సతము సహస్ర యుగ్మ స దశద్వయ స ద్వి సమా వరమ్ము భా
రత ఘన దేశ విశ్వ జన రంజక సౌఖ్యద దుర్వ్యధా నివా
రిత జిత రోగ సంప దభివృద్ధి విధాయక శాంతి యుక్త వ
ర్జిత నిజ మత్స రాది గుణ వృత్త మొసంగును గాక సద్దయన్ 30
వాతాం గారక మాధురీరమణ దాంపత్యమ్ము వర్ధిల్లఁగా
శీతాంశుద్యుతి సన్నిభమ్ముగను సచ్ఛ్రేయో వితానమ్ములన్
ధాతాదిత్య కృపా రసేక్షణలఁ బొందం జేసి వీక్షింతు రా
సీతారాము లొసంగి సంతతము నాశీర్వాద భాగ్యమ్ములన్ 29
కరుణాంభోధి రమాధినాధుఁడు జగత్కల్యాణ సంధాయకుం
డరవిందాక్ష కృపా కటాక్షముల నిత్యారోగ్య మాయుస్సులున్
సిరులున్ వర్ధిలఁ బార్వతీశ్వరులు దాక్షిణ్యమ్మునన్ సంతతం
బరయంగన్ హిమబిందు శేఖరుల వంశాంభోధి వర్ధిల్లెడిన్ 28
కరుణా దృక్కుల గిరిజా
పరమేశ్వరులు నిరతమ్ము పన్నుగ దీవిం
తురు గావుత వర్ధిల్లఁగఁ
జిరమ్ము హిమబిందుచంద్రశేఖరులు భువిన్ 27
సు మహానంద ర సాంబుధి
నుమామహేశ్వరు లొసంగ నుర్విఁ జెలంగున్
హిమబిందు చంద్రశేఖర
సు మధుర దాంపత్య దీప్తి శుభ దాయకమై 26
భూజాతా శ్రీరాములు
రాజత్కరుణా రసభర రాగేక్షణముల్
రాజిల్లఁ జేయ వర్ధిలు
సౌజన్యారామచంద్ర సంసార మిలన్ 25
తన్నామావలి భక్తిసంయుతము సత్పారాయణం బర్థిమై
విన్నాణంబునఁ జేయ నచ్యుతుఁడు సంప్రీతుండు రక్షింప శ్రీ
మన్నారాయణ సత్కృపా రస సుసంరంభేక్ష ణామ్నాయ సం
ఛన్నంబై వెలుగొందు రామశశి సౌజన్యేద్ధ దాంపత్యమే 24
శ్రీమన్నారాయణ విత
తామేయ కృపా రసేక్ష ణావలిని సల
క్ష్మీమాత పరపి మేఘ
శ్యాముఁడు గను రామచంద్ర సౌజన్యలనున్ 23
శ్రీకృష్ణార్పిత నిర్మ లాతిశయ చిచ్చేతో మహాంభోధికిన్
రాకా పూర్ణ సుధాకరుండ వయి భార్యా పుత్ర బంధమ్ముతో
నేకాంతస్థిర భావ మగ్నుఁడవు విశ్వేశున్ మదిన్ నిల్పి ని
త్యైకాగ్రస్ఫుట రక్తి నుంటి విట సత్యాకాంక్షఁ దండ్రీ మహిన్ 22
అల వైకుంఠమున కరిగి
నలినాక్షుని శ్రీహరినిఁ గనద్ఘన నిభ స
ల్లలితాంగునిఁ గను నొక నాఁ
డిల శ్రీహరి కోటపంక్తి యిప్పుణ్య తటిన్ 21
అకట యరయంగ రైతాంగ మన్నమాట
జానపదము కా నేరదు జనులు పలుక
మాండలిక మన్న నొప్పదు మహినిఁ గాంచఁ
దెనుఁగు సంధి కా నేరదు దేవ భాష
యందు సంధియుఁ గా దౌర యందు నిందుఁ
బండితబ్రువు లైనట్టి పరమ నేత
లుద్ధతినిఁ బల్కఁ బత్రిక లుదరి మించి
పెంచి పోషింప నిత్యమ్ము నంచితంపుఁ
దెనుఁగు నేలఁ బుట్టి పెరిఁగి దిశల నెల్ల
ముమ్మరం బగు గంజాయి మొక్క సుమ్ము 20
సకల క్ష్మాజన సంత తాదిమ వ రార్చా పాత్రు విఘ్నేశ్వరున్
సక లాదిత్య గణార్చనీయ ఘన రక్షా దక్షు హేరంబునిన్
సక లాటంక మహీరు హోత్కర లతా స్తంబఘ్ను ద్వైమాతురున్
సక లా ఘాగమ కోటి వజ్రు గొలుతున్ సద్భక్తి హస్త్యాననున్ 19
ఆది శంకరాచార్య వరార్చనా ప్ర
భా యు తాన్నపూ ర్ణాంగాంగ భవ్య వర్ణ
న సు వచో విరాజిత కాంచన రవణమున
కాంధ్ర గంధ మలఁది ధన్యుఁ డయ్యె గౌరి! 18
ఒక్క కరాగ్రం బన్యుని
దిక్కునఁ బ్రసరింప దూఱ దిట్టఁదనమునం
దక్కిన మూ డంగుళు లవి
నిక్కును దన వైపు నంచు నేరఁడు దానే 17
రామాంకిత పద్యమ్ములు
రామాంకిత కార్య కోటి రాజ్యావళులున్
రామాంకిత చిత్తమ్ములు
రామాంకిత వేశ్మ రాశి రామావనముల్ 16
న్యాయ నిలయముల నాయన పని యేమి వేగంబ గడువుల వేయు టయ్య
పాలక వర్గంపుఁ బని యేమి నాయన జనుల బాగోగులె చాలు నంట
ప్రతిపక్షముల కున్న పని యేమి నాయన తంతు లన్నిటిని ఖండింతు మనుట
రక్షక భటుల కార్యం బేమి నాయన క్షేమంబు నరసి దక్షిణలు గొంట
కనుల పని యేమి నాయన కనఁ దొలఁగుట
చెవుల పని యేమి నాయన చెత్త వినుట
మనము పనియేమి నాన్న యేమఱచి యుంట
జనుల పని యేమి నాయన యణఁగి యుంట 15
ప్లవ సంవత్సరపు టుగాది:
పంచాంగమ్ములు భవ్య భూషణములై భాసిల్ల ద్యోతిర్మహా
సంచారమ్మలు నీ పదాంకములునై సంధిల్ల ఋత్వాలి ద్వ
చ్చంచన్నేత్ర దృగాలియై చన నహశ్శ్యామా ద్వయమ్ముల్ త్వదీ
యాంచన్నేత్రములై వెలుంగఁ బ్లవ నా మాబ్జాక్షి దీవింపుమా 14
31/3/2021 (13/4/2021)
ఈ ప్లవ నామ వత్సర మహీన పరాక్రమ వీర్య యుక్తమై
విప్లవ ఘోర కీటక సవిస్తర నాశక యజ్ఞ సాగ రా
వప్లుత శుద్ధ దేహి యయి వాత జలానల భూత భీక రో
పప్లవ హీనమై సుఖ శుభప్రదమై యలరారుఁ గావుతన్ 13
28/3/2021 (13/4/2021) /
కంటిమి యా వికారి నటఁ గంటిమి శార్వరిఁ గంటగింపుగాఁ
గంటక హీనమై చెలఁగఁ గందు మికం బ్లవ వత్సరమ్మునుం
బంటలు పండ మెండుగను బాడియు సంపద లుండ నిత్యమున్
మింటను రేఁగి వర్షముల మేఘము లీయఁగఁ జాలినంతగా 12
28/3/2021 (13/4/2021) /
వ్రాసినఁ బద్దెము మెప్పుల
కోసము వేగిర పడకయె గుణ దోషములన్
వేసరక వెదకి కాంచిన
దోసమ్ముల నెల్లఁ దీర్పఁ దొడఁగుమ సుకవీ 11
స్వీయ కృత నూతన కోవిదార వృత్త లక్షణము: *భ త ర త స జ వ*; 10 వ యక్షరము యతి.
భా త ర తా సా జ వా యనం బాదమ్ములఁ జెలంగ నోజ నిటన్
భాతినిఁ బ్రాసమ్ము తోడఁ దోఁపన్ సద్యతి పదింట నుంచినచో
వ్రాతలఁ జక్కంగఁ గోవిదారంబై ధర వెలుంగు చుండ ద్యుతిన్
ఖ్యాతిఁ బ్రసాదించి కావుమా కాకుత్స్థ రవివంశ వార్ధి శశీ 10
నిరత మనురక్తిఁ జూపుచు
గురుతర రీతి పతిభక్తి కురియించుటలో
ధరణిజ సమమౌ లక్ష్మీ
వరనామ పతివ్రతా ప్రవాళంబ ధరన్ 9
వాగర్థ ప్రతిముల నా
నాగే శాగజలు నైన యా శివ శివలన్
జాగరణమ్మున మేలుగఁ
దాఁ గొలువ శివము లిడుదురు దాక్షిణ్యమునన్ 8
నష్టము రాఁగ నమ్మిన ధనమ్మున లోటు కనంగ దేశముం
గష్టము లెంచి యమ్ముదురె కాఁకలు దీరిన దేశ నేతలే
యిష్టము వచ్చినట్టులు న రేతరులే యది కొన్నవార ల
న్వేష్టలు గాంచ మార్గములు నేర్పరు లందఁగ లేరె లాభముల్ 7
సత తానంద దయార్ద్ర మానసుఁడు సత్సంకల్ప సంభావ్యుఁ డా
ర్జిత సత్కీర్తి ధనుండు చక్రి దయ వీక్షింపంగ నీ సౌమ్య వా
గతులస్వాంత నరుండు వేంకట యుతంబౌ సత్యనారాయణ
ప్రతి మాఖ్యుం డగు సద్గుణుండు దివి సంపాదించి శాంతించెడిన్ 6
వాతాం గారక మాధురీరమణ దాంపత్యమ్ము వర్ధిల్లఁగా
శీతాంశుద్యుతి సన్నిభమ్ముగను సచ్ఛ్రేయో వితానమ్ములన్
ధాతాదిత్య కృపా రసేక్షణలఁ బొందం జేసి వీక్షింతు రా
సీతారాము లొసంగి సంతతము నాశీర్వాద భాగ్యమ్ములన్ 5
చిరకాలమ్ము సనాతనార్ష గుణ సంశ్లేషైక సన్మానసుం
బర మార్థాతత శోధనార్థ పరితప్తస్వాంత సంచారినిన్
గురు సేవానుగ తాఖిలాంచిత మహా గుప్తార్థ విజ్ఞానినిన్
దరహాసాస్య విరాజమాన జనకున్ ధాతాభునిం దల్చెదన్ 4
ఒంటిలో బలమెల్ల నుడుగక మున్న చెవులకు వినికిడి పోవుటకు మున్న
కన్నుగవల చూపు కాలియుంటకు మున్న మఱ పెల్ల బుద్ధి నమరక మున్న
కాళ్లు చేతుల లోని కదలిక పోవక మున్న రుచుల పోక కన్న మున్న
ముక్కు వాసనలను దక్కక మున్న మలము మూత్రము వడ నేరమికి మున్న
వెన్నకట వంగి యుంటకుఁ గన్న మున్న
కాఁక కాంతా సుతులకును గాక మున్న
చావు నిన్నింకఁ గబలించి చనక మున్న
యన్న యెన్నుమ క్రన్నన వెన్ను నింక 3
అస్వభావికం బర్థ దౌష్ట్యమ్ము దూష్య
భావ లోక విరుద్ధంపు వాక్య మీయ
సుస్వభావికం బర్థ సంస్తుత్య విమల
భావ లోక సమ్మత మగు వాక్య సుకర
ణం బగును సమస్యా పూరణంబు సుకవి 2
గుచ్చుగఁ బుట్టి నట్టి పురుగుం గని చంపును దిట్టయై వడిం
బచ్చని పంట లిచ్చుచును బాడి నొసంగును మిక్కుటమ్ముగా
నచ్చము తిమ్మ నిచ్చు నిఁక నందఱి కింపగు సొమ్ము విద్దెలన్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి