60.
అఱచిన నేమి యా యతిథులై చనుదెంచిన వార లెల్ల ర
త్తఱి వెగ టంద డెందములఁ దప్పక దూరము సేయ వారి, నీ
కఱిముఱి కోప మున్న మది నందఱ కీయఁ దలంప వంత నా
యఱిసెల వ్రేల్వఁ గావలయు నాముద మందున, స్వాదు వందఁగన్ 59.
బుద్బుదములు జీవుల ప్రాణము లని సకల
జనుల కింపుగ నెఱిఁగించు చంద మేమొ
చిత్ర మరయ నొక్క నిమిష మాత్రమునన
స్థిరము లయ్యెఁ దటిల్లతల్ చిన్కు లెల్ల 58.
అరుదయి యుండ వర్షము సహస్ర శతాహము లందు నెన్న నేఁ
డరయఁగ వృష్టి నిట్లు వనజాక్షు దయా రస దృగ్బలమ్మునన్
నరులకు రేఁగ హర్షము మనమ్ముల వారికి లోచనమ్ములన్
స్థిరములుగాఁ దటిల్లతలుఁ జిన్కులు మారెను గుంభవృష్టిలో 57.
మా బొందులు మా యిష్టము
నీ బాధల నీవ కనుమ నీ కేలయ్యా
యే బొందికి నేమి హితవొ
మా బట్టల తీరుఁ జెప్ప మాన్యత యగునా 56.
మా మేనుల్ గద మా యభీష్టములు సంబంధమ్ము నీ కేటికిన్
మే మూనన్ మెయిఁ బారదర్శకములం బెంపార నీ కేటికిన్
మే మున్నం దగ దేవతాంబరములం బెద్దన్న నీ కేటికిన్
మే మే బట్టలఁ గట్టఁగా వలయునో మీ రెవ్వరో చెప్పఁగన్ 55.
అవనిఁ గోదండ రామున కఖిల జనులు
నిర్మలాంతరంగమ్ముల నిశ్చలంపు
భక్తి సంతతం బడరఁగఁ బంక్తిముఖ వి
దారికి నమస్కరించిన దక్కుఁ బరము 54.
ద్వారవతీ పురమ్మున సదామము వెల్గుచు నుండ నిత్యమున్
వారక వాసుదేవునకు భక్తి సతమ్ము మహోగ్ర భీక రా
కార సురౌఘ నిర్దళన కాంచన భోజన దార్ఢ్య హృత్శిలా
దారికి మ్రొక్కినన్ బహు విధంబుల మే లగు మోక్ష మబ్బెడిన్ 53.
ప్రణతు లొసఁగి పిల్చిన కా
రణమునఁ దమ దోడు రాఁగ రజనీ జాతుల్
మణి భూషాలంకారులు
గణపతి సుత పెండ్లిఁ గనఁగఁ గదలిరి దివిజుల్ 52.
[దివిజులు = పగలు పుట్టిన వారు]
గణన కతీతమెన్నఁగ జగమ్మున వేంకట నాథు పెండ్లి స
ద్గుణముల రాశి పద్మ సుమ కోమలి వెల్గఁగఁ బెండ్లి కూఁతురై
ప్రణతు లొసంగి పిల్వఁగ నభఃపతి నాముఁడె యగ్రగామి కా
గణపతి పుత్రి ప్రెండ్లిఁ గనఁగాఁ జనుదెంచిరి మౌనులున్ సురల్ 51.
ధర్మ మాచరింపక యున్నఁ దప్పు సుమ్మ
ధర్మపరు లెల్లఁ జెలరేఁగఁ దద్ద యూఱ
కున్న నాపక యెవరేని కన్నులార
కన్న వారల కిడ రాదు గౌరవమ్ము 50.
అన్న క్రూరులు వారలెల్ల దురాత్ము లిద్ధర విత్త మీ
కున్న వారికిఁ గోరినంతనె యుగ్రులై మనుజావళిం
దన్నుచుందురు కిన్క మానవ ధర్మ హీనులు మోసపో
కన్న వారలఁ గాంచి నంతనె గౌరవించుట దోషమౌ 49.
అలరం జింతాకు పతక
ము లలన కంఠమ్మునఁ దన పురుషుని నరయన్
లలితాన్నము తత్క్షణమే
చెలి వడ్డించెను విభునకుఁ జింతాకుననే 48.
[చింతాకుననే = చింతాకుపతకముతోనే]
లలనా రత్నము సంతసం బొదవ నుల్లం బందు నీలాభ్ర కుం
తల వీక్షించి నిజేశు రాక నట నుత్సాహమ్మునన్ లేచి తా
నలవోకం దనరింపఁగా రుచుల నింపైనట్టి యా పచ్చడిం
జెలి వడ్డించెను బ్రాణవల్లభునకుం జింతాకు లోఁ బ్రేముడిన్ 47.
[చింతాకు = చింతచిగురు; లో = లోపల]
పరమేశ్వరు దయ కల్గినఁ
బరఁగును నేఁటి మరుభూమి పంటల తోడన్
ధర నిండ్లకు వలయు నిసుక
మరుభూమిని నిసుక నమ్ముమా సిరు లబ్బున్ 46.
[నమ్ము = విశ్వసించు]
వర సఖ నమ్మి మూర్ఖులను వర్తక మప్పురి రాదు సేయఁగా
నరిగి వనమ్ములో ఫలము లమ్మి గడింపఁగ వచ్చు దుడ్డు వే
యరిగి ఘనాబ్ధికిన్ జలము నమ్మి గడింపఁగ వచ్చు సొత్తు నిం
కరిగి యెడారిలో నిసుక నమ్మి గడింపఁగ వచ్చు సంపదన్ 45.
తాఁక నాపత్సమయ మందుఁ దప్పు లేదు
సుండి నారీమణులను బరుండు నైనఁ
గాంచి రక్షింప నెదనెంచి కాలుచుండఁ
బైఁట లాగెను పెఱవాఁడు పతియె మెచ్చె 44.
ఏటికి గుర్తు లొల్లరు కవీంద్రులు పద్దెము లందు నేరమే
పైఁటను లాగినాఁడు తన భర్తయె మెచ్చిన వాఁడె యన్యుఁడౌ
నాఁట విరామ చిహ్నములు నాయన! యర్థ మిదే యిటం జుమీ
పైఁట చెఱంగుఁ బట్టెఁ, బెఱవాఁడు గనుంగొని మెచ్చె, భర్తయే 43.
[లాగినాఁడు = లాగిన వాఁడు]
తేజోమ యామృతాంధో
రాజినిఁ గొలుచుచు సభక్తి గ్రామమ్ములలో
రాజిలు క్షుద్ర సురావళిఁ
బూజించుట మాని నపుడె పుణ్యము దక్కున్ 42.
ఆజి మనోర థాతత దురాత్ములు నై ఘన రోష తప్తులై
వ్యాజ మనస్కులై పర ధ నాఖిల వస్తు వినాశ నార్థమై
భూజన సంక్షయమ్మునకు భూరి తరాణు వరాస్త్ర కోటికై
పూజలు మానినన్ విపుల పుణ్యము దక్కును సజ్జనాళికిన్ 41.
ఉల్లమ్ము లలరఁగం దాఁ
బెల్లుగ వలచిన లతాంగిఁ బ్రియమారం దా
వల్లె యన మిత్రున కొసఁగి
చెల్లినిఁ, బెండ్లాడెఁ గడు విచిత్రమ్మెటులౌ 40.
తెల్లముగా నెఱుంగ రిల దేవ మనోగత భావజాలముల్
చెల్లికిఁ బట్టె యోగము విశేషముగా నని యెంచ నెల్లరుం
గల్లలు కావు మాట లివి కాదని యక్కను సంతసమ్మునం
జెల్లినిఁ బెండ్లియాడెను విచిత్ర మటంచుఁ దలంప రెవ్వరున్ 39.
తప్పు సైరింప నెన్నఁడు నొప్పు కాదు
కవి కృతమ్ములఁ బరికింపఁ గానిపించు
వృత్తి దుష్టమ్ము దండింప వేగ దొడ్డ
వేము తీ యన యనె నెట్లు వేమన కవి 38.
[పేము = బెత్తము]
ఏమి వక్రముగా వచింపకు మిట్లు కొల్చుచు నా పరం
ధాము నత్తఱిఁ దాఁ తినం దినినం దగన్ మధురం బనెన్
భ్రామితుం డయి పల్క లేదు ధరాతలమ్మున నేరుమా
వేము తీయన యన్న వేమన విజ్ఞుఁ డెట్లగుఁ దెల్పుమా 37.
ధనమె మూల మంద్రు తత్త్వజ్ఞు లెల్లరు
తన్ను మాలి నట్టి ధర్మ మేల
స్థిరములే తలంప సిరులు సంపత్తిల
దాత! నిలుచు బుద్బుదంబు వోలె 36.
చేతో మోదము సన్నగిల్లు వినఁగాఁ జీత్కారముల్ నిత్యముం
బ్రాతః కాలము లేవఁ గష్ట మగు దుష్ప్రాప్తంబులౌ నిద్రలే
చేతుల్ కాళ్లును గంప మందు సత మిస్సీ వార్ధకంబేర్పడం
దాతల్ నిల్తురు బుద్బుదంబుల వలెన్ దానమ్ము దుష్కార్యమౌ 35.
[తానము = స్నానము]
మాటల నెద నమ్మి మర్మమ్ము నేరక
మోసపోకు మయ్య పురుష వర్య
తియ్యగ వచియింత్రు నెయ్యమునకు నిట్లు
నే ననంగ నీవె నీవు నేనె 34.
కానక యున్న సుంతయును గార్యము నాతని యందు నిట్లనున్
నే నన నీవు కాదు మఱి నీవన నేనును గా దెఱుంగుమా
యూనిన సుంత యేని యుపయోగము దా వచియించు నివ్విధిన్
నే నన నీవె నీ వనిన నేనె కదా పరికింపఁ దత్త్వమున్ 33.
అడుగ మన్నేల తింటివి యంచు నమ్మ
చిన్ని కృష్ణుఁడు చూపింపఁ జిత్రముగను
బోటి గాంచె లోకమ్ముల నోటి లోన
డాఁగె నణు గర్భమం దజాండమ్ము లెన్నొ 32.
క్షణ మాత్రమ్మును నాఁగ కుండఁ ద్రిజగత్సంచారముల్ సేయుచున్
గణనాతీతము గాంచి యూహలను వీకం జిన్ని డెందమ్ము దా
నణఁచున్ లోకము లన్నిటిం దనదు గర్భాండమ్మునన్ వింతగా
నణు గర్భంబున దాఁగి యుండెఁ గద బ్రహ్మాండంబు లెన్నెన్నియో 31.
ఎద్దియన నుడివెద నాలకింపు మయ్య
పరఁగె నుత్తర మింపుగఁ బ్రశ్న లోన
నేల ప్రశ్నింతు రీ నరు లిట్లనునది
ప్రశ్నలను వేయువారికిఁ బ్రశ్న యెద్ది 30.
విశ్న విహీన కాయుఁడు వివేక విహీనుఁడు సంతతోగ్ర మ
ర్త్యాశ్న గణాధిపుండు సుమహాద్భుత దేహుఁడు కక్ష వూని యా
పృశ్ని కుమార పుంగవుని వీర్యము నెట్లు హరించె నన్నదే
ప్రశ్నలు వేయు వారలకె ప్రశ్నగ మారిన దెద్ది చెప్పుమా 29.
[విశ్నము = కాంతి; అశ్నుఁడు = తినువాఁడు; పృశ్ని = దేవకీ దేవి]
ప్రియుని పైనఁ దలంపులు వృద్ధి సెందఁ
దన్ను గొనిపోవ నంత వింత జగములకు
నూహలు మదిలోఁ జెలరేఁగ నుల్ల మలర
వేణువా లేదు స్వరసుధల్ విందు సేసె 28.
వగచుచు నంత గోపికలు పద్మ దళాక్షులు మిక్కుటమ్ముగన్
నగధరు పూర్వ చేష్టల మనమ్ముల నెంచుచు నిశ్వసించుచున్
మగువలు కృష్ణునిన్ వెదక మార శరానల తప్త చిత్తలై
యగపడ దొక్క వేణువు స్వరామృత పానముఁ జేసి రెల్లరున్ 27.
వివరమ్ముగఁ జెప్పిన సుం
త వినక యేమని వచింతు ధారణ లేమిం
గవిమాని వలదనినఁ దా
నవధానము లెన్నొ చేసి యల్పుం డయ్యెన్ 26.
నృ వరా యెన్నుమ యా కవిత్వ మెదలో నిష్పక్షపాతమ్ముగాఁ
గవివర్యుండవు సాటి సత్కవినిఁ గక్షా యుక్త మీర్ష్యాళువై
యవమానించుట నీకు నిట్లు తగు నయ్యా పండితశ్రేష్ఠుఁడై
యవధానంబులఁ బెక్కు సేసినను దా నల్పుండె విద్వత్సభన్ 25.
అకటా జీవికిఁ బుట్టుట
యొక చావు చదువు టది మఱియొక చా వగుఁ గు
క్షి కొఱకుఁ గృషియుం జావే
యొక దేహమె కాని చావులో పెక్కు లగున్ 24.
అకటా మోక్షము కల్గు నంత వఱ కత్యంతార్తి భోగింపఁ బూ
ర్వ కృతానేక విధాత్మ కర్మఫల సంభారమ్ములన్ భూమిపై
నొకటే యాత్మ సతమ్ము గాంచు నఁట యోహో భోక్త గా నుండి యొ
క్కొక దేహంబున కెన్నియో మరణముల్ యోచింపఁగన్ మానవా 23.
పరమ పుణ్య దేశము సుమ్ము భరత భూమి
యెన్నఁగ నిజ మింపుగ నెల్ల యెడలఁ దక్క
నవని గ్రీష్మపు టెండన్ విహార కేళి
సుఖద మౌను వీక్షింపఁగ సుదతి వినుమ 22.
ఇష్మ విహార సన్నిభము హెచ్చిన వేడుకతోఁ జరింతమా
భీష్మ తరంపుఁ దాపమున విశ్వము వేఁగఁగ మిక్కుటమ్ముగా
నూష్మము సాంత మంత మయి యుర్విని వర్ష ఋతూద్భవమ్ము గా
గ్రీష్మపు టెండ చల్లన సఖీ విహరించెదమా మరీచికన్ 21.
[వర్షకాలములో నెండమావుల గోచరము సాధారణమే]
పాయ కుదర పోషణమే
న్యాయం బని యెంచి తివిరి యవనిఁ దిరుగఁగా
నా యెండకు నఱకాలులు
కాయలు గాచినవి పండ్లు గావెన్నటికిన్ 20.
వేయి విధమ్ములం గలఁత వెట్టఁగ డెందమునుం దలంపులే
రేయి పవళ్లు గాచికొన రిత్తఁగ సుంతయు నిద్ర రాక నా
తోయజ నేత్ర రాక కయి తోయము లింకఁగ నేత్ర యుగ్మముల్
కాయలు పెక్కు గాచినవి గాని ఫలంబులు గా వవెన్నఁడున్ 19.
కఱవు వచ్చిన వారక వఱద లరుగు
దెంచినను గలఁతలు వలదంచుఁ దప్ప
కాదుకొందు మెల్లర నంచు హాలికులకుఁ
గరుణ లభియించెఁ దీరవు కాంక్ష లయ్యొ 18.
తరుణము మోక్ష మందఁగను దారస మయ్యెను మంద బుద్ధి నా
వరమును గోర వక్కట యపార దయానిధి భక్తవర్య! నీ
వరసెడు నట్టి యైహికము లన్ని యనర్థము లబ్జనాభు స
త్కరుణకు నోఁచుకొంటి మఱి కాంక్షలు దీర వదేమి చిత్రమో 17.
భ్రమరాం బేశుని మున్ను వి
నమె మార్కండేయుఁ డార్తి నకులుని వేఁడన్
యముఁ డడరుచుఁ బాశము నే
య మునిన్ బ్రతికింపఁ జేసి యమునిం దఱిమెన్ 16.
సుమ శర వైరి కాత్మ జన శోకము గాంచఁ గరంగు డెందమే
డమరువు మ్రోగఁ జేయుచుఁ దటాలునఁ దా నరుదెంచి యుగ్రతం
గమలి కరమ్ము నార్తిని మృకండు కుమారుఁడు వేఁడుకోలు సే
య మునికిఁ బ్రాణ భిక్ష నిడి యా యమునిన్ వడిఁ బాఱఁ ద్రోలెనే 15.
పణమం దోడినచోఁ గా
రణ మేమైన వెసఁ దీర్ప రాక భృశముగా
ఋణములఁ జిక్కిన జనకుఁడు
గుణవంతుఁడు పుత్రుఁ డైనఁ గూలును గొంపల్ 14.
తృణ మాత్రమ్ము గృహమ్ము నందకట శాంతిం గాంచ మెన్నండునున్
వ్రణమై నిత్యము సళ్పుచుండఁగఁ గుమారవ్యాజ రూపమ్మునన్
క్షణికావేశము ప్రజ్వరిల్లు సుతుఁ డొక్కం డున్న దుర్వార దు
ర్గుణవంతుండగు పుత్రుఁ డుండఁ గడు సంక్షోభమ్మగున్గొంపలో 13.
కరువు వచ్చినఁ గనుట దుర్భరము సుమ్ము
సొమ్మ లున్నను భృశము ఫలమ్ము సున్న
వెన్నుని కరుణ వెతలు రాకున్న యెడలఁ
గరువు జీవులకున్ మోదకరము సుమ్ము 12.
[కరువు = గర్భము]
హరిహర నామ సంస్మరణ మక్షయ పుణ్య మొసంగు ధాత్రినిన్
నర సుర యక్ష కింపురుష నాగ విహంగమ భేద హీనమై
హరి చరణాబ్జ సంస్తవము నత్యధి కార్తి సభక్తి వెట్ట నే
కరువు సమస్త జీవులకుఁ గల్గఁగఁ జేయు ననంతసౌఖ్యముల్ 11.
[ఏకరువు = ఒక్కవల్లె]
స దయ త్రినేత్రుఁడు సంతస
మది చెలరేఁగఁగ నెడంద సాంబ శివుఁ డిలం
గదిసి మహాదేవుని యా
స్పదములు పాదములు గొలుచు వారలఁ బ్రోచున్ 10.
చెదరని నమ్మకమ్మునను శ్రీపతి నుంచి యెడంద నిత్యమున్
వదలక కొల్చు వారలకుఁ బ్రాప్త మగుం బర మంచితమ్ముగన్
సదమల మానసమ్మునను జాఁగి సమంచిత భక్తిఁ బాడుచుం
బదములు పాదముల్ గొలుచు వారికి శ్రీప్రదముల్ మనోజ్ఞముల్ 9.
కలరు మేక వన్నె పులులఁ బోలు నరులు
వారి బారి పడిన మూరు వెతలు
నేర కక్కట లయకారి యని తనదు
పతిని నమ్మి భామ భంగపడెను 8.
పతితం బయ్యెను ధర్మ మెల్ల కని యా పాశ్చాత్య భోగమ్ము భా
రతమం దక్కట యిట్టి వార్త లతిఘోరమ్ముల్ విచిత్రమ్ములే
సతినే నమ్మిన భర్త భంగపడి తా చావుం గనెన్ శీఘ్రమే
పతినే నమ్మిన భామ భంగపడె సర్వస్వమ్ము నర్పించియున్ 7.
అతులిత మత్సర గుణ సం
వృత మనమునఁ బల్కుచుంటివి సకల జన స
న్నుత రాజశేఖరుఁ డితడు
మతి చలియించిన ప్రభుండె మమ్మేల వలెన్ 6.
శతమన్య్వాభ నరోత్తముండు ఘన సంస్కారుం డజేయుండునున్
వితత జ్ఞానుఁడు నిర్వికార మతి గంభీరాజి సద్యశ్శిరో
నత రాజన్యుఁడు వీరుఁ డాతనికి నెన్నం డేల తర్కింపఁగా
మతి చాంచల్యము గల్గు, వాఁడె ప్రభువై మమ్మెల్లఁ బాలించుతన్ 5.
ఉత్తమ కవి బిరుదు నొందిన పండితుఁ
గాంచి సంతసమ్ము కదుర నెడఁదఁ
గవి వరు మెడ లోనఁ గవన గణన నియ
మమ్ముఁ దప్పుపట్టి మాల వేసె 4.
పమ్మిన శబ్ద లాఘవము పన్నుగ నచ్చఁగ నెల్ల వారికిం
బిమ్మటఁ దన్మనోహర కవిత్వపు టుద్ధతి నుబ్బు నా ని జో
రమ్మున, సత్కవీంద్రు నెద రంజిలి నట్టిది స్వీయ కీర్తి కా
మమ్మును దప్పుపట్టి, యొక మాలను వేసె సభాంతరమ్మునన్ 3.
వ్యర్థ కార్యము లవని ననర్థ దాయ
కములు సుమ్ము పనికి వచ్చు కర్జ మొకటి
లేక తనదు పురమ్మును, రిత్తగాను
గడప, దాటని పురుషుండె ఘటికుఁ డగును 2.
[కడప = కడచు నట్లు చేయుటకు]
కడప పట్టణ ముర్విలో నర కాంత సంచయ యుక్తమై
పుడమి వర్ధిలు చుండ నిత్యము పూర్ణ వీరవరేణ్యమై
యడరు చుండఁగ భాగ్యరాశు లనంత రీతి నవార్యమై
కడప దాటని పూరుషుం డగుఁ గాదె తా ఘటికుండుగా 1.
21, నవంబర్ 2025, శుక్రవారం
భీష్మ మాహాత్మ్యము.
|
|
భీష్మ మాహాత్మ్యము. |
|
|
ఉ. |
భీష్ముఁడు శాప జన్మ పరిపీడిత కౌరవ వంశ కీర్తి రో
చిష్మయ వర్ధనుండు సు వశీకృత పంచ నిజేంద్రియుండు చి
చ్ఛుష్మ పరాక్ర మోన్నత యశోధన మండిత వీర వర్యుఁడున్
భీష్మతమ ప్రతిజ్ఞుఁ డరి వీర భయంకరుఁ డెన్న ధాత్రినిన్
|
1.
|
|
|
|
|
|
మ. |
త్రిది వోత్తుంగ నదీ కుమార వరుఁడై దేవవ్రతాఖ్యుం డహో
యుదయించెం గురు వంశ రాజమున నిత్యోద్యోగియై నిల్చెనే
సదసద్భావ వివేకవంతుఁ డిలలోఁ జాపాగ్ర్య నైపుణ్యుఁడై
సుదతీ కారణ మాత్మ సద్గురువునే చోద్యంబుగా గెల్చెనే
|
2.
|
|
|
|
|
|
ఉ. |
తీర్పఁగఁ దండ్రి కోరికను దిట్టతనమ్మున వీడె రాజ్యమే
యేర్పడ దాశరాజునకు నింపుగ నమ్మక మాత్మలోఁ గటా
కూర్పరి బ్రహ్మచర్యమును గోరి వరించెను జీవితాంతమున్
మార్పఁడు నిర్ణయమ్మును సమంచిత రీతినిఁ గాచె రాజ్యమున్
|
3.
|
|
|
|
|
|
చం. |
నర వధ మాజిలోఁ బది దినమ్ములు సల్పెను భీష్ముఁ డుగ్రుఁడై
నరపతి ధర్మరా జడుగ నర్మిలిఁ దన్ను జయించు వైనమున్
దురమున నాశిఖండి నరు తోడుగ నిల్పుఁ డటంచు మర్మముం
గరుణ వహించి తెల్పి సహకార మొనర్చి త్యజించె బాణముల్
|
4.
|
|
|
|
|
|
శా. |
గాంగేయుండు శరోగ్రతల్పమున విక్రాంతుండు స్వచ్ఛంద రీ
త్యంగాంతం బొనరింప నైపుణుఁడు కృష్ణారాధనా వ్యగ్రుఁడై
యంగీకారము లైన నీతులను రాజౌచిత్య ధర్మమ్ములం
బొంగారన్ మది ధర్మసూనునకుఁ దా బోధించెఁ బుణ్యాత్ముఁడే
|
5.
|
1, నవంబర్ 2025, శనివారం
సమస్యాపూరణ_నవంబర్ 2025
మెత్తని పఱుపు ఱాయియై మేనుఁ గలఁచెఁ
గంటికిఁ గునుకు దూరమై కలఁత నొసఁగె
దారుణమ్ముగ విరహాగ్ని తప్త యైన
కలువకంటికిఁ గాటుక గరళమయ్యె 54.
పోటులు మాటిమాటికిని మూరుచు వచ్చుచు నుండఁ దోర మ
ప్పాటలగంధికిం గనులఁ బాఱుచు నుండ జలమ్ము ధారయై
పాటిలఁ గంటికిం గలఁక వారని బాధ నొసంగ నిత్యముం
గాటుక చూడఁగాఁ గలువ కంటికిఁ దీవ్ర విషంబె యౌనుగా 53.
మందు గొన్న రీతి మంచి జరుగు నెంచ
సంతసంబు తనరఁ జింత లేక
యనుదినమ్ము సుంత యంచితమ్ముగ మంచి
మదిరఁ గొన్న యెడల ముదిమి రాదు 52.
తాతల్ తండ్రులు త్రాగి మద్యమును సంతప్తాంగు లై రెల్లరున్
నీ తీరుం గన నీకుఁ దప్ప దని సందేహంబు నా కయ్యెడిన్
భ్రాతా చక్కఁగ నాలకింపుమ సుధన్ రాగంబుతో, వీడి ని
ష్ప్రీతిన్ నిత్యము మద్యముం, గొనినచో వృద్ధాప్యమే రాదు పో 51.
తగవులు పెక్కు చెలంగును
విగతం బగు నెడఁద శాంతి విజ్ఞుల కైనం
దగునే పలుకఁగ నిట్లున్
స్వగృహము లేనట్టి వాఁడె? భద్రతఁ గాంచున్ 50.
పగతుఱ కైన నిప్పగిది వాసము దైవ మొసంగకుండెడిం
దగదిది యెల్లవారలకు దైన్యము నూని వశింప శక్యమే
యగణిత వాసరమ్ము లకటా తల వంపులు గా సదా పర
స్వగృహము లేని వాఁడె కడు భద్రతఁ గాంచును జీవితమ్మునన్ 49.
కోపం బూనక తా సం
తాపములం దెద వగవక తనరుచు నుండం
దాపస వరేణ్యుని విగత
పాపిని మెత్తురు సుజనులు పావనుఁ డంచున్ 48.
తాప మొసంగుటం బ్రజకుఁ దా మది నేరక సుంత యేనియుం
జూపఱు లెల్ల వారికిని శుద్ధ మనస్కుని రీతిఁ గన్పడన్
రూపము మార్చి తా వసు పరుండయి కోట్లను గూడఁ బెట్టినం
బాపముఁ జేయువానిఁ గని పావనుఁ డంచు నుతింత్రు సజ్జనుల్ 47.
వే వ్యయ మొనర్ప వినికిడి
నవ్య గతిన్ దద్దఱిల్ల నరులకుఁ జెవులే
సవ్యాపసవ్యము లహో
శ్రావ్య! గళస్వనమునన్ ఖరమె మేటి గదా 46.
దివ్యముగాఁ దలంచి వసుదేవుఁడు గాడిద కప్డు మ్రొక్కి తా
భవ్య తరమ్ముగాఁ బొగడె వారక యేఁగుచుఁ గార్య సిద్ధికై
కావ్య చయాది పాఠములఁ గాంతుము వర్ణన లిట్టి భంగినిన్
శ్రావ్యగళస్వనమ్మున ఖరమ్మున కెయ్యది సాటి వచ్చురా 45.
అత్మీయత వర్ధిల్ల ని
జాత్మ సఖులపై సతమ్ము నత్యంతము జీ
వాత్మకు నిరంతరము వీ
తాత్మశ్లాఘమ్మె తెచ్చు నలఘు యశమ్మున్ 44.
ఆత్మజ్ఞానము ప్రజ్వరిల్లఁ బరమాత్మాంతస్స్థి తాత్మీయ జీ
వాత్మాలింగన కార్యముం దెలియ సత్యం బంచు నేపార న
ధ్యాత్మం బత్యధికమ్ముగా నెడఁద నిత్యమ్మున్ విసర్జింపఁగా
నాత్మశ్లాఘము, సాధు దూషణములన్ ఖ్యాతిం గడింపం దగున్ 43.
కోరి భజింపఁగ నీ గ్రహ
వారములను భక్తి తోడ వరుసల నెంచన్
వారము వార మొసఁగు కై
వారములో రెండుగ రవివారము లయ్యెన్ 42.
[ కైవారము = పొగడ్త; గ్రహ వారము = గ్రహముల సమూహము]
వారికి వీరి కెన్నఁడును భార మొసంగవు వీని కేల యీ
దారుణమైన పంపకము ధర్మమె యివ్విధి దుఃఖ మీయఁగం
దోరము కష్ట మయ్యె నిడు తొంటి విధమ్ముగ నిక్కమెంచ నీ
వారము లోన వచ్చె రవి వారము సూడఁగ రెండు మాఱులున్ 41.
[రవి వారము = రవి యొక్క తడవ]
దర్ప మడరంగ దోర్బల దానవుండు
కొండ నెత్తంగ యత్నించి కూల నేల
వేగ సదయ రక్షించెను వేడ భక్తి
వక్త్రముల్ పది గల్గినవాఁడు శివుఁడు 40.
రుక్త్రైలోక భవాళి నాశకర నిర్మోహుండు ఫాలాక్షుఁడే
దిక్త్రాణార్థము విష్ణువే తనరఁ బ్రాక్దిఙ్నాథుఁ డయ్యెం దద
న్వక్త్రాతృప్రవరుండు పద్మజుఁడు వింతం గాంచ నర్ధమ్ములై
వక్త్రంబుల్ పది గల్గు సాంబశివునిం బ్రార్థింతు సద్భక్తితో 39.
అంతఃకరణం బుండ ని
రంతర మతి శుద్ధిగ నెద నర్చించినచో
సంతత కరుణా రక్షిత
కుంతీసుత గణపతి మన కోర్కెల్ దీర్చున్ 38.
[రక్షిత కుంతీసుతుఁడు = రక్షింపఁబడిన భీముఁడు గలవాఁడు]
సంతోషమ్ము లభించు డెందము వెసన్ శాంతించుఁ బ్రాప్తించు దుః
ఖాంతం బింపుగ సత్వరమ్ము కలుగుం దోడ్తోడ బాంధవ్య మ
త్యంతావేశము వీడు మింక జన పూజ్యం బౌను నీ జన్మమే
కుంతీపుత్ర! వినాయకుం గొలిచినం గోర్కెల్ ఫలించుం గదా 37.
[కుంతీపుత్రుఁడు = తల్లిదండ్రులను నేరని వాఁడు]
పంతము నూని ధనమ్ము న
నంతము నొడ్డి వికటింప నక్కట స్వీయ
స్వాంతము జూదం బాడితి
నింతలు గను లున్ననుఁ దెరువే కన నైతిన్ 36.
కంతుని బారిఁ బడ్డ నరకాంతుల చిత్తము లార్తి నందవే
యింతినిఁ జెంతఁ గన్న మది నెంతయొ రక్తి జనింప వింత నే
సుంతయుఁ దాళకుంటి వెస సొంతము సేసికొనంగ నక్కటా
యింతలు గన్ను లుండఁ దెరువే కన నైతి నిదేమి చోద్యమో 35.
తనదు భాగ్యముఁ దలపోసి తమ్మికంటి
సంతతము సతీ రక్తుఁడై సుంత కాక
కామ తప్తుండు నన్య కాంతా మణులకు
విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె 34.
రమణీరత్నము గా సుధా వితరణార్థం బప్డు విష్ణుండు భా
మ మనోహారినిఁ గాంచు కోర్కి సెలగం బంతంబుతోఁ జూచినన్
రమనీయం బగు విష్ణుమాయ మదిఁ దెల్లం బైన వే మోహినీ
విముఖుండై పతి వీడి పోయె ననుచున్బ్రీతిన్గనెన్ సాధ్వియే. 33.
మనమున జనింప ఘన సంభ్రమమ్ము తనకుఁ
గనుల కింపు నొసంగఁగ ఘనతరముగ
నప్పురమున జరుగు నంచుఁ జెప్పి నంతఁ
దన సతి వివాహమున్ జూడఁ దాను నేఁగె 32.
అనుజుఁడు కన్యకా మణిని నారసి చారు లతాంగి నొక్కెడన్
మనసిజ పద్మ బాణ చయ మర్దన తప్తుఁడునై వరింపఁగా
ననయము వెంట నుండు నలినాక్షి సరోజ నిభాస్య తోడు రాఁ
దన సతి పెండ్లి చూచుటకుఁ దానుఁ జనెన్ హితబంధుకోటితో 31.
చేర లంకా నగర మతి శీఘ్రముగను
రావణ వధార్థము భయంకర స్వనముల
వానర సమస్త సైన్యము వంతెన పయి
రామునాజ్ఞ వాలియె సముద్రమును దాఁటె. 30.
[వాలు = అతిశయించు]
ధీమంతుం డెద నిశ్చయించి గత సందేహుండు వైదేహినిన్
భామం గాంచఁగఁ దన్మహేంద్ర గిరిపై వాతాత్మజుం డుద్ధతిన్
భీమాకారము నొంది పాద యుగముం బీడించుచున్ ముందుకున్,
రామోక్తిన్దలఁ దాల్చి, వాలియె సముద్రంబున్దరించెన్గదా. 29.
[వాలు = వంగు]
రావణ వధార్థము భయంకర స్వనముల
వానర సమస్త సైన్యము వంతెన పయి
రామునాజ్ఞ వాలియె సముద్రమును దాఁటె. 30.
[వాలు = అతిశయించు]
ధీమంతుం డెద నిశ్చయించి గత సందేహుండు వైదేహినిన్
భామం గాంచఁగఁ దన్మహేంద్ర గిరిపై వాతాత్మజుం డుద్ధతిన్
భీమాకారము నొంది పాద యుగముం బీడించుచున్ ముందుకున్,
రామోక్తిన్దలఁ దాల్చి, వాలియె సముద్రంబున్దరించెన్గదా. 29.
[వాలు = వంగు]
లోకైక విచారం బిది
వీఁక నిజోగ్రత్వ మందు విస్తార మిలం
గాకుండుటకై దండిత
పాకిస్తాన్ మంచి దనుచుఁ బలికెన్ మోడీ 28.
ఏకాకిత్వము చేష్టలం దుడిగి నప్డే యుగ్ర వాదమ్ము దా
నే కాలమ్మున సమ్మతం బవనిఁ గాదేన్ మానవత్వం బటన్
సాకారం బయి నిల్వ సంతతము హింసానందమున్ వీడినం
బాకిస్తాన్ మన మిత్రదేశ మనుచున్ వాక్రుచ్చె మోడీ సభన్. 27.
అప్పు సేసినఁ గ్రమముగ నొప్పుఁ దీర్ప
నప్పు డప్పుడు ముప్పిసుమంత లేదు
గొప్పలకు నేఁగక యడుగ నప్పు నొప్పు
రాష్ట్రమునకుఁ గావలె నప్పు ప్రగతిఁ గనఁగ 26.
ఆష్ట్రాధ్వమ్మును నంట సంపదలు నిత్యానంద మేపార సౌ
రాష్ట్రాంధ్రాది సమస్త రాష్ట్రములు భద్రైశ్వర్యసంపన్నతన్
రాష్ట్రాన్యాధిక వృద్ధిఁ గాంచి ధరలో రంజిల్లి వర్తింపఁగా
రాష్ట్రాభ్యున్నతి కప్పులే శరణమై రాజిల్లె సౌభాగ్యముల్ 25.
[అప్పు = నీళ్లు]
మోద మంద నెల్ల భూలోక వాసులు
సంజనింపఁ బ్రేమ సద్య మంత
సుంద రాంగుని మృదు సుమ నిచయ శిరస్స్త
బకునిఁ బెండ్లియాడెఁ బడఁతి యొకతె 24.
ప్రకటము గాఁగఁ దారకుని ప్రాణ వినాశము నిశ్చయమ్ముగా
సకల జనమ్ము లివ్వసుధ సంతస మందఁగ మిక్కుటమ్ముగన్
వికల మనస్వినీ నగజ భీకరపుం దప మాచరించి త్ర్యం
బకుని వివాహ మాడె నొక భామిని ముప్పిరిగొన్న ప్రేమతో 23.
పరికింప నంద ఱొక్కటె
తరతమ భేదమ్ము లేల ధరలో విను మో
నరుఁడా మానవులం దం
తరువులఁ బెంచుటయె పెద్ద తప్పగును జుమా 22.
నర లోకమ్మున కెన్న హానికరముల్ నాశమ్ము గావించు భీ
కర మత్యంతము వాని ప్రాభవము నిక్కం బెంచ గాలించుచున్
ధరలో నింపుగ మత్తొసంగునవి నిర్దాక్షిణ్య ముద్వేగివై
తరువుల్ పెంచుట తప్పు పట్టుదలతో ధ్వంసంబు గావింపుమా 21.
కడు దుర్భర మౌను బ్రతుకు
మడిసినఁ దలిదండ్రు లకట మగ దిక్కునకై
పడతి స్వయమ్ముగఁ దొందర
పడుచున్నను బెండ్లి సేయువారలు లేరే 20.
తడ వే లివ్విధి నుద్యమింపుఁ డిఁకఁ నుత్సాహమ్మునం జక్కఁగాఁ
బుడమిం గాంచిన యెట్టి సుందరులకై పొంగండు నెవ్వారి నొ
ల్లఁడు వీక్షింపగ నిట్టు లిప్పు డనుకూలంబైన లావణ్యపుం
బడుచున్నం దగఁ బెండ్లి సేయుటకు నెవ్వారైన లే రెందుకో 19.
నైపుణ్యం బధిక మళికి
నాపద యెబ్భంగిఁ గల్గు నావంతైనం
దాపము దాఁకని యట్టుల
దీప శిఖాగ్రమునఁ దేఁటి స్థిరముగ నిలిచెన్ 18.
దాపుల సంచరించుచు రొదల్ కడుఁ జేయుచు గెంతు చుండి సం
తాప మొకింత లేకయె ముదమ్మున రమ్య వనాంతరమ్ములో
నేపుగఁ బెర్గి నట్టి విరు లింపగఁ బూసిన మొక్క గన్పడన్
దీప శిఖాగ్ర భాగమునఁ దేఁటి స్థిరంబుగ నిల్చెఁ జూడుమా 17.
[దీపము = మయూరశిఖి యను మొక్క]
సర్వధారి చనిన యంత నుర్వి లోన
నశుభములు దొలంగు నరయ నక్కజముగ
గ్రహముల గమనమ్మును గాంచ రాహువు తగు
మే లొనర్చెడి వాఁడె సుమీ విరోధి 16.
[విరోధి (న్) = విరోధి నామ సంవత్సరములో]
కాలుని భంగి శాత్రవ నికాయము మార్కొని చంపుచుండఁగాఁ
జాలక హింస నోర్వఁగను సంకట ముక్తికిఁ బ్రాణ రక్షకై
యాలము నందు నెట్టి గతి నైనను నింతయు శత్రు సేనకున్
మే లొనరించు వ్యక్తియె సుమీ జగ మందునఁ జూడ శత్రువౌ 15.
పిలువ విం దొసంగ నలరి వచ్చిన వార
లీ పురుష వరేణ్యు లెంచి చూడఁ
బంక్తి లోన నున్న వార లొక్క విధము
చిన్న యెవ్వఁ డిందు మిన్న యెవఁడు 14.
జన్నము పూర్తి కా నలరి శత్రు విహీనుఁడు గాంచి ధర్మ సం
పన్నునిఁ దాత శాంతనవుఁ బన్నుగ ధర్మజుఁ డడ్గె నిట్టులన్
మిన్నగ నశ్వమేధ మెలమిం బరిపూరిత మగ్ర పూజకై
చిన్న యెవండొ మిన్నగనుఁ జేకొన నర్హుఁ డెవండొ చెప్పుమా 13.
కిట్కనఁగ రాదు కిటు కను
గుట్కలు నట్కులు తగు నన గుటకలు నటుకుల్
గుట్కా పరదేశ పదము
గుట్కా సేవించువాఁడె గురువై నెగడెన్ 12.
చిట్కా లున్నవి పోవఁగా వ్యసనముల్ శీఘ్రంబ మేల్గూర్పఁగా
మట్కా యన్నది యాట నూతనము వే మానంగ మేల్మేదినిన్
గుట్కా శబ్దము సుప్రసిద్ధ మగు నొక్కో యన్య దేశ్యంబునై
గుట్కా సేవన మాచరించెడి గురున్ గుర్తించి కీర్తించిరే ? 11.
ఆర్యా కల్లలు వలుకుట
కార్యము కా దేరికైనఁ గవివర చెపు మే
చర్యల శంకరు లను నా
చార్యులచే హైందవమ్ము సర్వమ్ము చెడెన్ 10.
ధైర్యము నూని యేకతను దాఁ ప్రవచించెను ద్వైత భావమే
వార్యము నాఁగ శంకరుఁడు పల్కెను హైందవ మన్న శబ్దమే
యార్యుల దృష్టి సంస్కృతము నందు నదృశ్యము సుండి శంకరా
చార్యుల చేత హైందవము సర్వ విధంబుల భ్రష్టమై చెడెన్ 9.
రాజ్య మీ నని భీష్మించి రాజరాజు
బంధు మిత్ర పుత్ర యుతమ్ము భారతమున
యుద్ధమున వీర మరణమ్ము నొంద నంతఁ
బాపచిత్తుఁడు చేరెను స్వర్గమునకు 8.
పాపం బైనను బుణ్య మైనను నరవ్రాతమ్ము పొందున్ ఫలం
బేపారంగ సునిశ్చయమ్ముగను శంకింపంగ రా దిందుఁ దా
నే పుణ్యం బిసు మంత సేసెనొ కదా యింపార భోగింపఁగాఁ
బాపాత్ముం డగు మానవుండు గనఁగా స్వర్గంబుఁ జేరెన్గటా 7.
పరమాద్భుత రీతిని నా
సరసపుఁ బద్యమ్ము నందు శబ్దములం దా
వరుసలు మార్చి చదివినన్
విరసమె పద్యమున నొలుక వేడుకఁ గూర్చెన్ 6.
నరవర యేమి చెప్పుదు వినంగ వలెన్ వచియింప శక్యమే
సురుచిర శబ్ద సంచయ సు శోభిత భంగినిఁ గావ్య లోక మం
దు రుచిరమై వెలుంగఁగ మనోహర రీతి రచింపఁ గావ్యమున్
సరసకుఁ జేరి కోమలికి సత్కవి తా నధరామృతమ్ము ద్రా
వి రసమె పద్యమం దొలుక విజ్ఞుల కొప్పెను బ్రీతిపాత్రమై 5.
సర్దు లెఱుంగక మనము క
పర్ది కృప వహింప నాటపాటల నలరన్
మార్దవముగ నిఁకఁ దొలఁగెను
దుర్దిన మని బాలు రెల్లఁ దోషముఁ గనిరే 4.
[సర్దు = సరుదు, ఎల్ల]
అర్దుగ సంభవింతు రిల నంచిత జన్ములు సాధు సజ్జనౌ
ఘార్దిత భాసి తాననుఁడు నౌ మన కృష్ణుని మేనమామకున్
దుర్దమ నిత్య సంకటద దుర్భర బాలక హింసకారికిన్
దుర్దిన మంచు బాలకులె తోరఁపుఁ దోషము నంది రత్తఱిన్ 3.
చేయరా దెగతాళి కొంచె మయిన నిను
భస్మ మొనరించుఁ గోపము వడసె నేని
యెవ్వ రనుకొంటి వీ యోగి నెడఁద నీవు
నిప్పులం బూల వలెఁ జేత నిలిపినాఁడ 2.
[నిలిపిన వాడు+అ = నిలిపినాడ; నిలిపి నట్టి వాఁడె ]
ఒప్పుగ నేఁ దపో మహిమ నుర్వినిఁ జేసితి వింత లెన్నియో
త్రిప్పితి భూమి చక్రమును దీవ్ర రయమ్మున నీటి కుప్పలో
నప్పుల నొక్క గ్రుక్క వెస నానితిఁ గొండలఁ బిండి సేసితిన్
నిప్పులఁ జేతఁ బట్టితిని నేర్పున మల్లెలు బంతి పూలుగన్ 1.
29, అక్టోబర్ 2025, బుధవారం
డా. పోచిరాజు శేషగిరి రావు కవి వరేణ్య సంస్తవ దశకము
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)