20, మార్చి 2026, శుక్రవారం

భారత దేశ ప్రాశస్త్యము.

 

 

భారత దేశ ప్రాశస్త్యము.

ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు.

 

 

 

 

సీ.

సత్య ధ ర్మాహింస శాం తాకరము మహా భారత గణతంత్ర భవ్య భూమి
సర్వ వీరావృత శక్తి పీఠము మహా భారత గణతంత్ర భవ్య భూమి
యర్ణ వాగమ వలయ విరాజితము మహా భారత గణతంత్ర భవ్య భూమి
వన నదీ వర సస్య భాసి తావని మహా భారత గణతంత్ర భవ్య భూమి

 

ఆ.వె.

పౌర ధన విలసిత వసుధైక వలయమ్ము
హలిక కార్మిక గణ నిలయ వరము
భూత లామర పురి పుణ్య తమము మహా
భారత గణ తంత్ర భవ్య భూమి

1.      

 

 

 

సీ.

నానా మతాన్విత నానా విధ నిజ భాషా జన సంవృత బాజనమ్ము
నానా కులాచార నానా విలాస విహార భూషా వేష పౌర వృతము
నానా కళాభిజ్ఞ నానా విశేష విద్యా విశారద గణ ధామ వరము
నానా ముని విరాజమాన సనాతన ధర్మ సంవర్ధిత కర్మ భూమి  

 

ఆ.వె.

యిహ పర ఫల చింత నైక పుణ్యావని
యేకతా మత రత నాక నిభము
మనుజ సామరస్య మాననీయము మహా
భారత గణ తంత్ర భవ్య భూమి

2.     

 

 

 

సీ.

నిష్పక్షపాత మనీషిత వైఖరీ రాజ్యతం త్రైక విరాజితమ్ము
దేశ విదే శోపదేశ సామర్థ్య మంత్రాంగ విద్వజ్జన సంగమమ్ము
నిజ దేశ రక్షా వినిశ్చయ నిర్వక్ర విక్రమ పాటవ విలసితమ్ము
నిత్యాభివృద్ధి నిరత్య యాలోచనా సంసక్త కార్య సంచయ విధిజ్ఞ          

 

ఆ.వె.

గగన తల విహార గరిమ ప్రసిద్ధమ్ము
విశ్వ వర్త కాభివృద్ధి సక్త  
యార్థి కాభి వృద్ధి నలరు చున్నది మహా          
భారత గణ తంత్ర భవ్య భూమి

3.     

 

 

 

సీ.

శత శతార్ధాధిక శతకోటి జనసాంద్ర సంభృత సంసార సాగరమ్ము
షట్త్రింశ దఖిల విశాల భారత భాగ కలిత సమాహార విలసితమ్ము
ద్వావింశతిప్రశస్థ తమ భాషాయుత భాషా సహస్ర ప్రభా విరాజి  
ద్వాదశాగ్ర నదీనద ముఖ చతుస్సహస్రాధికోత్తుంగ జలాశయముల   

 

ఆ.వె.

సహజ సిద్ధ కవచ సన్నిభ సీమల
పాడి పంటల ననవరత మలరి  
జనులు సంచరింపఁ జాగుచుండును మహా
భారత గణ తంత్ర భవ్య భూమి 

4.     

 

 

 

సీ.

కృతయుగ మందు భారత ఖండమునఁ బాలకు లెవరో యేరికిఁ దెలియు నకట
యిక్ష్వాకు రాజుల యేలిక యత్యద్భుతంబు భారత మందుఁ దలఁచి చూడఁ
బౌర వాన్వయ చక్రవర్తులు భారతావనినిఁ బాలించిరి ఘనతరమ్ము  
చంద్ర గుప్తాది రాజవరేణ్యు లాదిగ ప్రభు సహస్రం బయ్యె రక్ష భరత     

 

ఆ.వె.

భూమి కంత ఖండము లయి పాలయ్యెను
బశ్చిమంపు రాజ వర్యులకును
గుమిలి వంద లేండ్లు కుడిచె స్వేచ్ఛను మహా
భారత గణ తంత్ర భవ్య భూమి

5.     

 

 

 

సీ.

వేదాల నిలయమ్ము పృథ్వీతలమ్మునఁ బావన దేశమ్ము భారతమ్ము
గిరి వర్ధను భగవద్గీత పరిఢవిల్లె వ్యాస ముఖమ్మునఁ భారతమున
బోధిసత్త్వుఁడు గౌతముండు బోధించెను బౌద్ధ మతమ్మును భారతమునఁ
జాణక్యు నర్థ శాస్త్రం బుద్భవించెను బరిపాల నార్థమ్ము భారతమున   

 

 ఆ.వె.

మే లొనర వరాహ మిహిరుండు వెలయించె  
గగనపు గ్రహ గమన గతుల నడరి
బుధుల పుట్టి నిల్లు భూతలమున మహా
భారత గణ తంత్ర భవ్య భూమి   

6.     

 

 

 

సీ.

కలి కాల మహిమ నాఁగ నిరుగు పొరుగు దేశమ్ములు సెలఁగి ద్వేషమ్ము నూన
మిత్రత్వము నటించి శత్రుత్వ మూన వ్యాజమ్మునం బెద్ద దేశమ్ము సరస
నిది సేయ రాదింక నది సేయ వలె నంచు శాసింప నగ్ర దేశం బొకండు
యుద్ధ మేఘమ్ములు నిద్ధరఁ జెలరేఁగ నెల్లెడ నుల్లముల్ తల్లడిల్ల   

 

ఆ.వె.

దేశ రక్షణమ్ము ధృతి వహించి నెడఁద
భంగ పడక యుండు భంగి నెంచి
యుద్య మింప నొప్పు యుక్త విధము మహా
భారత గణతంత్ర భవ్య భూమి  



7.    



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి