ఏ తఱిని దాఁచ రానివి
భూ తలమునఁ గొన్ని యుండుఁ బూరుషుఁ డొక్కం
డే తా దాఁచఁగ నట్టిది
యా తిరు మంత్రమ్మె యుసురు నాహుతిఁ గొనియెన్ 63
భీతి యొకింత లేక యవివేకపుఁ జింతన సాహసమ్మునం
జూతమె యేమి యౌనొ యని శూరత దానిని నాచరింపఁగా
నాతని కంతఁ బాటిలఁగ నాపద ఘోరము కన్ను మూసెనే
యా తిరు మంత్ర మొక్కటియె యాహుతి గొన్నది నిండు ప్రాణమున్ 62
[మంత్రము = ఆలోచన ]
కమలాక రాంబువుల పై
న మండు చున్నను భృశమ్ము నైజం బెంచం
గమలాకరమున నంభో
జమునకుఁ గ్రిందనె కలదఁట చల్లఁదనంబే 61
క్రమముగ నాటఁ జెట్లను సుఖం బిడు మానవ జాతి కిద్ధరం
గమలఁగ మేను లెల్లరకుఁ గందఁగ నెండయె మండు చుండఁగా
సుమములు పత్ర శాఖ లటఁ జొప్పడఁ జుట్టును విస్తరింప క్ష్మా
జమునకుఁ గ్రింది భాగమునఁ జల్లఁదనం బట చూచితే కవీ 60
వటువు రూప మూని బలిచక్ర వర్తిని
దాన మడుగ విరివి దానవుండు
మూరి దాన మొసఁగె నారాయణున కని
బలినిఁ బొగడె విష్ణుభక్తుఁ డొకఁడు 59
జలద నిభాంగ పద్మ దళ చారు విలోచను బద్మ నాభు భూ
వలయ నివాస జీవ చయ భక్త జనావన సక్త చిత్తుఁ జే
తులను మొగిడ్చి యా భవ విదూరుఁ జతుర్దశ విశ్వ రాణ్మహా
బలిని నుతించె విష్ణుపద పంకజ దాసుఁడు క్షుత్పిపాసతన్ 58
బాల్యము నుండి రిపుఘ్నఁడు
కాల్యాలోచన పరుండు కంసారియు నా
కల్యాణప్రదుఁడు విగత
శల్యుం డర్జునునకు రథసారథి యయ్యెన్ 57
[విగత శల్యుఁడు = వీడిన బాణము గలవాఁడు]
కల్యాణమ్ము నొసంగఁ బార్థునకు సంకల్పించి స్వీయాత్మ వై
కల్యుం జేయఁగ నెంచి గర్ణుని నటం గౌంతేయుఁడే కోరఁగాఁ
దుల్యుండై తగఁ బార్థసారథికిఁ దా దుష్టాంగ భూనేతకున్
శల్యుం డయ్యెను బార్థ సారథిగ నా సంగ్రామమం దొప్పుగన్ 56
[పార్థసారథి = 1. కృష్ణుఁడు 2.రాజునకు సారథి]
వర క వీభములకు నెంచ హరి యితండు
కవన వనమందు విహరించు కరి యితండు
కరి వర సదృశుం డగుఁ గాన గిర లివి సరి
గఱిక పాటి సేయఁడు గదా గరికిపాటి 55
తఱచు కవి వరుండు తనదు తర్క మింకఁ గవనమున్
వెఱపు లేక చూపు చుండ విబుధ జనులు మెచ్చఁగా
నఱిముఱి యెదఁ జెలఁగఁ గొంద ఱందు రిట్లు చలమునన్
గఱిక పాటి సేయు నొక్కొ గరికిపాటి సూడఁగన్ 54
అరసినఁ గపటం బెన్నిక లందుఁ గరము
పెరిగిన విభుల స్వార్థమ్ము ధరణి యందుఁ
దఱిఁగిన నవకాశమ్ములు దద్ద యింక
వలదనుచుఁ గోరుదురు ప్రజాస్వామ్యము నిట 53
ఇలలో రాచరికమ్ము మున్వెలిఁగె దేవేంద్రాభ రాజన్యులే
విలసిల్లంగను ధర్మ రక్షకులునై వీక్షింపఁగా నేఁడు రా
వలె నంచున్ జను లెల్లఁ గోరిరి ప్రజా స్వామ్యమ్ము దేశమ్మునన్
వలదంచున్ జను లెల్లఁ గోరిరి ప్ర జాస్వామ్యమ్ము దేశమ్మునన్ 52
ముజ్జగములకు రక్షణమ్మును దలంచి
తపమునకు నింతయిన ఫలితమ్ము నొసఁగ
నజుఁడు వర మీయ కున్నచో నవ్విధమ్ము
కుంభకర్ణుని కంటికి కునుకె రాదు 51
నినదమ్ముల్ శ్రవణమ్ములం బఱచినన్ నిర్ఘాత తుల్యమ్ములన్
ఘనశూలమ్ములఁ బొడ్చినం గరులఁ ద్రొక్కం జేసినన్ మేనునన్
ఘన నిద్రా రతు లేప నెవ్వరికి రక్షఃకాంతుఁ, బ్రాప్తించినం
గునుకే, రాదట కుంభకర్ణునకు లోకుల్ నమ్మి రీ మాటనే 50
కుక్కుట మనఁ గోడి మఱియుఁ
గుక్కుయుఁ గుక్క యనఁ గాదు కోడి కనుక నే
రిక్కడ యనరా దివ్విధిఁ
గుక్కుటముల సమరమందుఁ గుక్కయె గెలిచెన్ 49
ఎక్కటి వింత యేరికిని నెవ్విధి నెమ్మదిఁ గల్గ నేర్చునో
కుక్కుట మన్నఁ గుక్క యని కూడ నెఱుంగుమ యర్థ మింపుగాఁ
గుక్కలు పోరఁ గాక మఱి కుక్కయె పోరున నక్క నెగ్గునే
కుక్కుటముల్ దలంపడఁగఁ గుక్క జయంబునుఁ గాంచె వింతగన్ 48
మెల్లగను బెండ్లి చూపులఁ
బిల్లను గని సమ్మతింప వింత దనర నే
నొల్ల ననఁగ నక్క తివిరి
చెల్లినిఁ బెండ్లాడె మెచ్చఁ జేరిన బంధుల్ 47
ఉల్లము లందు నెల్లరకు నుబ్బఁగ మోదము మిక్కుటమ్ముగం
గల్లల నాడ నే ననుచు గర్వ మెడందఁ జెలంగ బల్కుచుం
దల్లడిలంగ నేల యిటఁ దా రని తా ధృతి నేడ కూడ దం
చెల్లినిఁ బెండ్లియాడెనఁట చేరిన బంధువు లెల్ల మెచ్చఁగన్ 46
[కూడ దంచు+ ఎల్లిని= కూడ దం చెల్లిని; ఎల్లి = రేపు]
భువి నత్యాశం జెందం
గ వలదని వచింప నొక్క కథ నింపారం
గ వినిన మది యా కథ పా
ర్శవము దటాలునను లేచె సంతస మెసఁగన్ 45
[పార్శవము = పరశువునకు సంబంధించినది]
చెవు లట దద్దరిల్లఁగను జిందులు వేయుచు బాలు రచ్చటన్
రవములు నిండ దిక్కులను రమ్య తరమ్ముగ నాడఁ జూడఁగా
వివశము సెంది మానసము వింతగ జ్ఞప్తికి రాఁగ నాత్మ శై
శవము దటాలునన్ మిగుల సంతస మందుచు లేచెఁ జూడుమా 44
వింటిని మాటను దామర
కంటీ కొంటిని పసిండి కాసుల పేరున్
వింటివె యన సతి పాడుచు
టంటం టట టంట టంట టంటమ్మనియెన్ 43
మింటిని నంటఁగాఁ గినుక మిఱ్ఱుగ గంటయె మ్రోఁగ కున్నచో
నొంటికి నొజ్జ చెప్పు నది యుండఁగ మంట యనంగ నంతటం
దుంటరి పిల్లవాఁ డొకఁడు దూఁకి రయమ్మున గంటఁ గొట్టఁగా
టంటట టంట టంట టట టంటట టంటట టంటటమ్మనెన్ 42
భక్త జన శిష్ట జన పరిపాలన రతు
దుష్ట జన దనుజ దమన దోర్బల వరు
నాశ్రిత జన సందోహ కృ తాఘ రాశి
హంతకునిఁ గొల్చెదరు దేవుఁ డంచు జనులు 41
శాంత మనస్కుఁ డెంతయును జాప ధరుండు ఘనుండు భండ నై
కాంత లయుండు చండ కిరణాభుఁడు గండఁడు దండకావనిన్
వింతగ నిల్చి యొక్కఁడును వీర వరుండు నిశాచ రాలికిన్
హంతకుఁ డైన వాని జను లందఱు దేవుఁ డటంచుఁ గొల్చిరే 40
సతతమ్ము పఠించుటలో
రతి నూను నలిన దళాక్షి రయమున రాఁగన్
సుతుఁడు బడి నుండి యా భా
రతము ముగియకుండ లేచె రమణి వడివడిన్ 39
అతుల పతివ్రతా మణికి నాత్మ ధవుండు సుదూర మేఁగఁగా
వితతము మీఱ డెందమున వెక్కసమై విరహమ్ము భర్తఁ గాం
చి తరుణి హర్ష మంది యెద శీఘ్రమ యప్పుడు చేయు చున్న యా
వ్రతము ముగింపకుండనె త్వరాత్వర మా సతి లేచె నిమ్ములన్ 38
ఘోరార్త జనాశ్రిత మం
దారను నలినాక్షి సంతత త్రిదశ సమూ
హారాధిత గిరిజ నుత
శ్రీరమణిన్ సతిగఁ బొందె శివుఁడు ముదమునన్ 37
వారిజ సంభ వాది సుర పర్వ మనోరథ పూర ణార్థమై
వారని దీక్షఁ బంచ శర పాణి చలమ్మున నుద్యమింపఁగా
మార శరాభి తప్త హృత మానస శైలజఁ బార్వతీ తప
శ్శ్రీ రమణీ మణిన్ శివుఁడు సేకొనె భార్యగ మెచ్చఁగన్ సురల్ 36
అక్షయముగఁ గోతలు దా
నాక్షేపణ మెంచ కుండ ననవరతమ్మున్
దక్షుఁ డనె నిట్లు లవుఁడే
లాక్షాగృహమందు లవుఁడు లంకిణిఁ గూల్చెన్ 35
[లవము=కోత; లవుఁడు = కోతల రాయఁడు]
పోవుచు నుండ నూరికిని ముచ్చట లాడుచు వింత వింతగా
భావ విహీన పండిత నివారిత పామర రంజకమ్మునుం
ద్రోవ వచించె వింత కథ దూరము నేరక యుంట కివ్విధిన్
లావును జూపుచున్ లవుఁడు లంకిణిఁ గూల్చెను లక్కయింటిలో 34
[లంక = రావణ నియోగిత లంకా నగర రక్షక రాక్షసి, లంకిని గ్రామ్య మని నా భావన.]
అచట క్షామము తాండవ మాడ భృశము
వర్షములు లేక మఱి పెక్కు వర్షములును
గుమిలి యాఁకలి కంత నలమట, చెదరఁ
దృప్తి, పడి రెల్లరును దినఁ దిండి లేక 33
అని పని నైపుణమ్మున భయమ్మును వీడి రిపుస్థలమ్ములం
దనశన రీతిఁ జేయఁగ బలాధిపుఁ డింపుగఁ గాంచి యంత నీ
సున నరుదెంచి వీడి చను చుండఁగ వెన్కకు శత్రు కోటియే
తినుటకుఁ దిండి లేక కడుఁ దృప్తిని పొందిరి చూడ నెల్లరున్ 32
సంతసించెను గౌసల్య సంతసించెఁ
జక్రవర్తి భూ జను లెల్ల సంతసించి
రమితముగ నయోధ్యాపుర మందు సుతుఁడు
రామచంద్రుఁడు పుట్టె సంక్రాంతి నాఁడు 31
[సంక్రాంతి =మంచి ప్రవేశము]
ఇన వంశార్ణవ పూర్ణ చంద్రుఁడు వికుంఠేశుండు సంప్రీతి ధా
త్రినిఁ గార్యార్థము సేసె సంక్రమణమున్ దివ్యంబుగా విష్ణువే
తనయుం డయ్యె నజాత్మ సంభవునకుం దా నా యయోధ్యాపురిన్
జనియించెన్ గద రామచంద్రుఁడు గనన్ సంక్రాంతి నాఁడిమ్ములన్ 30
[నాఁడు = ఆనాఁడు; సంక్రాంతి = భూ సంక్రమణము]
భువనముల నేలు తల్లీ
యవివేకమ్మున నొనర్ప నఘముల నిలలో
రవ మైనను గోపం బుం
చ వట గదా నినుఁ దలఁచిన శంకరపత్నీ 29
అవిరళ కార్య భారమున నక్కట మానవ జాతి మున్గెనే
సువిదితమే భవన్మహిమ శోక వినాశిని మంగళప్రదా
భువి నిడ మంగళమ్ములను మూరుదు వమ్మరొ నేర కుండినం
జవట గదా నినుం దలఁప శంకరపత్ని గణేశ్వరాంబికా 28
ఎన్నకుమీ డెందమ్మున
నెన్నడు వరముల గిరముల నెందెందుఁ జనం
గొన్నను గాని ధనమ్మున
నన్న! వరమ్మున లభించ దన్నం బయ్యో 27
అన్న మదేల సన్నని సురాన్నము మిన్నగ నందు చుండఁగాఁ
జెన్నుగ నింటి నింటను నశేషము భక్తుల గుంపు సేర నా
సన్నము సత్యదేవుని ప్రసాదము దక్కు నిరంతరమ్ముగా
నన్నవరమ్మునం దకట యన్నము వుట్ట దదేమి చోద్యమో 26
వనజాసన వాసవ ముఖ
దనుజారి గణంబు గోర ధరణిన్ జన్మిం
చిన దశరథ నందనుఁ డో
హనుమంతుని బంటు! రాముఁడై నుతి కెక్కెన్ 25
ఘన నీలాంగుఁడు రామచంద్రుఁడు మహా కాకుత్స్థ వంశాగ్ర్యుఁడుం
దన భార్యార్థము గూడి వానర తతిన్ ధానుష్కుఁ డుత్సాహియై
ఘనరక్షః పతి రావణాసురుని సంగ్రామంబునం జంపఁగా
హనుమత్సేవకుఁ డౌచు రాఘవుఁడు సమ్యక్కీర్తికిం బాత్రుఁడౌ 24
[హనుమత్సేవకుఁడు = హనుమంతుఁడు సేవకుఁడుగాఁ గలవాఁడు]
ఉపకార మేమి సంతత
ము పలువురు కఱపిన మారుపు కనం బడునే
కపటులు పాషండులకున్
విపరీతమ్ములఁ బలికిన విద్వాంసుఁ డగున్ 23
కృప శాస్త్రజ్ఞులు ధర్మ వేత్తలు తగం గీర్తించు ధర్మాలికిన్
నెపముల్ సూపుచు శిష్య బృందమునకున్ నిత్యమ్ము దుర్బుద్ధిఁ బ్ర
త్యుప దేశమ్మొనరించు పూరుషుని యా దుష్టాత్ము వాక్యాలికిన్
విపరీత ప్రతిభాష లాడినపుడే విద్వాంసుఁ డంచందురే 22
వటువుగా వచ్చి స్వీయ రూపమ్ము సూపి
మెచ్చి తనమీది భక్తికి నిచ్చ గొప్ప
వరము కైలాస గిరిరాజు వాక్ప్రసూన
పారిజాతమున్ గిరిజకుఁ బార్థుఁ డొసఁగె 21
స్వర్జన పూజనీయుఁడును బార్థుని సారథి వాసుదేవుఁడే
కర్జము లందు నైపుణుఁడు కంస విరోధియు శాత్రవాలికిన్
దుర్జయుఁ డైన గోపకుఁడు దోర్బలుఁ డెత్తెను మేఘ సన్ని భా
నర్జునుఁ డద్రి నందనకునై కొని వచ్చెను బారిజాతమున్ 20
[సన్నిభ + అనర్జునుఁడు = సన్ని భానర్జునుఁడు; అనర్జునుఁడు =
నల్లని వాఁడు; నందన = సంతోషించునది, ఇక్కడ సత్యభామ]
ఒకటి తీర నన్య మొదవుచు నిత్యము
పార మెఱుఁగ నట్టి కోరికలను
జెలఁగు చుండు నట్టి స్వీయేంద్రియముల ధి
క్కార మగును మోక్ష కారకమ్ము 19
మూరిన పూర్వ కర్మ ఫల భుక్తి నిమిత్తము కల్గు జన్మముల్
శౌరి యొసంగు మోక్షమును జన్మ పరంపర నాపి యింపుగా
నీరజ నాభు నామముల నిత్య సమంచిత కీర్తనమ్ము సోం
కారము మోక్షకారకము కారణజన్మున కాత్మవేత్తకున్ 18
[స+ ఓంకారము =సోంకారము ]
ఉత్తమ గుణుండు దనరంగఁ జిత్త మందు
నిర్మలత మనో వాక్కాయ కర్మములను
దైవమును విశ్వసించు నతండు క్షుద్ర
దైవ దూషకుఁడె గుడికి ధర్మకర్త 17
విమల మనస్కుఁ డుత్తముఁడు వేద విదుండు వివేక వంతఁడున్
సముచిత భాషణుండు నుత సచ్చరితుండు దయామయుండు ని
త్య మమర పూజలం దనియు ధార్మికుఁ డాతఁడు సత్యమెన్నఁ దాఁ
గుమతియు దైవదూషకుఁడె కోవెలకుం దగు ధర్మకర్తగన్ 16
సదమల చిత్తా! కిన్కను
వదనం బరుణంబుఁ దాల్ప భయ మొదవంగన్
బెదరుచు నుండిరి యెల్లరు
సుదతీ నీ ముఖము నందు సూర్యుం డాడెన్ 15
చదలన్వెల్గెడు సూర్య బింబము సహస్రద్యుత్తునే మ్రింగఁగా
విది తాఖండ జలౌఘ భాసిత మహావృత్తంబ! సన్మంగళ
ప్రద! నిత్యోచిత నిర్మలోదక నదీ రత్నంబ! గోదావరీ!
సుదతీ నీ ముఖ మందు నాడెను గదా సూర్యుం డమోఘద్యుతిన్ 14
వేద వేదాంగములు ప్రభవిల్లె భరత
ఖండ మందుఁ బురాణ నికాయ మడరె
వీఁక విప్ర వరేణ్యులు గాక యున్నఁ
దులువ లామ్నాయముల శ్రద్ధతోఁ బఠింత్రు 13
ఇలఁ బరికింప క్షుణ్ణముగ నీ కలి కాలము నందు ధర్మ మే
వల నరయంగ లేము పరిపాలన మందుఁ బ్రజాలి నైననుం
బలువుర కొక్క నీతి మఱి వారికి నన్యము క్రొత్త రీతినిం
దులువలు వేద వాఙ్మయముఁ దోరపు బుద్ధిఁ బఠింత్రు శ్రద్ధతోన్ 12
ఆరుద్ర – ఆత్రేయ- శ్రీశ్రీ- వేటూరి శ్రీకృష్ణుని సాధు రక్షణ దుష్ట శిక్షణ వర్ణనతో
ఆ రుద్రస్తోత్రశ్రీ
శ్రీరవు నాత్రేయ పురుష సింహు పదపు వే
టూరిననె మద్దె లాయెఁ గు
బేర సుతు లణఁగి రసురులు వెన్నుని మహిమన్ 11
ఆడఁ గల యేడు జంటలు
నాడుచుఁ బాడుచుఁ జెలంగ నానందముగా
నేడుగురు పురుషులఁ బతిగ
నేడవ మగఁ డున్న భార్యకే దక్కు నుతుల్ 10
ఆడిన యాటలో గెలుపె యాడిన వారి కొసంగు ఖ్యాతినిం
బాడిన పాట మెప్పరయఁ బన్నుగ గాయకుఁ డందు మన్ననల్
కోడలుగా గృహమ్ము నను గూరిమి నుండఁగఁ బుత్రుఁ డింటిలో
నేడవ భర్త కల్గి నపుడే కద సాధ్వికి గౌరవం బిలన్ 9
ఇప్పుడమి లోనఁ గలఁడే
మెప్పులకు వశమ్ము గాని మేటి మగండే
తప్పక పొగుడుచుఁ జక్కని
చెప్పులతో స్వాగతమ్ముఁ జెప్పఁగ నొప్పున్ 8
[చెప్పులు = చెప్పెడి మాటలు]
గొప్ప మహాత్ముఁడే తెఱవఁ గోరిన బంగరు కొట్టు వానికిన్
మెప్పును బొందఁగాఁ గరము మేలిమి బంగరు దండ వేయఁగా
నొప్పుగ వచ్చి తాఁ దెఱవ నుద్ధతిఁ జెప్పుల కొట్టుఁ బెట్టెలం
జెప్పుల దండ వేసి మఱి చెప్పఁగ నొప్పును స్వాగతం బిఁకన్ 7
వారక వహింప నిత్య మ
పారమ్ముగ శ్రద్ధ పంట పండిన యంతం
దోరముగా రైతున కం
బారునుఁ గని నంత మనము పర్వులు వెట్టెన్ 6
[అంబారు = ధాన్య రాశి]
భారము కాదె యేరికిని భార్యయె దూరము నందు నుండినన్
మూరిన వేళఁ బ్రేమ కడు ముద్దుగఁ బిల్చును భర్త యింపుగాఁ
బా రని భార్య పార్వతిని వచ్చినఁ దాఁ జని పుట్టి నింటికిం
బారునుఁ జూడఁగానె మది పర్వులు వెట్టిన వింత యెట్లగున్ 5
వీఁక విహగ రాజములకుఁ
గాకముతో హంస తోడ ఘనముగ ధర నా
హా కుజ కాసారమ్ములఁ
గాకికి హంసకును బెండ్లి కనువిం దయ్యెన్ 4
సన్నుత పండితుం డని విశారదుఁ డంచు సమస్త విద్యలం
బన్నుగ రాజనందనకు వంచనఁ జేసిరి పెండ్లి యన్నులన్
మిన్నకుఁ గాళిదాసునకు మేదిని మించిన వెఱ్ఱి వానికిం
గన్నుల పండువై వెడఁగు కాకికి హంసకుఁ బెండ్లి యయ్యెనే 3
ఉంచ నేల యాశ లలమ టించు టేల
కాల చక్రము నాప శక్యమ్ము కాదు
వచ్చి వెడలెడు దానికై పర్వ మేల
వెడలిపోయిన దానికై వేడ్కలేల 2
మాయను దాఁటఁగాఁ దరమె మానవ కోటికి నెంత నేర్చినం
గాయము లుండఁ బోవు కలకాలము నేరికి నొక్క రీతినిన్
రేయి పవళ్లు కాదు విపరీతము నిత్యము వచ్చి పోవుటల్
పోయిన దేది రాదు మఱి పోయె నటం చిటు లేల వేడుకల్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి