18, జనవరి 2026, ఆదివారం

ప్రజా సేవ

 

ప్రజా సేవ


తే.గీ.

అన్న తఱచు ప్రజా సేవ యంచు విందు
నందు నిందు నా కెద నొక్క సందియమ్ము
ప్రజ లనఁగ నెవ్వరు మఱి సేవ యన నెద్ది
యెఱుక లేదయ్య సుంత నీ వెఱుఁగఁ జెపుమ

1.     

 

 

 

తే.గీ.

పదవి లోనున్న వారంద్రు పరమ లక్ష్య
మే ప్రజా సేవ యంచు మా కెప్పటికిని
నంద్రు ప్రతి పక్ష మందున్న నధిపు లట్ల
మఱి ప్రజల కేల యిక్కట్లు మానవేంద్ర!

2.     

 

 

 

తే.గీ.

ప్రజలు కనుచున్న వారంచుఁ బ్రభువు లంద్రు
ప్రజలు చూచు చున్నా రని  పదవి లేని
వారు నందు రీ ప్రజలు నా ప్రజ లనంగ 
నెవ్వరో యేరి కెఱుకయ్య యింత యేని

3.     

 

 

 

తే.గీ.

వినఁబడు సమాజ మను పదం బనవరతము
ప్రజల విభజించి పాలింప రాజనీతి
యన్న సిద్ధాంత ముద్భవ మయ్యె నేఁడు
యిది ప్రజా సేవ కర్థమ యెఱుఁగఁ జెపుమ

4.     

 

 

 

తే.గీ.

సేవ కర్హుల నెన్న నెంచిన సమాజ
మేల యర్హత యది యున్న చాలదె మను
జుఁ డతఁ డెవ్వఁ డైనను నేమి కడఁగి తీర్పఁ
గష్ట మించుక  ప్రజ లందుఁ గనమె వాని

5.     

 

 

 

తే.గీ.

వీరి ప్రజ లెల్ల వారికిఁ గారె ప్రజలు 
కార్య కర్తకుఁ బట్టమ్ము కట్ట నేల
వాని నొక్కనిఁ  గందురె ప్రజల లోన   
సేవ లన నర్థ మిద్దియ చిత్రముగను

6.     

 

 

 

తే.గీ.

దోఁచు కొను చుందు రిప్పటి దొర లనంగ
దోఁచు కొంటిరి యప్పటి దొర లటంచు
నొకరి నొకరు దూషించుచు నుండ సతము
వీరి వారి ప్రజాసేవ విదిత మయ్యె

7.     

 

 

 

తే.గీ.

కందు రెదలఁ బ్రజా సేవ నంద ఱక్క
టా ప్ర జాసేవ గాను దొడ్డ దొర లిపుడు
స్వార్థమే బలీయము గాఁగ వ్యర్థ జనులు  
వేచి, వేఁచుచుండ దొరలు, జూచు చుంద్రు.
[ప్రజా + అసేవ = ప్ర జాసేవ, ప్రజలకు సేవ చేయమి; వేచి = నిరీక్షించి; వేఁచు = వేఁగఁ జేయు] 

8.     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి