28, జనవరి 2025, మంగళవారం

సమస్యాపూరణ_జనవరి 2025

మంజులముగా నిరంతర
ముం జాగింప బ్రతుకు మనమునఁ దలఁపనిచో
ముంజావును గోరినచో
గంజాయిని సాగుచేయగా వలె రైతుల్                                                                     62 

గంజాయిం దలపంగనేల మఱి గింజాయిన్ మహా భేలపుం
బంజా వంటిది యేల నయ్య మనకున్ భద్రమ్ము వీక్షింపవే 
కంజాక్షుం దగఁ గొల్చు చుండి మది వీఁకన్ వీడి దుష్టంపు టా 
గంజాయిన్ దగ సాగు చేయవలె సౌఖ్యం బబ్బు రైతన్నకున్                                 61 

ధారుణి నంచితముగ దై
త్యారి రమా ధవునిచే లయము కా ధరణీ
భారమ్ము దుష్ట జన సం
హారము కొఱ కుద్యమం బహర్నిశ లయ్యెన్                                                           60 

పోరులు గల్గెఁ బెక్కు లిల మున్ను నిరంతర మెన్నఁ దిండికై 
దారులు గెల్వఁ గొల్లలు పదంపడి యాఁకలిఁ దీర్ప నెంచినన్ 
వారక భూతలమ్మునను బన్నుగ నెల్లరు సాలినంత యా
హారము కోసమై జను లహర్నిశలుం గృషి సేయఁ గావలెన్                                  59 

అంగదుఁడు మోయ సౌమిత్రు నడరి యంత 
మారుతాత్మజుం డయ్యెను గారవమున
వాహన వరంబు నా రామ భద్రునకును 
లచ్చి మగఁ డెద్దుపై నెక్కి లంకఁ జేరె                                                                     58 

సూక్ష్మీ భూత శరీర భాసితుఁడు నై చోద్యంబుగా నంత ద్వై
పక్ష్మోజస్వదధీశ్వరాత్మ సఖుఁడై  పశ్యద్కృశీభూత తం
కక్ష్మాభృత్పరమాధినాయకుఁడు తత్కైలాస ఫేనప్రభా
లక్ష్మీ నాథుఁడు నందివాహనముపై లంకాపురిం జేరెఁ బో                                     57 

అర్ధాంగీకృతి యెన్నఁగ 
నర్ధానంగీకృతి యగు వ్యవహారములన్ 
గర్ధింప నేమి ఫల మగు 
నర్ధాంగీ కృతి గనుఁగొన వ్యర్థంబయ్యెన్                                                                  56 

నిర్ధారించుట పెండ్లి యత్తఱిని సందేహంబ నిక్కంబుగన్ 
స్వర్ధాత్రీ తల మందుఁ దద్వర వధూ సాంగత్య మేపార దం
తర్ధానం బగు వారిలో నొకరు భేదస్వాంతులై నిల్వఁగా
నర్ధాంగీ కృతి వ్యర్థమై చనియె లక్ష్యం బయ్యొ దుర్లభ్యమౌ                                 55 

అలఁతి దినముల నయిన నా
స్తులకై చలము లణఁగారి తూర్ణము దాయా
దులతో మితి మీఱిన కూఁ
కలతో వైరమ్ము దప్పఁ గలదే భ్రాతా                                                                       54 

కలికాలమ్మున నెన్న శాంతి తగ భాగ్యంబౌ నశేషమ్ముగాఁ
జెలరేఁగం జల మాత్మలం దనిశ మాక్షేపించుచున్ బిట్టు చూ
పులఁ జిందంగ విషమ్ము రిత్తగఁ గడుం బోరాడు తీండ్రంపు మూఁ
కలతో వైరము దప్పదా మనకు భాగ్యప్రాప్తికై సోదరా                                             53 

ఆఁడు వారు సేయు నట్టి కర్మములకుఁ
బురుషుల నియమించు టరుదు సుమ్ము
ముచ్చట కొలుపంగ ముగ్గులు వేయంగ
శంకరుండు వలదు శాంతి వలయు                                                                         52 

అంకము లవి యేల మనకు హర్షములకు నవియె యా
టంకము లగు నెల్ల వంగడములు గూలుఁ బుడమిలో
శంక సుంత లేని వాఁడు క్షయ మొనర్ప శాంతి నా
శంకరుండు వద్దు మాకు శాంతి గావలెన్ సదా                                                        51 

పదిలంబుగ వచియించుచు 
ముద మొనగూర్చు సభికులకుఁ బొలుపుగ నీ వ
న్నది యక్షర సత్యంబే
మది రాసక్తుఁడె నిలుపును మర్యాద సభన్                                                      50 
[మదిరా+అసక్తుడు; మదిర యందుఁ దగులని వాఁడు] 

మదనాతుర్యుని గౌరవింప నిట సంభావ్యంబె రాజన్య స
మ్మద భాషాచతురత్వ భాసితులు నింపారంగ నిల్వంగ ని
ర్మద విద్వజ్జన సద్గుణౌఘ విబుధవ్రాతమ్ము వేంచేయఁగా 
మదిరా సక్త విలాస చిత్తుఁడె? సభామర్యాదఁ గాపాడెడిన్                                     49 

ఒంటిగ నటఁ జక్కఁదనము 
పొంటెం గులుకుచుఁ గరమ్ము బొట్టుంచఁగ వా
ల్గంటి కనుమ బిగువు సడల 
కంటన్ గంకణ మిడెఁ దిలకమును గరమునన్                                                   48 
[సడలక + అంటన్ = సడల కంటన్] 

కంటివె భూషణమ్ములను గంజదళాక్షి ధరింప నింపుగా
నుంటను వెల్గు లీనుచు మహోజ్జ్వల రీతిని నుజ్జ్వలాంగి క్రీఁ
గంట విలోలులై  యెవరుఁ గన్నులఁ ద్రిప్పక యెల్ల బందుగుల్ 
కంటను గంకణమ్ము తిలకమ్ము గరమ్ము నలంకరించెడున్                                    47 
[కంటను = కనుటచే; కరము = మిక్కిలి] 

అగ్ర ధనుర్ధరుఁ డబ్భర 
తాగ్రజుఁడు విడిచిన బాణ మత్తఱి వెస నా
విగ్రహము దాల్చెనో యన    
సుగ్రీవాగ్రజుని కాలు శునకము గఱచెన్                                                           46 

ఉగ్రాదిత్యు కుమారు నింద్ర తనయుం డుర్విన్నొగిల్చెం గడున్    
వ్యగ్రుం డౌటకుఁ గారణంబు విదితం బయ్యెన్ మహా క్రూరుఁడై 
యగ్రోద్భూతుఁడు సోదరాంగనను దా నంకించె, నున్మాదియై  
సుగ్రీవాగ్రజు పాదమున్ శునక మచ్చోఁ గాటు వేసెన్ వడిన్                                   45 

తామరస దళ లోచన తన్ను విడిచి 
పుట్టి నింటికిఁ జనినంత బెట్టిదముగ
విరహ తాపంబు సెలరేఁగ వింత వాని
కాఁగెఁ గాలమ్ము భాస్కరుఁ డాఁగకున్న                                                              44 

వేగ మెలర్పఁగా విసర బిట్టు చలమ్మునఁ  జక్ర యుగ్మముం
జాగి రయమ్మునం బుడమి జంటగ నించుక సేపు సుంత యే 
నాఁగక  యేఁగుచుండ వడి నర్జున చక్రము తగ్గ వేగమే
యాఁగెను గాలచక్ర మది యబ్జసఖుం డపు డాఁగకుండినన్                                    43 

మేదినిఁ గావడి కుండలు
నాఁ దనరు నఁట సుఖ దుఃఖ నామ ఘటమ్ముల్   
 జోదున కోడఁగ విజయుని 
మోదము నందున నొగులు సమున్నతము గదా                                                 42 

వాదము లేల నంత్యమున వైరి జన స్వజ నాలిఁ గాంచఁగా 
నే దరి గెల్పు భాసిలిన నేమి ప్రయోజన మౌను ఘోర బా
ణాది గదా పరశ్వథ మహాయుధ దారిత గాత్ర శోణి తా
మోద మహానుభోగమున ముఖ్యము నైనది దుఃఖమే కదా                                    41 
[శోణి తామోదము = నెత్తురు వాసన] 

భువన మోహన రమ్య వపో విరాజ
మాన పద్మలోచన వనజానన రఘు
రామచంద్ర లగ్నాంతఃకరణము మరలి 
రాదు రా దది రమ్మనన్ రానె రాదు                                                                  40 

ఆది జనించి నట్టి వగు నయ్యలవాటులు వోవ నేర్చునే 
మేదిని నెట్టి వారికిని మృత్యు విలం గబళించు నంతకున్ 
జూదరి కింక మూర్ఖునకు సుస్థిర బుద్ధి నొకింత గూర్పఁగా
రా దది రానె రాదు గన రా దిఁక రమ్మన రాదు రా దిఁకన్                                       39 

కీడులు తొలంగ భక్తిని 
వేఁడిన నిష్ఫలము గాదు  వేంకటపతినిన్ 
మాడ లొసఁగి దుష్ట మతిని 
వేఁడిన నిష్ఫలము గాదె వేంకటపతినిన్                                                             38 

గోడుల నాలకించు దయ ఘోర తరాఘ చయమ్ముఁ బాపుఁ జే
తోడుగ నుండు నిత్యమును దొడ్డ వరమ్ము లొసంగుచుండుఁ గా
పాడెడు ఱేఁడు త్రాత యగుఁ  బన్నుగఁ గా దిల నెన్నఁ డేనియున్
వేఁడుకొనంగ నిష్ఫలము వేంకటనాథుని భక్తితో జనుల్                                          37 

సముచితము గాని పల్కులు 
కుమతుల్ గాకున్న నిట్లు ఘోషింతురె యే 
నిమిషమ్మున నెవ రయినం
గుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్                                                 36 

విమలాంతఃకరణమ్ము లింపుగను దీపింపంగ నవ్వీటినిం 
గమవీయమ్ముగ జీవనమ్ము లవి సాగన్ సజ్జనుల్ వీత చిం
త మనోజ్ఞంబుగఁ దృప్త చిత్తు లయి మేధావుల్, పరీక్షింపుఁ డో 
కుమతుల్, మాత్రమె వాస ముందురు గదా గుంటూరులో నెప్పుడున్                        35 

ద్రౌపదీ సతి పాంచాలి ధర్మముగను 
ధర్మజునకు భీమునకు నింద్ర తనయునకు 
నకులునకును నా సహదేవునకుఁ గ్రమముగఁ
బెండ్ల మర్ధాంగి వల్లభ ప్రేయసి సతి                                                                    34 

పండ్లగు నెన్న ముత్యములు పద్మ నిభమ్ములు కన్ను లెన్న లేఁ
దూండ్లగు బాహు యుగ్మములు దొండ ఫలం బధరమ్ము చూపులే 
ముండ్లగు ధాత్రి భార్యలకుఁ బోల్ప ముఖం బగుఁ జంద్ర బింబమే  
యిండ్ల వసింత్రు దారలు మృగేక్షణ లింపుగ దార కర్థమే
పెండ్లము గేస్తురాలు సతి ప్రేయసి వల్లభ దార జాయయున్                                     33 

రోచిస్సు లడర ముఖమునఁ 
బ్రాచీనాచారములను బాటించినచో 
నీచార్థ రహిత తద్వా
చా చాతుర్యంబు శ్రవణసౌఖ్యం బొసఁగున్                                                          32 

ఆచారమ్ముల ధ్యాస నుంచి సుర నిత్యారాధ నార్థమ్ముగా 
వాచాలత్వము వీడి భక్తిఁ దనరన్ వాక్ఛుద్ధి భాసిల్లగా 
శౌచస్వాంతము సామ వేద విహితాంచద్రాగ వత్కీర్త నా
ర్చా చాతుర్యము వింతగన్ జెవులకున్ సౌఖ్యంబు నిచ్చున్ గదా                              31 

కడుపార నారగింపఁగ 
బెడిదమ్ముగ బలము నంద వీత భయమునం  
దడఁబాటు లేక శౌర్యం  
బడరెను భీముని యెడఁద బకాసురుఁ జూడన్                                                      30 

కుడువఁగ నీ వలెన్ బకుని కోసము బండెడు బోన మింకయుం
దడయక దున్నలన్ నరు సతమ్మును ధర్మజు సోదరుండు వీ
రుఁడు వడిఁ జేర రక్కసుని రోష రయమ్మునఁ, జూడ నైరృతుం
డడలి, వడంకె భీముని హృదంతరసీమ బకాసురుం గనన్                                      29 

సౌరమానమున మకర సంక్రమణపు 
దినము  వీక్షింపఁ బ్రతి యేఁడు స్థిర మయి చన 
మారు చుండు నేఁటేఁటను మానవేంద్ర! 
చాంద్రమానమున మకర సంక్రమణము                                                              28 

జన సంఘాతము సంతసింప వఱలన్ సౌభాగ్య సందోహముల్ 
తనరం బుణ్యపు టుత్తరాయణము వింతన్ ధాత్రి సూర్యుండు సొ
చ్చిన నానందము తోడ నా మకర రాశిం బుష్య మాసమ్ములోఁ 
గనఁగా వచ్చును జాంద్రమానమున సంక్రాంతిన్ ముదం బందుచున్                            27 

ముని సుర నర వరులఁ బ్రోవఁగ గుణము లం 
దధమునిం గుమతిని మధు వరాఖ్యు
రాక్షస గణ ముఖ్యు భ్రమరాలి సన్నిభ
కచుని సుతునిఁ జంపెఁ గైటభారి                                                                         26 
[కచము=జుట్టు] 

విచలిత మౌని సంచయుని వీరవరేణ్యునిఁ బాపకర్ము సం
కుచిత దురాత్ము నగ్నిముఖ కోటి విరోధి ఘనాసితప్రభా 
త్వచు ఖలుఁ గైట భాఖ్య ఘన దైత్యుఁ దృణీకృత ఘోర సంచర
త్కచుని కుమారునిం దునిమెఁ గైటభవైరి గరమ్ము ప్రీతితో                                          25 
[కచము=మేఘము] 

పంతమ్మున నేత యొకం
డెంత పని పరిష్కరింప నీ యైదింటిం 
జింతింప నిట్టు లకటా 
వింతగను సమస్య లైదు వేలయ్యె భళా                                                               24 

భువిలో లోకుల కున్న కష్టముల సంపూర్ణమ్ముగా నెన్నఁగా 
దివిజాధీశున కైన శక్య మగునే తీర్పంగ సుంతైనఁ బౌ
ర వరుల్ సెప్పుకొనుండు మీ వగ లనం బ్రారంభముం జేయఁగా 
నవురా చూచుచు నుండఁగా నయిదు వేలయ్యెన్ సమస్యల్ భళా                               23 

సురుచిరముగ సతతమ్మును
దిరుగాడుచుఁ గూఁత లిడుచుఁ దృప్తిం గొనుచున్ 
సరసీ జాతమ్ములఁ దా   
మర లందుం గనె భ్రమరము మకరందమ్మున్                                                        22 

ధరలోనన్ భ్రమ రాలి యత్యధిక నందం బిచ్చు వర్ణింపఁగా 
వర కావ్యమ్ముల సత్కవీంద్రులకుఁ బుంభామా విలాపమ్మునే 
యరవిందమ్ముల నన్య పుష్పతతిఁ జైత్రాంతర్గ తాంచన్మ హా 
మర లందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్                                    21 
[అమర = మామిడి చెట్టు] 

పావని లక్ష్మీ దేవిని 
శ్రీ వనితను బెండ్లి యాడ శితి దేహుండే 
పావని నుమ నేకాంతము 
శ్రీ వనితను బూజ సేసె శితికంఠుండే                                                                      20 
[శ్రీ వనిత = శ్రీదేవి చే సేవంపఁ బడినది] 

గ్రీవమునన్ హలాహలము కీడొనరింపక నుంటకై సుసం
భావన సేసి సంతతము వారక నిత్యము దల్చు చుండి వి
శ్వావన దక్షఁ బ్రాణి నిచయాంబను నాదిమ శక్తి మంగళ
శ్రీవని తానురక్తుఁ డయి చేసెను బూజల ఫాలనేత్రుఁడే                                                19 

దేవ దానవులు దివిరి దించు చుండ 
వాసుకిఁ దగిలించుచు నుండ బరువు మీఱ 
మందర నగమ్ము గూల నమంద గతిని
దుగ్ధ సాగర మందున ధూళి రేఁగె                                                                           18 

ముగ్ధ నొసంగ కున్న రుష భూపతి వొంద నెడంద యం దసం
దిగ్ధము యుద్ధ మేర్పడఁగ దిక్కులు మిక్కిలి పిక్కటిల్ల స
మ్యగ్ధుత మానసాబ్జమున నంబర మంటఁగ రాజచంద్రు ప్రో
ల్దుగ్ధ పయోధి మధ్యమున ధూళులు రేఁగెను చూడుమా హరీ!                                      17 

అప్ను వరేణ్యము లౌ నీ 
స్వప్నంబు లని మది నెంచి పల్కితివి యిటుల్  
క్షిప్నువు కా నొల్ల కకట  
స్వప్నంబునఁ గన్న దెల్ల సత్యం బయ్యెన్                                                                  16 
[అప్నువు = సుఖ మిచ్చునది; క్షిప్నువు = తిరస్కరించు వాఁడు] 

స్వప్నౌఘమ్ముల కేల యిత్తు వకటా ప్రాధాన్య మిబ్భంగి నే 
క్షిప్నూగ్రుండను నిత్య మీ కలలహో చింతింపఁ గల్లల్ సుమీ 
స్వప్నమ్ముల్ మఱి గ్విప్నముల్ దలఁపఁగన్ సందేహముల్  నీ కెటుల్ 
స్వప్నం బందునఁ గాంచి నట్టి దవురా సత్యంబుగా నిల్చెడిన్                                          15  

పరమాత్ముఁడు దయసేయగ
వరమ్ము నుతియింప భక్తి భార్యా మణినిం
బరమ ప్రీతిఁ గనుట కయి 
పురుషునిఁ బురుషుండు గలియఁ బుత్రుఁడు గలిగెన్                                                    14 
[పురుషుని = మగవానిని; పురుషుండు =  భర్త]  

తరుణీ రత్నము సంతసించెఁ గడు సంతానమ్ము వర్ధిల్లఁగా 
సరసీ జాత నిభాక్షి భక్తిమెయిఁ బూజల్ సేయ గొడ్రాలు త
ద్దురవస్థం గని జాలితో వరము సంతుష్టాత్ముఁ డీయన్ మహా
పురుషుం డొక్కఁడు పూరుషుం గలియఁగం బుత్రుండు గల్గెం గదా                                    13 

దుర్హతి తప్పించిన పూ
జార్హుఁడు గంగాసతీ జలాగ్రహ జవ ధ్వం
సార్హుఁడు రక్షా దక్షుఁడు 
గర్హింపం దగిన వాఁడు గంగాధరుఁడే ?                                                                        12 

అర్హానర్హతఁ గాంచ కింతయును గర్వాంధుండు నై సర్వ పూ
జార్హుండైన యుమా మహేశ్వరుని మాహాత్మ్యమ్ముఁ దగ్గింప నిం
దార్హుం డౌను వచింప నిప్పగిది దథ్యం బిద్ధరన్ నిచ్చలున్  
గర్హింపం దగి నట్టి వాఁడు గద యా గంగాధరుం డెప్పుడున్                                             11 

వితత విరచిత బహు వృత్త కావ్య పఠన 
ఫలము సుంత గాక పరగణింప 
వితత విరచి తావివేక కావ్యపఠన 
ఫలముఁ గోరువాఁడె పండితుండు ?                                                                          10 

తెలిసిన సర్వ శాస్త్రములు దిన్నని వృత్తము జీవితమ్ము నం
దలవడ మంచిచెడ్డల నిజాత్మ నెఱింగినఁ గర్మ సంచయ
మ్ముల నొనరింప, నెంచు చొక పోలిక నాత్మను నిష్ఫలమ్మునున్ 
ఫలమునుఁ, గోరువాఁడె కద పండితుఁడున్ సదసద్వివేకియున్                                         9 

వింతఁగ ముక్కంటి దలఁచె
నంతఃకరణమ్ము నందు నసురుఁడు దలపై 
నుంతుఁ కరం బనఁ గట్టా 
యింతలు గను లుండి మార్గమే కన నైతిన్                                                                  8 

దాంతుని భంగిఁ గన్పడు విధమ్ముగ నిత్యము సంచరింపఁగా 
సుంతయు నేని కైతవము చూపఱ కేర్పడ నీని నీదు వే
దాంతపుఁ బల్కు లెల్ల విని యైతిని వెఱ్ఱిని నీ ముఖంపు నే
నింతలు గన్నులుండి తెరువే కన నైతిని మందభాగ్యుఁడన్                                              7 

ఆమందోదరి సుమతినిఁ
గామాంధుఁడు రావణుండు ఖలుఁ డా లంకా
ధాముఁడు క్రూరుఁడు వంచిత
రాముఁడు పెండ్లాడె నొక్క రాక్షస కాంతన్                                                                     6 

ఈ మహి నెంద రుండ రఁట యింపును గొల్పఁగ రామ నాములై 
భూమిజు లెల్ల మానవులు భూజ సమేత మహా చరాచర
గ్రామము లన్ని యెన్నఁగను గ్రన్ననఁ జెప్పుమ విశ్వ మందు నే 
రాముఁడు పెండ్లియాడె నొక రాక్షస కాంతను మోహ మగ్నుఁడై                                            5 


తామరసములఁ బోలెను దరుణి కనులు 
దొండ పండును మించెను దుండి పెదవి 
చంద్ర బింబమ్ముఁ దలఁపించెఁ జామ ముఖము 
సూర్యబింబమ్ము శోభించె సుదతి నుదుట                                                                    4 

కనులారం గన నుబ్బె సంతసము వీక్షాభాగ్య మేపారఁ బూ
చిన పుష్పమ్మును బోలు నాముఖమునున్ సింధూర బింబమ్ము త
ద్వనితా ఫాల నభో విరాజితము ప్రాతః కాల సంజాత భా
గిన బింబ మ్మలరారె నింతి నుదుటన్ హేలా లసద్భూషయై                                               3 

గుణ దోషమ్ముల నింపుగ 
గుణముల నెన్ని తలఁపక యగుణముల స్వీ యా
గణితానురాగ గుణ ము
ద్రణమే నెయ్యమునుఁ గట్టు రజ్జు వగుఁ గదా                                                                  2 

తృణ మైనన్ మద మూన కుండ మదిలో దీపింప సంతృప్తి స
ద్గుణ వారాశి యనంగ భాసిలుచు సంతోషమ్మునం దేలుచున్ 
మణియై మానవు లందు వర్తిలుచుఁ గామక్రోధ మాత్సర్య వా
రణమే నెయ్యపు రజ్జు వౌను సుఖ సామ్రాజ్యాధిపత్యం బిడున్                                            1 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి