మర్మమ్ములు భేదిలఁ ద
త్కర్మమ్మును గాంచిన జనకాయపుఁ గేకల్
మార్మోగ నక్కయె గ్రసిత
కూర్మము పరుగెత్తె వడిని గుఱ్ఱము వోలెన్ 63
నర్మిలిఁ జేయ సాయము ఘనమ్ముగ వెన్నుఁడు స్వీయ సత్కృపా
ధర్మ మెడంద నెంచి వసుధన్ ధవ లాంబుధిఁ జేయఁగన్ బృహ
త్కర్మము మంద రాగమము దాల్పఁ దలంచుచు సంభ్రమమ్మునం
గూర్మము వాఱె వేగమున గుఱ్ఱము వోలె శిలీ ముఖంబుగన్ 62
అనవసర మైన దిచ్చినఁ
గన మెట్టి ప్రయోజనమ్ము గారవమునఁ గా
వున నడిగిన విత్తము ని
మ్మనుజున కవసరము లేని దాహారమ్మే 61
కన వలె నాహారమ్మును
గొన వలె హారవ్రజమ్ము కోర నగును వా
హనములు వ్యయించి విత్తం
బనవసర మగును మనుజున కాహారమ్మే 60
[ఆహారము = తిండి; అపహరణము]
ఊహాతీతము గాని సంధి ధరలో నొక్కండ మార్గం బగుం
బాహాటమ్ముగ నెంచ భూవలయ విధ్వంసమ్ము వారింపఁగా
నే హారమ్ములు శాంతి నీయ వినమే యెన్నండు విశ్వమ్ములో
నా హారమ్ముఁ గొనంగ మానవునకున్ వ్యర్థంబె ముమ్మాటికిన్ 59
[హారము = యుద్ధము]
కలవు కల్యాణ మంటపములు వధూ వ
రుల కొఱకు నింపుగఁ గవి వరులు నుతింప
విరివి విలసిల్లు చున్నవి పృథ్వి లోన
సాహితీ సంస్థలే ప్రయోజనము కొఱకు 58
మతి మంతుల్ నిరసించు శబ్దములు సంపాతమ్ములై యుండ స
న్నుతి సేయం గన నేతిబీర పగిదిన్ శూన్యమ్ము సాహిత్యమే
తతులన్ సంతత మూరకే బిరుదులన్ దానం బిడం గాంచఁగా
క్షతి లేనట్టి ప్రయోజనం బిడు నొకో సాహిత్య సంస్థల్ భువిన్ 57
గత భవ పుణ్య ఫలమ్మున
వితత ధనవ్యయమున జన వేద్యుఁడు వైద్యుం
డతి కుశలతఁ దప్పింపఁగ
సతి మరణము పతి కొసంగె సంతోషమ్మున్ 56
శత దశ కుంజ రాభ బల సన్నుత వీర్యుఁడు మల్ల యుద్ధ తీ
వ్రతఁ బరి ఘాభ దీర్ఘ తమ బాహువులన్ వలలుండు కొట్టఁగా
నత వదనుండు కీచకుఁడు నర్తన శాలను, జూచు చుండఁగా
సతి, మరణింపఁగాఁ బతికి సంతస మెంతయొ కల్గె బిట్టుగన్ 55
వద్దు వద్దని కడు వారించినను విన
కుండ నాదు సుద్దు లుత్సహించి
యద్ద నల్ల రంగు నానన మందు నే
నద్ద మందుఁ గాంతు నన్యు నొకని 54
అద్దము నందుఁ గాన నగు నాత్మ ముఖమ్ము యథాతథమ్ముగం
బెద్దలు పిల్ల లెల్లరు నభేదము నిత్యము చూతు రద్దముం
దద్ద నిజం బశక్య మిది తప్పన నేరికి వాహనమ్మునం
దద్దము నందుఁ గాంచి నపు డన్యుఁడు గన్పడు నెల్ల వేళలన్ 53
ఉత్సాహ మేల నిట్లనఁ
గౌత్సుకుఁడే కశ్యపుండు కాకోదరమే
కుత్సాహీన ప్రాణియె
కౌత్సునకుం దక్షకుండు గడు మేల్సేసెన్ 52
హృత్సుమ మందఁ దృప్తి నిడె నెంతయొ విత్తము సద్గుణైక రా
జత్సకలావనీ ధవునిఁ జంపఁ బరీక్షుతు శాప తప్తుఁ గా
ర్యోత్సుకుఁ డప్డు కశ్యపున కున్నత మంత్ర విరాజి కిద్ధ ని
ష్కౌత్సున కెంతొ మేల్గలుఁగఁగా నొనరించెను దక్షకుం డహో 51
సరసులోఁ బొడగని సరసకు నరుదెంచి
భర్త నరసి నలిన పత్ర నేత్ర
కాంత కోర నల్ల కలువఁ బోలం బయో
ముక్కుఁ గోసి తీర్చె ముచ్చటఁ బతి 50
అక్కుల కాంత కోరికల నన్నిటిఁ దీర్చుచు నొక్క టొక్కటిం
జెక్కిలి మీటి యక్కునను జేరిచి మిన్నగఁ బొంగఁ బ్రేమయే
చక్కని చుక్క గోరఁగను జక్కఁగ ముక్కర వెట్ట గోముగా
ముక్కును గోసి వల్లభుఁడు ముచ్చట తీర్చెను ముద్దు ముద్దుగన్ 49
తనకు మాలిన ధర్మమ్ము తాను జేయు
పగిది దిగి రాఁ దలంపక పాదపమ్ము
కింది కుఱుకంగ నెంచినఁ గీ డరయక
తాను నిలుచున్న కొమ్మనుఁ దగును నఱుక 48
అగణిత రీతి గౌరవము నందెను దొల్తను మూర్ఖుఁ డైన విం
తగ శివ యూని నట్లు పులిఁ దాఁ గని వాతలు లోకు లెల్ల న
వ్వఁగఁ గవి కాళిదాసు వర పండితు భంగి నొనర్ప నెవ్విధిం
దగును సుబుద్ధికిన్ నఱుకఁ దా నిలుచుండెడి కొమ్మఁ దానుగా 47
సతతం బిద్ధర ధర్మ
చ్యుతి కారణ మైన యట్టి జూదము నందున్
రతియే దేనికి లొంగెనొ
పతి చచ్చుట మంగళంబు భామా మణికిన్ 46
సతి చెఱ వోయె భర్త మది శాంతము నందెను నంద నానుకూ
లత లభియించె హర్షదము రా మృగ రాజవరేణ్య లోచ నా
గత మద కుంజ రాభ మయి కన్నని చెంతకుఁ గంసుఁ డా ధరా
పతి మరణింప మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్ 45
పండుగ దినమందు నడరి మెండుగాను
గారె లామవడలు వండి మూరి పప్పు
నరఁటి కూర పులుసు పరమాన్నము దగఁ
బాలు నీరు గలిపి చేసెఁ బచ్చడి సతి 44
కాలము మించ కా పలు రకమ్ములు నైన పదార్థముల్ గడున్
మేలుగ సంగ్రహించి మితి మీఱిన వేగము తోడఁ బ్రీతితో
నా లలితాంగి వే వలసి నట్టివి, ముందుగఁ జక్కఁబెట్టి యా
పాలను నీటి, లోఁ గలిపి భామిని సేసె నుగాది పచ్చడిన్ 43
ఉపాధ్యాయున కెంత వచ్చు నన్నది ముఖ్యము కాదు
తానెంత చక్కఁగ బోధింపఁ గలఁ డన్నదే ముఖ్యము.
అక్కఱకు వచ్చు నట్టివి
లెక్కకు మించినవి యెన్నొ లీలా గతినిం
జిక్కని కష్ట తరమ్ములు
లెక్కలు రా నట్టి వాఁడు లెక్కలు నేర్పెన్ 42
ఇక్కలి కాల మందు నిజ మెన్న నెడంద వహించి ధైర్యమున్
లెక్కకు సుంత గైకొనమి రేఁగ నగౌరవ గౌరవమ్ములే
మిక్కుట మబ్బు శాంతియు నమేయ సుఖమ్ములు నాఁగఁ జేరఁగా
లెక్కలు రాని వాఁడొకఁడు లెక్కలు నేర్పెను మేలనన్ జనుల్ 41
[లెక్క = పరిగణనము, లక్ష్యము, లెక్క]
ఏమఱి యన్నను సందియ
మేమియు లే దిందు సుంత యేనియు సత్యం
బీ మాట కాదనఁ గలమె
భీముఁడు పార్వతిని మెచ్చి పెండ్లాడెఁ గదా 40
భీముఁ డనంగ శంకరుఁడు భీకర తాండవ మాచరించు ని
త్యామర సేవితుండు త్రిపురాంతకుఁ డంతక దర్ప హంతయున్
భీమపుఁ దత్తపో నిరతి ప్రీతి నొసంగ గణించి దీక్షనున్
భీముఁడు పార్వతిన్ వలచి పెండిలియాడెను మెచ్చ దేవతల్ 39
భోగాసక్తులు గాకయె
బాగుగ నధ్వర్యు నాఖ్య భాసిలు చుండన్
యాగార్థ సోమ రసముం
ద్రాగిన మానవుని బ్రతుకు ధన్యం బగురా 38
రాగ యుతమ్ము రామ రఘు రామ సురార్చిత రామ యంచు భ
క్తాగమ నాభిలాష నిర తార్తి స భక్తి నిరంతరమ్ము ని
ద్రా గతి జాగ్ర దన్యముల రామ సునామ సుధా రసమ్మునుం
ద్రాగిన వాని జీవనము ధన్య మగున్ ధరలోనఁ జూడఁగన్ 37
ఏ మా నయినను నది మీ
కే మని యుత్తర మొసంగి యిల నాటఁగ వా
రా మొక్క, తనరఁ బ్రక్కన
మామిడి నిలువెల్లఁ బూచి, మారే డాయెన్ 36
వ్యాపారమ్మున విత్తమే పెరుఁగ నూహాతీతమై సంతతం
బాపాదింపఁగఁ బ్రాభవం బడరి రాజాతీతమే యేరి కే
నోపన్ రాని విధమ్ముగా మిరియ మంతుండంగఁ జిత్రమ్ముగా
రేపున్ మాపునుఁ బూచి మా మిడియె మారే డాయెఁ గన్విందుగన్ 35
[మిడి = గర్వము]
ధీమతి! పద నానార్థ
స్తోమ విశేషజ్ఞ! కవన ధుర్యా!సుగుణ
స్తోమ!ప్రజ యని సమంచిత
నామంబునుఁ బెట్టితే జనంబులకుఁ గవీ 34
స్తోమ పరంపరార్హ సువచో రచనా నిపుణా! వధాన సం
గ్రామ సభా స్థలాంతర సుఖస్థిత పండిత వర్య! వీత దం
భా! మృదు భాషి! ప్రాశ్నికుల మన్నన కర్హులుగాఁ గలంక హీ
నా! మముఁ బెట్టినాఁడవు జనంబులకున్ మురళీ! కవీశ్వరా! 33
గోముగఁ బతి దేవుం డా
వామాక్షి నవీన రీతి భార్యా మణియే
ప్రేమగ శాదమ్ముల భూ
రోమంబుల కూరఁ జేయ రుచిగ భుజించెన్ 32
భామల్ మెచ్చ భృశమ్ము పాకమును విభ్రాంతాత్మలై నిత్యమున్
క్షేమం బీయఁగ నెంచి భోక్తలకు వీక్షింపంగ మందంచు నా
వామున్ శక్తి యుతమ్ము నెమ్మి విభుఁడే, స్వాస్థ్యార్థమై వండు వా
రోమంబుల్ వడిఁ దెచ్చి వండినఁ గడున్ రుచ్యంబుగా మెక్కెనే 31
[వండు వారు + ఓమంబుల్ = వండు వా రోమంబుల్]
నిలిచి మేఁక వీఁపునఁ గాకి యులికి పడక
యఱచు చున్నది వీక్షింపు మయ్య సత్య
మఱచి నట్టిది కాకి మహాత్మ కాదు
మేఁక కావు కా వనెను మేమే యన దఁట 30
సాఁకెడు వేళ తిండి నిడి చప్పుడు సేయవు విశ్మయాత్ములే
కాకుఁడు మీరు వింత లివి కా వన నెక్కడి కేని తిండికై
పోక నగమ్ముపై నిలిచి ముచ్చట గొల్పఁగ నొక్క కాకమే
మేఁకకు మేఁతఁ బెట్ట నది మే యన కుండఁగఁ గావు కా వనెన్ 29
[అనక + ఉండఁగ = అన కుండఁగ]
కనులు కన్నులు దిన దినమును గలయుచు
నుండఁ గలిగె వారికి నంత మెండుగాను
బ్రేమ దాని వలన నయ్యెఁ బెండ్లి కూడ
రెండు రెండును కలువంగ రెండు వచ్చె 28
అండగ విద్య కింక వినయమ్మున కింపుగ జాలి దానమున్
మెండు గుణమ్ములం గలుప మేలుగ కీర్తి ప్రతిష్ఠయున్ భువిన్
దండిగఁ గల్గె నుత్తమ విధమ్ముగ నొక్కఁడు సంచరింపఁగా
రెండును రెండుతోఁ గలుప రెండు లభించెను లోకు లౌననన్ 27
ఎంత కష్టము వచ్చిన నింతి సంతు
కొఱకుఁ దపియించి నిలఁబడి కొండ వోలె
దేవకీ దేవి కారలో ధృతిని విశ్వ
భర్త కిచ్చెను దన్వి పావన జననము 26
కాలమే దొరలంగ నంత సుకాల మేర్పడఁ గోడలే
మేలు వొందఁగ నత్తగా నగు మేదినీ తలమం దహో
మేలుగా మును స్వీయ నాథుఁడు మెచ్చ దన్ను స్నుషార్యకుం
దాళి గట్టిన భర్త కిచ్చెను దన్వి పావన జన్మమున్ 25
మాంసము సేవింపఁ బరమ
హంస ధరణిలోన మాన్యుఁ డగునా వర శ
బ్దాంసాస్థి చయము ఛందో
మాంసము విడి పండితుండు మాన్యుం డగునా 24
ధ్వంసము కాదె సద్యశము తప్పక చెల్లునె యూన నిత్యముం
బాంసు విహీన వస్త్రములు పండిత సత్సభ లందు గోష్ఠిలో
హంస యనంగఁ దర్కమున వ్యాకరణమ్మున నైన స్వీయ భీ
మాంసముఁ గోరకున్నఁ దరమా ఘన పండితుఁడై చరింపఁగన్ 23
[భీమ + అంసము = భీ మాంసము; అంసము = అంశము, భాగము]
సంతసము పిక్కటిల్లఁగ సుంత యేని
నోహటిల్లకయుఁ బర మోత్సాహమున వి
నంగ వచ్చిన వారి మానసము లపహ
రణము సేయ వచ్చితి విచిత్రంపు నుడుల 22
తృణ మాత్రమ్మును స్వీయ డెందముల సందేహింపకే యొడ్డఁగా
ఫణ మొక్కింత వరావధాన సభలన్ స్వాంతమ్ము హర్షింపఁ బ్రాం
గణ మందున్న మహానుభావు లెదలం గంపింప నుత్సాహినై
రణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో 21
స్వప్నకు నలిన దళాక్షికి
స్వప్న సహోదరికిని మృగశాబ నయనకున్
స్వప్న సహోదరున కహో
స్వప్నము మెలఁకువ సుషుప్తి సమ కాల మగున్ 20
అప్నుల మేటి నిద్ర యగు నన్న ధరా తల మందు నుండునే
క్షిప్నువు ధ్యాన ముద్ర విలసిల్లిన తాపస కోటి కెంచ న
స్వప్నము నీ త్ర్యవస్ధలును సత్క్రమ రీతిని నెంచి చూడఁగా
స్వప్నమునున్ సుషుప్తియును జాగ్రదవస్థలు నేక కాలమౌ 19
[అప్నువు =సుఖ మొసంగునది; క్షిప్నువు = కాదను వాఁడు]
పారాయణమునకై యుప
కారి యగునని తలపోసి క్రన్నన నంతన్
వారక మందిరమునకు వ
సారా కొని హితముఁ గనిరి సద్బ్రాహ్మణులే 18
శ్రీ రామార్చితు నాగభూషణు నటన్ సేవించి యా సత్కృపా
పారావార మహేశు సాంబ శివునిం బంచామృతం బింపుగా
వారెల్లర్ గుడి కేఁగి భక్తి విమలస్వాం తాకలం కేద్ధ కా
సారా! త్రాగి తరించి పోయిరి గదా సద్బ్రాహ్మణుల్ భూమిలో 17
శ్రీరాముని యభిషేకము
నారయ భార్యలను గూడి హరి వరు లెల్లన్
వార కయోధ్యకుఁ జన వలెఁ
దారా! రమ్మనుచుఁ బిల్చె దాశరథి దమిన్ 16
రారాదం చనఁ గానకున్ వినవె యారాటమ్మునున్ వీడ వో
నారీ రత్నమ! సమ్మతించితిని యానందమ్ము నిండన్ మదిన్
దారా!సీత! విదేహ రాజ సుత! మచ్చైతన్య ధారా నభ
స్తారా! రమ్మని పిల్చె రాముఁ డెలమిన్ దానంద సౌఖ్యమ్ములన్ 15
భ్రంశ మగుఁ బుణ్య మంతయు
వంశీధరుఁ డాగ్రహించుఁ బాటను వినినన్
సంశయ మేల విరాగపు
వంశీ నాదము చెవులకుఁ బాపమ్మొసఁగున్ 14
వంశఘ్నుల్ ధర మానవక్షయము నాపాదింప నిత్యమ్ము స
ర్వాంశమ్ముల్ పరికించి క్షుణ్ణముగ నందం దుండు ఛిద్రమ్ములన్
సంశోధించి వచింపఁ గ్రూర తర భాషల్ విశ్వ విధ్వంస దు
ర్వంశీ! నాదము విన్నచో శ్రుతులకున్ బాపమ్ము సంధిల్లుగా 13
మందు చేదైన రోగమ్ము మాన్పు వేగ
మాట తీపైనఁ జేతలఁ జేటు నొసఁగుఁ
గాలము గడవ నింపుగ మే లొసంగు
ములికు లైనట్టి పలుకులు చెలిమిఁ బెంచు 12
కలవరపాటు సెందినను గ్రన్నన మే లది యింపుగాఁ దుదిం
గలుగు నటంచు నెంచి మది గారవ మొప్పఁ దలంచి స్నేహముం
దలఁపక కోప మూను నని తప్పక చెప్పిన మేలుఁ గూర్చెడిన్
ములికులు పల్కు లైనఁ గడుఁ బొల్పు వహింపవె స్నేహ బంధముల్ 11
[ములికి బహువచనము ములికులు, భామినులు వలె; ముల్కి కి ముల్కులు]
కంటిని మున్నిలఁ బెక్కం
డ్రుంటను దుడుకుఁ దన మెల్ల నుడిగి మును గడుం
దంటలఁ జెలరేఁగిననుం
దుంటరి జన మాన్యుఁ డగును దొడ్డ పనులచే 10
మంటలు రేఁగఁ గంసునకు మానుష రూపము నూని యన్నతో
జంటగఁ దిర్గుచుండి ధృతి సంతతమున్ నిరపేక్షఁ గాచుచుం
గంటికి ఱెప్పగా జనులఁ గన్నఁడు చిన్నఁదనమ్మునం గడుం
దుంటరివాఁడె చేయుఁ గద దొడ్డ పనుల్ జను లెల్ల మెచ్చఁగన్ 9
సత్సమస్య లొసఁగు సత్కవీంద్రులకు న
ప్రస్తుతప్రసంగి వరున కన్యు
లడ్డు కొనఁగ నేర మవధాన సత్సభన్
హర్ష భంగ మగు సభాంతరమున 8
ఒడ్డులు మారు మాట లన యుక్తము కాదు సభాంత రమ్మునన్
దొడ్డ కవీంద్రు డెందమునఁ దోఁపఁగ ధారకు నడ్డు లేకయే
పడ్డ పదమ్ము లర్థములఁ బద్యము లల్లఁగ నాలకింప మే
లడ్డు కొనంగ నేర మగు నందు వధానము నందు సత్కవీ 7
కలవర మొకింత లేక చక్కఁగ సతమ్ము
మల విసర్జనమనకుఁ దల్లులకుఁ జంటి
పిల్లల కొసంగ నుదయంపు వేళ లందు
నాముదం బన్నఁ బ్రీతియే యందఱకును 6
భూమి సురేంద్రు వంశమున భూరి యశస్కరు నింట దీపమై
క్షేమ కరంపు లగ్నమున శీత మయూఖుని భవ్య వర్ణ మం
దేమని చెప్ప నొప్పుఁ గుల మింపుగ వర్ధిలఁ గొడ్కు వుట్టఁగా
నా ముద మెంత గొప్పదగు నందఱి మోములుఁ దేజరిల్లఁగన్ 5
వాద్య తతుల మేటి సద్యో ముద మొసంగు
వినఁగఁ బండువ యగు వీనుల కది
నా ముదాల మురళి నవధాని యన రాదు
వేణు వనఁగ నొప్పు విశ్వ మందు 4
నిక్కము నెంచ సత్కవులు నింగిని మేరగ నుంచి తారలం
దక్కువ సేసెడిన్ గిరల ధాత్రిని వెల్గఁగ నిల్ప నేర్వరే
చక్కఁగ నెంచి వాఙ్మణిని సత్వర మక్షర లక్ష లిచ్చినన్
లెక్కకు నాముదాల మురళిన్ గొన వచ్చునె సద్వధానిగన్ 3
అరవింద నయనుఁ డారసి
యరవిందాక్షిని వరించి యాడఁగఁ బెండ్లిన్
సురుచిరముగ నప్పును బే
హరిని హరియె వేడె హరిని హరియింపంగన్ 2
[బేహరి = వ్యాపారి యిక్కడ కుబేరుఁడు, హరి = విష్ణు విక్కడ
శ్రీనివాసుఁడు, హరిని = పచ్చవర్ణము గలది యిక్కడ
పద్మావతీకన్య, హరించు = సంగ్రహించు]
పరుషము లైన నంశువులు పాటున కోర్వక యుష్ణరశ్మి యా
దరమున నేఁగి సంభ్రమము తద్ద సెలంగ నెడంద మ్రొక్కుచున్
గురుతర మిచ్చు చుండ వగఁ గ్రూరత వత్సర వత్సరమ్ములన్
హరిని హరింపఁగన్ హరియె యా హరినిన్ గని వేడె నయ్యెడన్ 1
[హరి = పాము (రాహువు) , సూర్యుఁడు, శ్రీ హరి]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి