పాడిగ వ్రాయం దగ నీ
మూడు పదమ్ములను జరణముల గతి భళిరా
వేడుక మీఱఁగ నింపుగ
మూడునకున్, నాల్గు, గలుప ముప్పది యగురా 66.
[ముప్పది = త్రిపద;
మూడునకున్
నాల్గు
గలుప]
నేఁడును వాడ వాడలను నెమ్మి చరించి గణింప నింపుగాఁ
బాడిగ సుప్రసిద్ధములు భారత వాఙ్మయ మందుఁ జక్కఁగా
మూడు చతుష్టయమ్ముల సమూహము నాఱు త్రయమ్ము లిద్ధరన్
మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్ 65.
[వేదోపాయ దుష్ట చతుష్టయములు; గుణ తాప కాల ఋ ణేషణ మూర్తి త్రయములు]
మ్రుచ్చులే చెలగంగ విత్త విమోహులై కడు ధాత్రిలోఁ
జెచ్చెరం గపటం బెఱింగినఁ జెప్ప నెంచిన సత్యముం
గచ్చితమ్ముగ మూరి యక్కఱకాండ్రు లేక నటించినం
బిచ్చి వారికిఁ దెల్వితేటలు పెక్కు లుండును బిచ్చిలో 64.
లంచముం గొన్న యట్టి నరప్రవరున
కధిక బాధలు కల్గెడు విధము జనులు
స్వప్రయోజన మాశించి సతమపప్ర
దాన మొనరింపఁ గల్గు బాధలు గడింది 63.
వైన మెఱింగి యింపుగను వంచనముల్ వల దన్న విత్త వి
జ్ఞానులె యాచరింప నిల సాధ్యము కాదని తాము నేరినన్
మానక గెల్వ నెన్నికల మంతన మాత్మ నొనర్చి వ్యర్థ వా
గ్దానము సేయు వారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్ 62.
చైద్యుని వల దన నుభయులు
వాద్యమ్ములు మ్రోగుచుండ భారత రణమం
దాద్యులు, చేరని వీరుఁడు
ప్రద్యుమ్నుం డొకఁడు, పంచపాండవు లందున్ 61.
[అందున్ = ఆ భారత రణములో]
వేద్యుం డీతఁడు మారుతాత్మజుఁ డనన్ విశ్వంబునం దింపుగా
సద్యః కోప యశో విరాజితుఁ డిలన్ సంగ్రామ నైపుణ్యు లం
దాద్యుం డాజి విజేత భీముఁడు సహస్రానేక మాతంగ వ
త్పద్యుమ్నుం డనువాఁడు పాండవులలో భావింపఁగా నొక్కఁడౌ 60.
[ప్రద్యుమ్నుండు = మంచి బలము కలవాఁడు]
తంట లిడకు నీ వే మను
కొంటివి యిటు లన బలాది గుణ రాసులఁ గ్రా
ల్గంటులతోఁ బోల్పఁగ వే
యింటికి దీపమ్ము మగఁడె యే గతి గనినన్ 59.
[మగఁడు = పురుషుఁడు]
మూరినచోఁ బ్రభువుల యప
కారము సుఖ జీవన లయ కారణ మగులే
వారని పాలక జన సహ
కారమె సుఖ జీవన హిత కారణ మగులే 58.
నీరము నిండుగాఁ దనరు నిండు ఘటమ్ము తొనంక దయ్య గం
భీరము వార్థి మధ్యమము భీషణ రావ విహీన మౌను సం
సారము నందు భాసిలెడు శాంతము నిత్యము వీడఁగా నహం
కారమె కారణం బగు సుఖప్రద జీవన శైలి కెప్పుడున్ 57.
గూటి లోన నున్న గ్రడ్లఁ గాకి బొదుగఁ
గల్ల కాదు సుమ్ము పిల్ల లైనఁ
గూఁత రాక యున్న నాతత రీతినిఁ
గాకిపిల్ల ముద్దు కోకిలకును 56.
పోక నిల్చిన కూనపై నెద మూరఁ గూరిమి యంతటన్
వీఁకఁ దప్పు నెఱింగి యంత విభేద మేర్పడఁ గూఁతలన్,
రాకతోను వసంత కాలము వ్రాలి కైకొనఁ గాకమే
కాకిపిల్లను, గోకిలమ్మయె కాంచి ముద్దిడెఁ బ్రేమతో 55.
రుగ్వ్యంజన రాసుల స
మ్యగ్వ్యయము కరమ్ము భావ్య మైన విధమునన్
ధిగ్వ్యర్థ భాషణమ్ములు
వాగ్వ్యాపారమ్ము లేని వాఁడె బుధుండౌ 54.
ధిగ్వ్యంగ్యార్థ వచో విరాజి సిరులం దేలంగ వీక్షింపమే
లుగ్వ్యాయాముఁడు భాసిలం గనమె యే లోపమ్ము లేకుండఁగా
దిగ్వ్యాకీర్ణ దివాకరప్రభలు ఖ్యాతిం గాంచి వర్ధిల్లవే
వాగ్వ్యాపారము లేని వాఁడె బుధుఁడై ప్రఖ్యాతి నందెన్ గదా 53.
[వాగ్వ్యాపారము = వాక్కుల యమ్మకము]
గురు తప మొనరింప నరే
తరుల వలనఁ జావు లేమి ధాత యొసంగెన్
నిరతమ్మును జెలరేఁగుచు
వరమున రాక్షసుఁడు పుట్టెఁ బాలింప భువిన్ 52.
వర మిడ పద్మనాభుఁడు సుపర్వుల కింపుగ లోకరక్షకై
పురుష వరుండు రాఘవుఁడు వుట్టె వధింపఁగ రావణాసురున్
సురముని దత్త శాపమునఁ జోద్యము వైశ్రవణుండు కండ కా
వరమునఁ బుట్టె రాక్షసుఁడు వైభవ మొప్ప జగంబు నేలఁగన్ 51.
వీఁకఁ జేయు చుండి లోకోపకారము
స్వార్థ చింత వీడి సంతతమ్ము
శిష్ట జనులఁ గాచి దుష్ట జనులఁ గాంచి
దూఱు వాఁడె యఘ విదూరుఁ డగును 50.
పాఱక భీతి నెన్నఁడును వారక దుష్టుల ఘోర కృత్యముల్
దూఱుచు మంచి బుద్ధులను దోరము వారికి నేర్పి మార్చుచున్
మీఱి జగజ్జనావన నిమిత్తము మ్రొక్కఁగ మందిరమ్ములం
దూఱెడి వాఁడె దుష్కృత విదూరుఁడు గణ్యుఁడు లోకమాన్యుఁడున్ 49.
[దూఱు= నిందించు; తూఱు= చొచ్చు]
సుతు లెల్ల భుజించిరి నీ
కతులమ్ముగ నాఁకలి యని యాత్మ నెఱుఁగుదున్
హితముగ భోజన మే నుం
చితి సిద్ధము రమ్ము నాథ చేకొన సుఖముల్ 48.
పతి సేవన్ సతి మగ్న యై మసలుటే భావ్యంబు నాఁ దల్చెదన్
సతతం బివ్విధి నుండఁ గోరెదను నా స్వామీ స రాగమ్ము సు
వ్రత సంతోషము నిండె డెందమున నీ లాలిత్యముం గాంచ మె
చ్చితి సిద్ధం బిఁక రమ్ము నాథ తనియన్ శృంగార యజ్ఞంబునన్ 47.
ఓర్పు, నేర్పు, మార్పు, తీర్పు
పదాలతో పద్యము.
ఓర్పుష్కరమ్ము కురియఁగ
నేర్పుడమిం బాఱ మేఘమే యడరఁగ వే
మార్పుష్కలముగ వెస నా
తీర్పురికొల్పదె ముదమ్ము స్థిరముగ నెదలన్ 46.
[ఓరు+పుష్కరము = ఓర్పుష్కరము, గాలిధ్వని మఱియు నీరు/
పెద్దగా నీరు; ఏఱు+ పుడమి = ఏర్పుడమి; మారు + పుష్కలము =
మార్పుష్కలము; తీరు + పురికొల్పు = తీర్పురికొల్పు]
అచ్చమైన తెల్లని దని మచ్చరమ్మ
యీఁద నేర్చు నింపుగ నని యీర్ష్య మెండ
కవులు దాని వర్ణించుట కారణమ్మ
యంచపై గ్రుడ్లగూబకు నలుక యేల 45.
మంచుఁ బోలు తెల్ల నైన మనసు దనరు పూరుషుం
గొంచె మైన జాలి లేక కొట్టు చుండు నిత్యమున్
మించి యింగిలంపుఁ గెంపు మేటి గ్రుడ్డు లున్న వాఁ
డంచ పైన గ్రుడ్లగూబ కంత కోప మేలనూ 44.
నీ యడుగులకు మడువులన్
వేయ వలెన లేక యున్న విద్వేషమునం
దీయఁ దలంతువె మానము
వ్రాయకు మయ వ్రాయ కిట్టి వ్రాతల నింకన్ 43.
కాయకు కాయఁ బోకు మయ కాయకు కాయకు పందె మెన్నఁడుం
దీయకు తీయఁ బోకు మయ తీయకు తీయకు తిట్ల పొత్తమున్
రోయకు రోయఁ బోకు మయ రోయకు రోయకు మాత్మ బంధులం
గూయకు కూయఁ బోకు మయ కూయకు కూయకు మిట్టి కూఁతలన్
వ్రాయకు వ్రాయఁ బోకు మయ వ్రాయకు వ్రాయకు మిట్టి వ్రాఁతలన్ 42.
దండకారణ్య మందుఁ గదన మొనర్ప
ముని వరేణ్యల రక్షింప నినకులుండు
మించి యొకపరి యెదిరించు మేటి యసురు
లాయనకు నేవు రైరి రామాయణమున 41.
ఆయన కని యంటివి యెవ్వ రా నర వరుఁ
డేవు రంటివి గద వార లెవ్వ రయ్య
యెట్లు విశదమౌ నయ్య నీ విట్లనంగ
నాయనకు నేవు రైరి రామాయణమున 40.
కంగా రేలయ చెప్పెదన్ నిలుమ నిక్కం బే విధంబయ్యెనో
యంగీకారముతో నజాత్మజుఁడు పూజార్హుండు శాంతాఖ్యఁ బ్రీ
తిం గాంతా మణిఁ గూఁతుఁ గాఁ గొనిన రీతిన్ బిడ్డ లింపారఁగా
రంగా యాయన కేవు రైరి గదరా రామాయణం బందునన్ 39.
ఇమ్మహి నింపుగ సంరం
భమ్మున శీఘ్రంబ దుష్ట మానవ సాంగ
త్యమ్మును వంచనముల దురి
తమ్ముల వీడంగఁ గల్గు ధర్మము ముదమున్ 38.
సొమ్ముల నింక రాజ్యమును జూదము నందుఁ జెలంగి యొడ్డి తా
నమ్మక చెల్ల యోడినను నాగక యాడుచు మానసమ్మునం
బమ్మిన యట్టి పంతమునఁ బార్థుఁ డజాత రిపుండు దారనుం
దమ్ముల నోడె ధర్మజుఁడు తప్పక ఘోర వినాశనంపు నె
త్తమ్ముల వీడఁ గల్గుఁ గద ధర్మము తోషము సిద్ధియున్ ధరన్ 37.
నారీమణి పాయసమున
ధారాళము ప్రీతి నాకుఁ దనియక కట్టా
నోరూరఁ దినఁగఁ దినఁగ వి
కారము పాయసము నందుఁ గడు హెచ్చయ్యెన్ 36.
కారుణ్యమ్మున విందు నీ వొసఁగినం గాంతా విచిత్రమ్ముగం
బారావార నిభమ్ముగా నడరుచున్ భాసిల్ల భాండమ్ములం
దోరంబై కనిపించు నా యతిథి సందోహమ్మునం బ్రీతి స్వీ
కారం బెక్కువ యయ్యెఁ బాయసమునం గంజాతపత్రేక్షణా 35.
దిట్ట వేదాధ్యయనమున దిట్ట యౌ ని
తం డుపన్యాసము లొసంగ మెండుగాను
గద్యములు వ్రాయ నేర్చినఁ గాని వ్రాయఁ
బద్యములు రాని యవధాని వాసిఁ గాంచె 34.
[అవధాని = వేదముల నేర్పరి]
చోద్య మాతని పాటవమ్ము వచో విశారదుఁ డిద్ధరన్
విద్యలన్ ఘటికుండు మేటి వివేకి నైపుణుఁ డూహలం
బద్య సంచయ కల్పనా నుత పారగుం డయి వర్ణ నా
పద్య మొక్కటి రాని బాలుఁడు వాసిఁ గాంచె వధానిగన్ 33.
[వర్ణన + అపద్యము = వర్ణ నాపద్యము, నీచమైన వర్ణనము]
అక్కజముగ నెదలోఁ గవి
తిక్కనయే యంచుఁ దలఁచితివ వనజాక్షీ
యక్కట వెస ఖడ్గపు టా
తిక్కనను వరించి తీవు తిక్కల పోరీ 32.
ఒక్కరి కున్నఁ దిక్క కనుచుందుము పోరు నిరంతరమ్మునుం
దిక్క సెలంగ నిద్దఱికి దిట్టగ జంట చరించు నొక్కటై
తిక్క గలట్టి యన్న యగుఁ దిక్కన తిక్కకుఁ దిక్క యొప్పనం
దిక్కననున్ వరించెఁ గద తిక్కల పోరి యిదేమి లొల్లియో 31.
రుణ్మనమున నడుగ నభ
స్త్విణ్మణి సాక్షిగ వచింపు వేల్పుల మిన్నా
షణ్ముఖ యే లోకమ్మున
మృణ్మయ పాత్ర వెల హెచ్చు హేమము కంటెన్ 30.
రాణ్మణు లుండ దేశమునఁ బ్రాకృత మానవుఁ డొంద నేర్చునే
త్విణ్మయ భర్మ భూషలను దిట్టతనమ్మున భారతమ్మునన్
షణ్ముఖ ధాత్రి నట్టి దివసమ్మునఁ దప్పక, యే దినమ్మునన్
మృణ్మయ పాత్ర కుండు వెల మిక్కిలి, స్వర్ణ ఘటంబు చౌకయౌ 29.
వనజాక్షుఁడు కరుణామయుఁ
డనిశం బార్త జన బంధువై చరియించుం
గినియక శరణాగతులను
దన శత్రువు లైన జనుల దైవము ప్రోచున్ 28.
తనిపెన్ మోక్షమునన్ హిరణ్యకశిపున్ దైత్యున్ హిరణ్యాక్షునిన్
వనితం జంపి యొనర్చెఁ బావనినిఁ దాఁ బాలీయఁగాఁ బూతనం
బనిపెం గంసుని స్వీయ లోకమునకుం బాపాత్ము నింపారఁగం
దనకున్ శత్రువు లైన వారిని సదా దైవంబు ప్రోచుం గదా 27.
మతి లేని వారు కొందఱు
నతుల నొసఁగి యేఁగుదెంచిన నృవరు లన్యుల్
వితతజ్ఞానులు జరిగిన
శతావధానమున నర్ధశత పృచ్ఛకులే 26.
మూరి శతావధానమును ముచ్చట గొల్ప నొకండు సేయఁగా
నేరఁడె వేయఁ బ్రశ్నలను నెమ్మి నొకండును వంద ప్రేక్షకుల్
తోరము మెచ్చ నన్న యది తోఁపక యిట్లని పల్కు వార లె
వ్వారు శతావధానమునఁ బ్రాశ్నికు లేఁబది మంది చాలరా 25.
సాధారణ విషయం బిది
బోధింపరె సత్కవులు విపులముగ నిత్యం
బీ ధర వేఁడిమి తమ్ముల
బాధింపదు చలివిభుఁడు ప్రవాసం బుండన్ 24.
[చలివిభుఁడు= చలువఱేఁడు]
ఇలలో నింతుల గుహ్య చిత్తముల నూహింపంగ నెవ్వారికిం
దలమౌనే పతి కైన బ్రహ్మ కయినం దథ్యంబుగా నక్కటా
చెలి కిష్టం బఁట యాకుకూర లన నిస్సీ చెంత నుండంగ బ
చ్చలి బాధింపదు వల్లభుండు పరదేశం బేఁగి రాకుండినన్ 23.
చింత సేయ వైతి సుంత యేని నకట
మందబుద్ధి వైతి సుందరాంగ
వే రొకండు లేఁడె యూరిలో నీ కయ్యొ
వాడ వాడ దిరుగు వాఁడు గురువు 22.
పాడిగఁ బార్థ పౌత్రునకు భాగవతమ్మును జెప్పె నిల్చి యే
నాఁడును సుస్థిరమ్ముగ మనస్వి మునీంద్రుఁడు నిల్చు వాఁ డహో
కాఁడఁట క్షీరముం బిదుకు కాలము మాత్రమ యుండు నొక్కెడన్
వాడల వాడలం దిరుగువాఁ డఁట విశ్వ గురుండు చిత్రమే 21.
పురముల క్షేమం బరసి యె
గుర ఱెక్కలఁ గూడి మున్ను కోసె నెఱకలన్
సురపతి ముల్లోకమ్ముల
గిరి విధ్వంసకుని జనులు కీర్తింత్రు సదా 20.
నరలోకమ్మునఁ గొండలే యరయఁగా నారాయ ణావాసముల్
గిరి పూజా రత మానసుల్ జనులు శంకింపంగ రా దేరికిన్
సుర లోకాధిపుఁ గూడి సప్తగిరి వాసున్, శక్రుఁ డుద్రేకియై
గిరి విధ్వంసకుఁ డైన, శ్రీపతిని సంకీర్తింత్రు లోకుల్ సదా 19.
వాఙ్మాత్రమ్మున దుస్సహ
దృఙ్మహిమ మడరఁగ దుర్మతి దశాస్యునకుం
దిగ్మాంశుఁడు నమ్రుండై
ప్రాఙ్మణి సూర్యుండు దోఁచె రజనీవిభుఁడై 18.
వాఙ్మయ మందు నింపుగను భానుఁడు చంద్రుఁడు సుప్రసిద్ధులే
రుఙ్మయుఁ డస్తమించు తఱిఁ గ్రూరత క్షీణము గాఁగ విస్తృ తా
సృఙ్మయ రూపమేర్పడఁగఁ జిత్రముగాఁ గమనీయ కాంతిమ
త్ప్రాఙ్మణి యైన సూర్యుఁడు నభంబునఁ దోఁచెను జంద్రబింబమై 17.
మితముగా వచింప మేలొనఁగూర్చును
మితపు వ్యయ మొసంగు మేలు సతికి
జీర్ణమై త్వరితము చేవ నొసంగి య
మితము గాని తిండి మేలుఁ గూర్చు 16.
జిత నిజ దుర్దమేంద్రియుఁడు చెన్ను వహించు నిరంతరమ్మునున్
మిత మన నేర వెన్నటికి మించి జనించుచు నుండుఁ గోర్కెలే
సతతము కామితమ్ములు భృశమ్ములు జిహ్వకుఁ గాంచ మెన్నఁడున్
మితము నతిక్రమించి తిన మే లగు నెప్పుడు మానవాళికిన్ 15.
హరి వచన మాలకింపుడు
గిరి రిపు సేవన మదేల కృతమతు లారా
ధర గోవర్ధన పుణ్య శి
ఖరమును సేవించి కనుఁడు కైవల్యంబున్ 14.
ధరణీ భృద్ధర పద్మనాభ కరుణోదన్వద్భృశాపన్న స
చ్ఛరణార్థివ్రజ దీన సంచయ సమంచద్భక్త కోటీ నిరం
తర రక్షా పర సర్వ జీవ నిచయాంతర్యామి గీర్వాణ శే
ఖరపాదద్వయ కంజ సేవనమునం గైవల్య మందం దగున్ 13.
పట్టు వదల కుండ వాదించి వాదించి
సత్యము గెలిపించి యత్యధికము
ద్రవ్య మపహరింపఁ బ్రత్యర్థులకుఁ బట్ట
వ్యాధి, నయ మొనర్చు న్యాయవాది 12.
సాధన తోడ జ్ఞానము భృశమ్ముగ నుండఁ బ్రసిద్ధ వైద్యుఁడే
బాధ లొసంగు రోగమును బన్నుగ మాన్ప ధరాతలమ్మునన్
నైధన తుల్య సంకటము జ్ఞాతి నికాయ మొసంగు నా మనో
వ్యాధి నెఱింగి తగ్గుటకు నౌషధ మిచ్చును న్యాయవాదియే 11.
దైవ కృప సన్నగిల్ల స్వభావ మణఁగు
నమ్ముకున్న తనదు శక్తి నాశన మగు
నోడ లరయంగ బండ్లగు నుర్విఁ బాఱ
నీరు పల్ల మెఱుంగదు నేరు మిట్ట 10.
చల్లగ నున్న మానసము సాగును సుస్థిర మైన రీతి భా
సిల్లును భావజాలములఁ జెన్నుగఁ గంప మెఱుంగ కెవ్విధిం
బెల్లుగ వాయు వైనఁ గడు వేఁడి గ్రహింప ననూహ్య రీతినిం
బల్లము నుండి యెత్తునకుఁ బాఱు జలంబులు సర్వ కాలమున్ 9.
అఖిల మానవులు నిరాడంబరు లయినఁ
దారతమ్యము లిల నేర రెవరు
వేష భాష లందు భూషణమ్ముల నిర్వి
కార మున్ననె మమకార మలరు 8.
గౌరవ మాన వాళి సహకారము పెద్దలు సెప్పు నుళ్ల స్వీ
కార మిహోపకారము నఖర్వ సనాతన సన్ను తైక సం
స్కారము వేష భాషల వికార విహీనము నిత్య నిర్మ లా
కారము గల్గు చోట మమకారము సుంతయుఁ దగ్గ దెప్పుడున్ 7.
చక్కఁగఁ దనకు భర్తగఁ జక్రధరుని
దయ నొసంగు నని మదినిఁ దలఁచి యంత
నరసి యర్ధ నారీశ్వరు కరుణ గరిమ
నమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని 6.
మునుముం దూనుచు మాల లింపుగను సమ్మోదమ్మునన్ నిత్యముం
దన నాథుం డని పద్మనాభు మెడలోఁ దా నుంచు నా దండలం
దన కింపారఁగ వెన్నునిం బతిగ సంధానింపఁగాఁ గోరుచుం
దన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్ 5.
నేరముగా భావించి పు
రారాతి కని విరి శరము లట ఫాలాగ్నిం,
గోర కొనర్పఁగ సమరము
మారుతి! చక్రాయుధమున, మారునిఁ జంపెన్ 4.
నారి కసత్య మాడఁ గడు నైపుణ ముండు నటంచు విందు నే
సూరి జనోక్త వాక్యమును సుంతయుఁ జింత యొనర్ప కాత్మలోఁ
గోరి యసత్య మొక్కటినిఁ గోమలి పల్కు మనంగ నిట్లనెన్
మారుతి చక్ర ఘాతమున మారునిఁ జంపెను రాజ్యకాంక్షతో 3.
ఈశ్వ రానుగ్రహమ్మున హీన విక్ర
ముండు సెలరేఁగి యొకనాఁడు పాండు సుతుల
సమర వీరుల వారించె సైంధవుండు
కాల సర్పముం గబళించెఁ గప్ప యొకటి 2.
విను తెరు వందు నేగుచును వేగము మీఱ బలాఢ్యుఁ డొక్కెడన్
మును గజ కచ్ఛపమ్ములను మూరి భుజించిన వాఁడు చక్కఁగా
ఘనుఁ డగు పక్షి రాడ్వరుఁడు కశ్యప సూనుఁడు రేఁగి రెంటినిం
గనుఁగొని కాల సర్పమును గప్ప వెసం గబళించె నాఁకటన్ 1.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి