శ్రీవత్స వక్షో
విరాడాది లక్ష్మీ! పదాంభోజ సందీప్త మందాకినీ! శార్ఙ్గ కౌమోదకీ చక్ర నిస్త్రింశ
శంఖాది దివ్యాయు ధానీక హస్తాబ్జ గంభీర శుభ్రాభ్ర
మేఘాభ నీలాంగ నిశ్చేష్టి తాలోక లోకాలి
తప్తాభ్ర కోటీర కేయూర కర్ణాంక దివ్యప్రభా సోజ్జ్వలత్కౌస్తు భోపేత హారాలి
మంజీర కాంచీ కనత్కంక ణాబంధ కౌశేయ పీతాంబ రానంద చిద్రూప! చిత్తమ్ము నందుంచి
నింగొల్తు నిత్యమ్ము సద్భక్తిఁ గల్పంపు టంతమ్ము నందెల్ల లోకమ్ము లంభోధి మున్గంగ
ధ్వాంతమ్ము నిండంగ నీకుక్షి లోనుండ విశ్వమ్ము సూక్ష్మంబుగా నుండి రక్తంపు వర్ణంపు
నీ కాలి వ్రేలుండ నీ నోటిలో నిండి చిత్రమ్ముగా మఱ్ఱి పత్రమ్ముపైఁ గ్రీడ నీ వాడు
చుండంగ నా లీల వర్ణింప శక్యమ్మె వేదమ్ము లింపార దుర్దాంత మత్స్యంబవై సోమకుం దోయ
సంచారకుం జంపి రక్షించితే, భీమ శైలాభ కూర్మంబవై తాల్చితే మంథమున్ శైల రాజేంద్రమున్, దంష్ట్ర భీభత్స సుశ్వేత కోలంబవై త్రుంచి యంభోధిఁ గ్రూరున్
హిరణ్యాక్షు లోలాక్షు భూదేవిఁ గాపాడితే, సందె వేళన్ నృసింహుండవై యుగ్ర రూపమ్మునం జంపితే దైత్య
నాథున్ హిరణ్యాశనున్ భగ్న నీచాశునిన్, వామ నాకారముం బూని
దైత్యేంద్రు వైరోచనున్
సమ్యగాలోచనుం ద్రొక్కితే, భార్గ వామ్నాయ రాముండవై రాజలోకమ్ము గర్వాంధ తోత్తీర్ణ
నాకమ్ము నిశ్శేషముం జేసితే, వీర కోదండ రాముండవై చంపితే రావణున్ లోక విద్రావణున్, రామ నాముండవై శౌరివై భూమి భారమ్ము నస్తోక భారమ్ము
విచ్ఛేదముం జేసితే, బుద్ధ దేవుండవై మాన వోద్ధారముం దుల్య మందారముం జేసితే, నీవ కృష్ణుండు విష్ణుండవే కల్కి నా నింక రా నుంటివే ధర్మ
రక్షార్థమై నాథ! కృష్ణుండు నా మీఱి గోపార్భ సంఘాత విధ్వంస దుష్పూతనా స్తన్యముం
గ్రోలి ప్రాణమ్ములం దీసి, పెన్బండినిం దన్ని, యాకాశ వీధిం దృణావర్తునిం గూల్చి, మన్నేల భక్షించితే యన్న నీ నోటనుం జూపితే మాతకున్ విశ్వ
సందోహమున్, మద్దెలం
గూల్చితే,
వత్స రూపంపు ఘోరాసురుం జంపితే, వ్యాజ వేషున్ బకోటాసురుం జంపితే, భీక రాఘాసురుం జంపితే పద్మసంజాతు దర్పమ్మునుం ద్రుంచితే, కాళియుం డుండఁ గాళింది మర్దించితే, ఘోర దావాగ్ని వే మ్రింగితే, లీల గోవర్ధనం బెత్తి దేవేంద్రు గర్వమ్ము వో గొట్టితే, నందు శ్రద్ధావతిం జేరి తోడ్తెచ్చితే, వల్లవీ కాంతలన్ రాస లీలాదులం దన్పితే, శంఖచూ డాఖ్యునిం ద్రుంచితే, సౌర భారిష్టునిం జంపితే, కేశి నామాశ్వకవ్యోమ దైత్యోగ్రులం జంపితే, చాకలిం జంపితే, కుంజరక్రూరు భంజించితే, మల్ల చాణూరునిం జంపితే, మామ కంసున్ ధరా బాల హింసున్ దురాత్మున్ సులీలం దెగంజూచితే
తల్లికిం దండ్రికిం గార మాన్పించి పూజించితే తాతకుం బట్టముం గట్టితే కుబ్జ కా
వక్రముం బాపి పుత్రుం బ్రసాదించితే, రుక్మిణీ దేవితో నష్ట సద్భార్యలం బొందితే యింక
నష్టద్వయమ్ముల్ సహస్రమ్ములున్ భార్యలం బొందితే యేక కాలమ్ము నందుం బ్రకాశించితే
వారి సౌధమ్ము లందుండి నిత్యారియౌ దామఘోషుం దదాత్మీయుఁ డౌ దంత వక్త్రాఖ్యునిం జంపి జన్మత్రయాంతమ్ము
వారిద్దఱిం జక్క వైకుంఠ లోకమ్ము నన్నిల్పితే శుద్ధ గీతా పరిజ్ఞాన మందించి రక్షించితే
పార్థు నీమాయ నే మందు విశ్వేశ! చండప్రచం డాంశు సాహస్ర భానుండు పేయూష సాదృశ్య
శీతాంశు చంద్రుండు నీ నేత్ర చిత్తమ్ములై యుండ, మున్నీరు మామయ్యె, భూమాత యర్ధాంగి, కంజుండు పుత్రుండు, నీశుం డభేదుండు, నీవుందు వన్నింట నిక్షిప్తమై వింత, నీ లేని లేశంబు శూన్యంబ కాంచంగ, క్షీరాబ్ధిఁ దాఁ బుట్టి శ్రీలక్ష్మి కాకుత్స్థుఁ డీ వైన
వైదేహి తానయ్యె, శ్రీకృష్ణుఁ
డీ వైన వైదర్భి తానయ్యె, లోకాల నేలంగ నిత్యమ్ము నీవుండఁ జేదోడు
వాదోడు తానయ్యె నెన్నండు, నాతల్లితోఁ గూడి దేవాది దేవా చిదానంద సమ్మోహ నోత్సేధ! పద్మాక్ష! మూర్తిత్ర
యైకైక భావమ్ము నీయంద వర్ధిల్ల నిన్నెంచ లేరన్న శేషాహి వాగీశ గౌరీశ దేవేంద్రు
లింతైన నే నెంత నీపాద దాసుండ నీ దాస దాసుండ నా మోహముం ద్రుంచి, నీభక్తినిం బెంచి, నన్నేలు నిత్యమ్ము, నిం దక్క నేనేర నిం కెవ్వరిన్నాదు చిత్తమ్మునన్ దేవ! నామాంత
రోద్భాస నామాలి భూలోక వాసౌఘ సిద్ధౌఘ సాధ్యౌఘ యక్షోర గాశ్వాంగ నీడోద్భ వానీక
విద్యాధ రాదిత్య గంధర్వ మున్యోఘ దేవాది సంపూజి తాంఘ్రిద్వయా! దైత్య సందోహ
విధ్వంసకా! దుష్ట సంహారకా! శిష్ట రక్షైక దీక్షాగ్ర గణ్యా! దయాసింధు!
సాక్షాద్విరాడ్రూప! వైకుంఠ సద్వాస! లక్ష్మీశ! నిన్నెంచి నే మ్రొక్కెదన్
మ్రొక్కెదన్ మ్రొక్కెదన్.
ప్రబల రచనా ధురంధర | నిబిడీ కృత మోద భరిత నిర్మల చిత్తున్ || స్తబక నిభ కవన చయ రత | విబుధ వర విధేయ సత్కవి జనాసక్తున్ ||
7, జూన్ 2021, సోమవారం
Sri mannarayana Dandakamu.
శ్రీమన్నారాయణ దండకము.
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి