అడుగ కున్న నీ వెన్నండు నమ్మ యైనఁ
బెట్ట నేర్చునె యన్నము కట్ట నీకు
మెత్తగా నున్న నెల్లరు మొత్తు వార
కామమును గోపమే కదా కామ్యము లిడు 60
ఏమైనన్ మఱి యేది కల్గినను మీ కెన్నండు డెందమ్ములం
దేమీ యిట్టుల నయ్యె నంచు వగ పింతింతేని రాకున్నచో
మీ మీ కోర్కెలు దమ్మ మందుఁ దనరన్ మీ కిన్క లట్లుండఁగాఁ
గామక్రోధములే కదా నరులకున్ గామ్యంబు లిచ్చున్ సదా 59
పలికెఁ బ్రొద్దుఁ గుఱ్ఱ ప్రక్కనఁ దా నిలు
వంగ తమ్ముఁగుఱ్ఱ వంత తోడఁ
గలఁత వల దెడందఁ గమ్మని సుద్దు క
రమ్ముఁ దెచ్చె హనుమ రామున కని 58
అమ్మకచెల్ల దాశరథు లాజిని బమ్మను మేఘనాథుఁడే
కుమ్మగ దొడ్డ తూపునను గూల దురమ్మున నంత నుంటకై
నెమ్మిని రామలక్ష్మణులు నేర్పున మందుల కొండ నెత్తి తో
రమ్మునుఁ దెచ్చె మారుతియె రామునకై ముద మంద వానరుల్ 57
నేర్పకుండ నెట్లు నేర్తుము మేమాడఁ
జూడ నెంచి తేని యాడ మేము
బూర నూదుచుండి మూరుచు రేపు మా
పాడ నేర్పు మనుచుఁ బాము లడిగె 56
[రేపుమాపు + ఆడ= రేపు మాపాడ]
వీటను చూచి నట్టి వగు వింతల నక్కట యేమి చెప్పుదుం
దూటులు లేని యత్తెలివి దోరము సెల్గఁగఁ జుట్టలై చనం
మేటివి కొన్ని బాము లవి మీఱఁగఁ బాములు గోయిలమ్మలుం
బాటలు పాడ నేర్పుమని పాములు వేడెను గోయిలమ్మలన్ 55
ఏ తీరునఁ జూచెదు వా
రీతిని వీక్షింపు మంచుఁ బ్రేమ సెలంగన్
నాతి రుమయె సుగ్రీవునిఁ
గోఁతినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్ 54
నాతియె మించుఁ బాటలను నాట్యము నందము నందుఁ జక్కఁగా
నాతఁడు మించు శిల్పముల నందము లొల్కెడు రీతిఁ జెక్కఁగాఁ
బ్రీతినిఁ గోఁతి పిల్లి యని పిల్చుచుఁ బెర్గఁగ నొక్కరొక్కరిం
గోఁతినిఁ బెండ్లి సేసికొనఁ గోరెను సుందర నారి యిచ్ఛతో 53
చేకొన జయమ్ము సంగ్రా
మాకాంక్షుఁడు ద్వంద్వ యుద్ధ మప్పు డొనర్పన్
వీఁక రణము సేయుదు నని
రాకొమరుఁడు బిచ్చ మిమ్మురా యని వేడెన్ 52
ఆఁకలి కుండు నెందు నుచి తానుచితమ్ములు భూ తలమ్మునం
బ్రాకట మయ్యె నిప్పు డిది పన్నుగ నెల్లర కక్కజమ్ముగన్
సాఁకఁగ బిడ్డ నింటఁ గడు చక్కఁగ నైన నిదేమి చిత్ర మౌ
రా కొమరుండు బిచ్చ మిడరా యని వేడెను పేద వాకిటన్ 51
నేటి వారి కింపు నిన్నటి వారికి
సొం పొసంగదే ధరింపు మీవు
సుందరతర మయినఁ జొక్కాయ కింతలు
కన్ను లున్న వంచుఁ గలఁత యేల 50
[కన్నులు = రంధ్రములు]
క్రన్నన నింటివాఁడ వికఁ గమ్ము ప్రయత్నము లింకఁ జేయుమా
మిన్నగ జాగు సేయకుమ మిత్రుఁడ నే వచియించు చుంటినే
సన్న శరీర సుందరులు చక్కఁగ నొక్కరినిన్ వరింప నీ
కన్నులు గల్గినం గలఁత గాంచుట యేలఁ గనంగఁ జాలవా 49
[నీకు + అన్నులు = నీ కన్నులు]
వచ్చి నట్టి వాఁడు బంధు వనుచు నెంచి
యున్న నింక లేకయున్న నొసఁగఁ
గంటగింపకుండఁ గాంచి వడ్డించిన
వంట లేని యింట బంధువు దినె 48
పంటయు నింట నుంటయు స భద్రము గల్గు నకంటకమ్ముగా
వెంటఁ జరింప నింటిది నివేశము సేరి తలంచి యట్టులం
గొంటయె కాని భక్ష్యములు గూర్మి సెలంగఁగ నే దినమ్మునన్
వంటయె లేని యింటఁ దిని బంధువు ద్రేన్చెను బొట్ట నిండఁగన్ 47
కల్లయె యుంట కనఁబడని
ముల్లులు పురుషాధము లిట మును ముందుగఁ దా
నుల్లమున నెఱిఁగి యెల్లినిఁ
జెల్లని రూక నిడి మగఁడు చీరన్ దెచ్చెన్ 46
తల్లడిలంగ దార వర తారలు గట్టిన చీర లంతఁ దా
నుల్లము నందు వీక్షణము నొప్పుగఁ జేసి యొసంగ నాజ్ఞనే
చల్లగ నూఱడిల్లుమ విశాల విలోచన! చెల్ల దింక నీ
చె ల్లని రూకతో మగఁడు చీరను దెచ్చెను భార్య కోసమై 45
[చెల్లు= కొనసాగు (క్రియ); చెల్లు = చెల్లుబడి, అధికారము, (విశేష్యము)
అల! తెలుఁగు వాఁడు గాఁడే
చెలరేఁగుచు శ్రావ్యముగ వశీకరణుండై
లలితంపు టన్య భాషం
బలుకన్ రానట్టి వాఁడు పాటలు పాడెన్ 44
చలము సెలంగ డెందములఁ జక్కని కంఠము గాంచి నంత ను
త్తలము జనింప మిక్కుటము తత్తఱ పాటునఁ బట్టణమ్ములోఁ
బలువురు రిక్త నిందలను బాధ లొసంగినఁ గూడ ఱేపుమా
పలుకులు రానివాఁడు పలు పాటలు పాడె జనమ్ము మెచ్చఁగా 43
[ఱేపుమాపు + అలుకలు = ఱేపుమా పలుకలు]
అన్నమునకుఁ గా దిది సమయమ్ము గాన
నఱవ కుండఁ దినుండని యందఱకును
బంచదారతోఁ జేసిన పాటవంపు
టాఁకలి యని కేక లిడఁగ రోఁకలి నిడె 42
ఆఁకలి మాట దేవుఁడు నిజాత్మనెఱుంగుఁ జెలంగెఁ గష్టమే
వీఁకను దంచు మంచును వివేకము తోడుత నెల్ల నూకలం
గూఁకలు సైపఁ జాలక స కోపము దా విన నన్య రీతిగా
నాఁకలి యంచు కేక లిడ నమ్మ యొసంగెను రోఁకలిం గటా 41
ఎక్కడి కైనను బోదము
స్రుక్కిన యది సాలు నింక సుందర తనువే
పొక్కెను వెక్కసముగ నా
కుక్కను సహియింప ననుచు నుగ్మలి పలికెన్ 40
[నాకు +ఉక్కను =నా కుక్కను]
తిక్క సెలంగఁగా నపర దిక్కుల నున్న జనాలిఁ గాంచఁగా
నెక్కటి వింత మచ్చునకు నిట్టివి భారత మందుఁ గాంతుమే
పెక్కురు బోధ సేసినను బెన్మిటి మారక యున్న నింటి బొ
గ్గుక్కను సైప లే ననుచు నుగ్మలి చేరెను బుట్టి నింటికిన్ 39
[బొగ్గు +ఉక్కను = బొగ్గుక్కను]
ఈ కలఁత నింక వీడుమ
నీ కగును శుభము లచిరము నెమ్మి వహింపన్
వే కని త్యజింపుమీ చీ
కా కా పట్టి ననె వచ్చుఁ గాన్కల్ బిరుదుల్ 38
[చీకాకు +ఆ పట్టిన్ = చీకా కా పట్టిన్; పట్టి = బిడ్డ]
ఏ కావ్యంబున కెట్టి యాదరణమో యెవ్వం డెఱుంగున్ ధరన్
వైకల్యమ్మును జెంద నేల మదినిం బాండిత్యమే చాలునే
యా కల్యాణపు రాజ యోగ మది నిండై, యేల కాకమ్ము నాఁ
గా కా, పట్టినఁ గాని రావఁట కదా కాన్కల్ పురస్కారముల్ 37
[కా కా = కాకి యఱపు]
పలుకు లింపుగ ధర్మమ్ము లొలుకు చుండు
చేత లవియెల్లఁ బరికింప రోత లగును
సాధువు లనంగఁ జెలరేఁగు చపల హృదుల
రామ! పదధూళి తలవ్రాత లేమి మార్చు 36
కామ పరీత మానసులు కాలిడఁ గల్గునె పాల నార్థమై
భూమిని శాంతిసౌఖ్యములు పూరుషు లుందురె చింత లేక ధా
త్రీ మనుజాధినేతల ప్రవృత్తుల నేరమె స్వార్థ చింతనో
త్క్రాముని పాదధూళి తల వ్రాతల మార్చునె నమ్ము టొప్పునే 35
[చింతనా + ఉత్క్రాముని = చింతనోత్క్రాముని]
ఆ రాముని మాహాత్మ్యము
నీరధి కరుణామహిమము నెగడఁగఁ బారా
వారమునఁ గల్గె వంతెన
వారధినిం గట్ట లేదు వానరు లెవరున్ 34
దారుణ రీతి రక్కసుఁడు ధర్మము వీడి హరింప సీతకై
పోరునఁ జంప రావణుని మూరుచు నంతియ కాని దుర్మతిం
గోరుచు భోగ భాగ్యములు కొల్లలు లంకను నాక్రమింపఁగా
వారధిఁ గట్ట లేదు గద వానరు లెవ్వరు రామ భృత్యులై 33
అంబరాంబరుండు శివుండు నక్షరుండు
కాలకంఠుండు నిత్యకపాలధారి
చంద్రచూడుండు త్రిపురారి శంభుఁడు జిత
దండధరుఁ డిచ్చు ముక్తిని దర్శనమున 32
గండము భండనమ్ములును గల్గక యున్నను గాలవాయువుల్
మెండుగ వీవకున్న నిల మీరము నింగిని ముట్టకున్న ను
ద్దండున కైన బక్కకును దథ్యము కాలము దాపురించినన్
దండధరుం డొసంగు నఁట దర్శన మాత్రమునన్ విముక్తినిన్ 31
క్రూర కర్మ నిరత నర కోటి కంప
కాఁడు భక్తుల కక్కఱకాఁడు శిష్ట
మేదినీ జనుల యఘము మృగపు వేఁట
కాఁడు వేంకటేశుండు గాపాడువాఁడు 30
పాడిగ భక్తి నూని మదిఁ బన్నుగఁ గొల్చిన డెందమందునున్
గోడు వినంగ సత్వరము గూర్మినిఁ జూపెడు వాఁడె నేఁ డహో
వేఁడిన మోసగాఁడు నల వేడుక కాఁడు మఱెట్టి కాఁడునుం
గాఁడఁట వేంకటేశ్వరుఁడు గాచెడి దైవము మానవాళికిన్ 29
'కల - తల - వల- వెల' ఈ పదాలను అన్యార్థముల
సంక్రాంతి సంబరాలపై స్వేచ్ఛాఛందములో:
కలఁతలు దీర్చి ప్రజకు భూ
తలమున భాస్కర వలయము తద్ద శుభమ్ముల్
వెలయం జేయును గిరణా
వలితో సంక్రాంతి మకర పదసంప్రాప్తిన్ 28
భోగి మహోన్నతమ్ముగను భోగ కరమ్మని యెంచి నెమ్మదిన్
దాఁగిన కట్టె లన్నిటినిఁ దద్ద రగిల్చి జయింత్రు శీతలం
బాగక విష్ణుచిత్తజ సమంచిత చిత్త వరించి విష్ణునిం
దూఁగుచు భర్తృ వక్షమునఁ దుష్టిఁ జెలంగుచు నుంట వింటిమే 27
రామాగ్ర హానల శిఖా
భీ మాతప సదృశ విశిఖ వేగ విఘాతుం
డై మోక్ష మందె నసురుఁడు
కామాసక్తునకె దక్కుఁ గైవల్య మహో 26
ధామస్థుం డయి తాను బొంది వరుసన్ ధర్మార్థ కామమ్ములన్
శ్రీమంతుండు దరిద్రుఁడుం బుడమి నిర్వేదంబు వర్ధిల్లినన్
వే మోక్షార్థమ నిత్య మచ్యుతుని సేవింపంగ సన్యాస స
త్కామాసక్తుఁడె యర్హుఁ డయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్ 25
కాంచ దేశ మనిన మట్టి కాదు దేశ
మన్న మనుజ వరు లగుదు రెన్నఁ డేని
ధీనిదు లడరు చుండ నదీన విగత
శుంఠల వలన దేశమ్ము శోభఁ గనును 24
బాలు రనంగ నేల పరిపాలిత దేశము నందుఁ బెద్దలున్
వాలి సశాస్త్రవిద్యలను బండిత సంచయ మాన్యవిద్యలన్
మే లొనఁగూడఁ బౌరుల కమేయము నిత్య మశాస్త్ర విద్యలన్
బాలురు శుంఠలైన యెడ భారత కీర్తి మహోన్నతం బగున్ 23
వృద్ధి సెందఁగ వంశము బుద్ధి యున్న
నెవ్వఁ డందఁడు హర్షమ్ము నెడఁద లోన
సంతసమ్మునఁ బొంగుచుఁ జెంత నంతఁ
గాకికిం గాకి పుట్టఁగఁ గాకు లఱచె 22
సాఁకునొ సాక కుండునొ విచారము నూని యెడందలో నికం
దాఁకునొ తాక కుండునొ సుతం గర యుగ్మము తోడ నంచునున్
లోకులు కాకులే యన విరుద్ధమె కూఁతురు వుట్ట హర్ష మే
కాకికిఁ గాకి పుట్టె నని కాకులు గోలిడె గుంపు కట్టుచున్ 21
[కాకి = అల్పము; హర్ష మల్పము]
తీయ తీయని చందపుఁ దీరు నుండ
మానసం బలరు పగిది మ్రాను లందుఁ
బాడు రాగము సుద్దులు గూడి నట్టి
సద్దు సేయదు పికము వసంత మందు 20
నిద్దురం బెను తిండిఁ గోరెడు నిత్య కాములఁ గాంచి యె
ప్పొద్దు వోలుచు వారిఁ దాఁ దలపోయకే నిజ ధర్మముం
దద్ద మామిడి పల్లవమ్ము సతమ్ము మెక్కి పరుండి యే
సద్దు సేయదు కోకిలమ్మ వసంత కాలము వచ్చినన్ 19
ధర కీయఁగ నానంద మ
సుర నాథుని రావణుని యసువులు హరింపన్
సుర లెల్లరు మ్రొక్కం దన
కురు కులమున రాఘవుండు కోరి జనించెన్ 18
[తనకు +ఉరు కులమున = తన కురు కులమున]
కురుసైన్యమ్మును రూపుమాపె వెసఁ దా ఘోరాజి నుగ్రుండు సం
గర విద్యానిపుణుండు శత్రుకరికిం గంఠీరవుం డిద్ధరన్
నర నారాయణులన్ నరుండును బృ థానందుండు పెన్వింటినిం
గురు వంశంబునఁ బుట్టి కీర్తిఁ బడసెం గోదండ రాముం డహో 17
మన్నించి తరళ లోచన
తన్ను వరించె నని పద్మ దళ నిభ నయనుం
గ్రన్నన వరించి నెచ్చెలి
యన్ననుఁ బెండ్లాడె నతివ యందఱు మెచ్చన్ 16
కన్నల కింపు గొల్ప జనకప్రభు ముద్దుల పట్టి దేవతా
సన్నిచయంబు డెందముల సంతస మంద నభస్స్థలమ్ములో
నన్నుల మిన్న సీత వనజాయత పత్ర నిభాక్షి వీరు రా
మన్ననుఁ బెండ్లియాడె సుగుణాంబుధి బంధువులెల్ల మెచ్చఁగన్ 15
ఆద్యం బయిన మనశ్శో
కాద్యావలి మఱవ నీక యార్తి సెలంగం
జోద్యంబై జ్ఞప్తి నొసఁగ
సద్యఃస్ఫూర్తియె బుధులకు సంకటము లిడున్ 14
విద్యా బుద్ధులు నేర్చి మిక్కుటముగన్ విద్యాధికుండై వెసం
బద్యవ్రాతము దా రచించి రచనా ప్రావీణ్య మేపారఁగన్
విద్యా గంధ విహీన భూధవునకున్ విన్పింప దీపింపఁగా
సద్యఃస్ఫూర్తి, యొసంగుఁ గష్టములు నష్టంబుల్ బుధశ్రేణికిన్ 13
పఱచుచు వెన్నెల మనమున
నఱమఱ లేక యొక యింత యలరింపఁగ నం
దఱఁ జంద్రుఁ, డస్తమింపఁగఁ
జుఱచుఱ చూడ్కుల దినమణి, సుధలం గురిసెన్ 12
వెఱ పొక యింత లే కెదల విస్తృత దర్పము మూరు చుండఁగా
నెఱఁగక యున్నఁ దన్ను గని హీన మనస్కులు వారి నొంపఁగా
నఱిముఱి సెంద ముజ్జగము లార్తి నభోమణి కంద గాత్రముల్
చుఱచుఱ చూపులం గనలి చూడ్కులలో సుధఁ జిల్కె భానుఁడే 11
[సుధ = సున్నము; నభోమణి = నింగి నున్న (సున్నపు) ఱాయి]
వర విష్ణు ధనువు నెక్కిడి
ధరామరు తపోమహిమను దాఁ గొని హరియే
గిరి కేఁగ నిర్జి తాఖిల
భరతునకున్ వేణుధరుఁడు పాదము నిచ్చెన్ 10
[నిర్జి తాఖిల భరతునకు = జయించిన భరతఖండము గలవాఁడు,
ఇక్కడ పరశు రాముఁడు; పాదము నిచ్చెన్ = మహేంద్ర గిరికిఁ జనఁ
బాదము నడచుటకు ఖండింపక యిచ్చెను]
త్వర గెలిపింప బాలవరుఁ బన్నిన యా సభలోనఁ బేర్మితో
భరతున కిచ్చెఁ బాదము శుభం బనుచున్ మురళీ వరాఖ్యుఁడే
నరు జయ మెంచి యా నళిన నాభుఁడు తేరున నిల్ప విశ్వ గ
ర్భ రతున కిచ్చెఁ బాదము శుభం బనుచున్ మురళీధరుం డహో 9
పూర్ణ మెఱిఁగి యింద్రుని నిజ
గర్ణ సుకుండలము లొసఁగి కలనున సమయన్
నిర్ణయ మివ్విధిఁ దగునే
గర్ణుఁడు భీరు వతి లోభి క్ష్మాపతు లందున్ 8
చూర్ణము సేయువాఁడ రిపు శూరుల నాజిని వేసి నారి నా
కర్ణము లాగి నే శర నికాయము నం చని కౌరవేద్ధ సే
నార్ణవ మగ్నుఁ డుత్తరుఁడె యారయ జిష్ణుఁడు స్యంద నాఖ్య నౌ
కర్ణుఁడు లోభియై మసలె క్ష్మాపతు లందున భీరు వాతఁడే 7
[యుద్ధ మొసఁగుటలో లోభియై; స్యందనాఖ్య నౌకర్ణుఁడు = రథ మను
నౌక చుక్కాను ధరించిన వాఁడు, బృహన్నల; జిష్ణుఁడు =అర్జునుఁడు]
కీర్తి నింపునె యుదరమ్ము నార్తి తీర్చి
మాన్య! యున్నంత వఱకైన మానకుండ
వీఁకఁ బోషింపు మింపుగ లేక యున్నఁ
దనువు శాశ్వతము సుకీర్తి గన క్షణికము 6
ఇలలో నొక్క దురాకృతమ్మున యశం బెల్లన్ నశించుం ద్రుటిం
గల కాలం బన స్వప్న మెంతవఱకుం గన్పించు నా కాలమే
లలితం బివ్విధిఁ జింత సేయ నరుఁ డుల్లం బందు నిక్కం బగుం
గల కాలంబు శరీర ముండును దటిత్కల్పంబు సత్కీర్తియే 5
వింత లే దిందు సుంతయు సంత తాను
కంపన మడర జనుల రమింపఁ జేయు
దివ్య నది యగు గంగాసతి తన చెల్లి
పార్వతికి రమాదేవి సపత్ని యగును 4
[రమా దేవి = సంతోష మొసఁగు స్త్రీమూర్తి]
పర్వదినమ్ము నందుఁ బరిపాటిగ నొక్కెడఁ గూరుచుండఁగా
గర్వము తోడ నిట్లుడివెఁ గర్మఠుఁ డొక్కఁడు సత్వరమ్ముగా
సర్వ మసత్యమౌ నటులఁ జారుతరమ్ము వచింపుమా యనం
బార్వతికిన్ రమాసతి సపత్ని యటంచు వచింత్రు విజ్ఞులే 3
ధర్మ సంసక్త వర్తన నిర్మలాత్ము
సర్వ భూత రాసుల యందు సంతత కరు
ణార్ద్ర చిత్తతన్ లోక కల్యాణ కార
కాత్మ పూనఁగా నూఁగు మహాత్ముఁ దలఁతు 2
ఆత్మ నొకండు నుండుఁ బరమాత్మ వరాఖ్య వెలుంగు చుండి జీ
వాత్మ కొసంగి సంతతము నంచితమైన స్వతంత్ర భావ జా
లాత్మక బుద్ధి కర్మ సముపార్జిత భోక్తను జేసి యట్టి య
య్యాత్మలు పూన నూఁగు మహితాత్ముల నేను దలంతు నాత్మలోన్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి