పరమానందము సేకురు
నరయఁగ నిసిలో సఖ మనసార వెలసి యం
బరమున రవి చంద్రుల యం
తరువున వెలుఁగొందుచుండెఁ దారలు గనుమా 52
[అంతరువు = తారతమ్యము]
సురుచిర శారదాగమము శోభ లొసంగును బాండురాంబు దో
త్కరములు చంద్రికా ధవళ కాంతులు నింగిని నాక్రమింపఁగాఁ
గర మరుదైన కుట్మల నికాయము రమ్య తరమ్ముగా నభ
స్తరువున వెల్గుచుండె నవె తారలు మాలిక లౌచు వింతగన్ 51
పగలు నిదురించి మేల్కని బద్దకమున
లెండు లెండంచు వేగంబ రం డనుచును
బాలుఁ డొక్కండు వింతైన బద్దకంపుఁ
గుక్కుటము మలిసంజలోఁ గూసె నహహ 50
తీయగ నెల్లవారలను దిట్టతనమ్మున రేఁగి కొక్కురో
కో యని కూసి మేల్కొలిపెఁ గుక్కుట మా తొలుసంజ వేళలోఁ
దీయగఁ దోడి వారలను దివ్వెలు నా కయి మూరి వెల్గె నొ
క్కో యని కూసి మేల్కొలిపెఁ గుక్కుట మా మలిసంజ వేళలో 49
[కుక్కుటము = 1. కోఁడి 2. మిణుఁగుఱుపుర్వు]
జాలి గలవాఁడు కావున
నాలము లేల నని యెంచి యవి యెల్లరకుం
జాల వని తలంచి యెడఁదఁ
బాలను విడి యతఁడు క్షీరపాన మొనర్చెన్ 48
[క్షీరము = నీళ్లు]
చాలిన యంత యుండఁగను క్షామము లేక యొకింత కుండలన్
మేలొన రింప నెల్లరకు మిక్కిలి మక్కువ సంతరింపఁగా
బాలుర కింక నారులకుఁ బా లొనరింపఁగ వేఱు వేఱుగాఁ
బాలను వీడి క్షీరమునుఁ బానము సేసె క్షుదార్తి దీరఁగన్ 47
ప్రాపున నింపుగ సర సా
లాపములు సెలంగు చుండ రాగం బలరన్
మైపులకింప నవార్యము
దీపమ్మాఱిన గృహమునఁ దేజమ్మెసఁగెన్ 46
[తేజము = వీర్యము]
వ్యాపారమ్ములు నిల్చి పోవఁ ద్రుటిలో నవ్వీటఁ జిత్రమ్ముగా
క్షిప్రంబెల్లెడఁ జూచు చుండఁగ జనుల్ సీఁకట్లు వ్యాపింపఁగాఁ
జూపఱ్ నివ్వెర నంద డెందములఁ జక్షుప్రీతి యేపారఁగా
దీపమ్మారిన యింటిలోన నెసఁగెన్ దేజమ్ము లొక్కుమ్మడిన్ 45
[ఆరు = అతిశయించు]
విత తాగమ వేత్త విబుధ
నుత చారిత్రుఁడు లసత్తనుండు మనమునన్
సతతమ్ము దేవ తాను
స్సతి గలిగిన బ్రహ్మచారి సత్పురుషుండౌ 44
నుత గుణవంతురాలు సు మనోహర రూప మహా పతివ్రతా
సతి గల ధన్య జీవిఁ గని సత్పురుషుం డని మెచ్చి రెల్లరున్
సతతము నింద్రియమ్ములు వశమ్మున నుండఁగ వేద విద్య నా
సతి గల బ్రహ్మచారిఁ గని సత్పురుషుం డని మెచ్చి రెల్లరున్ 43
చక్కని సభ లోన శబ్దార్థ భావ నై
పుణ్యము పరికించు పూన్కి యందుఁ
గవి గణమ్ము తోడి కమనీయ భాషార్థ
రణమె యశమును గవిరాజుల కిడు 42
తృణ నిభ భావ యోగ మితివృత్త లయమ్ము ద్రుతైక సంధి మా
రణము కడింది గ్రామ్య పద రాగ నిమగ్న మనోరథమ్ము దా
రుణ వికృతోప మావళి విరోధి సమాస వృథాప శబ్ద వా
రణ మొనరింపకుండఁ గవి రాజుల కచ్చపుఁ గీర్తి గల్గునే 41
క్రన్నన స్వీయ మనమ్మన
నెన్ని యనల దేవ సత్కృతేశ్వర వీర్యా
సన్నలు కృత్తిక లార్వురు
కన్నకొడుకె తన మగఁడని కాంత వచించెన్ 40
అన్నుల మిన్న కాత్మ నలరారఁగఁ బ్రేమము బావపైన సం
పన్న కుటుంబ జాత తన భావము తెల్లము సేయ నెంచి తా
నెన్ని భవమ్ము లెత్తినను నింపు వొసంగెడి మేన యత్తకుం
గన్న కుమారుఁడే తనకుఁ గాంతుఁ డటంచు వచించెఁ గాంతయే 39
పర దనమ్ముల పైనఁ దనరెడు నాస
పరుల దారల కయి మదిఁ బరఁగు కోర్కి
పరుల నేలఁ జూఱఁగొను తపనయు సత్య
మ తివయే మూలమౌఁ గలహమ్ములకును 38
[తివ = త్రికము]
సతి యగు సీతకై యసుర సంతతి సచ్చెను వత్సరమ్మునన్
సతి నగ వక్కజమ్ముగను జ్ఞాతుల నెల్ల వధించె నాజిలోఁ
గుతకుత లాడు నాగమ ప్రకోపము కూల్చెను మానవాళినే
యతివయె మూల మౌను గలహమ్ములకున్ భువి లోన నెప్పుడున్ 37
వారి జాయత లోచన చారు తరము
రాతి రెల్ల విద్యుద్దీప రాశి వెలుఁగు
చుండ నుద్యాన వన మందు మండితముగఁ
బండువెన్నెలఁ గను మమావాస్య నాఁడు 36
అమరె ధరాతలమ్మున మహాద్భుత దృశ్యము సూచుచుండఁ గాం
త ముఖము చంద్ర బింబ మయి తద్ద వెలుంగుచు నుండ నమ్మరో
సముచిత రీతి సుందరి కచమ్ముల కెన్నఁగ సాటి రాఁగ నా
యమవస నాఁటి రాత్రి చెలియా కనుఁగొమ్మదె పండు వెన్నెలన్ 35
నాక తలావృత సుర నీ
రాకరము విమల తరమ్ము నత్యంచిత మ
స్తోకము మందాకినిలో
నాకసమునఁ బూచెఁ గోయు మమ్మ జలజముల్ 34
ఆకస మబ్ధి గాఁగ నసితాంబుద మింపుగ శైవలమ్ము గా
వీఁక వెలుంగు వెన్నెలయె ఫేనము గా నుఱుముల్ రవమ్ము గాఁ
బ్రాకటరీతి వెల్గుచును రాతిరి సుందర తార లెల్ల నా
యాకస మందుఁ దోఁచె వికచాంబురుహంబులు గోయవే చెలీ 33
అరవిందాక్షుని స్మరణము
పురాకృత ఫలమునఁ గాక స్ఫురియింపదు సూ
హరి యాలకించి వేఁడఁగఁ
గరి కరుణం గనుఁగొనిన సుఖప్రదమె కదా 32
నరహరి దుష్ట శిక్షకుఁడు నామ సహస్రుఁడు విశ్వ రక్షకుం
డరి దర ఖడ్గ రాడ్వర గదాయుధ ధారి దయా సముద్రుఁ డా
హరి సరసీరుహాక్షుఁడు బుధావన దక్షుఁడు రక్షితాటవీ
కరి కరుణించి చూచిన సుఖప్రదమౌఁ గద యెల్లవారికిన్ 31
వింతగ వేయ జనౌఘము
గంతులు ఘన పారితోషకమ్ములు గొని శు
ద్ధాంతఃకరణు లడరి భూ
కాంతుని పెండ్లికిఁ జనె నొక కాంత సుతునితోన్ 30
సంతస మంతరంగమున సందడి సేయఁగ సంభ్రమించి శ్రీ
మంతుల యింటఁ బుట్టిన కుమార వరేణ్యుని సద్గుణైక ధీ
మంతుని సోదరోత్తముని మాన్యు నిశాకర సన్నిభప్రభా
కాంతుని పెండ్లి కేఁగె నొక కాంత తనూజుని తోడఁ బ్రీతితోన్ 29
మత్త మాతంగ మిభముల మందఁ గూడి
యేఁగు చుండంగ రేఁగిన యెలమి తోడఁ
గామ సాగరమం దభంగం బనంగు
తమ్మివిరి దాఁకి కూలె దంతావళమ్ము 28
తేలదు త్రాసు వస్తువుల దేవి సమర్పణ మెంత సేసినన్
మేలిమి స్వర్ణ భూషల నమేయము వేసిన రిత్త లయ్యెనే
వ్రాలిన భక్తితోఁ దులసి పత్రము వేయఁగఁ దూఁచెఁ గృష్ణునిం
గూలెను మత్తవారణము గొట్టఁగ నొక్కఁడు తమ్మిపూవుతోన్ 27
ఇంత తర్కింప నీ కెద నేల నయ్య
కన్న వెల్ల సత్యమ్ములు కావు సుమ్ము
ఘోర మిట్లనఁ గుండకు నేరు నమ్మ
రోటికిం గట్టె రాముని ద్రోవది సతి 26
[నమ్మరు + ఓటికిం= నమ్మ రోటికిం]
పాటవ మొప్పసంతతము పద్మ దళాక్షుఁడు దుష్ట శిక్ష నా
నాట సెలంగ ద్వాపరము నందు రమా పతి రామచంద్రుఁ డ
వ్వీట జనింపఁ గృష్ణునిగ వేదనఁ గృష్ణ స్వకీయ భక్తి య
న్రోటికిఁ గట్టె రాఘవుని ద్రోవది కుండిన పట్టణమ్మునన్ 25
[ద్రోవదికి + ఉండిన = ద్రౌపది కున్న; ఆసమయములో ద్రౌవది కున్న పట్టణము హస్తినాపురము]
అడరి పఠియింప మంత్రమ్ము నాలకించి
కూర్మి సెలరేఁగ మదిలోనఁ గొడుకు నొసఁగఁ
గుంతిఁ గరుణించి యరుదెంచి చెంత కంతఁ
జల్లఁదన మిచ్చె సూర్యుఁడు చందనముగ 24
ఎల్లరు నంద నచ్చెరు వహీనము గాల్చెను లంక నెల్లనుం
దల్లడ మంది డెందమునఁ దల్లి మహీసుత యగ్ని వేఁడఁగా
సల్లలితమ్ముగా నడరి సత్వర మంజన పట్టి కత్తఱిం
జల్లఁదనంబు నిచ్చెను గృశానుఁడు చందన చర్చ పోలికన్ 23
తీఱఁగ సత్వర మా సం
భారమ్ముల లోటు తొలఁగ బాధలు మదిలో
మూర ముదము చక్కని యం
బారుం గని శ్రోత్రియుండు వహ్వా యనియెన్ 22
[అంబారు = ధాన్యము]
లేరే పంక్తికి బ్రాహ్మణప్రవర పారీంద్రమ్ము లివ్వేళలో
రారే నన్ను దరింప నంచు వగపే రాఁ బాద సంచారులై
యూరూరం దిరుగాడు పావనుల మున్యోఘమ్ము సంద్రమ్ముఁ బో
ల్బారుం గాంచిన శ్రోత్రియుండు మురిసెన్ వహ్వా యటంచున్ గడున్ 21
[బారు = సమూహము]
వారక మనోహరముగాఁ
దారాధ్వము కంప మంద దశ దిశ లద్రువన్
మీరలు పాడిన వారలు
కారా గృహమున ధ్వనించె గాంధర్వమ్ముల్ 20
వే రాఁబట్టఁగ వారు కోరు నిజముం బేట్రేగి యా రాత్రి యౌ
రా రక్షా భట నామధేయు లతి గర్వాంధుల్ బలాధిక్యులై
ధారాళమ్ముగఁ గొట్టు చుండ నరులన్ దాక్షిణ్య హీనాత్ములై
కారాగారమునన్ ధ్వనించె వినుఁ డా గాంధర్వ సంగీతమున్ 19
మాన్యమ్ము లెన్ని యున్నను
ధాన్యం బది శూన్యమైనఁ దరమే బ్రతుకన్
దైన్యమ్ము వీడి చేరఁగ
ధాన్యం బున్నట్టి తావుఁ దడయక విడుమా 18
అన్య జగమ్ములం దునికి యర్హ మగుం బరికింప లోనఁ జై
తన్యము లూన నెంచిన స దార కుమార యుతమ్ము ధాత్రినిన్
శూన్యము లేక పంచుటకు సుంతయుఁ జాలక యున్న రీతినిన్
ధాన్యము గల్గు తావును బదంపడి వీడుటె మేలు సూడఁగన్ 17
ఆర్యు లెల్ల సకల కార్య సమారంభ
ముల గణింత్రు వివరముగను దీని
వర్జ్య కాల మెల్ల వర్జింప నవ్వీత
దోషకాల మొసఁగుఁ దోష మెంతొ 16
పాషాణాభ మనో విరాజితులు విశ్వాసింత్రు నిక్కమ్ముగా
నీషన్మాత్రము నైన డెందముల శంకింపంగ రా దెన్నఁడుం
గాషాయాంబర ధారి చెప్పఁగను దీక్షాయుక్త మింపార ని
ర్దోషంబైన ముహూర్తమే మనకు సంతోషంబునుం గూర్చెడిన్ 15
వంత తొలఁగె రైతన్నకుఁ బాము వలన
వాని భాగ్యమ్ము నేమని పలుక నేర్తు
మూషికమ్ముల భక్షించి మూఁగకున్నఁ
జీడ పురుగు రైతుకు మేలుఁ జేసె నెంతొ 14
[పురుగు = పాము]
కామిని సేరి శూర్పణఖ క్రన్నన నన్నకు నిచ్చె నాకమున్
గోముగఁ జేరి మంధర ప్రకోపిని రాజ్య మొసంగెఁ గైకకున్
భూమిని ధార్తరాష్ట్రుఁడు విభూతినిఁ గర్ణున కిచ్చె చెల్మిమై
యే మిది వింత చీడపురు గెంతయొ మే లొనఁగూర్చె రైతుకున్ 13
వైభవమ్ముగఁ దన భవన రాజమ్మున
వనజ నయన పెద్ద లనుమతింప
నుచిత రీతి తనదు రుచిరంపుఁ జెలికత్తె
కన్నను మనువాడి యతివ మురిసె 12
తిన్నని నైజ ముండి మది ద్వేష మెఱుంగని వాని నిత్యమున్
మన్నన సేయు వానిఁ జెడు మానిన వానిని మిక్కుటమ్ముగం
దన్ను వరించి నట్టి గుణ ధాముని నచ్చిన వాని నెవ్వ రే
మన్నను భర్తగాఁ గొనిన యన్నులమిన్న యదృష్టరాశియౌ 11
కావలె సచ్చరితము స
ద్భావము కరుణా గుణమ్ము ధరణి జనులకున్
నీ వెఱపు మత్సరము గ
జ్జావళి హరియించు సౌఖ్య సంపద లెల్లన్ 10
[గజ్జు = మదము; ఆవళి = ఉపద్రవము]
ఈ వసుధాతలమ్మున నహీన విశేషము లెన్ని యుండునో
జావళి సర్వ సౌఖ్యములఁ జక్కఁగ నిచ్చును మానవాళికిన్
చావు నొసంగఁ బుచ్చుకొన సత్వర మెల్లర కింత యేని నం
జావళి సర్వ సౌఖ్యముల సంపదలన్ హరియించు చుండెరా 9
[నంజు + ఆవళి = నంజావళి; నంజు = విషము; ఆవళి = సమూహము]
రండు కొలువుండు వేంచేసె నండ నొసఁగ
నాక లోకాదిగ నఖిల లోక రక్ష
కుండు నభవుండు మోక్షప్రదుండు పాప
హరుఁడు శంఖచక్రములతో నలరు చుండె 8
హరి నిజ భక్త దీన నిచ యావన కార్య నిమగ్న చిత్తుఁడే
కరి పర మార్తి సంహరణ కార్య నిజాంస నితాంత ధారి ని
ర్జర గణ రక్ష ణాతురుఁడు శార్ఙ ధరుండు నరద్విషౌఘ సం
హర కర యుగ్మ మందు నలరారుచు నుండెను శంఖచక్రముల్ 7
దేవర్షి సుసంచారియుఁ
బావన చరితుండు మాధవపద రతుండున్
దేవా! రక్షో నాథా!
రావణ! గమనుండు బెదరి రావణుఁ గొల్చెన్ 6
చేవయె సన్నగిల్ల ధృతి ఛిన్నము గాఁగఁ బరాజితుండునై
రావణి చేత యుద్ధమున లంకను జేరి వినమ్ర శీర్షుఁడై
దేవ గణాధి నాయకుఁడు దిక్కరి నాథుఁడు శుద్ధ పాండు రై
రావణ వాహనుం డడలి రావణుఁ గొల్చె సమిత్రుఁడై వెసన్ 5
దేవ సంచయ సంజాత దైవ కార్య
కార ణోద్భవు లైన నగచరు లిట్టి
పగిది నింపుగ నేరిన వార లఖిల
పాండవులు వారధినిఁ గట్టు వానరు లఁట 4
శూరవరేణ్యు లేవురును సుందర రూపులు ధర్మ తత్పరుల్
నేరుదు రెల్లఁ బాండవులు నీరజ నాభు దయారసమ్మునన్
నీరజ బంధు సూను వృత నిర్భయ సైనికు లిట్టు లన్న వా
ర్వారలు పంచపాండవులు వారధిఁ గట్టిన వానరుల్ గదా 3
కాకి పిల్ల కాకికి ముద్దు గాదె కరము
కన్న వారు దోషమ్ములఁ గాంచఁ గలరె
యాత్మ నందన కకట విద్యాఖ్య కుసుమ
సౌరభము లేదు మెచ్చిరి చంపకమును 2
ఆరయ మెందుఁ జంపకము లంచిత శబ్ద దళమ్ములుండఁగా
నారయ మొక్క కేశరము లక్షర రాశికిఁ గొమ్ము లుండఁగా
నారయ మెట్టి రంగులను నద్భుత వర్ణము లందగింపఁగా
సౌరభ మింత లేదు మఱి చంపకమాలను మెచ్చి రెల్లరున్ 1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి