1, ఫిబ్రవరి 2016, సోమవారం

సమస్యాపూరణ_ఫిబ్రరి2016

అధమ మార్గమ్ముల ధనార్జ నాను రాగు
రాగ మత్సర కలిత దుర్వ్యసన పరుని
పరము విస్మరింపంగ నపగత ధర్ము
ధర్మసత్రనిర్మాణముల్ దగని పనులు.                                          31

పార్థసారథి జన్మించె భానుమతికి
పతి సుయోధను పినతల్లి వదిన గారు
దేవకీ దేవికిన్ వసుదేవు డంత
సంత సించ నా కంసుండు చింత నొంద                                            30

తలగితి వీవు వనాంతర
తలమున మము వీడి కృష్ణ దయ వీడితివే
తలపులు నీపై నిడి భూ
తలమంతయు వెతుక నవగతము గాదాయెన్                                29

సద్యపు స్ఫూర్తినిన్ వినయ సంపద లందున నుత్తముండునై
హృద్యము లైన కార్యతతు లింపుగ నేర్పునఁ జక్కబెట్టుచున్
వైద్య విశారదుండు నుడు వన్నిక దప్పద టంచు నించుకన్
మద్యముఁ ద్రాగువారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్.           28

రామ నామమాత్ర దురిత లాలసుండు
సత్య వచన దూరు డవని నిత్య కపటి
పర ధనాసక్తుడు వ్యసన పరు డభినవ
రాముఁ డన నెవ్వఁ డతఁ డొక రాక్షసుండు.                         27

చలము నుత్సాహముం గృషి సరస మధుర
భాషణమ్ముల నిమ్ముగ వసుధఁ బరగు
చుండ తనదరి రానీయ కుండ నున్న
పగటినిద్ర బద్ధకము సంపదల నొసఁగు.                              26

శస్త్ర నైపుణంబు జక్కగఁ జూపుచు
ధైర్య సాహసములఁ దనరి ఘోర
సమర మందు ఘనులు శాత్రవ వీరుల
వెన్నుఁ జూపువాఁడె వీరుఁ డనఁగ.                                        25
కర్షకులకు నెల్ల హర్షాతిరేకమ్ము
లొసగ పాడిపంట లున్నతముగ
వృద్ధి జెందు చుండ విరివిగఁ పైరుల
వెన్నుఁ జూపువాఁడె వీరుఁ డనఁగ.                                          24

పావనమైన భద్రగిరిఁ బబ్బము సేయగ నెంచి రెల్లరున్
దైవ సుకార్యనిర్వహణ ధాత్రిని మానవ ధర్మమంచునా
దేవుని పెండ్లికిం జనుల దీయని పల్కులఁ బిల్చిరివ్విధిన్
నీవును నీవు నీవు మఱి నీవును నీవును నీవు రావలెన్.           23

సత్పురుషుల కనిశమ్ము ప
రాత్పర విమలాంచిత పద లాలిత సేవా
తత్పరులకు వెత! భగవ
త్తాత్పర్యము బోధపడదు తత్త్వజ్ఞులకున్.                               22

రావణ వధాంతరమ్మున రమ్యముగను
దోష రహితుండు ఘనుడు విభీషణుండు
లంక నేలెను రాజయి లక్ష్మణుండు
రామచంద్రుండు దీవింప రాగమొప్ప                                      21

విష్ణుపదప్రాప్తము భ
క్త్యుష్ణము సుతదారధన వియోగము ననగన్
తృష్ణవిహీన జనాంచిత
కృష్ణపదారాధనమ్ము కీడొనరించున్.                                       20

సంఘ విద్రోహు లెల్లరఁ జక్క బఱుప
మహిని, భక్తి శ్రద్ధల తోడ మదిని దలచి
కన్నతల్లిని మించిన కరుణమూర్తి
భరతమాతను,  దూషించువారె ఘనులు.                                19

కోపావేశమ్ము లుడిగి
పాపమ్ములకున్ మనమున  బాధం బశ్చా
త్తాపము జెందిన వారలు
పాపాత్ములు భ్రష్టులు జనవంద్యులు జగతిన్.                            18

నడ్రేయి లేచి వగచియు
దొడ్రాయిగ మారివేడ దురిత విదూరున్
తోడ్రాని తోటి వారును
గొడ్రాలికిఁ గొడుకు పుట్టెఁ గోడండ్రేడ్వన్.                                      17

కోనేరున జేరె మకరి
దీనమ్ముగ వరద నీట దేవుని లీల
న్నానీరాట మొక బకము
కోనేరున నొక్క చేఁప కొంగను మ్రింగెన్.                                         16
[చేఁపకు+ ఒంగను=  చేఁప కొంగను,  చేఁప కొఱకు వంగగ]

భస్మ మంగ మెల్ల పార్వతి సవ్యమై
కంఠమున గరళము గంగసిగఁ గ
పాలమాల గ్రీవ పథి శిరమున నెల
వంక యున్నవాఁడు శంకరుండు.                                                15

శాస్త్ర విజ్ఞాన సంతుష్ట  సద్వివేక
విరహి తాలఘు కార్య సంప్రీతు లైరి
కాని వాతావరణ మెల్ల కలుషితంబు
జలధరమ్ములు గరళవర్షమ్ముఁ గురిసె.                                          14

ధనమె మూల మంచు ధరణి నెల్లప్పుడు
లంచముల జనులను ముంచి యైన
పుడమి నందునున్న భోగభాగ్యమ్ములఁ
బతినిఁ గోరు కాంత భ్రష్టురాలు.                                                      13

పుత్రుని కొరకు కైకేయి శత్రు వాయె
రాముని సవతితల్లి ధరాతనూజ
భర్తను వనవాసంబంప భర్తఁ గోరఁ
జకిత మానసుండాయె దశరధు డంత                                            12

కలికాల మందు ధర్మము
కలదని తెలుపంగ నేమొ కరముం బ్రీతిం
గలతం జెందక సేవల
కలకాలము బ్రతుకు జీవి గార్దభ మార్యా.                                         11
వాసుదేవ వాసవుల నపార భక్తి
నసిత పథుడు వేడంగ నాహారమునకు
ఖాండవ వన దహన ఘన కార్య రతులు
రుక్మిణీ ప్రాణనాథుఁ డర్జునుఁడు నిజము.                                       10

కర్షకులకుఁ బ్రీతి నొసగ
వర్షాకాలమ్ము వచ్చు,  వైశాఖమునన్
హర్షాతి రేక హృదయా
మర్ష విదూరాత్ములు గద మానవులు భువిన్                                  9

కాలాను గతిం భగవ
త్పాలిత మీజగతి యెల్లఁ బ్రకృతి వశమునన్
మేలుగ, నతి దుస్సాధ్యము
కాలగతిని నిల్పఁ, గలఁడు గద మానవుఁడే.                                     8

ఏక చక్ర పుర జనేప్సితముం దీర్పఁ
దల్లి పంపున జని దనుజు బకునిఁ
జంప ననిల సుతుడు శకటంబు పైనెక్కి
కత్తి వదలి వచ్చెఁ గదనమునకు.                                                  7

మిక్కుటముగ దీప మక్కడ వెలుగంగ
చక్కగ గుమి గూడి సంధ్య వేళ
మిణుగుఱు లపుడు మితిమీరగ నెగురంగఁ
గోమటింటఁ దెగెను కుక్కుటములు.                                                6
[కుక్కుటములు =మిణుగుఱు పురుగులు ] 

ద్వాపర కాలమందు భరతావని వెల్గిన భారతంబునుం
జూపగఁ జిత్రరాజమున సుందర రూపులు పాత్రధారుల
న్నీపురమందు పాండుసుతు లేవుర కొక్కని నెంచ నత్తరిన్
ద్రౌపది కొక్కఁడే పతి గదా యని చెప్పిన మెచ్చి రెల్లరున్.                      5

క్ష్మాపతు లేవురిన్నియమ కర్తలునై యొక వత్సరం బొకం
డా పడతింట నుండ సమయావృత బద్ధత నుండు నట్టుల
న్నాపతు లేవు రింపుగను నారదు పంపున సంచరింపగన్
ద్రౌపది కొక్కఁడే పతి గదా యని చెప్పిన మెచ్చి రెల్లరున్.                       4

దాచిన దాగునె మోసము
నీచేసిన ద్రోహ మాగునే యూరక నిం
గాచెడి వారలు లేకన
నాచెంతకుఁ జేరినావు న్యాయమ చెలియా.                           3

శ్రీరమారాధిత పదాబ్జ చింత నామృ
తంబు నిత్యము సిక్కని యంబలి వలె,
చిత్తమెప్పుడు హరినామ చింతనాను
రక్తమును, ద్రాగువాఁడె పో భక్తుఁ డనఁగ.                               2

వైశ్రవణుడు పురుష వాహనుం డిలబిలా
త్మజుడు పైడిఱేడు ధనదు డేక
పింగళుండు యక్షవిభుడు నంచిత సమ
కాలయమునిఁ గొలువఁ గాసు లొసఁగు.                                1

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి