14, జనవరి 2020, మంగళవారం

పద్యాలు _ 2020

నూత్నాం గ్లాబ్ద మొసంగుఁ గాత జన సందోహేప్సి తాకాంక్షలన్ 
రత్నవ్రాత స శౌక్తికేయ యుత పారావార వృత్తావనిన్ 
యత్నోద్దీపిత కార్య కాయ ఘన సద్యః ప్రాప్త సాఫల్యమున్ 
నూత్నారోగ్యద కీటకక్షయము సంతోషమ్ములన్ వేగమే                                                    89

వర రాజ్యమ్ము నొసంగి భూధవుని సంభావించితే భక్తునిం  
బరమప్రీతిని వైశ్య దంపతులకుం బట్టిం బ్రసాదించితే 
వర భూదేవునిఁ గాచితే కరుణ సంప ద్వైభవ ప్రాప్తినిం  
జిర సంతోష మొసంగి గావుమ దయన్  శ్రీసత్యనారాయణా                           88

ప్రావీణ్యమ్మున వేదవిజ్ఞు లెద సద్భావమ్ము సంధిల్లఁగన్ 
గోవిందుండు విభుండు సర్వులకు నా ఘోషించుచుం బల్కఁగా 
నీ విశ్వమ్మున నే మతం బకట తా నే రీతి నన్యం బగున్ 
గోవిందుం డెఱుఁగండె  పశ్చిమమునం గూర్చుండి పాలింపఁడే                                             87

రామా యని కీర్తించిన 
భామామణి సీతఁ గూడి భక్తిగ నెదలో 
క్షేమము లెన్నియొ కల్గును 
క్షామము లుండవు ధరణినిఁ గాకుత్స్థు దయన్                                                                 86             

1967 మార్చి లో నాకు జరిగిన యథార్థ గాథ: 
నిత్య ధూపమ్ముల నేఁ గొల్చు చుంటిని వెంకన్న బాబును విజయవాడఁ 
జదివెడు దినముల నుదయమ్ముల నలరి విత్తము కఱ వయ్యె నత్తరిని న 
గరు కాష్ఠముల కప్పు గైకొనమి ప్రతినఁ గాలు కాలిన పిల్లి కరణి నుంటి  
మరునాటి పూజకు మార్గ మెద్దని యెంచి  సాయంసమయమున సహచరుండు
 
క్రింద టేఁడు నా నుండి తా నందు కొనిన 
యప్పుఁ దా వచ్చి తీర్చెను గొప్పవింత 
పూజ సాగెను మర్నాడు ముదము తోడ 
దైవ సాహాయ్య మవ్విధిఁ దారసిల్లు                                                                 85   

పసిపాప తగఁ గడుపారఁ గ్రోలి  నిదురింప ఘన పయో  కలశమ్ము లవియ 
నిజకాంతుఁ డలవోక నిదురించి మఱి  సేదదీరంగఁ జిత్రంపు దిండు లవియ     
సకల జీవులు ధర జనియించి వర్ధిల్ల మూరి వెల్వడఁ బుణ్య భూమి యదియ
కుటిలతఁ బరకాంతఁ గోరెడు మోహంపుఁ గ్రూరాత్ముల నరక కూప మదియ 

యన్నము నడరి యుడికించు నగ్ని వోలె 
నవయవమ్ము లంటినఁ గాల్చు నగ్ని భంగి 
మంచి వారికిఁ జేయును మంచి నెపుడు 
చెడ్డ వారి కొసంగును జెడ్డ నెపుడు                                                                          84    

చేరి కొలువ సురలు శ్రీపతి పండితా
రాధ్యుల గృహవరుఁడు రాగ యుక్త
పద సుమ భరిత గళ బాల సుబ్రహ్మణ్య
ము పిక జిష్ణువు దివమునకు నేఁగె                                                                  83  

ఆ కావ్యార్థము లంద పోకడల లే వాడంబరమ్ముల్ మెయిన్ 
శ్రీకారమ్ముల యంద కాని సిరులన్ లేవెట్టి యాపేక్షలే 
యే కాంతా మణిఁ గోర నేరఁ డిలఁ దా నిక్కావ్య కాంతన్ వినా 
సాకారుం డగు విశ్వనాథకవి భాషాంభోధి కిద్ధాత్రినిన్                                                         82
  

పారావార పరీత భూవలయ దిగ్భా గాంతరంగ ప్రభా 
ద్వా రానేక వినోద కారక కృపా పారీణ! ప్రాణాలి దే
హారామస్థిత పూరు షోత్తమ! చ రాత్యం తాచ రానీక ర
క్షా! రాజీవ ముఖాక్షి యుగ్మ! స రమాకాంతా హరీ కావుమా                                            81

తేజ యూర్ధ్వ విరాజిత భ్రాజితుండు 
నభ యుచిత వస్త్ర ధారి త్రినయన శూలి 
మన యుదిత తను విలయుం డుమాధవుండు
రజ యుమాయుత కాయుండు నజుఁడు శివుఁడు                                                          80

ధర్మభూమి యిపుడు ధర్మ హీనం బయ్యెఁ గర్మభూమి యగు దుష్కర్మ భూమి
మను ధర్మశాస్త్రము మఱుఁ గయ్యెఁ బరనీతి వరమయ్యెఁ బర భాష కరము తీపి 
కలుషిత మ్మిట కూడు కలుషిత మ్మిట గాలి కలుషిత మ్మిట వృత్తి కలుష హృదులు 
నేతలు వక్తలు చేతల స్వార్థమ్ము పనులందు దయ్యమ పల్కుల శ్రుతి

లాభములె ముద్దు వర్తకులకు సతమ్ము 
వైద్య మయ్యె దేశమ్మున వర్తకమ్ము 
పనుల పూర్ణమ్మ ముఖ్యమ్ము ప్రజల కయిన 
భరత భూమి పవిత్రమ్మ పరమ పురుష                                                          79                                                     
శీతల కరుండు శశియే 
యాతత కరుణా రసాన్వి తాలోకనుఁడా  
వీతత్రపాస్యుఁ దన్నే  
రీతినిఁ గాన నగు నింక లీలాలోలా                                                                        78

ద్రష్టగ నిల్చితి సన్ని
శ్చేష్టిత గాత్రప్రకర వశీకృత చిత్తా
విష్టాక్షిద్వంద్వ సుపరి
పుష్టశ్వేతప్రభా ప్రబోధిత వేళన్                                                                            77

వర భక్తోత్కర సేవిత 
వరౌఘ సంప్రాప్త సిద్ధ భక్తశ్రేణీ 
వరదాయినీ హరిరమా 
వరలక్ష్మీ వందనములు వరసుర పూజ్యా                                                                76

క్షీరా బ్ధ్యుద్భవ కన్యా 
నారీ లోకాభిపూజ్య నలి నావాసా 
నారాయణ వక్షోద్భా
సా రామా లోక రత్న సామజ సేవ్యా                                                                    75

విఘ్నాధిపత్య ధుర్యా !
విఘ్నచ్ఛేదన నితాంత  విద్యా! భక్తో
పఘ్నా! భవ సంచిత పా
పఘ్నా! భగ్నైక దంత! భవకాయఘ్నా                                                                74

కరుణా! కడలీ! జనకా! 
వరదా! జననీ! సఖుండ! పరమా! యిహమా!
గురువా! యుసుఱా! గురువా!
గరిమా! చదువా! ధనమ్మ! కనుమా దయతో                                                   73

భాషా దరిద్రు లాంధ్రులు 
భాషాన్యం బాంగ్ల భాషఁ బలుకుదు రెలమిన్ 
భాషకు మధ్యన్ మధ్యన్ 
భాషా జ్ఞానంబు సూపఁ బండితు లైనన్                                                             72

కరిమూర్ధా! శివవక్త్రా! 
హరి వరయజ్ఙోపవీత! హత విఘ్నాలీ! 
వర మూషికేంద్ర వాహన! 
గిరిజా హస్తాబ్జ భూత! గేయస్తుత్యా!                                                                   71

ఫణివర శయనా! కాంతా
మణి కౌస్తుభ రత్న వక్ష! మాధవ! జన ర
క్షణ రత! శంఖారి గదా
గణ భాసిత! లోక సేవ్య! కైటభ దమనా!                                                             70 

వాణీవల్లభ! వాణీ 
వీణా నిస్వన వినోద! వేద చయ లస
త్పాణీ! లలాట రేఖా 
శ్రేణీ కరణప్రవీణ!  శ్రితమందారా!                                                                       69

ఫణిభూషణ! శివ! విష మే
క్షణ! గగనాంబర! మనో వికాసిత కాంతా 
మణి భాసిత వామాంగ! క
రుణా విలోకన! స శశి శిరో గత గంగా!                                                                68

ఇన వంశార్ణవ సోమా! 
జనకనృప సుతాత్మ తోష! జనక వచో వ
ర్ధన! లక్ష్మణ నిత్యార్చిత! 
ఘనాంగ! కోదండ రామ! కరుణా వనధీ!                                                               67

ఎవ్వని కంఠ మూను విష మెవ్వని నెత్తి వెలుంగు గంగయే 
యెవ్వని సవ్య దేహము వహించును గౌరిని వ్యాఘ్ర చర్మ ముం 
డెవ్వని మధ్యఁ గూలు జగ మెవ్వని మాయఁ దదీశుఁ గొల్తు నే 
నవ్వర జంబు వజ్జల కణాబ్జ దమాభ సు జాలవంతునిన్                                             66
[మూలములో: జంబూ వజ్జల బిందు వజ్జలజ వజ్జంబాల వజ్జాలవత్ = 
జంబూ వత్ జల బిందు వత్ జలజ వత్ జంబాల వత్ జాలవత్ : 
జంబు +వత్ +జల +కణ +అబ్జ + దమ +ఆభ + సు + జాలవంతునిన్ : 
నేరేడు పండు రసము వంటి జలపు కణముల తోగూడిన తామరలతో 
గూడిన పంకము బోలు మోసగాని  (ధూర్తుని =శివుని)]

శశిపైఁ గాలిడి కృత్రిమంపు గ్రహముల్ సంధించి యాకాశ వీ
ధి శతానేక సహస్ర హస్తి నిభ శక్తిన్ మీఱు నస్త్రమ్ములన్ 
వశ మందుంచి యదృశ్య జాలక జగద్వ్యాపారముల్ వెంచినన్ 
దశ మారెం ద్వర నయ్యె మానవ గుణధ్వంసమ్ము కీటార్థమై                                        65

అప్రమత్తులై రధికారు లనెడి వార్త 
వినఁగఁ గలుగు శంక మదిని వీరు సంత
తము ప్రమత్తులా యంచును దథ్యముగను 
ఘోరమే వార్త లందించు వారి భాష                                                                   64

అంతము గౌఁగిలింత లిఁక నా పులకింతలు వింత లెంతకున్
సంతు నెడంద నూనఁ గనఁ జాలము చెక్కిలి నొక్క దక్కునే
చెంత మఱింత దూరము వచింతురు వంత చెలంగ సుంతయే
వింతగఁ గీటక మ్మకట వేల్చెను నిర్దయ మానవత్వమున్                                           63

హంసగీతి గారి యపూర్వ చిత్రకళా ప్రావీణ్యమునకుఁ బరవశించ 
జాలువాఱిన నా పద్యము: 
అలి షండాభ విశేష నీల ఘన కే శాసన్న భూషా రుచిం
దిల కాపూర్ణ వికాస ఫాల తల సందీప్త శ్రవో భూషణన్
నలి నాభాక్షి లసత్కపోల యుగ సన్నాసిక్య బింబోష్ఠినిం
బులక ప్రేరణ ముగ్ధ మోహన ముఖాంభోజ ద్యుతిం జూడరే                                                        62

పద్యాశ్రుమందారమాల: 
వందారు వంది తామర
బృందార్చిత! వనజ నేత్ర! బృందావన హృ
ద్యేందుశిలా తల సంచా
రేందు వదన! వందనమ్ము లెలమిం గనవే                                                                             61

చావక యున్న నందురు విశాలము రోగ నిరోధ శక్తి నా
వే వడ నండ్రు చంపెనని భీకర కీటక మయ్యొ  వాని నా
వేవురు సిక్క కున్న నిఁక వెఱ్ఱులు పల్కుదు రప్రమత్తతం
దావక దుష్ట కార్య ఫలిత మ్మిది నా ననెఁ గీట కేంద్రుఁడే                                                             60

కారణమౌఁ గరోన కృమి కాలుని శాసనమైన ధారుణిన్
మారణ సంస్తరమ్మునకు మానవ లోక వినాశకారి వి
డ్డూరము కాదె కీటకము డుల్చుట యివ్విధి శస్త్ర శాస్త్ర మే
ధోరమణీయ పారగులఁ దూర్ణము మాయ నెఱుంగ శక్యమే                                                       59

చతుర్థీ విభక్తిలక్ష్యము: 
పుట్టుటకై వరాల కయి మూరుటకై మఱి మేటి కూటికై 
పెట్టుటకై పొలాల కయి వీడులకై శకటమ్ము లుంటకై 
కట్టెలకై సుఖాల కయి కానలకై పశుకాయ వృద్ధికై 
గిట్టుటకై విముక్తి కయి కేళులు  మోడ్చుమ చక్రధారికై                                               58

దండకము.
శ్రీవత్స వక్షో విరాడాది లక్ష్మీ! పదాంభోజ సందీప్త మందాకినీ! శార్ఙ్గ కౌమోదకీ చక్ర నిస్త్రింశ శంఖాది దివ్యాయు ధానీక హస్తాబ్జ గంభీర శుభ్రాభ్ర  మేఘాభ నీలాంగ నిశ్చేష్టి తాలోక లోకాలి  తప్తాభ్ర కోటీర కేయూర కర్ణాంక దివ్యప్రభా సోజ్జ్వలత్కౌస్తు భోపేత హారాలి మంజీర కాంచీ కనత్కంక ణాబంధ కౌశేయ పీతాంబ రానంద చిద్రూప! చిత్తమ్ము నందుంచి నింగొల్తు నిత్యమ్ము సద్భక్తిఁ గల్పంపు టంతమ్ము నందెల్ల లోకమ్ము లంభోధి మున్గంగ ధ్వాంతమ్ము నిండంగ నీకుక్షి లోనుండ విశ్వమ్ము సూక్ష్మంబుగా నుండి రక్తంపు వర్ణంపు నీ కాలి వ్రేలుండ నీ నోటిలో నిండి చిత్రమ్ముగా మఱ్ఱి పత్రమ్ముపైఁ గ్రీడ నీ వాడు చుండంగ నా లీల వర్ణింప శక్యమ్మె వేదమ్ము లింపార దుర్దాంత మత్స్యంబవై సోమకుం దోయ సంచారకుం జంపి రక్షించితే, భీమ శైలాభ కూర్మంబవై తాల్చితే మంథమున్ శైల రాజేంద్రమున్, దంష్ట్ర భీభత్స సుశ్వేత కోలంబవై త్రుంచి యంభోధిఁ గ్రూరున్ హిరణ్యాక్షు లోలాక్షు భూదేవిఁ గాపాడితే, సందె వేళన్ నృసింహుండవై యుగ్ర రూపమ్మునం జంపితే దైత్య నాథున్ హిరణ్యాశనున్ భగ్న నీచాశునిన్, వామ నాకారముం బూని  దైత్యేంద్రు వైరోచనున్  సమ్యగాలోచనుం  ద్రొక్కితే, భార్గ వామ్నాయ రాముండవై రాజలోకమ్ము గర్వాంధ తోత్తీర్ణ నాకమ్ము నిశ్శేషముం జేసితే, వీర కోదండ రాముండవై చంపితే రావణున్ లోక విద్రావణున్, రామ నాముండవై శౌరివై భూమి భారమ్ము నస్తోక భారమ్ము విచ్ఛేదముం జేసితే, బుద్ధ దేవుండవై మాన వోద్ధారముం దుల్య మందారముం జేసితే, నీవ కృష్ణుండు విష్ణుండవే కల్కి నా నింక రా నుంటివే ధర్మ రక్షార్థమై నాథ! కృష్ణుండు నా మీఱి గోపార్భ సంఘాత విధ్వంస దుష్పూతనా స్తన్యముం గ్రోలి ప్రాణమ్ములం దీసి, పెన్బండినిం దన్ని,  యాకాశ వీధిం దృణావర్తునిం గూల్చి, మన్నేల భక్షించితే యన్న నీ నోటనుం జూపితే మాతకున్ విశ్వ సందోహమున్, మద్దెలం గూల్చితే, వత్స రూపంపు ఘోరాసురుం జంపితే, వ్యాజ వేషున్ బకోటాసురుం జంపితే, భీక రాఘాసురుం జంపితే పద్మసంజాతు దర్పమ్మునుం ద్రుంచితే, కాళియుం డుండఁ గాళింది మర్దించితే, ఘోర దావాగ్ని వే మ్రింగితే, లీల గోవర్ధనం బెత్తి దేవేంద్రు గర్వమ్ము వో గొట్టితే, నందు శ్రద్ధావతిం జేరి తోడ్తెచ్చితే, వల్లవీ కాంతలన్ రాస లీలాదులం దన్పితే, శంఖచూ డాఖ్యునిం ద్రుంచితే, సౌర భారిష్టునిం జంపితే, కేశి నామాశ్వకవ్యోమ దైత్యోగ్రులం జంపితే, చాకలిం జంపితే, కుంజరక్రూరు భంజించితే, మల్ల చాణూరునిం జంపితే, మామ కంసున్ ధరా బాల హింసున్ దురాత్మున్ సులీలం దెగంజూచితే తల్లికిం దండ్రికిం గార మాన్పించి పూజించితే తాతకుం బట్టముం గట్టితే కుబ్జ కా వక్రముం బాపి పుత్రుం బ్రసాదించితే, రుక్మిణీ దేవితో నష్ట సద్భార్యలం బొందితే యింక నష్టద్వయమ్ముల్ సహస్రమ్ములున్ భార్యలం బొందితే యేక కాలమ్ము నందుం బ్రకాశించితే వారి సౌధమ్ము లందుండి నిత్యారియౌ దామఘోషుం దదాత్మీయుఁ డౌ  దంత వక్త్రాఖ్యునిం జంపి జన్మత్రయాంతమ్ము వారిద్దఱిం జక్క వైకుంఠ లోకమ్ము నన్నిల్పితే శుద్ధ గీతా పరిజ్ఞాన మందించి రక్షించితే పార్థు నీమాయ నే మందు విశ్వేశ! చండప్రచం డాంశు సాహస్ర భానుండు పేయూష సాదృశ్య శీతాంశు చంద్రుండు నీ నేత్ర చిత్తమ్ములై యుండ, మున్నీరు మామయ్యె, భూమాత యర్ధాంగి, కంజుండు పుత్రుండు, నీశుం డభేదుండు, నీవుందు వన్నింట నిక్షిప్తమై వింత, నీ లేని లేశంబు శూన్యంబ కాంచంగ, క్షీరాబ్ధిఁ దాఁ బుట్టి శ్రీలక్ష్మి కాకుత్స్థుఁ డీ వైన వైదేహి తానయ్యె, శ్రీకృష్ణుఁ డీ వైన వైదర్భి తానయ్యె, లోకాల నేలంగ నిత్యమ్ము నీవుండఁ  జేదోడు వాదోడు తానయ్యె నెన్నండు, నాతల్లితోఁ గూడి దేవాది దేవా చిదానంద సమ్మోహ నోత్సేధ! పద్మాక్ష! మూర్తిత్ర యైకైక భావమ్ము నీయంద వర్ధిల్ల నిన్నెంచ లేరన్న శేషాహి వాగీశ గౌరీశ దేవేంద్రు లింతైన నే నెంత నీపాద దాసుండ నీ దాస దాసుండ నా మోహముం ద్రుంచి, నీభక్తినిం బెంచి, నన్నేలు నిత్యమ్ము, నిం దక్క నేనేర నిం కెవ్వరిన్నాదు చిత్తమ్మునన్ దేవ! నామాంత రోద్భాస నామాలి భూలోక వాసౌఘ సిద్ధౌఘ సాధ్యౌఘ యక్షోర గాశ్వాంగ నీడోద్భ వానీక విద్యాధ రాదిత్య గంధర్వ మున్యోఘ దేవాది సంపూజి తాంఘ్రిద్వయా! దైత్య సందోహ విధ్వంసకా! దుష్ట సంహారకా! శిష్ట రక్షైక దీక్షాగ్ర గణ్యా! దయాసింధు! సాక్షాద్విరాడ్రూప! వైకుంఠ సద్వాస! లక్ష్మీశ! నిన్నెంచి నే మ్రొక్కెదన్ మ్రొక్కెదన్ మ్రొక్కెదన్.                    57

తుల్యము లేదు నీ దయకుఁ దోయజ లోచన మెప్పువొంద సా
కల్యము భక్తి నుంచి మదిఁ గైగవ మోడ్చఁ దొలంగుఁ జిత్త వై
కల్యము నామ కీర్తనము గారవ మొప్పఁగఁ జేసి నంతఁ గై
వల్యము నిత్తు వీ విల  కృపారస సాగర! శ్రీధరా! నతుల్                                         56

సౌఖ్యానంద విధాయ కాఘ ఘన వృక్షచ్ఛేద నిర్ఘాతమా! 
ప్రఖ్యా తాసుర దైత్య దానవ గణ ధ్వంసార్థ సంజాతకా!
యాఖ్యానేక సుహృజ్జనావన కృ పాయత్తారవిం దాయ తా
క్షా! ఖ్యాతిస్ఫుట కార్య కాయ సువిరాట్కాయా! ముకుందా! నతుల్                           55

పుట్టితి కార యందు నిజ మూర్తి ధరించి వచించి కార్యమున్ 
మెట్టితి మంద గుప్తముగ మీఱి చెలంగితి బాల్య లీలలన్ 
గుట్టుగఁ జంపి తాసురుల గోత్రము నెత్తితి ప్రోచి తందఱిన్ 
గట్టి ధరా భర మ్మణఁచి కాచితి ధర్మము కృష్ణ! మన్నతుల్                                     54

లీలా లీలను ద్రాగితే విషము శూలీ కాలకంఠేశ్వరా
కాలక్లేశము మాన్పితే శశికి భర్గా చంద్రమౌళీశ్వరా 
బాలా రత్నము నుంచితే తనువునన్ వామార్ధ నారీశ్వరా
ఫాలాక్షా! ప్రమథాధిపా! పురహరా! పాలించు నందీశ్వరా!                                       53

భూతప్రేత పిశాచ సేవక గణాపూర్ణ ప్రమోదాత్ముఁ గా 
లాతీతాభవ నిత్య నర్తన కళాహ్లాదాంతరంగున్ హరున్ 
సీతా నాథ కరాబ్జ పూజిత పద శ్రేష్ఠ ద్వయున్ దుఃఖిత
వ్రాత త్రాతను రక్షి తార్త గత మార్కండేయు నేఁ గొల్చెదన్                                      52

విజ్ఞానాది విశేష శాస్త్ర చయ గంభీ రాగ మాతీత స
త్యజ్ఞానాకర! విస్తృ తాఖిల జగన్న్యస్తోదరా! సుస్థిరా!
ప్రజ్ఞాపాటవ సంయ మీంద్ర గణ హృద్భా వానవాప్తా! వరా 
త్మజ్ఞా నావగ తాభయప్రద పరా! దామోదరా! మన్నతుల్                                      51

మహి షాదిత్య విరోధి లోక దమనున్ మర్దించితే భూ నభో 
విహి తోద్ధండ నిశా చరాలి నిజ హృద్భేదమ్ముగా రౌద్రతన్
సహకంఠీరవ శూల హస్త జన రక్షాదక్ష! ముక్తిప్రదా!
యిహసౌఖ్యావహ నిత్యపూజ్య! వరదాయీ!శాంభవీ! మన్నతుల్                               50

సకల చరాచ రాసు గణ సంభవ వర్ధక నాశ కారకా! 
సకల పదార్థ రాజ దణు సంచయ శుద్ధ హృదంతరాళ వా
సక! కరుణాంతరంగ! వికసన్నవ పద్మదళాయతాక్ష! శ్రీ 
శుక ముఖ మౌని పూజిత వచోరుచి సన్నుత మాధవా! నతుల్                              49

దుర్మద దైత్య భంజక చతుర్దశ లోక మహా ధురంధరా! 
కర్మ ఫలాశ సంత్యజిత కర్మ నరావలి ముక్తి దాయకా! 
ధర్మ నిరంత రావన సదా ఘన కార్య ధురంధరా! హరీ! 
నిర్మల వర్ష కాల ఘన నీల శరీర విరాజి! మన్నతుల్                                           48

ప్రళ యాభీల సుఘోర మేఘ మరు దావర్తాత్త సాంద్ర ప్రభా
జల ధారా వటపత్ర తల్ప సుఖ వాసశ్రాంత పాదాంగుళీ 
విలసద్వక్త్ర విలాస హాస వదనా విశ్వోదరా శ్రీకరా 
జ్వల దంభోజదళేక్షణా నుత కృపా పారీణ దేవా నతుల్                                          47

క్షీరాబ్ధ్యాత్మజ నుంచితే యురమునన్ శ్రీకంఠు నర్చించితే 
పారావారము దాటి చంపితి కదా పౌలస్త్యు నుగ్రాజిలోఁ 
గారాగారము నందుఁ బుట్టితి కదా కంసాధముం జంపఁగా 
నే రీతిం దరమౌ నినుం బొగడ విశ్వేశా ముకుందా నతుల్                                      46

నరమౌనీంద్రుఁడు వొందెనే కృతమునన్ నారాయణా నిన్నెదన్
మరు దాత్మోద్భవుఁ డందెఁ ద్రేతఁ దమి రామా నీదు సాన్నిధ్యమున్ 
నరుఁడే ద్వాపర మందుఁ బొందెఁ గద కృష్ణా నీదు బాంధవ్యముం 
బరమాత్మా తవ లీల లెన్నఁ దరమే ప్రార్థింతు నిన్నాత్మలో                                      45

సత్యం బియ్యది హంసరాజు నెఱపున్ సారథ్యమే యబ్జజా
నిత్యంబుండు విహంగ రాజవరమే నీ వాహనంబై హరీ
ప్రత్యేకమ్ముగ నయ్యె వాహనము గో రాట్చంద్రమే శంకరా 
భృత్యశ్రేష్ఠులు నన్ను నప్పగిది వే వీక్షింప నే వేఁడెదన్                                           44

అరవిందాక్ష! రమా సతీ లలిత హస్తాంభోజ సంపూజితా! 
కురు సంగ్రామ మిష క్షమా భర ల యాఘో షాపదే శాచ్యుతా!  
పరమా ర్థేద్ధ సుధా రసానుభవ  సంప్రావీణ్య జిజ్ఞాస స
త్వర మోక్షప్రద! ఫల్గుణార్థ వర గీతాజ్ఞాన దాతా! నతుల్                                        43

వర కాలార్దిత పూతనా కుజననీ ప్రాణాపహార క్రియా 
స్మర బాణార్దిత గోపికా నివహ సన్మానాపహార క్రియా 
యరవిందాసన చిత్త దూషిత నిజాహంకార నాశ క్రియా 
మురళీ నాద వినోద హర్ష మయ  సంపూర్ణ వ్రజా మన్నతుల్                                42

అఘ నిచ యాటవీ వర దవానల! దాశరథీ! దయానిధీ!
రఘుకుల వార్ధి పూర్ణ సిత రాజిత రాజ నిభా! ఘనప్రభా! 
మఘవ సమర్పిత ధ్వజి స మాతలి సంస్థిత సుప్రశస్తకా! 
విఘటిత దానవేంద్ర రథ! వీరవరేణ్య! నరోత్తమా! నతుల్                                        41

త్రిపదాక్రాంత సరోజజాత వరగౌరీనాథ నిత్యాలయా
నుప మావాస సుమంగళప్రద సుపర్వో ఘార్చి తానంద స
త్యపద వ్యాప్త నితాంత విశ్వ మయ భూతాత్మం ద్రిమూర్త్యాత్మి కా 
ది పరాశక్తి మృగేంద్ర వాహనను  సంతృప్తాత్మ నే గొల్చెదన్                                   40

పద్మ సుఖాస నాంబురుహ భావ విధాతృ సరస్వతీ ధవుం
బద్మ దళాక్ష తామరస ఫాండ జగత్త్రయ నిత్య రక్షకుం
బద్మభ వాంగ కోద్భవ శివప్రద చండ దశైక రుద్రులం 
బద్మ సు వర్ణ నామ ముని వంద్య సురేశులఁ గొల్తు ముక్తికై                                  39

షడ్జాదిస్వర యోగ వేణు నినద స్తంభీ కృతోర్వీ తల
త్విడ్జీవావలి రక్షణైక రత సందీప్తాంతరంగా! సరో
రుడ్జాతాత్మ విరాజమాన పురుషా! రుద్రార్చ్య  దేవా! ధరా 
రాడ్జాలాసు వినాశ కార్య భర భృద్రామా! రమేశా! నతుల్                                     38

కైకొని ముద్ద నే మఱతు కంజదళాక్షుఁడ మ్రింగ దానినే 
చేకొని పూలు నే మఱతుఁ జిన్మయ యుంచఁగ నీ పదమ్ములన్ 
వీఁక పఠించ నే మఱతు వెన్నుఁడ నీదు సహస్ర నామముల్ 
వాకొని యేడ్వ నే మఱతు పన్నగ తల్పుఁడ నిన్ను దల్చుచున్                              37

శార్వరి నామ సంవత్సరపు టుగాది:  
సర్వ సుఖప్రదమ్ము నయి శాంతిదమై సుజ నౌఘ సమ్మ దా
ఖర్వ వినోద సంభరిత కార్య కలాప విరాజితమ్మునై 
పూర్వ సమోధ్భ వాధమ విమోహ వికార వినాశకారియై 
శార్వరి యుర్విఁ బర్వములఁ జారుతరమ్ముగ నిచ్చుఁ గావుతన్                               36

క్రిమివర కరోన కుక్షి
క్రిమి కలుష కరానుగత వికీర్ణ వ్యతిరే
క మహోజ్వల బల సంప
న్న మయి విరాజిల్లు గాక నవ శార్వరియే                                                       35
[కర +ఊన + కుక్షిక్రిమి  = కరోనకుక్షిక్రిమి : చేతులు తక్కువగాఁ బొట్ట గలిగిన క్రిమి]   

మాన వేతర ప్రాణమ్ము గానిపించ 
నీయ దీల్గ నెందు వికారి యెసక మెసఁగి 
దాని గుణ మెంచి శార్వరి మానవులకు 
మేలు సేయుఁ గాక దయ నిక్కాల మందు                                                       34

ఛన్న సధగద్ధగద్జ్వల 
సన్నిట లాంబక! ధిమిధిమి చయ నిర్ఘోషాం 
చన్నటనాంఘ్రిద్వయ! విల

సన్నాగాభరణ కంఠ! సర్వజ్ఞ! నతుల్                                                             33

పాయక నిల్వ నారములఁ బద్మదళాక్ష చెలంగి తీవు నా
రాయణ పుణ్య నామమున రాజిలఁ జక్రము చక్రి వైతివే
యాయత విశ్వ నామక మహాండము నిండిన విష్ణు తావకా
మేయ సహస్ర నామముల మేదిని మాధవ నిన్నె కొల్చెదన్                                    32         

అసమాక్షి జ్వలిత స్వనంగ సుర కార్యా ర్థాగ తాంగోద్భవా! 
యస మాశీ విష కాలకూట గళ విన్యస్త ప్రజా రక్షకా! 
లస దంభోజ కళా జటా!  సుర నదీ రాజచ్ఛిరో రత్నమా!  
విసృ తోరస్క! ఫణాకరాంక! ప్రణతుల్ విశ్వాత్మ! గౌరీధవా!                                      31

కాచితి వొక్క యేనుఁగును గ్రక్కునఁ జంపితి వన్య హస్తినిం
దాఁచితి వొక్క సర్పమును దల్పము సేసితి వన్య భోగినిం 
బ్రోచితి వొక్క మానినిని మూరి వధించితి వన్య భామనుం 
గాచిన నేఁచినం బుడమిఁ గైటభ మర్దన నిన్నె కొల్చెదన్                                        30

వాణీ హస్త యుగాంగుళీ ముకుళ సద్వ్యాపార మూ ర్ధాబ్జజుం 
ద్రాణైకైక గుణాస్ప దాంచిత ఘనోరః ప్రాప్త లక్ష్మీ సతిం
బ్రాణాధిక్య సతీ విరాజిత లసద్వామాంగ విభ్రాజితుం 
బ్రాణాయామ ముఖ క్రియా రతుఁడనై ప్రార్థింతు నా మువ్వురన్                               29

సకలప్రాణి లలాట లేఖన కళా సాకల్య నిష్ణాతునిన్ 
సకలప్రాణి సమంచి తావన కళా సాకల్య నిష్ణాతునిన్ 
సకలప్రాణి సమంచిత క్షయ కళా సాకల్య నిష్ణాతునిన్ 
సకలాదిత్య మునీంద్ర సన్నుత మహచ్ఛక్తి త్రయిం గొల్చెదన్                                  28

నలుమోమయ్య సదా చతుర్దశ జగన్మౌళి స్థిరావాసునిన్
బలి బంధించిన వాని లచ్చి మగనిన్ వైకుంఠ రోచిష్ణునిం 
గలఁతల్ దీర్చు ధరాధ రాత్మజ పతిం గైలాస సంవాసినిన్ 
బలు లా మువ్వుర దివ్య మూర్తులఁ దమిం బ్రార్థింతు మోక్షార్థినై                              27

దైత్యశ్రేణి నరాశ్వ యక్షగణ గంధర్వాహి సన్మాన వా
దిత్యారాధిత పాద పద్మ యుగ సంతృప్తాంతరంగా! శివా! 
నిత్యోద్దీపిత వాద్య నర్తన మనో నిష్ఠైక హృష్టా! భవా! 
భృత్యవ్రాత మహా బలప్రమథ సంప్రీతాత్మ రుద్రా! నతుల్                                       26

భూగోళం బిది మానవైక కుల సంభోగ్యంబుగాఁ జేసెనే 
యాగీర్వాణుఁడు కీటక క్రిమి సతిర్యగ్యోని పక్ష్యాది జీ
వాగారం బగు నాఁ దలంచి మది నల్పాయుష్యుఁ డణ్వాయుధ
శ్రీ గర్వాంధుల నెల్ల నొక్క త్రుటిఁ  దాఁ జేసెన్ భయభ్రాంతులన్                                 25

కైలాసాగమ వాస వామ సు తటీ గాత్రార్ధ భాగప్రభా 
లీలావాస విలాస హాస! కర వల్లీ శూల సంధాయినీ! 
కాలీ నామ విశేష సంచరిత భక్తాభక్త దైత్యాలి దృ
గ్బాలేందు ప్రళయాంత కాభ  వదనా! పాలించు కాత్యాయనీ!                                  24

పాథోధ్యుద్భవ వాస వానుజ కరాబ్జగ్రాహిణీ! పావ నా
నాథత్రాణ సతీ! సరోజ దళ విన్యస్తేభ హస్త స్రవ
త్పాథస్సిక్త నవీన పద్మ విలసద్ధస్తాబ్జ సమ్మోదినీ!
గాథా గాన మనో వికాస ధనదా!  కారుణ్య రాశీ! నతుల్                                         23

విశ్వసృడంగ సంజనిత విశ్వ జనార్చిత సుందరీ మణిన్ 
శశ్వ దజాత్మ సంస్థిత విశాల చలన్నయ నాంబు జాన నా
నశ్వర వల్లకీ మధుర నాద వినోద ముదాత్మ నాథనున్ 
శాశ్వత శుద్ధ విద్య నిడ శారద వేఁడెద రక్తి భక్తిమై                                                22

విద్యుత్సన్నిభ కాంతి పుంజ విలసద్వీక్షా దయా నిర్ఝర
ప్రోద్యద్వైభవ భక్త సంచయ! మహాభోగాలి శయ్యాలయా!
యుద్యద్బాహు సభీష ణాయుధ జితాత్యుగ్రారి సంఘాత! సం
వేద్యామ్నాయ చయాంతరంగ! త్రిజగద్విక్రాంత! దేవా! నతుల్                                  21 
   
కల్పాంతాంబుధి కుక్షి సంచరిత మార్కండేయ మౌనీశ్వరా
నల్పానంద విధాయకా! వట దళ న్యస్తాంగ యోగీశ్వరా!
తల్పీభూత వటచ్ఛదా! పరమ శాంతస్వాంత లక్ష్మీధవా!
యల్పజ్ఞాన విమోహ నిర్దళన! లోకైకేశ్వరా! కావుమా                                                       20

హృచ్ఛాంత్యర్థము దుఃఖ నాశ రతి రోషేర్ష్యాది దుశ్చింతనా
విచ్ఛిన్నార్థము భక్తిఁ గొల్తు వరదా!  విశ్వేశ! దైత్యాలయ
ప్రచ్ఛన్నస్థిత!  దాన వాన్వయవర ప్రహ్లాద సంపూజితా!
తుచ్ఛస్వాంత హిరణ్య భుక్తి నఖ సద్యో జిన్నృకంఠీరవా!                                                    19

సప్త నగాంత సానుతల సంస్థిత మందిర సుందరాకృతిం
దప్త సువర్ణ హార సిత దామ విభూషణ రాజి రాజితుం
బ్రాప్త సుఘోర పాప చయ భంజకు భక్త జనావ నైక సం
క్షిప్త  మనో వికాసు నత శీర్షతఁ గొల్తును వేంకటేశునిన్                                                      18

యుక్తాయుక్త వివేక శూన్య మృగ వంశోద్ధార నక్రద్విపుల్
ముక్తిం గాంచిరి మాన వార్భకులు సంపూర్ణంపు మోహాంధు లా
సక్తిం గోర ధనాది వైభవములం జక్రాయుధా యిత్తువే
ముక్తిం గోరిన వారి కిత్తువు కదా ముక్తిన్ మురారీ నతుల్                                                17

రక్షిత దీనశిష్టజన రాగ వివర్జిత భక్తకోటి సం
శిక్షిత దుష్ట భావయుత చిత్త విలక్షణ దైత్య కోటి ని
ష్పక్ష మనో విరాజిత కృపానిధి శార్ఙ్గ గదారి శంఖ స
ల్లక్షిత రమ్య రూప కమలాధవ విక్రమ నీకు మ్రొక్కెదన్                                                   16

కరి దైత్యార్భక రక్షణార్థ సుమహా కారుణ్య దృగ్జాల భా
సుర దైత్యద్వయ కుంభకర్ణ వర రక్షోనాథ చైద్యావనీ
వర దైత్యాంశక దంతవక్త్ర ఝష దుర్వారాది ముక్తిప్రదా
హరి దామోదర పద్మనాభ యరవిందాక్షా ముకుందా నతుల్                                            15

రమ్య తరమ్ము నెమ్మిని సరస్వతి సద్దయ విద్య లబ్బఁగా
గమ్యము సేరి మారుతి సుఖమ్ముగ జానకి జాడఁ గాంచి తా
సౌమ్య వచో విభూతిని విచారము వాపి దహించి లంక ని
స్సామ్యము రాముఁ జేరిన లసత్కథ వ్రాసితి రామభక్తినిన్                                               14

మీనశ్వేతవరాహ రూప శివ భూమిత్రాతృ కూర్మప్రభా
నానా వస్తు సుధా రమా సుసృజనా నైపుణ్య  భాస్వన్నృసిం
హానింద్యాకృతి వామనప్రవర  రామాఖ్యావనీశఘ్న రా
మానంతాసుర హంతృ కృష్ణ నృప బుద్ధావార్య  కల్కీ నతుల్                                            13

వ్రత నిష్ఠార్చిత మానవాకలన దేవవ్రాత మున్యోఘ స
న్నుత హర్షోల్లసి తాంతరంగ గిరి ధానుష్కార్ధ దేహస్థితన్
విత తానుగ్రహ దివ్య వీక్షణ సుధా విస్తారఁ గాత్యాయనిన్
శ్రిత మందారను మంగళప్రద వరశ్రీగౌరి నేఁ గొల్చెదన్                                                    12

శ్రీవాణీ గిరిజా ర మార్చిత ధవ శ్రేష్ఠ క్షితి త్రాణ దీ
క్షా విశ్వేశుల సృష్టి నాశన సు రక్షా కార్య సంసక్తులం
గైవా రార్చిత సత్యలోక హిమ వత్కైలాస వైకుంఠ ధా
మావాస త్రిమహాత్ములం గొలుతు భక్త్యావేశ చిత్తమ్మునన్                                             11

పుడమి పడతి యెడ నిడి హరిఁ బరముని మురిసి కడు కురియు విరులు సిరులు
కడలి పొగడి సిరిపడతి నిడి హరి కరణముగ జనులకు మణుల నొసఁగు
గిరిపతి హరునకు గిరిజ నిడి మురిసి పసిడి గనులఁ గడు నొసఁగుఁ బ్రజకు
విహగ విభుఁడు హరికి హయ మగు నలరి వహన మగు వృషభపతి హరునకు

విష శయనుఁడు హరికి విషగళ హరునకుఁ
బడుక తొడవు లగును బడగ పురువు
హరి హరులకుఁ గనవు మెరమెర యవి మఱి
నరులకుఁ దగు నెటుల నరయ బెరుకు                                                                             10

నర నారాయణ నామ కీర్తనము పుణ్యప్రాప కాలాప మా
నర కృష్ణద్వయ రూప వీక్షణము సంత్రాసాలి విధ్వంసమే
యరి భీభత్సుల భార తాహవ మహాయజ్ఞార్థ సంభూతులన్
నిరతం బేను స్మరింతు భక్తి మదిఁ దన్నీరేజ పత్రాక్షులన్                                                       9

పోదువె మూట గట్టుకొని పుత్తడి యెక్కడి దయ్య నీదు సం
పాదన మింక నాది యను వాదము లేలయ లేశమైననున్
లేదిల నెంచ నీది   పితృరేతము మాతృ నిజాండ యుక్తమై
నీదు శరీర మేర్పడెను నీతను వంతయు వారి సొత్తగున్                                                       8

ఆద్యంబౌ నర సద్గుణౌఘముల నత్యావశ్యకంబే చుమీ
చోద్యం బందఁగ నేల నిక్క మది సంస్తుత్యంపు సంస్కార మే
వాద్యవ్రాతము కర్ణ సంకట శిరో భారంబ నిస్తాళమై
విద్యాధిక్యత నిష్ఫలంబ యగు నుర్విన్ వీడ సంస్కార మే                                                     7

ఆర్య సాంప్రదాయం బనివార్య  ముర్వి
నగ్ని సాక్షిగా నొనరించ భగ్న మగునె
భారతీయ వైవాహిక బంధ మాయు
వుండు వఱకును జాగుచు నుండు వఱలి                                                                          6

సాహిం సోద్యమ తర్జితాంగ్ల జన సర్వాధీనతా భావ సం
దోహభ్రాజిత పుణ్య పూరుషుఁడు సద్యో వైభ వోద్యుక్తుఁడున్
బాహాబాహవి వైర భీత సుమహాజ్వాలావృతస్వాంత సం
దేహవ్రాత సుచోది తాపకృత నిర్దేశ్యుండు మా  గాంధియే                                                     5


విద్యల కెల్ల దేవతవు వేద గిరార్చిత మాతృ మూర్తివే
హృద్య ఫలాశ నాక్ష కుసు మేప్సిత పుస్తక యుక్త పాణివే
చోద్య విపంచికా స్వర యశో భరి తాఖిల లోక వేదసం
వేద్య సురాళి పూజిత వివిక్త విరించి మనో విలాసినీ                                                           4

రుక్మిణియు జాంబవతియు సరోరుహాక్షి
సత్యభామ కాళింది యష్ట మన మిత్ర
వింద నాగ్నజితియు భద్ర సుందరాంగి
లక్షణలు కృష్ణ సతు లైరి లక్షణముగ                                                                               3

చెట్టు కూడ మున్ను వట్టి మొక్కయె చుమ్ము
మొక్క కూడ విత్తె యొక్క నాఁడు
చుక్క లన్ని కూడ నిక్కి కడలి యౌను
బండితుండు మున్ను పామరుండె.                                                               2               


భోగి మ్రోఁగు  నరోగమ్ము వేగ వీఁగి
భోగి రేఁగ మంటలు మూఁగి కాఁగి వేఁగ
భోగి రాఁగ సభోగమ్ము తూఁగు లాగు
భోగి భోగము లాఁగవు బాగు బాగు                                                                 1                   


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి