1, సెప్టెంబర్ 2022, గురువారం

సమస్యా పూరణ సెప్టెంబర్ 2022

అగ్రస్థాన మొసంగి కృష్ణునకు ధర్మాత్ముండు కౌంతేయుఁ డ
య్యగ్రాధీశుఁడు భక్తి నర్చ లిడఁ బాదాబ్జమ్ములం దాఁకి తా 
నుగ్రుండై శిశుపాలుఁ డార్చుచును నిందౌఘమ్ముసారింపఁగా  
నుగ్రధ్వానము మోక్ష సాధనముగా నుర్విం బ్రశస్తిం గనెన్!!                   59                 

మిన్నగ నెల్లెడ లందును 
మన్నన లందు కవి వ్రాయ మహనీయుండే 
యన్నా యానందపు టా
కన్నీటికిఁ బద్యమొకటె కారణ మయ్యెన్                                              58                                        

మేటి స్వరంపు గాయకుఁడు మెచ్చఁగ నచ్చట నెల్ల వారలుం
బాటవ మొప్ప రాగమునఁ బాడఁగఁ దా కరుణా రసం బహో
దీటుగ నొల్క నత్తఱినిఁ దియ్యఁదనమ్మున విన్న వారికిం
గాటుక కంటి నీటికిని గారణమయ్యెను బద్యమే చుమా                          57                                 

అమ్మానవు గెలువంగఁ ద
రమ్మే యిట్టు లన వలదుర వచనములు నీ
యిమ్మాట లిట్టు లున్నవి
తొమ్మిదిలో నొకటి దొలఁగఁ దోరఁపుఁ బదియౌ                                         56 

ఇమ్మహి లోనఁ జిత్రముల నెన్నియొ కాంతుము లెక్కలందు నో
యమ్మరొ మచ్చు కొక్కటిని నారయు మిచ్చట నక్కజమ్ముగా 
నిమ్ముగఁ గాన వచ్చు నటు లిచ్చట వ్రాసిన నూరు నింకనుం
దొమ్మిది నుండి యొక్కటినిఁ ద్రోయఁగఁ దాఁ బది యౌను జక్కఁగన్            55             

మారాము సేయ నేలయ 
నీరమ్మును, జూడ కుండ నిను మార నిభా
కారా! మన్నగర నివా
సా! రా, త్రాగక రచనను సాగింతు నెటుల్                                                54                         

పారంబుం గన నట్టి సంతసమునన్ వాక్యమ్ము లంచత్సు ధా
గారమ్ముల్ వచియించు చుండి సరసం గర్పూర తాంబూలముల్ 
నారీరత్నము లీయఁ బేయములుఁ బ్రజ్ఞా పాండితీ గంధవ
త్సారా! త్రాగక పద్య లేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్                       53                     

కామాతురుండు గంధ
ర్వామర నర బాధకుఁడు దశాననుఁడు మహా 
భీమాసురుండు లం కా
రాముఁడు దుష్టాత్మకుండు రక్షోవిభుఁడౌ                                                     52           

ధాముఁడు సద్గుణావళికి ధారుణి ధార్మికు లందు శ్రేష్ఠుఁడౌ 
కోమలి సీతకున్ ధవుఁడు కూరిమిఁ గాచును భూత రాశినిం
బ్రేమను జూచు లక్ష్మణుని వెంట సతమ్ము చరించు వానినిన్ 
రాముఁడు, రాక్షసప్రభువు రావణుఁడే,  పురుషోత్తముం డిలన్                      51

జ్యౌత్స్నమునఁ గాన కుందుమె 
జ్యోత్స్నా లసి తాంబరమ్ము నుత్సాహమునం
గృత్స్నమ్ము కాన కున్నన్ 
జ్యోత్స్నల్ దిశలావరింప సూర్యోదయమౌ                                                  50    

సత్స్నిగ్ధమ్ముగ వెల్గఁ జంద్రుఁ డట హర్షం బావహింపంగ నం
చత్స్నానమ్ము సెలంగి చేయుమ శరచ్చంద్రాత పాంభోధినిం
గృత్స్నం బభ్రము నిండె వెల్గుల నిరీక్షింపంగఁ గించిత్తిటన్
జ్యోత్స్నల్ దిక్కుల నావరించె సుదతీ సూర్యోదయం బయ్యెడిన్                      49                             

అకట పిల్లి యెదురయిన నాఁగ కున్న
నడుగిడఁగ గృహమునఁ గాళ్లు కడుగ కుండఁ
గడఁగి పూజ సేయు నపుడు కట్ట కున్నఁ
దోరణమ్ము సర్వానర్థ కారణమ్ము                                                                 48           

పోరున నైపుణమ్ము పరిపూర్ణము సాహసవంతులే భటుల్ 
వారక యిత్తు రెల్లరును బ్రాణము లైనను దేశ రక్షకై 
వైరము నూని దుర్జయపు భారత దేశము తోడఁ జేయఁ దో
డ్తో రణమే కదా సకల దుఃఖము లిచ్చు ననర్థ హేతువౌ                                      47            

ఏమి దౌర్భాగ్య మియ్యది యెక్క డైనఁ 
నిట్టు లుండునె యక్కట యెంచి చూడ
నెందు వీక్షించినను దేశ మందు బడుగు
రాయలను మించు హీనుఁడౌ రాజు లేఁడు                                                       46      

ఏ యుగ మందు నైన మఱి యే సమయమ్మున నైన నేమి నీ 
తోయపు వారి లోఁ గనిన దుష్ట గుణమ్ముల నీవు దక్కఁగాఁ
గాయము నందు నింకను బ్రగల్భవచో నిపుణత్వ మందునున్ 
రాయల మించు హీనుఁడగు రాజు ధరాతల మందు లేఁడు పో                             45                

తెల్లముగఁ దలఁచి మది "సహసా విదధీత 
నక్రియా" మని వచనములు కలుగ 
వేగిరపడ కుండ నాఁగి విచారించి 
రే పొనర్చు జనులనే పొగడెద                                                                            44             

రేపటి నాదు జీతమును బ్రీతిగ నేఁడ యొసంగ శంకతో 
నాపక సంతసించి కడు నంచిత రీతిని మిక్కుటమ్ముగా 
రేపినఁ గొంత వట్టునను రేపటి కావలి నాటి కార్యమున్
రే పొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్                                       43     

వనరిన లాభం బెయ్యది 
మనమున  నిజధర్మ సక్త మానసుని మహా
త్ముని సత్యవ్రతు భూకాం
తుని దర్శించెదను నాదు దుఃఖము దొలఁగన్                                                        42    

వనజాక్షుం బరమాత్ము నవ్యయుని శ్రీవత్సాంకు వైకుంఠ ధా
మునిఁ బీతాంబరధారుఁ దామరస నాభున్  దీన మత్తేభుఁ గా
చిన నారాయణుఁ గౌస్తుభాభరణు లక్ష్మీకాంతు భక్తవ్రజా
ప్తుని దర్శింతును జిక్కు లన్నియు విడన్ దుఃఖమ్ము దూరమ్ము గాన్                     41 

ఆకాంత యెంచ నొక గిరి
యా కాంతుఁడు సతిని నెత్తి యవనిం గూల్పన్ 
వే కినిసి సతీ మణి కై
రోకలి తోడ గిరిధరుని రుక్మిణి మోదెన్                                               40      

నా కను లారఁ జూచినది నమ్ముఁడు చెప్పుచు నుంటి నంచుఁ దా 
వీఁక వచించె జాంబవతి ప్రేమపుఁ గిన్క సెలంగఁ గామమే
తాఁక శిరమ్ము స్వీయ కర దండము రోకలి కాఁగ మెత్తగా 
రోకలి తోడ మా ధవుని రుక్మిణి మోదెను సత్య మెచ్చఁగన్                  39       

వెలయాండ్రే యచ్చరలు ము
నుల కయినన్ సత్యము లగును జుమీ యీ మా
టలు నిశ్చయముగ ధరలో 
వెలయాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్                                            38     

కలలో నైనను ద్వేష మూనదు మదిం గల్యాణమే కోరుఁగా 
లలనా రత్నముఁ గాచుటే పతికిఁ గర్తవ్యంబు త్యాగంబుతోఁ 
జలుపంగన్ నిజ దార సేవలకు దుస్సాద్యమ్ము లెక్కింపఁగా 
వెల యాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమం  బ్రసాదింపఁగన్               37                

అలవోకగఁ జేయ ప్రతిన
లులుకక యింటింటి కేఁగి యుచితమ్ములు నా
వలలోఁ జిక్కిన పలు మూఁ
కలు గల్గినవాఁడె రాజు కలికాలమునన్                                              36      

కలిగిన నేమి చేసినను గార వరించిన నబ్బు సౌఖ్యముల్ 
కలిగిన దోఁచు కొన్న మఱి కాఁగలఁ డింపుగ రాయఁ డిద్ధరం 
కలిగిన వానికే కలుగుఁ గాలిడ నెన్నిక లందు శక్తి రూ
కలు గలవాఁడె రాజు కలికాలము లోనఁ దలంచి చూచినన్                   35    

కీటక సరీసృపమ్ములు పాటవముగఁ 
బ్రాక విహరింప నింకను నాఁకలిఁ దగఁ  
దీర్చికొనఁగ నింపుగ శ్రమ తీర మేలి 
రైలు పట్టాలపై నిద్ర మేలొసంగు                                                        34                   

తల్పశ్రేష్ఠము  లధ్వముల్ దివికి నిర్ద్వంద్వంబుగా నింపుగా 
స్వల్పంబుల్ రుజ లంద నేర రిఁక నా వైకుంఠ వాస్తవ్యులై 
యల్పాయుష్కుల కిద్ధరా తలము నం దానంద ధామమ్ములౌ 
రైల్పట్టాలఁ బరుండ మేల్గలుగు నార్యప్రోక్త సత్యం బిదే                           33   

వీనులకు విందగును నేఁ
డీ నందనుఁడు పిలువంగ నీ యాంగ్లమునం 
దానక్కట యమ్మా యన 
మానవులకుఁ దల్లినుడి యమంగళకరమౌ                                        32 

మానవుఁ డుచ్చరించుఁ దొలి, మాత వచించిన మాట లింపుగా 
మానస మందు నిల్చు నవి మాయవు కాల మతిక్రమించినన్   
మౌనముతోఁ ద్యజింప వలె మాటల నివ్విధ మేరు వల్కినన్ 
మానవ జాతి కంతటి కమంగళ మూలము మాతృభాషయే                   31      

రాయబార ఘట్టములో శ్రీకృష్ణుఁడు దుర్యోధనుని హెచ్చరించుటను స్వేచ్ఛాఛందములో.
నిషిద్ధాక్షరాలు...
మొదటి పాదములో కవర్గాక్షరాలు
రెండవ పాదములో చవర్గాక్షరాలు
మూడవ పాదములో తవర్గాక్షరాలు
నాల్గవ పాదములో పవర్గాక్షరాలు. 

ధర్మ తత్పరుఁడు సత్యవ్రతుఁ డరుషుండు డెందమునను ధర్మ నందనుండు
భీముఁ డుద్దండుఁడు భీమ గదా రణ మందు నెన్నఁగ వాయు నందనుండు
గాండీవి కిల సాటిఁ గాంచంగ శక్యంబె భవ్యంపు విలుకాఁడు సవ్యసాచి
నకులుని సహదేవు నరవరులను దాఁకు వారలు వుట్టిరె వసుధ లోన

బల్లిదుల తోడ వైరము పాడి కాదు
సమరమున వారి గెలువ నశక్య మెన్న
వారి పాలు దుర్యోధన వారి కిమ్ము
భయము లేక నీ వారిని బ్రతుక నిమ్ము                                               30 
        
వారక కొండల గుట్టల
దారిని నేఁగఁ దిరుమలకు దర్శన మయ్యెన్ 
మూరిన యధికారుల సం
స్కారమ్మే తీయ నయ్యెఁ గద భక్తులకున్                                               29        

ద్వారక లోఁ గుచేలుఁడు కృపాలునిఁ గృష్ణునిఁ గాంచఁ బ్రీతిమైఁ 
గోరి భుజించి గుప్పె డటుకుల్ ధన ధాన్యము లిచ్చెఁ బెక్కులన్ 
మూరిన వారి స్నేహ మిఁక భూరిదయారస మమ్మహా పుర
స్కారము తీయనై సుఖముగా మురిపించెను భక్త బృందమున్                28 
              
కల్లు త్రాగు చుండి రచట నెల్ల వారు
పూర్వ మష్టావధానపు టుర్వి యిప్పు
డుల్ల ముప్పొంగ నాతఁడు తల్లడిలక
కల్లు పాకలోఁ జొచ్చెను గవివరుండు                                                      27   

సవితృ సమాన తేజుఁ డగు సత్కవి యంకిత మీయఁ గావ్యముం 
జెవులకు సోఁకి నంతటన చెప్పఁగ నివ్విధి రాజు ప్రీతితో 
గవనము మెచ్చి రత్నములు గైకొన నేఁగుమ రత్న శాలకుం 
గవివరుఁ డెల్ల వారు గనఁగా వడిఁ జొచ్చెను గల్లు పాకలో                            26                   
[కల్లు = ఱాయి] 

కదియఁగఁ గబలించు కాలము వీక్షించి 
చండ కిరణ పంక్తి సంతరింప 
జీవ రాశి కొసఁగఁ జేవ బ్రతుకు  నందు
భానుఁడు వెలుఁగంగ వచ్చెఁ దమము                                                      25                
[తమము = రాహువు] 

మానవ జాతి లోకము సమస్తము భీతిలి చూచు చుండ ద్వే
షానల తప్త మానస సు ధాశన వక్త్రుఁడు నిర్మలాభ్ర దే
శానఁ గరాళ దంష్ట్ర విల సద్ఘన గాత్రుఁడు భాను మ్రింగు స్వ
ర్భానుఁడు వెల్గు చుండ నొక వంకఁ దమస్సులు గ్రమ్మి వచ్చెడిన్                 24      

పూసిన పాదప రాజము
వాసి పుడమి పైన రాలి వర్ణమ్మున స
ద్భాసితమై యొక్కింతగ 
వాసన విడి చంపకమ్మె వాసిం గాంచెన్                                                     23    

వేసర కింత యేనియు గభీర మహోన్నత భావ మొల్కఁగా  
నాసన మందుఁ గూలఁబడి యత్యధికమ్ముగ వాడ కీర్తియే
మాసిన మాయుఁ గాక తగు మాలగ నా పద సౌరభమ్ముతో 
వాసన లేని చంపకమె వాసిఁ గనెం గవి లోకమందునన్                              22  

మేలాముదమ్ము పాదప
జాలము లేని జగ మందుఁ జందం బొప్పం 
జాలించుమ యీ సుద్దులు 
కాలము లన్నింటను గలి కాలము మేలౌ                                                 21        

కాలము లందు మూటి నర కాయము గాంచిన జాడ లేదె యా 
కాలముఁ జూచినట్టి ఘన కాయుఁ డొకండును నేఁడు లేఁడుగా 
మేలుగఁ గాంచి చక్షువుల మేదిని నేఁడు విశంక నిక్కముం
గాలము లందు మేటి కలి కాలమె యంచు వచింత్రు పండితుల్                     20                
వివరం బెఱుఁగుమ కాదే
ని వశమె యెత్తఁగ నతనికి నిజ మైనవి కా 
వవి పంచదార బొమ్మలె
యవలీలగ నెత్తెను శిశు వశ్వముఁ గనుమా                                                 19    

ఛవి మద్భ్రాజిత కాంచనమ్ములును భాస్వద్రత్న భూషావళుల్ 
భువినిన్ బాలుర కేల చాలును గదా ముఖ్యంబుగా బొమ్మలే 
యవి యుండన్ సత చిన్ని బొమ్మ లట నాత్మానంద ముప్పొంగఁగా 
నవలీలన్ శిశు వెత్తెఁ జూడు మదె యా యశ్వంబు నుత్సాహియై                      18        
[అశ్వము= ఏడుసంఖ్య]  

మతిమంతుఁడ వీవు మహా
చతురుండవు కవి వరుఁడవు సంయమి వోలెన్   
వితత కథాంచిత రచనా
రతి భావాబ్ధిని మునిఁగితె ప్రాజ్ఞ వధానీ                                                           17                       


అతుల జ్ఞాన సముద్ర పూర్ణ శశి కాలాతీత మెన్నంగ నా
తత రీతిం జెలఁగంగఁ బల్క వకటా ధాత్రీ ధరాభమ్ము సం
తత గంభీర పదార్థ భేద కలన ధ్యానమ్మునన్ మున్గి యా 
రతి భావాంబుధి నోల లాడితె కవీ రమ్యావధానంబునన్                                     16
   
'మైకు - డిజే - సాంగు - లేకు' ఈ పదా లన్యార్థములో గణేశ నిమజ్జన వర్ణనము. 
అతి భారమై కుఱుచ మూ
రితి వడి జేగంట లడర లీల గణేశుం 
డతిశయిత సాంగుళీయము 
లతుల భజనలే కుదరఁగ నప్పుల మునిఁగెన్                                                   15    

యుక్త మగు విషయములను వి
రక్తిని నుపమింప నిప్పు రవ్వల తోడన్
భక్తి జనకమ్ముగఁ దనర 
ముక్తికిఁ గారణము విషయముల రక్తి గదా                                                        14     

ముక్తులు గిక్తు లేల యని బుద్ధిని మిక్కిలి యైన విత్త సం
సక్తత మీఱ సంతతము సంపద లింపుగఁ గూడఁ బెట్టఁగా
శక్తిని వాడ భోగముల జన్మ పరంపర లెల్లఁ, గోరమిన్ 
ముక్తినిఁ, బొందఁగన్ విషయ మోహమె కారణ మౌను సంయమీ                            13     

ఆఁకలి దహియింప నచ్చ టచ్చట నడ
యాడు చుండి ప్రీతి నారగింపఁ
బెద్ద ప్రొద్దునకు లభించె భోజన మంచుఁ
గప్పను గని పన్నగంబు వాఱె                                                                            12      

అప్పరమాత్ము లీల లరయం గడు వింతలు కప్ప భోగికిం 
గప్పకుఁ కీటకమ్ములును గాంచఁగ ధాత్రిని భోజనమ్ములౌఁ 
జప్పుడు నాలకించి వడి చయ్యన గృధ్రము వ్రాల, వీడి యా
కప్పను, గాంచి పన్నగము కాతర భావము నంది పాఱెడిన్                                     11  

చేసిన యుపకారమ్ములఁ జింత సేయ 
వీవు గుర్తుండుఁ జేయని వెల్ల నీకు  
నీదు దోషము లెంచిన నిర్భయముగ 
నేఁ గుబుద్ధుఁడ నీచుఁడ నింద్యుఁడఁ గద                                                                 10      

నే నొనరించితిం బనులు నెమ్మిఁ దలంచి పరోపకారమున్ 
దానము లర్థి సంతతికిఁ దప్ప కొసంగితి నీతి వీడ లో
కానఁ జరింతు ధర్మమునఁ గావున నైతిని యిజ్జగమ్మునన్
నేను గుబుద్ధుఁడం బరమ నీచుఁడ నింద్య చరిత్రుఁడంగదా                                         9     

జగ దారాధుం డగు ప
న్నగ భూషణుఁ డాగ్రహమ్మునఁ దెఱచి కంటిన్ 
నగ మద్రువన్ మేరు మహా
నగధారి యనంగుఁ ద్రుంచి నాతినిఁ బ్రోచెన్                                                                8    

అగజను దాపసిం గరుణ నారసి పెండిలి యాడి శంకరుం
డు గరిమ నెన్ని గర్వమును డుల్లఁగఁ జేసి ఖరంపు చూపుతోఁ  
బగతుఁడె యెంచ శంభునకు భావిని జన్మ నొసంగ నుండ నా
నగధరుఁ డంగజుం దునిమి నాతినిఁ బ్రోచె సురల్ నుతింపఁగన్                                      7  

ఆర్తినిఁ బెరిగినఁ గని స
ద్వర్తన సూత్రమ్ము నంతఁ దా మౌనమునన్ 
వర్తిల్ల మంగళమ్ములు 
భర్తకు గళసూత్ర మలర భామిని గట్టెన్                                                                        6         

వర్తన మందు నుత్తముఁడు పన్నుగ నల్లుఁడు కాఁగఁ బ్రీతిఁ ద
న్మూర్తికిఁ గాన్కయంచు సుమనోహర హార మిడం గుమార్తెకున్ 
నర్తన మాడుచున్ ముదమునన్ లలితాంగి చెలంగి యంతటన్
భర్తకుఁ గంఠసూత్రమును భామిని గట్టె మనంబు రంజిలన్                                               5  

బల విహీనుఁ డయిన బల్లిదు నెదిరింపఁ 
గా ననర్హుఁ డెన్నఁ డైన నరయఁ
గొట్టఁ జెంప దెబ్బ కోపమ్ము మీఱ న
రాతి కనులు దిరిగి వ్రాలె భువిని                                                                                   4   

నాతికి నా రతీ సతికి నాథుఁడు నిర్జర కార్య మగ్నుఁడై
వీత భయమ్ము మన్మథుఁడు వేయఁగ పుష్ప శరమ్ము కిన్కతో
భూత గణాధి నేత తన మూడవ కంటిని విప్ప శంక రా
రాతికిఁ గండ్లు గిఱ్ఱు మనె వ్రాలెఁ దనూ లత భశ్మ శేషమై                                                    3  

పుంస్త్వమున కీ డగు గిర ల
పుంస్త్వ బృహన్నలకుఁ జెప్పె ముగుదల కడఁ గా
బుంస్త్వము బయల్పడ నతఁడు 
పుంస్త్వమ్మును వీడి బ్రహ్మ! పొలఁతిగ మారెన్                                                                 2   

పుంస్త్వస్త్రీత్వము లెంచఁ దుల్యము లగుం బో సృష్టి కార్యార్థమై
పుంస్త్వధ్వంసపు శాప మీయ సతికై ముక్కంటి రాజన్ని జా
పుంస్త్వంబం దిలఁ జక్క సూనుఁ గనియెం బో సూర్య వంశస్థుఁడే 
పుంస్త్వాకారము బ్రహ్మ కిం పొదవమిం, బూనెం గదా స్త్రీత్వమున్                                        1
[బ్రహ్మ = ఈశ్వరుఁడు] 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి