శ్రీరామ స్తోత్రము
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు.)
ద్విపద మాలిక :
శ్రీరామ రఘురామ సితదామ రామ
కారుణ్య వననిధీ కాకుత్స్థ రామ
జానకీవల్లభా జనలోక రక్ష
దానవ భంజనా ధరణీశపుత్ర
సీతా మనోహరా శివచాప భంగ
దాతాగ్రగణ్యేశ దనుజేంద్ర దమన
తాటక సంహార తారక రామ
పాటవ ధీశాలి పరమాత్మ రామ
సత్యపరాక్రమ శత్రుసంహార
భృత్యాను కంపన పిశితాశనారి
కోసల క్ష్మాభర్త కోదండ రామ
కౌసల్య నందనా కౌశిక శిష్య
కౌశికు యాగము గాచితి వీఁక
నీ శర సంపద నిగ్గును జూపి
జానకిఁ జేపట్టి సంతోష మడర
మౌని దర్పము నెల్ల మాయము సేసి
యువరాజ పదవిని నుదరి గైకొంటి
సవతి తల్లి యనుపఁ జాగితి వనికి
రక్కస బెడదను లయ మొనరించి
చక్కఁగ మునులకు శాంతి నొసంగి
పడతి కోరికఁ దీర్ప వనినిఁ జెలంగి
పుడమి పట్టినిఁ బాసి పొగిలి కరమ్ము
అడవినంత వెదకి యనుజుని తోడ
వడి శబరినిఁ గాచి కడు దయ తోడ
పంపను సుగ్రీవు వానరేంద్రుఁ గని
చంపి వాలిని వాని కింపు నొసంగ
కోఁతి మూకను గూడి నాతి కొఱకయి
కూఁత లడర దాఁటి ఘోరార్ణవమ్ము
రావణుని వధించి రాక్షస నాథు
చేవ మీఱఁ గరము చెలిని గ్రహించి
చేరి యయోధ్యను శీఘ్రమ్ము గాను
నీ రాజ్య మేలితె నెమ్మి నొసంగ
దశకంఠ సంహర్త దాక్షిణ్య మూర్తి
దశరథ నందనా దయజూడు మమ్ము 1
రామ! భవాఘ విరామా!
శ్యామల తను రుచి లలామ! సద్గుణ ధామా!
రామా! సత్య పరాక్రమ!
భామావనిజ హృదయాబ్ధి భాసిత సోమా! 2
రఘు వంశాబ్ధి శశాంక! కోప జిత పారావార! కోదండ పా
ణి! ఘనాకార విరాజితా! కపి వరానీకైక సద్రక్షకా!
యఘ దూరీ కృత భక్త సంచయ! దశాస్యప్రాణ విధ్వంస! సూ
ర్య ఘృణివ్రాత నికాశ సద్విమల దేహా! రామ! సీతాపతీ! 3
ఇక్ష్వాకు ప్రవ రాబ్ధి పూర్ణ శశి దైత్యేంద్రక్షయార్థైక జ
న్మ క్ష్వేడా స్వన సత్య వాక్చతుర సంభావ్యుండు ధానుష్కుఁడున్
సక్ష్వింక వ్రజ భాను సూన సఖుఁడున్ సద్ధర్మసత్పాలుఁడున్
సుక్ష్వేళాత్త గళాంబికా పతి దయాంశు శ్రేణి లబ్ధుండు ప్రా
ప్త క్ష్వేళీ ద్విష పుంగ వానురతినిం బ్రార్థింతు సీతాపతిన్ 4
మందాక్రాంతము.
ఇక్ష్వాక్వంభోనిధి సిత నిశీథేశ సంకాశ మూర్తిన్
సుక్ష్వింకానీక ధవ రవి సత్సూన సంభావ్య ధీరున్
భిక్ష్వామ్నాయప్రముఖ శివ సంప్రీత ధానుష్క వీరున్
స్విక్ష్వత్యుగ్రాస్త్ర ధర నిభు నే నింపుగం గొల్తు రామున్ 5
ఇన వంశార్ణవ పూర్ణచంద్ర నిభ మత్తేభేంద్ర సంచార మో
హన నీలద్యుతి భాసి తావయువ సత్యద్యోత దుర్విక్రమా
వన కార్యైక సునిశ్చయాత్మక లసద్బాణాసన స్కంధ సా
వనిసంజాత సలక్ష్మణ స్థిత సుదుర్వైరిఘ్న రామా నుతుల్ 6
ధరకన్యామణి హృద్వనాంతర లసత్కల్పద్రుమా రాఘవా
వర రాజన్య విరాజమాన రవి సద్వంశాటవీ కౌముదీ
దురభిక్రాంత సురారి ఘోర గిరి సందోహైక నిర్ఘాతమా
హర పద్మాసన శక్ర దేవగణ నిత్యారాధ్య రామా నుతుల్ 7
గుణ సంసిద్ధ సదా విరాజిత మహా కోదండ హస్తాంబుజా!
గుణ సంధాన పరాక్రమ ద్యుతి మహాకోదండ విధ్వంసకా!
క్షణి కోద్రేక మహీసు రార్చిత మహేష్వాస ప్రభా గ్రాహకా!
రణ విచ్ఛేదిత దైత్య సంచయ! విభూ! రామా! మముం గావుమా 8
నీలాంగ ద్యుతి పుంజ నిర్జిత చలన్నిర్భేధ్య పర్జన్యమా!
వేలాక్రాంత యశః పయోధి! కృత నిర్వీ ర్యోగ్ర రత్నాకరా!
లీలా మానుష రూప సంచరిత కేళీ ఖండితాస్య వ్రజా!
బాలా భూమిజ హస్త పూజిత పదా! పాలింపవే రాఘవా! 9
[ఆస్య వ్రజుఁడు= ముఖ సమూహములు కలవాఁడు, రావణుఁడు]
కమల విలసితము:
దశరథ తనయ సదమల చరిత్రా
కుశలవ జనక సుగుణ గణ ధామా
శశినిభ ముఖ హరి సదృశ సుమధ్యా
దశశిర విదళన ధరణిజ నాథా 10
నారాయణ వృత్తము.
నీలి మేఘశ్యామ రామ
వాలి జీవధ్వంస భీమ
లాలితోత్సంగస్థ సీత
జాలి చూపించంగ రావ! 11
నేరము లెంచకు చూపుమ
తీరము ఘోరపు భవముల దింపకు రామా
కోరెద నీ పయి భక్తియ
తోర మఘలతా లవిత్ర తోయజ నేత్రా 12
సీతా దేవి స్తోత్రము:
సమ దా ళ్యావలి పాఱెఁ గాంచి లలనా శ్యామాలక శ్రేణులం
గమనీ యాబ్జము లప్పు దూఱె నరయం గాంతా ముఖాంభోజముం
దిమి వేశ్మమ్మున దాగె శంఖములు దొంతిం గాంచి తద్గ్రీవముం
దమి యేపారఁగఁ గాంచి లే ళ్ళుఱికె సీతాదేవి కందోయినే 1