నం గ్లీతక వచనమ్మున
నాంగ్లము పలుకక కడింది యలరించఁ గదే
సంగ్లానపు భాషణ మిది
బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్ 60
[నను + క్లీతక = నం గ్లీతక; క్లీతకము = మధురము;
సంగ్లానము = మిక్కిలి బడలిక]
పుం గ్లౌ తాదృశ నిర్మ లానన కృపా పూర్ణాత్మ వీరాలి గాం
చం గ్లీబాల్ప మనంగ నేరికి నిటన్ శక్యంబె వే భీకరం
పుం గ్లానిం దగఁ జేయగాఁ బరులకుం బో నిత్య సన్నద్ధులై
బంగ్లాదేశ మహమ్మదీయు లవురా భక్తాగ్రణుల్ శూలికిన్ 59
[శూలి = శూలము ధరించిన వాఁడు, ఇక్కడ సైనికుఁడు;
పుం = పురుష; గ్లౌ = చంద్రుఁడు]
హంసధ్యానమ్మున ననృ
శంసుండు నిజేంద్రియ చయ జయమునఁ గామ
ధ్వంసత భాసిల్లంగన్
సంసారము నందిన యతి సత్పూజ్యుఁ డగున్ 58
సంసారమ్మున నా వసిష్ఠుఁ డరయన్ సత్యంపు బ్రహ్మర్షియే
సంసారమ్మునఁ గౌశికుండు నరయన్ సత్యంపు బ్రహ్మర్షియే
సంసారమ్మున నత్రి యొక్కఁ డరయన్ సత్యమ్ము సప్తర్షులన్
సంసారస్థితుఁడై యతీశ్వరుఁడు పూజాభాజనుం డయ్యెడున్ 57
వారిరాశి గర్భముఁ ద్రవ్వి పట్టవచ్చుఁ
దివిరి తైలసంపద ధరిత్రీ జనాలి
కడు ప్రయాసల కోర్చినఁ గడలి యందు
జలములో నూనె చుక్కల జాడఁ గనము 56
కశ్చిన్మహర్ష్యువాచ:
తెలుపక యున్నఁ దత్క్షణము తీవ్ర తరమ్ము శపింతు నిత్తరిం
గలవర మందఁ జేయుటకు గౌరవ హీనుఁ డెవండు ఘోరపున్
జలమున వేయ కున్న మఱి నాదు కమండలు వందు నుండు నీ
జలమునఁ దైలబిందువుల జాడఁ గనంగ నసాధ్యమే కదా 55
పేపర్ - బుక్ - పెన్ – ఇంక్ – భారతార్థములో
స్వరములు జాఱ చివరను ద
నరు నిటు రేపేప రుబుకు నలి రే పేపర్
నరుఁడు నుబుక్ చాపెను పద
మరయం జాపెన్ మఱింకు నరయంగా నింక్ 54
[నరుఁడు = అర్జునుఁడు; నలిన్ రేపు ఏపర్ ;
నలి రోగము; ఏపు = బాధించు;
ఏపరు: ఏపర్; ఉబుకు: ఉబుక్; చాపెను: చాపెన్;
ఇంకు: ఇంక్, యిట్లు పదముల చివరి
స్వరము జాఱిన యగు నని భావము]
గరళకంఠ శూలి గంగాధర పురారి
జంద్రశేఖర హర శంభు సాంబ
బార్వతీపతి శివ బంచవక్త్ర యని త్ర్యం
బకునిఁ గొల్చిరి హరి వాయుసుతులు 53
సకల ప్రాణి భవ స్థితి క్షయ సురక్షా దక్ష విశ్వాత్మునిన్
సక లోర్వీజన సేవ నార్హు ఘనుఁ గంసధ్వంసుఁ బద్మాక్షునిన్
వికసన్నేత్రునిఁ గృష్ణు ఖండిత మరుద్విద్వేషి చంచుప్రభా
బకునిం గొల్చిరి కృష్ణ భీములు గడున్ భక్తిన్ బ్రదర్శించుచున్ 52
[కృష్ణభీములు = భీమార్జునులు]
వింత నా కిందుఁ దోఁచదు సుంత యేని
రామ రావణు లనిశమ్ము రామ రామ
ప్రీతి నొందుదు రిద్దఱు పీల్చి పీల్చి
రావణుఁడు నస్య మిమ్మని రాము నడిగె 51
సస్యశ్యామల భారతావనినె దుశ్చారిత్రు దుర్బ్బుద్ధి కా
మ స్యాలభ్య మనోరథ మ్మగునె సంభావ్యంబు నిత్యం బనా
లస్యన్ సీతను దప్తకాంచన మయ శ్లాఘ్యమ్ము వైదేహి దౌ
నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్ 50
[నస్యము = ముక్కున ధరించు ముక్కుపుడక;
కామ స్యాలభ్య మనోరథము: అలుక్సమాసము ]
ఏరి కుండదు పుట్టఁ గుమారుఁ డాలి
కింపుగ మనమ్ము లోపల నెన్నఁ డైనఁ
బట్ట లేక యానందము కట్టెదుటనె
భార్యకున్ గర్భమయ్యెను భర్త యేడ్చె 49
ఆర్య కులాభివృద్ధికి మహత్తర భాగ్యవిధాయకమ్ము న
ధ్వర్యచ యాత్త సత్ఫలము వంశ వివర్ధన మౌను గర్భమే
కార్య మకార్య మందు ఘన కార్యము నందు విభేద శూన్యుఁడే
భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్ 48
పెద్దలు సెప్పిరి యివ్విధిఁ
గద్దు శునక రూపుఁ డగుట కాలయముండే
సద్దొనరించక రా నే
తద్దినమున శ్వానపూజ తప్పదు సేయన్ 47
పెద్దలు మెచ్చ హర్షమున వెల్గుచుఁ దృప్త మనోరథాత్ములై
సుద్దపుఁ జిత్తమూనియు నశోచత వర్తిలఁ జేసి భక్తినిం
దద్దయు శ్రద్ధ పూర్వులకుఁ దర్పణ సంయుత కర్మకాండముల్
తద్దిన మందు శ్వానమును దప్పక కొల్వుము శాస్త్రపద్ధతిన్ 46
[శు +ఆనము =శ్వానము; శు = చక్కగ, త్వరితముగ; ఆనము = ఉచ్ఛ్వాసము,
ఇక్కడ ప్రాణాయామ మని భావించ నగును]
ఆ నీలాకాశ నిభ
మ్మా నీలాభ్ర సదృశమ్ము నా మీసమ్ముం
దా నరసె భర్త యందున్
మీనాక్షికి మీసమెంతొ మేలుగ నొప్పెన్ 45
ఆనందమ్ము నిజాత్మ లందుఁ గర మేపారంగ సంపత్క రీ
శానీ దివ్య కృపార సాత్త వర కాసారమ్మునం దిర్గెడిన్
నానా జాతి వరాండజ ప్రతతి విన్యాస ప్రపూర్ణంబునన్
మీనాక్షిం గని మేలు మేలనిరహో మీసంబులన్ గల్గినన్ 44
[అక్షి = ద్వయము]
భక్తి మీఱఁ జిత్తమ్మున భయద విఘ్న
భగ్న కారకములు శుక్ల పక్ష మందు
భాద్రపద మాసమునఁ బంచవాస రోన
నవమి పూజలె మేలు వినాయకునకు 43
ప్రవరులు త్రేత యందు మఱి ద్వాపర నామ యుగమ్ము నందు మా
నవకుల రక్షణార్థము సనాతన పూరుషు లుద్భవించఁగా
నవనిని రామచంద్రునకు నా పిదపన్ బక దైత్య భేదికై
నవమియె శ్రేష్ఠమౌ తిథి వినాయక! పూజకు వీడు మష్టమిన్ 42
నీరు తెగకుఁ జెందిన నీ
వారము నింపునె యుదర మపార మయిన, యె
వ్వారికి నైనఁ బుడమిఁ, గై
దారము లేకున్న సుఖము దక్కునె భావిన్ 41
[కైదారము = కేదార జనితము, ధాన్యము]
వారని భక్తి కొల్వుమ యపార కృపారస సిక్త చిత్తునిన్
దూరము సేయుఁ దూర్ణముగ దుఃఖ సమూహము నెల్ల సద్దయన్
నీరనిధిన్ మునుంగ భువి నీరజ నేత్రుఁడు దివ్య శుక్ల కుం
దారము లేక సర్వ జనతా భవితవ్యము శూన్యమే సుమా 40
చేయఁ జేయ విసుగు లేక చేకుఱు నిల
నెట్టి పనులైన సంశయ మేల యిందు
మానకుండక యోర్పున సానపట్ట
రత్నములుగ మారెను ఱాళ్ళు ప్రజలు మెచ్చ 39
పత్ని యుతమ్ము మ్రొక్కఁగ నపత్యము కల్గెను జక్రవర్తికిన్
నూత్న విధంపు సేద్యమున నూకలు పండెను బీడుభూములన్
యత్నము సేసి మూర్ఖుఁ డొకఁ డయ్యెను బండిత సత్తముం డిలన్
రత్నము లయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చఁగ లోకు లెల్లరున్ 38
కొడుకు కృతవీర్యునకు నేలెఁ బుడమి నెల్ల
వేయి చేతులు భాసిల్ల నాయతముగఁ
గార్తవీర్యార్జును నని భార్గవుఁడు సంప
నసువులం బాసె నర్జునుం డంద ఱేడ్వ 37
కసిమసఁగంగఁ గౌరవ నికాయ మధర్మ విధాన మెంచి భా
ను సమ మహార థోత్తము ఘనుం గడతేర్చిరి యంద ఱొక్కటై
వసుమతిఁ గూలి పోరుచు సుభద్ర కుమార వరాభిమన్యుఁడే
యసువులఁ బాసె నర్జునుఁ డనంత విషాదము నొంద నందఱున్ 36
[కసిమసఁగంగ = చంపంగ]
స్తుత విద్యల శ్రీకారపు,
నతులిడి గణపతికిఁ దొలుత నలువ సతి సర
స్వతి వాగ్దేవిని భక్తి ని
రతినిఁ గొలిచి, కావ్యములను వ్రాయఁగ నొప్పున్ 35
అతి లావణ్య విశేష భావముల ద్వంద్వార్థ ప్రభా నైపుణిన్
విత తానుగ్రహ దీప్త ధీద్యుతి సదా వేద్యంబుగా భాసిలన్
నుత శబ్దార్థ లసత్ప్రమాణములఁ బ్రాజ్ఞుల్ మెచ్చ వాగ్దేవి భా
రతి పూజన్ ఘటియించి వ్రాయఁగఁ దగున్ రమ్యంపుఁ గావ్యమ్ములన్ 34
నర లోక వాసులకు న
చ్చెరు వైన వపాయము లతి చింత్యమ్ములు దు
ష్కర మైనను బ్రజ్ఞన్ దు
ర్మరణమును జయించువాఁడె మర్త్యుం డన్నన్ 33
కరణము లెల్లఁ జేసిన సకాలము నందుఁ జెలంగి మే లగున్
నరులకుఁ గష్ట సాధ్యము లనంతర మెంచి మనమ్ము నందు దు
ష్కరమును గూడఁ జేయగను సంభవ కార్య మమర్త్యుఁ డంచు, నీ
మరణమునున్ జయించిననె, మర్త్యుఁ డనంబడు నెవ్విధిన్ గనన్ 32
[మర్త్యుఁ డమర్త్యుఁ డనంబడు నని భావము;
మర్త్యుఁడు = మర్త్య లోక వాసి; అమర్త్యుఁడు = మరణము లేని వాఁడు]
కృష్ణ లీలల నేర శక్యమె!
కొండ నేల నెత్తఁగ వలె నండకొఱకు
వాసుదేవుండు బోరున వాన పడఁగ
చాలును గద యిట్లన్నను జాలు నింక
వానలం గురిపించకు వరుణదేవ 31
వానల్ దాఁ గురిపించు భూతలమునం బర్జన్యుఁడే వేఁడినన్
నే నీ శక్రుని భక్తితత్పరత దానీరంబు నిల్పుం గదా
యీ నీర్కుప్పకు నాథునిం గొలువఁగా నేలయ్య నీ వివ్విధిన్
వానల్ మాకిఁక వద్దురా వరుణదేవా నీకు మా స్తోత్రముల్ 30
యాతత హర్షము సెల్గఁగ
నా తరిఁ బట్టంగ లేక యాశ్చర్యముగం
జేత లుడుగంగ బోరున
స్వాతంత్ర్యము వచ్చి యేడ్వఁ జాగిరి నేతల్ 29
మెచ్చిరి పౌరు లెల్లరును మించెను మిన్నున వాద్య ఘోషయే
నచ్చిన రీతి నాట్యములు నారుల తోడుతఁ జేసి రింపుగా
నచ్చపుఁ గేతు రాజముల నారసి వీనిని నిల్పు టెట్లు నా
వచ్చె స్వతంత్రమంచుఁ గడు వంతను బొందిరి నేత లెల్లరున్ 28
[అప్పటి నేత లెల్లరు ధర్మాత్ములే]
రుసరుస లాడఁడు మీఱి యె
కసక్కెముల నాడు వాఁడు కాదు మఱి సన్ను
త స దాసమాన సుమనో
రసికుండని పేడినొక్క రమణి నుతించెన్ 27
ముసురునఁ జేరు కప్పలు విమోహులు లోకులు స్వార్థ చిత్తులున్
విసమును బూని తీయనవి పెక్కు వచించిన వాని మెత్తురే
యసముఁడు విద్యలం దని ధనాశ వచింతురు పండితబ్రువున్
రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలోన్ 26
ఆప్నోతి పొందునని య
స్వప్నుఁడు దేవత యని సురభాష వచించున్
క్షిప్నుఁడవు కావల దిటన్
స్వప్నములోఁ గన్నదెల్ల వాస్తవమయ్యెన్ 25
క్షిప్నునిఁ బోలెఁ జూడకుమ చిత్తము చెప్పిన రీతి నుందు దు
స్స్వప్నము సత్య మై పరఁగ సంతసముం గన నెట్లు సంత తా
స్వప్నుని నాకు దైవమ యపారపు భాగ్యము కల్గ నేర్చునే
స్వప్నమునందుఁ గాంచినది వాస్తవమై ముదమందఁ జేసెరా 24
[క్షిప్నువు = తిరస్కరించు వాఁడు]
ద్విపద.
ఇల నన్య జగతికి నేఁగఁగను జతి
కిలఁ బడుచు రవి గ్రుంకెన్ నడిరేయి 23
కాకోదరమ్మును దఱిమె
నా కేల గిరీంద్ర మెత్తి యారసె నేలా
నీకీ ప్రశ్నము బేలా
శ్రీకృష్ణుఁడు దైవమగునె శిష్టజనులకున్ 22
వీకం గొల్వుము బుద్ధి నూని మది నా విశ్వేశునిన్ వహ్నిలో
దూకం జాలెడు మూర్ఖమౌ శలభమై తోచంగ నేలా నరా
యేకాంతమ్మునఁ జింత సేయు మిఁక కాదే పల్కు దుష్టాలికిన్
శ్రీకృష్ణుం, డపరాధి! దైవమగునే శిష్టాత్ములౌవారికిన్ 21
ఉక్క చెలంగఁగ నంతట
లక్క కరగు మండుటెండలను సూర్యుండా
టక్కరి వినుఁ డో చక్కని
చుక్కలు! నిప్పులను మంచు సూర్యుఁడు గురిసెన్ 20
[మంచు = మనఁ జేయు నట్టి]
ఎక్కటి తార లింక రవి యెక్కటి దీ భువి యక్కజమ్ముగన్
మిక్కిలి యౌచు ద్వంద్వముల మిన్నున నిల్చి చెలంగు చుండగం
జిక్కని మైల రాత్రిని విశేషపు టెండ లహమ్ము నందునుం
జుక్కలు, నిప్పురవ్వలను సూర్యుఁడు, మంచును గ్రుమ్మరించెడిన్ 19
తాళ వృక్ష మూలమ్మునఁ ద్రాగుచుండఁ
బాలు దా నగు నిందల పాలు సుమ్ము
దుష్టజన సమూహము నుండి కష్ట మయినఁ
బాఱిపోవలెఁ గీర్తినిఁ గోరుకొనిన 18
నేలఁ జెలంగ శత్రువులు నివ్వెఱ సెందక వీరు లెల్లరున్
వాలి సశస్త్ర సంచయము వారిని నాజి జయించ నొప్పఁగా
నాలము సేయ నేఁగు నపు డడ్డిడి యింతయు భీతిఁ గొల్ప నీ
కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్ 17
[గొల్పనీక + ఆలికి = గొల్పనీ కాలికి]
గౌరి శుభదాయిని మది జగత్రయపు హి
తమ్ము గోరి పతినిఁ ద్రాగఁ, దలచి యిట్టు
లివ్వి షమ్ము మహా త్ముని నేమి సేయ
దజునిఁ గోరె, శివుఁడు హలాహలముఁ గ్రోల 16
జిహ్మగ దంత సంభవము సిక్కఁగఁ దద్ధవళాబ్ధిఁ జిల్కఁగా
జిహ్మ గతిం జెలంగి వడి ఛిన్నము కాఁగ జగమ్ములే పర
బ్రహ్మము దేవదేవుని సభక్తినిఁ గాంచఁగ దేవకోటి వే
బ్రహ్మనుఁ జీరె, శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్ 15
కర కటకములన్ గాజు ల
న రాదె యనవచ్చుఁ జుమ్మి నరవర వినుమా
హరికథను నుడివెడు మహా
పురుషులకున్ భూషణములు పూవులు గాజుల్ 14
పురుషులకున్ సుభూషలగుఁ బో భుజకీర్తులు నుంగరమ్ములుం
బురుషగ ణోత్తముండు పరిపూర్ణ మహా హరి నిట్లు గాంచమే
కురులకు హస్త పద్మములకుం గన స్త్రీలకుఁ, బుణ్యలబ్ధ ధీ
పురుషులకున్, సుభూషలగుఁ బువ్వులు గాజులు గాలి మెట్టెలున్ 13
దుష్కరములు జప తప ఆ
విష్కరణము లెల్ల వ్యర్థ విన్యాసములే
శుష్కవచనమ్ము లివియే
దుష్కృతమునఁ బుణ్య మబ్బు దుర్మార్గునకున్ 12
[తపస్ + ఆవిష్కరణము = తప ఆవిష్కరణము / తప యావిష్కరణము)
నిష్కృతి లేదు పాపచయ నిశ్చిత మానస దుష్ట కోటికిం
బుష్కర కాల గాహనపుఁ బుణ్యము దీర్చును గొంత పాపముం
బుష్కర నేత్రు నామమును మూరి జపించిన నంత్య వేళలో
దుష్కృత మాచరించు కడు దుష్టున కబ్బు నితాంత పుణ్యముల్ 11
అంభోరాశి నిభ మహా
గంభీ రార్థ కవితా నికాయము కలదా
డంభమ్మున సద్యస్స
రంభా భోగమ్ముఁ గోరరాదు కవీంద్రా 10
అంభోజాసన దార వీతదయ విద్యాహీన దుర్భాగ్యుఁడా
సంభావ్యమ్ముగ నేర్చి విద్యలను సచ్ఛబ్దార్థ సంయోగముల్
శుంభత్కావ్య ము లొక్క టొక్కటిగనే శోభిల్లు గ్రంథవ్ర జా
రం భాభోగముఁ గోరె దేల కవిచంద్రా యర్హతల్ గాంచవే 9
[ఆరంభ + ఆభోగము =ఆరంభాభోగము: ప్రారంభమునందె పరిపూర్ణత]
శారద నిశా సమయ మందుఁ జంద్రుఁ జేరఁ
దార లెంచఁ జోద్యమ్ముగఁ దక్కి నట్టి
చుక్క లలుగఁగ రోహిణి, చూచు చుండ
సీత, కరపద్మమున వెల్గె శీతకరుఁడు 8
శీతమయూఖ చంద్ర ముఖి సీత కృపారస సిక్త వీక్షయే
పూత చరిత్ర భూమిసుత పూజకునై కడుగంగ నెంచి తా
రాతిరి రామపాదములు రమ్యపు దోయిలి నీర ముంచగా
సీత కరాంబుజంబునను శీతకరుండు వెలింగెఁ గంటివా 7
[సీత దోయిలి నీటిలో స్వీయ ముఖమ్మును గాంచినది]
యా ఖర నఖముల మెఱయుచు, నంభోజముఖీ
నే "ఖీ" యనిన సఖీ యని
రా ఖీ, కట్టిన కరములె ప్రాణముఁ దీసెన్ 6
[ఆఖము = గడ్డపాఱ; కరములు = కిరణములు; కట్టిన = కూడఁబెట్టిన]
ఈ ఖానంతము నందు సంకలిత మయ్యెన్ జీవ మచ్చోటనే
శాఖా భేదము లేల నీ కకట సఛ్ఛాతోదరీ వంశ స
చ్ఛాఖా యే మిది “తా” యనం దగ దహో శాపమ్మునన్ వర్ణ మౌ
రా “ఖీ” కట్టిన హస్తపద్మము లయో ప్రాణంబుఁ దీసెన్ గదా 5
[ఖ + అనంతము = ఖానంతము: అనంతాకాశము]
హరి రమానాథుని యమర వర వినుతుని
లోక రక్షైక నాథుని లోకపూజ్యు
పన్నగ వరేణ్య తల్పుని భక్త చిత్త
హరుని కరములు శంఖచక్రాంచితములు 4
హర హరులం గనంగ నగు నట్టి నరుం డిల నుండ శక్యమే
నరవరుఁ డొక్కఁ డాత్మను ఘనమ్ముగ నూహ వహించి తెల్పెనే
తిరముగ నెవ్వ రెవ్విధి మతిం దగఁ దల్చిన నుందు రవ్విధిన్
హరుని కరంబులందు నలరారుచు నుండెను శంఖచక్రముల్ 3
కవి లోకార్ణవ చంద్రుం
డవు విబు ధారాధ్యుఁడవు పుడమి రత్నంబై
సువిదితుఁడవు నా చిత్తము
కవిసమ్రాడ్విశ్వనాథ! కలతపడె నయో 2
భువి నీ యస్తమయమ్ము దుఃఖకరమే భూగోళ విద్వాంస గౌ
రవ పాత్రుండవు నీకు భావ్య మగు స్వర్గప్రాప్తి నిర్జన్మమై
స వివేక ప్రవ రాగ్ర్య వార్తలకు సత్సంధాత నా విత్తమే
కవిసమ్రాట్టగు విశ్వనాథ! కడు దుఃఖంబందె నీనాఁ డయో 1
[ఈనాఁడు = వార్తాపత్రిక]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి