1, అక్టోబర్ 2026, గురువారం

సమస్యాపూరణ_అక్టోబర్ 2026

కలి యుగమ్మునఁ గనరారు వలపుకాండ్రె 
యెంచి తనకు జోడి యని ప్రేమించి నట్టి 
యింతికిం దక్క తాను వరించని యతి
వలకుఁ జిక్కని వాఁడె యౌ వలపుకాఁడు                                           63. 

తలఁపన్ వేఱగుఁ బ్రేమ మోహములు తథ్యం బెన్న గాఢమ్ముగాఁ 
గలకంఠిం గని యొక్క చేడియ నెదం గాంక్షింపఁ బెండ్లాడఁగా  
జలజాక్షుల్ తమి వైతురే వలల నీషన్మాత్ర మెన్నండు నే   
వలకుం జిక్కని వాఁడె ప్రేమి యని తా వర్ధిల్లు నెల్లప్పుడున్                    62. 

కోమలి రతీసతి వగపు
నేమని వర్ణింప నింక నేరికిఁ దరమౌ
సోముని చంద్రధరుని ని
ష్కాముని నేత్రానలమ్ము కంతునిఁ గాల్చెన్                                          61. 

భీముని తోడ నాటలను బేలతనమ్మున నాడ నెంచి తా
నీమము తప్పి మన్మథుఁడు నేరక యాపద మ్రగ్గె నక్కటా 
హైమవతీ సమక్షమున నంచిత శీత నగమ్మునం దపః 
కాముని కంటి మంటలకుఁ గంతుఁడు మారెను భస్మరాశిగన్                    60.  

వాణి మగఁడైన రక్షింప వలను కాదు 
రాణు లుండినఁ బెక్కండ్రు రాజ యినను 
బాణ సన్నిభ లనిశమ్ము బాధ లొసఁగఁ 
బ్రాణగండమౌ గృహమునఁ బతికి సతము                                           59. 

శ్రేణీ భూతము లౌను జన్మము లిలన్ జీవాత్మ నాథుండ యౌ 
ఠాణం బౌను శరీర మెన్నఁగను ద్రష్టవ్యమ్ము బ్రహ్మాత్మకున్ 
వేణీ సన్నిభ మైన జీవితమహో    విచ్ఛిన్న మే నాఁటికిం  
బ్రాణాపాయ పరిస్థితుల్ పతికి సంప్రాప్తించు గేహంబునన్                        58.  
[పతికి = గేహపతి, జీవాత్మ; గేహము = దేహము] 

ఆర్తి నిడ ధార్త రాష్ట్రులు 
వర్తించిరి సంతతమ్ము వారలు క్రూరుల్ 
ధూర్తులకుఁ బ్రీతి నిడు దు
ష్కర్తవ్యము వీడు వారు కల్యాణ కరుల్                                              57. 

వార్తావ్రాతము నమ్మరా దెవరు విధ్వం సార్హ కార్యాలికిం 
గర్తృత్వమ్మును సమ్మతింపరు జగత్కల్యాణ కాంక్షా మతుల్ 
ధూర్తౌఘమ్మున కీఁ దలంప కెదలం దోడ్పాటు సత్పూరు షా
కర్తవ్యమ్మును వీడు వార లిలలోఁ గల్యాణ కారుల్ గదా                           56. 
[సత్పూరుష + అకర్తవ్యము = సత్పూరు షాకర్తవ్యము] 

వేసవి సమయమ్ము విస్తరించిన నేమి 
చింత నంద వలదు సుంత యేని 
సౌధ మందు నుండఁ జలియంత్రము సుఖమె 
మంట, లోనఁ బుట్టె మంచు గనుము                                                 55.  
[మంట = మనుట] 

మింటన్ సూర్యుఁడు సంచరించుచును భస్మీభూత గోళమ్ము కాఁ
బంటల్ వెల్గెడు భూమిఁ జేయు తఱినిన్ వర్షమ్ము కుర్యంగ వె
న్వెంటం జల్లఁ దనమ్ము క్రమ్ముకొనియెం బృథ్వీ తలంబం దహో 
మంటల్ రేఁగెడు నగ్ని హోత్రమున నమ్మా మంచు పుట్టెం గదా                 54. 

అకట యాశ్చర్య మే మున్న దరయ నిందు 
సంభవించుచు నుండు నీ సరణి నవనిఁ 
దా నహో తన కడపటి తమ్మునికినిఁ 
దనయుఁడు జనింపక మునుపె తాత యయ్యె                                     53. 

జంకే మాత్రము లేని వార లను వాచ్యవ్రాత మిట్లుండునా 
యింకన్ దారయుఁ జూలు లే దనినఁ గొడ్కే సోమలింగంబ యీ 
వంకం గన్పడు చున్నవీ నుడు లహో పైత్యంబు వర్ధిల్లెనే   
యింకం బుత్రుఁడె పుట్ట లేదు మనుమం డేతెంచెఁ దాతం గనన్                 52. 

ఎక్కడికో చన వలదే 
ప్రక్కన మందిర వరమ్ము రమ్యతరముగా 
నొక్కటి వెలసిన దట ర
మ్మక్కా రామాలయ మట యర్చింపఁ దగున్                                         51. 

ఎక్కాలమ్మున నైన రాముఁ డిలలో నింపారఁ బూజార్హుఁడే 
యక్కా యేఁగ వలెం బురమ్మునకు నాంధ్రాయోధ్య కుత్సాహులై   
చక్కన్ దర్శన మౌను భద్ర గిరిఁ బూజాద్రవ్య సంపత్తి తె
మ్మక్కా రాముని దివ్యతీర్థము గదా యర్చింపగా రమ్మిఁకన్                       50. 

పట్టణమ్ము లయ్యెను నేఁడు పల్లె లెల్లఁ 
జెప్పినది సేయ రెవ్వరు సెప్పి నట్లు 
సత్తెకాలపు నరు లున్నఁ జాలు మనకు 
నాఁటి పల్లెల్ గనము నంగనాచు లేల                                                   49. 

కోట లున్నను బాక లున్నను గూడి యుండిరు మిత్రులై 
మాట యిచ్చినఁ దప్ప రెన్నఁడు మానసమ్ములు వెన్నలే 
తోటి వారికి నెల్ల రప్పుడు తోడుగాఁ జరియించిరే  
నాఁటి పల్లెలు నేఁడు గానము నంగనాచులె యేలఁగన్                               48. 

గోముగ సతి మెచ్చుకొనుచు 
భామా మణి చేతి పిండి వంట లహో, నే
నే మందును, బాగున్నవి 
మామా యని సర్వముఁ దినె మా యల్లుండే                                           47. 

భామారత్నము నీయఁ దృప్తిలఁడు సంబంధమ్ము మీ పుణ్యమే 
మీ మాన్యమ్ములు పెక్కు లన్ని యకటా మీ కేల నా కిమ్మనెన్ 
ధామం బిమ్మనె వాహనమ్ము గొనె యర్థం బెంతొ యాశించెనే 
మామా మామ యటంచు సర్వముఁ దినెన్ మామా!  స్వజామాతయా           46. 

పొందు మన్నన నిత్యము ముద్దరాలు 
మాన్య లౌదురు మానినీ మణులు నెల్లఁ  
దెల్ల మగును గనిన నిట్టి తీరు నచట 
రాణ్మహేంద్రిలో నొక్కటే రాలు మణులు                                                   45. 
 
విణ్మయమ్ములు పట్టణమ్మున వీథు లెల్లను వింతగా 
రుణ్మనుష్యులు పోరు చుందురు లుప్త ధర్ములు సత్పరి
వ్రాణ్మహాత్ములు సంచరింతురు పాదచారులు భిక్షకై 
రాణ్మహేంద్రవరమ్ము నందున రాలు రత్నము లొక్కటే                                 44. 

వర్మ కరవాలము లడర 
చర్మం బల్లాడఁ బోరు సలుపక యున్నన్ 
మర్మ మెఱిఁగి పాలింపఁగ 
ధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్                                              43. 
[ఏలఁ దగున్,  తగఁడు] 

దుర్మార్గమ్మును సైపఁ డెన్నఁడును సంతుష్టుండు సంగ్రామపుం
గర్మవ్రాతము నేరి నట్టి ధరణీ కాంతుండు నిష్ణాతుఁడే 
ధర్మాధర్మము లందు నెన్న నెద సత్యమ్మున్ ద్విషద్వాహినీ 
ధర్మాధర్మ మెఱుంగ నట్టి ధవుఁడే? తా నొప్పుఁ బాలింపఁగన్                          42. 
[ధర్మాధర్మము = ధర్మబద్ధ మైన యధర్మము; ధవుఁడే? కాడు] 

మాంసమ్మును సేవించి ప్ర
శంసల కెదఁ బొంగుచుండి సంతతమును మీ
మాంసను వల్లించి పరమ
హంసను విడి సాధకుండె యాత్మకుఁ జిక్కెన్                                             41. 

నక్ర సన్నిభములు దురతిక్రమములు 
నరుల కింద్రియములు కారణములు చ్యుతికి 
భువన వినుత పరమ హంసను విడి సాధ 
కుండె యాత్మకుఁ జిక్కెన్ నరుం డొకండు                                                  40. 

ధ్వంసము కాక తప్ప దిలఁ దాపస వర్యున కైన మాన వో
త్తంసున కైన నింద్రియ వితానముఁ గట్టడి సేయ కున్నచో 
హింసను మెచ్చు బుద్ధిని జయింప నశక్యుఁడు నై మహాత్ము రా   
డ్ఢంసను వీడి సాధకుఁడె యాత్మకు లోఁబడి ఖిన్నుఁడాయెగా                           39. 
[రాట్ +హంస = రాడ్ఢంస; సన్యాసులలో శ్రేష్ఠుఁడు] 

అనునయింప దుఃఖమ్మున నమ్మ లేదు 
చదువుకొనఁగఁ బొత్తమ్ములు గదిని లేవు 
నేను జేసిన పాపమ్ము గానరాదు  
పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు                                                   38. 

గాజు ముక్కలు రత్న రాసులు గావు పౌరుష హీనుఁడౌ 
రాజు గద్దె వహింప నెవ్విధి రాజ్య మేలును శూన్య పృ
థ్వీజ రత్నచయంపుఁ బీఠము పీఠమే పరికింపఁగాఁ 
బూజ సేయఁగఁ బీఠ మందునఁ బూవులే కఱ వయ్యెఁగా                               37.  

ఆరయ శివుఁ డన్నను శుభ
కారి యని నెఱుంగ వచ్చుఁ గమనీయముగా 
నారాయణుండు శివుఁడే  
క్షీరాబ్ధి సుత మనువాడె శివుని ముదముతో                                              36. 

సారానంత ధనప్రదాయిని సదా సౌభాగ్య సంయుక్త యా
క్షీరాంభోధి తనూజ చక్రిఁ దమిఁ దాఁ జేపట్టఁ బ్రాణేశుగా 
సారాచార సువేత్త్రి శీత నగ రాట్సంజాత, లేకున్న నా 
క్షీరాంభోధి తనూజ, శంకరునిఁ దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్                                  35. 
[పార్వతీ కల్యాణము నాఁటికి లక్ష్మీ దేవి యింకను క్షీర సముద్రము నుండి పుట్ట లేదు.] 

లోన యున్నఁ జూడ నగునె మానసమ్ము 
గాలి యున్నను లోకుల కంటఁ బడునె 
కాన కేరికిఁ దా నిలఁ గాచుచుండు 
దేవుఁడే లేఁడనుచు నేల దేవులాట                                                            34. 

ప్రోవులై వెత లుండ నిత్యము భూమిపైఁ గనఁ డెన్నఁడుం 
గావు మంచును మ్రొక్కు వారికిఁ గాన రాడిల నెన్నఁడున్ 
సేవ లంచును దోఁచు చుండినఁ జింత నందఁడె యెన్నఁడున్   
దేవుఁ డేలనొ లేక పోయెను దేవులాట లిఁకేలనో                                            33. 

నర రూప రాక్షసులు నేఁ
టి రాజు లతి నిర్దయులు కుటిల రణ చతురుల్ 
దురమున నక్కట తెగినవి 
కర చరణాల్ గోటులు దలకాయల్ లక్షల్                                                     32. 

చరిత మనర్హ మైన నెద జాలి గుణం బది లేక మాన వో
త్కరమున సుంత చిత్త మిడఁ గాసుల వంచక వైద్య నేతకున్,
గరిమ నొసంగ నాయము సుఖమ్ముగ వైద్యులు విక్రయింపఁగాఁ 
గర చరణాలు గోట్లు దల కాయలు లక్షలు, గుండె లెన్నియో                              31. 
[కర చరణాదులు = అవయవములు; వైద్య నేతకున్ గుండె లెన్నియో] 

నిక్కముం బరికింపఁగఁ జక్కఁగాను 
దశముఖుఁడు సీత శోకాగ్ని దగ్ధుఁ డయ్యె 
నాత్ర మంద నేల నిమిత్తమాత్రుఁ డౌను,  
రావణుం జంపె జానకి, రాముఁడు గన                                                        30. 

దైవ మలంఘనీయ మగుఁ దప్పిన ధర్మము ధాత కైననుం 
జేవ నశించు నన్న నది చిత్రము కాదు చతుర్దశమ్మునన్ 
వావిరి పాప నాశన మవార్యము కావఁగఁ జాల దక్కటా 
యే వర మైన నిత్య నయ హీనునిఁ జేసిన దుష్కృతమ్ములే 
రావణుఁ జంపె సీత రఘురాముఁడు సూడఁగ యుద్ధ భూమిలో                          29. 
[సీత రఘురాముఁడు = సీత యొక్క రఘు రాముఁడు] 

బాధ లొసఁగును బరికింప వ్యర్థ మైనఁ 
గ్రోధము నిరంతరమ్ము నరులకు భృశము 
పన్నుగ సతమ్ము నంచిత ఫల మొసంగు  
క్రోధమే మంగళకర వాక్శుద్ధి నిడును                                                             28. 

ఆధారమ్ములు పుష్కలమ్ము లిల సత్యం బెన్న మూలమ్మ యి
స్సీ ధర్మచ్యుతి కెన్న నాగ్రహము వీక్షింపంగఁ గోపాలకున్ 
బాధావ్రాతము కారణం బగును దాపం బిచ్చు నిత్యమ్ము న
క్రోధం బెంతయొ మంగళప్రదము వాక్శుద్ధిం బ్రసాదించుఁగా                                 27. 

కురుపతి వీర వరుల కా
వరమ్ముచే నెట్టి ముప్పు వాటిలె నకటా
నరులకు నని గోవుల కా
పరులనుఁ గని పాండు సుతుఁడు భయపడె ననిలో                                           26. 

ధరలో రక్తపుఁ గూటికై తనరు యత్నం బేల నాకంచు సం
గర మత్యంతము పాప హేతు వని శంకా తప్త చిత్తుండు పో
టరు లుద్యుక్తులు నిల్వఁగా గురుల తోడం దాతలన్ బంధులం
బరులం గాంచిన పాండు నందనుఁ డనిన్ భ్రాంతుండునై భీతిలెన్                          25. 

భక్త లోక నిరంతర పాలకుండు 
మత్త మాతంగ సన్నుత మాధవుండు 
శిష్ట జన సంచయమును రక్షించి తామ
సుల భరతముఁ బట్టిన హరి శుభము లిడుత                                                   24. 

జలజ నిభాక్ష నీల ఘన సన్నిభ సుందర గాత్ర భాసితుం 
డలఘు బలాన్వితుండు సుజనావన కార్య దురంధరుండు  స
ల్లలిత పదాబ్జ నర్తన కళా మహిమన్ యము నాపగా నివా
సుల భరతమ్ముఁ బట్టిన యశోనిధి కృష్ణుఁడు మిమ్ముఁ బ్రోచుతన్                            23. 

పరమ భాగవతుండును భక్త వరుఁడు 
రాఘ వాంకితముగ గొప్ప రచన సేసెఁ 
బండితులు పామరులు గూడ దండిగ విన
న రవమున వ్రాసెఁ బోతన హరి కథలను                                                           22. 
[అ రవమున = ధ్వని సేయక] 

నరపతి కీయ కంకిత మనంతున కా రఘు వంశ సూతి కి
చ్చి రుచిర భంగినిం దెనుఁగు సేత నొనర్చె నశేష భక్తిమై  
స్థిర మతి నెందఱో యనువదింప ముదమ్మున సుందరమ్ముగా   
నరవము నందుఁ బోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో                                    21. 

ఇంతి! వృద్ధాశ్రమమ్ములు జంతు శాల
లెల్లఁ గ్రూర మృగము లుండుఁ జల్లగ నట
నవ్విధం బయ్యె సతము నీ వెవ్విధిఁ దలఁ 
తెలుఁగు తల్లి వృద్ధాశ్ర మాధీన యయ్యె                                                             20. 
[తలఁతు+ ఎలుఁగు = తలఁ తెలుఁగు; ఎలుఁగు = ఎలుఁగు గొడ్డు]  

నిలయము లందు నే బడుల నేర్వక  తెల్గును సుంత నేఁటి పా
పలు  మగ బిడ్డ లెల్లరును బల్కఁ దొడంగిన నాంగ్ల భాషలో 
నెలమినిఁ జిల్క పల్కులను నిప్పటి వృద్ధులు సద్దయాత్ములై 
తెలుఁగునుఁ దల్లిగాఁ దలఁచి దించిరి వృద్ధుల యాశ్రమంబునన్                                19. 

సుజ నానీకము చేతను 
నిజ వంశజ నాథునకు ననేక విధములన్   
గజ సంచయ మైరావత
గజమునకుం బూజ లందఁ గనె భాగ్యమ్మున్                                                        18. 

సుజల తరంగ సంచయ విశుద్ధ చరిత్ర యశోవిరాజినీ   
నిజ కుల వర్ధమాన సతి నీల సువర్ణ జలప్రసిద్ధ న
క్ర జలచ రావృతమ్మును సరస్వతి కిద్ధ నదీ మతల్లి క
క్క జమున కెంత భాగ్యము ముఖమ్ము యుగాలుగఁ బూజ లందెడిన్                         17. 

ప్రాజ్ఞు లర్హు లయ్య ప్రజ్ఞను గుర్తింప 
సరస మెఱుఁగు నెట్లు షండుఁ డవని 
నల్పు లందు రిట్టు లజ్ఞాన మడరంగ 
నాముదాల మురళి యల్పుఁ డంద్రు                                                                    16. 

అవమానమ్ములు వ్యక్తి నామముల నయ్యా రాజకీయమ్ము లం 
దవలోకమ్ములు నాఁ దలంచితి నసత్యం బయ్యె నీ రీతినే 
యవధానమ్ములఁ గూడ వచ్చినవి యే మందుం బరంధాముఁడా 
యవధానంబున నాముదాల మురళీ యల్పుండ వీ వంద్రు పో                                   15. 

నరవరులను హింసింపం
గ ఋషి వరేణ్యులఁ గడింది కాఱియ వెట్టన్ 
ధరణిజ కొసఁగ వెతలు సు
స్థిరం బరాక్షస హితుఁడగు శ్రీరాముఁ డొగిన్                                                             14.  

మరణాంతమ్ములు వైరముల్ పుడమి నా మన్నించి కాకుత్స్థుఁడే 
శరణం బెల్లర కీయ రక్కసుల కాశ్చర్యమ్ముగా సాయ మా
హరి సందోహ మిడన్ విభీషణుఁడు రాజ్యం బేలు చుండంగ నా 
ధరలో రాక్షస లోక మిత్రుఁడు పరంధాముండు శ్రీరాముఁడే                                           13. 

నాతి పయి రేఁగ మోహం 
బాతతముగ నంధుఁ డయ్యె నరసి నిజ మహా
పాతకమును దీర్ఘతముని 
సూతినిఁ గని నాక విభుఁడు శోకితుఁ డయ్యెన్                                                           12. 

ఏ తఱి దైవ నిర్ణయము లెవ్విధి నుండునొ యేరి కెర్క సం
పాతము సెంద విక్రమము వారక భండన మందు నింద్ర జి
ద్ఘాత పరాజయుండు గత ధాముఁడు లుప్త యశుండు విశ్వవ
స్సూతినిఁ గాంచి నాకపతి శోకము నొందెను బ్రాణ భీతిచే                                              11. 

ధరలో ఋణత్రయమ్మును 
సు‌రుచిరముగఁ దీర్ప నెల్ల శుభములు కలుగున్ 
నర పుంగవులకు మృత సం 
స్కరణమును మఱవఁ గలుగవు గౌరవ కీర్తుల్                                                             10. 

హరణమె యెల్ల భాషల ననర్హము సమ్మత సూక్త సంత తా
చరణ మవార్య కార్య మగు సన్నుత పండిత సమ్మతాధ్వ సం
చరణము భావ్య మెల్లరకు సత్కవి కావ్యము లందు నెందు వ్యా
కరణము విస్మరించు నెడఁ గల్గవు కీర్తియు గౌరవమ్ములున్                                               9. 

అభిరాముని నా కృష్ణుని 
సభార్యుఁ జేసెను బకారి సకల భువన స
ద్విభునిన్ సత్రాజిత్తు దు
రభిశాపము మేలుఁ గూర్చు నశ్రాంతమ్మున్                                                                   8.  

ప్రభలం దెన్నఁగ సూర్య సన్నిభము దుర్వారోగ్ర శాపమ్ము దు
ర్లభ లక్ష్మీ పతి జన్మ కారణమునై లాభమ్ము సేకూర్చెనే 
యభయం బిచ్చెనె యక్కిరీటికి నహో యయ్యూర్వసీ శాపమే 
యభిశాపమ్ములు మేలుఁ గూర్చును గదా యశ్రాంత మేపారుచున్                                      7. 

నరుల కొసంగఁ బొగడ్తలు 
విరివిగ నుప్పొంగరే భువిని స్తోత్రము లీ 
యర కోరిన విద్యలకై 
గురువుం గొట్టంగ వలెఁ దగు నుతి శరములన్                                                               6. 

కరుణ వహించినన్ గురువు కామిత విద్యలు వొంద వచ్చు నా
కరుణను జూప కున్న యెడఁ గల్గునె భాగ్యము విద్య నందఁగా 
గురువును గౌరవింపఁ దగుఁ గోరిన విద్యలఁ బొందఁ గోరఁ గా 
గురువునుఁ దిట్టి కొట్ట వలెఁ గుత్సిత బుద్ధి వహింప ద్వేషియై                                             5. 
[కా గురువు = దుష్ట గురువు] 

అల కాంచి యొక్క రిద్దఱి
నలువు రటులె యుందు రని మనములఁ దలఁచుచుం 
బలుకఁగ రా దిబ్భంగినిఁ 
గలుషిత చిత్తులె కదా జగద్గురు లెల్లన్                                                                         4. 

కల రిలఁ గొంద ఱెల్లెడలఁ గైతవ సంయము లర్థకాముకుల్ 
ఫలముల యాశఁ జూపి జన వర్గము నక్కట మోసపుచ్చఁగా   
సలలిత మొప్పు నిట్లనిన శంకరుఁ డాదిగ నొజ్జ లెల్ల ని
ష్కలుషిత చిత్తులే కద జగద్గురువుల్ పరికించి చూచినన్                                                 3. 

వెండి కొండ పైనుండి ఘనుండు నాగ
భూషణుండు త్రినేత్రుండు మోద మలర  
హరుఁడు హింసింపకయు సుంత యంత వృషభ  
హంసపై శంకరుఁడు వచ్చె హాయిగాను                                                                          2. 
[వృషభ హంస = వృషభ శ్రేష్ఠము] 

హింసను నొల్లకున్న సృజియించిన దుష్టుని బాలవైరి నా
కంసుని శంకరుం డన సుఖమ్ము లొసంగెడి వాఁడు బ్రహ్మ మీ
మాంస నెడంద నూనకు ప్రమాదము లేదు తలంప నవ్విధిన్ 
హంసను నెక్కి శంకరుఁడు హాయిగ వచ్చెను శారదాంబతో                                                 1.