27, జనవరి 2026, మంగళవారం

శాంతి మంత్రము


 


శాంతి మంత్రము 


 

 

 

 

మ.

ధరలో దేశము లెల్లఁ జాగ వలె నిత్యస్నేహ భావమ్ములన్     

స్థిర సంభావిత మిత్ర భావముల వర్ధిల్లున్ మనశ్శాంతియే

విరహం బెన్నఁడు  లేక భాసిలును గంభీరాబ్ధి సాదృశ్యమై

తిరమై ద్వేషము మండుచుండఁగను సందేహాగ్ని జృంభింపఁ బ

ల్వురి డెందమ్ములు తల్లడిల్లు ఘన కల్లోలాబ్ధి చందమ్మునన్           

1.      

 

 

 

ఉ.

స్వీయ ధరా విభాగముల వృద్ధియె లక్ష్యము దేశ కోటికిం

బాయ మనస్కరింపమియె భావ్యము సీమల నాక్రమింప నే

న్యాయము మేటి శక్తి కల దంచు నెదుర్కొనఁ బాడి యెట్లగుం

బోయిన వారి వారి నిజ భూములు కుందరె  యెల్ల రెన్నఁగన్                                        

2.     

 

 

 

మ.

నిరతం బుండఁగ దండయాత్రలను గన్నీరొల్క సంద్రమ్ములై

పరిమార్పంగ జనవ్రజమ్ము నిల దైవం బెట్లు మన్నించుఁ  సే

కురు నెబ్భంగి ద్యులోక మే మతము లుద్ఘోషించు విధ్వంశముం

బరమాత్ముండు సహింప నేర్చునె మహా పాపోగ్ర కార్యమ్ములన్  

3.     

 

 

 

మ.

ధరణీ గోళమె యంతరిక్షమున వృత్తక్షిప్త కక్ష్యన్ నిరం

తరముం దిర్గుచు మానవాలి కొసఁగెన్ స్థానమ్ము లింపారఁగాఁ

బరఁగం బ్రాణము లెల్ల బుద్బుదములై వాత్సల్య భావమ్మునన్

ధరలో నుండక యేల మర్త్యులకు విధ్వంసంపు టాలోచనల్  

4.     

 

 

 

ఉ.

పుట్టిన వార లెవ్వరును భూ జను లాఱక తప్ప దెన్నఁగాఁ  

జుట్టము లాత్మ నందనులు చొప్పడ మృత్యువు వెంట వత్తురే

పెట్టిన దాన ధర్మములు  వీడవు కాలుని యింటి కేఁగినం

దట్టిన నంత్యకాలమునఁ దద్ధరి నామము కల్గు మోక్షమే       

5.     


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి