దాన సౌశీల్య గుణములు దనర వలయు
నతిథి పూజలు సంతత మడర వలయు
ధన ఫలాది భోగముల స్వార్థ మడరంగ
దంపతులు సౌఖ్య మందుట దారుణమ్ము 62
వారని ప్రేమ తోడుత శుభమ్ముగ నూని గృహస్థ ధర్మమున్
దార సమేత మిద్ధర సతమ్ము చరింపఁగ భర్త ధన్యుఁడే
కారణ మేమి చెప్పిన నగర్హితమే యిది నిత్య సత్యపుం
దారుణ కార్య మౌను గద దంపతు లందుట సౌఖ్య మిద్ధరన్ 61
[సత్యపు +తారుణ =సత్యపుం దారుణ; తారుణము = తరుణ భావము
- అన్ ప్రత్యయము; తారుణ్యము యన్ ప్రత్యయము.
ఉదా: శ్రమణ అన్ /యన్ = శ్రామణము / శ్రామణ్యము]
ఏ మగువ సైప నోపును
గాముకుఁడౌ స్వీయ భర్తఁ గన నివ్విధి నా
భామకుఁ గలిగెను రోతయె
కామిని నూపుర మలరెను కాంతుని తలపై 60
[కామిని: ఇక్కడ వేశ్య]
ప్రేమ గలట్టి చోటునను వింతయె నిందలు గూడ నొప్పులౌ
క్షేమము గూర్తు రింపుగను జింత వహింపక వారి కెప్పుడున్
భామిని సత్యభామ పతి వామ పదమ్మునఁ దన్నఁ గిన్కమై
కామిని నూపురం బలరెఁ గాంతునకున్ దలమానికంబుగన్ 59
వలపుల కవధినిఁ గనరు జ
నులు పెరుగు నవి యలవడినను ధర యొసఁగినన్
వలసినవి దనియ కధికము
వలయు నను ఖలుఁడు సుజనుఁడు వలదను నెపుడున్ 58
కలవర మందు చుందుదురు కాపురుషుల్ మది దానమిం డనన్
సలలిత మిత్తు రుత్తములు చక్కగ విత్తము లార్త కోటికిన్
బిలబిల సాగుచుం బరుల వీటికిఁ గూటికి నర్థికోటి పో
వలయు ననంగ దుష్టుఁ డగు వద్దను వాఁడగు సజ్జనుం డిలన్ 57
అందము చిందించును మా
కందము భంగి నిల దెనుఁగు గారవ మొప్పన్
వందనము లిమ్ము తెనుఁగున
వందే మాతర మనుటకు వాక్యము సుకవీ 56
సందేహం బది యేల నిత్యము మహా శక్తిం బ్రదర్శింప ది
క్సందోహమ్ము చలింపఁ జాగె నట యక్కాలమ్ము దౌర్భాగ్య కే
లిం దుష్ట వ్రజ రాజ సంచయపు టాంగ్లే యాధిపత్యంబునన్
వందే భారతమాతర మ్మనుట దుర్వాక్యంబగున్ సత్కవీ 55
దుఃఖ మడరంగఁ బల్కిన దుష్ట భాష
ణమ్ము లవి యెల్ల నిక్కమ్ము సుమ్మనంగ
మించి యెల్లరు నన్ను మన్నించ నాదు
నేడ్పు విని మోద మందితి హృదయ మందు 54
నేఁడు సెలంగె సంతసము నిండు మనమ్మున మిక్కుటమ్ముగా
వేడుక కాదె జన్మ నిడ బిడ్డకు రాతిరి ప్రస్ఫుటమ్ముగా
నేడయి నంత దార ప్రసవించెను జక్కటి చంటిబిడ్డ నా
యేడుపు విన్న నా హృదయ మెంతయొ మోదమునందెఁ దృప్తిగన్ 53
స్వీయ దేశ మెల్లర కెంచ విశ్వ మందు
మాత నాఁ బిలువంబడుఁ బ్రీతితో వి
వాద సంజనక మహోగ్ర వాద సౌర
భ రత మాతకు జయ మనువాఁడె ఖలుఁడు 52
ఆరయ సత్య ధర్మ నిర తావని సంతత శాంతి కామి యీ
భారత దేశ మున్నతము పన్నుగఁ గొల్వుమ చిత్త శుద్ధితో
నీరిత దుష్ట భావమున నిద్ధర శాత్రవ దేశ మైనచో
భారత మాతకున్ జయము వల్కెడు వాఁడె ఖలుండు ద్రోహియౌ 51
ఎప్పటి వలె వర్షమ్మునఁ
దెప్పలుగఁ జెలంగి కూయ దిక్కు లదరఁగా
నప్పుడు సరోజములతోఁ
గప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్ 50
[అహి =జలము]
ఒకటికి నొక్కటిం బెనఁగ నొప్పును గుంభికి గడ్డిపోఁచలే
ప్రకటితమే లయమ్ము కదరా చలిచీమల చేత భోగికిం
జకచక నైకమత్యమునఁ జాగఁగఁ గాన మసాధ్య మెద్దియున్
బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను బాము గ్రక్కునన్ 49
జలద తోయ కణావృత విలసి తాభ్ర
సంజనిత ఘన సంచార సన్నుతమ్ము
సూర్య తప్త కాయ జనిత శోక జనుల
రంజిలఁగఁ జేయఁ గలదు ప్రభంజనమ్ము 48
దమన విలగ్న చిత్త యుత దైవగ ణేశ్వర చోదితుండునై
విమల మనో బృహద్బల వివేక మురారి నణంచ నెంచుచున్
సమదము గోకులార్తిదము సత్వ తరమ్ముగ విశ్వ మాన వా
ప్రమదముఁ గూర్చ వచ్చెను ప్రభంజన మెల్లెడ వీచి తీవ్రమై 47
[మానవ +అప్రమదము =మానవాప్రమదము]
కనవే యరాజకమ్ములు
వినవే విజ్ఞులు వచించ వినయము తోడం
గను నిన్నిఁక భగవంతుఁడు
కనకపు సింహాసనంబు గాడిదకె తగున్ 46
తనపతి కుండు నెన్నఁడు కృతజ్ఞతతో శునకమ్ము ధాత్రినిం
దనపతి బట్ట లెల్ల సువిధమ్ముగ మోయు నిరంతరమ్మునున్
వనరఁగ నేల గర్దభము వచ్చిన దంచును గ్రామసింహపుం
గనకపు గద్దె నెక్కుటకు గాడిదకే కలవన్ని యర్హతల్ 45
చంద్రశేఖరుఁ గైలాస శైల వాసుఁ
బార్వతీ సక్త వామాంగు ఫాలనయను
నాగ భూషణు నాట్యమ్ము నాఁ బరంగు
శ్రీసతీ పద మొత్తెడి శివునిఁ గొలుతు 44
[శ్రీ సతి = కీర్తి కాంత]
కేదారేశ్వరుఁ గాలకంఠుని హరున్ గీర్వాణ సంస్తుత్యునిం
గాదక్షఘ్ను సుధాంశు శేఖరుని నేఁ గైలాస సంవాసు గం
గా దారాగ్రణికిన్ సహోదరియు నా కాత్యాయణీ మాతయే
శ్రీదేవీ! పదపద్మ మొత్తెడి శివున్ జిత్తంబునం గొల్చెదన్ 43
స్కంధము లానుచు సౌహృద
గంధము ప్రసరింప నింపుగ మనమ్మున గ
ర్వాంధుఁడు కా కెన్నఁడు వా
గ్బంధములం ద్రెంచుకొనిన బంధు వనఁబడున్ 42
గ్రంథము లందు నివ్విధము కన్పడు నేరికి నైన వారు జ్ఞా
నాంధులు కాక యున్నఁ బరమాత్ముఁడు నిత్యుఁడు విశ్వ జీవ నై
కేంధన దాత జీవులకు నిద్ధర వెన్నుఁడు వాని కింపుగా,
బంధము లెల్లఁ ద్రెంచుకొన, బంధు వనంబడు లోక మందునన్ 41
సద్యో విద్యా పారీ
ణాద్య కవీంద్రర్షభ పరమామ్నాయ నభో
హృద్యాంశు సన్నిభుండవు
పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా 40
విద్యలు రావు వంశ గత విద్వ దమేయ పరంపరన్ భువిం
జోద్యముగా శ్రమించిననె చొప్పడు సద్గురు శిక్ష లుండఁగా
గద్యము నొక్క తప్పయినఁ గానక యుండఁగ వ్రాయ నేరఁడే
పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్ 39
తోయజ నేత్రను గాంచుమ
నీ యెదఁ జోటిమ్ము నాకు నెమ్మిని జాఁ గే
లా యివ్విధమ్ముగా రా
రా యను నను వీడి పోకురా యను రాయా 38
రాయఁడ నిన్ను గాంచి వర రాజకుమారి మృగేంద్ర మధ్యయే
వే యనురాగ మూని మది వింతగ నొక్క త్రుటిం జెలంగి తా
సోయగ మందు గర్వమున సుందర గాత్ర సమేత యౌవన
ప్రాయను నన్ను వీడకుమురా యను రాయ! పరాయణోక్తులన్ 37
[రాయ = రాయ బిరుదు కలవాఁడా]
స్యందన గజ తురగ బల
స్పందిత దే శావ నార్థ సన్నద్ధపు టా
క్రందమున భర్తలు సమసి
నం దనుల దహించిరంట నాఁటి పురంధ్రుల్ 36
[సమసినన్ + తనుల = సమసినం దనుల]
ఇంతులు నాఁడు కా రబల లెంచఁగ నింపుగ ధీర చిత్తలే
సంతత ధర్మ పాలికలు సద్గుణ రాశులు కోరినట్టి వి
త్తుం దమి నొట్టు నాఁ బలుకు దుష్ట జ నేతర మానినీ రమ
న్నందనులన్ దహించిరఁట నాఁటి పురంధ్రులు శీలరక్షకై 35
[నందనుఁడు = సంతోషించువాఁడు]
మనమున నింపుగ దైవ
మ్మును నిల్పి త్యజించి కోపమును మఱి నిత్యం
బనయేషణ నదికిన్ రౌ
తన తో శయనింప మౌని తన్విం గోరెన్ 34
[రౌతు+అన =రౌతన: రాతిచేఁ గట్టఁ బడిన యానకట్ట;
రౌతు = రాయి; అన = ఆనకట్ట]
వనితా రత్నము వచ్చి వేఁడఁ జరణ ద్వంద్వమ్ములం దాఁకి భ
క్తిని శాంతిం దగఁ గూర్చు దేవ యని సంకీర్తించి తా నిల్వఁగా
ఘన పుణ్యప్రద నిత్య మంగళసతీ కాత్యాయనీ సక్త చిం
తన తోడన్ శయనింపఁ గోరె నొక కాంతన్ మౌని పుణ్యాత్ముఁడై 33
కర్షకుం డొకండు కామధేను నిభము
లావుల నిటఁ జూప మని యడుగఁగ
విక్రయించు చోటు వీక్షించి వరధేను
రత్నములను విడిచి రాలఁ గొనెను 32
[విడిచిరి +ఆలఁ = విడిచి రాలఁ; ఆలు =ఆవులు]
రత్నము పుట్టు నింపుగను రాతినిఁ జక్కఁగ సానపట్టఁగా
యత్నము తోడ నాఁ దలఁచి యంచిత వర్తక పుంగవుండు దాఁ
బత్నిని వెంటఁ బెట్టుకొని పన్నుగ నేఱి మహానుభావుఁడే
రత్నపు రాసులన్ విడిచి రాలఁ గొనెన్ సుజనుల్ నుతింపఁగన్ 31
పదిలము కావని యక్కట
చదువమె వాడఁగ నొకట రసాయనము లిటుల్
పది మంది యీయక ఫలిత
మొదవులు కర్షకుల మోదమును దొలఁగించెన్ 30
[ఒదవు (విశేష్యముగ)= ఉపయోగము]
మది దయ నుంచ కింతయును మర్త్యులు భూతల జీవ కోటికిం
బదిలము గాంచ కించుకయు వర్తిలఁ గల్గు విపత్తు లిట్టులే
కుదురును గోలు పోయి కట ఘోర విషాప్పులఁ ద్రాగఁ జావఁగా
మొదవులు కర్షకప్రకర మోదమునుం దొలఁగించె నొక్కటన్ 29
విన్మా మిత్రమ కన నీ
కన్మును జాఁ గగు భృశముగఁ గావున నేఁడే
తన్మన మలరఁగఁ జేయుఁడు
సన్మానం, బేల కవికి సంక్రాంతి కిలన్ 28
జన్మాధిక్యుఁడు కాశ్యపేయుఁడు సహస్రస్యోన ధీరుండు కిం
చిన్మోహమ్ము వహించె నేమొ యన నిస్సీ బంధితుం డైన యీ
షన్మాత్రమ్ము బలమ్ము సూప కసిదంష్ట్ర ద్వేష్య వక్త్రమ్ములో
సన్మానంబు లవేల సత్కవులకున్ సంక్రాంతి పర్వమ్మునన్ 27
[అసిదంష్ట్రము = మకరము]
బోగినాఁడు కలసి పొలతు లెల్ల మురిసి
రేఁగు పండ్లు తెచ్చి రెచ్చి యంత
శుభము లెల్లఁ గల్గుచుండు బాలల కంచు
బోగి పండ్లు గురియ రోగమొదవె! 26
పరమ రహస్యమే యగును బన్నగ భూషణు చెయ్వు లెంచఁగా
నరులకు నే విపత్తులు ఘనమ్ముగ నెప్పుడు కల్గు నెవ్విధిం
గరము రయమ్ముగా విషము కంపముతో నికిలించు చుండియుం
గురియఁగ బోగి పం డ్లొదవె ఘోరముగా నొక రోగ మయ్యయో 25
[బోగి = భోగి = పాము]
విరహ చిత్తుల కిద్ధర వేదన నిడు
రాత్రిమణి దినమణి భంగిఁ జిత్రముగను
స్నేహ మలరఁగఁ బద్మ సమూహమునకు
దినమణియె శీతకరుఁడు చంద్రుని తెఱఁగున 24
వీర్య విహీన నిత్య ఘన భీర జనాలికి దూది యెంచఁగా
వార్యమ యౌను ప్రస్తర నిభమ్ముగ మోయ నశక్యమై ధరం
గార్యము లందు మగ్ను లగు కార్య రతాత్మ నరాలి కెంచఁగన్
సూర్యుఁడు చందమామ వలె శోభిలు శీతకరుండుగా దివిన్ 23
శృంగము లున్నవి చూడు కు
రంగం బది నిక్కముగను రమ్ము సఖా నీ
యంగమ్మున నచ్చోటన్
సింగము లేకున్న నెటుల సింహా! చలమౌ 22
[చలము = వణుకు]
స్త్రోత్రౌఘమ్ము పఠించి పూజ లిడ నస్తోకమ్ముగా భక్తినిం
బాత్రం బెంచి నిజాగ్ర్య భక్తతతిఁ గాపాడంగ వచ్చెం గదా,
చిత్రం బేమి నృసింహుఁడే వెలసి తచ్ఛ్రేష్టాద్రిఁ, దన్నామమే
చిత్రమ్మే కద సింహమున్ గనమటన్ సింహాచలం బందురే 21
నేటి విద్య తోడ నిస్సత్తువ సెలఁగు
విద్య మాట నింక వేలు పెఱుఁగుఁ
బిల్ల లైరి మోసి వీపున ఖరములు
పుస్తకమ్ములు ఖర భూషణములు 20
దుస్తులు వస్తు జాలములు తోరము కా గృహ మందు దాఁచగం
బుస్తక సంచయమ్మునకు బొక్కస మెక్కడ నుండు తల్చఁగన్
విస్తృతమై బయల్పడ భువిన్ వలలోఁగలి పాఠకాలికిం
బుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచి చూడఁగన్ 19
[ఖరము = వేడిమి; వలలోఁగలి = అంతర్జాలము]
అర్మిలి మ్రొక్క బ్రతికెదవు
చర్మము ధరియించి నీదు చావిట నాకున్,
మర్మ మెఱిఁగిన నరులు చెన
క ర్మము, నీ రూపు దాల్చి కనఁబడె నెదుటన్ 18
[చెనకరు + మము = చెనకర్మము]
ధర్మ విహీన మానవుల ధాత్రినిఁ గాంచమె మిక్కుటమ్ముగన్
దుర్మతు లుండ నే నకట దుర్గతి పాలగు టిట్లు న్యాయమే
నర్మము లేల ఖేదనమ! నాకు పురాకృత ఘోర పాప మ
త్కర్మము నీదు రూపమున కన్నుల ముందఱ నిల్చె నొప్పుగన్ 17
పెల్లుగ నిండంగఁ గడుపు
చల్లఁ గలిపి యన్నము దిన శర్వరి గడవన్
వెల్లివిరియకను మును చూ
పిల్లికి శ్రాద్ధమునుఁ బుడమివేలుపు వెట్టెన్ 16
[మునుచూపు +ఇల్లికి; ఇల్లి = ఉపవాసము]
కల్లలు పల్క నేల నపకారపుఁ జేష్టలు స్వార్థ బుద్ధియుం
బెల్లుగ నున్న యీతనికిఁ బ్రేమ దయాగుణముల్ సెలంగునే
తల్లికిఁ బిండముం దనిసి ధాత్రిని పెట్టని బిడ్డఁ డక్కటా
పిల్లికి శ్రాద్ధముం బుడమి వేలుపు వెట్టెను! శాస్త్రపద్ధతిన్ 15
[శాస్త్రపద్దతిన్: ఇక్కడ తల్లికి నన్వయముగా గ్రహించఁ దగును]
మానధనము మిన్న మానినులకు ధరఁ
బస్తు లున్న దాని వదలఁ గలరె
ధన విహీన యైనఁ దన దగు నభిమాన
ధనము వలదటంచుఁ జనునె తన్వి 14
ఘనముగఁ బెండ్లి కాఁగ జన కాయము మెచ్చగ వైభవమ్ముగం
జనుతరి వచ్చి నంతటనె సంచలితాత్మ సరోరుహాక్షి తా
మనమునఁ జింత నుంచక కుమారిక స్వీయజ నామి తానుబం
ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్ 13
కంటిని వర్ణించఁగ లే
కుంటిని బామెల్లఁ దొలఁగె నువిదను గనఁగా
నొంటిని మన మూఁగఁ దొడఁగెఁ
దుంటరి పరు గూని చెలఁగుఁ దోయలిఁ జేరన్ 12
మూర నుగ్ర కోపము సుతునిఁ బిల్తురు
గబ్బిలం బనుచును గాఁక తోడ
మూర సంతసమ్ము పుత్ర రత్నము వారి
కనుల విందొనర్చు గబ్బిలమ్ము 11
కనిన నమంగళం బనుచుఁ గాంతురు దుఃఖము లండ్రు వింత సూ
కను నట కూన నింపుగ మృగమ్ము నిభమ్ము తనూరుహద్వయ
మ్మున విహగమ్ము భంగి దివి మూరుచుఁ జాగు నధః శిరమ్ముగాఁ
గనులకు విందొసంగుఁ గద గబ్బిలమే తన సోయగమ్ముతో 10
ఘనుఁ డింద్రియ నిగ్రహఁడు సు
మనస్కుఁడు తపో నిరతిని మను వాఁ డంతం
దన భార్యను వీక్షించుచుఁ
దనతో శయనింప మౌని తన్వినిఁ గోరెన్ 9
[తన్వి = తనివి, తృప్తి]
ఘన సుశ్రోణినిఁ జంచరీకచికురం గంజాక్షి వీక్షించ నిం
తినిఁ గామార్తులు కాని వా రరుదు గాధేయుం డహో మేనకం
గని నిష్ఠం దప మాచరించుచుఁ దగన్ క్షత్రర్షి భావమ్మునం,
దనతోడన్ శయనింపఁగన్ బిలిచెఁ గాంతన్ యోగి, మోక్షార్థియై 8
ఓ యన్నా వాలీ విను
న్యాయమె యిది నీ యనుజున కలమట నీయన్
నా యాలిని, నేలుకొనుచు
నీ యాలిని, నా కొసఁగుము నీతిపరుఁడవై 7
ఓయీ యోడితి వింక లెమ్ము వడి రాజోగ్రుండ జూదమ్ము నా
నీ యుద్ధమ్మున మున్ను గెల్చినవి నా యీ సంపదోఘమ్ముతో
మాయల్ మాని నరేంద్ర స్యందన తతుల్ మత్కుంజ రాశ్వంపు, రా
నీ, యాలిన్ దగ నాకొసంగవలె నీ నీతిజ్ఞతన్ జూపుచున్ 6
[ఆలి =పంక్తి]
సిలికానాంధ్ర వారి సుజనరంజని పత్రిక:
ద్విసహస్రోత్తర వింశ తీరిత మహా విధ్వంస కీటమ్ములన్
వెస సంహారము సేసి నూతన సమావిష్టమ్ము తోరమ్ముగా
నొసఁగంగా వలె లాఘ వాయువుల నుద్యోగప్రమోదమ్ములన్
లస దాదాయ సమగ్ర విద్యలను మిత్రత్వమ్ము విశ్వమ్మునన్ 5
దుక్క వలె నుంటి వచ్చట నెక్కి బండి
కన్ను లున్నను నిల్చితి కానకుండ
దున్న పోతది వరిమేయఁ దూఱి పొలము
దున్నపోతని నిందింప దుఃఖమేల 4
[ఇక్కడ దున్నపోతు బండి మీద నున్నవాఁడా
లేక దున్నపోతా? ఏమో! శ్లేష.]
చాలుం జాలును మాట లాపు మిఁక నీ శాస్త్రంపు వాదమ్ములం
గా లాకాలము నేర వింతయును వాక్చాతుర్యముం గంటిమే
యీ లీలం జరియింప నేల నిట నీ వేహ్యమ్ముగా నయ్యొ రా
దేలా దుఃఖము దున్నపోతు వని నిందింపన్ సభన్ మిత్రమా 3
భూతలము లోన నగరము
లే తీరున గొప్పవి యగు నీ యూరుల కే
రీతి నయిన గణనమ్ముల
నూతన సంవత్సరమున నూటికి నూఱే 2
ఏతరి జూచినం బుడమి నెన్నఁడు మార వహర్నిశల్ నరుల్
సూతురె హెచ్చు తగ్గులను జొప్పడ వత్సర కాలమం దిలం
బాతది యెట్లు వచ్చెనొ యపారపు టాసలు జూపి యట్టులే
నూతన వత్సరమ్మునను నూటికి నూఱె యటంచు నవ్వెదన్ 1
[నూత్నారోగ్యద కీటకక్షయము = ఆరోగ్యము నిచ్చునదియు, కీటకమును
నాశము చేయు నట్తిది , టీకా]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి