16, మార్చి 2021, మంగళవారం

Kavita _ 2020

 

కవిత – 2020.

మతము జన సమ్మతము

 

మతముల పేరు కాని సామరస్య మను మాట కాని ప్రస్తావించక మతముల గు ణావగుణములను వివరించి మతముల యేకైక లక్ష్యమును నిరూపించు ప్రయత్మ మీ మతము జన సమ్మత మను ఖండిక. వచన కవిత్వమును దలపించు   ద్విపద మాలికలో రచన సాగుట గమనార్హము.

 

 

నిన్నుద్ధరించును నీ దగు మతము

తన్నుద్ధరించును దన దైన మతము

 

పగనెల్లఁ జంపును బదునైన మతము

పగవానిఁ జంపును బరుషంపు మతము

 

నడతను బోధించు నాణ్యంపు మతము

కడగండ్ల నిచ్చును గపటంపు మతము

 

దారినిఁ జూపించు ధర్మంపు మతము

పోరును గల్పించు మూర్ఖంపు మతము

 

శాంతినిఁ జేకూర్చు సత్యంపు మతము

పంతము పుట్టించు వ్యర్థంపు మతము

 

స్నేహమ్ము పెంచును జెలువంపు మతము

ద్రోహమ్ము తలపెట్టు దుష్టంపు మతము

 

ఓర్పును నేర్పించు యుక్తంపు మతము

దర్పమ్ము పెంచును దౌష్ట్యంపు మతము

 

దీక్షను గూర్చును దిట్టంపు మతము

కక్షను బుట్టించుఁ గఠినంపు మతము 

 

మననీయ నిచ్చిన మహనీయ  మతము

మనుజులఁ దరియించ మహనీయ మతము

 

మనసుల నలరించ మహనీయ మతము

మనమెల్ల నొక టన మహనీయ మతము

 

మర్మము శోధించ మహనీయ మతము

మర్మము తొలఁగించ మహనీయ మతము

 

దారులు వేరైన ధామము చేర్చుఁ 

దీరైన మతములు దివ్యంపు నెలవు 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి