1, ఆగస్టు 2026, శనివారం

సమస్యా పూరణ ఆగష్టు 2026

భీమ యుతమ్ము సైంధవుని భీరు జయింపఁగ లేక యో పరం
ధామ! నరాత్మసంభవుని ధర్మ విహీనము పంపి యుంటిమే 
నా మగ ధీరు లాత్మల ఘనమ్ముగ భీతి వహించి నిల్చిరే 
చీమనుఁ జూచి భీతిలెను సింహము క్రూర మృగాభిశంకతో                        63. 

ఏమన వచ్చును వింతను 
భీమేతర సింహముఁ గని వెలవెల నగుచున్, 
దోమ యొకండు భయంపడఁ 
జీమం జూచి, భయపడెను సింహమ్ము గడున్                                        62. 

ప్రియముగఁ బఠింపఁ దగు వా
ఙ్మయములు వర్ధిల్లి పెక్కు మహిలోఁ గలవే  
నయవంచక నాస్తిక వా
ఙ్మయమున ధర్మమ్ము లేదు మానుఁడు చదువన్                                     61. 

క్షయ మొందింప జనోత్కరమ్ములను గక్షాపూర్ణ మంత్రాళి ని
ర్దయఁ జొప్పింతురు ద్వేష భావములు మిథ్యా వాక్య యుక్తమ్ము సం
దియ మావంతయు నిందు లేదు వినుమా తీవ్రోగ్ర వాదోక్త వా
ఙ్మయమం దున్నది ధర్మ దూర మగు సంపాఠ్యమ్ము గాదెన్నఁడున్                 60.  

నమ్మిన సిరు లిడు  నమ్మను 
నెమ్మనముల నుంచి రక్తి నీరజ నేత్రల్ 
తమ్ముఁ గరుణఁ గాచెడి భా
రమ్ము నిడెద రంట స్త్రీలు రమకున్ భక్తిన్                                                 59. 

తమ్ము నిలా తలమ్మున సతమ్మును నెమ్మి నొసంగి కావుమో 
యమ్మరొ యంచు వేఁడుచు వ్రతావళిఁ బూజల నెల్లఁ జేయుచుం
గొమ్మలు నిత్యముం బసపు కుంకుమ  లింకను బూలు పండ్లు తో
రమ్ము నొసంగు చుందు రఁట రామలు లక్ష్మికి నిండు భక్తితోన్                       58. 

ఈశుండ వైతి లలనకు 
నీ శాతోదరి సుఖ మిడు నిట్లనకుమ యా
వేశమున బ్రహ్మ చర్యపు 
నా శార్థము నాఁడు దక్కె నా మను వకటా                                               57. 

ఆశా పాశము లేల నయ్య యని వార్యార్థమ్ములం దిట్టు లే 
యాశం జూచిన నన్ని పుట్టుకలు తథ్యాంతమ్ములే చుమ్మిలన్ 
నాశార్హమ్ములె యెల్ల వారలకు నన్నా చింత నీ కేలయా 
నా శార్థమ్మున నాకు దక్కె మను వన్నా యేమి చెప్పంగనౌ                            56. 
[మనువు =జీవనము] 

కలవు వింతలు గాంచఁ బెక్కులు పుడమినిఁ 
గలదె హరికి నసాధ్యము తలఁచి చూడ   
జలధి లోన లక్ష్మీ దేవి సంభవింపఁ 
దోయధిన్ క్షార జల మయ్యెఁ  దీయగాను                                                 55. 

బాగుగ నుండఁగా జలము వార్ధులఁ గొన్నిటి క్షార నామ త
త్సాగర మం దిలన్ లవణ సంపద వర్ధిల క్షీర నామ స
త్సాగర మందు భాసిలఁగఁ జక్కని క్షీరమె యిక్షు నామ త
త్సాగర మందు నీర మది చక్కెర రీతిని తియ్య నయ్యెనే                              54. 

పూర్వ జన్మ వృత్తాంతము సర్వ మరసి 
నట్టి గంధర్వుఁ డొక్కండు పుట్ట సర్ప
జాతిలో శాప మోక్షమునే తలంచి 
విషముఁ ద్రాగి క్షీర మొసఁగె భేకభుక్కు                                                      53. 

విషమును జిమ్ము పుర్వయిన భీతిల కింపుగఁ బాల నీయఁ గి
ల్బిష మతి సంచరించుఁ బగ వృద్ధిల నిత్యము దందశూకమే 
రుష సెలగంగ మిక్కిలి విరోధి శరీరినిఁ గాటు వేసి వే 
విషమునుఁ, ద్రాగి సర్ప మది వింతగ క్షీర, మొసంగెఁ బ్రీతితోన్                        52. 
[త్రాగి సర్ప మది క్షీరము వే విషము నొసఁగె – అన్వయము] 

ఆదరింపఁ దగునె యాకారమును గాంచి 
పాత్రుఁ డాదరింపఁ బండితుండు 
చెన్ను మీఱ నచ్చ టున్న వారల బాన 
పొట్ట యున్న వాఁడె బుధుఁడు సుమ్ము                                                      51. 

పట్టు నింతయు వీడ కుండినఁ బంత మూనిన సంతతం 
బట్టి వానిని మూర్ఖుఁ డంచును నందు రడ్గిన యంతటం     
జట్టనన్ వచియించు నేర్పున శబ్ద పూరిత మైనదౌ 
పొట్ట గల్గినవాని నందురు భూమి పైన బుధుండుగన్                                   50. 

సతతం బుండఁగ గళమున 
సతియై సరసను వెలుంగ సంతోషముగన్ 
మతి నూహించి వెస నుప
స్థిత రూపముఁ గని పలుకుము శ్రీయొ యగజయో                                       49.  
[శ్రీ = విషము; అగజ = పార్వతి] 

సతతం బెన్న సతీ విలోలు లిరువుర్ సందేహ శూన్యమ్ముగా 
నుత నారాయణ నాగభూషణులు నే నోరార వాకృచ్చెదన్ 
స్తుత నారీ మణు లెవ్వ రెవ్వరఁట వక్షోభాగ వామార్ధ సం 
స్థిత రూపమ్మును జూచి పల్కు మిపుడే శ్రీదేవియో గౌరియో                             48. 

సత్కవీంద్ర సంచయ మింక సకల విబుధ
సత్తములు నిలువంగ నసత్య మకట 
సుంత వచియింప రాదయ్య యింత యేని 
వాఙ్నియమ మెఱుంగని వాఁ డవా వధాని?                                                  47. 

దిఙ్నిచయాంతరాళమున ధీవరు లెల్లరు సన్నుతింపఁ దా
దృఙ్నర పుంగవార్భకుఁడు పృథ్విని నెందును లేఁడు లేఁడనన్ 
వాఙ్నిధి యందు దిట్ట యయి ప్రస్తుత పృచ్ఛక సన్మనశ్చర
ద్వాఙ్నియమం బెఱుంగని యువప్రవరుం డవధాని యయ్యెనే                           46. 

ఆత్మ వగవక నింతయు నాలకించి 
రాజు నాజ్ఞను బట్టపు రాణి యంగ
నా మణి వెసఁ గౌసల్య తన సవతులను  
బత్ని యతివలను బిలిచి పతి కొసంగె                                                          45. 

నూత్నము చంద్ర కాంతము వినూత్న విశేషము సూర్య కాంతమున్ 
రత్నము నిన్పకాంతమును రమ్యతరమ్మును గాంచి యంగనా 
రత్నము లంచు నెంచి యనురాగము రేఁగ నెడంద నత్తఱిం 
బత్నియె పిల్చి కాంతలను భర్తకు నిచ్చెను సంతసమ్మునన్                               44. 
[ఇన్పకాంతము = అయస్కాంతము]

వడి వడి వచ్చి గృహమ్మున 
నడుగిడి యాయుధము నూని హతమార్ప నొకం 
డడరిన, రక్షింపంగం
బడఁతుక నిజపతినిఁ, జంపి పావని యయ్యెన్                                               43. 

పుడమిఁ బతివ్రతావళికిఁ బుణ్య చరిత్రల కెన్న దుష్కరం 
బడరునె వారి కుండునె దురాగత దుఃఖము లెన్నఁ డేని తా 
నడలక సత్యవంతునకు నాయు వొసంగెడు దార యైన యా 
పడఁతి నిజేశ్వరున్ యముని పాలికిఁ బంపి పవిత్ర యయ్యెనే                             42. 

అవిరళ మొనరించిన పా
ప వితతి నశియింప స్నాన భాగ్య మొసఁగుమా 
ప్రవిమల గంగా ధారా 
శవమా నా మనవిని విని సౌఖ్యం బిడుమా                                                     41. 
[శవము = జలము] 

సవనౌఘమ్ములఁ జేయ లేను దగ నీ సంకీర్తనల్ సేయఁ జా
ల వసువ్రాతము లీయ లేను దయ రా రమ్మంటి కావంగఁ గే
శవ నాపల్కుల విస్మరించితివ విశ్వత్రాత యాశింప శై
శవమా విన్నప మాలకించి దయతో సౌఖ్యంబుఁ గూర్పంగదే                                 40. 

ముంపఁగ నిరంతరం బను
కంపమునం దెల్ల జనులఁ గమనీయముగా  
నింపుగ రూపం బూనిన  
గంపలలో మోయఁ దగును గౌరవము బుధుల్                                                  39. 

పెంపు వర్ధిల మిక్కుటమ్ముగ వెల్గుచుండఁగ సద్యశ
స్సంప దౌఘము సన్నుతమ్ముగ సంతసమ్మునఁ బొందుచుం,  
బంపఁగాఁ దమిఁ బౌర బృందము వస్తు రాశినిఁ బ్రేమతోఁ 
గంప లందున మోయు చుందురు, గౌరవమ్మునుఁ బండితుల్                                38. 

నర్తకీ మణి యాడఁగ నాట్యముఁ బరి 
కించి నట్టి వారి నడుగ నెంచ జనుల 
మతము నాట నచ్చని యట్టి మనుజ వరులు  
కాకి యనఁ గొంద ఱయ్యది కేకి యనిరి                                                             37. 

సందియ మేల డెందమున శంకకు సుంతయు లేదు తావు సూ 
యెందును గాకి కోకిలకు నెల్లరు నంతర మంత నేర్వరే 
యందఱు ముక్త కంఠముగ నందురు దానిని కాకి యంచునే 
కొందరు కాకి యంచు మఱి కొందఱు కోకిల యంచుఁ బిల్వరే                                   36. 
[పిల్వరే = పిల్వరు కదా; నేర్వరే = నేర్వరా? నేర్తురు] 

చెలఁగి తగవులం బెట్టెడు 
ఖలు పెండ్లికిఁ బాక శాస్త్ర గణ్యులు వండం 
బలికె నొకం డిబ్భంగిన్ 
నలభీములు వండినారు నారదు  పెండ్లిన్                                                           35. 

వలయును వంట వా రనఁగఁ బంపఁగ నెన్నిక సేసి మిన్నగా 
నలునిని మించు వా రడరి, నా వచియించిన వారు వండఁగా 
నలవడు నయ్య యెట్టి రుచి యన్నఁ గరమ్ము శ్రమించి చేయ నా 
నలుఁడును  భీముఁడుం గలసి నారదు, పెండ్లికి వంటఁ జేసిరే                                    34. 
[కలసి ను + ఆరదు= కలసి నారదు; కలసిను = కలసి కూడ; ఆరదు = కలుగదు] 
“కలసి ను” ప్రయోగమునకుఁ బ్రమాణము: 
వాటువడి మూర్ఛవోయిం / బోటర దైత్యుండు దెలిసి....  ఉ. హరి. 4. 235.  
మూర్ఛ వోయిను + పోటర దైత్యుండు. – ప్రౌఢ వ్యాకరణము. శబ్ద. 116. 

చక్కగఁ బర్విడి యిక్కడ 
నక్కడ తిరుగాడుచుఁ దగ నాడుచు నగచున్  
వెక్కసముగఁ బసిపాపఁడు  
త్రొక్కఁగఁ బాదముల జనులు తుష్టిం గనరే                                                             33. 

రక్కసుఁ డాడ వేషమున రాసుతుఁ డర్మిలి నొక్క రొక్కరిం 
ద్రొక్కఁగఁ బాద యుగ్మహతి తోరపు నవ్విడుఁ జూచు వానికిం 
జక్కగఁ బెండ్లి వేళ సరసంపు వధూవరు లొక్క రొక్కరిం 
ద్రొక్కఁగఁ బాద యుగ్మహతి తుష్టి నొసంగదె చూచువారికిన్                                         32. 

ఇంటి పేరఁట కయ్యాల యింతి పేరు 
శూర్పణఖ యఁట వరుఁడు కస్తూరి వారి  
బిడ్డఁ డఁట చూడగం బుట్ట దొడ్డ ప్రేమ 
శూర్పణఖను వరించెఁ గృష్ణుండు మురిసి                                                                31. 

నేర్పరి యుద్ధ తంత్రముల నేరఁడు భీతి నెదన్ లసద్వపో 
దర్పుఁడు కాలకేయ కుల  తారకుఁ డుగ్రుఁడు కార్య కోటి యం 
దోర్పన లేని రక్కసుఁడు నుగ్ర తటిద్రసుఁ డందకత్తె నా 
శూర్పణఖన్ వరించె నఁట సుందర రూపుఁడు కృష్ణుఁ డయ్యెడన్                                   30. 
[కృష్ణుఁడు = నల్లని వాఁడు; తటిద్రసుఁడు = విద్యుజ్జిహ్వుఁడు] 

వేయి యేనుఁగుల బలము వెలఁది కొసఁగె 
నౌర పంకజ గర్భుఁడు కోరి నంత 
నారి రక్కసి తాటక, నసను దూఱఁ
జీమ, తుమ్మెను సింహముల్ సెదరె జడిసి                                                              29. 

వెడల నరుం డెదిర్ప పర వీరుల సంగర రంగ మందు మ్రోఁ
గ ఢమఢమధ్వనుల్ పుడమి  కాంతుఁడు సైంధవుఁ డేయ బాణముల్ 
దృఢముగ నిల్వ లేక కడు దీనులు పాండవు లైరి యక్కటా 
ద్రఢిమను జీమ తుమ్మఁగ బదాబదలయ్యె మృగేంద్ర సంఘముల్                                  28. 

లేరే త్రిదశు లనేకులు 
వార లగుదు రయ్య సాటి పద్మాక్షునకున్ 
నారాయణు నచ్యుతు మన 
సారా సేవింతు నేను సతతము భక్తిన్                                                                    27. 

వీరావేశము డెంద మందుఁ జెలఁగెన్ వీక్షింపు శ్రీమద్రమా 
నారీ రత్న మనోధినాయక హరీ నారాయణా సద్దయా
పారావార త్వదీయ నామ రసమున్ వైకుంఠ సంవాస వా
సా రా పాన మొనర్తు నేను సతమున్ సద్భక్తితోఁ బ్రీతితోన్                                           26. 

పచ్చ గడ్డి యెండిన గడ్డి నిచ్చి చొప్ప 
కఱ్ఱల నొసఁగ నింపుగఁ గతికి తనిసి  
రంజనమ్మున నడరుచు గంజిఁ గించి
దామ్లముం గ్రోలి గోవు పయస్సు నొసఁగె                                                                  25. 

ఆమ్లము సుంత క్షారము సమంచిత రీతిఁ జెలంగఁ బ్రీతి ద
ధ్యామ్లము గ్రోలి మర్త్యు లకటా యొనరింత్రు జనాపకారముం  
గామ్ల రుచిప్రవృద్ధమును గారవ మొప్ప నొసంగ సంచి తా
న్నామ్లముఁ గ్రోలి గోవు మధురామృత దుగ్ధము నిచ్చె దూడకున్                                    24. 
[అన్నామ్లము = గంజి; దధి+ఆమ్లము = దధ్యామ్లము; పుల్లని పెరుగు; 
కామ్లము = కొంచెము పుల్లన] 

ఒక్క టడుగుచుంటి నక్కజము సెలఁగఁ
జెప్పు మయ్య నాకుఁ దప్పకుండఁ 
జాల వింత గాంచ నేల యనుజుఁ డయ్యెఁ
జదువు రానివాఁడు శతవధాని                                                                              23. 

కుదరఁ గడింది దైవకృప గుప్త విధమ్ముగ స్వీయ భక్తిచే 
నుదరి గడింప జ్ఞానమును యుక్త విధమ్ముగ నిష్ఠ తోడుతన్ 
విదితుఁడు సంస్కృతాంధ్రముఖ విద్యల సుంతయుఁ గంటిచూపుతోఁ 
జదువగ రానివాఁడు తన జాడ్యత నయ్యె శతావధానిగన్                                             22. 

కూడు వెట్టదు కావ్యము గొప్ప దైనఁ 
జేరి వినరు పఠింపరు పౌరు లెవరు  
కవికిఁ గలికాల మందుండఁ గష్ట మౌటఁ 
గాకినాడలోఁ దక్కువ కవుల సంఖ్య                                                                          21. 

పవలు రేలని చూడకుండను వాఁగు చుందురు విన్న  నా
చెవులఁ జిల్లులు రేఁగు నట్టులఁ జెప్పఁగాఁ గడు చిత్రమే
యవును వాఁగఁగఁ గావు కావని యట్టి నోళ్లకు వేయఁగాఁ 
గవులు తక్కువ కాకు లెక్కువ కాకినాడ పురమ్మునన్                                                    20. 
[కవి= కళ్లెము] 

వృషభగతిరగడ. 
కవులు తక్కువ కాకు లెక్కువ కాకినాడ పురమ్మున నరయఁ  
దెవులె యంచును దలఁతు రెల్లరు దేహమందుఁ గవిత్వము వెలయ                                   19. 

తగ్గక యెప్పగిదిఁ గదియ 
ముగ్గురు నెగ్గుటకు నొక్క పోరున  బలిమిన్ 
బెగ్గడిలక రా నన్యుఁడు 
ముగ్గురిలో నొకఁడు రామి ముగురు మిగిలిరే                                                                18.  

ఎప్పటి వోలె యిట్టు లొనరించిన నొప్పున నిశ్చయమ్ముగాఁ 
జెప్పుడు నమ్మకమ్మునను శీఘ్రమ మీ రని యడ్గినంత వా 
రప్పుడు చింత సేసి యెద నన్నది యిద్దియె యేక కంఠులై 
"యొప్పగు" ముగ్గురున్, సుతుల నొక్కఁడు లెక్కకు రామి ముగ్గురే                                    17. 

నేరము దేవుని లీలలు 
దారినిఁ దగ నేఁగుచుండు తరుణం బందున్ 
మారుత పతాకపుఁ గఱకు 
దారము ప్రాణములఁ దీసె దారుణ రీతిన్                                                                      16.  

లేరు జగమ్మలం దడరి లీల నెదిర్ప సమర్ధు లేరు నన్ 
వీరు లటంచు భీతి నెద వీడి చరింప సదర్ప మంతలో  
మూరి హిరణ్య నేత్రుని సముద్ర జలమ్మున విష్ణుమూర్తి భూ
దారము దీసెఁ బ్రాణము లుదారత వీడియు దారుణమ్ముగన్                                              15. 

ఓర్పది లే దవగుణ పరి
సర్పిత నరలోక మందు జగ దభిమతముల్ 
మార్పులు నిత్య విసర్జిత 
దర్పమ్మును మించి లేవు దైవిక గుణముల్                                                                     14. 

కూర్పఁగ రాని దయ్య గుణ కోటి నరాళికి దీన లోక సం
తర్పణ సక్త మానసము ధర్మ గుణోద్ధర ణాప్రమేయ దై 
వార్పిత భక్తి తత్పరత యంచిత దాన గుణమ్ము వీత సం
దర్పము కన్న లేవు గద దైవికమౌ గుణముల్ జగమ్మునన్                                                   13. 

పురిటి నొప్పుల సైచుచుఁ బువ్వుఁబోఁడి 
కన్నులను మూసి బిగపట్టి కాయ మెల్ల 
నర్మిలిఁ బ్రసవ వేళలో నాత్మ లోన 
మగని మొగముఁ జూచి కనెను మగువ సుతుని                                                               12. 
                         
మగని మొగంబుఁ జూచి కనె మానిని యంధుని మూసి కన్నులన్ 
మగని మొగంబుఁ జూచి కనె మానిని రోయుచుఁ బాండు రోగినిన్ 
మగఁ డనఁ బూరుషుండె యిట మక్కువ మీఱఁగ శాంత చిత్తయై 
మగని మొగంబుఁ జూచి సుకుమారి సుతుం గనె లోక పూజ్యునిన్                                         11. 

తుష్యద్హృత్శంకరుఁ డా
యుష్యాల్పుఁడు సద్గురుండు నుదరి గ్రహించెన్ 
శిష్యులుగ నొజ్జలఁ బుడమి    
శిష్యుఁడు గురు వయ్యె గురులు శిష్యుం డ్రగుటన్                                                               10.  

శిష్యుండై బలభద్రు తోడుతఁ దమిం జిత్రమ్ము సుమ్మీ సద
న్వేష్యాచార్యున కిద్ధరిత్రి సదసద్వేద్యమ్ము బోధించె స
ద్భాష్యవ్రాతములన్ వచించి హరి పార్థా యంచు శ్రీకృష్ణుఁడే 
శిష్యుం డొక్కఁడు సద్గురుం డగు గురుల్ శిష్యాళిగన్ మారగన్                                                 9. 

ఔరా నీ పతి హరుచే 
నీ రయ్యె నఁట గద యొక్క నిమిషము నందున్ 
నారాయణి రమకుఁ, బలుక 
రా రతి! ముద్దు సుతుఁడు మకరధ్వజుఁడె కదా                                                                    8. 

రతి పతి సుందరాంగుఁడు లలాట విరాజిత నేత్ర దగ్ధుఁ డం
చిత సుర కార్య మగ్నుఁడును జిత్తజుఁ డంగ విహీనుఁ డౌర స
మ్మత మిది యెల్ల వారికి రమా సతి సంతత కేశ వార్చనా 
వ్రత రతి ముద్దు బిడ్డ మకరధ్వజుఁ డన్న విశేష మౌనొకో                                                         7. 

అన్యమ్మును జింతింపకు  
విన్యస్తం బగు జయమ్ము పిదపం దథ్యం 
బా న్యాయమునకు ముందుగ 
నన్యాయమె జయము నందు నవనీస్థలిపై                                                                          6. 

కన్యా భోగము లందు మగ్నుఁ డగు లంకా నాథుఁ డెల్లప్పుడున్   
మాన్యామాన్య వివేక శూన్యులకు ధర్మం బన్న దెందుండు రా
జన్యాశేష పరాజయార్థ మయి రక్షః పాలు రాజ్యమ్ములో 
నన్యాయంబె జయించుచుండు భువిలో హత్యా విధుల్ ధర్మమౌ                                               5. 

అక్షయముగ దశ దిశలును,  
నక్షత్రాధిపుని తోడ నభమున నెల్లన్ 
సుక్షయము గాఁగ దినమున 
నక్షర కౌముది, విరిసె నహస్కరు ప్రభలన్                                                                             4. 
                         
భక్షణ మెంచి హన్మ పసి బాలుఁడు పండుగ నెంచి సూర్యు వే 
యక్షర వీథి పర్విడిన నాగ్రహ మందక సద్దయా మతిన్ 
శిక్ష నొసంగ మారుతికి శీఘ్ర తరమ్ముగ శబ్ద శాస్త్ర ది
వ్యాక్షర చంద్రికల్ విరిసె నంబుజ నాథ మయూఖ దీప్తులన్                                                      3. 

తాఁకవు భిన్న ధృవమ్ములు 
వీఁకఁ జలుప యత్నములను విశ్వం బందున్ 
మా కేల నయ్య తగవులు 
‌మాకున్ మీకును గుదరదు మైత్రి నిజముగన్                                                                       2.   

కైకొండంచును మైత్రి నాఁ దనరు నిక్కన్యామణిం జూపఁగా 
మీకున్ లే కిఁక మాకు నొక్కరికె చుమ్మీ  సేవ కర్హం బగున్ 
వీకం బల్కిరి యిట్లు బంధువు లొగిన్ వేర్వేరుగాఁ గావునన్ 
మాకున్ మీకును మైత్రియే కుదర దమ్మా మైత్రితోఁ జెప్పితిన్                                                     1.