ఉరువుగ నిజ చిత్తమ్ము ల
లరంగ దృఢభక్తి నుంచి రాజ్యం బెల్లం
బరఁగ ధనధాన్యముల భూ
వర లక్ష్మీ వ్రతముఁ జేయవలె పురుషు లిలన్ 62
పురుషశ్రేష్ఠులు దేవ తార్చనలకుం బుణ్యాత్ములుం జాలరే
పరమోదారులు పూర్వ కాలమున నంబా పూజలం జేయరే
వరమాలన్ ధరియించి శుద్ధ హృదులై భార్యాద్వితీయస్థిరుల్
వరలక్ష్మీ వ్రత మాచరింపవలె సద్భక్తిన్ దగం బూరుషుల్ 61
కమనీ యోరగ భూషణ
సుమనస్కుఁడు నిత్య పరమ శుచుఁడౌ శివుఁ డా
యుమకుం బెనిమిటి, కోరఁగఁ
గమలాక్షుఁడు, విషముఁ గ్రోలెఁ గద శుభకరుఁడై 60
అమృ తాకాంక్షులు ద్రచ్చ నంబుధిని రా హాలాహలం బక్కటా
తము రక్షింప సురాలి వేఁడుకొనఁగం దాఁ బొందఁ, గీర్తించఁగాఁ
బ్రమదస్వాంతులు కాలకంఠుఁ డని, సుప్రాశస్త్యముం ద్రిజ్వల
త్కమలాక్షుండు విషమ్ముఁ గ్రోలెనఁట లోక క్షేమముం గోరుచున్ 59
[త్రిజ్వలత్కమలాక్షుండు = మూడు ప్రకాశించు కమలముల వంటి
కన్నులు గలవాఁడు, శివుండు]
మతి వీ వాస్తికుఁడ వెన్న మానవ మఱి నీ
క తగునె పలుకఁగ మాటలు
మతి లేనట్టి, పవనజుని మానక గొల్తున్ 58
సతి వైదేహికి రామచంద్రునకు సత్సాంగత్య సంప్రాప్తికై
శతవద్యోజన వార్ధి దాటిన మహోత్సాహాత్మునిన్ సంతత
మ్మతి నిష్ఠాస్థిత చిత్త తత్పరుఁడనై యాగార్హతా దాత్రి శ్రీ
మతి లేనట్టి మరుత్సుతుం గొలిచెదన్ మాంగల్యముం గోరుచున్ 57
ముందు గలవు పండుగ లింక నిందువదన
చాలు గద వస్త్ర మీయ నేఁ జాల నీకుఁ
జెప్పఁ బబ్బము చిన్నది గొప్ప లేల
చెలికి ఱవిక మాత్రము చాలు చీర యేల 56
మానముఁ బ్రాణ మీవ యిల మానిని చంచల పద్మలోచనా
కానఁగ లేను నీ యొడలు కందిన నించుక గోరు లున్న యా
వైనముఁ గాంచఁ దెల్ల మగు భద్రముగా ధరియించుమా సతీ
మానధనాఢ్యకున్ ఱవిక మాత్రము చాలును జీర యేటికిన్ 55
[జీర = గీఱ]
నే గతి నైనను హతవిధి యిది తగులు నహో
యా గిది ధనమా! ధాన్యమ!
రోగులు సంపన్నులే? కరోనా వలనన్ 54
ఏ గతి లంచ మిచ్చిన నహీన విభుత్వ భయ మ్మొసంగినం
దా గతి మార్చ నెంచదు సత మ్మిసు మంతయు భేద ముంచదే
యోగము కల్గి నంతటనె యుక్త కుకీటము పేద లైననున్
రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్ 53
[ రోగులె భాగ్యవంతులు = భాగ్యవంతులు రోగులె]
నెంచి సతము వీత నిజ దురీప్సిత తతికిం
బంచత నొంద విసర్జిత
వంచకులకు మాధవుఁ డిడు వరమోక్షమ్మున్ 52
ఎంచ మనమ్ము నందుఁ బగ నెన్నఁడుఁ గాంచన భుక్తి నేత్రులన్
మించి యెదిర్చ ద్వేషమున మేదిని రావణ కుంభకర్ణులం
బంచకుఁ జేర్చితే నృ గణపా శిశుపాలక దంతవక్త్రులన్
వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్ 51
దూరం బౌదురు నిక్కము
మూరి వచించినఁ దెగించి ముఖ్య సఖులిలన్
ఘోరమ్ముయినను మఱి నీ
కారము గల మాట మెప్పు గల దెల్లపుడున్ 50
[నీకు + ఆరము = నీ కారము; ఆరము = తియ్యమామిడి]
గారము మించ దుఃఖములు కల్గుట నిక్కము మించకున్న స
త్కారము నొవ్వ రే జనులు తథ్యము సుమ్మిది మాటలం దహం
కారము లేశమంతయినఁ గల్గినఁ దిట్టరె హర్షవచ్చమ
త్కారముఁ గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్ 49
శబ్దరత్నాకరపుఁ బరిచయము మెండు
వ్యాకరణమును బట్టె నౌపాసనమ్ము
తెనుఁగు పద్య రచన యందు దిట్ట యొజ్జ
సానితోఁ జేయవలె నవధానములను 48
కవి విద్వన్నుత సారవన్నయ సువిఖ్యాతాత్త గూఢార్థ భ
వ్య వివేకద్యుతి యుక్త భావ జల సద్భంగస్థ సద్యస్స్ఫుట
చ్ఛవిమచ్ఛబ్ద వికాస నిత్య నిజ రాజత్స్వాంత సన్నిష్ఠకై
యవధానం బొనరింపఁగా వలెను వే శ్యాసంగతిం బొందుచున్ 47
[వేశ్యా +అసంగతి = వే శ్యాసంగతి]
కర్ణింపుము తమిఁ బురాణ గాథలను బృహ
త్కర్ణా యౌను నిజంబే
కర్ణుఁడు పినతండ్రి గాఁడె కౌంతేయులకున్ 46
కర్ణశ్రేయ వచో యుధిష్ఠిరుఁడు దా కాలాత్మజుండే కదా
కర్ణాఖ్యుండు సుతుండు సూర్యునకు దాఁ గాఁ, బుత్రుఁడే దండ నో
త్తీర్ణుండైన యముండు సూర్యునకుఁ గుంతీదేవి కింపారఁగాఁ,
గర్ణుండే పినతండ్రి పాండవులకున్, గాంగేయుఁడే మామయౌ 45
సంతసించఁ గురియుఁ గాంత కాంతుని పైన
శారదేందు శుద్ధ చంద్రికలను
గాంత భర్త నంతఁ గనలఁ గన్నుల నిప్పు
పూలు సెగలఁ బొగలఁ బుక్కిళించె 44
ఆ వనితా శశీద్ధ ముఖ మంతట మారెను జూచు చుండగం
బావన కాళికాస్య నిభ భాసిత బింబము నాఁగ నత్తరిన్
వావిరి బొగ్గు లుంచి పొయి వంటలు సేయఁగ నిప్పు నూఁదగం
బూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించెరా 43
[కాళిక = కాళికా దేవి , బొగ్గు]
భాగ మెల్ల వీడి పగను వారి
కి నిఁకఁ బంచి దేనికిఁ బనికి రాని పం
తమ్ముఁ జంపి సద్యశమ్ముఁ గొనుము 42
తమ్ముండైనను నన్నయైనను మహా దండంబు సాగించి ప్రాం
తమ్మంతం బగలం బ్రతిక్రియల విధ్వంసంబు గా నీక శాం
తమ్ముం జిద్రము చేయునట్టివి త్వదంతశ్శత్రు బంధాల మొ
త్తమ్ముం జంపి సుకీర్తి చంద్రికల నందంగం దగున్ భూవరా 41
ఎవ్వరికి నే తరి నకట యెట్టి పగిది
వచ్చు నాపద లేరికి వచ్చుఁ దెలియ
దుముకఁ దనపైకిఁ గుప్పించి తూర్ణ మంతఁ
బిల్లినిన్ మ్రింగి యాఖువు బిలముఁ జొచ్చె 40
[ఆఖువు = అడవి పంది; బిలము = గుహ; మ్రింగి = పొట్టన పెట్టుకొని]
ఉల్లము హర్ష వేగమున నుప్పెన భంగినిఁ బొంగు చుండినన్
మెల్లఁగ సంచరించుచును మేదిని నక్కట యంతఁ జిత్తమే
తల్లడిలంగ సన్నగిల ధైర్యము దా గుటకల్, కనంగ నా
పిల్లిని, మ్రింగి మూషకము వేగమె చొచ్చె బిలమ్ములోనికిన్ 39
భర్త మెప్పు కన్న పడతి కేమున్నది
పుడమి నెంచ నెందుఁ గడు ముదమ్ము
బుజ్జగించి నాథుఁ బూర్ణచంద్రానన
చీర విప్పి చూపెఁ జెలువ మతివ 38
నారుల కెంచఁ జీర లవి నచ్చిన నాథుని నెత్తి మొత్తి తా
రోరిమి కూల్చి కూల్చి కొన నొప్పికొనంగను జేయ వింతయే
వారక వేఁడి వేఁడి పతిఁ బట్టుది క్రొత్తగఁ గొన్న దట్టిదౌ
చీరను విప్పి చూపినది చెల్వము నా సతి యెల్లవారికిన్ 37
పుట్టెను గరోన సమయించఁ బుడమి నెల్లఁ
గన్న కొడు కైనఁ దండ్రినిఁ గాంచ రాఁడు
కలియుగ మహిమ మేమని పలుకఁ గలను
వ్యాఘ్ర సింహములకుఁ బుట్టె వానరుండు 36
[వానరుఁడు = వన సంబంధములను భక్షించు వాఁడు]
దఘ్రత దైవలీల లవి ధారుణి వింతలు కావె చూడ నా
దఘ్రయ సంభ్రమమ్మది వృథాగతి యయ్యెను గాంచఁగా ననన్
వ్యాఘ్రిని సింహినిం దమిని నామృగ రక్షణ శాల నింపుగా
వ్యాఘ్రము సింహముం గలియ వానరుఁ డొక్కఁడు పుట్టె వింతగన్ 35
[ఆదఘ్ +రయ = ఆదఘ్రయ: నిరాశ వేగము; దఘ్ +రత =దఘ్రత: కాపాడ నాసక్తి]
నిలువ నేర్చి నట్టి బల్లిదులు కవులు
గలరె వీని ముందుఁ గాంచ నెందుఁ
బద్య భండనమునఁ బాటవమ్మది మీఱఁ
గంది శంకరయ్య కవులఁ జెఱచు 34
ఉత్సాహము.
అంద ఱేల యుందు రిట్లు నందు నిందుఁ గందుమే
సందు దొఱక నాడు వాఁడు చాలు నింక హాస్య మం
దెందు ముందు నుండు, చింత నేల నొందు దయ్య యో
కందిశంకరయ్య! ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్ 33
విశ్వమునఁ జూడఁ జూడఁగ వెఱ్ఱి తలలు
వేయ నాగరికత నేడు వేయి గతుల
దుస్సహంబై విబుధులకు దుష్టజన స
భా రతము సంస్కృతి భ్రష్టమై రహించు 32
ధర దుర్నీతి మహోజ్వ లాకృతి జనత్రాసంబుగా నూనఁగాఁ
గరుణా సంభృత వీక్షణ ప్రచురతా గంభీర చిత్తుండునౌ
హరి సంకల్ప సుధా రసార్ద్ర యయి ఘోరాప్రాచ్య దేశస్థమౌ,
భరతక్షోణి పురోగమించు నఁట, భాస్వ త్సంస్కృతి భ్రష్టమై 31
పాపచయము పాపి భృశము
కాపు నఖలుఁడు జపియించఁ గైటభ దమనా
యేపుగ నహీనుఁడు తలఁచఁ
బ్రాపును భద్రోహిత విధిఁ బడయఁగఁ గనుమా 30
మాటి మాటికిఁ గననేల మగువ వాటి
భామ దుశ్శంక, కాంచీ రవ సదృశమ్ము
లందియల, వీడ నొప్పు నాట్యమున రంభ 29
[అందియల = అందియలే]
భంజాదేవి కృపా కటాక్షములు రంభా నీకు నేపారగం
గంజాక్షీ! మృగరాజమధ్య! విలసద్గౌరాంగి! స్ఫూర్జత్ప్రభా
మంజీరమ్ములు వే ధరించి యిఁక సంభగ్నావమర్దమ్ము లీ
మంజీరమ్ముల వీడి చేయఁదగు రంభా నాట్య మీ వేదికన్ 28
[భంజా దేవి = అన్నపూర్ణా దేవి]
మునిగణ మడరు జీవించు జన గణమ్ము
భండనం బందు రవణమ్ము బాణ మూని
రాముఁడే రావణుండైన ప్రజకు మేలు 27
నీ మది శంక వీడు తగు నేర్పున నింపుగఁ బేర్చ శబ్దముల్
నీమము నెంచి పద్యముల లీలఁగ నౌనిక నర్థవంతముల్
గ్రామణి పాద మౌచితినిఁ గన్పడు గాంచుమ పండితోత్తమా
రాముఁడె రావణుండయి ధరాతల మేలుట పాడియౌఁ గదా 26
[పద విభజన: రావణుండు – రాముడె – అయి - ధరాతల మేలుట పాడియౌఁ గదా]
యుర్వ్యాహార సుసమృద్ధి కుత్సాహివియై
పూర్వ్యమ్ము మేలు మానుము
దుర్వ్యాపారంబె జనుల దుఃఖముఁ ద్రోఁచున్ 25
నిర్వ్యూహమ్మును మించు నిప్పుడమి దండింపంగ నిర్వీర్యమున్
దుర్వ్యూహమ్ము తలంచఁ బౌర జన సందోహమ్ము భీతిల్లగన్
నిర్వ్యాపారము కన్న మే లగును నిర్ణేతౄణ పాత్రమ్ముగా
దుర్వ్యాపారము క్షేమదాయకము సంతోషంబు పౌరాళికిన్ 24
[దుర్వ్యాపరము = కష్టసాధ్య వ్యాపారము]
ఇందు వర్ణత్రయాధిక పంచమ చరణంబుఁ జమత్కారముగ బూరణంబు సేయుఁడు.
మీసములు గడ్డములు నరసిన విట యౌవనునకు పళ్లూడి బంగరు
పళ్లు కట్టించి కొనిన కాంతామణి సమాధానము:
సరస సుధాంశు బింబ సహజంబగు మద్వదనంబునం గరం
బరుదుగ నున్న నై నిడుదలై మెఱుఁగా రెడు పాండు రోమము
ల్కిరణము లట్ల యొప్పెఁ దిలకింపు మటంచు విటుండు వల్క సుం
దరి చిఱునవ్వు డాఁచికొని తా నపు డుత్తర మిచ్చె నాదు ప
ల్వరుసను గాంచఁ గన్పడును రాజ దనుత్తమ కాంచనచ్ఛవుల్! 23
నిత్య హృద్య దివ్య సత్య వాక్కు
సర్వకాల దేశపర్వ సర్వగతుల
గీత, మార్చఁ గలదె గీఁతఁ గృష్ణ 22
[నా గీఁత మార్చఁ గలదా కృష్ణా!]
వాతాగ్ని త్రిదశేశ్వ రాది సుర సంభావ్యైక దేవా వ్యధా
వ్రా తాంభోనిధి మాన వాత్త రిపు షడ్వర్గమ్ము సంసార సం
ఘాత స్తోమము నుత్తరించఁ దగ నో కంసఘ్న! త్వద్వాక్సుధా
గీతాశాస్త్రము గీఁత మార్చఁ గలదా కృష్ణా యశోదాత్మజా 21
ఘనముగ భూషితయై ముఖ
మున చిరు నవ్వొలుకు చుండ ముద్దుగ హర్ష
మ్మునఁ గులుకుచుఁ దోడు నడవఁ
దన సతి, పెండ్లిం గనుటకుఁ దా నేఁగెఁ ద్వరన్ 20
పను లెల్లం దగఁ బూర్తి సేసి వడిఁ బ్రాప్త చ్ఛంద యానమ్మునం
దన భాగ్యమ్ముఁ దలంచి గుట్టడర నత్యంతమ్ము చిత్తమ్ము నం
దున హర్షించి వివాహ మాడ సతికిం దోబుట్టు, మున్నేఁగఁగాఁ
దన యర్ధాంగి, వివాహముం గనుటకై తానేఁగె నుత్సాహియై 19
అవివేకి గొలుసులం దన
ను విచారించంగఁ గట్టను వెఱపున ఖర
మ్ము వలికె నిట్టులు చిక్కము
కవి కంటెను మేలు గాదె గాడిద! భువిలో 18
[కవి = కళ్లెము ]
భువి వీక్షించిన గుడ్ల గూబ వలనం బూజ్యంబు లాభం బహో
తెవులం చేడ్వక సొమ్ము లిమ్మనక ప్రీతిన్ నిల్చి యీ గార్దభం
బవిదూరంబున మోసి మూటలను దానర్చించు నిర్ణేజకుం
గవి కంటెన్ బరికింప గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా 17
[కవి = గుడ్లగూబ]
కాంత కందోయి పురుడించఁ గలువల జతఁ
గాంతుఁ డేతెంచి కన్పించఁ గనుల ముందు
పగలు శశి పూర్ణకళలతో నెగడె దివిని 16
సుగమ పథానువర్తి యయి చోద్యము మీఱఁగ నుత్సహించుచున్
గగన విహారి కైరవ నికాయ మనస్పతి శీతరశ్మి యా
శగ జగదేక సుందరుఁడు శారద యామిని నెల్ల జేయుచుం
బగలు శశాంకుఁ డంబరముపై విలసిల్లెఁ గళాసమగ్రుఁడై 15
ముద్దు ముద్దుగఁ బల్కుల నెద్దినమ్ముఁ
బలుకు చుండ విహంగము పొలఁతి ముందు
నంగనామణి పండ్ల నొసంగెఁ దమి శ
కుంతికిన్ గుంభకర్ణునకు సుత సీత 14
[శకుంతి = పక్షి (మగ); కుంభకర్ణునకు = పెద్ద చెవు లున్న దానికి]
అంతము లేని దుఃఖముల నక్కట కానన వాస తప్తయే
సంతత భర్తృ పాద యుగ సక్త విచార నిమగ్న చిత్తయే
పొంతము మీఱ మా సతియె భూమికి, నేరను గల్గఁ బుత్రికల్
కుంతికిఁ గుంభకర్ణునకుఁ, గూఁతురుగా జనియించె సీతయే 13
అన్నుల మిన్నా వినుమా
వెన్ను విఱుగఁ బడ్డఁ బాలు పితుకుచు నుండన్
గిన్నెను గైకొని ధేనువు
తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్ 12
ఎన్నఁ దరమ్మె యేరికిని నెన్నఁడు దియ్యని పారవశ్యపుం
గన్నని వేణుగానపుఁ బ్రకంపన ధాటి సహించ నోపునే
మిన్నఁగ భక్తి నా నుదధి మేదిని లోకుల కంద నంత లో
తన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వు టొప్పగున్ 11
[అన్ను =పరవశమగు]
ఆమృగ లోలాక్షి కృశ
హ్రీమృగ మధ్యకు ధవళ మహీ సదృశాంగీ
దామ పరివృత జటాఖ్యలు
కోమలి తలమీద రెండు కొమ్ములు వుట్టెన్ 10
[కొమ్ములు గల జింక, గోవులతోఁ బోలిక గల కాంతకు
జడ లను కొమ్ము లుండుట భావ్యమే]
అమ్మను లోకమాతఁ బరమాత్మ హరీశ్వరి నెల్ల రింక నె
య్యమ్మున విశ్వకర్మ యిడ నంచిత దుగ్ధ సముద్రకన్య స్తో
త్రమ్ములఁ గొల్వుఁ డింపుగను దప్త సువర్ణ కిరీట మందు నా
కొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీర్షమునందుఁ గాంచఁగన్ 9
వియ్యాల వారి యింటను
వయ్యారమ్ము లొలికించు పద్మాక్షిదియౌ
సయ్యాట లందు గెంతుచుఁ
బయ్యెదనున్ లాగువాని భామిని మెచ్చెన్ 8
కయ్యము ముందు కల్గుటకుఁ గారణ మౌ నని నిశ్చయమ్ముగం
గుయ్యని యంబికా సుతుఁడు కుందుచు నుండుట తెల్లమే యనన్
దయ్యమ కాచు నన్ననుచు ద్రౌపది కృష్ణుని, నేవగించి యా
పయ్యెద లాగు ధూర్తునిని బాగని, భామ నుతించెఁ బ్రీతితోన్ 7
వత్తు రెల్ల రింకఁ జత్తురు శీఘ్రమ
బల్లిదుండ వీవు భయపడంగ
నేల రాక్షసేంద్ర వాల ధనులె వీరు
వానరులనుఁ గాంచి వగచఁ దగునె 6
మానవు లెంచ నిప్పుడమి మాన్యులు విజ్ఞులు శక్తిమంతులున్
దాన దయా గుణమ్ముల నుదారులు నిత్యము పర్వు లేలయా
వానినిఁ గాంచి వెల్పలకు వానరసింహమ మూయు మింక నీ
వా నర జాతిఁ గాంచి కడు వంతనుఁ జెందుట నీకు యుక్తమే 5
[నీ వా = నీ నోరు]
ఉత్తలపడి యున్న నరసి
చిత్తంబునఁ బుట్ట జాలి శ్రీకృష్ణుండే
యత్తరిఁ దగఁ గుంతిని మే
నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్ 4
చిత్తము పొంగ లక్ష్మణుఁడు సీతయుఁ దోడుగ నుండఁ బ్రీతి నై
మిత్తిక మౌనిదర్శనుఁడు మేఘ నిభాంగక సుప్రభా దను
స్సత్తముఁ డర్క వంశ తిమి చంద్రుఁ డగస్త్య మహర్షి సుజ్వల
న్నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్ 3
[జ్వలత్ +నత్ +తను = జ్వలన్నత్తను]
ద్వార మందు నిలిచి వారించ వీక్షించి
సంభ్రమమ్ము నందు సంశయమ్ము
వీడి చిత్త మందు వేగ నలుఁగుపిండి
పుత్రుఁ జంపి శివుఁడు పొలఁతి నందె 2
గాత్ర మనో యు తాఖిల జగన్నర సంచయ మోహకార చా
రిత్ర యశో వివర్ధన శరీర మనోజ్ఞ విలాస మూర్తి స
ర్వత్ర జయార్థ మానస నిరాదర ణాంధ సుదర్ప తద్రమా
పుత్రునిఁ జంపి శంకరుఁడు పొందెను బర్వతరాజ పుత్రికన్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి