2, అక్టోబర్ 2015, శుక్రవారం

పద్యాలు 3


నన్నయ గారి ఉత్ఫలమాల కు తేటగీతి పద్యము:
మనము నవనీత తుల్యము మాటలు గన
దారుణాఖండలాశని ధారలు సుమి
విప్రులకు విపరీత ముర్వీశుల కును
ద్విజు డెఱుగు శాప నిహతి భూవిభు డెఱుగడు                              73

అందమైన మిరప కాయలు గల మొక్క:
ఇంపు గొలుపు కెంపుల వ
ర్ణంపు మిరపకాయ సొంపు లరయంగన్నా
వెంపు హరితంపు పెంపున
గుంపీ వైపుఁ గనువిం దగుచు విలసిల్లెన్                                        72

అంశం... చలి”:
సీ. ఉత్తర దిక్కున నుహుహూ యనం జలి గాలులు వీచెను గాఢముగను
    రాత్రులన్ని బహు దీర్ఘంబయి తరిగెను బవలు లంబరమణి పాఱఁ జలికి
    శంభుని ఫాలమం దంభుధి గృహమేధి యిండ్లను త్రేతాగ్నులిరికె బెదరి
    సతుల త్రిమూర్తులు సంగతి వదలరాయే శీత లార్తిని నెంత నరులు       71

ఆ.వె. వీధి వీధి వెలగె వెచ్చని మంటలు
       గుంపు గుంపులు జను లింపు గొలుప
       ముద్దుల మురిపెంపు ముచ్చట లాడుచు
       నంత కాగిరి చలి సంతసమున                                              70

దినదినము గండ మాయెను
జనమేజయ గురునికి ముని శాప భయమున
న్ననిశము శుక యోగీంద్రా
ననోద్ధితము హరికధా నినద పరితుష్టున్                        69

ధీరత్వంబున శునకము
పౌరగమన నియమ సుపరిపాలన నియతిం
గోరిన ప్రభుత్వ మిచ్చెనొ
గౌరువ మొప్పగఁ గనుండు గ్రామహరీశున్                     68

యేసు క్రీస్తు జనన సన్నివేశము:

అచిరద్యుతి సదృశామల
రుచినిచయము కందర తటి లోలిత గతినిన్
ప్రచరింప నేగి తారా
నుచరులు గాంచి రట క్రీస్తు నుత్సాహముగన్                     67

సీతాకోక చిలుక వర్ణన:

కమనీయ వర్ణ సముదా
యము నన్నలరుచు ఛదద్వ యాకర్షణ వి
భ్రమ, సీతాకోకచిలుక,
సుమ మకరందాశను గన చోద్యంబాయెన్                                   66


ఇంతలు గన్నులుండఁ దెరు వెవ్వరి వేడెదు నిర్భయంబుగన్
వింతగఁ దోచు చున్నది వివేక విహీనుడవై చరింపగన్
సుంతయు భీతి సెందక విశుద్ధ చరిత్రులఁ బెద్దవారలం
బంతము బూని నిందలిడి ప్రాణము మీదికి దెచ్చుకొంటివే            65

ఇంతలు గన్నులుండఁ దెరు వెవ్వరి వేడెదు బ్రాహ్మణోత్తమా
వింతగఁ దోచు చున్నది వివేక విహీనుడవై చరింపగన్
సుంతయు భీతి సెందక విశుద్ధ మతిన్ హిమశైల సానులన్
గాంతల నేకతంబ పలుకంగ నెపంబున గాక నేమనన్                  64


చింత కాయల గుత్తి యున్న చిత్రమును చూచి:
చూలాలుల కిష్టం బట
మేలగు తీయని పులుపుల మేళపు రుచులన్
వీలుగ గింజల తోడన్
బాలిక లాడుదురు గూడి పరమప్రీతిన్:                                    63

పత్రమునఁ జిత్రము కడు వి
చిత్రముగన్ నేత్రములకు చిత్తంబునకుం
జిత్రానుభూతి నిచ్చి ప       
విత్రానందము నొసంగె విస్తారముగన్                                            62


కటకట యెంతమాట ననుఁ గాదని యాతఁడు నొక్క మానవున్
చటుల మనంబు తోడ నొక శౌర్యవిహీనుని  రాజ్యదూరునిన్
పిటుకని రాము దా శరణు వేడె విభీషణుడంచు నెంచె న

క్కట దశకంఠు డెట్లెఱుగు ఖండిత శాత్రవ గాత్రు రాఘవున్         61

హృత్పద్మము వికసించును
మత్పూర్వభవాదులన్న మర్చిన యేకిం
చిత్పుణ్య విశేషమున భ
వత్పద పద్మములు గనిన పన్నగదమనా                          60 

ఇడుములు వచ్చును పోవును
వడివడి మబ్బులట నింగి వచ్చిన భంగిన్
పటుతర వాయు నిభ ధృతిన్
జటిల సమస్య లవలీల  సన్నగిలునిలన్                             59

కలిమి వివేకశీలురకుఁ గల్గఁగఁ జేయునపార కీర్తినిన్
చెలిమిని దానధర్మము లశేష దయాగుణ రక్తిఁ జేయగన్
కలిమి వివేకహీనులకుఁ గల్గఁగఁ జేయు నపార దర్పమున్
మలిన మనస్కులై విభవ మత్త విచేతను లౌదు రందఱున్           58 

పశుసుత పత్న్యాదులఁ బర
వశులై మోహాంధకార బద్ధులు నరులున్
విశదమ ఋణానుబంధము
పశమింపం జనుటలెల్ల బాంధవ్యములున్              57

కందిపప్పు చారు కటువయ్యెరా రామ
వెలసె నిపుడు వివిధ పిశిత పాక
రాజ భక్ష్యములు సురాదులు చోష్యముల్
పశ్చిమోర్వి సుప్రభావమునను                            56

రాక రాక వచ్చితివి శ్రీరామచంద్ర
వారిద నిభదేహా రఘు వంశ తిలక
దశరధతన యాఘవినాశ ధరణిజేశ
ధన్యుల మయితిమే తవ దర్శనమున                      55

క్షణ మొక యుగమై తోఁచెను
ఫణిరాజ శయను నఘారిఁ బన్నగ దమనున్
ఫణిరాజారి విహారిని

ఫణినిభ భాసుర ఘనతర బాహుంగనకన్                   54 

వచ్చి పోవుచుంద్రు బంధువుల్ మిత్రులు
ధనము గలిగెనేని దండిగ నిల
ధన విహీను జూడ దలగి పోవరె వారు
ధనమె మూల మాయె ధరణి నేడు!                           53

నమ్మితిని నా మనమున సనాతనులగు
నాది దంపతుల శుభంకరావిరళ కృ
పారసామృత వీక్షణా ప్రసరణులను
పార్వతీ పరమేశుల భక్తి తోడ                                   52

పరి పరి విధములఁ జెప్పితి
పరిపక్వాహార భోజ్య భక్ష్యాదులచే
విరివిగ దధి నీరాదుల
బరితుష్టుల జేయు మనుచు బాలింతలనున్                   51

సంధ్యా వందన బాలా
నింధ్యుడు వామన నిభుండు నింకను చదువుల్
సంధ్యల చిక్కడు జూడగ
వింధ్యా పర్వత నివాస విబుధుండేమో                           50

నే నొక పూలమొక్క కడ నిల్చిమనోహర పుష్పవాటికన్
భానుని తీక్ష్ణ తేజములు భాసురమైయటఁ బ్రజ్వలింపగన్
వీనుల విందు గొల్పెనట వేడ్క మృదంగ రవమ్ము లత్తరిన్
కానగ సల్పుచుంటి రొక కాంతకు పెండ్లియ వైభవమ్ముగన్     49

ఎవ్వఁడో వచ్చి నిన్నుద్ధరించు ననుచు
భ్రాంతి బడనేల? నీ ప్రతిభను మది నెఱ
నమ్మి చక్కటి కృషితోడ నరయు ఫలము
కృషియె మూలమీ జగతికి కీర్తి నొసగు                      48

వరవీణా మృదుపాణీ
కరకమ లాలంకృతాబ్జ కందర్పరధ
న్నరవిందాసన సుందరి

సురుచిం గొలుతును విధాత సుమనోహారిన్                    47 


పద్యరచనకు అంశము బాలల దినోత్సవము
బాల లతి సున్నితులు నిష్కపటులు  నిర్మ
లులు వివృత హృదయులు పెద్దలు నుడివిన య
టులె చరింతురు గాదె యిటు లన దగును
నేఁటి బాలలే రేపటి నేత లనుచు                                 46

చిత్రాన్ని (Ice creams) పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.
విశదంబిది జనులకు పర
వశులై మురియుదురు గనిన బాలురు విడువన్
వశమగునె సురుచి రామో

ఘ శర్కర మిళిత తుషార ఖండము లచటన్                    45

అటఁ జని కాంచెను ప్రవరుఁడు
నటనోల్లాస మదశిఖిగణా వృత తటినిన్
కటకచరిత మృగ యుగముల్  
పటుతర వృక్ష భరితమ్ము పర్వతరాజున్                           44

తిమిరముఁ బాఱఁ ద్రోలుటకు దీపము లెల్లెడఁ దేజరిల్లెనే
సుమదళ దామసంయుత సుశోభిత సౌధ విరాజితావళుల్
ఢమఢమ శబ్ద మత్తరి పటాకులు గాల్చ నభంబు నిండగన్
ఘుమఘుమ లాడు వంటలట గూర్పగ బండుగ జేసి రెల్లరున్     43 

ఒక మంచిమాటె చాలును
సుకరంబులగుబనులెల్ల సూటిగ ధరణిన్
సకల విబుధజన సంతో
షకరము, మృదుభాషణములు సన్నుతములగున్               42 

పూమాలల్ గడు భక్తిఁ దెచ్చితిని నీ పూజార్థినైయా ర్తినిన్
వేమారుందవ నామ మంత్రమును కాపీర్ణంబుతో దల్చుచున్
రామారామ యటంచు నిత్యము నపారాచంచలాసక్తినిన్
ప్రేమంబొప్పగ పూజసేతు నయ నే రేయింబవల్లిద్ధరన్               41

నీతుల్ జెప్పెడివారలు
కోతలు కోసెడి ప్రబుద్ద కోవిదులును ప్ర
ఖ్యాతుల సలహా నీయను
జూతుము గాదె జనులనిల సూటిగ లీలన్                             40 

కాలుని దున్నపోతు మెడ గంటలుకన్పడవెప్పుడేరికిన్
కాలము కర్మమున్నరసి కాలుడు జీవుల ప్రాణవాయువుల్
జాలియొకింతజూడకయు సత్వరముంగొనిపోవునుంగదా

కాలుడు ధర్మ మూర్తి యవికారుడు సంయమనుండు జూడగన్        39

పద్యముఁ జెప్పఁగావలెను భావము పండిత పామరేద్ధ సం
వేద్యముగన్  పఠింపనల వీనుల విందుగ శోభితంబునై  
హృద్యమ మై వెలుంగుచు సహేతుకమౌ పద సంహితంబునై
విద్యల నుత్తమంబుగ కవీశ్వరు లందరు జెప్ప నేర్తురే           38

వనితయుఁ గవితయు రెండున
వని కుసుమ సదృశులపార భావ నిగూఢుల్
మనముల నలరింతు రిరువు

రు నలంకారప్రియులు గురుతర గమనులే                        37

చుక్కలు మిలమిల మెరిసెను
మిక్కిలి వింతగ వెలసెను మిహికాకరుడున్
చక్కని వెన్నెల విరిసెను
గ్రక్కున  శారద నిశీధిఁ గనువిందగుచున్                           36

దైవముపైన భారమిడి ధర్మముఁ దప్పక సంచరించుచున్
పావక కీల లందు మసిబారిన వీటిని వీడి నత్తరిన్
పావన జాహ్నవీ నదిని పాటవ మొప్పగ దాటి రాత్రి వే

ళా వసుదేవసూను మది నందిడి పాండవు లుండిరే వనిన్        35 

విసమును మ్రింగినట్లు కడు వేదన మానసమందు నాటగన్
వసుమతి భర్త దుర్మరణ వార్తయు రామవనాంత రమ్మునన్
వసనము నార  చీరల సభార్య సహానుజుడై  ప్రవాసతన్

మసలగ లక్ష్మణాగ్రజుడు మండుచుఁ దల్లిని జూచె నుగ్రతన్          34

భరతభూమి రక్ష బడులు గుడులు వేద
శాస్త్ర తతులు మరియు సంయమనము
భిన్న జాతు లైన భేదభావులు గారు

భరత మాత ముద్దు పౌరు లెల్ల                                     33


ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు సంతసంబుగన్
మ్రాకుల తోటలందిరిగి మక్కువ నూయలలూగి నంతప
ద్మాకర మందునీది విగతశ్రము లై ఘన మోదమొప్పగన్

చీకటి క్రమ్మకుండనిలు చేరహముల్ మరు వంగ వచ్చునే       32

సామాన్యుఁడు వీఁ డనుకొని
యా మనుజాశన బకాసు రాధము డచటన్
భీముంగని భీషణ సం

గ్రామమునన్ ధృతి సెడి సనె కాలుని కడకున్                     31

ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు
విబుధ జనవిధేయ విహీన వినయగుణ ర
హితుడు సభ్యతా సంస్కార హీను డైన
విద్య నేర్చినఁ వాడొక వింత పశువు.                                30

ఇదె కద పుణ్యకార్య మన నెల్లరు మెచ్చఁగ వైభవమ్ముగన్
సదమల వృత్తి  యాజయిత సద్విజ సంయమి శాస్త్ర వేద సం
విద సుసమేత మైపరగ వీర వరేణ్యుడు రాఘవుండిలన్
ముదమున వాజియాగము సమున్నత రీతి సమాచరించెనే          29

నవవికచ సరసిరుహము సు
కవివర కవనార్హతావికసితోల్లాసన్
జవరాండ్ర వదన సదృశమ

రవిందమును గన మనోభి రామము గాదే                   28 

ఔరా కలయా నిజమా
శ్రీరాముడు చనుట నారచీరలను జటా
ధారి వనవాస మెనిమిది

యారేండ్లు దశరధు పంపు నరయం గలమే                     27

మారీచుడు రావణునికి చేయు హిత బోధ. దానిని విని తిరిగి లంకకు చేరుకుంటాడు రావణుడు.
విను మిదె నా హితవాక్యము
చనుమీ లంకకు నతిప్రసన్నత దనరా
రు నిజసతీ రాగంబున

ఘనుడా రాముడు సభార్య కానల దనియున్                         26

కటకట యిట్టి మాట లనఁగాఁదగునే చెపుమా సభాంతరన్
పటుతర వృద్ద బాంధవ నృపాల గురూత్తమ ధర్మవేదులున్
ఘటికులు వేద శాస్త్ర ఘన కౌశల దర్పిత విప్ర సంఘముల్

ఘటనము సేయ యాగము వికారపు పల్కులు కృష్ణుడోర్చునే          25 

బలము గలదేని నాతో
బలీ తగు చలము వహించి, వజ్రాహతికిన్
కలవర మొందియసుర మా

యల గెల్చుట ఘనమె, పోరుమయ్య గనియెదన్              24

వికసించెను ముఖపద్మము
కకావికలుగ శివచాప ఖండన మవ జా
నకికి నట రామునింగన
సకలగుణ విరాజితుండు సన్నుత వీరున్                                23 

కలయో వైష్ణవమాయ యొక్కటగునో గాకౌర వింతన్ బృహ
న్నలసారధ్యము వీడి ధన్వియయి బాణౌఘమ్ములన్ ధార్తరా
ష్ట్రుల గాంగేయ సమేతులం బఱచె నుగ్రుండై రణోత్సాహి గా
కిల రానున్న మహారణంబునకు సంకేతంబు గాకుండునే              22

కలయో వైష్ణవమాయయొ
లలనయశోదగనెనుబల రామానుజ లీ
లల నోట విశ్వమంతయు
బలారిసన్నుతుగొలుతును పద్మదలాక్షున్          21

ఔరా యెవ్విధి నమ్ముదు
వీర వరేణ్యులఖిలాస్త్రవిధ్యాధికులన్
కౌరవులు పాండుతనయుల
ఘోరారణ్యముల బంప కుటిలత్వమునన్              20

సూర్యోదయ వర్ణనము:

సీ.     పాలక డలిన నుద్భవ మొంది దర్పించి వెడలు లక్ష్మి తిలక బింబ మనగ
         మునులు నదీ తోయముల మునిగి యట బాలార్కు నర్చించుచు నర్ఘ్యము లిడ
         శార్వరీ తిమిరమ్ము సన్నగిల్ల యరుణ కాంతులు జగతిని క్రమ్ముకొనగ  
         చౌర సంఘమ్ముల జారుల చిత్తంబు లెల్లను మొత్తంబు  తల్ల డిల్ల  
ఆ.వె.  ఆల మంద లచట నంబారవమ్ముల
         పల్లె పడతులంత పాలుబిదుక
         కొక్కురోయనంగ కుక్కుట ములు కూయ
         భానుడు కనిపించె  భాసురముగ 19 

కమలములవంటి కన్నులు
నమలకుసుమకోమలారుణాంచిత పదముల్
విమలశిఖ మండిత శిరము
సుమదళ దామ వసుదేవ సుతునింగనరే              18


 సీతా దేవి రామునికి మాయ లేడిని చూపుతున్న సందర్భము:      
 మృగ వికారుడుమారీచు మృగమనుకొని
 విహ్వలారీ మృగము మణి వెలుగులన్న
డరెను గద నెల రాజీ పుడమి తెరగున
రమణి భవ్యానుకంఠీధర గనుమనియె                     17

భారతార్ధమున:

కారు కూతలేలా రిపు కాయములను
రణమున పడడు రాజీ పురందర తన
యుండు ఖండింప డేవేగ యుద్ద భూమిఁ

ప్రాణములు వోవ కలుగు దివ్యాను భూతి    16



మగఁడా! పోటుమగండ వీవె యని సంభావింప నుద్రిక్తుడై
మగువా వీరవ రేణ్యు ధర్మసతియున్ మాంచాల ప్రేరేపగన్
పగవారిం దునుమాడ నెంచి చనె కోపావేశ సంరంభియై
విగతాసుండయె బాలచంద్రు డకటా వీరుండు పల్నాడునన్   15

అనిశము సర్వభూతములయందు నుదార కృపాళుడై యిలన్
వినయ విధేయ తన్గురుల వృద్దజనంబుల గారవించుచున్  
మనమున నిత్యతాపమదమత్సరమోహగుణాళి దూరుడై

యనునయ వాక్యసంపదల నార్తుల గాచుచు నుండ ధన్యుడే 14 

ఇద్దరు భార్యలు గలిగిన
మద్దెల దరువే ప్రబుద్దు మర్త్యుని కకటా
బుద్దిగ నొక్కసుదతినిన్
ముద్దు మురిపెములొలికించి మోదపడదగున్  13

నే నొక పూలతోటకడ నిల్చితి నొంటిరినై యొకింత ని
త్యాను భవార్హ తోపకరణాదుల గూర్పగ చింతనా రతిన్
మానస మందె సంతసము మల్లెల మొల్లలగంధమత్తరిన్
మేనలరెన్ సువాసన సమేతపు మారుత తాడితంబునన్       12

ఏమని వర్ణింతును నీ
రామాంకిత భాగవత పురాణాధికముల్
వేమారు చదువ తనియదు   
నామది సతతమ్ము పోత నార్యా  ప్రణతుల్ 11

ఎంత సుదిన మిద్ది యేమని వివరింతు
మేమిట బొడగంటిమి వసుదేవ
నందను పరితోషనందు సహిష్ణు రో

చిష్ణు విష్ణు కృష్ణు జిష్ణు నలర   10

పుడమిఁ గల జనులు పొగడఁగ
నడరిన ముఖకమలుడు గురునత శిరుడును రా
ముడట శివధనువు విరువగ
వడివడి ముదిత జనకసుత పరిణయ మయ్యెన్ 9

బాల కృష్ణుని శైశవ కష్టాల సందర్భము లో :

కటకట యెన్నికష్టములు గల్గెను పూతన నంజు స్తన్యమున్
జటిలపు బండి ఘాతమును జక్రసమీర విఘాత దైత్యుడున్
పిటుకగు రక్కసుం డొకడు వేష విశేషి సువత్స రూపుడున్  
తటకపు నొక్క కొంగయు విదారకు బాధ సహింప నేర్వవే                   8

(నంజు = విషము; విఘాత = అడ్డంకి;  పిటుకగు= గట్టి; తటకపు = ఆశ్చర్యమైన)

కవివర!నీ కవిత్వమునఁ గాంతుము భావ గభీర గూఢముల్ 
కవన సుధార సోద్దిత వికాస మనోజ్ఞ మరంద  ధారలున్               
సువికసితా రవిందములు సుందర శబ్ద సుసంహి తమ్ములున్
నవరస గుంభితా విరల నంద విశేష  విలాస దాయముల్ 1

ఎక్కడ కేగువాఁడ నిపు డెవ్వని వేడుదు నార్త త్రాత దా
నెక్కడ లోకనాధు డన నెవ్వడు దీనజనోద్ధరుండు దా
నెక్కడ భక్తపాలుడన నెవ్వడు దానిట నన్ను పేరిమిన్                                    
మక్కువ జూపినిమ్మకరి మత్తుని వేతన బాప రాగదే 2

మనసిజ పుష్పబాణము లుమాటికి  గ్రుచ్చఁగ వెచ్చనూర్చుచున్
వనరుహ నేత్రుఁ గృష్ణు మధువైరి తలంపుల బాధలోర్వకన్
ఘనవిపి నాంతరమ్ముల నఘారి నగోచర దర్శ నార్తులున్            
చనిచని వేడుకొంటి రట జాడ నొసంగ లతా నగమ్ములన్  3

న్యాస తటీ నగరాజ వి
లాసితమున్ స్వాదుతర జలాశయ రాజున్
భాసిత కోకనదాశ్రిత                             
కాసారము నట గనుండు కమలాకరమున్ 4

కురునృప! పాండునందను లకుంఠిత దీక్షఁ విశేష విద్యలన్
స్థిరమతి తోడ నేర్పున  విచిత్ర పుటస్త్ర సశస్త్ర రీతులన్ 
గురువరు కుంభసంభవు నిగూఢు నరోత్త మపార కౌశులున్
కురుకులవృద్ధ భీష్మడ లగూర్పగనేర్చిరికౌర వేయులున్ 5

హరసుత గజశిర లంబో
దర విఘ్నేశ్వర నగసుత దనయ దురితసం
హర మూషిక వాహన సుర
వర సన్నుత గై కొనుమివె వందన శతముల్    6

అతి దంభంబున దానధర్మముల దా నత్యంత వేగంబునన్
మతి జేయంగ దలంచి వేసెనొక  బ్రహ్మాండంబనిందల్చుచుం
బ్రతిపాద్యంబుఁ బ్రణాలికం ఘనుడు సౌభాగ్యోద్ధరీయంచికం
బ్రతికూలంబవ నాటి యూహనకటా ప్రత్యాశ యయ్యెంగదా! 7



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి