7, జనవరి 2022, శుక్రవారం

పద్యాలు _ 2022

అత్యంతమ్ము పరస్ప రాదర సమే తానంద సంధాయ కౌ
న్నత్యప్రాభవ యుక్త జీవనము సన్నద్ధంబునై సంత తౌ
చిత్యాత్మాన్వయ సర్వతోముఖ జయశ్రీ లబ్ధ హృష్టాత్ములై 
నిత్యం బిద్ధర మీరు వర్ధిలుత  మన్నింపంగ శ్రీకాంతుఁడే                                                      19  

అగణిత మహిమాన్విత త
జ్జగదంబా శంకర ప్రసన్నతమ దయా 
త్త గరిమ ప్రోచుత! వర్ధి
ల్లఁగ జ్యోత్స్నారాజశేఖర కుటుంబ మిలన్                                                                            18   

విద్యా బుద్ధులు నేర్చి మిక్కుటముగన్ విద్యాధికుండై వెసం
బద్యవ్రాతము దా రచించి రచనా ప్రావీణ్య మేపారఁగన్ 
విద్యా గంధ విహీన భూధవునకున్ విన్పింప దీపింపఁగా  
సద్యస్స్ఫూర్తి యొసంగుఁ గష్టములు నష్టమ్ముల్ బుధశ్రేణికిన్                                                 17                     


విపులంపు గోకవరపు గణాధిప మండల పరిష దున్న తానుపమ పాఠ
శాల లలిత బాల బాలికా సుమనో వికాసీ కరణ మహాగార వరము 
బాల మృన్నిచయము మేలుగఁ బౌగండ రత్న సంచయముగ రాల్చు నేల 
యుదరి విద్యా బుద్ధు లొసఁగి నిరంతర మిద్ధర జ్ఞానము నెలమిఁ బంచి

యాటపాటల నిత్యము నలరు చుండి 
విద్య నింపుగ గడియించి వృద్ధి సెంది 
నేఁడు కంటిమి బడి యున్న నేల నెలమి 
మామిడికుదురు పురము మా మనికిఁ గుదురు                                                                       16              

చక్కని స్వర మని యుష్ట్రము 
చక్కని రూప మని ఖరము ఛవి నొండొరులన్ 
మిక్కిలిఁ బొగడుచు నుండగ 
నక్కజమును గాంచ వలయు నార్య వరేణ్యుల్                                                                15     

ధరల నియంత్రించి తద్ద వృద్ధినిఁ గాంచు జనవాక్య మెడ నుంచు ననవరతము 
తనవారు పగవారు తనకు సమాను లని తలంచు నిజకార్య తతుల యందుఁ  
బాత చట్టమ్ములఁ బడఁ ద్రోసి నూత్న శాశనముల నొనరించుఁ దనర ఫలము 
కర్షక సైనిక కాయమ్ము దేవతా సమ మంచుఁ బల్కుచు సంస్కరించు 
శత్రు సంహార మనిశమ్ము సల్పు ఘనుల 
థర్మ విత్త కామార్జన మర్మ విదుల 
సార్వభౌములుగాఁ జేసి సత్కరించి 
వినుతి కెక్కెను మన భూమి విశ్వ మందు                                                                           14    

కాషాయమ్మును నా కమండలువుఁ జక్కం బూన డెందమ్మునన్ 
ద్వేషంబే తనరంగఁ బల్క భగవద్గీతన్ జటాజూటమే 
వేషంబై పరఁగన్ విభూతి నిడి నిర్భీతిన్ వచింపంగఁ దా
భాషా నైపుణిఁ దాపసుం డగునె! యాపాపాత్ముఁ డెబ్భంగినిన్                                                            13   

ఆడదు భర్త మాట కెదు రాడదు నిష్ఠుర భాషణమ్ములం 
దోడుగ నుండు బంధులకు దూఱదు వారి నొసంగ నిందలం 
బాడిగ నుండు దూరమునఁ  బల్కక యెద్దియు మౌన మూనుచుం 
జేడియ లందు మిన్న యనఁ జిత్రమె వేంకట రామ లక్ష్మినిన్                                                                12       

హనుమను రామదాసుని మహానిల తేజుని వాయు పుత్రునిన్ 
దినకర శిష్య పుంగవుని దీర్ఘ తరాంగుని నాంజనేయునిన్ 
దనుజ నికాయ హర్త వసుధాతన యాంచిత సిద్ధ శోధకున్ 
మనమున నుంచి యెల్లపుడు మానుగఁ గొల్తును భక్త రక్షకున్                                                              11   

ఛందోభాషణము:   
అవధానిప్రవరా నమస్కృతులు కార్యం బేమి మీ కిత్తఱిన్  
ఛవిమద్భూషణముల్ వచింపు డెవి సచ్ఛాయల్ గరం బున్నవే  
కవి యెచ్చోటున నందుఁ బూజలను మూర్ఖవ్రాత దేశమ్ములన్  
కవి కిష్టంబగు వస్తు వెయ్య దిలఁ దాకాంక్షించు తద్వస్తువే                                                           10  

దత్తపది: నృసింహుఁడు – చంపకమాల 1-2; 2-7; 3-20; 4-16. 
నృ రుచిరాంగ సింహ ముఖ సంచిత రూపము భీతి గొల్పఁగా
దినమణి కాంతి సింద నలు దిక్కులు పిక్కటిలంగ నార్చుచుం 
బనిగొని పుట్టి స్తంభమున వర్ధిలు తీక్ష్ణ నఖాలి బాహుఁడై  
తునిమె హిరణ్య భోజనుని దోర్బలవంతుఁడు సంధ్యలోపలన్                                                        9  
 
దాశరథుండు రాఘవుఁడు ధార్మిక లోక వరేణ్య వర్యుఁ డౌ 
యీశుఁడు నిత్య సత్య రతుఁ డిద్ధ చరిత్రుఁడు జానకీ మనః
పాశ నిబద్ధుఁ డర్క కుల వారిధి పూర్ణ శశాంకుఁ డుగ్ర దై
త్యేశ దశాననఘ్నుఁడు మహీ వలయమ్మును బ్రోచుఁ గావుతన్                                                               8
[ప్రదీయతాం దాశరథాయ మైథిలీ – రా. 6. 14. 3,4. వాల్మీకి మహర్షి ప్రయోగము]  

రక్షోనాథు కుమారుఁ గావఁగ దయన్ లక్ష్మీనృసింహా! నృ హ
ర్యక్షాకారము నూని గోరులను సంధ్యా వేళ సంరంభివై  
రక్షోనాథు వధించితే  పరమ సంత్రాసంపు రూపమ్మునన్    
రక్షార్థంబ యెడంద నిన్ను గొలుతున్ లక్ష్మీనృసింహేశ్వరా!                                                                    7 
  
కరి హస్తద్వయ పూరితాంబు కణసిక్త స్వీయ మూర్ధ ప్రభా 
సుర సంఘార్చిత పాద పద్మ యుగ సంశుద్ధా నిజాష్ట స్వరూ
ప రమా పద్మదళాయతాక్షి వరదా పద్మాలయా గావుమా 
వరలక్ష్మీ వర హర్యురస్థ సక లైశ్వర్య ప్రదాత్రీ నతుల్                                                               6 

అగ్రస్థాన మొసంగి కృష్ణునకు ధర్మాత్ముండు కౌంతేయుఁ డ
య్యగ్రాధీశుఁడు భక్తి నర్చ లిడఁ బాదాబ్జమ్ములం దాఁకి తా 
నుగ్రుండై శిశుపాలుఁ డార్చుచును నిందౌఘమ్ముసారింపఁగా  
నుగ్రధ్వానము మోక్ష సాధనముగా నుర్విం బ్రశస్తిం గనెన్!!                                                               5       

శుభకృన్నామ వరాబ్ద మిద్ధరఁ గడున్ శోభాయమానంబునై 
శుభ సందోహ సమావృతం బగుచు సంక్షోభ క్షయ క్రీడలం
బ్రభవిల్లున్ జన కోటి కీయఁగ వెసన్ భద్రాయు రారోగ్యముల్ 
విభవమ్ముల్ విలయం బొనర్పగఁ దమిన్ విధ్వంస కీటాలినిన్                                                                4    

శోభకృ దంచి తాఖ్య ధర శోభ లొసంగుచు నిత్య సర్వ లో
కాభయ సుప్రదాత్రి వయి హాటక సర్వ వసుప్రదాయినీ
శోభల వెల్గి రోగ కర సూక్ష్మ భయంకర కీటకఘ్నవై 
లాభ విధాయక ప్రవిమల స్థిర కార్యము లిమ్ము వర్షమా!                                                                  3 
 
నీల గళమ్ము నీల రమణీయ నభస్స్థల సన్నిభమ్ము గా 
ఫాల తలమ్ము సుజ్వలిత భాస్కర మండల దీప్తిమంతమై  
చేల వరమ్ము కుంజర వశీకృత మానస దర్శనమ్ము గాఁ 
గాల ఫణీంద్ర భూషణ! జగమ్ముల వెల్గెడు నీకు మ్రొక్కెదన్                                                                  2      

వాల్మీకి ముని యున్న గుల్మ మెయ్యది నేఁడు వ్యాస మునీంద్రుని న్యాస మెద్ది
కాళిదా సున్నట్టి  గోళ మెయ్యది నేఁడు నన్నయ భట్టున్న పెన్నిర వెది 
తిక్కన కవిసింహ మెక్క డుండెను నేఁడు యెఱ్ఱన చనినట్టి పఱ్ర యెద్ది
పోతన సత్కవి యే తటి  నేఁడుండెఁ గవిసార్వభౌమునిఁ గందు మెందు

నిన్న యున్నట్టి వారలు నేఁడు లేరు
శాశ్వతమ్ములే మానవ జన్మము లిల  
లీలఁ బుట్టించు గిట్టించు నీలతనుఁడు
కాల గర్భ లయము జీవ జాల మెల్ల                                                                                                                      1                             

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి