నిడ్సుల్ వెట్టకు గాడ్సే
గీడ్సే యని కపట రీతి గిర లిబ్భంగిన్
బుడ్సై పోదువు నరుఁడా
గాడ్సేయె మహాత్ముఁ డనెను ఘనుఁ డన్నదొరై 6.
[నిడ్సు = నిడుసు , పెద్ద ధ్వని; బుడ్సు = బుడుసు, సన్నము]
తొడ్సుల్ లేని విధమ్ము వాక్కు లన సంతోషమ్ము వాటిల్లునే
గడ్సుల్ గాక పరుల్ వచింతురె యిటుల్ కాఠిన్య వాక్యమ్ములే
యడ్సుం జల్లఁగ నేల నేత పయి నన్యాయమ్ముగా నివ్విధిన్
గాడ్సే కన్న మహాత్ముఁ డెవ్వఁడని వ్యాఖ్యానించె నన్నాదొరై 5.
[తొడ్సు = తొడుసు, సంబంధము; గడ్సు = గడుసు; అడ్సు = అడుసు]
విధ్వంసకారి రణమున
విధ్వంసక వీర రిపుల వీరత్వమునన్
విధ్వంస కాభిమన్యుఁడు
విధ్వంసముఁ జేయఁ బొగడె విశ్వం బతనిన్ 4.
వ్యధ్వమ్ముల్ నశియించె బాల్యపు వివాహమ్ముల్ క్షయించెం గదా
సాధ్వీ రత్నము భర్తతోఁ జన దహో చావంగ జీవించు నేఁ
డధ్వర్యమ్ములఁ జంపరే నరుల మూఢాచార భావమ్ములన్
విధ్వంసమ్మును జేసె మానవుఁ డహో విశ్వమ్ము గీర్తింపఁగన్ 3.
ఆహా దార కిడె నెడమ
దేహము పంచాననుండు తృప్తుండై సం
దేహము తగదయ్యా యర
దేహము లేనట్టి వాఁడె తేజోమయుఁడౌ 2.
ఊహ కెఱుంగ రాక సకలోచ్చ చరాచర రమ్య జీవ సం
దోహ నిజాంతరంగములఁ దూఱి వసించు సహస్ర మూర్ధుఁడే
మోహ మొకింత లేక యెదఁ బుష్కర నాభుని యున్కి పైన సం
దేహము లేని వాఁడె ఘన తేజము నంది వెలుంగు నంతటన్ 1.