ఎండ యచటఁ గాయు చుండ మండుచు నుండి
కందుకంపు టాటగాఁ డొకండు
కొండొక తఱి మున్ను మెండుగ నాడఁగ
బంతి తగిలి గొనియెఁ బ్రాణములను 57
చింత యొకింత లేక యెద శీఘ్రమ తాఁ జని వెండి కొండ కా
యింతినిఁ గూర్ప శంకరున కింపుగ నంతక చిత్త సక్త గ
ర్వాంతకు నుగ్ర రూపుఁ గని యంగజుఁ డత్తఱి మారుఁ డేయఁ బూ
బంతి రయమ్మునన్ దగిలి ప్రాణములం గొను టెంత వింతయో 56
వజ్రమును గోయఁ గావలె
వజ్రం బెవ్వరికి నైన వసుధన్ నీ క్షు
ద్వజ్రంబున కమ్మి వెసన్
వజ్రపు టుంగరము మ్రింగ వలె మేలుఁ గనన్ 55
వజ్రికి నాయుధం బగును బాణి తలమ్మున వెల్గి నిత్యమున్
వజ్రము నీకు భూషణము పాయక నూన శరీర మందు నా
వజ్రము మూర నాఁకలి యపారముగాఁ దపియింప కమ్మి నీ
వజ్రపు టుంగరమ్మును శివా యని మ్రింగిన మేలు నీ కగున్ 54
ధర్మ రక్షణ మందుంచి తద్ద రక్తి
నిర్మలమ్ముగ డెందమ్ము నిల్పు చుండి
నిత్య మిల రామ భద్రుని నిర్జిత ఘన
రాక్ష సేంద్రునిఁ గొల్చుటె రక్ష నీకు 53
రక్షిత సంయమివ్రజుని రాఘవ వంశ పయోధి చంద్రునిన్
శిక్షిత తాటకాసురిని సేవిత పన్నగ భూషణున్ జగ
ద్రక్షకు దీన వత్సలుని రామ వరాఖ్యుని, వేగ వీడి యా
రాక్షస రాజుఁ, గొల్చిననె రక్షణ నీకు లభించు నిచ్చలున్ 52
మగ్నంబై క్రోధమ్మునఁ
బ్రాఙ్నగముం దాఁటఁ గాంచి రాహువు రవినిన్
భగ్నంబొనర్పఁ బట్టఁగ
బ్రాఙ్నగ మధ్యమునఁ గ్రుంకె భానుం డయ్యో 51
దృఙ్నిచయ విస్మయమ్మునఁ
బ్రాఙ్నగ పర శైల మందు రథికుండు వ రా
సృఙ్నిభ వర్ణుఁడు వఱలుచుఁ
బ్రాఙ్నగ మధ్యమునఁ గ్రుంకె భానుం డయ్యో 50
వాఙ్నుతులన్ ముదం బెడఁద వర్ధిల బొంగుచు మిక్కుటమ్ము తి
ర్యఙ్నర భంగిఁ గాక చన రమ్య తరమ్ముగ వేగ వంతుఁడై
భాఙ్నిచయమ్ము నెల్లను గబంధుఁడు కోపము తోడ మ్రింగఁగాఁ
బ్రాఙ్నగ మధ్యభాగమున భానుఁడు గ్రుంకె నదేమి చిత్రమో 49
వనజాయతాక్షి డెంద
మ్మున సంత్రాసమ్ము కరము మూరఁగ నార్తిం
బెనిమిటి కంటి కలఁకకుం
జనుపాలిడి సౌఖ్య మిచ్చె సతి తన పతికిన్ 48
పనిలో నుంటిని నిల్వుఁ డంచనక తాపం బేల సంత్రాస మే
లను మీ కివ్విధి నంచుఁ జేయకయె నిర్లక్ష్యమ్ము భక్షింప రం
డని యాసీనునిఁ జేసి తత్క్షణమ యల్పాహారమున్ వెచ్చగాఁ
జను పాలిచ్చి సుఖింపఁ జేసెను గదా చంద్రాస్య ప్రాణేశునిన్ 47
శీఘ్ర చరులు గోవదన
వ్యాఘ్రమ్ములు కారె నరులు పరికింపంగన్
వ్యాఘ్రము నమ్మరు మగువలు
వ్యాఘ్రము మగవాఁడు నమ్మవచ్చునె మగువా 46
జిఘ్రుఁడు విత్త సంపదల చెల్వపు వాసన లున్న మానవ
వ్యాఘ్రుఁడు మించుఁ గ్రూరతను వ్యాఘ్రము నెంచ నెడంద నింపుగా
శీఘ్రపు నిర్ణయమ్ములను జింతలు సేకుఱు నిశ్చయమ్ముగన్
వ్యాఘ్రము వంటివాఁడు దగవా మగువా మగవాని నమ్ముటల్ 45
వే కను మీ క్రమ మొప్పుగ
వేకువ లేచి పరికించి భీతిని నిలువన్
వీఁక హరివ్యాఘ్రమ్ములు
కాకుల్ గర్జించెఁ గుక్క గాండ్రించె నయో 44
పోకల్ ఘోరము లౌను స్వార్థపరులే భూగోళ మందెన్నఁగా
లోకుల్ కాకులు కుక్కలౌదు రిల నాలోకింప సత్యమ్మునుం
గా కెన్నండును వారి కీవు బలి దుష్కర్మాలి వీక్షింపుమా
కాకుల్ గర్జన సేయఁగా శునకముల్ గాండ్రించె నుగ్రమ్ముగన్ 43
ప్రచురపు టిక్ష్వాకుఁడు రా
జు చనఁ గుమార వనమునకుఁ జోద్యం బయ్యెన్
సుచరిత! సుద్యుమ్నున కల
కుచములు పురుషునకు వచ్చెఁ గోమలికి వలెన్ 42
అచటను గాంచ మాఁడు మగ యన్నవిభేదము పంచ సైన్యమున్
విచలిత చిత్త మింతయును వీరుల వీరల యందుఁ గాంచ రా
దచల నిభంపు ధైర్యమున నద్భుత రీతిని నంక మందుఁ దాఁ
కు చములు వచ్చెఁ బూరుషునకున్ గొమరాలునకున్ సమంబుగన్ 41
[చమువు = సేనా విశేషము]
నలుగురు మన్మథ తుల్యులు
నలుగురు శాంతస్వరూప నరవరు లెంచం
దొలఁగదు వేఁడిమి వలనను
నలుగురి యంగ విభవ మన నచ్చిరి సర్వుల్ 40
వెలుఁగఁగఁ జేయు సూర్యకుల వీరుల విక్రమ మెల్ల దిక్కులం
దొలఁగఁగఁ జేయు సత్వరము దుఃఖము రాఘవ దర్శనం బెదం
గలుగు నెడంద సంత సము గాంచిన రాఘవు లైన యట్టి యా
నలుగురి యంగ వైభవ మనన్ దల లూఁచిరి సంతసమ్మునన్ 39
భూ జనులకు నెల్ల ముద్దుల మామయై
తనరు చుండు నట్టి ఘనుఁడు ప్రీతిఁ
దనయలను గ్రహించి దక్షున కా చంద
మామ యల్లుఁ డయ్యె నేమి వింత 38
మామకు మామ యయ్యె హరి మాతకు కూతురహో సపత్ని యై
గోముగ వెల్గె వింతగను గుంభిని వింతల నెన్న శక్యమే
భామిని సీత కాంచ సుత వర్యుల భూమికి రాముఁ డబ్ధికిన్
మామయె యల్లుడయ్యెను గుమారియె యత్తగ మారె వింతగన్ 37
కల్లయె శాఖాహారులె
యెల్ల ప్లవంగము లనంగ నిద్ధరలో వ
ర్ధిల్లి, భయంపడ కింతయుఁ
బిల్లికి, జనియించి కోఁతి పికమును మ్రింగెన్ 36
ఉల్లము నందు నెంచి తన కొప్పెడు పండని యుత్సహించుచుం
దల్లడిలంగఁ బక్షి కని దారుణ కర్మము నొక్క గ్రుడ్డునుం
జల్లని వేళ నొక్క కపి సత్తము భార్యకు మున్ను, కాక యే
పిల్లికిఁ, బుట్టి కోఁతి గడు వింతగ మ్రింగిన దొక్క కోకిలన్ 35
ప్రీతిని వ్రాయఁగ నిజ సం
జాతుఁడు రవి యన నొకండ సంహర్షణ సం
జాతము సన్నిధి సేరఁగ
రాతిరి యుత్తరము నందు రవి యుదయించెన్ 34
[ఉత్తరము = జాబు]
భూత వితాన మంద రహి భూతల వాస చ రాచ రాలి ప్రా
భాతిక మందుఁ గాక మఱి భాస్కరుఁ డెం దుదయించు నెన్నఁడే
నాతత కాంతు లీనుచు సమంచిత రీతినిఁ దూర్పు దిక్కునన్
రాతిరి యుత్తరంబునను రమ్యముగా నుదయించె భానుఁడే 33
[ఉత్తరము = మీఁదిది, రాత్రి కుత్తరము పగలు]
డుంఠి వినాయకు కరుణన్
శుంఠుల నశియింపఁ జేయఁ జోద్యముగ మహా
కుంఠిత విక్రమ రాక్షస
కంఠీరవ కంఠ మందుఁ గరి యుదయించెన్ 32
[కంఠము = సమీపము; కరి = కోఁతి, ఇక్కడ మారుతి]
కుంఠీ భూత పరాక్రముం డనుపమక్రూరుండు దైత్యుండు వై
కుంఠద్వేషి హిరణ్య భోజనుఁడు నా ఘోరేభ తుల్యుండు నా
కంఠాఘాబ్ధి మునుంగ మాధవ లసత్కంఠీర వోత్సుంగపుం
గంఠం బందున దిగ్గజమ్ము వొడమన్ గంఠీరవం బొప్పెనే 31
[కంఠము = సమీపము]
ఎవ్వని శాపమొ తగ్గక
రవ్వం తైనను గడింది రసి కాఱంగన్
నొవ్వునఁ గంటిం గాచిన
పువ్వు దినాంతమునఁ బెద్ద భూతం బయ్యెన్ 30
నవ్వుల కన్న దంచును మనమ్మున నెంచకు మయ్య దీనినిన్
దవ్వుల కాదు దగ్గఱనె తత్తరు రాజము జూడ నేఁగుమా
త్రవ్వఁగ భీకరాకృతి సెలంగ భువిం బడె నొక్క గండు ఱా
పువ్వు దినాంత మందుఁ బెను భూతముగాఁ గనిపించె వింతగన్ 29
[ఱా పువ్వు = ఒకానొక చెట్టు]
ఇన తేజుం డయ్యడవినిఁ
గనలి కిరాతుని పయిఁ గడఁక సెలంగఁ గర
మ్ము నరుం డేసినచో నీ
శున కమ్ములు వువ్వు లయ్యె శోభ వహింపన్ 28
కనకమ్ముల్ వెస నయ్యెనే యినుప ముక్కల్ రత్నమే ఱాయిగన్
మినుముల్ మారెను వేగమే యిసుకగా మే నయ్యెఁ గాష్ఠమ్ముగాఁ
గనలన్ భూమి సురుండు శాప మిడఁగాఁ గంపించి యొక్కుమ్మడిన్
శునకమ్ముల్ కుసుమంబు లయ్యె మిగులన్ శోభావిశేషంబునన్ 27
[తన పైకి శునకముల నుసికొల్పిన దుష్టుని నొక మునీశ్వరుండు శపించిన సందర్భము]
అంగుళ మేనియు నందుఁ గ
నంగ నశక్యంబు నూతన రహితము మహో
త్తుంగంపుఁ గుడ్య తలమున
బంగరు మేడ నొక కాంత వ్యాఘ్రముఁ గాంచెన్ 26
అంగన కుండదే భయ మనంతము డెందము నందుఁ జూడ న
బ్భంగిని నన్య పూరుషుని వ్రయ్యలు కాదె హృదండ మత్తఱిన్
దొంగను వ్యాఘ్ర సన్నిభునిఁ దొల్లి యెఱుంగని వానిఁ దూఱఁగా
బంగరు మేడపైన నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్ 25
వంగడము లొక్క టైనను
బొంగిన పంతమ్ముచేతఁ బోరుచు నంతం
ద్రుంగంగ నక్కటా నూ
ర్సింగము కాల్ నక్క గఱచెఁ జిత్రముగ నహో 24
[ఊర్సింగము = ఊరు సింగము,కుక్క]
బంగరు మాతృభూమిని నపార పరాక్రమ మొప్ప నిత్యమున్
భంగ మొనర్ప కెన్నఁడును బన్నుగఁ గాచుచు నుండ నొక్కెడన్
వంగిన సూడు నక్క పగ పట్టుచు సైన్యము నందు బంటు పె
న్సింగము కాలు నక్క గఱచెన్ గడుఁ జిత్రముగాఁ గనుం డదే 23
[సూడు నక్క = పగవాఁ డను నక్క; బంటు పెన్సింగము = భట మహా సింహుఁడు]
కవి వరుం డొకండు ననర్గల విధ మచటఁ
జెవుల పండువు నొనరింపఁ జెప్పుఁ డనుచు
నింకఁ దనచుట్టు నెల్లరు నెలమి తోడ
మూఁగ వినిపించె షట్శాస్త్రములను జదివి 22
[మూఁగు = కవియు]
చెవి కింపారఁగఁ జెప్పఁ గోరఁగఁ బరీక్షిత్తుండు మోక్షార్థియై
సవిశేషంబు రమా మనోహరు కథల్ సంతోష మేపారఁగన్
భువిలోనం బరమంపు హంస శుక నాముం డాఁత డవ్వానికిం
జవులూరన్ వినిపించె మూఁగ యొకఁడున్ షట్శాస్త్రముల్ వింతగన్ 21
[మూఁగ = పక్షి విశేషము, ఇక్కడ చిలుక యని / మూఁగ = మూఁగయే]
అల మాగధుం డపుడు పే
రలుకఁ బురము ముట్టడింప నత్యుగ్రుండై
బలరాముఁ డాయుధము రోఁ
కలిఁ బూని వధించె శత్రు గణముల నెల్లన్ 20
అలుకం బూని యరాతి సంచయము వీరావేశముం బొంది యా
కలనం బార్థకుమారుఁ డాత్మ పతి చక్కం ద్రుంపఁ దాఁ దక్కువే
పొలయం గాంచిన వంట యింట నలుకన్ బొద్దీఁకలం బెద్ద రోఁ
కలిఁ బూనెన్ వధియించె శత్రుగణమున్ గంజాక్షి క్రోధమ్మునన్ 19
మర్యాద నేమఱక యని
వార్యమ్ముగఁ జిత్ర వసన భామా మణులే
కార్యాలయములు సేరఁగ
సూర్యోదయ మైన పిదప చుక్కలు వొడిచెన్ 18
పర్యావర్తము సేయుఁ బూర్వ గిరికిం బాశ్చాత్యపుం గొండకున్
సూర్యుం డెప్పుడు మానకుండగను నస్తోకంపు ధైర్యమ్ముతో
నార్యావర్తము దాఁటి సంభ్రమముతో నస్తాద్రినిన్, వీడి వే
సూర్యుం డా యుదయాద్రి, నెక్కఁ బొడిచెన్ జుక్కల్ మనోజ్ఞంబుగన్ 17
తము దక్షిణ సాందీపుఁడు
కుమారుఁ బ్రతికింప మంచుఁ గోర గురునకుం
గొమరుఁ గొన రామకృష్ణులు
యమ మందిరమునకు నరిగి రతిహర్షమునన్ 16
అమలిన వెంగమాంబ యన నన్నుల మిన్నయె యన్నపూర్ణయై
సముదము రండు సత్వరము సక్కఁగఁ బెట్టుదు నన్న మన్న వే
కమలిన దేహు లాఁకలికిఁ గారుణి కమ్మున నన్నమెంచి యా
యమ సదనంబుఁ జేరి రతిహర్షమునన్ దమ భాగ్యమం చహో 15
ఇలలోఁ జిన్ని కుమారుఁడు
లలితుఁడు ప్రహ్లాదుఁడు వర రక్షస్సుతుఁడుం
గలఁడు పరమ భాగవతుని
తల లోనే యిమిడి యుండెఁ దత్త్వంబెల్లన్ 14
అల మున్నెందఱొ తాపసోత్తముల నభ్యర్థింపఁగాఁ బుట్టు వా
రల బోధామృత వార్ధులందుఁ గన నౌ రమ్యంబులౌ తత్త్వముల్
లలి తాంతఃకర ణైక సంయముల సల్లాపమ్ము లందింక వ్రా
తల లోనే నెలకొన్న దందు నిఁకఁ దత్త్వంబెల్ల యోచించినన్ 13
ధన నేరమ్మునకై దా
పనమున కాయాధి నేత వచ్చిన యంతన్
మనమున నప్పుడు ధనవం
తునిలోఁ బెనుగొండ భయముతో డాఁగెఁ గనన్ 12
మును కన్పట్టిన ధైర్య మెల్లయును సంపూర్ణమ్ము విధ్వంసమై
తను వెల్లం జలియింప మీఱ నెద సంతాపమ్ము ఫా లాంబక
మ్మును దా విప్పఁగ శంకరుం డెడఁదలో ముక్కంటి వీక్షింపఁ గం
తుని లోనన్ బెనుగొండ డాఁగె భయసందోహమ్ము వెన్నాఁడఁగన్ 11
కాకి యెప్పుడు వల్కును కా వని యిల
మేఁక సంతత మఱవదె మే యని విని
పింప నేరి కైనను విశ్వసింప కిట్లు
కా వనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మ ఫలము 10
కా వనుటం ద్యజించి మఱి కాకులు నేర్చునె పల్క నన్యమున్
నీ వన యెద్ది యైనను సునిశ్చిత మద్ది వచించు నట్టులే
కావున నెట్లు సెప్ప నగుఁ గాకుల కూతల కర్థ మివ్విధిం
గావని కావు కా వనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్ 9
ఖాద్యములు గావలెఁ దినఁగ
హృద్యమ్ములు గావలె విన నేరికి నైనన్
హృద్యమ్ములు గానివి నీ
పద్యము లన విజయవాడ ప్రజ లొప్పరుగా 8
ఆద్యము భాష పద్యమున కైనను నయ్యది గద్య మైననున్
విద్యయె నేర్పు వ్యాకరణ బృందము ఛందము నేరి కైననుం
జోద్యము సెప్ప నెల్లరును సుంత గణింపక వాని నంచు నా
పద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే 7
ఓరుపు వహించి యెడఁద వి
చారించి సమంచితముగ శాస్త్ర వితతులన్
సారమ్మును జ్ఞానవ దను
సారా! క్రోలంగ నొప్పు సౌఖ్యం బందన్ 6
[జ్ఞానవత్+ అనుసార = జ్ఞానవదను సార]
దారం బుత్రులఁ గావ బాధలకు నౌ ధామంబు నిత్యమ్మునున్
లేరీ ధాత్రినిఁ గావ నిన్నెవరు నుద్రేకమ్ము వే వీడుమా
పోరం జాలవు కృష్ణ వాఙ్మయ సుధన్ భోగమ్ములం జిద్విలా
సా రా క్రోలుము శాంతి సౌఖ్యములకై సంసార బంధమ్మునన్ 5
నిజముం గాంచి పరీక్షిం
ప జగము నందెన్నఁ డేని పన్నుగ నెదలన్
నిజ ధీ బలమునఁ గా దా
భుజబలమున సతుల మించు పురుషుఁడు గలఁడా 4
నిజ బల దర్ప మోహితులు నిక్కము నేరక తల్తు రెల్లఁ దో
యజ ముఖు లల్ప జీవులని యాత్మల వారికిఁ దోడు దైవమే
ఋజు వగు భక్తి తోడ మది నీశ్వరు వేడఁగఁ బుట్టి నట్టి శం
భుజ బల మందుఁ గాంతలనుఁ బూరుషుఁ డెన్నఁడు మించలేఁడులే 3
[శంభుజ బలము = శంభుని చేతఁ బుట్టిన బలము]
పిలిచిన దరికి రాకున్న నలిగి కరము
నాఁగలిని లాఁగి చెంతకు రేఁగి యంత
నయ్యమునకు నదీ మణి కట్లు రామ
రామ! గర్వభంగ మొనర్చి రాముఁ డలరె 2
భీమపు విష్ణు కార్ముకము ప్రీతి గ్రహించి మునీంద్రు నుండి సూ
చీముఖ మెక్కిడంగ నతి చిత్రము భార్గవు శక్తి డుల్లఁగా
సోమ నిభాననుండు రణ శూరుఁడు వచ్చిన జామదగ్ను నా
రాముని గర్వభంగమును రాముఁ డొనర్చెను దీమసమ్ముగన్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి