1, ఆగస్టు 2022, సోమవారం

సమస్యా పూరణ ఆగష్టు 2022

విఘ్నములఁ దొలఁగింపుమ విఘ్ననాథ
నా మది స్మరింతు నయ్య వినాయక! సుర!  
నవరతము మమ్మిల సద గను మయ్య
ష్టములను బాపి వినాయక సతతమ్ము                                              59                         

పీన నిజోద రేభ ముఖ విఘ్న వినాశన ముఖ్య కార్య ల
గ్నా నత సర్వ దేవ సుర నాథ నరవ్రజ సుందరప్రస
న్నానన కిన్న రాసుర విచ్చర పూజిత హృష్ట మానసా 
గాన సుధా రసస్రవ విత్థన కోటి నుతింతు  విఘ్నహా                              58          

రండని పిల్చి త్రాగుఁ డని రమ్య కషాయము నెమ్మి నంచుఁ దా
నెండిన యట్టి గింజలది యింపగు చూర్ణము వేసి పాత్రలో
మెండఁగఁ గాఁచి తోయమున మేలుగఁ దేఱిచి యంతఁ బాడు గా
కుండెడు పాలు వోసి యిడెఁ గోమలి పేయ వరమ్ము  భర్తకున్                    57                    

పద్యము లగు భూషణములు హృద్యము లగుఁ 
జదువరులకు నయిన నేమి చదువ నెవ్వ
రిష్ట పడుదురు దోష భూయిష్ఠ మైన
వసుధఁ బద్య కవిత్వము వర్జ్యమె కద                                                   56          

సేద్యము తోడఁ బోల్ప నగుఁ జెన్నుగఁ బద్య కవిత్వ మిద్ధరం
జోద్యమె యన్య దేశ్యములు చొప్పడ నం దవి కల్పు మొక్కలే 
హృద్యములై చెలంగునె పఠించిన సంకర మైన భాషతోఁ
బద్య కవిత్వ మెల్లరకు వర్జ్య మదెట్టుల సంప్రదాయమౌ                           55   

ధార్తరాష్ట్ర కౌంతేయుల వర్తనమ్ము
లాజిఁ గాంచ కున్నను రాఁగ నంత మందు 
మెఱసి దుర్యోధను తొడలు విఱిచి యపర 
రావణుం జంపె మారుతి రాముఁడు గన                                                54   

పావను మించి వీరులను భక్త వరేణ్యులఁ గాంచ శక్యమే 
యీ వసుధా తలమ్మున మఱెక్కడ నైనను భండనమ్మునన్ 
రావణు సేన లోనఁ బలు రాక్షస వీరుల దీనుఁ జేయఁగా
రావణుఁ జంపె మారుతియె రాముఁడు సూచుచు మెచ్చు రీతిగన్             53                  

కాన నాంతరమ్మున వేగ కదలు చుండఁ 
బడఁగ  నేలపైఁ దడఁబడి బాధతోడఁ
గుముల నెత్తి తొండమ్మును గుంజర వర
శిశువు కరమున శతకోటి చేరెఁ గరులు                                                52     

విశదముగాఁ గరాబ్జముల వృద్ధి నొసంగ నిరంతరమ్మునున్ 
శశి నిభ వక్త్ర బాలునకు సంపద లింపుగఁ గల్గఁ జేయఁగా
భృశముగ వెల్గు చున్న యవి రేఖలు కుంజర సన్నిభమ్ములై 
శిశువు కరంబునం గలవు చిత్రముగా శతకోటి యేనుఁగుల్                     51

స వినయము వేడెదను సుం
త వివేకము సూపు మయ్య తమకమ్మునఁ గొ
న్నవి యారగింపఁ బొట్లము
రవి! కను విప్పెడి తఱి నిటు రమ్మనఁ దగునా                                      50                

అవనినిఁ బెర్గు చున్నయవి యత్యధికమ్ముగ నేఁడు వంచనల్ 
వివిధము లైన రీతులను విత్తము నింపుగ సంగ్రహింపఁగా 
వివరము లెల్లఁ దెల్లముగ వింటిని వచ్చిన వారి గుట్టునున్ 
రవి! కను విప్పు చున్న తఱి రమ్మని పిల్చుట యుక్తమౌ నొకో                49             

ప్రియ జనకుఁడు శ్రీనాథుఁ డ
భయప్రదుఁ డొసంగ మహిమ ప్రావీణ్యముతో 
నియతి నలువ, సమయింపఁగ
లయకారుఁడు, సేయ సృష్టి లావణ్యంబౌ                                             48                                         

ప్రియ మారంగ సురక్షణం బొసఁగు నా విష్ణుండు లోకవ్రజ
క్షయకారుండు శివుండు ముక్తి నిడు బ్రచ్ఛన్నుండునై చక్కఁగన్  
దయ వీక్షించి ధరా చ రాచర సమస్త ప్రాణి నిత్యస్థి రా
లయ కారుం డొనరింప సృష్టినిఁ గడున్ లావణ్య యుక్తం బగున్             47                        

తరుణీ రత్నము వల్కెడు 
గిరలను విన స్పష్ట మేరికి నయినఁ దలపం
గ రయమ్మున, నిది నిశ్చయ
మ, రణమ్మును గోరి వచ్చె మానిని గంటే                                          46                       

తరుణులఁ గాంచ మన్యులను ధాత్రిని నివ్విధి సక్త చిత్తలం
దరుణము నందు నిర్ణయము తప్పక కైకొను నట్టి వారినిన్
నిరతము ప్రేమ పంచఁగను నీరజ లోచన వెంట నుండ నా
మరణముఁ గోరి వచ్చినది మానిని సూడఁగ ముచ్చ టాయెరా               45                                   

విష్ణు మాయ నిక్కమ్ముగ విశ్వ మెల్ల 
ధర ఋణానుబంధమ్ములు తనరు చుండు 
జనకుఁ డెవ్వఁడు పరికింప జాతుఁ డెవఁడు
సింహమే తల్లి సతి తేలు చేప సఖుఁడు                                              44              

బృంహిత సన్నిభమ్ముగను బెద్దగఁ జాటిన రిత్త తల్పఁగా
నంహతు లౌను దథ్యముగ నారయఁ జుట్టరికమ్ము లెల్లనున్ 
రంహతి వచ్చి పోవుదురు రాగము లేల ధరాతలమ్మునన్ 
సింహము తల్లి తేలు సతి చేఁపలు మిత్రులు పీత చెల్లెలౌ                      43        

మేలుగ వీరుండు క్రియా
శీలుండు తన పగ తీర స్వీయాస్త్రములన్ 
లీలగ రణమున రిపు రా
జాలి కు చముఁ గోసి తినియె నానందముగన్                                      42                  
[కు చమువు = దుష్ట సైన్యము]

చాల భరించి దార యిడ సంకటముల్ సతతమ్ము నిర్దయన్ 
‌మే లన నంత రాత్మ కడు మెత్తని  బియ్యపు పిండి తోడనే 
యాలి పయిం గరం బలిగి యందముగా సతి బొమ్మ సేసి తా
నాలి కుచమ్ముఁ గోసి తినె నా పతి దేవుఁడు మోద మందుచున్             41 

మగువ మధు రాఖ్యను భృశ
మ్ముగ నీ వెఱుఁగుదు కద పరిపూర్ణముగా నెం
చఁగ శంక తోడ నీ పయిఁ 
బగఁబట్టిన వాఁడె మధుర భావుకుఁ డిలలోన్                                       40             

తోటకము. 
సెగ వోలెఁ జెలంగును జేరఁగ న
క్కగృహమ్ము నసూయయె కాఱియ పె
ట్టగ డెందమునం దకటా యతఁడా 
పగఁబట్టిన వాఁడె సుభావుకుఁడౌ                                                          39      

'పాలు - పెరుగు - వెన్న - నేయి
ఈ పదాల అన్యార్థంలో శ్రీ కృష్ణుని స్తుతి. 

శిశుపాలు తప్పులు పెరుఁగు
భృశమ్ము తా వెన్న కుండనే యిడ నిందల్  
శశివదన నీకు నిచ్చితి 
వి శార్ఙ్గి వీక్షించి ముక్తి వెన్నుఁడ ప్రణతుల్                                               38        

ఏడ శంకరుండు రమేశుఁ డెక్కడ కన
కాద్రి యెక్కడ యెత్తెడు కార్య మెద్ది 
రిత్త గిర లివి మునిఁగితె మత్తు నందు    
శంకరుం డెత్తె హరి చెప్ప స్వర్ణ గిరిని                                                       37       
లంక యనంగ వెల్గెడిని రాక్షస రాజ్యపు రాజవర్యుఁ డా 
సంగర దుర్జయుండు ఘన శక్తుఁడు వీరుఁడు సర్వ దేవతా
సంకట కారకుండును దశప్రవ రాస్యుఁడు సేవి తాద్రిజా 
శంకరుఁ డెత్తె నా కనక శైల  ముమా ధవు వాంఛ దీరఁగన్                            36   

చిత్త శుద్ధి లేక దేవతా చింత లేక 
భూత దయ లేక కారుణ్య బుద్ధి లేక 
పాప భీతి లేక యనృత భయము లేక
మునుఁగ గంగలో మోక్షముఁ బొంద లేము                                                  35       

కని విని నేర నట్టి వగు కార్యము లెన్నియొ ఘోర భంగిఁ దా
మొనరిచి కీడు నెల్లరకు నుర్వి నొసంగుచు స్వీయ వృద్ధికై
కనికర మింత లేకయు సుఖమ్ముగఁ బాపము లెన్ని సేసినన్ 
మునిఁగిన మోక్ష మబ్బు నని మూర్ఖులు చేరిరి జాహ్నవీ తటిన్                      34                       

ఏ రీతిం గలుగు బలము
సారము లేనట్టి తిండి చాల నమలినం
దీరుగ వచింపు వడి నే
సారము లేనట్టి తిండి శక్తి నొసంగెన్                                                             33    

వారక యేపుగా బలము వర్ధిలఁ జేయు పదార్థ జాలమున్ 
వారము వార మింపుగను బన్నుగఁ గొంచును బొట్ట నిండుగం 
గారము నింక నా పులుపు కమ్మఁ దనమ్ము సెలంగు చున్న ని
స్సారము లేని తిండిఁ దిని శక్తి గడించిరి లోకు లెల్లరున్                                  32      

చిత్రములు గాలి పటములు సెలఁగి యెగుర
వేయు చుండఁగ బాలురు విరివి గాను 
వింతఁ జూచు వారికిఁ దోఁచె నంత నిట్లు 
కలువలు పవలు పూఁచెను గగన మందు                                                     31                            

కలలం  దైనను మాన వాలి కిలలోఁ గాంచంగ డెందమ్ము ని
శ్చలమై యుండదు భావ జాలములు సంజాతమ్ములౌ నిత్యమున్ 
లలి తాకాశము వోలె స్వాంతము కడున్ రాజిల్ల భావమ్ము లం
గలువల్ పూఁచె వియత్తలమ్మునఁ బవల్ గన్గొంటివా సత్కవీ                             30          
[భావమ్ములు + అన్ = భావమ్ము లన్] 

భారత త్రివర్ణ పతాకాన్ని వర్ణిస్తూ స్వేచ్ఛాఛందంలో పద్యం, నిషిద్ధాక్షరాలు : 
ప - ఫ - బ - భ – మ
దౌష్యంత వర్షాఖ్య ధాత్రీ జన వరు లారాధించినం దిగ రంగు లడర 
సంగ సంక్షయ ధరా సత్య నిరతి నీతి వర్తనీ కృత సంజ్ఞ  ధ్వజవిరాజి   
యింటింటఁ గదలాడు నెల్లరు కీర్తించి గౌరవించుచు నుండ వార కుండ 
వాడలం దిల వేరు వలుకులయిన వేరు నడత లయిన రక్తి యెడఁద లందు
నునిచి యుందురు జను లెల్ల నుత్సహించి 
శూల వృద్ధికిఁ దగి నట్టి మే లొనర్చు   
చుండి స్వీయ కార్య తతుల శుచి వహించి 
యిట్టి దేశ వాసు లరుదు వట్టి చూడ                                                              29                           

ఎప్పుడు సూచిన నింగినిఁ 
గప్పుచు విహరించు చుండి కాఠిన్యమునన్ 
గొప్పవి గ్రద్దలు పక్షుల
కప్పలు సర్పములఁ జంపెఁ గద వెంకప్పా                                                         28                        

దండాకారము తిర్గు చుండి పర మోద్దండుండు దర్పోద్ధతిం
గొండం తాకలి మ్రగ్గు చుండి వెస సంకోచింపకే మత్త వే
దండప్రఖ్యుఁడు పక్షి నాథుఁడు గరుత్మంతుండు హర్షింపఁగా
మండూకంబులు మట్టుపెట్టెఁ గనుమా మల్లాడి సర్పంబులన్                              27         

సూర్యునకు మంచి మిత్రుఁడు సోముఁ డుర్వి
నొక్క దిన మందు నిర్వురు నుత్సహించి
చనఁ దలంచిరి యాత్రకుఁ జక్కఁగాను
సూర్యుఁ డెక్కెను చక్రము సోముఁడు గన                                                         26           

చర్యల దేవతా వరులు శ్రద్ధ వహింతురు మిక్కుటమ్ముగా
నార్యుఁ డనూరుఁ డౌర సమయమ్మున కప్పుడు రాక యున్నచోఁ
గార్య నిమగ్నతం దనరి క్రన్నన వాహన రాజ మన్యమున్ 
సూర్యుఁడు చక్ర మెక్కఁ గని చొక్కముగా శశి నవ్వె మెచ్చుచున్                            25  

ఆలస్య మింకఁ జేయక
యీ లోకమున వసియించు నెల్లరు దీక్షన్
మేలుగ నిర్మూలించినఁ
గాలుష్యము మేలుఁ గూర్చుఁ గద మనుజులకున్                                                24          
 
కాలుం జేరఁగ రాజ మార్గములు లోకం బందు జీవించు నా
భీలోగ్ర క్రిమి కీట కాదు లవి దుర్భేద్యంబు లెవ్వారికిం
గాలుష్యం బగు వాని కాలయము నిక్కం బెంచఁగాఁ గాన ని
ష్కాలుష్యం బది హెచ్చె నేని బహు సౌఖ్యం బిచ్చు మర్త్యాళికిన్                                23             

వినయ మీయ నట్టి విద్య లేల మనకు
డెంద మందు నకట కొందరికి న
ఖర్వముగఁ బుడమిని గర్వ మొసంగును 
విద్య, లేని వారె విజ్ఞులు గద                                                                                 22      

ఆద్యం బెల్లర కెంచ సుంతయిన విద్యా గంధ మిద్ధాత్రినిం 
జోద్యం బింతయుఁ గాంచ మీ గిరలఁ బ్రాచుర్యంబ లోకమ్మునన్ 
సద్యస్స్ఫూర్తి సెలంగ మిక్కుటముగన్ శాస్త్రార్థ సంవేదులౌ
వి ద్యాగంధ విహీనులే వసుధలో విజ్ఞుల్ ఘనుల్ తాత్త్వికుల్                                       21   

బల్లిదున కోగిరం బగు బక్క జీవి 
డేగ యొక్కటి వినువీధి నేఁగుచుండ
నింపుగ నరసి మున్నారగింపఁ బడఁగఁ
జేఁప కొంగను దినుచుండెఁ జెట్టు పైన                                                                       20   

పాపముఁ బుణ్యముం దలఁపఁ బాడియె యాఁకట మ్రగ్గు చుండఁగాఁ 
బాపనిఁ గాంచఁ దల్లి చను పాలవి శీఘ్రమ చేఁపు రీతిగా 
నేఁపున గృధ్ర రాజమున కెక్కవయై కట క్షుత్పిపాసలే 
చేఁప బకమ్ముఁ బట్టుకొని చెట్టునఁ జేరి భుజించెఁ గాంచుమా                                          19   

ఆజ్ఞప్తులై నృపునిచేఁ 
బ్రాజ్ఞాధ్వరు లత్యధికపు భక్తిఁ జలుపఁగా
నజ్ఞాను లందు రివ్విధి 
యజ్ఞమ్ములు హానిఁ గూర్చు నవని జనులకున్                                                           18   

విజ్ఞులు స్వీయ లాభములు పెక్కుల నందఁగఁ బల్కుచుండ్రు దై 
వాజ్ఞ యటంచు యాగముల నత్యధికమ్ముగఁ జేయ మేలు నా
నజ్ఞులఁ గాంచి యెట్టి ఫల మందిరి యెవ్వరు నిక్క మెంచినన్ 
యజ్ఞము లెల్ల లోకులకు హానినిఁ గూర్చుటకే తలంచినన్                                             17   

కావ్య రచనా ధురంధర కర విరాజి
త వర పుస్తక మిక్కిలి ధన్యుఁడవు గ
దన్న యేక పత్నీవ్రత సన్నుత గుణ
పర సతినిఁ గోరి కవివర్య వాసిఁ గంటె                                                                             16 
  
పరమ పతివ్రతా తిలక భార్యను గూడి యశోధనుండవై 
వర పద భావ సంకలిత పండిత పామర సప్రజా మనో
హర రచనా సమాకుల సమంచిత సుందర కావ్య నామ కా 
పర సతి నెంతగా వలచి వాసినిఁ గంటివొ సత్కవీశ్వరా                                                      15    

సు పరిచిత మెల్లరకును ద
న పనితనం బింపుగాఁ దనర సమయం బం
చెపు డైనఁ బరిష్కర్తకు
నపశబ్దము లున్న పద్య మానంద మిడున్                                                                    14 

విపరీతమ్ములు గావు దోషము లహో విశ్వంబులో నెవ్వ రే
ని పరీక్షింపఁ గవీంద్ర కావ్యముల సందేహమ్ము శూన్యంబు సూ
తపనీయ ద్యుతి వెల్గు నట్టి కవి రాడ్ధౌత ప్రమాదస్ధ వా
గపశబ్దంబులు గల్గు పద్యము లమం దానందముం గూర్చెడిన్                                          13   

చూచు వారికిఁ దనులందుఁ జొప్పడంగ 
రోమహర్షణము భృశము భామ కింకఁ 
బరఁగ నైపుణమే త్రాటి పైన నాడఁ
జరణముల్ దెగి నటియించె చక్కనమ్మ                                                                             12  
[తెగు = సాహసించు]

పరమానందము కల్గుఁ గాదె మదిలో వైరమ్ము మూలమ్ముతోఁ
బరిపూర్ణమ్ముగ నాశనం బయి సుహృద్భావమ్ము సేకూరఁగం
దరుణీ రత్నము నేరి సత్యమును బ్రీతిం జెంది స్నేహమ్ముఁ బం
చ రణంబుల్ దెగి నాట్య మాడె నటియే సభ్యుల్ ప్రశంసింపఁగన్                                              11  

చాల బలవంతుఁ డతి ధీ
శాలి మనోజవుఁడు హరివృషభుఁడు ఘనుండౌ 
గాలికి నంజనకు సముఁడు 
వాలికి మారుతి జనించె భాస్కరుఁడు గనన్                                                                         10  

మే లన వాన రోత్తము లమేయ బలాన్వితు లెల్లఁ బ్రీతితో
నా లలనా మతల్లి తర లాక్షికిఁ దార కొసంగ హర్షమున్ 
బాలుఁడు వాస వాన్వయుఁడు వానర వర్యుఁడు నంగదుండు త
ద్వాలికిఁ బుట్టె మారుతి నభశ్చరుఁడౌ రవి గాంచి మెచ్చఁగన్                                                    9   

మును భూ దేవులు మాంస
మ్మును యజ్ఞావసరముల సమోదము గొనరే 
చని యాగమ్మున కింపుగఁ
గొనుము ధరామర హిత మనుకొని మాంసమ్మున్                                                                 8      

కను దూరమ్మున నుండు నీ పతనమే కార్యక్షయంబౌ వెసన్  
మనమం దుండదు ధర్మ చింతనము సమ్మానంబు శూన్యం బగున్ 
వినమే భ్రష్టున కెట్టి త్యాజ్యములు నీ విశ్వంబు లో లేవనం
గొనుమో భూసుర మద్య మాంసముల సంకోచమ్ము లేకుండఁగన్                                            7     

అంగనల నంబుజాక్షుల నరసి నంత 
నంగజు నెదిరింపఁగ బ్రహ్మ కైన వశమె 
 యాతతమ్ముగ నెద మోహ మావహింప 
బ్రహ్మ దేవుని సృజియించె వాగ్వధూటి                                                                                6   

విత తానుగ్రహ నిగ్రహ ప్రకర సద్విద్యా ప్రవీణుండు నా
తత కారుణ్య విలోకనుండు హరి దా దాక్షిణ్య మేపార సం
తత లోకప్రభవైక కార్యమునఁ దాతన్ నిల్ప శ్రీనాథుఁడే 
చతురాస్యున్ సృజియించె వాణి! సకలైశ్వర్యప్రదున్ బ్రహ్మనున్                                              5 
      
పదిలముగా నుండ వలెను 
ముద మీయఁగ నెంచి నిన్ను బొగడుచుఁ బలుకన్ 
వదలక నిరంతరమ్మును 
మృదు మధు రోక్తు లొసఁగు నొకొ మే లెన్నటికిన్                                                                   4 

సదమల డెంద మూని నిజ సఖ్యము గోరుచు నప్రియమ్ములన్ 
బెదరక పల్క సత్యములు పెన్నిధు లౌదురు వార లెన్నఁగా 
నెదురుగ నుండి నీకు ముద మీయ నిజాప్రియు లెల్లఁ బల్కు నా 
మృదు మధు రోక్తు లెన్నఁడును మేలొనఁ గూర్పవు తిట్టఁగా వలెన్                                          3 
  
రాజ ధర్మము పాటించు రాడ్వరులకు 
భూత దయ మెండుగా నున్న పూరుషులకు 
సతము సత్య నిష్ఠా ధర్మ రతుల కెట్టు 
లభయ మిడి చంపుటయె ధర్మ మగును గనఁగ                                                                     2 

ఉభయ జగమ్ము లందుఁ గొన నుత్తమ మైన పదమ్ము కావలెన్ 
విభవము లున్న వ్యర్థములు పృథ్వి దయా గుణ మింత నిత్య మా
హ భయము నింక దుస్సహపు టార్తినిఁ, దా శరణార్థి కింపుగా
నభయ మొసంగి, చంపుటయె యన్నిఁటి కంటెను మేటి ధర్మమౌ                                             1

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి