ఇఁకఁ బిమ్మటేమి వాకిలిఁ
బ్రకటింపుఁడు వలదని వలపత్రము వెలయన్
సుకవి గణ చోదనంబై
వికసింప శివాభరణము విశ్వము నందున్ 17
[పిమ్మటేమి వాకిలి = Whatsapp, వలపత్రము = Blog (web log)]
అవమానం బని నిన్ను నెంచెదరు నిత్యం బాత్మ లందుం బరా
భవ మన్నం బరమంపు మోక్షమని సంభావింప నొప్పున్ ధరన్
స్వవనీ సంతతి మోక్ష కారణము నిత్యానంద సంధాయినీ
భవ బంధమ్ములఁ ద్రెంపు మమ్మ వసుధా భద్రమ్ము నిమ్మా కలిన్ 16
[పరా + అభవము = పరమ మైన జన్మ రాహిత్యము]
ఈ వపరాభవై తనరి హీనపరాభవ గానొనర్పుమా
యీ వసుధాతలమ్మును నహీన పరాభవ వత్సరంబ నీ
దీవనలే సెలంగఁ గడతేఱ విపత్తులు విశ్వ మందు వే
కావు మొసంగి శాంతిని సుఖమ్మును మెండుగ మానవాళికిన్ 15
పెరిగెఁ బరాభవమ్ము లిల విశ్వ విశేష జనాంతరమ్ములన్
నరులకు ద్వేష భావము ఘనమ్ముగ నాత్మల నుద్భవించెనే
విరివిగ యుద్ధ మేఘములు విశ్వ నభమ్మున సంచరింపఁగా
నరయవె నూత్న వత్సరమ యమ్మవు నై యిల నింకఁ గావవే 14
నల్ల నయిన వ్యాపారము చెల్లదు గద
కొనెడి వారలు లేకున్న మనుజు లందు
లంచ మే రీతిఁ గైకొను మించి లంచ
మీక యున్నచో నరు లెల్ల రూక లున్న 13
ట్రంపు పగటి కలలు వికటమ్ముగఁ గను
నాపితిని భారత రణము నను నొక పరి
యాకు పచ్చ నేల తనది యను మఱి యొక
తూరి క్యూబాను వెస మ్రింగుదు నను నాస
నా యిరాను పని సమసె ననును నేఁడు 12
నాది నాదని దేశాధినాథుఁ డడరు
నెమ్మి బుద్బుదం బైన జీవమ్ము వోవ
నెచ్చటికిఁ బోయె నా రాజ్య మెల్లఁ జూడ
నేర్చునె జనుల నొక్కరిని నయిన నిఁక 11
కన రెవ్వరు కనిన నొక ర
యిన నుత్తర మొసఁగ రే మెయి నుదా సీనం
బనయం బిట వర్ధిల్లును
మన కవు లెల్లరు నితాంత మౌనవ్రతులే 10
బాల్యావస్థ మనో చాం
చల్య మిచటి ప్రచురణమ్ము చాపచ్యుత దు
శ్శల్యం బరణ్య రోదన
తుల్యంబే సుండి వితత దుఃఖాస్పదమే 9
కవి లోకారణ్యం బిట
వివేక పరిశీల నైక వివిధ కవి వరే
ణ్య విహార విహీనం బయి
ఛవి హీనం బయి మసల విచారం బయ్యెన్ 8
వెలఁదుల మిన్న బంధుజన వృద్ధ జనావళి సుప్రసన్న వె
న్నెలఁ దలపించు మానసము నిండుగ వెల్గెడి ముద్దరాలు తే
నెలఁ గురియించు వాక్యముల నీరజ లోచన నాథు నెప్డు సే
వల నలరించు భామ యని పల్కుదు రెల్లరు రామలక్ష్మినిన్ 7
నీదు స్వగ్రామ మెయ్య దని యడుగంగఁ
జారు వైకుంఠ మందును సద్య మడరి
యెవరు మీవా రని యడుగ నెలమి నేను
బదు లొసంగుదు హరిధామ వాసు లంచు 6
బడులు వడి వడి వెడ యెడలఁ
గడు నడరించుఁ గడఁక నిడుఁ గడ విడిముడులన్
బడు లిడు మెఱవడి కడిమిన్
బడుల గుడు లని నుడువ దడఁబడి వెడలకుమా 5
[వెడ = అల్పము; ఎడ = హృదయము ; అడలించు = వర్ధిల్లఁ జేయు;
విడిముడి = ధనము; మెఱవడి = గౌరవము]
నిండుగ నూర్వసంతములు నెమ్మి శరీరము నందు డెందమం
దుండఁగ బంధు వర్గము సహోదర సంయుత సోదరీమణుల్
మెండుగ నుండ నాత్మజ సమృద్ధి ధ నామిత ధాన్య భూ లస
న్మండన వాహ నావసధ మండలి వర్ధిలు గావుతన్ ధరన్ 4
నన్నయ వ్రాసె మున్నల ఘనస్తవనీయ మహాంధ్రభాషలో
వన్నెలు చిందు భారతము వ్యాకరణమ్మును శబ్ద శాసనుం
డన్న ప్రసిద్ధి నంది మఱి యాంధ్రము నందు సనాతనుల్ కవుల్
మున్నొక రైన లేనియెడఁ బో పరిపక్వత నందు నెట్టు లీ
మన్ననఁ బొందుఁ దెన్గిలఁ గ్రమమ్మునఁ జెందక వృద్ధి సద్యమే 3
అంబుధిఁ బానవట్ట మన నర్యమ బింబము రుద్ర లింగమై
యంబర మందు నుద్భవము నందెను వింతగ విశ్వనాథుఁడే
సాంబ శివప్రసిద్ధ పరమాంచిత తేజమె యర్చికోటులై
సంబర మొప్ప విశ్వమునఁ జక్కఁగ నిండెను వెల్గు నీయఁగా
బింబమె యస్తమించె శశిభృత్తు లయం బొనరించె నిద్రకై
యింబడరంగ లోకులకు నించుక కాలము విశ్వమంతటిన్ 2
ఇల నిరు వేలపై నిరువ దింకను నాఱవ యేఁ డొసంగుతన్
ఫలములు మానవాళికి నపారము లాయు రరోగ సారముల్
సలలిత రీతి సంపదలు సౌఖ్యము శాంతిని స్నేహ వృద్ధులన్
విలయము నంద వైరములు విశ్వము నందు నిరంతరమ్మునున్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి