భాసురముగ ఘోరాటవిఁ
బూసిన పూవుల విధమ్ము పూర్ణము విద్యా
భ్యాసము లేని జగమ్మున
వ్రాసిన సత్కవిత శృంగ భంగమ్మె యగున్ 53.
కాసులు పెక్కు లున్న వని గర్వము నూని వచింప నొప్పునే
బాస నెఱింగి క్షుణ్ణముగఁ బల్కిన దోస మొకింత యుండునే
వాసికి నెక్క లోకమునఁ బాండితి లేక సభాంతరమ్మునన్
వ్రాసెద సత్కవిత్వ మను వానికిఁ దప్పదు శృంగ భంగమే 52.
విపరీతమ్ములు కల్గును
గృపా విహీను లొనరింపఁ బృథ్విని నకటా
జపమును దుశ్చింతులకుం
దపమును దానమునుఁ జేయఁ దప్పగును సుమా 51.
జపములు సల్పఁగాఁ దగును సన్మతి నూని జనావనార్థమై
తపములు నింక దానములు తప్పక యొప్పు జగద్ధితార్థమై
విపుల జగద్వినాశమును వేఁడి, యపాత్రునిఁ బిల్చి, యెన్నడుం
దప మొనరింపఁగా వలదు, దానము సేయుట, దోషమే సుమా 50.
గోముగ లాలించు సతము
భామామణి సోదరి దశ వక్త్రుఁడు వెసఁ దా
నేమఱక శూర్పనఖ యా
రామ వివాహముఁ గనంగ రావణుఁ డేఁగెన్ 49.
[రామ వివాహము = రామ యొక్క వివాహము, రామ= రమించు స్త్రీ]
పాతివ్రత్యము నందు మిన్న సుమ విశ్వంబందు నిక్కమ్ముగా
భీతిల్లుం గడు భర్త యన్న మదిలో భేదిల్ల దెన్నండనున్
మాతా చూచెద నంటివే చన వహో మందోదరీ నా ననెన్
సీతారాముల పెండ్లిఁ జూడఁ, జనుదెంచెన్ రావణుం డొయ్యనన్ 48.
[చూడను+చనుదెంచెన్ = చూడఁ జనుదెంచెన్]
ధరలో నెల్ల రెఱింగన
పరమార్థం బిది మదిఁ గలవరపడ నేలా
తరుణీ వాడక యున్నం
గరిగిన నెయిఁ గాఁచి నంత గడ్డలు గట్టున్ 47.
పెరుఁగును బోయఁగాఁ దగును బిఱ్ఱుగ గడ్డలు కట్ట నింపుగాఁ
బరులను బిల్వఁ గుడ్పునకు వడ్డన వేళల లోనఁ బూర్తిగాఁ
గరఁగిన నేయి వోసిన సుఖమ్ముగ నుండును సుంత మాత్రమే
కరిగిన నేయి నిప్పు పయిఁ గాఁచిన గడ్డలు గట్టు నద్దిరా 46.
[కట్టు = రెండవ యర్థము నిరోధించు]
తనుతర మధ్యలు వికసిత
వనజాక్షులు సంతసమున వలచిన వారిన్
ఘనముగ స్మరించి మనముల
హనుమంతునిఁ బెండ్లియాడి రార్గురు కాంతల్ 45.
అనుమఁడు బ్రహ్మచారి యని యక్కట శంక వహింప నొప్పునే
జనకజ నింక రాఘవునిఁ జక్కఁగఁ గూర్ప నతండు గాంచమే
మనువుల నొల్లకుండినఁ గుమార్తెలు తండ్రి తపించి మ్రొక్కఁగా
హనుమనుఁ గాంచి మర్లుగొని యార్గురు కాంతలు పెండ్లియాడిరే 44.
ద్విపద.
త్రాణమై మాకు నిత్యము కాచుచుండ,
వీణాధరీ, దుర్గ విభవమ్ము లిమ్ము 43.
నిరతం బింపుగ నీకు మ్రొక్కెద మిలన్ నీరేజ పత్రేక్షణా
కరుణా దృక్కుల మమ్ము గావుమ సతీ కాత్యాయనీ బిడ్డలన్
హర మాయా మహి మాదిశక్తి సిత దుగ్దాంభోధి సంజాతవై
వరవీణా మృదు పాణివై వరలు శర్వాణీ సిరుల్ గూర్పుమా 42.
కుములరు దుఃఖమ్ముల భో
గములం జిక్క రిల నిర్వికారులు మునులే
మమత లెఱుంగమి నేరమి
బ్రమయుట సహజమ్మె యగును భవ విముఖులకున్ 41.
మమతల నూతిఁ జిక్కుటకు మానవ సంచయ ఘోర దుఃఖ పుం
జములకు సంత తాగణిత జన్మ పరంపర కార కాఖి లా
ఘములకు నెల్ల నక్కట జగమ్మున నాఁడుది కారణమ్ము నా
బ్రమయుట సాజమౌ భవ పరాఙ్ముఖ చిత్తుల కెల్ల వేళలన్ 40.
దామోదరు ప్రోద్బలమున
భీమమ్ముగఁ జెలఁగి చంప వెస నాటల యం
దేమఱక ప్రలంబుని బల
రాముని వక్షమున నెసఁగె రక్తపు ముద్రల్ 39.
భూమిపుఁ డైన నేమి తన ముద్దుల కొడ్కున కీఁడె ముద్దులన్
సీమను గాంచ లేము పరిశీలన సేయఁగఁ గన్న ప్రేమకుం
బ్రేమ సెలంగఁ దండ్రి మురిపెమ్ముగ నిల్పఁ గుమారు శైశవున్
రాముని, వక్షమం దెసఁగె రక్త పదద్వయ ముద్ర లద్దిరా 38.
[రక్తపదద్వయము = ఎఱ్ఱని పాదయుగము]
తగిన పని యంచుఁ బురుషుల్
మగనిన్ శ్లాఘింతురు గద మగువం గొట్టం
దగిన పని యంచు మగువల్
మగువన్ శ్లాఘింతురు గద మగనిం గొట్టన్ 37.
సమ దానేకపరాజ యాన సరసస్వాంతమ్ము జృంభింపఁగా
రమణీయం బగుఁ దిన్న విన్నను మహా రాత్రమ్మునన్ భర్తకుం
గమనీయం బగు సన్నివేశ మది శృంగారప్రమోదమ్మునం
బ్రమదారత్నము శ్లాఘనీయ యగు భర్తం గొట్టి నిందించినన్ 36.
పతికి నెదురు వల్క భరత ఖండమ్మునఁ
బడతి కెంచ గౌరవమ్ము కాదు
రాచ బిడ్డ వైన రమణీమణీ నీదు
ధవునిఁ జేరి నంత దర్ప ముడుగు 35.
ధవ దానమ్ము వ్రతమ్ము లోనఁ గడు చిత్రం బౌను వీక్షింప సుం
త విచారింపుమ లేనిచో ధనము సంతాపమ్ము వాటిల్లు నీ
సవతుల్ చెంతను, దేవమౌనివర దాస్యం బౌర ఘోరమ్ము మా
ధవునిం జేరిన యంత, లుప్త మగు నీ దర్పంబు చంద్రాననా 34.
గోప కాంతలు చెంగటఁ గొలిచి యుండ
వారి కీయఁ బ్రీతిని బలభద్రుఁ డడరి
రమ్మనిన రాక యున్న వర నది యమున
రామునకుఁ గల్గె ఘోర పరాభవమ్ము 33.
ఆ ముని పుంగవుం డకట యాత్మ నెఱుంగక రామచంద్రునే
యేమఱి పిల్చెఁ గయ్యమున కెంచక వైరి బలమ్ము స్వీయమున్
రాముఁడు విష్ణు చాపముఁ గరమ్మునఁ గైకొన నక్కజమ్ముగా
రామునకున్ఘటిల్లెను బరాభవ మాహవ మందు ఘోరమై 32.
సీత త్రేతా యుగమ్మున ఖ్యాతి నంద
ద్రౌపది వడసె యశమును ద్వాపరమున
యాజ్ఞసేని పాతివ్రత్య మందుఁ గాంచ
ద్రౌపది యన జానకికి సోదరియె కాదె 31.
నాథులతోఁ జరించిరి వనమ్ముల నిర్వురు గాంచఁ బూర్వ త
ద్గాథల నగ్నిగుండమునఁ గారణ జన్మము నందెఁ గృష్ణయే
మైథిలి యగ్నిగర్భ కిల మానిని వుట్టిన దక్కజమ్ముగా
మైథిలి చెల్లి కృష్ణ యని మాన్య వరేణ్యులు చెప్పి రెప్పుడో 30.
దేహికి నిహ లోకమ్మున
నైహిక సుఖ తతులఁ దేల కనునిత్యంబున్
మోహము, నిత్యం బంచును
దేహము, వీడినఁ గలుఁగుఁ బదింబది సుఖముల్ 29.
బాహుల నెత్తి మోదుకొని భార్యను దిట్టుచు మిక్కుటమ్ముగా
ద్రోహము సేసె నాకు నని దుఃఖము నంది కరమ్ము నుండకే
గేహిని పైన నిత్యమును గించి దవశ్య మెడంద వ్యర్థ సం
దేహము వీడి నప్పుడె పదింబదిగా సుఖ మబ్బు డబ్బుతో 28.
తాళ వృంత మేల తగ దంచుఁ జక్కఁగ
నొంటి కొసఁగ సుఖము నింటి లోన
వేగ వేసి నంత విద్యుద్వ్యజనమును
గాలి వీచెఁ గొమ్మ గదల దయ్యె 27.
[కొమ్మ = వనిత]
తూలిరి వింత శబ్దములు తోరము విన్పడ లోకు లెల్లఁ బా
పా లొనరింప మానవులు వారక నిత్యము దేవ సంఘ శా
పాలు సెలంగ పట్టణ నివాసులు వొంద భయమ్ము వింతగా
గాలులు వీచెఁ దీవ్రముగఁ గాని కదల్పవు వృక్ష శాఖలన్ 26.
[గాలులు = పిశాచములు]
కపటం బనంగ నేరని
విపరీత పరోపకార విలసిత మతియే
యుపలబ్ధము గాఁగ భృశము
తప మెందుకు దాన మేలఁ దగ సుజనులకున్ 25.
కపటము నూని డెందమునఁ గంజ దళాక్షున కెన్నఁ డేనియుం
గుపితుఁడు గాక వే తనదు కోరిక తీర్చుట కర్థి కీయఁగా
నుపమమె యెన్న లంచమున కుర్విని విశ్వ వినాశనార్థమై
తప మొనరింప రాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్ 24.
నీతి నెంచినఁ జంపు టెట్లగు నీతి లోకము నందుఁ దా
నాతతమ్ము తపించి లోపల నన్న లందఱి జంకకే
యాతఱిన్ జనకాజ్ఞఁ జంపెనె యౌర భార్గవ రాముఁడే
భ్రాతృహంతకుఁ డైన రాముఁడు భ్రాతృవత్సలుఁడే కదా 23.
ఒల్లక యే పని పాటలఁ
గల్లరి సంతతము గోరుఁ గలిమి కొఱకు, నీ
ర్పల్లమునకుఁ బాఱు పగిది,
నిల్లరికము నందుఁ గలుఁగు నెన్నొ సుఖంబుల్ 22.
తల్లడిలంగ నేల పరితాపము సెందఁగ నేల నిక్కమై
చెల్లును నాదు మాట విను జిక్కులు గల్గవు నమ్ము మిత్రమా
యుల్లము నందు మాన మది యుండక సుంత చరించు వాండ్ర కీ
యిల్లరికంబు నందుఁ గల దెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్ 21.
ఇలలో భక్త సమాజము
సలలిత రీతి నొనరింప సంతోషముతోఁ
గులుకుచు నుమామహేశుల
తలిదండ్రుల పెండ్లిఁ గనఁగఁ దరలిరి పుత్రుల్ 20.
మెచ్చఁగ నెల్ల బంధువులు మిత్రులు నందఱు మిక్కటమ్ముగా
నచ్చపు వృద్ధ దంపతుల కత్యధికమ్ముగఁ బ్రీతి నీయఁగా
వచ్చెను షష్టిపూర్తి కడు వైభవ మొప్పఁగఁ జేయ నెంచుచున్
వచ్చిరి తల్లిదండ్రుల వివాహముఁ జూడఁగఁ బుత్రు లెల్లరున్ 19.
వెలుఁగ వలె నఖండమ్ముగ నిలయ మందు
దీప పంక్తులు నిత్యమ్ము భూప వర్య
తెమ్ము శీఘ్రమ్ము శుద్ధ తైలమ్ము, వలదు
నీరు, చాలక దీపమ్ము లాఱిపోయె 18.
తోరము దుఃఖ దాయకము తూర్ణము తే వలె నింక నూనెనే
సార విచారమే కలుగ సజ్జన పంక్తికి మందిరమ్ములో
నారయ దివ్య పాదపచ యాభము లక్కట తైల రాశి నా
నీరము లేక దీపములు నిల్చి వెలుంగక యాఱెఁ జూడుమా 17.
మున్ను గుర్తింపఁ బడకున్న నెన్నఁ డేని
సత్య మెఱిఁగి నట్టి జన సంచయము చేతఁ
గల్ల లెఱుఁగ నట్టి పరోపకారి కపట
హీనుఁడే లోకమున గౌరవింపఁబడును 16.
కానఁగ రాదు గౌరవము కార్య దురంధర ధైర్యశాలికిం
గానఁగ రాదు గౌరవము కైతవ హీన మనోధినేతకున్
మానవ లోక మందు ధన మర్మము నేరిన మాటకారియౌ
హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవ మందుచుండెడిన్ 15.
యింటి పేరు కస్తూరి వారింట నున్న
వకట గబ్బిలములు గాంచ నక్కజముగ
లేవు వాగ్వక్త్ర శుద్ధులు లేశములును
బండబూతులఁ బలికెను పండితుండు 14.
కలఁగము వల్కఁ బామరుఁడు కైతల నీ విధి నచ్చ టచ్చటం
గలఁగక వాణి సైచు నెదఁ గాక సమస్యను గాంచ దోషమే
యొలికెను వింతగా ద్రతమె యున్న నహో పరుషమ్ము నిల్పెనే
పలికెను బండబూతులను పండితుఁ డౌర సభాంతరమ్మునన్ 13.
నమ్మకమ్ము నూని యిమ్ముగ ధరియింత్రు
భరత ఖండ మందు భక్తు లెల్ల
హరి హర వర భక్తు లందఱి పుండ్రాల
బూది లోనె గలదు భూతి యెల్ల 12.
వాదన లొనరింప నిందుఁ బాడి కాదు వింటివే
మోద మూని నుదుటిపై విబూది బొట్టు నుంతురే
రాదు వట్టి బూది యంచు వ్రాయ దీని శైవు మై
బూది లోనె కలదు సుమ్ము భూతి యెల్ల మిత్రమా 11.
దరినిఁ జేరి నంత దర్పం బడరఁగ మ
కరము కనఁబడె వెస ఘన మృగమ్ము
హరి మృగేంద్రు సకల కరి రాణ్నిచయ భయం
కరినిఁ గని మకరము గడు వడంకె 10.
కరివర ఘోర నక్రముల కయ్యము నందు జయింప లేక యా
కరి హరి నంతఁ దన్ను దగఁ గావఁగ రమ్మని వేఁడ వచ్చినన్
హరి శిత చక్ర హస్తు సుజ నావను రక్షిత తప్త దేహ వ
త్కరినిఁ గనంగనే మిగులఁ గాతరభావము నందె నక్రమే 9.
లేమల నెదిరింపన్ సు
త్రామునకును లేదు శక్తి రవ్యుదయమునే
తా మాన్ప సతీ సుమతిన్
భామను దూషించిరి శశి భాస్కరు లలుకన్ 8.
ధీమతి! చందురుండు చనుదెంచ నొకింతయె జాగు సేయఁగా
భీమ తరమ్ము వెల్గు నిడి పృథ్వికి సూర్యుఁడు విశ్రమింపఁగా
భూమిని నెల్లఁ గప్పఁ దన పోడిమిఁ జాటఁగ నా నభో రజో
భామను దిట్టినారు శశి భాస్కరు లిద్దఱు క్రోధ చిత్తులై 7.
సత్తెం బెన్నిన నింటికి
నత్తయుఁ గోడండ్రు నెట్టు లమరుదు రయ్యా
యెత్తఱి నేని జడమునకు
నత్తయు నొక యింటి కోడ లనఁగఁ దగదు పో 6.
అత్తకు మున్ను పెం డ్లయిన నప్పుడు నిక్కము నెంచ మిత్రమా
యత్త యొకింటి కోడ లని యందఱు వల్కుట యొప్పుఁ జక్కఁగా
నెత్తఱిఁ బెండ్లి కాని యెడ నిద్దర నప్పుడు వాలుఁగంటి మే
నత్త యొకింటి కోడ లని యందఱు వల్కుట యొప్పునా భువిన్ 5.
దైవోపహతుం డైన మ
హా వీరుఁడు రామ చంద్రుఁ డగ్రజుఁ డనుపం
ద్రోవఁ గబంధుని, వెదకుచు
రావణు, లక్ష్మణుఁ డడఁచె నరణ్యము నందున్ 4.
ఆవిరి కాఁగఁ గోరికలె యాసురి పంపఁగఁ జుప్పనాతియే
చావును గోరి రా జనుల స్థానమునం దసు రాధముల్ పగం
జేవ వధించి రాఘవుఁడు చిత్రముగాఁ బదునాల్గు వేవురన్
రావణు గెల్చె, లక్ష్మణుఁ డరణ్యమునన్ ఖరదూషణుల్ గనన్ 3.
నమ్ము వారున్న వచియింత్రు నెమ్మి నెన్నొ
మున్ను జరగనివి జరగె నన్న విధము
పుక్కిటి పురాణములు నమ్మఁ బోకు దీని
హరుని లెక్క సేయఁడు సిరియాళుఁ డెపుడు 2.
హరుఁ డరుదెంచి యన్నమును యాచన సేయుట కల్ల సుమ్ము నా
రి ఋషి కుమారు మాంసము వరించుట కల్లల కెల్లఁ గల్లయౌ
నరులకు నమ్మకమ్ములు ఘనమ్మన వచ్చును గాంచ నీ కథన్
హరునిఁ దృణీకరించె సిరియాళుఁడు పుత్రునిఁ జంప నొప్పఁడే 1.
[తృణీకరించె = చిన్నఁబుచ్చె; ఒప్పఁడే = ఒప్పును]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి