కానక మంచి చెడుల నే
మానవుఁడు చరించు చుండి మనును నిరతమున్
మానవతను మంటఁ గలిపి
మానవ! తన్ విడిన వారె మాన్యు లవనిలో 30.
[తన్ = తను/ తన్ను]
మాననీయుల మిన్న నాఁ బది మంది మెచ్చి నుతింపఁగా
దాన ధర్మము లందు నెన్నఁగ దాన కర్ణుని మించుచుం
బాన భక్ష్య చయమ్ము లింపుగఁ బంచుచుం గుహ నాచర
ద్మానవత్వము లేని వారలె మాన్యులై వెలుఁగొందిరే 29.
[కుహనా + ఆచరత్ = కుహ నాచరత్ ; కపట బుద్ధితో స్వార్థమునకై యాచరించుచున్న]
కాలి నంతటఁ జేతులు కడఁగి భృశము
పత్రములను నాత్రమ్మునఁ బట్టి నట్లు
నిలువ జానకి లంకలో నేరకుండ
లంకఁ గాల్చిన హనుమ కళంకితుండు 28.
శంక చెలంగ డెందమున జానకి దుఃఖిత యయ్యె నత్తఱిన్
గొంక కెడంద నల్పమును ఘోర తరమ్ముగ నగ్ని ధగ్ధ లం
కాంకిత మీయ సోకులకు నద్భుత రీతిని నంత వారికిన్
లంకనుఁ గాల్చి మారుతి కళంకితుఁ డయ్యెను సీత దృష్టిలో 27.
నెమ్మి నొసఁగు నపాత్ర దానమ్ము భంగి
దాన కర్ణుం డనిన లోభిఁ దగని పగిది
వీత ధర్మానురక్తి యౌ నేత కౌను
బూత వాక్సౌరభపుఁ దోట బూతుపాట 26.
పరవశ మందరే నరులు వారిఁ బొగడ్తల మించి ముంపఁగా
సురుచిర వాక్సుమాంబునిధి సుందర వర్ణన నైపుణమ్మునన్
ధరణిపు లెల్ల మెత్తురు వదాన్యత నిత్తురు విత్త మింపుగా
సరస వచోవిలాస సుమ సౌరభ మొప్పును బూతు పాటలన్ 25.
[బూతు = బట్టువాఁడు]
మించఁగ నభి మాన మంచితముగ నెంచి
కొంచె మైన నచట మంచి తనము
మించఁ బిలువ రంచుఁ బెంచి సంకోచమ్ము
కంచ మందు తిండి గలదు తినఁడు 24.
మించిన బాధ డెందమున మేటి మగండును గ్రుంక కుండునే
పంచన నిల్చి యుండినను భార్యను జూడఁడు పల్కరింపఁడే
మంచము పైన దొర్లు నణు మాత్రము జాఱఁడు నిద్ర లోనికిం
గంచము లోని యన్నమునుఁ గాంచుచు నుండెఁ దినండు సుంతయున్ 23.
ప్రాణ మస్థిరం బనుచుండఁ బ్రాయ మెంత
పుచ్చుకొని కుమారుని నుండి మున్ను తిరిగి
యౌవనమ్మును సుతున కీయంగ విగత
యౌవనాఢ్యుఁడౌ పతిఁ గాంచి యాలి యేడ్చె 22.
ఆతత తాపసోత్తము లనన్య మనోహర రూప మందు టే
రీతిని వింత యౌను వ్యతిరేకము వింత యనంగ సత్యమౌ
యీతని కే విధమ్మున గతించెను వార్ధక మౌర యంచు నా
యాతత యౌవనాఢ్యుఁ డగు నట్టి పతిం గని భార్య చింతిలెన్ 21.
[చింతిలు = ఆలోచించు]
అడుగులకు మడుఁగులు తడయక యొత్తుచు
నెప్పు డేది వలయు నప్పు డిడుచు
మాట కెన్నఁ డెదురు మాట చెప్పక యున్న
భర్త భార్యకుఁ దల వంచు నెపుడు 20.
ఆర్తి యటంచు నెంచకె యపార గృహాంతర కార్య కోటికిం
గర్తగ నుండు నెల్లపుడు కా దన కెన్నఁడు భర్త మాటనున్
వర్తిలు భర్త యాజ్ఞలను భార్య నిరంతర మాచరించుచున్
భర్త వినమ్రుఁడై తనదు భార్యకు నెప్డు శిరమ్ము వంచునో? 19.
భరతుఁ డటు లేల సేయును
మరులుకొని మనమ్ము నందు మాతవి యగు నా
గిరలను నామోదించిన
భరతుఁడు దుష్టాత్ముఁ డనుట వాస్తవమె కదా 18.
నరులకు నెల్ల మే లగును నాశము కా నరి వర్గ మాత్మలోఁ
బరఁగిన నందు నొక్కటియుఁ బన్నుగ శిక్షకు నర్హుఁ డౌను దో
మరమునఁ గ్రోధ కామ మద మత్సర మోహ నిరంత రోగ్ర లో
భ రతుఁడు చెడ్డవాఁ డనుట వాస్తవమే పరికించి చూచినన్ 17.
అనుమానము సుంత వలదు
కనఁ దర్కము నీటి మూషి కమ్మనఁ జెల్లున్
వనచర మకరమ్ముఁ గనుక
వన విభునకు మూషికమ్ము వాహన మయ్యెన్ 16.
మనుజౌఘమ్మునకన్ సురావళికినిన్ మాన్యుండు హేరంబుఁడౌ
ఘనుఁ డా మత్త గజాస్య భాసితుఁడు తద్గౌరీ కరాంభోజ సం
జననుం డెల్లెడ సంచరించుటకు హర్షం బంది విఘ్నవ్ర జా
వన రాడ్వాహన మయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్ 15.
రాక్షసేంద్రుఁడు చెండాడ రణము నందు
రాక్షస వరేణ్యు లంది హర్షమ్ము నెదల,
నేఁచి రావణు ధాటికిఁ జూచు చుండ
వానరులు, జోత లిడిరి రావణుని మెచ్చి 14.
మానరు పోరు వానరులు మానిసి దిండ్లు చలమ్ము మీఱఁగా
వానరు లెల్ల రాఘవునిఁ బార్థివ సూనునిఁ గాంచి మెచ్చఁ బం
క్త్యానన విక్ర మోద్యమము నాజిఁ దృణీకృత సంఖ్య సంచర
ద్వానరు లెల్ల జోతలను బల్కిరి రావణుఁ జూచి మెచ్చుచున్ 13.
ఏ నిమిషము నందు నేమి జరుగు నేరి
కెఱుక పుడమి నెన్నఁ డేని చూఁడి
పిల్లి నన్ను జూచి వేగ లంఘింప మా
పులికి నచ్చెరువుగఁ బుట్టెఁ బిల్లి 12.
[మాపు + ఉలికి = మా పులికి]
పులికిన్ బెబ్బులి యుద్భవించు టిల నామోదమ్ము వీక్షింపఁగా
బలవంతుం డగు మత్స్య దేశ పతికిన్ బాలుండు భీరుండు నౌ
బల దర్పుం డగు నుత్తరుండు కలిగెన్ వాక్శూరుఁ డత్యుద్ధతిం
బులికిం బిల్లి యొకండు మ్యావు మనుచుం బుట్టెం గదా వింతగన్ 11.
అమ్మాన వోత్తమునితో
నెమ్మెయిఁ గన లేక యున్న నింతయు బాంధ
వ్యమ్ము కరుణతో వెంకా
యమ్మను నన్నుఁ గనిన మహితాత్మున్ గొల్తున్ 10.
పమ్మిన నీతి బాధలు నపారము మూరిన ప్రేమ తోడ నం
కమ్మున నుంచి పెంచ మము గౌరవ భావము నాత్మ నూని ని
త్యమ్మును నీదు తాతను దయా గుణ భాసితు సచ్చరిత్రు మీ
యమ్మను నన్నుఁ గన్న మహితాత్ముఁ దలంచెద నెమ్మనమ్మునన్ 9.
క్రౌర్యం బగు నా భావమె
వార్యం బెవ్వారి కేని వసుధం గడు దు
ష్కార్యం బది త్యాజ్యము పర
భార్యా సంగమము ఘోర పాపమ్మె కదా 8.
కార్యాకార్య మహా విచక్షణులు నిక్కం బందు రీ ధర్మమున్
భార్యా హీనులు మోక్ష మన్న యది సంపాదింప రే నాఁటికిన్
భార్యా రత్న మిలం బితౄణమును దీర్పన్ హేతువై భాసిలున్
భా ర్యాసంగము పాప హేతు వగుఁ దద్భావంబు వర్జింపుమా 7.
[భార్యా +అసంగమము = భా ర్యాసంగమము]
సక లామర సంపూజితు
వికసిత నలి నాభ నేత్రు వినుత మహా భ
క్త కరిత్రాతృ విదారిత
బక నామ జపంబు చేతఁ బడయమె ముక్తిన్ 6.
బక వత్శ్వేత ధరాధరాలయు శిరో బాలేందు సాహస్ర కాం
బక యుక్తామర సంఘ పూజితుని శర్వప్రోక్తు చంచన్మహా
బక సంహార కరాబ్జ పూజితుని తద్భస్మాంగు ఫాలస్థ లాం
బక నామమ్ము జపింప మోక్ష మది సంప్రాప్తంబు గాకుండునే 5.
అర్థానర్థ వివేక స
మర్థములు గభీరము లసమానమ్ములు కృ
త్స్నార్థ సమున్నతములు వ్యం
గ్యార్థము లేనట్టివి గద యాంధ్ర పదమ్ముల్ 4.
స్వార్థము తోఁచు చున్న దిట వ్యర్థ గిరా నిచయమ్ము సంత తా
నర్థ చయప్రదం బగు నయాచిత వార్తలు దుఃఖ దాయముల్
వ్యర్థ వివాద భాషణము లౌ నివి జ్ఞాన విహీను లందు రి
ట్లర్థము లేనివౌ పదము లాంధ్రము నందున నుండెఁ బెక్కులై 3.
క్షేమం బడర వివాసిత
ధాముండు విభీషణుండు ధర్మాత్ముం డా
రాముని దయతో లం కా
రాముఁడు లంకా నగరికి రాజయ్యెఁ గదా 2.
[లంకా + ఆరాముఁడు = లం కారాముఁడు]
రాముని కార్య మవ్విధము రమ్య తరమ్ముగ సిద్ధి నంద భా
ర్యామణి బంధ మాఱఁగను హర్ష మెడందఁ జెలంగ సద్గుణ
స్తోముఁడు నా విభీషణుఁడు శూర వరేణ్యుఁడు, రాజ్య మీయఁగా
రాముఁడు రావణుం దునిమి, రాజుగ నయ్యెను స్వర్ణ లంకకున్ 1.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి