1, సెప్టెంబర్ 2026, మంగళవారం

సమస్యా పూరణ సెప్టెంబర్ 2026

బొంకు నెఱుఁగ నే నెన్నఁడు 
గొంకకు ధైర్యము వహించు గురుతరముగ నా
టంకము లెన్ని యెదురయిన 
నింకిన చెఱువున జనించె నెన్నొ కమలముల్                               64. 

జంకుట మాను మోటమికి సాధన సేయ వరించు గెల్పులే 
క్రుంకకు మెప్డు దుఃఖమునఁ గూడవు దుఃఖము లెల్ల కాలముల్ 
గొంకకు మయ్య నిందలకుఁ గూలు నసత్యము లెట్టకేలకే 
యింకిన చెర్వునందుననె యెన్నియొ పద్మము లుద్భవించెడిన్         63. 

భవ భయ హర కావ్యమ్మును 
భవ సంచిత పుణ్యమునను భవ దూరుండై 
భువిని వెలసి వల్మిక సం
భవుఁడు రచించెను రఘుకుల మాన్యుని చరితన్                          62. 

అవిరళ శోక తప్తుఁ డయి యద్భుత రీతిని మైథిలీ సతీ 
శివతమ సచ్చరిత్రముఁ బ్రచేతసు సూనుఁడు మౌనిపుంగవుం 
డవని వెలింగి యాదికవి యబ్జజు కోరిక వామలూరు సం
భవుఁడు రచించె రామ కథ మానవ కోటికి మేలు సేయఁగన్              61. 

అవనిజ సచ్చరిత్రమును నంచిత రీతిని వల్మికేద్ధ సం
భవున కొసంగి వందనము భక్తి వినమ్ర మనో భిరాముఁ డా  
యవిరళ పోచిరాజ సుకులార్ణవ రత్న వరేణ్య గర్భ సం 
భవుఁడు రచించె రామ కథ మానవ కోటికి మేలు సేయఁగన్              60. 

అబ్బ మంద బుద్ధికి జ్ఞాన మబ్బె నేని 
పిసిని గొట్టు నడుగ దాన మొసఁగె నేని 
పాట లింపుగ నే మూఁగ పాడె నేని 
కాకి కోకిలయౌఁ బైడి కాంస్య మగును                                           59. 

దూఁకు చుండిన దండ యాత్రకుఁ దొంటి గౌరవ మబ్బునే 
వీఁకఁ బంపిన నుగ్ర వాదుల వీట శాంతియె నిల్చునే 
ప్రాకు లాడిన దుడ్డు కోసము భాగ్య మబ్బిన వింతగాఁ 
గాకి కోకిలయౌ ధరిత్రినిఁ గాంస్య మన్నది పైడియౌ                            58. 

కొమ్మరొ వింటివె వైద్యుం
డిమ్ముగఁ దగు నౌషధమ్ము నీయఁ దొలఁగ మో
హమ్ము త్రుటి ముద్దు గుమ్మకు 
బొమ్మకుఁ బ్రాణమ్ము వచ్చి పూజ్యత నందెన్                                    57. 

వమ్మగు టెల్ల వింత యగుఁ బర్వత రాజ కుమారి యెంచి లో 
నిమ్మహిఁ జేసి నట్టి పను లెల్లను బ్రహ్మయు నాప నేర్వఁడే 
గుమ్మము వద్దఁ గాపుగను గూర్మినిఁ బార్వతి సేయఁ బిండితో 
బొమ్మకుఁ బ్రాణముల్ గలిగి పూజ్యత నందెను దేవళమ్మునన్               56. 

అవ్విధి ననె దుఃఖా వేశ మందు  మంచి 
చెడ్డల నవలోకింపక చింత తోడఁ 
గర్కశుం డైన కుజుఁడు సంకటము లీయ 
వచ్చె లగ్నము వరుఁ దన్న వలయు నిపుడు                                     55. 
[లగ్నము వరుఁడు = లగ్నము యొక్క యధిపతి]  

భగ్నం బయ్యెను వాని వ్యూహము వెసన్ బంధింప నా రాజునే
యాగ్నే యోన్నత దేశ పాలకుఁడు నిత్యానీక సంధాన ని
ర్మగ్నుం డాతఁడు చక్కఁ బట్టువడియెం బాపాత్ముఁ డీ రీతినిన్ 
లగ్నం బిప్పుడు ప్రాప్త మయ్యె వరునిన్ లంఘించి తన్నన్ వలెన్             54.   
[వరుఁడు = ప్రభువు] 

వావిరి వీనుల విందుగ 
నే వినిపింప విని భళి యని యనం డెవఁడున్ 
భావిని నా పాటను నం
బా! విని నను మెచ్చు సుకవివర్యుఁ డెవండో                                       53. 

భావన సేసి చూచినను బమ్మి కృతజ్ఞత సూపు వారి మీ 
రీ వసుధాతలమ్మున వసించిన మానవు లందుఁ గందురే    
పావన మిచ్చి నందులకుఁ, బన్నుగఁ ద్రవ్విన కారణమ్మునన్,  
బావిని, నన్ను మెచ్చు కవివర్యునిఁ జూపు మటంచు వేఁడెదన్                  52. 

అల్ల సుధఁ దెత్తు విడువుమ 
తల్లీ దాస్యమ్ము నంచుఁ, దల్లడఁబడఁగా 
నుల్లము దాసినిఁ జేయఁగఁ 
దల్లిని దూషించి, సవతి తల్లికి మ్రొక్కెన్                                               51. 

ఎల్ల వచింపఁ దల్లియె ని జేప్సిత సిద్ధిని రాజ్య లబ్ధిఁ దా 
నల్లనఁ జేరి యంతిపుర మన్నను దండ్రినిఁ గాన రాక స్వీ 
యోల్లము తల్లడిల్ల నను జోత్తముఁ డా భ‌రతుండు తప్తుఁడై 
తల్లిని దూఱుచున్ సవతి తల్లికి మ్రొక్కె నొకండు విజ్ఞుఁడై                         50. 

శిష్టు లైన లేక దుష్టు లైనను గాని 
మే లొసంగు చుండు నీల తనుఁడు 
ముక్తి నొసఁగి యాజి మును రావ ణాదులఁ
గాచె విష్ణుమూర్తి నీచ జనుల                                                             49. 

చూచితె యర్ధ బిందు ఘన చోద్యము మిత్రమ సద్దయా సుధా 
వీచిక లందు సంతతము వీర విహార మొనర్చు చుండి తాఁ
గాచుచు నుండు భక్త జన కాయముఁ గాఁచెను  గాని యేడఁ దాఁ
గాచెను విష్ణుమూర్తి గడుఁ గావర మెక్కిన నీచు లందఱన్                          48.  
[కాచు = రక్షించు; కాఁచు= కాఁగఁ జేయు] 

చాలు చాలింకఁ జెప్పకు చాలు చాలు 
మబ్బు లేకుండఁ జనుదెంచె నబ్బ వాన 
తల్లి లేకుండ నీ చిట్టి తల్లి వుట్టె 
వధువు లేకుండఁ గట్టెను వరుఁడు దాళి                                                 47. 

మానుమ యింక నీ గిరలు మానవు నీ సఖు లెంత సెప్పినన్ 
మానుగ నీదు పంతమును మానవుఁ డెచ్చట నెప్పు డెవ్వఁడో 
మానవుఁ డైననుం గలఁడ మా కిఁకఁ జెప్పుమ మానవోత్తమా 
మానిని లేక యే వరుఁడు మంగళసూత్రముఁ గట్టెఁ బెండ్లిలో                        46. 

కొం డ్రాసనములు వింతను
గం డ్రని  పాప మనుకొన్నఁ గాంచక యే మీ
రుం డ్రని యాగక పామును, 
దండ్రియుఁ గూఁతురు గలసిరి తల్లినిఁ, జంపన్                                         45. 

వేండ్రము నాగ్రహం బొసఁగు వీడుఁడు చాలిఁక నంచుఁ బల్కి కో
డండ్రు కుమారు లెల్లరు నెడందల నింపఁగ శాంత మింపుగాఁ 
దీండ్ర తరోద్ధి తాగ్రహము తీర మనమ్ముల మత్సరమ్మునుం, 
దండ్రియుఁ గూఁతురుం గలసి తల్లినిఁ, జంపిరి సంతసమ్మునన్                     44. 

పలుమారు లెల్లరు దలఁచి 
తలంచి తగ నిర్ణయించి తప్పక యిఁక నా
వలఁ గాంచి పండఁగాఁ జిం
తల కాయల చారుఁ గాఁచఁ దర్షము నిండెన్                                             43. 
[చింతల కాయలు = చింత చెట్ల కాయలు] 

కలకాలమ్మును గుర్తునం దనర సత్కార్యంబు నా నెంచుచుం 
దలకాయల్ తగ పండి యుండఁ దెలివిన్ దర్పంబె యేపారఁగా
నలవోకం జని వండు వా రులవ చే నందుండఁగా నెత్తిపోఁ
తల కాయల్ గొని చారుఁ గాఁచిరి జనుల్ దర్షంబు నిండారఁగన్                     42. 

సున్న యన్న సుద్దు తెలియు మిన్నగాను   
జూడ నను మాట నాకెన్న సుపరిచయమె 
తక్కినవి నే నెఱుంగను దమ్మువాఁడ 
సున్న మార్కులు ర్యాంకేమొ చూడ ఫస్టు                                                41. 

తుర్క లెఱుంగ నోపుదురొ దొడ్డ దొరల్ పరికింప నేర్తురో 
యెర్కకు రాక యుండె నిది యింతయు నక్కట యేమి భాషయో 
కొర్కఁ బడంగ రా దకట కూరిన దేదియొ యెందు నిల్చెనో  
మార్కులు సున్న వచ్చినను మాధవి నిల్చెను ఫస్టు ర్యాంకులో                     40. 

అర్క నిభమ్ము మండుచును నార్చుచు రొప్పుచు సంభ్రమమ్మునం 
దర్కము కూడ దంచు నని తద్దయు భీతి నొసంగి యొజ్జకుం 
జుర్కుగఁ జెప్పె నేమొ మఱి చుట్టము వచ్చి వచింప నట్టులే 
యెర్కయె సున్న సంఖ్య గడియించిన  మాధవి శ్రేణి యొక్కటే                     39. 
[పర భాషా పదములను బరిష్కరించి చేసిన పూరణము] 

అనురక్తిని భస్మావృత 
తనుండు ముక్కంటి సన్నుత వృషభ రాజ
మ్మున నలరి సమర్చిత తా
ర్క్ష్యునిపై శంకరుఁడు దిరిగె సురలు నుతింపన్                                          38. 

ఘన చక్రాయుధ మూని హస్తమున రక్షశ్శ్రేణి హింసార్థమై 
వనజాక్షుండు రమా మనోధవుఁడు నాపన్నప్రసన్నుం డహో
వన సంజాతము లారగింపఁ దమి నప్పక్షీంద్రుఁ డింపారఁ దా
ర్క్ష్యునిపై నెక్కి చరించె శంకరుఁ డమర్త్యుల్ సూచి కొండాడఁగన్                     37. 

మార్క్ష్య వరాయుధమ్మును సమంచిత మూని కరాబ్జమం దహో 
పార్క్ష్య తటీ విహార రిపు భంజన కార్య నిమగ్న చిత్తుఁడై 
వార్క్ష్యము లారగింపఁ దమిఁ బక్షి వరేణ్యము పద్మనాభుఁడే 
తార్క్ష్యునిపైన నెక్కి చనెఁ ద్ర్యక్షుఁడు శంకరుఁ డా సురల్ గనన్                       36. 
[మార్క్ష్యము = మృక్షమునకు (గీకెడు నాయుధము) సంబంధించినది; 
పార్క్ష్యము = యుద్ధమునకు సంబంధించినది; వార్క్ష్యము = 
వృక్షమునకు సంబంధించినది] 

జిత్తు లన రాదు వానిని 
నెత్తు లనఁగ నొప్పు నయ్య యెత్తులకును పై 
నెత్తులు దోషము లగునే 
జిత్తుల నక్కలకె మిగుల జీతము దక్కున్                                               35. 

పొత్తులు మిన్ను నంట గెలుపుల్ వెనువెంటఁ జరించు నిత్యమున్  
విత్తము లున్న వార లిల విజ్ఞులుగాఁ దనరారు చుందురే 
పొత్త మెఱుంగ నట్టి నర పుంగవుఁ డూనును నాయకత్వమే 
జిత్తులమారి నక్కలకు జీతము లెక్కువ ప్రజ్ఞ శూన్యమౌ                              34. 

అంబ మహత్వ మం చనకు మయ్య మహత్వము కాదు నిక్క మె
ల్లం బరికింపఁగా నెదఁ గరమ్మును నచ్చెరు వొంద నేలయా 
యంబువు లందు నున్నఁ గద యత్తఱిఁ గారుట కింత యేనియుం 
జెంబుకుఁ జిల్లు వడ్డ దఁట చిత్రముగా నొక చుక్క కారదే                              33. 

పంక్తిఁ గూర్చుండ నెల్లరు యుక్త రీతిఁ 
గాంచె నొక్కఁడు తనచెంబు నుంచ నచట 
రోఁత సెలరేఁగ నెదలోన మూఁత కింత 
బొక్కవడెఁ జెంబు గారదు చుక్కకూడ                                                    32. 

కాలానుగుణమె యున్నది 
మేలుగఁ బద్యార్థ మెల్ల మించి చెలంగెం  
జా లంచును నర సేసిన 
నాలుగు లఘువులు గురు వగు  నయముగ సుకవీ                                   31. 

విఘటించెం గద నీ ప్రయత్నములహో వీక్షింప నిచ్చోట విం
త ఘనుండంచు నుతింతు రెల్లరు నసత్యం బయ్యె నా ఖ్యాతియే   
యఘటింపంగ నటన్ గణమ్ములను నేకైకమ్ము పూరింపఁగా  
లఘువే కావలెఁ బద్య పాదమును నిర్లక్ష్యమ్ము నందక్కటా  
లఘువుల్ నాలుగు చేరఁగా గురు వగున్ లక్షింపఁగా సత్కవీ!                        30. 
[గురు వగు = బరు వగును] 

బుధు లెవ్వరు మెచ్చనవి వి
విధాంక్షలను నొచ్చు చుండె విశ్వం బెల్లన్ 
స ధన వ రాగ్రావని భా
వి ధవా నిన్గొల్వ నొద వభీష్టము లెల్లన్                                                     29. 

బుధ వర్గార్చిత పాద పద్మ యుగ! శంభూ! శంకరా! భక్త లో
క ధవా! సాంబశివా! త్రినేత్ర! విషభృత్కంఠా! లసద్భక్తి నే 
విధ మర్చించినఁ దృప్తి సెందెదవు పృథ్విన్ శాంభవీ పుణ్య దే
వి ధవా! నిన్ భజియించు మాకు సకలాభీష్టంబు లీడేఱెడిన్                           28. 

సదసద్హృదయుని పదములు 
మది స్మరియించు తఱి నాకు మైకము కప్పన్ 
విదిత మజున కా వైనము, 
ముదిమినిఁ గను మూతలు వడె, భూతాత్మునకున్                                       27. 

ఎదను గణింప నేఁడును బయిన్ నిమిషమ్ములు కొన్ని ప్రాయమౌ 
ముదిమినిఁ గాదు తాత పువు పుట్టువు చుట్టఱికమ్ము చేతనే 
చెదరిన దైన స్వప్నమునఁ జెప్పెద రిప్పగిదిం బరాకునన్ 
ముదిమి వయస్సులోఁ గనులు మూతలు వడ్డవి పద్మసూతికిన్                        26. 
[నాల్గు యుగము లొక్క దివ్య యుగము
వేయి దివ్య యుగములు బ్రహ్మ కొక్క పవ లనఁగా 720 నిమిషములు 
ప్రస్తుతము నడచు చున్నది 28 వ కలి యుగము. అనఁగా28 వ దివ్య యుగము. 
28 దివ్య యుగములు బ్రహ్మకు 28×720/1000 = 19.44 నిమిషములు.
బ్రహ్మ యొక యేఁడు తపస్సు చేసి సృష్టి ప్రారంభించెను] 

ధ్వంసం బొక పరి మేలగుఁ 
గంసారి వధింపఁ గనమె కార్యమె యీ మీ
మాంస కన దుష్ట శిక్షకు 
హింసా భావంబు శ్రేష్ఠమే యన నొప్పున్                                                     25. 

ధ్వంసం బైనఁ గలట్టి చుట్టఱికముల్ భద్రంబు సేకూరునే 
సంసారార్ణవ మందు నక్ర నిభ దుష్ట స్వాంతు లుద్వేగులై 
హింసా కృత్యము లెన్ని చేసినను నోర్పే మంత్ర మీక్షింపఁగా 
హిం సాభావమె యుత్త మోత్తమ మనన్ హేయోక్తి యౌ నెవ్విధిన్                     24. 
[ హింసా + అభావము = హిం సాభావము, హింస లేమి] 

వితత మొనర్పుమ నిత్య మ
హితములు నిరయమున కేఁగ నెంచినచో జీ
విత విలయం బాశింప ని
యతి ధర్మచ్యుతియె సవ్య మగు సత్యంబౌ                                                 23. 

వెతలం దుంచిన స్యీయ పౌరులను నిర్భీతిన్ ధయా హీనుఁడై 
మతి లేకింతయుఁ బాలనమ్మున కిలం బాత్రుండు కాకుండు సం
తత మత్యంతము దుఃఖ యుక్తము ప్రజా నష్టమ్ముఁ జేకూర్చు న
య్యతి ధర్మమ్మును వీడి  యుండుటయె సవ్యం బౌట సత్యం బగున్                 22. 
[ఆ + అతి ధర్మమ్ము = అయ్యతి ధర్మమ్ము] 

మీనకేతనుండు మానక చెలరేఁగ 
దోష మెన్న కెడఁద, రోష మూని 
మూరి విప్పి నంత ముక్కంటి తన కన్ను
వహ్ని పుట్టెను హిమవన్నగమున                                                              21.  

జిహ్నపు మాట విన్నఁ గడు చిత్రము కన్పడ కుండు నేమొ సా
యాహ్నము తోడఁ బట్టపగ లక్కట వింతగ దేనిఁ దెల్పు నీ 
చిహ్నము ముజ్జగమ్ములను జెచ్చెర నా ప్రళయమ్ము క్రమ్మునో 
వహ్నిని మంచు పుట్టె హిమవన్నగ మందున రేఁగె జ్వాలలున్                           20.  

వితతమ్ము రాజ్య మేలిరి 
మతములు వేరైన నేమి మన దేశమునన్ 
సత ముండ భారతీయుల 
చతు రామ్నాయములఁ జదువఁ జాలిరి తురకల్                                             19. 
[ఆమ్నాయము = కులము] 

వితతానందము నందు మున్గుదు రిలం బెంపొంది విత్తమ్ములన్  
సతతం బుందురు నృత్య గానముల నిస్సందేహ మెందేనియున్  
వ్రత దారావళి మాంస భోజన సురాపా నోపవాసమ్ము ల
న్చతురామ్నాయములం బఠింత్రు తురకల్ సామర్థ్యముం జూపుచున్                   18. 
[.. ఉపవాసమ్ములు + అను + చతురామ్నాయమ్ములం; ఆమ్నాయము = సముదాయము] 

పరమానందము నందు మున్గుదురు సంపాదించి విత్తమ్ములం 
జిర కాలమ్మును నృత్య గానముల నిశ్చింతం బ్రవర్తించుచుం 
బరిగృహ్యావళి మాంస భోజన సురాపా నోపవాసమ్ము ల
న్పరమామ్నాయ చతుష్టయమ్ముఁ దురకల్ వల్లింత్రు  రమ్యంబుగా                       17. 

కన్న యన్నఁ దప్పక యగుఁ జూచిన యని 
తప్పు కాని దేను జెప్పుచుంటిఁ 
బలువు రాడు మాట పార్వతీ తనయుండు 
కరివదనుఁడు లక్ష్మి గన్న కొడుకు                                                                  16. 

కరము ముదం బొసంగు హరి గాథలు విన్నఁ బఠింప రక్తి నె
వ్వరి కయినం జిరం బెడఁద వాదన లేల వినుండు శ్రద్ధగన్  
నర తతి నందగాఁడు హరి నందన ముఖ్యుఁడు శంబరారి యు
క్కరి వద నుండు శ్రీసతికిఁ గన్న కుమారుఁ డఁటంద్రు పండితుల్                           15. 
[వద =వద్ద] 

నింగి నుండి దిగిన తార భంగిఁ దోఁపఁ  
దనువు కాంతిఁ గాంచి ద్యుమణి దాఁగి యుండఁ 
జెలఁగి పద్మముఖి యొకర్తె చెంత నుండఁ 
బ్రత్తి చేనులో వికసించెఁ బద్మ మొకటి                                                           14. 

తత్తరమ్మును బొందఁగా నెడఁదం గుబేరుఁ డసూయచే 
విత్తనమ్ముల నమ్మ వచ్చెను బెద్ద మొత్తమె యింకనుం 
బ్రత్తి నంగడి నమ్మి నంతటఁ బన్నుగన్ నిధి యబ్బెనే 
ప్రత్తి చేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్                                           13. 
[పద్మము = కుబేరుని నిధి] 

మాట రాక యున్న లోటేమి యుండును 
సైగ లెల్లఁ జేయ బాగు గాను
గేళ్లు కదుపుచుండి కేళి లీల నరయ 
మూఁగవాని భాష ముదముఁ గొలుపు                                                            12. 

బా గనంగఁ జాల దతని భాష రమ్యతరమె యే
రోగ మెఱుఁగఁ డెన్నఁ డతఁడు గ్రుక్క త్రిప్పకుండకే 
యాఁగకుండ మాట లాడ, నాలకింప నెందఱో 
మూఁగ, వాని భాష విన్న మోద మెంతొ గల్గుఁగా                                                 11. 

అరయ మందాకినీ జల మంచితమ్ము 
స్నాన మాడంగ నఘములు సడలి పోవుఁ 
బానమున కయోగ్యము లంచు  భవ్య విష్ణు 
పద్యములు సెప్పకుఁడు విన్నఁ బాప మగును                                                    10. 
[పద్యములు = పాదము లందుఁ బుట్టినవి] 

విద్యావేత్తలు మెచ్చ రెవ్వరును నీ విశ్వంబునం దక్కటా 
యాద్యంతమ్ములు లేక వ్యర్థ గిర లత్యంతమ్ము దొర్లంగ నా 
గద్యా లైనను నింక దుష్ట కవితా  కాయమ్ము  మిథ్యోక్తముల్ 
పద్యాల్ సెప్పకుఁ డయ్య యివ్విధినిఁ బాపం బౌను వీనిన్ వినన్                              9. 

అప రారుంధతి నాఁ బరఁ
గు పరమ సాధ్వి యనినం దగును నేరక యే
కపటమ్ము భానుమతి యో 
ద్రుపదాత్మజ! పెండ్లియాడె దుర్యోధనునిన్                                                           8. 

విపరీ తార్థము గైకొనంగఁ దగునే విద్యాధికశ్రేణికిం 
జపలత్వమ్మునఁ గాదు సుస్థిర మతిన్ సాధించె రారాజునిన్ 
నృప వంశోద్భవ యైన భానుమతి, కుంతీపుత్రులం బొందఁగా 
ద్రుపదాత్మోద్భవ, పెండ్లియాడెను గదా దుర్యోధనుం బ్రేముడిన్                                  7. 

మగువల కిల జుట్టందము 
తగు రీతినిఁ బూల చెండు తల నిడ నంద
మ్ముగఁ గన్పడంగ నల్పపు 
సిగ లేని సతికిఁ బువు లిడ శ్రేయమ్మె యగున్                                                       6. 

మగువల్ మెత్తురు మిక్కుటమ్ముగను  సమ్యగ్రీతి భూషింప వా
సిగ స్వీయోన్నత మూర్ధజమ్ములను నాక్షేపింప రాదేరికిం
దగ నా కాంత కొసంగ నందమును మూర్ధం బందుఁ బుష్పాలి వా
సిగ లేనట్టి పడంతికిం బువు లిడన్ శ్రేయమ్ము మోదం బగున్                                   5. 

చెట్ల పైన వ్రేలాడిన నెట్లు గొప్ప 
దొంగలును జరియింపరె పొంగి నిశల 
నేల నీ కింత గర్వము సాలు చాలు 
గబ్బిలమ నీ కనులు మనోజ్ఞములు గావె                                                            4. 

కబ్బము లందు సత్కవి నికాయము దుష్ట తరోపమానముల్ 
గబ్బు సెలంగఁ జేయుదురు కార్యమె యట్టు లొనర్ప నక్కటా 
యబ్బుర మౌను నీ చరిత మారయ  గాఢ తమస్సు నందు నో 
గబ్బిలమా మనోజ్ఞములు గావె భవద్రమణీయ వీక్షణల్                                          3.  

అల వైకుంఠ పురాధి నేత పయి నత్యంతమ్ము సద్భక్తి భా
సిల డెందమ్మున నర్చనా సహిత లక్ష్మీనాథ సంకీర్తనా
ఫల సంప్రాప్త నిమిత్త మబ్బును మహాభాగ్యమ్ము విధ్వస్త త
ద్బల దర్పాది వికార సంహతులతో బ్రహ్మంబు ప్రాప్తించెడిన్                                     2. 

గుప్త ధనము వెచ్చింపుమ 
సప్తాహము లందుఁ గోర్కి సమకూరు నయా 
తృప్తిల్లి వేచి చూడుమ 
ప్రాప్తించును బ్రహ్మ! పదము బల దర్పములన్                                                     1.