సంపూర్ణ బతుకమ్మ
పాట
(ప్రణీతము:
పోచిరాజు కామేశ్వర రావు.)
ద్విపద మాలిక :
శ్రీగౌరి బ్రతుకమ్మ సిరు లీయ రావె
మా గౌరి వోయమ్మ మన్నింపు మమ్మ
ఇంపార మాయింటి యిలవేల్పు వమ్మ
సొంపారఁ జక్కఁగఁ జూడఁగ రావె
వెత లన్ని వాపఁగ వేగంబ రావె
బ్రతుకమ్మ బ్రతుకమ్మ బంగారు తల్లి
మాయమ్మ దుర్గమ్మ మముఁ గన్న తల్లి
ఆయమ్మ బ్రతుకమ్మ నర్చింప రమ్మ
తంగేడు గుమ్మడి తామర సుమలు
బంగారు గునుగును వామనె విరులు
కమనీయమౌ గడ్డి కనువిందు కట్ల
రమణీయమౌ దోస రమ్యపు బీర
చేమంతి పూబంతి చెంగల్వ పూలు
భామ లందఱు సేరి వాలుగఁ బేర్చి
పసుపు గౌరినిఁ జేసి వానిపై నుంచి
వసుధను దంబల ప్రభల నీయంగ
నెలఁత లందఱు గూడి నృత్యమ్ము లాడి
పలుమారు కీర్తించి పాటలు పాడఁ
గత లన్ని వింటిమి కారుణ్య మూర్తి
బ్రతుకమ్మ సద్దుల బ్రతుకమ్మ బ్రతుకు
కుదురుగ నిత్యమ్ము కొలుతుము నిన్ను
కదలిరా బ్రతుకమ్మ కాపాడ మమ్ము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి