సంతతము తన్ను సేవించు సతినిఁ గాంచి
భర్త యుప్పొంగు మిక్కిలి స్వాంత మందు
నుల్ల మందు నారయ సుంతయుఁ గపటంపుఁ
బ్రేమ లేని మగనిఁ జూచి భామ మురియు 62
ఇంతికిఁ బ్రీతి మిక్కుటమ యీక్షిత వస్తు గణ క్రయమ్ముపై
సంతత మట్టు లైన మఱి చాలునె పైకము లెన్ని యున్ననున్
వింతఁగ స్వీయ భర్తయును విశ్వమునం దని దుర్వ్యయమ్ములన్
సుంతయుఁ బ్రేమ లేని పతిఁ జూచి సతీమణి పొందు మోదమున్ 61
అడుగ వాధార పత్రమ్ము నసమ నేత్ర!
నిత్తెపు నగదు లెక్కయు నీలకంఠ!
వఱలి ముఖ చిత్ర మడుగవు పంచవక్త్ర!
వరము లిడి దుష్టులకు శివ వాసిఁ గంటె 60
[దుష్టులకు (న్); నిత్తెపు నగదు లెక్క (నినలె) = PAN]
పరమ శివా నుతింతు నని ప్రార్థన సేసినఁ జాలుఁ బొంగుదే
పరఁగితి వీవు బాణునకుఁ బ్రాణ సఖుండవునై గిరీశ్వరా
నిరతము భస్మ దైత్యునకు నెమ్మి దశాస్య ముఖాసు రాలికిన్
వరముల నిచ్చి దుష్టులకు వాసి గడించితి వెట్లు శంకరా 59
వెలయ వలయు నిడిన పిదప
వలదు కలవర మర సున్నపడ లే దకటా
యిల దైవపేటి యనఁబడు,
తొలఁగు నఘము, “హుండి” నిడిన దోఁచిన సొమ్ముల్ 58
[ఇడిన పై నరసున్నపోకున్న “ఇడినఁ దోఁచిన యయి తోఁచిన సొమ్ము లని యర్థము]
అరుగును వేసి నట్టి జనుఁ డా నరకమ్మున కెంచి చూడ నె
వ్వ రిడిరి యన్న దెన్నఁడును బ్రశ్నము రాదిల దైవ దృష్టినిన్
సరి యగు భాషణంబ యిది సత్యము దోఁపిడి యైన వారివౌ
దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ జేజెకై 57
స్వాంతము చలింప భృశముగ
సంతత చౌర్య గుణ మానస న రాధముఁ డ
త్యంత సమీపమ్మున భూ
కాంతునిఁ గనినంత మొగము కాంతులు దప్పెన్ 56
కాంతుఁడు దైత్య సంతతికిఁ గయ్యము కోరెడు బాణుఁ డంత దు
ర్దాంత రుషాగ్ని సంచలిత తప్తుఁడు వీరవ రానిరుద్ధుఁ దా
నంతట సత్యుషాంతికము నందు వినోద విలాస మగ్ను నా
కాంతునిఁ గాంచినన్ మొగము కాంతులు దప్పెఁ గళావిహీనమై 55
[కాంతుఁడు = కంతుని కుమారుఁడు, అనిరుద్ధుఁడు]
విశ్వమందు నేఁడు వినమె విశ్వామిత్రు
భంగి సృష్టి సేయ వఱలె శక్తి
గిఱ్ఱునఁ దిరుగుచు మృగీకరణ మహిమం
జెక్కినట్టి బొమ్మ సేసె నటన 54
[మృగీకరణము = animation]
ఎక్కటి రూప సంపదల నెల్లరు మోహ మనోఽరవిందులే
వాక్కర ణాత్య యానిమిష వారము తత్పురుహూత ముఖ్యులున్
మిక్కిలి సంతసింపఁగ నిమీలిత రంభ విధాత యింపుగాఁ
జెక్కిన బొమ్మ చిత్రముగఁ జేసెను నాట్యము నెల్ల వీథులన్ 53
ఈ జన సందోహము నిజ
భోజన కాంక్షా యుత మయి మూరి చరించున్
వ్యాజ మృగబలి సమాహిత
పూజల నిరసించువాఁడె మోక్షము నందున్ 52
రాజకులావతంసుఁడు నరవ్రజ యోగ్యుఁడు బుద్ధిమంతుఁడున్
నైజ మనోనురాగుఁడు ననన్య దయాంబుధి దానశీలి వి
భ్రాజిత పుణ్యశీలి నయ బద్ధుఁడు భక్తుఁడు నెన్న వాఁ డహో
పూజల రోయు నాస్తికుఁడె పొందును మోక్షము నిశ్చయమ్ముగన్ 51
[నాస్తికుఁడె? : కాదు]
పద్యభారతి వారి రామాయణార్థములో భీమ, నకుల, కర్ణ, కృప పదములు:
భీమ ముని జన కుల దమన
కామ దనుజుఁడు విగత కృపఁ గాకుత్స్థ సతీ
భామిని నాకర్ణనమున
నా మూర్ఖ దశాననుఁ డపహరుఁడై చచ్చెన్ 50
బలరిపుం డింద్రు వీక్షింప వచ్చినట్టి
దేవమునులను గని శచీ దేవి నిత్య
తరుణి పౌలోమియె పతివ్రతా మతల్లి
యింద్రసతి భానుమతి మ్రొక్కె నెల్లరకును 49
[భానుమతి = ప్రకాశించునది]
ఇంద్ర సతీ సమాన తరళేక్షణ సువ్రత చారుశీల దే
వేంద్ర పురాభ పట్టణవ రేశ్వర వల్లభ గాంచి వ్యాస మౌ
నీంద్ర వరద్విజావలిని నింపుగ నంతట ధార్తరాష్ట్రు రా
జేంద్రుని భార్య భానుమతి యెల్లరకుం బ్రణమిల్లె భక్తితోన్ 48
ఎదురుగ వచ్చి రయమ్మునఁ
జదువఁగ బడికి నిలువ వరుసను విత్తముఁ బం
చెద రనఁగ బద్దకమ్మునఁ
గదలనివాఁడె పరుగెత్తెఁ గడు వేగమునన్ 47
వదలకు మాగు మాగు మనఁ బాఱఁగ నేర్చిన వాఁడు నిల్చునే
యెదిరిప జాగరూకత వహించుట నీ కగు న్యాయ మెత్తరిన్
విదిలిచి నీ కరాంబుజ మభీతిని, నించుక యైన నేని నీ
కదలఁగ లేనివాఁడు, వడిగం బరు వెత్తుట చోద్య మెట్లగున్ 46
[నీకు + అదలఁగ = నీ కదలఁగ; అదలు = బెదరు]
ఈయఁగ సమస్య నొక్కటి నివ్విధముగఁ
“గోడినిన్ మ్రింగె నొక కోడి సూడ జనులు”
చెలఁగి బూరింతు రివ్విధి శీఘ్రముగఁ “బ
కోడినిన్ మ్రింగె నొక కోడి సూడ జనులు” 45
[నేను బూరింప నేల యనినఁ బకోడి యన్య దేశ పదము]
వేడుక మీఱ నొక్కటిని వే దిగి తమ్ముల యింట నేర్పునన్
గోడను దూకి యన్యమును గొక్కొకొ యంచును మోసపుచ్చుచుం
బాడిగ వండ నింటఁ దమిఁ బట్టఁగ నీటిని నేల రెంటి నీ
ర్కోడినిఁ గోడి మ్రింగెఁ గనుఁగొన్న జనుల్ సహజమ్మటందురే 44
ఇందఱిలో నేల శివుని
నంద ఱడుగ వలె నలసమె యా యద్రి విషం
బందేల పుట్ట వలె నని
మందరపర్వతము నొక్క మానిని దిట్టెన్ 43
[ఇక్కడ మానిని పార్వతీ దేవి చెలికత్తెలలో నొకతె]
అందఱు చూచు చుండగ ననర్హను నిందల కేను మిన్నయౌ
సుందర వృత్తి నుండ నిలఁ జోద్య మకారణ మక్క టక్కటా
కంద మనమ్ము మిక్కుటము కర్కశ రీతిని నన్ను జూడు మా
మందరపర్వతంబు నొక మానిని నింద యొనర్చెఁ గిన్కతోన్ 42
మీనములఁ దిన నెదఁ దల్చె మీన నయన
కాన రాకున్న వెదకంగ మేను బడలె
నుస్సు రంచును గుండలో నున్నయట్టి
నీరమునుఁ ద్రాగె జలజాక్షి నెత్తు రనుచు 41
[జల జాక్షి = చేపల జంట; జలజము = చేప; అక్షి = రెండు]
మత్తున నుండు సంతతము మానక నా పతి యంచు నేడ్చుచున్
నిత్తెము దాను గ్రూరముగ నింద లిడంగ సహింప నేరకే
యత్తఁ దలంచి డెందమున నక్కసుతోఁ బగ దాని యెఱ్ఱనౌ
నెత్తు రటంచుఁ ద్రాగె నొక నీరజలోచన స్వచ్ఛ నీరమున్ 40
అన్యమ్ము లుండఁగా సా
మాన్యమ్ముగ జాతకమున మహిమం జెపుమా
మాన్యా యేయే గ్రహములు
కన్యం గూడంగఁ దొలఁగు ఘన పాపమ్ముల్ 39
మాన్యంబే మన సాంప్రదాయ మిల ధర్మం బందు నిల్చుం దగన్
ధన్యంబై నిజవంశ మింపుగను, సంతా నార్థమై ప్రీతి మా
నిన్యౌఘ ప్రవరం గటంకట సుసాన్నిధ్య ప్రదత్తాంగనం
గన్యం గూడినఁ, బాపముల్ దొలఁగి మోక్ష ప్రాప్తియౌ నందురే 38
కాననముల నెల్లఁ గట్టెల కింకను
నిల్వఁ గొట్టఁ గినిసి వెల్వడంగ
మ్రింగ నుత్స హించి చెంగున బలిసిన
మేఁకనుఁ గని జడలమెకము వాఱె 37
వీఁకను దిర్గుచుండును దివిన్ ఘన రాశులు సంతతమ్మునుం
బ్రాకట రీతిఁ గాంచ నొక వాసరమం దిటు లుండఁ గేతువున్
వే కన మేష రాశి శశి వేఁగుచు నిల్వఁగ సింహ రాశిలో
మేఁకనుఁ గాంచి సింహ మదె మ్రింగు నటం చుఱికెన్ భయమ్మునన్ 36
ముఖ్యముగ నెంచ రఘు రామమూర్తి విశ్రు
తాఖ్య జప గరిమఁ బెరిగె నట జనులకు
సఖ్యము రవంత దుఃఖము, చాల కల్గె
సౌఖ్యమే, లేదు రామరాజ్యమ్మునందు 35
ఘనపు టుపద్రవమ్ము సెలఁగం బురి నప్పుడు భద్రు రాహు కా
ల నిగది తోక్త వాక్యముల రాఘవ హృద్విలసన్మనో రమా
వనిజ బహిష్కరించి యనుపన్ వని కక్కట దుఃఖ తప్తులౌ
జనులకు రామరాజ్యమున సౌఖ్యము సుంతయు లేదు లేదుపో 34
తోడుండఁగా సరస్వతి
గోడులు తీర ధనలక్ష్మి కోపము తోడం
గూడదె యెంతగఁ గొల్చినఁ
గోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్ 33
వీడక చుట్టు తిర్గుచును బ్రీతినిఁ గూర్చెడి స్వీయ పుత్రుఁడే
నేఁడు సతీ వశుండు నయి నిత్యము కొంగును బట్టి తిర్గఁగా
నాడ మనమ్ము సంతతము నత్యధి కార్తినిఁ గుందు చుండఁగాఁ
గోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకు నైన సాధ్యమే 32
దైత్య బృందము ద్వేషించె నిత్య మబ్జ
నాభుని హరిని సంత తానాథ శరణు
శుద్ధ భక్తిని నమరులు, చూచు చుండ
హరిని శరణమ్ము వేడి, రసుర గణమ్ము 31
దైత్య బృందము ద్వేషించె నిత్య మబ్జ
నాభుని హరిని సంత తానాథ శరణు
దక్ష జాత్మనాథుని సంతత కరుణా ల
హరిని శరణమ్ము వేడె నసుర గణమ్ము 30
హరి తానంచు విభీషణుం డెఱిఁగి రామాఖ్యున్ నుతించెన్ హరిం
గరి రక్షా రతుఁ బూజ సేసి రల రక్షః కోటి మున్నెందఱో
యరిషడ్వర్గముఁ ద్రుంచి సంతతము ప్రహ్లాదాది దైత్యార్భకుల్
హరి నీవే శరణంచు వేఁడిరఁట దైత్యశ్రేణి సద్భక్తితోన్ 29
అపకారమ్ములు సేసెడు
నెపమునఁ జేయకుమ మేదినిని నే పూజల్
విపరీతమ్ములు ఘోర కు
జపతపముల విడుచు వాఁడు సద్గతి నందున్ 28
విపుల దయాగుణుండు నగు వెన్నునిఁ గొల్వ సతం బపారపుం
గృప నొసఁగంగ మాధవుఁడు హీన భవౌఘము నాశ మందఁగా
నృపవర! యింద్రి యార్థముల నెల్లను నిష్ఠను, మానకుండఁగా
జప తపముల్, ద్యజించి చను సాధకుఁ డందును సద్గతిన్ వెసన్ 27
భాగ్యనగరమ్ము విలసిల్లు భద్ర గతిని
భార తావనిఁ బన్నుగ వఱలు చుండి
పరఁగుచుఁ గొలంబొ నా ముఖ్య పురము, కాదు
హైదరాబాదు, గలదు సింహళము లోన 26
సోదరుఁ డాక్రమించె ఘన శూరుడు రావణుఁ డీపురమ్మునున్
గాదిలి విశ్వకర్మ మఱి కట్టఁ గుబేరుఁడు నుండ నింపుగా
మేదిని లంక నా పురము మించఁగ శోభలఁ బెక్కు భంగులన్
హైదరబాదు సింహళము నందలి పట్టణమౌ నిజంబుగన్ 25
[హైదరాబదు(న్)]
జీవ లయ కార్యము దలంప శివుని లీల
యొక్కరికి నొక్క కారణ ముండ మృతికిఁ
జంపు వా రాయుధమ్ములె శంకరునకు
రుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను 24
క్షుద్రుని వంశ నాశకునిఁ గ్రూరుని నన్యపు టంగ రాశియే
భద్ర మవధ్యమై తనరఁ బార్థుని సన్నను గాంచి యంతటన్
ఛిద్రము సేసి యూరువుల శీఘ్రమ భీముఁడు భీకరాకృతిన్
రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా 23
కడు భారం బయ్యె నిపుడు
గడవ దినమ్ము లిఁక డబ్బు కఱవే కాఁగా
నిడరే వేతనములు రా
బడి లేదని పంతులయ్య వలవల యేడ్చెన్ 22
కడు ఘోరం బగు విద్య నేర్వఁగ మహా క్షామం బిటన్ నీటికిన్
విడు మీ దాహపు మాట నీర కణమున్ వీక్షింపఁగా శక్యమే
బడిలోఁ బిల్లల కాళ్లు చేతుల కహో ప్రక్షాళ నార్థంబుగాఁ
బడియే లేదని పంతులయ్య గడు దౌర్భాగ్యుండునై యేడ్చెరా 21
[పడియ = నీళ్లు నిలిచిన చిన్నపల్లము ]
రవి తుల్యుండు వినూతన
వివి ధాంశ విశేష గుప్త విజ్ఞానమునం
గవి కావలెఁ దగ దిట్లనఁ
గవి! యవధానమ్ము లింతగా సులభములా 20
పారావార సమాన ధారణ పదప్రామాణ్య విజ్ఞానుఁడున్
ధారా సంయుత పద్య కల్పన మహా దార్ఢ్యాది సంయోగుఁడున్
దూరాలోచన శక్తి యుక్తుఁ డయినం దోరమ్ముగా ధాత్రిలో
నౌరా సత్కవి యింతగా సులభమా యష్టావధానం బనన్ 19
చనిచని వేగముగ నలయ
దిన మధ్యము సేరినంతఁ దీక్ష్ణతరముగాఁ
గనలఁగఁ జేయఁ బ్రచండుఁడు
దినమణి, గుఱ్ఱములు పాఱె దిక్కున కొకటై 18
పనిగొని యంత మార్కొని నభస్సద ముఖ్యుల నొక్క రొక్కరిం
దన వర వీర్య దర్పమునఁ దంపి నిమిత్తము సూర్య లోకముం
గొనకొని రావణాసురుఁడు క్రూర మనస్కుఁడు ముట్టడింపఁగా
దినమణి యేడు గుఱ్ఱములు దిక్కున కొక్కటి పాఱె భీతితోన్ 17
వీర్యాతిశ యోద్ధత దు
ష్కార్యాసక్తుండు నయి విషయ లోలుండై
మర్యాద గణింపక పర
భార్యను బ్రేమించువాఁడు భ్రష్టుండె యగున్ 16
కార్యము విస్మరింపగను గాదు నిజాంబను భార్య వచ్చినన్
ధైర్యము తోడ సాఁకుమ సతమ్మును నిద్దఱి నొక్క తీరు నౌ
దార్యము వీడి నొవ్వు లిడఁ దల్లికి నిత్యము క్రూరురాలునౌ
భార్యను బ్రేమతోడఁ గనువాఁడు నిజమ్ముగ భ్రష్టుఁడే యగున్ 15
కండ బలము మిన్న యండ కలదు వాని
కర్థ మందు ధనదుఁ డౌను భువిని
నిజము సెప్ప కన్న నేర్పున నోర్పునఁ
గల్ల లాడు, వాఁడె బల్లిదుండు 14
ఉల్లం బందును నిల్పి శ్రేయమును సద్యోగమ్ము నాశించుచుం
గల్లోలం బిడు సత్యవాక్కులను బల్కన్ వాఁడు శత్రుండు సూ
సల్లాపంబుల నిత్య మాత్మ కతి హర్షం బిచ్చు ప్రీత్యుక్తులౌ
కల్లల్ వల్కెడు వాఁడె బల్లిదుఁడు వెన్కన్ నవ్వు వాఁ డాప్తుఁడౌ 13
భామకు లొంగి భయంకరుఁ
డై మను జాధిపతి పంప నడవికి సుతునిన్
రాముని దయ వీడి, కనలి
రాముఁడు భీష్ముని కొడుకని వ్రాసెఁ గవి దగన్ 12
[భీష్ముఁడు = భయంకరుఁడు]
క్షేమద విఘ్ననాథు శశిశేఖర రక్షితు శ్రీ లసన్మహా
భీమ భుజంగ సూత్రు పరివేష్టిత నిర్జరు కుంజరంపుఁ బె
న్మోము గలట్టి వాని వరమూషిక వాహను భక్త మాన సా
రాముని తండ్రి భీష్ముఁ డని వ్రాసెను ధూర్జటి భారతమ్మునన్ 11
[మానస +ఆరాముఁడు =మాన సారాముఁడు; భీష్ముఁడు =శివుఁడు; భారతము = భారత దేశము]
పద విన్యాస ప్రతిభా
విదథ మహా కావ్య చయము విష యాధీ శా
విది తానాదర మైనం
బదుగురు మెచ్చెడి కవితల ఫలమేమి కవీ 10
సదమల శబ్ద భావ యుత చారు తరార్థ వరోపమాన సం
ప దతులి తావతంస సువిభాసిత భవ్య మనోజ్ఞ సత్కథా
విదిత రసాన్వి తోన్నత పవిత్రము లర్థ విహీనమైనచోఁ
బదుగురు మెచ్చు పద్యముల వ్రాసిన నేమి ఫలమ్ము సత్కవీ 9
[అర్థము =1. శబ్దార్థము 2. ధనము]
రాకలు పోకల వలనం
జేకుఱు నెల్లరకు హాని శీఘ్రమ యంచున్
వీఁకను నీ చాత్ములకున్
సాకుల్ వచియించి తొలఁగు సజ్జనుఁ డెపుడున్ 8
ఆఁకలి గొన్న వాని కిల నన్నము మేలొన రించు రీతినిన్
వ్యాకుల చిత్త మానవుని నారసి జాలిగ మూర్ఖ చిత్తు జ్ఞా
నాకరుఁ డెల్లఁ దాఁ దలఁచి నట్టిది యింపుగ, నాలకింప కే
సాకులఁ, జెప్పి తప్పుకొను సజ్జనుఁ డెల్లరు మెచ్చు రీతిగన్ 7
స్వామి భక్తిని నిల్పుచు సంతతంబు
వాని యాజ్ఞ దృఢమ్ముగ వఱల డెంద
మందుఁ గర్తవ్య పాలన మందుఁ గాంచఁ
గఠిన చిత్తులు గద తెలంగాణ ప్రజలు 6
పుడమిం గాంచఁగ మానవౌఘము సతంబున్ స్వీయ లాభమ్మునే
యెడఁదన్ నిల్పి చరించు నిక్కముగ లేదిం దెట్టి సందేహమే
సడలం బ్రేముడి నాయకవ్రజపు వాక్చాతుర్య బద్ధాత్ములై
కడు కాఠిన్య మనస్కు లౌదురు తెలంగాణా ప్రజల్ సూడఁగన్ 5
శిబిని మించెను భువి దానశేఖరుండు
కోరఁ గవచ కుండలములు కోసి యిచ్చెఁ
దలఁచుచు నిరంతరము ఘను దాన కర్ణు
సొగసునన్ మేటి వందురు సూ కరమును 4
[కరము =చేయి]
పెగలిచి దుష్ట దానవుని, వెన్నుని లీలల నెంచ శక్యమే,
తగలిచి భూమి దంతమునఁ దద్దయు నేర్పున నెత్తి కావఁగా
నగణిత వీర్య దంష్ట్ర బల యజ్ఞవరాహము నెన్ని భక్తినిన్
సొగసున సాటి రావనుచు సూకరమున్ నుతియింత్రు సజ్జనుల్ 3
చుట్టు నున్నట్టి పిల్లలు దట్టముగఁ బె
రుఁగ వలయు నంచు నెంచుచుఁ దగ నెడంద
గెలను గొట్టి నైపుణ్యమే యలర నరఁటి
తల నఱుకఁ గాంచి మెచ్చిరి తగిన పనిగ 2
కలవర మీయ నెల్లరకుఁ గాఱియ పెట్టుచు నాగ కుండఁ జూ
పులు మఱి త్రిప్పకుండ నలవోకగ మిత్రుఁడు పల్కుచుండఁగా
నల పన నేర కుండఁగ నిరంతర మచ్చట స్వీయముల్ బొగ
డ్తల నఱుకంగఁ గాంచి బహుధా స్తుత కార్య మటంచు మెచ్చిరే 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి