21, అక్టోబర్ 2015, బుధవారం

శ్రీరామ స్తోత్రము


శ్రీరామ స్తోత్రము
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు.)

ద్విపద మాలిక :

శ్రీరామ రఘురామ సితదామ రామ
కారుణ్య వననిధీ కాకుత్స్థ రామ
జానకీవల్లభా జనలోక రక్ష
దానవ భంజనా ధరణీశపుత్ర
సీతా మనోహరా శివచాప భంగ
దాతాగ్రగణ్యేశ దనుజేంద్ర దమన
తాటక సంహార తారక రామ
పాటవ ధీశాలి పరమాత్మ రామ
సత్యపరాక్రమ శత్రుసంహార
భృత్యాను కంపన పిశితాశనారి
కోసల క్ష్మాభర్త  కోదండ రామ
కౌసల్య నందనా కౌశిక శిష్య 
కౌశికు యాగము గాచితి వీఁక 
నీ శర సంపద నిగ్గును జూపి 
జానకిఁ జేపట్టి సంతోష మడర 
మౌని దర్పము నెల్ల మాయము సేసి  
యువరాజ పదవిని నుదరి గైకొంటి 
సవతి తల్లి  యనుపఁ జాగితి వనికి 
రక్కస బెడదను లయ మొనరించి 
చక్కఁగ మునులకు శాంతి నొసంగి 
పడతి కోరికఁ దీర్ప వనినిఁ జెలంగి 
పుడమి పట్టినిఁ బాసి పొగిలి కరమ్ము 
అడవినంత వెదకి యనుజుని తోడ
వడి శబరినిఁ గాచి కడు దయ తోడ 
పంపను సుగ్రీవు వానరేంద్రుఁ గని 
చంపి వాలిని వాని కింపు నొసంగ  
కోఁతి మూకను గూడి నాతి కొఱకయి 
కూఁత లడర దాఁటి ఘోరార్ణవమ్ము 
రావణుని వధించి రాక్షస నాథు 
చేవ మీఱఁ గరము చెలిని గ్రహించి 
చేరి యయోధ్యను శీఘ్రమ్ము గాను 
నీ రాజ్య మేలితె  నెమ్మి నొసంగ 
దశకంఠ సంహర్త దాక్షిణ్య మూర్తి
దశరథ నందనా దయజూడు మమ్ము 1


రామ! భవాఘ విరామా!
శ్యామల తను రుచి లలామ! సద్గుణ ధామా!
రామా! సత్య పరాక్రమ!
భామావనిజ హృదయాబ్ధి భాసిత సోమా! 2

రఘు వంశాబ్ధి శశాంక! కోప జిత పారావార! కోదండ పా
ణి! ఘనాకార విరాజితా! కపి వరానీకైక సద్రక్షకా!
యఘ దూరీ కృత భక్త సంచయ! దశాస్యప్రాణ విధ్వంస! సూ
ర్య ఘృణివ్రాత నికాశ సద్విమల దేహా! రామ! సీతాపతీ! 3

ఇక్ష్వాకు ప్రవ రాబ్ధి పూర్ణ శశి దైత్యేంద్రక్షయార్థైక జ
న్మ క్ష్వేడా స్వన సత్య వాక్చతుర సంభావ్యుండు ధానుష్కుఁడున్
సక్ష్వింక వ్రజ భాను సూన సఖుఁడున్ సద్ధర్మసత్పాలుఁడున్
సుక్ష్వేళాత్త గళాంబికా పతి దయాంశు శ్రేణి లబ్ధుండు ప్రా
ప్త క్ష్వేళీ ద్విష పుంగ వానురతినిం  బ్రార్థింతు సీతాపతిన్ 4

మందాక్రాంతము.
ఇక్ష్వాక్వంభోనిధి సిత నిశీథేశ సంకాశ మూర్తిన్ 
సుక్ష్వింకానీక ధవ రవి సత్సూన సంభావ్య ధీరున్ 
భిక్ష్వామ్నాయప్రముఖ శివ సంప్రీత ధానుష్క వీరున్ 
స్విక్ష్వత్యుగ్రాస్త్ర ధర నిభు నే నింపుగం గొల్తు రామున్ 5

ఇన వంశార్ణవ పూర్ణచంద్ర నిభ మత్తేభేంద్ర సంచార మో
హన నీలద్యుతి భాసి తావయువ సత్యద్యోత దుర్విక్రమా
వన కార్యైక సునిశ్చయాత్మక లసద్బాణాసన స్కంధ సా
వనిసంజాత సలక్ష్మణ స్థిత సుదుర్వైరిఘ్న రామా నుతుల్ 6

ధరకన్యామణి హృద్వనాంతర లసత్కల్పద్రుమా  రాఘవా 
వర రాజన్య విరాజమాన రవి సద్వంశాటవీ కౌముదీ 
దురభిక్రాంత సురారి ఘోర గిరి సందోహైక నిర్ఘాతమా 
హర పద్మాసన శక్ర దేవగణ నిత్యారాధ్య రామా నుతుల్ 7

గుణ సంసిద్ధ సదా విరాజిత మహా కోదండ హస్తాంబుజా! 
గుణ సంధాన పరాక్రమ ద్యుతి మహాకోదండ విధ్వంసకా!  
క్షణి కోద్రేక మహీసు రార్చిత మహేష్వాస ప్రభా  గ్రాహకా!   
రణ విచ్ఛేదిత దైత్య సంచయ! విభూ! రామా! మముం గావుమా 8

నీలాంగ ద్యుతి పుంజ నిర్జిత చలన్నిర్భేధ్య పర్జన్యమా! 
వేలాక్రాంత యశః పయోధి! కృత నిర్వీ ర్యోగ్ర  రత్నాకరా!  
లీలా మానుష రూప సంచరిత కేళీ ఖండితాస్య వ్రజా! 
బాలా భూమిజ హస్త పూజిత పదా! పాలింపవే రాఘవా! 9
[ఆస్య వ్రజుఁడు= ముఖ సమూహములు కలవాఁడు, రావణుఁడు] 

కమల విలసితము:
దశరథ తనయ సదమల చరిత్రా
కుశలవ జనక సుగుణ గణ ధామా
శశినిభ ముఖ హరి సదృశ సుమధ్యా
దశశిర విదళన ధరణిజ నాథా 10

నారాయణ వృత్తము.
నీలి మేఘశ్యామ రామ
వాలి జీవధ్వంస భీమ 
లాలితోత్సంగస్థ సీత 
జాలి చూపించంగ రావ!            11

నేరము లెంచకు చూపుమ 
తీరము ఘోరపు భవముల దింపకు రామా 
కోరెద నీ పయి భక్తియ 
తోర మఘలతా లవిత్ర తోయజ నేత్రా                                                    12
      
సీతా దేవి స్తోత్రము:
సమ దా ళ్యావలి పాఱెఁ గాంచి లలనా శ్యామాలక శ్రేణులం  
గమనీ యాబ్జము లప్పు దూఱె నరయం గాంతా ముఖాంభోజముం 
దిమి వేశ్మమ్మున దాగె శంఖములు దొంతిం గాంచి తద్గ్రీవముం 
దమి యేపారఁగఁ గాంచి లే ళ్ళుఱికె సీతాదేవి కందోయినే 1

సంపూర్ణ బతుకమ్మ పాట

సంపూర్ణ బతుకమ్మ పాట

(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు.)

ద్విపద మాలిక :

శ్రీగౌరి బ్రతుకమ్మ సిరు లీయ రావె
మా గౌరి వోయమ్మ మన్నింపు మమ్మ
ఇంపార మాయింటి యిలవేల్పు వమ్మ
సొంపారఁ జక్కఁగఁ జూడఁగ రావె
వెత లన్ని వాపఁగ వేగంబ రావె  
బ్రతుకమ్మ బ్రతుకమ్మ బంగారు తల్లి
మాయమ్మ దుర్గమ్మ మముఁ గన్న తల్లి
ఆయమ్మ బ్రతుకమ్మ నర్చింప రమ్మ
తంగేడు గుమ్మడి తామర సుమలు
బంగారు గునుగును వామనె విరులు
కమనీయమౌ గడ్డి కనువిందు కట్ల 
రమణీయమౌ దోస రమ్యపు బీర  
చేమంతి పూబంతి చెంగల్వ పూలు
భామ లందఱు సేరి వాలుగఁ బేర్చి
పసుపు గౌరినిఁ జేసి  వానిపై నుంచి
వసుధను దంబల ప్రభల నీయంగ 
నెలఁత లందఱు గూడి నృత్యమ్ము లాడి
పలుమారు కీర్తించి పాటలు పాడఁ 
గత లన్ని వింటిమి  కారుణ్య మూర్తి 
బ్రతుకమ్మ సద్దుల బ్రతుకమ్మ బ్రతుకు
కుదురుగ నిత్యమ్ము కొలుతుము నిన్ను
కదలిరా బ్రతుకమ్మ కాపాడ మమ్ము. 

8, అక్టోబర్ 2015, గురువారం

గణేశ స్తుతి

శ్రీ గణేశాయ నమః


సకల క్ష్మాజన సంత తాదిమ వ రార్చా పాత్రు విఘ్నేశ్వరున్ 
సక లాదిత్య గణార్చనీయ ఘన రక్షా దక్షు హేరంబునిన్ 
సక లాటంక మహీరు హోత్కర లతా స్తంబఘ్ను ద్వైమాతురున్  
సక లా ఘాగమ కోటి వజ్రు గొలుతున్ సద్భక్తి హస్త్యాననున్                            15

విఘ్నాధిపత్య ధుర్యా !
విఘ్నచ్ఛేదన నితాంత  విద్యా! భక్తో
పఘ్నా! భవ సంచిత పా
పఘ్నా! భగ్నైక దంత! భవకాయఘ్నా                                                    14

కరిమూర్ధా! శివవక్త్రా! 
హరి వరయజ్ఙోపవీత! హత విఘ్నాలీ! 
వర మూషికేంద్ర వాహన! 
గిరిజా హస్తాబ్జ భూత! గేయస్తుత్యా!                                                                     13

శశ్వత్కృ తాఘ హర! వి
శ్వేశ్వర కర దత్త మూర్థ! హేరాంబా! నా
నైశ్వర్య దాంతరాయ
ఘ్నేశ్వర! రక్షింపు మయ్య యిభ వక్త్రాంకా!                                             12

విఘ్నారణ్య కుఠార! భక్తజన దుర్భే దావనీ వాస పా
పఘ్నా! నిర్జర పూజితాంఘ్రి యుగ! దుర్వా రోగ్ర దుర్దాంత శ
త్రుఘ్నోదార దయా రసామృత మహోత్తుంగాత్మ! షడ్వక్త్ర గ
ర్వఘ్నా! విఘ్నపతీ! నుతింతు నిను గాపాడంగ రావే దయన్                              11 

కైలాస గిరిలోన కమనీయ కాత్యాయనీ సతీ కల్పిత నియమ బద్ధుఁ
గర్తవ్య దీక్షా విగత శీర్షుఁ గరుణార్ద్ర పురహర కల్పిత కరి వరాస్యు 
బ్రహ్మాది నిర్జర వ్రాత సంకల్పిత భీకర దుస్సహ విఘ్ననాథు  
మోదక ఖాదన మోద విహారు విభాసిత మూషిక వాహన వరు
సురనదీ సతీ సుశోభిత నందను
మాన్య నాగ సూత్రు మంద హాసు 
భవ్య శూర్పకర్ణు వర కుమార గురువు
నిత్య మేను గొల్తు భృత్యు భంగి                                  10
 
వ కార నిషిద్ధము:
అంతరాయమ్ముల నన్నింటి మరల మరల నాపు నిన్నేను గొలిచి కొలిచి 
యాద్యంతములు లేని హృద్యంపు నీరూపు లలర నలర మదిఁ దలఁచి తలఁచి 
యాగ మోక్తములైన యద్భుతాఖ్యలఁ దనియ తనియ నేరక యఱచి యఱచి 
తొండ మేక రదము తోరపు బొజ్జయు చోద్యము చోద్యము సూచి చూచి 

మూషిక రథముఁ గని కని మురిసి మురిసి 
కుడుము లమర నమరఁ గాంచి కులికి కులికి 
దినము దిన మేను నుతియింతుఁ దేఱఁ దేఱ
బొజ్జ గణపయ్య రక్షించు మూరి మూరి                              9

పర్వత రాజసు తాత్మజ 
సర్వ ప్రత్యూహ హరణ సన్నుత దేవా 
యుర్వీ జన నిత్యార్చిత 
దుర్వార గణాధినేత తొలుతను గొలుతున్                                       8

ఆటంకపు గమి కడిదమ! 
పాటవ జిత కార్తికేయ! వారణ వదనా!
ఘోటక మూషిక! నిర్జర
కోటి వినుత పాదపద్మ! కోటి ప్రణతుల్                                7

ఉరువిఘ్న వినాశక! శుభ
కర! వక్రకర! శశివర్ణ! కాకోదర సూ
త్ర! రజత నగాధిపాత్మజ!
కరుణాంతఃకరణ! మమ్ము గావఁగ రావే                                                                      6

కైలాసంబున నుండి భూగతి సుసౌకర్యంబునం జేసితే
ఫాలాక్షభ్రమణక్రియా రతుఁడవై పాపఘ్న! విఘ్నేశ్వరా!
లీలానింద్య వరోందు రాంగన! సుకాళింగాస్య! లంబోదరా!
శైలేంద్రాత్మజ నందనా! శరణయా సర్వామ రైకాధిపా!                                                     5
[ఉందురము = ఎలుక; అంగనము = వాహనము; కాళింగాస్య = ఏనుగు 
ముఖము కలవాడు ]
ధవళాంబర ధరుని సకల
భువనవ్యాపి శశివర్ణు భుజ చత్వారిన్
సువికసిత ప్రసన్న వదను
ని విఘ్న రాహితికి మదిని నిత్యము దలఁతున్                                                             4

వినయాంజలి నే దలఁతున్
వినాయకుని వక్రతుండు విఘ్నేశ్వరునిన్
మునిగణ సేవితు హరసుతు
ఘన మోదక హస్తు మూషిక రథ విలసితున్                                                                3


మూషిక వాహనంబు నట మోదక పాణివియై యపార సం
తోషము పైఁగొనన్నడువ దుష్టుఁడు సోముఁడు జూచి నవ్వఁగన్
దోషికి శాప మీయఁగను దుష్టుఁడ వైతివి విఘ్నభీరు న
న్శోషుని గావు మయ్య మది సూక్తుల గొల్తును విఘ్ననాయకా                                           2

హరసుత గజశిర లంబో
దర విఘ్నేశ్వర నగసుత దనయ దురిత సం
హర మూషిక వాహన సుర
వర సన్నుత గై కొనుమివె వందన శతముల్                                                                   1

పద్యాలు -2

అష్ట నాట్య దిగ్గజాతివలు భరత
నాట్య కోవిదులు సునయనలు నతి
సుందర వదనులును సుశ్రోణులువివిధ
భంగిమల నలరిరి భామలిపుడు 1

విద్యయను ధన మొసఁగును విశ్వ కీర్తి
విద్య దానమీయ పెరుగు వింత గొలుప
విద్య యొనగూర్చుజనులకు వినయ ధనము
విద్య యొసగుగద సకల విత్త ములను 2


3, అక్టోబర్ 2015, శనివారం

శివ స్తుతి

శివ స్తుతి
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు.)


దంభంబు విడిచి నే సం
రంభంబున వేడుకొందు రాజమకుటునిన్
గంభీర గరళ కంఠున్
శంభుఁ ద్రినేత్రు గిరిజేశుశంకరు నీశున్ 1

దంభము వీడి నేఁ గొలుతు దానవ ఖండన ఖేలనాతి సం
రంభుని, దక్షయజ్ఞ పరి రక్షణ శిక్షణహేతు భూతునిన్  
స్తంభిత జాహ్నవిన్ , వికట దండధ రోద్ధత  దర్పహంతకున్
శంభుని, ఫాల నేత్ర తట సంజని తానల దగ్ధ మన్మథున్   2

శంభుఁ డిందు మౌలి శంకరుఁ డీశుండు 
నీలకంఠుఁ డసమ నేత్రుఁ డజుఁడు 
త్రిపుర వైరి శివుఁడు  దేవ దేవుండు కు
మార జనకుఁ దలఁతు మార వైరి.                                          3

వందన మాచరింతు మదిఁ బర్వత రాజ తనూజ భర్తకుం
జందన భస్మ గంధ పరి సర్పిత గాత్రుఁడు చంద్ర మౌళికిన్ 
నందిత భృంగి శృంగి వర నంది పిశాచ గణాధి నేతకున్ 
సుందర ఫాల నేత్ర పరిశోభిత వక్త్ర పినాక పాణికిన్.                        4

శ్రీశైలాగ్ర తటీ స్థ పుణ్యజన సంసేవ్యుండు మల్లన్ననుం 
గాశీక్షేత్ర విరాజితున్ శివుని ద్రాక్షారామ భీమేశ్వరున్ 
రాశీభూత దయా పయోనిధిని సద్రామేశ్వ రాఖ్యున్ భవా
నీశానీ కర పూజి తాంఘ్రియుగ దేవేశున్ భవున్ వేడెదన్                 5

హరహర! మహా సురా! హిమ
గిరివరవాస! నటరాజ! గిరిజానాథా!
పుర త్రయ హరా! దయాకర!
సురాపగా జూట ధీర! సుందర! ప్రణతుల్                                     6

మూర్ధ విరాజిత సోమున్ 
దుర్ధర్షాభీల గరళ దోషిత గళు నా
యర్థేశ సఖుఁ దలఁతు వా
మార్ధ స్థిత శైలసుత నుమాశంకరునిన్                                         7

ఆకాశ గంగకు హద్దులు సూపించి నడినెత్తి నుంచిన జడల ఱేఁడు
నగరాజ కన్యకు సగభాగ మిచ్చిన యర్ధ నారీశ్వరుం డంద గాఁడు
గజ దైత్యు కోరిక కరుణించి తీర్చిన జగ దభి నుత గజ చర్మ ధారి
శరణాగతుండు శశాంకుఁ గాచిన మేటి సౌజన్య మూర్తి యా చంద్రమౌళి
గరళమును మ్రింగి జగములఁ గరుణఁ గాచె
హద్దు లవి లేవు వరముల  పద్దు లందు
దుష్టుఁ డైనఁ గాచు పొగడ్త నిష్టుఁ డైన
హరుని గుణముల నెంచఁగఁ దరమె జగతి 8

హరి వాగీశాదిగ సుర
వర గణ సేవిత వధువును వరునిం గనుఁడీ 
దురితౌఘ హరము ఘన శుభ
కరమ్ము గిరిజా పురహర కళ్యాణ మిలన్                                                9     

ఇల్లరికపు టల్లుఁడు మఱి
మల్లుం డట వల్లకాటి మదనాంతకుఁడే
విల్లంది పుర త్రయముం
దల్లడిల మరల్చె యమ సదనమునకు సెలన్            10

వసంతతిలకము:
విశ్వేశ్వరుం బ్రమథ వీర గణాధినేతన్
శశ్వద్వరప్రదుని శంకరు సాంబమూర్తిన్
విశ్వాత్ము భా గసమ వీక్షణు నీలకంఠున్
సుశ్వేత శైలతట శూలినిఁ గొల్తు భక్తిన్                                            11

పరమోత్కృష్ట విలాస తాండవ సనిస్వానాద్రి సంచారముల్
గిరి కన్యా కర సారసద్వయ సు సంకీర్ణప్రకాశమ్ములున్
శర ణాకాంక్షిత మౌని హృద్విపిన సంచారంపు శీతాంశు శే
ఖర పాదమ్ముల సేవ మానవులకున్ గళ్యాణముల్ గూర్చుతన్ 12

కైలాసాగమ నిత్య నర్తన లసత్కాత్యాయనీ కేళి లీ
లాలో లాది వినోద తోషిత మనోల్లాసప్రభా విగ్రహా!
కాలాలోకన దగ్ధ మన్మథ! పురాకా రాసురఘ్నా! శివా!
ప్రాలేయాంశు విరాజమాన వర మూర్ధా! శంకరా! కావవే                                13
   
మానిని.
రుద్రుఁడ వీవని రోషుఁడ వంచు విరోధు లనంగ విరుద్ధ మయా 
యద్రి సుతార్చిత! యంగభవారి! మహాక్షయ కారక హాలహ లా
భద్ర వినాశక! పన్నగ భూషణ! బ్రహ్మ సురార్చిత! పాపహరా!
భద్ర మొసంగుమ పన్నుగ మాకిల భక్త వశంకర! పంచముఖా! 14.

మానిని.
ఈధర నందున నింపుగ లోకుల నెల్లరఁ బ్రోవు మహేశ నభో 
వీధి విహారివి వేమరు గొల్తును విశ్వవిధాయక! పింగళ! నీ
గాధలు గాంచ యగాధము లయ్య వికారము గల్గె నఖర్వము నా 
బాధలు దీర్చి కృపానిధి! కావవె భక్త వశంకర! పంచముఖా! 15.

మానిని.
నిర్జర సంచయ నిత్య సమార్చిత నిర్గుణ భాసిత నీలగళా 
దుర్జయ దోర్బల దుష్టపురత్రయ దుస్స్థితి కారక దుఃఖహరా 
దుర్జన మానస దోషగుణాంతక ధూర్జటి నామక దుర్గ ధవా 
భర్జిత తర్జిత పామర రక్షక భక్త వశంకర! పంచముఖా! 16.    

దైవ గణార్చిత దండధ రావన దైత్యవ రాధిప దర్ప హరా 
గ్రీవ విషంధర కీలి విలోచన కీర్తిత రాజత గేహ శివా 
భావజ విగ్రహ భర్జన భాసిత పన్నగ భూషణ పాప హరా 
పావన మూర్ధ నివాసిత వాహిని భక్త వశంకర! పంచముఖా! 17

శైల నివాస విషఘ్న విశారద శైల సుతార్చిత సాంబశివా 
కాల విరోధక కామ వినాశక కామిత దాయక కాలగళా 
శూల వరాయుధ సూరి జనావన సుక్రతు నామక శూర వరా 
ఫాల సులోచన భైరవ దండము భక్త వశంకర! పంచముఖా! 18

మానిని.
నీ దగు పాదము నెత్తిని నుంచుచు నిత్యము గొల్తును నిక్కముగా 
నీ దగు మూర్తిని నెమ్మదిఁ గైకొని నెమ్మినిఁ గాంచుదు నిక్కముగా 
నీ దయఁ గోరుచు నేనిల భక్తిని నిన్నె దలంతును నిక్కముగా 
వాదన లేలయ భారము నీదయ భక్త వశంకర పంచముఖా 19.

కవిరాజ విరాజితము. 
కర మనురక్తినిఁ గావుమ శంకర కాలుని బాధలు ఖండములై 
పరఁగెడు రీతినిఁ బన్నుగఁ గొల్తును భక్తిని నిన్నిఁక భస్మతనూ 
గురువుగ నెంచితిఁ గూర్మి వహింపుము గోపతి నాపయిఁ  గొండ దొరా 
పరువపు భాగ్యపు వాపును బాపుమ భక్త వశంకర పంచముఖా 20.

కవిరాజ విరాజితము. 
కలవర మొందితిఁ గష్టపుఁ దోయధిఁ గానక త్రోవను గామహరా 
విలవిల లాడితి వేగమ కావవె భీషణ! భక్తుని విశ్వపతీ 
చలిమలచూలికిఁ జక్కటి భర్తవు సన్మతి నీయవె చంద్రధరా 
వల దిఁక నాకిట బంధపుఁ బాశము భక్త వశంకర పంచముఖా 21. 

కవిరాజ విరాజితము. 
ననుదయఁ జూడుమ నంది సువాహన నాట్యవిహార యనాథ ధవా 
మనమున నిన్న యుమాపతి నమ్మితి మంచుమ నన్నిఁక మంచిగ నే
ననయము చిక్కితి నాపద లందున నాత్మను నిల్పితి నంబపతీ 
పనిగొని కొందఱు బాధల నిత్తురు భక్త వశంకర పంచముఖా 22.

కవిరాజ విరాజితము. 
సగ తను వందున సత్సతి నుంచితి చక్కఁగ నిత్యము సాంబశివా 
మగువను గంగను మానుగ నెత్తిని మాతను నుంచితి మారహరా 
వగలను మాన్పుమ భక్తుఁడ నైతిని పన్నుగ నీకిలఁ బాంశుధరా 
పగలను వీడితి వైరుల యందున భక్త వశంకర పంచముఖా 23.

ప్రేత భూ సంచారి రిక్తాంబరుండు త్రినేత్రుండు వరదుండు నిత్య శుభుఁడు 
భస్మ చందన దేహి ఫణివృత  బాహుండు శీతాంశు జాహ్నవీ శేఖరుండు 
నలి జటాజూటుండు నమరారి బంధుండు నత నిర్జర గణుండు సిత తనుండు  
నట నానురాగుండు పటు విషగ్రీవుండు  నాదిభిక్షుం డభయ ప్రదుండు 

ప్రమథ నిచయ భూతప్రేత పాలకుండు
నస్థి మాలి కర కపాలసుస్థిరుండు
నశుభ దృశ్య మాన నిరంతర శుభ దాయ
కుండు నా విశ్వనాథుని  రండు కొలువ                          24                              

విద్వన్మండల హృత్సరోజ విలసద్విఖ్యాత కీర్త్యంగనా 
చిద్వైచిత్ర్య తనూ విలాస కరు ణాశ్లిష్టాత్మ భక్తాళి రా
జద్వైశిష్ట్య గుణోత్క రాగుణ గణ క్షామాంతరంగ ప్రభా 
యుద్విగ్నార్త జనావ నైక రత సద్యోరక్ష శూలీ నతుల్ 25

దుర్వారాసమ నేత్ర సంజనిత సద్యో వహ్ని భస్మాంగజా 
గర్వోద్రిక్త పురత్రయాసుర మహాకాయాసు విధ్వంసకా 
నిర్వీర్యీ కృత కాలకూటవిష సన్నిక్షిప్త కంఠప్రభా 
శర్వా శంకర పార్వతీధవ హరా శాంతించి కాపాడుమా 26

ఫణిభూషణ! శివ! విష మే
క్షణ! గగనాంబర! మనో వికాసిత కాంతా 
మణి భాసిత వామాంగ! క
రుణా విలోకన! స శశి శిరో గత గంగా! 27

ఛన్న సధగద్ధగద్జ్వల 
సన్నిట లాంబక! ధిమిధిమి చయ నిర్ఘోషాం 
చన్నటనాంఘ్రిద్వయ! విల
సన్నాగాభరణ కంఠ! సర్వజ్ఞ! నతుల్ 28 

ఫాలాంతర్గత నేత్ర కీర్ణ సుమహాజ్వాలా విధగ్ధాంగజా!
నీలగ్రీవ విరాజమాన! విలసన్నృత్యప్రియై కాత్మ! లో
కాలోకాలి వివర్ధితాంగ! రహితాద్యంతప్రభా వైభవా!  
వేలాక్రాంత దయారసార్ణవ! హరా! విశ్వేశ!  రక్షింపుమా      29 

నీల గళమ్ము నీల రమణీయ నభస్స్థల సన్నిభమ్ము గా 
ఫాల తలమ్ము సుజ్వలిత భాస్కర మండల దీప్తిమంతమై 
చేల వరమ్ము కుంజర వశీకృత మానస దర్శనమ్ము గాఁ 
గాల ఫణీంద్ర భూషణ! జగమ్ముల వెల్గెడు నీకు మ్రొక్కెదన్      30

దొడ్డవరాన బిడ్డలను దొడ్డ మనమ్మున గడ్డుకాలమం 
దడ్డము లడ్డగించి యల యడ్డ మెఱుంగని యెడ్డు నెక్కి నీ 
వెడ్డెము లెన్ని పడ్డఁ బయి నింపుగ వడ్డన సేసి దుడ్డులన్ 
గొడ్డుఁదనమ్ము వాపి మఱి గుడ్డ లొసంగి గిరీశ! కావవే                              31 

2, అక్టోబర్ 2015, శుక్రవారం

పద్యాలు 3


నన్నయ గారి ఉత్ఫలమాల కు తేటగీతి పద్యము:
మనము నవనీత తుల్యము మాటలు గన
దారుణాఖండలాశని ధారలు సుమి
విప్రులకు విపరీత ముర్వీశుల కును
ద్విజు డెఱుగు శాప నిహతి భూవిభు డెఱుగడు                              73

అందమైన మిరప కాయలు గల మొక్క:
ఇంపు గొలుపు కెంపుల వ
ర్ణంపు మిరపకాయ సొంపు లరయంగన్నా
వెంపు హరితంపు పెంపున
గుంపీ వైపుఁ గనువిం దగుచు విలసిల్లెన్                                        72

అంశం... చలి”:
సీ. ఉత్తర దిక్కున నుహుహూ యనం జలి గాలులు వీచెను గాఢముగను
    రాత్రులన్ని బహు దీర్ఘంబయి తరిగెను బవలు లంబరమణి పాఱఁ జలికి
    శంభుని ఫాలమం దంభుధి గృహమేధి యిండ్లను త్రేతాగ్నులిరికె బెదరి
    సతుల త్రిమూర్తులు సంగతి వదలరాయే శీత లార్తిని నెంత నరులు       71

ఆ.వె. వీధి వీధి వెలగె వెచ్చని మంటలు
       గుంపు గుంపులు జను లింపు గొలుప
       ముద్దుల మురిపెంపు ముచ్చట లాడుచు
       నంత కాగిరి చలి సంతసమున                                              70

దినదినము గండ మాయెను
జనమేజయ గురునికి ముని శాప భయమున
న్ననిశము శుక యోగీంద్రా
ననోద్ధితము హరికధా నినద పరితుష్టున్                        69

ధీరత్వంబున శునకము
పౌరగమన నియమ సుపరిపాలన నియతిం
గోరిన ప్రభుత్వ మిచ్చెనొ
గౌరువ మొప్పగఁ గనుండు గ్రామహరీశున్                     68

యేసు క్రీస్తు జనన సన్నివేశము:

అచిరద్యుతి సదృశామల
రుచినిచయము కందర తటి లోలిత గతినిన్
ప్రచరింప నేగి తారా
నుచరులు గాంచి రట క్రీస్తు నుత్సాహముగన్                     67

సీతాకోక చిలుక వర్ణన:

కమనీయ వర్ణ సముదా
యము నన్నలరుచు ఛదద్వ యాకర్షణ వి
భ్రమ, సీతాకోకచిలుక,
సుమ మకరందాశను గన చోద్యంబాయెన్                                   66


ఇంతలు గన్నులుండఁ దెరు వెవ్వరి వేడెదు నిర్భయంబుగన్
వింతగఁ దోచు చున్నది వివేక విహీనుడవై చరింపగన్
సుంతయు భీతి సెందక విశుద్ధ చరిత్రులఁ బెద్దవారలం
బంతము బూని నిందలిడి ప్రాణము మీదికి దెచ్చుకొంటివే            65

ఇంతలు గన్నులుండఁ దెరు వెవ్వరి వేడెదు బ్రాహ్మణోత్తమా
వింతగఁ దోచు చున్నది వివేక విహీనుడవై చరింపగన్
సుంతయు భీతి సెందక విశుద్ధ మతిన్ హిమశైల సానులన్
గాంతల నేకతంబ పలుకంగ నెపంబున గాక నేమనన్                  64


చింత కాయల గుత్తి యున్న చిత్రమును చూచి:
చూలాలుల కిష్టం బట
మేలగు తీయని పులుపుల మేళపు రుచులన్
వీలుగ గింజల తోడన్
బాలిక లాడుదురు గూడి పరమప్రీతిన్:                                    63

పత్రమునఁ జిత్రము కడు వి
చిత్రముగన్ నేత్రములకు చిత్తంబునకుం
జిత్రానుభూతి నిచ్చి ప       
విత్రానందము నొసంగె విస్తారముగన్                                            62


కటకట యెంతమాట ననుఁ గాదని యాతఁడు నొక్క మానవున్
చటుల మనంబు తోడ నొక శౌర్యవిహీనుని  రాజ్యదూరునిన్
పిటుకని రాము దా శరణు వేడె విభీషణుడంచు నెంచె న

క్కట దశకంఠు డెట్లెఱుగు ఖండిత శాత్రవ గాత్రు రాఘవున్         61

హృత్పద్మము వికసించును
మత్పూర్వభవాదులన్న మర్చిన యేకిం
చిత్పుణ్య విశేషమున భ
వత్పద పద్మములు గనిన పన్నగదమనా                          60 

ఇడుములు వచ్చును పోవును
వడివడి మబ్బులట నింగి వచ్చిన భంగిన్
పటుతర వాయు నిభ ధృతిన్
జటిల సమస్య లవలీల  సన్నగిలునిలన్                             59

కలిమి వివేకశీలురకుఁ గల్గఁగఁ జేయునపార కీర్తినిన్
చెలిమిని దానధర్మము లశేష దయాగుణ రక్తిఁ జేయగన్
కలిమి వివేకహీనులకుఁ గల్గఁగఁ జేయు నపార దర్పమున్
మలిన మనస్కులై విభవ మత్త విచేతను లౌదు రందఱున్           58 

పశుసుత పత్న్యాదులఁ బర
వశులై మోహాంధకార బద్ధులు నరులున్
విశదమ ఋణానుబంధము
పశమింపం జనుటలెల్ల బాంధవ్యములున్              57

కందిపప్పు చారు కటువయ్యెరా రామ
వెలసె నిపుడు వివిధ పిశిత పాక
రాజ భక్ష్యములు సురాదులు చోష్యముల్
పశ్చిమోర్వి సుప్రభావమునను                            56

రాక రాక వచ్చితివి శ్రీరామచంద్ర
వారిద నిభదేహా రఘు వంశ తిలక
దశరధతన యాఘవినాశ ధరణిజేశ
ధన్యుల మయితిమే తవ దర్శనమున                      55

క్షణ మొక యుగమై తోఁచెను
ఫణిరాజ శయను నఘారిఁ బన్నగ దమనున్
ఫణిరాజారి విహారిని

ఫణినిభ భాసుర ఘనతర బాహుంగనకన్                   54 

వచ్చి పోవుచుంద్రు బంధువుల్ మిత్రులు
ధనము గలిగెనేని దండిగ నిల
ధన విహీను జూడ దలగి పోవరె వారు
ధనమె మూల మాయె ధరణి నేడు!                           53

నమ్మితిని నా మనమున సనాతనులగు
నాది దంపతుల శుభంకరావిరళ కృ
పారసామృత వీక్షణా ప్రసరణులను
పార్వతీ పరమేశుల భక్తి తోడ                                   52

పరి పరి విధములఁ జెప్పితి
పరిపక్వాహార భోజ్య భక్ష్యాదులచే
విరివిగ దధి నీరాదుల
బరితుష్టుల జేయు మనుచు బాలింతలనున్                   51

సంధ్యా వందన బాలా
నింధ్యుడు వామన నిభుండు నింకను చదువుల్
సంధ్యల చిక్కడు జూడగ
వింధ్యా పర్వత నివాస విబుధుండేమో                           50

నే నొక పూలమొక్క కడ నిల్చిమనోహర పుష్పవాటికన్
భానుని తీక్ష్ణ తేజములు భాసురమైయటఁ బ్రజ్వలింపగన్
వీనుల విందు గొల్పెనట వేడ్క మృదంగ రవమ్ము లత్తరిన్
కానగ సల్పుచుంటి రొక కాంతకు పెండ్లియ వైభవమ్ముగన్     49

ఎవ్వఁడో వచ్చి నిన్నుద్ధరించు ననుచు
భ్రాంతి బడనేల? నీ ప్రతిభను మది నెఱ
నమ్మి చక్కటి కృషితోడ నరయు ఫలము
కృషియె మూలమీ జగతికి కీర్తి నొసగు                      48

వరవీణా మృదుపాణీ
కరకమ లాలంకృతాబ్జ కందర్పరధ
న్నరవిందాసన సుందరి

సురుచిం గొలుతును విధాత సుమనోహారిన్                    47 


పద్యరచనకు అంశము బాలల దినోత్సవము
బాల లతి సున్నితులు నిష్కపటులు  నిర్మ
లులు వివృత హృదయులు పెద్దలు నుడివిన య
టులె చరింతురు గాదె యిటు లన దగును
నేఁటి బాలలే రేపటి నేత లనుచు                                 46

చిత్రాన్ని (Ice creams) పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.
విశదంబిది జనులకు పర
వశులై మురియుదురు గనిన బాలురు విడువన్
వశమగునె సురుచి రామో

ఘ శర్కర మిళిత తుషార ఖండము లచటన్                    45

అటఁ జని కాంచెను ప్రవరుఁడు
నటనోల్లాస మదశిఖిగణా వృత తటినిన్
కటకచరిత మృగ యుగముల్  
పటుతర వృక్ష భరితమ్ము పర్వతరాజున్                           44

తిమిరముఁ బాఱఁ ద్రోలుటకు దీపము లెల్లెడఁ దేజరిల్లెనే
సుమదళ దామసంయుత సుశోభిత సౌధ విరాజితావళుల్
ఢమఢమ శబ్ద మత్తరి పటాకులు గాల్చ నభంబు నిండగన్
ఘుమఘుమ లాడు వంటలట గూర్పగ బండుగ జేసి రెల్లరున్     43 

ఒక మంచిమాటె చాలును
సుకరంబులగుబనులెల్ల సూటిగ ధరణిన్
సకల విబుధజన సంతో
షకరము, మృదుభాషణములు సన్నుతములగున్               42 

పూమాలల్ గడు భక్తిఁ దెచ్చితిని నీ పూజార్థినైయా ర్తినిన్
వేమారుందవ నామ మంత్రమును కాపీర్ణంబుతో దల్చుచున్
రామారామ యటంచు నిత్యము నపారాచంచలాసక్తినిన్
ప్రేమంబొప్పగ పూజసేతు నయ నే రేయింబవల్లిద్ధరన్               41

నీతుల్ జెప్పెడివారలు
కోతలు కోసెడి ప్రబుద్ద కోవిదులును ప్ర
ఖ్యాతుల సలహా నీయను
జూతుము గాదె జనులనిల సూటిగ లీలన్                             40 

కాలుని దున్నపోతు మెడ గంటలుకన్పడవెప్పుడేరికిన్
కాలము కర్మమున్నరసి కాలుడు జీవుల ప్రాణవాయువుల్
జాలియొకింతజూడకయు సత్వరముంగొనిపోవునుంగదా

కాలుడు ధర్మ మూర్తి యవికారుడు సంయమనుండు జూడగన్        39

పద్యముఁ జెప్పఁగావలెను భావము పండిత పామరేద్ధ సం
వేద్యముగన్  పఠింపనల వీనుల విందుగ శోభితంబునై  
హృద్యమ మై వెలుంగుచు సహేతుకమౌ పద సంహితంబునై
విద్యల నుత్తమంబుగ కవీశ్వరు లందరు జెప్ప నేర్తురే           38

వనితయుఁ గవితయు రెండున
వని కుసుమ సదృశులపార భావ నిగూఢుల్
మనముల నలరింతు రిరువు

రు నలంకారప్రియులు గురుతర గమనులే                        37

చుక్కలు మిలమిల మెరిసెను
మిక్కిలి వింతగ వెలసెను మిహికాకరుడున్
చక్కని వెన్నెల విరిసెను
గ్రక్కున  శారద నిశీధిఁ గనువిందగుచున్                           36

దైవముపైన భారమిడి ధర్మముఁ దప్పక సంచరించుచున్
పావక కీల లందు మసిబారిన వీటిని వీడి నత్తరిన్
పావన జాహ్నవీ నదిని పాటవ మొప్పగ దాటి రాత్రి వే

ళా వసుదేవసూను మది నందిడి పాండవు లుండిరే వనిన్        35 

విసమును మ్రింగినట్లు కడు వేదన మానసమందు నాటగన్
వసుమతి భర్త దుర్మరణ వార్తయు రామవనాంత రమ్మునన్
వసనము నార  చీరల సభార్య సహానుజుడై  ప్రవాసతన్

మసలగ లక్ష్మణాగ్రజుడు మండుచుఁ దల్లిని జూచె నుగ్రతన్          34

భరతభూమి రక్ష బడులు గుడులు వేద
శాస్త్ర తతులు మరియు సంయమనము
భిన్న జాతు లైన భేదభావులు గారు

భరత మాత ముద్దు పౌరు లెల్ల                                     33


ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు సంతసంబుగన్
మ్రాకుల తోటలందిరిగి మక్కువ నూయలలూగి నంతప
ద్మాకర మందునీది విగతశ్రము లై ఘన మోదమొప్పగన్

చీకటి క్రమ్మకుండనిలు చేరహముల్ మరు వంగ వచ్చునే       32

సామాన్యుఁడు వీఁ డనుకొని
యా మనుజాశన బకాసు రాధము డచటన్
భీముంగని భీషణ సం

గ్రామమునన్ ధృతి సెడి సనె కాలుని కడకున్                     31

ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు
విబుధ జనవిధేయ విహీన వినయగుణ ర
హితుడు సభ్యతా సంస్కార హీను డైన
విద్య నేర్చినఁ వాడొక వింత పశువు.                                30

ఇదె కద పుణ్యకార్య మన నెల్లరు మెచ్చఁగ వైభవమ్ముగన్
సదమల వృత్తి  యాజయిత సద్విజ సంయమి శాస్త్ర వేద సం
విద సుసమేత మైపరగ వీర వరేణ్యుడు రాఘవుండిలన్
ముదమున వాజియాగము సమున్నత రీతి సమాచరించెనే          29

నవవికచ సరసిరుహము సు
కవివర కవనార్హతావికసితోల్లాసన్
జవరాండ్ర వదన సదృశమ

రవిందమును గన మనోభి రామము గాదే                   28 

ఔరా కలయా నిజమా
శ్రీరాముడు చనుట నారచీరలను జటా
ధారి వనవాస మెనిమిది

యారేండ్లు దశరధు పంపు నరయం గలమే                     27

మారీచుడు రావణునికి చేయు హిత బోధ. దానిని విని తిరిగి లంకకు చేరుకుంటాడు రావణుడు.
విను మిదె నా హితవాక్యము
చనుమీ లంకకు నతిప్రసన్నత దనరా
రు నిజసతీ రాగంబున

ఘనుడా రాముడు సభార్య కానల దనియున్                         26

కటకట యిట్టి మాట లనఁగాఁదగునే చెపుమా సభాంతరన్
పటుతర వృద్ద బాంధవ నృపాల గురూత్తమ ధర్మవేదులున్
ఘటికులు వేద శాస్త్ర ఘన కౌశల దర్పిత విప్ర సంఘముల్

ఘటనము సేయ యాగము వికారపు పల్కులు కృష్ణుడోర్చునే          25 

బలము గలదేని నాతో
బలీ తగు చలము వహించి, వజ్రాహతికిన్
కలవర మొందియసుర మా

యల గెల్చుట ఘనమె, పోరుమయ్య గనియెదన్              24

వికసించెను ముఖపద్మము
కకావికలుగ శివచాప ఖండన మవ జా
నకికి నట రామునింగన
సకలగుణ విరాజితుండు సన్నుత వీరున్                                23 

కలయో వైష్ణవమాయ యొక్కటగునో గాకౌర వింతన్ బృహ
న్నలసారధ్యము వీడి ధన్వియయి బాణౌఘమ్ములన్ ధార్తరా
ష్ట్రుల గాంగేయ సమేతులం బఱచె నుగ్రుండై రణోత్సాహి గా
కిల రానున్న మహారణంబునకు సంకేతంబు గాకుండునే              22

కలయో వైష్ణవమాయయొ
లలనయశోదగనెనుబల రామానుజ లీ
లల నోట విశ్వమంతయు
బలారిసన్నుతుగొలుతును పద్మదలాక్షున్          21

ఔరా యెవ్విధి నమ్ముదు
వీర వరేణ్యులఖిలాస్త్రవిధ్యాధికులన్
కౌరవులు పాండుతనయుల
ఘోరారణ్యముల బంప కుటిలత్వమునన్              20

సూర్యోదయ వర్ణనము:

సీ.     పాలక డలిన నుద్భవ మొంది దర్పించి వెడలు లక్ష్మి తిలక బింబ మనగ
         మునులు నదీ తోయముల మునిగి యట బాలార్కు నర్చించుచు నర్ఘ్యము లిడ
         శార్వరీ తిమిరమ్ము సన్నగిల్ల యరుణ కాంతులు జగతిని క్రమ్ముకొనగ  
         చౌర సంఘమ్ముల జారుల చిత్తంబు లెల్లను మొత్తంబు  తల్ల డిల్ల  
ఆ.వె.  ఆల మంద లచట నంబారవమ్ముల
         పల్లె పడతులంత పాలుబిదుక
         కొక్కురోయనంగ కుక్కుట ములు కూయ
         భానుడు కనిపించె  భాసురముగ 19 

కమలములవంటి కన్నులు
నమలకుసుమకోమలారుణాంచిత పదముల్
విమలశిఖ మండిత శిరము
సుమదళ దామ వసుదేవ సుతునింగనరే              18


 సీతా దేవి రామునికి మాయ లేడిని చూపుతున్న సందర్భము:      
 మృగ వికారుడుమారీచు మృగమనుకొని
 విహ్వలారీ మృగము మణి వెలుగులన్న
డరెను గద నెల రాజీ పుడమి తెరగున
రమణి భవ్యానుకంఠీధర గనుమనియె                     17

భారతార్ధమున:

కారు కూతలేలా రిపు కాయములను
రణమున పడడు రాజీ పురందర తన
యుండు ఖండింప డేవేగ యుద్ద భూమిఁ

ప్రాణములు వోవ కలుగు దివ్యాను భూతి    16



మగఁడా! పోటుమగండ వీవె యని సంభావింప నుద్రిక్తుడై
మగువా వీరవ రేణ్యు ధర్మసతియున్ మాంచాల ప్రేరేపగన్
పగవారిం దునుమాడ నెంచి చనె కోపావేశ సంరంభియై
విగతాసుండయె బాలచంద్రు డకటా వీరుండు పల్నాడునన్   15

అనిశము సర్వభూతములయందు నుదార కృపాళుడై యిలన్
వినయ విధేయ తన్గురుల వృద్దజనంబుల గారవించుచున్  
మనమున నిత్యతాపమదమత్సరమోహగుణాళి దూరుడై

యనునయ వాక్యసంపదల నార్తుల గాచుచు నుండ ధన్యుడే 14 

ఇద్దరు భార్యలు గలిగిన
మద్దెల దరువే ప్రబుద్దు మర్త్యుని కకటా
బుద్దిగ నొక్కసుదతినిన్
ముద్దు మురిపెములొలికించి మోదపడదగున్  13

నే నొక పూలతోటకడ నిల్చితి నొంటిరినై యొకింత ని
త్యాను భవార్హ తోపకరణాదుల గూర్పగ చింతనా రతిన్
మానస మందె సంతసము మల్లెల మొల్లలగంధమత్తరిన్
మేనలరెన్ సువాసన సమేతపు మారుత తాడితంబునన్       12

ఏమని వర్ణింతును నీ
రామాంకిత భాగవత పురాణాధికముల్
వేమారు చదువ తనియదు   
నామది సతతమ్ము పోత నార్యా  ప్రణతుల్ 11

ఎంత సుదిన మిద్ది యేమని వివరింతు
మేమిట బొడగంటిమి వసుదేవ
నందను పరితోషనందు సహిష్ణు రో

చిష్ణు విష్ణు కృష్ణు జిష్ణు నలర   10

పుడమిఁ గల జనులు పొగడఁగ
నడరిన ముఖకమలుడు గురునత శిరుడును రా
ముడట శివధనువు విరువగ
వడివడి ముదిత జనకసుత పరిణయ మయ్యెన్ 9

బాల కృష్ణుని శైశవ కష్టాల సందర్భము లో :

కటకట యెన్నికష్టములు గల్గెను పూతన నంజు స్తన్యమున్
జటిలపు బండి ఘాతమును జక్రసమీర విఘాత దైత్యుడున్
పిటుకగు రక్కసుం డొకడు వేష విశేషి సువత్స రూపుడున్  
తటకపు నొక్క కొంగయు విదారకు బాధ సహింప నేర్వవే                   8

(నంజు = విషము; విఘాత = అడ్డంకి;  పిటుకగు= గట్టి; తటకపు = ఆశ్చర్యమైన)

కవివర!నీ కవిత్వమునఁ గాంతుము భావ గభీర గూఢముల్ 
కవన సుధార సోద్దిత వికాస మనోజ్ఞ మరంద  ధారలున్               
సువికసితా రవిందములు సుందర శబ్ద సుసంహి తమ్ములున్
నవరస గుంభితా విరల నంద విశేష  విలాస దాయముల్ 1

ఎక్కడ కేగువాఁడ నిపు డెవ్వని వేడుదు నార్త త్రాత దా
నెక్కడ లోకనాధు డన నెవ్వడు దీనజనోద్ధరుండు దా
నెక్కడ భక్తపాలుడన నెవ్వడు దానిట నన్ను పేరిమిన్                                    
మక్కువ జూపినిమ్మకరి మత్తుని వేతన బాప రాగదే 2

మనసిజ పుష్పబాణము లుమాటికి  గ్రుచ్చఁగ వెచ్చనూర్చుచున్
వనరుహ నేత్రుఁ గృష్ణు మధువైరి తలంపుల బాధలోర్వకన్
ఘనవిపి నాంతరమ్ముల నఘారి నగోచర దర్శ నార్తులున్            
చనిచని వేడుకొంటి రట జాడ నొసంగ లతా నగమ్ములన్  3

న్యాస తటీ నగరాజ వి
లాసితమున్ స్వాదుతర జలాశయ రాజున్
భాసిత కోకనదాశ్రిత                             
కాసారము నట గనుండు కమలాకరమున్ 4

కురునృప! పాండునందను లకుంఠిత దీక్షఁ విశేష విద్యలన్
స్థిరమతి తోడ నేర్పున  విచిత్ర పుటస్త్ర సశస్త్ర రీతులన్ 
గురువరు కుంభసంభవు నిగూఢు నరోత్త మపార కౌశులున్
కురుకులవృద్ధ భీష్మడ లగూర్పగనేర్చిరికౌర వేయులున్ 5

హరసుత గజశిర లంబో
దర విఘ్నేశ్వర నగసుత దనయ దురితసం
హర మూషిక వాహన సుర
వర సన్నుత గై కొనుమివె వందన శతముల్    6

అతి దంభంబున దానధర్మముల దా నత్యంత వేగంబునన్
మతి జేయంగ దలంచి వేసెనొక  బ్రహ్మాండంబనిందల్చుచుం
బ్రతిపాద్యంబుఁ బ్రణాలికం ఘనుడు సౌభాగ్యోద్ధరీయంచికం
బ్రతికూలంబవ నాటి యూహనకటా ప్రత్యాశ యయ్యెంగదా! 7