2, అక్టోబర్ 2015, శుక్రవారం

సమస్యా పూరణ 5


ఆరుగురు మునులు కలసి క్షణము యుగమను రీతి మంత్రములు పఠిస్తూ వేచి చూచిరని చెప్పుట.
షణ్మాత్రల కాలంబును
షణ్మాసము లనఁగ నొక్క సంవత్సరమే
ఫణ్మంత్రములు పఠించుచు
షణ్మునులు నిరీక్షణంబు సలిపిరి భక్తిన్                              91
[ఫట్+మంత్రములు=ఫణ్మంత్రములు; ఫట్ మొదలగు మంత్రములు]

షణ్ముఖుడు కార్తికేయుడు
షణ్మతముల సంఖ్యయారు సందియ మది యీ
షణ్మాత్రము లేదు యుగళ
షణ్మాసము లనఁగ నొక్క సంవత్సరమే.                                90

హరిశ్చంద్రుడు వరుణ దేవా నాకు గొప్ప వీరుడైన  కొడుకు పుట్టితే నీకతనిని బలిపశువు జేసి అగ్నిలో హోమము చేస్తానని వేడుకోగా వరుణుని ప్రసాదమున రోహితుడు పుట్టెను. కానీ హరిశ్చంద్రుడు పుత్ర ప్రేమతో తాత్సారము చేసి బలి ఇవ్వడు. శునశ్సేపుడను ముని పుత్రున్ని యిస్తాడు. 
  
అవగత మవని విధ మస
త్య వచను డాధర్మజుండు దలుపన్ వంచిం
చె వరుణుని హరిశ్చంద్రుడె
యవనీశ్వరు లెల్ల కల్ల లాడెడు వారల్                                   89

సుజల ఫలామల దళ కుసు
మజాలముల సంతసించు మాధవు డెలమిన్
కుజన కృతాడంబర ఘన
భజనాదుల నిష్టపడఁడు పరమాత్ముండే.                                88

ప్రాణ భీతి లేని ప్రాణులఁ గంటిమే
శృంగి శాప తప్త చిత్తు తక్ష
కుని మనంబు నందు జనమేజయ కృతాహి
యాగ మనినఁ గడు భయమ్ము గలిగె.                                     87

వేద్యం బిది యెల్లరకుం
బ్రద్యుమ్నుం డొకఁడు పంచపాండవులందు
న్నుద్యోతిత వీరుల నం
దాద్యుండౌ మధ్యము సఖు తనయుడు సుమ్మీ                        86 

ఇందందని వెతుకగ వల
దెందెందు గనిన మురారి యేలోకమున
న్నందంద యుండు నిక్కము

సందేహం బేల తండ్రి సర్వేశ్వరుపై                                85

అసి - కసి - నుసి – మసి పై పదాలను ఉపయోగించి సూర్యోదయాన్ని వర్ణిస్తూ  నచ్చిన ఛందంలో పద్యము:

అసి ధారాంశువు లగని వి
కసితము లాయె కమలములు కనువిందుగ భా
ను సితామల బింబమును భ్ర   
మసి శశియనగం గలువలు మండలి గనినన్                    84

కంస చెఱ రాత్రి దేవకి కనియె కృష్ణు
గడ్డిపాకలో గనె మేరి కాళరాత్రి
జగతిఁ బరిరక్షకుండు కంసారి భంగి
క్రీస్తు జన్మించె జనులెల్ల ఖిన్నులైరి.                                  83

స్వపర భేదంబు లెక్కడ ప్రభుసుతునకు
పరమ పురుషుడు మోద తాపముల సముడు
యేసు నెఱుగ రప్పుడు తగ దిటు లనంగ
క్రీస్తు జన్మించె జనులెల్ల ఖిన్నులైరి.                                      82

చక్కని రూప మింపలరు సద్గుణ రాశ్యతి కోమ లాంగియున్
మక్కువ జూపి నింగొలుచు మానిని పైయిటు శంక వీడుమా
వెక్కస మాయె చేష్ట లవివేకపు మాటలు చాలునింక ఛీ

కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో.            81

ధరణి పతుల కసాధ్యంబు తాపసులును
జనులు మెచ్చగ శ్రీరామ చంద్రు డంత
శివధనుర్భంగ మొనరించెఁ బవనసుతుఁడు
నాకథ విని జెందె పరమానంద మంత                              80

శంభు డిందుమౌలి శంకరు డీశుండు
నీలకంఠు డసమ నేత్రు డజుడు
త్రిపురవైరి శివుడు  దేవదేవుండు కు
మారజనకుఁ డతఁడె మారవైరి.                                       79

పావనమైన క్షేత్రముల భార్యయు పుత్రులు దోడురాగ సం
భావిత దానధర్మములు పన్నుగ సల్పుచుఁ దమ్ము నిత్యముం
బ్రోవగ వేడనుత్తమము క్రూర మనస్సున స్వార్థ చింతలన్
దైవముఁ గొల్వరా దనుచు ధర్మవిదుల్ వచియింతు రెల్లెడన్.          78

సార్వ జనీనమ్ము లవి సు
పర్వాధర్వామరమునివర సేవితముల్
గర్వాతిశయమున ననకి
టర్వాచీనమ్ములు స్మృతు లామ్నాయమ్ముల్.                         77

ఇమ్మేదిన్ సతిరూప ధారి యయి దానీశానురక్తుండునై
సమ్మోదంబుగ రామనామమును దాస్యాసక్తి నిందల్చుచు
న్నమ్మానీ విట కాళివే పరమ హంసాఖ్యుండు సద్భక్తిని
న్నమ్మా రమ్మని పిల్చె భర్త తన యర్ధాంగిన్ ప్రమోదమ్మునన్!       76

ఇనకులాబ్ధి సోము డీ హరిశ్చంద్రుడు
సత్య వచన బద్ద సత్పురుషుడు
స్వార్జిత  పితృ దత్త సకలోర్వి గృహ పశు
ధనము నమ్మి ధనము దార కొసఁగె.                             75

పెద్దలాడు మాట సద్ది మూట యనగ
నలరు చుండు నిల ననవరతమ్ము
యోగి వేమనార్యు డుడివె నపుడు వేప

చేఁదు తీయ నగుచు క్షేమ మొసఁగు.                             74

పాముల కాహారమ్మగు
నీ మండూకం బచట గనియె విధిలీల
న్నేమఱిన చిన్ని నలికిరి
పామునుఁ దినఁ గోరి కప్ప బారెఁడు సాగెన్.                              73

కవిరాజన్యుల భావజాలయుత వాక్చాతుర్య మాహాత్మ్యముల్
కవనప్రాభవ ధీతతుల్ మెరయ సత్కారార్హ పద్యావళుల్
శ్రవణా నందము నొప్పఁ జెప్పు కవిసమ్రాట్టుల్ గనన్నేల దా
నవధానమ్ముల నుండరా దనె సమస్యాపూరణం బెన్నడున్.           72

దూషణ ఖరాసురులు మునిదుఃఖకరులు
దండకారణ్య రాక్షసాధము లనిశము
వారి, భావినిహతులు కోపానలము న
రామచంద్రుని, రక్షించు రావణుండు.                      71

నట్టింట జనులు మెచ్చగఁ
బట్ట మహిషిగ శిరమందుఁ బన్నుగ నిడి య
ట్టిట్టనక తన కెపుడు నూ
కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్.           70

మురహరి పై భయభక్తులు
కర మరుదు గన శిశుపాలు కలుషాత్మునకున్
దురితు డగుట నలవడునే
మిరియములకుఁ దీయఁదనము మిరపకు వలెనే.         69

పుడమి పండ్ల శ్రేష్టము కదళీఫల మెంచ  
స్వాదుతరము నమృత సమము నైన
మరులు కొనగ దగదు మధుమేహ రోగికి
నరటిపండు ప్రాణహరము విషము.                   68

ఈధరఁ గుంతీ సూనుం
డా ధర్మజునకను బెద్ద యాదిత్యజుడున్
బాధిత దుష్టా నుచరుడు
రాధేయుని శత్రువు కురురా జనిరి బుధుల్.          67          

ఆధర్మున కనుజుడు నై
యీ ధర్మతనయున కన్న యీప్సిత వరదా
తాధమసహవాసార్తుడు
రాధేయుని శత్రువు కురురా జనిరి బుధుల్.            66

రమణీయ శరద్రాత్రిం
గమలాక్ష ముఖారవింద కమనీయ రుచుల్
తమకమున గన నతివ ముఖ
కమలము వికసించెఁ జంద్రకాంతులు సోఁకన్.           65

తనయుం డొక్కనినె కరం
బనురక్తిం జూచు భర్త పరితాపమునన్
జననిని వెతకుచు నిటునటు

చను బాలను తండ్రి తీయ సంతసమందెన్.             64

జూదమాడఁ దగదు శోకప్రళయ కార
ణంబు దెలిసి కూడ నవని పతుల
ధర్మ విధి యనంగ ధర్మజ సీరులు
జూద మాడువారు సుజనవరులు.                         63

అసుర సుర నరుల కగపడ
ని సతి యహల్య పతి శాప నిందిత ఘన తా
పసి యట రాముడు దన పద
కుసుమము తాఁకఁగనె నుసురుఁ గోల్పడె నయ్యో.       62
[తాఁకఁగనెను= తాకగా చూచెను; కోల్పడు=అగపడు; ఉసురు= ప్రాణము; అయ్యో=ఓ అయ్యా]


భాసురముగ కుమార సంభవమును సుక
వి “కవి రాజశిఖామణి” బిరుదు నలరి
నన్నెచోడుఁడు రచియించె,  నైషధమును
వ్రాసె నింపుగ “కవిసార్వభౌము” డడరి               61


మేదినీశుల నలరించె మేఘనాధు
తండ్రి చావు, సుతునకు సంతస మొసంగె
పరశు రామునకున్ముని వరుడు సాత్య

వతుడు దల్లియునన్నల బ్రతుకు నిలిపి               60

తస్కరు నిందాత యనిన
భాస్కరు డుదయించు నేని పశ్చిమ దిక్కున్
మస్కరము మండదని యన
విస్కీ బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్.                 59

జ్ఞాన వృద్ద వృద్దజన శీలవృద్దుల
నంబరగు త్రివిధ జనగణ మవని
గుణ విహీను డైన కుమతియు వయసున   
పెద్దవాఁడు దగఁడు వృద్ధుఁ డనఁగ.                         58

అంగన గబుట్టి యంబయె
గాంగేయు వధింపగన్ శిఖండిగ నిలువన్
భంగయశుడు గానేరక
గంగాసుతుఁ డాలమున శిఖండినిఁ జంపెన్.                57
[శిఖండి =శిఖండి, బాణము ]

చిత్త మందు ప్రేమ చిగురించు వారికే
యలుక కలుగు గాదె యలమటింతు
రు పితృవరులు గొట్టి త్రోవ దప్పుసుతులఁ
గఠిన చిత్తులు గద కన్నవారు.                                56

కృష్ణ దేవ రాయామిత కృపను బడసి
వైభవమున వెలిగి రష్ట వారణములు
కవులు శ్రీయుతులే సరిగా దిటులన
సిరియి వాణియు నొక్కచోఁ జేర రెపుడు.                     55

ఏడును దానికి కుదురుగ
నేడును వాటికిని గూర్ప యేడును చివర
న్నేడును వీటికి మూడును
మూడును మూడును గలసిన ముప్పదియేడౌ.              54

అప జయమ్ములఁ గుందక నవని జనులు
పురుష యత్నము నిత్యము పూన దగును
సాధ నావిరళ కృషియు చలము విజయ

మదమె ప్రగతికి మార్గమై ముదము నొసఁగు.                  53

భర్త యడుగు జాడలఁ జని భద్ర గతిని
నిల్లు చక్క బెట్టి పరువు నిలిపి దరికి  
జేరి ప్రియకాంతున కెపుడు సేవ జేయు
వార కాంత లెల్లరు పతివ్రతలు సుమ్ము.                        52
[జేయువార= జేయువారే]

[కావ్యానికి శబ్దార్థ గాంభీర్యములు; రణమునకు నిగూఢ వ్యూహరచన కాల్బల సంపద ముఖ్యమని సూచన.] 
సరళ రీతి యల్ప జనమనోవిదిత ని
గూఢ భావ గతుల గూర్పులమరఁ
గఠిన పద బలసహకార భీకర రణ
కావ్యమును లిఖించెఁ గత్తితోడ.                                    51

కీర్తి కాముడగుచు కృష్ణానదీతీర
వాసి కత్తి భూమి పండితుండొ 
కనికి నీయ ముదము గని  వదాన్యుని వంశ
కావ్యమును లిఖించెఁ గత్తితోడ.                                     50
[కత్తి భూమి= 17 ఎకరాల నేల కృష్ణా జిల్లాలో]

మంగళదాయి రమా దే
వింగని మ్రొక్కవలె భక్తిఁ బ్రియముగ మరియె
భ్భంగిని శ్రద్దయు భక్తి బ
లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్.                               49

దుష్యంతుని కడకేగుచున్న శకుంతల మనోభావము: 
నేనీ వలనన్ సత్సం
తానము వడసితి నిలేశ దారను సాధ్వి
న్నానుడివిన నాయందను

మానము పోవలె నటంచు మానిని తలచెన్.                         48

పేరిమి సుజనుల యెడ మమ
కారముల మసలుచు కుందక వికారాహం
కారములఁ  బరస్పర సహ

కారమ్మే భూజనులకుఁ గడు హిత మొసఁగున్.                        47

కీకారణ్యములె యొసగు
నీ కుంభిని వర్షపాత మెవ్విధి నైనన్
నాక చరాంబుదముల  ఫల
కాకర చేఁ దన్నమాట కల్లయె సుమ్మీ.
[ఫలక + ఆకర = ఫలకాకర = ఫలకలకు నిలయమైనది, కొండ; చేఁదు= ఆకర్షించు]   46

పాకములందు ప్రశస్తము
శాకము చేదైన నెట్టి సంతాపములం
జేకూర్ఛ దనామయమున్
కాకర చేఁదన్నమాట కల్లయె సుమ్మీ                                 45

బల ధన దర్ప నిరసనా
కుల భాషణముల నపార కోపానలమున్
విలసిల్లె మదిని మరియుం
జలము ఘనీభవముఁ జెందె జ్వాలలు సోఁకన్.

[చలము = మాత్సర్యము; కోపజ్వాలలతో మాత్సర్యము మరింత గట్టిపడింది.]  44 

బాల లతి సున్నితులు నిష్కపటులు  నిర్మ
లులు వివృత హృదయులు పెద్దలు నుడివిన య
టులె చరింతురు గాదె యిటు లన దగునె
నేఁటి బాలలే రేపటి నేరగాండ్రు.                               43

భర్త గూడి చనియె భార్య వాహ్యాళికిన్
కొండ చఱియ నకట గూలె పతియె
ముప్పిరి గొనగ ఘన మోహానురక్తుల

ముద్దు మగని ప్రాణముల హరించె.                        42

త్రిపుర దైత్యు లెదరు తిరుగిరి రుద్రుని
శివునిఁ , జంపె భీమసేనుఁ డలిగి
వారి నెల్ల నని నవారిత  శక్తినిన్
సంతసించి రెల్ల జనులు భువిని                            41
[భీమసేనుఁ డు = శివుడు= భీమ శంకరుడు = భయంకరుడు]

పాప - రూప - దీప తాప పై పదాలను ఉపయోగిస్తూ `దీపావళి' పర్వదిన ప్రాశస్త్యాన్ని తెలుపుతూ నచ్చిన ఛందంలో పద్యము: 
పసిడి పాపలు రూపలావణ్య వతులు
తైల దీపము లన్నియు దగ నమర్చి
దనరిరి నరకజనిత సంతాప ముడుగ
లీల గృష్ణుని దీపావళి శుభకరము                     40

మార్గ గమన పరిశ్రాంత మనుజు  డొకడు
సద్విజుండు విమల గుణ సత్తముండు
గనియె నొక పాక నచ్చట కలవు కడు న
కల్లుపాకలోఁ బురుషసూక్తముఁ బఠించె.                        39
[నకలులు = కాపీలు] 

అవిరళ భక్తిని నిత్యము
భవసాగర తరణమునకు పరమాత్మ కథా
శ్రవణముపాయము శివకే
శవపూజల వలన జన్మ సార్థక మగురా.                          38

స్పష్టోక్త గణ నియమ భూ
యిష్టము క్లుప్తమగుభావమెప్పుడు మరి సం
తుష్టి నొసగవలె జదివిన     
కష్టము గద కవిత లల్లఁ గందమునందున్.                         37

పరిణయమాయెను గోరిన
పురుషునితో ముదమలరగ ముదితకతిశుభం
కరమగు మంగళ సూత్రా
భరణమ్మును బొందె వధువు భాగ్య మటంచున్.                   36

దండన భయమున బండడు
గండరగండ డతి రయముగ నరిగె నాసూ
నుండ తనిని వేగమ సో

ముండా యని పిలువు మనుచు ముదితయె చెప్పెన్.             35

మాటునఁ గపిఁ జంప  మర్యాద కాదయా
రామ యనిన నోరు ఱాతిరోలు.
మాటున మృగ హింస మర్యాద నిక్కంబు

స్వానుజసతి హారి వాలి కాదె                                           34 

అన్నుల మిన్న మన్మధ వధాంతర భగ్నమనోరధార్తియై
యన్నగరాజ నందన హిమాద్రి తటిం దప మాచరించి ము
క్కన్నుల వేల్పునీల ఘనకంఠుని పార్వతి పెండ్లియాడగన్
పిన్నలు పెద్ద లేఁగిరఁట భీష్ముని పెండ్లికి మోద మందుచున్.       33
[భీష్ముడు = శివుడు]

ధర్మ బద్ధ కురుక్షేత్ర ధరణి యందు
సంభవించెను యుద్ధము శతకుమారు
లున్న ధృత రాష్ట్రునిసుతులందొకడు వాని

నంగదునిఁ జంపె నర్జునుఁ డాహవమున.                 32

సనకసనందాదు లవని
ఘనహరి భక్తులు బడసిరి కైవల్యమునున్
కనగ నచంచల భక్తియు

ధనమే మోక్షము గడించు దారినిఁ జూపున్.               31

కుంభసంభవుండు గురుభూధరాతిశ
యాపహార్యగస్త్యు డసురుని యజ
వేష ధారిని తినె విప్రవరుండన   

బ్రాహ్మణుండు మాంసభక్షకుండు.                    30

ఏగం దగ దెప్పుడు వే
శ్యాగారము సేకురు ఘనహానియు వలదీ
రోగము బహునారీ సం

యోగము భోగేచ్ఛఁ బెంచు నుర్వి జనులకున్.           29

చేరి వనము వేడ్క జింకను జూచి రా
జింక చంపి తినును చిఱుతపులిని
జంపు చర్మ పాణి జాపహరణకునై

వన్యమృగహననము బాడి కాదు
ఫడతిఁ సాధింప గోరుచు ఫల్గునుండు                       28

మత్స్యయంత్రమ్ముఁ గొట్టెను, మాద్రి సుతుఁడు
కూడ పెండ్లాడె పాంచాలిఁ గుంతి పలుక

పండు తెచ్చితినన కుంతి పంచుమనియె.             27


సవ్య సాచి సకల శస్త్రాస్త్ర వేదుడు
కాలకేయు లవని ఖండితులవ  
విజయు డాజిని ఘన విజయుడే శాత్రవ

జనులఁ జంపఁ గల్గు ఘనయశమ్ము.                        26

ఫాల నేత్రుడు నిక్కంబు పార్వతి పతి
బాణ కుసుముడు దెలియును పద్మ పట్టి 
ధారుణి నెరుగనిట్టి బాంధవ్యములన
మన్మథుండు ముక్కంటికి మాతులుండు.                    25

వేలాతిక్రాంతాతివి
శాలదళాంబుధి విశేష సైన్యదళమునన్
పాలితబృత్యుని కడ కర

వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్.                24

సమస్య: మరావతి రాజు చంద్రుఁడై శోభిల్లెన్.
కమలాసనవంశజు డను
పమ సంయమి కశ్యపఘనవంశాబుధికిన్
విమలయశుడు వజ్రాయుధు

డమరావతి రాజు చంద్రుఁడై శోభిల్లెన్.                                23 

అలవడె నేటిమానవుల కందర కిప్పుడు దృశ్యజాలముల్
కలవర పాటునిచ్చిన వికార మనస్కులు నైన భ్రాంతులై             
లలితపదార్ధసంహితము రమ్యము భాగవతమ్ము మెత్తురే 

లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చ రెవ్వరున్.       22

రాముడు వధియించె రావణునని ఘోర
రాక్షసుఁడు, రచించె రామకథను
జానకీసతికథ సంయమి వాల్మీకి

పావన చరితంబు భవ్యముగను                 21

కాళి చరణు పూర్వ కాలపు వాడట
మేఘవర్ణుడు గన మేటి యాట
గాడు పరుగు లందు కౌశల మధికంబు  

కృష్ణుఁ డాడెనఁట క్రికెట్టు క్రీడ.                          20

తోయజాక్షి ప్రమీల యా తురగమును గ
ని ఘన తరతీక్ష్ణ బాణాశని సదృశముల
నసమ శరబాణ వీక్షణ నక్కిరీటి

బురుషపుంగవు నోడించి పొలఁతి నెగడె.             19

పద్మ సంభవుండు వాణీశుడు శృతిసం
ఘాతవిలసితముఖకమలు డతడు  
భళిర యొక్క సారి వ్రాయనిక మరల్ప

చేఁతకానివాఁడు సేసె సృష్టి.                                     18

ఏసందేహములేదిట
నాసర్వవ్యాపిశంకరావధి హిందూ
వాసులు కారు ప్రభుసుతుడు

యేసును నమ్మినఁ ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్.        17

ఆ రాముడు శబరిఁ గనడె
శ్రీరామా యని పిలిచిన, శివుఁ డేతెంచెన్.
కారడవి తిన్నడు ప్రతిమ

నీరము గార్చ నయనముల నేత్రము లీయన్              16 

వరసతి నాధుని రాకకె
దరుచూడగ మగడువచ్చి  తరుణిని గనగన్
మురిపెమ్ముగ  తన్నుబొగడ
పురుషుఁడు పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్.            15

బతుకమ్మ యనగ హిమగిరి
సుత, గొలిచిరి పసుపు గౌరి సుమములఁ శంఖా
కృతి పైనిడి రమణు లచట  

బతుకమ్మల, నాడిరి మగవారలు వేడ్కన్.                        14

గృహమున కలదు సుందర కీరవాణి   
 భార్య మృదుభాషి చపలుడు వాడు కనగ
నేమి వింత నిజసతి సనియె తను పర

కాంతఁ గోరఁగ, తానె యేకాంతుఁ డయ్యె. 13

దర్భాసనుడవు నిత్యము 
దుర్భర దారిద్ర్య పీడితుఁడవు, కుబేరా
యర్భకుడ నేననుచు నా
గర్భధనసురవరుఁ వేడు కరము శుభమగున్ 12 

కారడవినతనికి కన్పట్టె సింహంబు  
వేసె భీతి వేగ విష భరితపు
బాణ మంత,  పదము పట్టి తను నకట
చీమ కుట్టెఁ,  జచ్చె సింహ మయ్యొ. 11

చూడ రోము చరిత జూలియస్ సీజరు
రాజ వంశ జాత రమణుడతడు
నట నలుబది యేండ్లు నాగస్థసుడనభి
రాముఁ డేలినాఁడు రోము ప్రజల. 10
(ఆగస్థస్ రాజు జూలియస్ సీజర్ బంధువు,
దత్తుడు. 27 BC నుండి 14 AD వరకు పాలించాడు.)

ప్రావేశిక ప్రశ్నలలో
నీవర ఢిల్లీ పురమది యెచటని యడుగన్
ప్రావీణ్యత నుడివె నొకడు

కావేరీ తీరమందు గలదఁట ఢిల్లీ. 9

సతి వాణి చతుర్ముఖహృ
ద్రత శుకవారిజ విమల కరాంబుజ బ్రాహ్మీ 
శృతి సూక్తి వివిక్తయు భా
రతి పతి మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్. 1

దక్ష యజ్ఞవాటిక యందు దక్షు శిరము
తెగిపడ  ప్రసూతి దక్షు సతి విలపించి 
వాణిఁ దలచి కడుఁ గలతఁ బలికె పద్మ    
కోడలా నా పతియె నీకు కొడుకు గాదె. 2

కలకల నగవులు నగుచుచు
పలు నుడువుల నుడువుచు నట పరిణయ శాలన్
కలసి మెలసి నెలత లచట
నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే. 3

ముదముగ పురాణములుఁ గనఁ
బదపడి భారతమునందు పర్వము లెంచన్
చెదరక తరుణుల వయసట
పదునెని మిది పదు నెనిమిది  పదునెని మిదియే.                     4

అనునయ వాక్యముల నుడివి
పనులన నేకము లజేయ వాక్దానములన్
వినయాన్వితు లందొక చిరు
వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్. 5

 పాండవులు విరాట రాజు కొలువు లో ఉన్న సందర్భము:
పటుతర బాహుపరాక్రమ
ఘటికులు దివ్యాస్త్ర శస్త్ర ఘనులు నరేభు
ల్లట విర టు నిల్లు జనిరట
ఘటమున నేనుఁగుల గుంపు గలదు ముకుందా! 6

తార బృ హస్పతి భార్యయె
తారక పివరుం  డువాలి  దార ముదముగన్
తార దివి నక్షిని గలదు
తారల గణనమ్ము సులభతరమౌఁ జూడన్. 7

పాండు నందనుండు పార్థుని వరియించె    
ద్రుపద రాజ కన్య , ద్రోణు వలచె
కృపి కమల నయన ట కృపుని భ గిని తాను
గురువు ఫల్గునునకు కుంభ భవుడు 8





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి