1, ఏప్రిల్ 2025, మంగళవారం

సమస్యాపూరణ_ఏప్రిల్ 2025

గూఁటి నిచ్చితి కాకమ కూర్మి మీఱ 
నింత కాలము కరుణఁ జూపింప నీవు
పెరిగితిఁ దఱుమకుమ కనికరము వీడి 
కూసెఁ గావు కా వని యొక్క కోకిలమ్మ                                                            52 
[కా = అని; వని యొక్క కోకిలమ్మ = అడవి కోకిలమ్మ] 

కోకిలాభము గాత్ర మెంచఁగఁ గోకిలమ్మయె నామముం 
బ్రాకటమ్ముగఁ బద్మనేత్రకుఁ బాటలన్నను మక్కువే 
సాకుచుండి సతమ్ము మమ్ము వసంతమా యని యార్తితోఁ 
గోకిలమ్మయె కావు కా వని గొంతు విప్పె నుగాదికిన్                                            51 
[కా = అని; వని(న్) = ఉద్యాన వనములో]

కనుల ముందు జరుగు చుండఁ గనవె యాప
వె నినదింపవె వలదని కని పనులను    
గనము విన మిట్టి మాటను మనము వినుమ
దుష్టుఁడై దుష్కృతముఁ జేయ దొరకు పునెము                                                  50 

దుష్కర మైన సత్యమును దుఃఖము లందినఁ దప్పకుండ నా
విష్కృత మెవ్విధమ్మున నభీతి నొనర్పఁగ దప్ప దేరికిన్ 
నిష్కృత మిద్ధరా తటిని నేరము దుష్ట చరిత్ర కోటికిన్ 
దుష్కృత మాచరించు ఘన దుష్టున కబ్బు నితాంత పుణ్యముల్                            49 
[దక్కును + ఇతాంత = దక్కు నితాంత; ఇతము = గతి;  ఇతాంత పుణ్యముల్ = 
గతిని ననఁగా జన్మ మార్గమున నంత మైన పుణ్యములు]

తనదు యజమాని యత్తఱిఁ దల్లడిల్లఁ  
బోరి పోరి పంతమ్మున దారి లేక 
బలము సన్నగిల్లినఁ దిర్గి పరుల కోడి 
పుంజుకొనఁ గోడి వోయెను పోరు మాని                                                              48 

సంజల యాతుధానులకు సంగర శక్తి పెరుంగు చుండు నం
చుం జల మూన కింతయును శూరవరేణ్యుఁడు భండనమ్మునన్ 
మంజుల రీతి యుద్ధమున మత్సర మూనక వారి యోధులం 
బుంజుకొనంగఁ జూచి రని పోరక వారల కోడి పోయెనే                                           47 
[వారలకు+ఓడి= వారల కోడి] 

సంతత మహింసఁ దమ మానసమ్ము లందు 
నుంచు జను లున్న యట్టి సముచిత భార 
తావని నకట దూర దేశాంత సింధు
జ గణ మది రాయలకు సమస్యలను దెచ్చె                                                        46 

అగణిత ధైర్య విక్రముఁ డహర్నిశ ముండును జాగరూకతన్ 
సగణము రామకృష్ణ కవి సత్తమ వింటివె కృష్ణ దేవ రా
డ్జగ దపహార కార్య రత చండ తురుష్క సమేత వైరి రా
జ గణము కృష్ణరాయలకుఁ జాల సమస్యలు దెచ్చె సత్కవీ                                     45 

నిత్య సత్య వచన నిరతుండు నుపకారి 
సజ్జన హితకారి సంతతమ్ము 
మాన వోత్త మాభిమానమ్ము నతి మధు
రమ్ముఁ గ్రోలువాఁడె రాజ్య మేలు                                                                       44 

ఇమ్మహి శక్తిమంత మనుజేశ్వరుఁ డెవ్వఁ డనంగ రాజ్య భా
రమ్మువలీలఁ బూనఁ గల రాజ కులస్థుఁడు నిశ్చయమ్ముగా 
నెమ్మిఁ బ్రజాభిమాన ధన నిర్భర మాన సుధా రసమ్ముఁ దో
రమ్మునుఁ గ్రోలు నా ఘనుఁడె రాజ్యము నేలు యశోధనుండునై                                43 

దైనందిన కర్మమ్ముల 
దానం బొకటిగఁ దలంచు దయ గల వాఁడున్ 
మానస మందుఁ గన దురభి
మానము లేనట్టి వాఁడె మాన్యత నందెన్                                                           42  

మానవ జాతి పైన నభిమానము సూపుచు సుంత యేని స
న్మాన రతుండు గాక  నయ మార్గ మనోరథుఁడై చరించుచున్ 
మానిన నాత్మలో దురభిమానము లో ననుమాన మాఱ దు
ర్మానము లేని వాఁడె కద మాన్యత నందును ధాత్రి లోపలన్                                    41 

ఏమఱక విన్న దెల్లను 
గోముగ వచియించుచుంటిఁ గుట్టక నిలుఁ డీ
జామున గ్రహణము వినుఁ డో 
చీమలు చంద్రునకుఁ బట్టెఁ జిత్ర మెటు లగున్                                                      40 

ఆమని పోయి గ్రీష్మ ఋతు వంతము గాఁ ద్రుటి వర్ష కాలమే 
భూమినిఁ దాఁక వేగముగఁ బున్నమి నాఁటి నిశీథ వేళలో 
సోముని కాంతి సన్నగిలఁ జుట్టుఁ  జరించుచుఁ గారు మబ్బు లం
జీమలు వట్టెఁ జంద్రునకుఁ జిత్ర విచిత్రము కాదు కాదుగా                                        39 

కవితా పటుత్వ ముండు ట
ది విదిత మెల్లర కనంగఁ దెలియ కకట నీ 
వ వచించు టహో పాడియె 
యవధానికి  రాదఁట తెలుఁ గద్భుత మిదియే                                                       38 

తడబడ కుండ సుంత కవితా ఝరి నింపుగ దేవ భాషలోఁ 
గడు వడిఁ బాఱఁ జేసెడు నిగర్వి కవీశ్వరుఁ డన్య భాష నా
తఁడు వెనువెంట వచ్చిన యతండు సనాతనుఁ డాప్త మిత్రుఁ డా 
తడయక వచ్చినట్టి యవధానికి రాదఁట తెల్గు చిత్రమే                                            37 

నేఁడు ద్రుత సంధు లొనరింప నెమ్మిఁ గాంచ 
రర్థ భేద మున్నను వాడ రకట పండి
తు లరసున్నను దలఁపరు దోష మెదల 
సున్నకుం బుట్టి యరసున్న శూన్య మయ్యె                                                          36 

వన్నె నశింపఁ గావ్యముల వ్యాకరణమ్మున కీక సుంతయేన్
మన్నన నుండఁ బండితులు న్యాయమె కోరని చోట మెత్తగాఁ 
దన్నిన మాయ మయ్యెడు ద్రుతమ్మున కొక్కొక వేళ మారుగా 
సున్నకుఁ బుట్టినట్టి యరసున్న గనంబడ దేమి చోద్యమో                                          35 

రా జని చని యడిగినఁ బ్ర
యోజన మిసు మంత యైన నుండదు సుమ్మీ
నైజమునఁ గపటి యాతం
డాజికిఁ బరసతికి నర్థి కట్లిట్లనురా                                                                       34 

తేజుల నాయుధమ్ములను దీయను మంగళ వార మెన్నఁడున్
గాజుల కంద మబ్బెఁ గద కాంతరొ నీవు ధరించి నంతటన్
వ్యాజపు మాట లాడగను న్యాయమె తక్కుమ బీద యార్పులే
యాజికి నట్లనున్ బరుని యాలికి నిట్లను నర్థి కిట్లనున్                                            33 

అండ కోరి నిండు మదిఁ గోదండ రామ
చంద్రు దండ సేరిన యట్టి శస్త్ర కోవి
దుండు రక్కసుండు విభీషణుండు వీత
రావణుం డాంజనేయుని ప్రాణసఖుఁడు                                                                32 

పావని సీత రాఘవుని పంచకుఁ బంపి సగౌరవమ్ముగాఁ 
బావనుఁ డై చరింపఁ దలపడ్డ నిశాచర రాజు తత్సభం  
బావని తోఁక కాల్చుటకుఁ బాల్పడ కాతని మాట విన్నచో 
రావణుఁ డాంజనేయునకుఁ బ్రాణ సముండగు మిత్రుఁడౌఁ గదా                                    31 

పంకజ లోచన గని న
ల్వంకలఁ జెదరంగ  నచట వస్తువు లెల్లన్ 
వంకాయల నేఱి విడిచి  
కుంకుడు కాయలను గడిగి కూరను జేసెన్                                                             30 

వంకలు వెట్ట నేల నతివల్ గడు నేర్పరు లన్న వింతయే 
పంకజ జన్ముఁ డైన మఱి వారిజ నేత్రల దూఱ శక్యుఁడే  
జంకక దొండకాయలను జక్కఁగ నుంచఁగ నుప్పు నీటిలోఁ 
గుంకుడు కాయలం గడిగి కోమలి కూరను జేసె భర్తకై                                                29 
[కుంకుడు = మునుక/ మునుఁగుట]  

కన్న కుమారున కొక సం
పన్నుఁడు శాస్త్రోక్త భంగిఁ బరమప్రీతిన్ 
మిన్నగ వడుగుం జేయఁగఁ
బెన్నిధి గలవాఁడు వట్టె భిక్షాపాత్రన్                                                                       28 

సకలంకాత్ముఁడు లోభి విత్త చయ కాంక్షా సక్త చిత్తుండునై 
సక లైశ్వర్యము లుండి పట్టుకొనె భిక్షాపాత్ర మోసమ్ముతో 
నకలంకాత్ముఁడు భక్త పుంగవుఁడు దే వావాస కార్యార్థియై 
సక లైశ్వర్యము లుండి పట్టుకొనె భిక్షాపాత్ర క్షుద్బాధతో                                             27 
[ఉపవాసముతో భిక్షాటనము] 

జటి లార్థ కథా చయ సం
పుట మడిగిన యంతఁ బ్రీతి భూనాథునకుం 
బటుతర పండితుఁ డరయుమ 
యటు కుల మూటకుఁ దన కృతి నంకిత మిచ్చెన్                                                    26  
[కులము+ ఊటకు =కుల మూటకు; కులము యొక్క బలమునకు] 

త్రుటి లభియించె నివ్విధము తోష మిడం గృతి భర్త యంచుఁ దాఁ
బటుతరమౌ కుచేల కథఁ బార్థివ పుంగవుఁ డడ్గఁ బ్రీతిమైఁ 
దటపటలాడ నేల యని తల్చి యెడందఁ బసిండి పోఁత నా  
యటుకుల మూటఁ బొంది కృతి నంకిత మిచ్చెఁ గవీశ్వరుం డహో                                 25 

జీవనంపుఁ బోరు సేయుచుండ నడవి 
లోన స్వీయ సోదరులు సెలంగి 
పడయ నెంచి దివ్య పాశుపతాస్త్రమ్ము 
పోరు వీడి క్రీడి మునిగ మారె                                                                              24 

కోరను రక్త సిక్త మగు కూటిని  నంచు వచించి కృష్ణుతో  
దారుణ రీతి యుద్ధమునఁ దాతల నొజ్జల బంధు కోటినిం 
గూరిమి వీడి చంపు టది క్రూర తరం బని యెంచి యూహలోఁ 
బో రొనరింప లేక తపముం బొనరింపఁగ నేఁగెఁ గ్రీడియే                                               23 

సంతాపము నందుచు న
త్యంత మెడఁద లోనఁ దాను ద్యాజ్యం బైనన్ 
సంతత మనుమానించెడు 
కాంతుఁడు శాత్రవుఁడు గాదె కాంతకుఁ జూడన్                                                          22 

సాంతము వంశ గౌరవము వ్యస్తము గాఁగ నిరంతరమ్మునున్ 
వంత లొసంగ నింతులకు వారని కోర్కెలఁ  జేయు చుండఁగా 
నంత మెఱుంగనట్టి దురితావళి రావణ నామ చండ భూ
కాంతునిఁ బోలు శాత్రవులు కాంతకుఁ గల్గుదురే తలంచినన్                                 21 

వీడి చలమ్ము నెడఁద మా
రాడకయే మేలొనర్ప నపకారికిఁ దా 
నోడకయే మున్నాతఁడు 
కీ డొనరించిన లభించుఁ గీర్తి వసుధపై                                                                          20 

పాడిగ నుద్యమించి తగు భద్రము గూర్పఁగ మానవాళికిన్ 
వేఁడక మున్న యెవ్వరును బెద్దరికమ్మున సుంత యేని కే
ళ్లాడఁగ నీక మానవుల కత్యధికమ్ముగ వచ్చు కీళ్లకుం 
గీ డొనరించు వారలకుఁ గీర్తి లభించును లోక మందునన్                                         19 

హాని కలుగ ధర్మమునకు నవని లోన 
యుగ యుగమ్ముల ధర్మము నునుచుటకును  
గాక శిష్టావనమునకుఁ గాక యేల 
పుట్టెదను దుష్కృతుల నెల్లఁ బ్రోవఁ దలఁచి                                                                18  

దిట్టతనంపుఁ బొంగున నతిక్రమణంబొనరింప సంయముల్  
వెట్టిన శాప మెవ్వరిని వీడదు తాఁకక యుగ్ర భంగి ము
ప్పుట్టువులన్ జయా! విజయుఁ బోలెను విష్ణు నిబద్ధ వైరివై 
పుట్టుచు నుందు దుష్కృతులఁ బ్రోవఁగ శిష్టుల సంహరింపఁగన్                             17 
[పుట్టుచు నుందు = పుట్టుచు నుందువు]
 
పరికించి తగిన పగిది నె
వరి కైనను నెన్నఁ డైన వంచించి ధను
ర్ధరులకు నస్త్ర నిమిత్తము 
గురు పాదార్చనము సూడఁ గుత్సితము గదా                                                             16 

ధరణి నిపాత పుష్పములు దైవ సమర్చన  కెట్టు లర్హముల్ 
సుర గణ పూజ నార్థము వసుంధరఁ గైకొన రాదు వర్జితా
మర పద భక్తి మర్త్య నిజ మత్త కరీంద్ర సమాన సంచర
ద్గురుపద పద్మ సేవనము కుత్సిత కర్మము గాక యే మగున్                                            15 
[గురు పద పద్మ సేవనము = పెద్ద పాదము లందుఁ బడిన పద్మములను దండగాఁ గుట్టుట] 

కలలు నిజము లగుట యెందుఁ గల్లలు సుమి 
యన్న యార్యోక్తు లెఱుఁగమె యవని లోన 
నాగ కీ రీతి నొక కల యందుఁ గన్న 
తల్లి మృతికిఁ దనయ లేడ్చు టెల్ల వింత                                                                       14 

తల్లడిలంగ నెల్లరును దారుణముం గన మిక్కుటమ్ముగా  
నుల్లము లందు సుంత ముద ముబ్బక యుండుట సోదరాదులుం   
బెల్లుగ నా కుటుంబమున వీడక యెన్నఁడు నుండు నట్టి పో
ర్తల్లి గతించి నంతట సుతల్ విలపించుట వింతయే సుమీ                                                13 
[పోరు తల్లి= ముఖ్యపుఁ బోరు / జగడ మను తల్లి]  

వనజాక్షునిపై సద్భ
క్తి నిలిపి వేదోక్త భంగిఁ దీర్చినఁ బనులన్    
మనుజాళి ననవరత సా
ధనమున మోక్షంబుఁ బొందఁ దగు నెవఁ డైనన్                                                               12 

అనివార్యం బిల జన్మసంభవము పాపాలోచ నానీక సం
హన నాబంధము లాభ హీన నిజ కర్మాసక్తి మర్త్యాలికిన్ 
ఘన లోభావృత మోహ రోష మద కాంక్షారణ్య దావాన లేం
ధనమే మోక్ష పథంబుఁ జూపు భవబంధచ్ఛేదముం జేయుచున్                                         11 

తరణి కిరణ సదృశములు రు
చిర విద్యుద్దీప రుచు లశేషప్రభలం 
దరుణీరత్నము వక్త్రం 
బరవిందము విచ్చె రాత్రి యందఱు గనఁగన్                                                                  10 

వారి నగౌరవించు టది పాడియె చెప్పఁ దలంచు వృత్తమున్ 
నేరమె చాలు విన్న కత నిక్కము సాంతము వింట వింతయే 
యూరక యేల వద్దనుట యుందము శాంతి వహించి పూర్తి కాఁ 
బేరుకొనంగ నెల్ల రర విందము భాసుర మయ్యె రాతిరిన్                                                    9 
[అర = సగము] 

ఒకరి పైన నొక్కరికి సముచితముగను 
నిత్య మైత్రి వర్ధిలుచుండ నత్యధికము 
ధాత్రి లోనఁ దురుష్క సోదరు లనియెడి
యా గములఁ జేసి తురకలు ఖ్యాతిఁ గనిరి                                                                      8 
[గమి = గుంపు ]

పాగా లింపుగ నూని మూర్ధములపైఁ బాలింప ధర్మమ్ము  స్వీ
యాగారంబులు వీడి కూడికొని యింపారంగ మాత్సర్య సం
త్యాగస్వాంతులు నిత్య పంచక మహా దైనందినప్రార్థనా 
యాగంబుల్ గడు నిష్ఠఁ జేసి దురకల్ ఖ్యాతిం గనం జూడమే                                               7 

జనసందోహం బలరుచు  
వినుతింప వృకారి మణుల వేడుక యందుం  
గన దంబరములఁ బెంపుడు 
శునకమ్ములు పువ్వు లగుచు శోభించె నటన్                                                                    6 

కనుకట్టో యది వంచనాత్మకమొ శంకా పూర్ణముల్ డెందముల్ 
కను లల్లాడవు సుంత సంగరమునన్ గాండీవి దోర్దండ సం
జనితామోఘము లెల్ల వ్యాధ వర వేషస్వామికిం బార్వతే
శున కమ్ముల్ కుసుమంబు లౌచు మిగులన్ శోభించె నచ్చోఁ గనన్                                          5  

అంగలు వేయుచుఁ గంపము
నం గడు వడిఁ బాఱుచుండ నైపుణమున సా
రంగము వేటాడ నిలిచి
బంగరు మేడన్బడఁతుక వ్యాఘ్రముఁ గాంచెన్                                                                     4 

బొంగురు వోవ గొంతు కడుఁ బూరుష  పుంగవుఁ డొక్కరుండు స
త్సంగము నందు నడ్డు వడి తా వచియింపఁ దొడంగ నంత వా
గ్భంగము సైపఁ జాలకను భగ్గున మండఁగఁ గోప వహ్నిలో 
బంగరు మేడ మీఁద నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్                                                3 

ప్రమదా మణి సంచయ సం
గమ సందర్భమునఁ జివరగను వారము వా
రము జరగు విందునకు నా
యమ సదనముఁ జేరి రెల్ల రతివలు ప్రీతిన్                                                                         2 
[ఆయమ = ఆమె]

విమలాచ్ఛాదన రుక్మ భూషణ సు సంవీతాంగ విభ్రాజితల్ 
క్రమ మేపారఁగ నొక్కరొక్కరును దారా నాథ బింబాననల్ 
తమకం బొప్పఁగఁ గాంచ వేడుకను దద్వైవాహి కోత్తుంగ మ
ధ్యమ సౌధంబున కేఁగిరా యతివ లత్యానందముం బొందుచున్                                              1 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి