పాట లందు గంధర్వుల వాణి మించు
గణిత గాయక గాయకీమణులు పాడ
శాస్త్రవిజ్ఞాన మహిమమ్ము సన్నుతింతు
మేటి రాగాల వినిపించు పేటిక యిదె 58
ఇలఁ దారాడు విరించి దేవి యనఁ గన్పింపంగ రమ్యంబుగా
నలివేణీ నిజమే వచింతు నిట మేనల్లాడఁ బద్మాక్షిరో
చెలువం బొప్పఁగఁ గింకిణీ కలిత కాంచీ బద్ధమై వెల్గుచున్
లలితమ్మై వినసొంపుగన్ నవరసాలన్ జిల్కు నీ పేటియే 57
[పేటి = నడికట్టు]
గలరు హలమ్మూనఁ గలరు కాంతామణులే
చెలువపు శృంగారమ్మునఁ
జెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే 56
[చెప్ప ను + కలరు + ఏ = చెప్పం గలరే;
చెప్పఁ గలరు చుమీ]
బలమునఁ గత్తి పట్టుదురు భామలు భండన విక్రమమ్మునన్
లలనలఁ దూలనాడకుమ రామ కథా రచయిత్రి మొల్ల నీ
యిలఁ గనమే సుధా రసల నింపుగ నింపెనె భావ్యమే యనం
జెలువలు సత్కవిత్వమునుఁ జెప్పఁగ నేర్తురె మేలనన్ బుధుల్ 55
దిన కృత నిజ కార్య శ్రమ జనిత దుర్భ
ర క్లమావృత మాన వార్భకుల కెంచ
నుత్కట నర విపత్కర మత్కుణ హర
కంటకములున్న పాన్పు సుఖంబునిచ్చు 54
చిరముగ నున్న దీ పఱుపు శ్రేయము లెన్నొ చెలంగె నంచు బా
గరి వచియింప కిత్తరి సుఖమ్ములు ముఖ్యము మానవాళికిన్
వర మగు నన్య సంస్తరము పద్మదళేక్షణ నిద్రవోవగం
బరమ సుఖంబు నిచ్చుఁ గద, పానుపు కంటకపూర్ణమైనచో 53
ఎలమిని నుండంగఁ గలసి
మెలసి సతము నా కనుంగు మిత్రుఁడవే నా
పలుకు లివి యేల నమ్మవు
తులువా సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడున్ 52
కల నైనం దలఁచంగ శక్య మగునే కాంచంగ దుష్టాత్ముగా
నల వానిం జరితంబు గన్పడుఁ గదా యత్యుత్తమంబైన య
ట్లిలలో నమ్ముదు నేరి నట్లయిన నీవే దిక్కిఁకన్, వాఁ డహో
తులువా, వందనమయ్య నాకిపుడు సద్బుద్ధుల్ దగన్ నేర్పుమా 51
శిష్టార్తుల రక్షణకై
పృష్ట విహీనతఁ జెలంగి పృథివీపతి తా
దుష్టుల సంతత తాడిత
శిష్టుల వేధించె ధర్మశీలుం డలుకన్ 50
విల యార్థంబ చరింత్రు దుష్టజను లుర్వీ భార దుర్వీర్యులై
లలనాసక్తుఁడు రావణాసురుఁడు పౌలస్త్యుండు యక్షానుజుం
డిలలో బ్రాహ్మణ వంశ జాతుఁ డయి లంకేశుండు కామప్రభా
విలసద్ధర్మపరాయణుండు మిగులన్ వేధించె శిష్టాత్ములన్ 49
కదిసిన వడిఁ గోయుఁ గరమును గోమలి
దూఁక నేల నీకుఁ బోకు దరికి
వెఱ్ఱిదనము నూని వీఁగిన బగులు బు
ఱ్ఱ మణి కుచముపైన ఱంపముండె 48
సమముగ నాత్మ రక్షణకు శార్వరి వచ్చిన చోర కాయమే
కుములక ధైర్య ముండుటకుఁ గూర్చఁగ భద్రము నెంచి వారలే
యమరి క్రమమ్ముగా నచట యందము లొల్కుచు వింత గాంచు మ
ఱ్ఱ మణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్ 47
[అఱ్ఱ మణి కుచముపై = శ్రేష్ఠపు పెట్టె యఱ గుండెలలో (లోపల), రాజహంసపు బొమ్మ]
బాడిగఁ బచ్చని తరువులు పంచక, నాకీ
వాడని కడింది చక్కటి
మో డీ, సమకూర్చలేఁడు మోదము ప్రజకున్ 46
[మోడు =ఈ = మోడీ; మోడు = మొక్క]
వాఁ డెవ్వం డగు నాజ్ఞ లీయ మనకుం బార్థుండె యోచింపగం
బాడన్ మేలగు శాంతిగీతములు సంభావ్యమ్ముగా నెన్నడుం
దేడా వచ్చిన నింక లాభ మగు నీ తీవ్రంపుఁ బోరందు వే
మో డీ చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్ 45
[డీ చర్యలు = డీకొట్టు పనులు]
అరవిందనయనలు వ్రత ని
కరమ్ము లొనరించి భక్తిఁ గమనీయముగాఁ
గరములు మోడ్చి మది శుభం
కరిని సతులు వేఁడుకొనిరి కలుముల నిడఁగన్ 44
తరళము.
తరుణు లెన్నఁడు వస్త్రహీనము తానమాడఁగ రాదు నాఁ
బరమ తత్త్వము వారికిం దెలుపంగ నిర్జిత శంక న
త్తరినిఁ గృష్ణునిఁ జేతు లెత్తి ముదమ్ము మీఱఁగ,నిల్చి భా
స్కరిని, వేఁడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో 43
[భాస్కరి = భాస్కరుని పుత్రి, యమున]
ది వరమనఁ బడసిన ఫల మది విడువఁ దగునే
శివపూజ, మాని నీవీ
శివరాత్రికిఁ బాపకర్మఁ, జేసిన శివమౌ 42
శివశివ యంచుఁ గొంద ఱిల సేవలు సేసి తరింత్రు కొంద ఱీ
యవనిని విష్ణునామముల నర్చన లందు నభేద మిద్దఱన్
భవునిలు సేరి నిల్చిన నభక్తిని మూర్ఖత నేరకుండఁగా,
శివ మగుఁ, బాపకార్యములఁ జేసినచో శివరాత్రికిన్ సఖా 41
శివున కర్పించ భక్తిని శీఘ్ర మేఁగి
కైకొనఁగఁ బ్రీతి యున్న, నక్కట చెలంగి
స్వాంతమును వడి నూపఁగ సంది యంపు
టూయల గలదు, మారేడు కాయలోన 40
ధారుణి దూల నూపులకుఁ దా వడి దానిఁ గ్రహించు నాశతో
వారక యెవ్వ రే మనినఁ బంతము వీడక యింత యేనియున్
మూరఁగఁ జిత్త మందు కడు మోహము తియ్యని మావి పండుగా
మారెడు కాయలోన నొక మానిని యూయల లూఁగెఁ బ్రీతిమై 39
[మారు మొగము – తిక్కన గారి ప్రయోగము ర ప్రాస యతి స్థానములో.
మాఱు ప్రయోగము కూడ కలదు ]
రంభము వేశ్యాంగనావర రత జనిత సం
రంభము సౌందర్య విజిత
రంభా ఫల మెంత విషమొ రసికుఁడె యెఱుఁగున్ 38
[ సౌందర్య విజిత రంభా ఫలము = సౌందర్యములో
జయింపబడిన రంభ కల యామెను గూడిన ఫలము]
వెస వీడం దగు జీవరాశికి ధరన్ వే భక్ష్యముల్ గ్రుళ్లినన్
విసమై చంపును రోగ కారకమునై వేగంబ సందేహమే
పస యెల్లం జెడి తద్ద క్రుళ్లిన నహోపండైనఁ దాఁ దిన్నచో
రసికుండే యెఱుఁగున్ విషంపు టునికిన్ రంభాఫలంబం దిలన్ 37
క్రాగి యెదను దాను మారెఁ గాషాయంపుం
బాగను గట్టఁడుమఱి యే
యోగులలో వేమనయె యయోగ్యుఁడు స్తుతికిన్ 36
చాగును గాదె యివ్విధి నజామిళు గాథయె భారతావనిన్
బాగరు లందుఁ జిక్కు కొని పామరు రీతినిఁ గాముకుండునై
యాగతి నిల్చినం బరువ మం దవభాసము వొందఁ బాపులన్,
యోగులలోన వేమన, యయోగ్యుఁడు ప్రస్తుతినందఁగన్ భువిన్ 35
[అవభాసము = జ్ఞానము; అయోగ్యుఁడు = కూడఁదగని వాఁడు; యోగము =కూడిక, యోగ్యము = కూడఁదగినది]
రణి నుభయక్షేమమే వరము, శాంతికిఁ గా
రణ మగునే మానుపు మీ
రణమే, పరమార్థ మందురా దూత కహో 34
అణు మాత్రమ్మవకాశమున్న నిలఁ దార్క్ష్యస్థూరి సైన్యోగ్ర వా
రణ సంఘాత సమేత సంఘటిత భూ రాడ్వ్రాత భీభత్స మా
రణ సంయోగ మనోభిలాష కృత భద్రఘ్నంపు సంగ్రామ వా
రణ సంకల్పము కంటె లేదు పరమార్థం బెన్నఁగన్ దూతకున్ 33
ఆ మున్నీటను ద్వార
గ్రామోద్దామమ్ము ద్వారకా నగరములో
నీ మాటయే వినంబడె
భామలు గలువంగ సత్యభామ సుతుఁ గనెన్ 32
ఏమని చెప్ప నొప్పు నిట నిండ్లను రేఁగిన సంబరమ్ములం
గామితదాయి కృష్ణునకుఁ గామిత మిచ్చెను ముద్దరా లహో
ప్రేముడి బిడ్డ బిడ్డఁ డని పెద్దగ నార్చుచు వాదులాడఁగా
భామయు భామయుం గలువ బాలుఁడు పుట్టెను సత్యభామకున్ 31
[కలువ బాలుఁడు = కలువను బోలు బిడ్డఁడు]
జనుదెంచె జనించి తూర్పుసామ్రాజ్యమునన్
వినిపించని నవ్వుల నీ
కనుపించని కీటకమ్ము గాలుని మించెన్ 30
ఘన నరుఁ డాక్రమించెను సుఖమ్ముగ నుర్విని స్వార్థ చిత్తుఁడై
మన మిట నుండ రాదె మఱి మాకిల నుండదె తీపి ప్రాణమం
దని మది నెంచి రోషమున నంతము సేయఁగ మానవాళినే
కనఁబడనట్టి కీటకము గాలుని మించె నిదేమి చిత్రమో 29
పెద్దవాఁడె యీతఁడు పైడి విద్దె యందుఁ
బనులు గానక కృశియించు వాఁడు సుమ్ము
భార మన రాదు మీరు బంగారమునకుఁ
బ్రేమికుల రోజు పిండముఁ బెట్టఁదగును 28
[ ప్రేమికులరు +ఓజు = ప్రేమికుల రోజు
(మేము ప్రేమికులము – మీరు ప్రేమికులరు);
ఓజు = కంసాలి; పిండము = బ్రదుకుఁదెరువు]
కాయము లెంచ రెండయినఁ గావని యాత్మలు వేఱువేఱు నా
నీ యవనీ తలమ్మున సహించఁగ లే మెడఁబాటు నం చయో
పాయఁగ నొల్ల కొండొరులఁ బ్రాణము లిచ్చిరి ప్రేమకోసమై
రోయక నేఁడు ప్రేమికుల రో జని పిండముఁ బెట్టఁగాఁ దగున్ 27
[రోయక = వెదకక; రోజు = దినము (తద్దినము)]
కసవునఁ జెప్పకయుఁ జెప్పుఁ గద జున్నిఁకఁ బా
యసము లలర మా ధేనువు
ప్రసవించును బావ యింకఁ బదిదినములలో 26
పయనము నెంచు మింక వడిఁ బన్నుగ నింటికి సంతసమ్మునన్
భయపడ రా దొకింతయును బావ సుఖప్రసవంబ యౌను సం
దియ మది యించు కేనియు నదృష్టమ వైద్యులు చెప్పి రక్కకున్
నయముగ బావ! యీ పది దినమ్ములలోఁ బ్రసవించుఁ జూడుమా 25
కాకి - దాది - పాపి- వావి
ఏకాకిగనై కుంతి ప్ర
భాకాంతునిఁ దా దినకరు వావిరి తలచం
గాఁకవెలుఁగు పాపి తరుణి
యా కలఁత నడరి యొసంగె నాత్మజు నంతన్ 24
[కన్యాత్వము పోవు నవమానము కలుగు నన్న కలఁత]
నీకు సదా దిక్కు రాజ నీతియ సుమ్మీ
యీకయ్య మాపు వావిరి
నీ కగు మే లింక శాంతి నెగడును ధరలో 23
బ్రహ్మ నలినజుం డొనర్చె రతి నత్తరి వ్యా
జిహ్మమ్ము లేని, మేల్కొన
బ్రాహ్మముహూర్తమున, నిద్ర భాగ్యప్రదమౌ 22
జిహ్మత్వమ్మునఁ బల్కు పల్కులను నీ చిత్తంబులోఁ ద్రుంచుమా
సుహ్మావాస జనౌఘ తుల్యమయి శుశ్రూషా రతిన్ నిత్య స
ద్బ్రాహ్మణ్యాంచిత ధార ణాస్వనిత సంభావ్యుండ! వీడంగ నీ
బ్రాహ్మీలగ్నము నందు నిద్ర, శుభ సౌభాగ్యమ్ము లిచ్చుం గదా 21
[సుహ్మము = ఒక ప్రదేశము వంగ దేశమున]
నెగఁడె సందియమ్ము నీది యైన
యిప్పలుకు నిజంబె యిప్పురి నొక తరి
నుండి లేని దొకటె యున్నదేమొ 20
[ఒకప్పు డుండి యిప్పుడు లేనిది యొకటి (అశాంతి) యున్నదేమో]
అండము కాంచ రాని దగు నందపుఁ బక్కియ కాదె యెంచఁగన్
మెండగు దైవశక్తి ధర మీఱుచు నుండు ననంగఁ దర్కముల్
భండన రీతి రేఁగె నిటఁ బండిత పామర భేద మెంచకే
యుండియు లేని దొక్కటియె, యున్నద? యున్నది, లేద? లేదుపో 19
చేవ దనరంగ నిశ్చిత
భావ నిమగ్నాంతరంగ బల దర్పితులై
యా వానరము లెదిర్చిన
రావణునిన్, సంహరించె రాక్షసుఁ డలుకన్ 18
దండకారణ్య మందలి మునులు రాముని తో మొఱపెట్టుకొను సందర్భము:
భూ వలయంబు దైత్య జన పూరిత తర్జిత మయ్యె నక్కటా
కావఁగ నీవ దిక్కు సుమి కంజనిభాంబక! దండకాటవీ
పావన దేశ వాస తను భాసిత విప్రుని ఘోర భీతి వి
ద్రావణునిన్ దురాత్ముఁడగు రాక్షసుఁ డొక్కఁడు సంపె నల్కమై 17
[భీతి విద్రావణుఁడు = భీతిని తఱుము వాఁడు; (రక్కసుఁడు చంపునన్న భయము)]
మన్నుకొమారిత లతాంగి మహిళా మణియే
కన్నుల పండుగగా రా
మన్ననుఁ బెండ్లాడెను మహితాత్ములు మెచ్చన్ 16
మిన్నయ విద్యలం దరయ మించి వివేకుఁడు విత్త మందుఁ దా
సన్నని వాఁడె యందమునఁ చక్కని వాఁ డని మేనకోడలౌ
యన్నుల మిన్న సుందరి నిజాంబకుఁ దమ్మునిఁ దోటి వారు కా
దన్ననుఁ బెండ్లియాడెను మహామహితాత్ములు మెచ్చఁగా భువిన్ 15
అంగా రార్చక విప్రుఁడు
పింగా క్షాంఘ్రి శరణుండు వేదమ్ములు వే
దాంగమ్ములు, మించఁగ నా
బంగారమును, నిరుపేద పంచె జనులకున్ 14
శృంగారమ్ములఁ జిత్త ముంచకుఁడు సంసేవ్యుండు విష్ణుండు సా
ష్టాంగప్రాంజలిఁ గొల్వుఁ డాతనిని స్వీయాస్వాంత పద్మమ్ములన్
రంగారంగ యనంగ దూరమగు సంత్రాసమ్ము సద్భక్తి నా
బంగారమ్మును బేద పంచె సుఖ సౌభాగ్యమ్ములం బొందఁగన్ 13
దుష్ట వచనములు విన, మా
యిష్టపు రీతినిఁ జనంగ నెట్లుందు మిఁకన్
నష్ట మగు ననిరి కుజనులు
దుష్టులు శిష్టులుగ మార, దుఃఖింత్రు జనుల్ 12
కష్టమె యర్థ మౌట గురు కావ్యము లందలి పద్యరాజముల్
స్పష్టము కాదె యీ నుడువు శబ్దము లింపుగఁ బేర్చి చూడు నీ
పృష్టపు సంశయం బుడుగుఁ బేర్చుమ యుత్తర మింక నాదినిన్
దుష్టులు శిష్టులౌటఁ గని దుఃఖముఁ బొందెద రెల్ల మానవుల్ 11
[పద విభజనమున నుత్తర పదము శిష్టులు మొదట నుంచ: శిష్టులు- దుష్టులు-ఔట ]
గొండ పట్టి డాపటి మేటి దండ వింత
వెండికొండ దర్శించఁగఁ గొండయల్లుఁ
దిండి మానఁగ నాకలి దీరిపోయె 10
మండుచు నుండ నాకలికి మాతరొ యే చిఱు తిండి యింత యే
నుండదె యిమ్ము నా కనఁగ నోర్పు వహించి కరమ్ము వేగఁ దా
వండిన నింటఁ గుక్షిఁ దమిఁ బన్నుగ నన్నము, చెడ్డ దైన యా
తిండిని మాని, వేయఁగనె తీరిన దాఁకలి యద్భుతమ్ముగన్ 9
కలుగును మత్తక్కట మతి
చలించు మానము ధనమ్ము శాంతియుఁ గరువౌ
కలు సేవింపకుఁడీ నూ
కలు సేవింపుఁడని గాంధి గణ్యుం డయ్యెన్ 8
అల నాంగ్లేయుల శాంతి మంత్రమున సత్యా ఖ్యాగ్రహ ప్రాభవ
మ్ముల నిశ్చేష్టులఁ జేసి చిత్రముగ సద్బోధాత్మకుండయ్యె మీ
యిలులన్ నేయుఁడు బట్ట లెల్ల నిజ దేశీయంపు సుక్షారపుం
గలు సేవింపుఁ డటంచు గణ్యతఁ గనెన్ గాంధీ మహాత్ముం డిలన్ 7
[కలు = రాయి]
నిండ్లుగా సమాధు లడర ముండ్ల తోడఁ
బండ్లు గా నుండ నెముకల గుండ్లు మీఱి
పెండ్లిచూపులకుం దగుఁ బ్రేతభూమి 6
సలలిత గంధ సార సుమ సంచయ తోరణ మండల ప్రభా
విలసిత వార కూట పరివేష్టిత పీఠ విరాజితమ్మ యా
వలఁ దనరంగ నేత్ర విభవమ్ముగ నొక్క విశాల హర్మ్యమే,
పిలిచిరి పెండ్లిచూపులకు వేడుక మీఱ, శ్మశానభూమికిన్ 5
[శ్మశానభూమికిన్ –ఆవల]
కడ్పున దారుణ మభీతి కౌరవ జనులే
పూడ్పఁగ నభిమన్యు నహో
తోడ్పడఁ డర్జునునకు హరి దోఁచిన రీతిన్ 4
ఉడ్పుమ వాసుదేవ యని యుద్ధము బంధు గణమ్ము తోడఁ జే
మోడ్పున నెంత వేడినను మూర్ఖతఁ బొందఁగఁ జిత్త తాపపున్
గాడ్పు ఘనమ్ముగా ననినిఁ గయ్యము మానుట కింత యేనియుం
దోడ్పడలేదు పార్థునకుఁ దోఁచిన రీతినిఁ గృష్ణుఁ డెప్పుడున్ 3
కాల మెట్టులు గడచును గలియుగమున
మేలు నుడివినఁ గల్గు కోపాలు మించి
మంచి చేసిన నిందలు పొంచి యుండు
మంచివారికి రాదులే మంచిరోజు 2
మత్తకోకిల.
పంచి తీ విఁక నాస్తి నెల్లను బంపకమ్ముల నక్కటా
ముంచె నాస్తిని వల్లకాటను బోరు మన్నను దీరునా
మించి ప్రేమగఁ జూచు చుండుచు మేలుఁ గూర్చిన, దుష్టులన్
మంచి, వారల కెంచి చూడఁగ మంచిరోజులు రావులే 1
[మంచి = మనిచి, రక్షించి]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి