1, జూన్ 2026, సోమవారం

సమస్యా పూరణ జూన్ 2026

అవిరళ భవ బంధశ్రే
ణి వినాశన మౌను వాంఛనీయము సుమ్మీ 
దివి జారాధన నిజ వై 
భవమే పుణ్యప్రదంబు భక్తుల కెల్లన్                                                        60. 

సవనమ్ముల్ దగఁ జేయ నెంచినను విస్తారమ్ముగా ధాత్రి మా
నవ జన్మంబ యవశ్యమౌను గద సుంతైనన్ విచారింపుమా 
యవనిం గాయమ యాద్యమై వఱలు ధర్మైకార్జనార్థం బనన్ 
భవమే భక్తుల కెల్లఁ బుణ్యములు సంప్రాప్తింప మూలమ్మగున్                        59. 

అంత వరుణేంద్రుల కహో
సంతస ముప్పొంగ నెదల సంయమి యుగమే,  
సాంతమును వెల్లడించిరి 
కుంతి, కొడుకు, రావణుండు, కుండను బుట్టెన్                                            58. 

సంతానం బగు హర్ష దాయకము నిస్సందేహ మెల్లప్పుడున్ 
వింతెట్లౌనయ ద్రోణు జన్మ విధి యీ విశ్వమ్ము నం దెన్న నో 
యంతేవాసి యగస్త్యు పుట్టుక రహస్యం బంతయున్ నేరరే 
కుంతీపుత్రుఁడు, రావణుండు గరిమన్, గుంభంబునన్ బుట్టెఁగా                        57. 

పామరుండ వీ వాతఁడు పండితుండు 
పేదవాఁడవు నీవు కుబేరుఁ డతఁడు 
బక్కవాఁడ వీ వాతఁడు బల్లిదుండు 
గ్రుడ్డువై వెక్కిరింతువె కూన నకట                                                              56. 

పడ్డన్ లేవవు నీ బలం బెఱుఁగుమా వారింపు మీ కూఁతలే  
యడ్డం బేల చరింతు కుక్కుటమ సర్పారాతి కో మన్మఁడా 
విడ్డూరమ్ముగ దగ్గు తాతకునె నేర్పింపంగ యత్నింతువా 
గ్రుడ్డా పిల్లను వెక్కిరించెదవ సంకోచంబు లేకుండఁగన్                                     55. 

ఈశ్వర కటాక్ష మడరఁగ 
నీశ్వరి విద్యార్థి కోటి కెల్ల గడించెన్ 
శాశ్వతపుఁ గీర్తి చదువుల 
కీశ్వరి పెండ్లాడె బ్రహ్మ నీప్సిత మొప్పన్                                                       54. 

నశ్వర జీవకోటి కిల నాభిజుఁ డయ్యెను దాత యాతనిన్ 
శశ్వ దభీష్ట దాయిని ప్రశస్థ చతుర్భుజ వాణి సంత తా
నశ్వర భారతీసతి సునారి సరస్వతి లోక మాన్య వా 
గీశ్వరి పెండ్లియాడెఁ దన యీప్సిత మొప్పఁగ బ్రహ్మ దేవునిన్                             53. 

భావి జయ సూచికమ్మన 
వేవేగ విభీషణుండు వివరింపంగన్ 
దేవ నికాయప్రభు వి
ద్రావణు తల లక్ష్మణుండు రణమునఁ దునిమెన్                                            52. 

కావఁగ వానరధ్వజినిఁ గావఁగ నన్నను రాజధర్మముం 
జేవ యెలర్ప నగ్రజు విశేష దయామహిమాన్వితుండునై 
దైవము నెంచి యింద్రజితు, దక్షిణ బాహు విహీను జేయఁగా 
రావణు, మస్తకంబును దురంబున లక్ష్మణుఁ డుత్తరించెరా                                51. 

శత్రు సైన్యముఁ దున్మాడి చిత్రముగను 
బరు లనేకులై యెదిరింపఁ బాడి తప్పి 
యాజి నభిమన్యుఁ డత్యుగ్ర తేజ మందు 
భాస్కరుం డస్తమించెను బగటిపూట                                                            50. 

మస్కర చౌర్య మగ్నులకుమౌఢ్యము మూరఁగ నొక్క నాఁడు శ్రే
యస్కర మైన మైత్రి చెడి యక్కట తూర్పున రేఁగ ద్వేషముల్ 
తస్కరు లైన యిర్వురకు దైవము సన్నిధి సాక్షి గాఁగ నా 
భాస్కరుఁ డేలకో పగలె పశ్చిమ దిక్కున నస్తమించెరా                                       49. 
[పగలె = కక్షలె] 

గగనమునఁ గారుమబ్బు ల
విగో కదలఁగ గుమిగూడి వింతగ నవియే 
యగపడె దున్నల వోలెన్ 
గగనమ్మున మహిష మేగెఁ గనుమా వేడ్కన్                                                    48. 

సహనము నూని యశ్వపతి సంభవ కోరఁగఁ దర్కయుక్తిమై 
విహితము స్వీయ ధర్మమును వీడి దయార్ద్ర మనస్కుఁడై సరో
రుహ ముఖి కిచ్చి తద్వరము రోష విహీనము ధర్ముఁ డుండఁగా 
మహిషము వేడ్కతో గగన మార్గమునం జరియించెఁ గాంచుమా                           47. 

పదిలముగఁ బొందఁ బ్రాయము 
నద నెఱిఁగి యతుల తపో మహత్వం బున్నన్ 
సదమల మునీంద్రు భంగిన్ 
ముదిమినిఁ బెండ్లాడఁ దగును ముగ్ధను బాలన్                                                 46. 

ముదిరిన బెండకాయ జన భోజన పాత్రము కాదు సుంతయుం 
గుదురుగఁ జాగ సంతతము క్రొత్త కుటుంబము వర్థిలంగ దో
హదము నొసంగ నున్నతికి యౌవన మందునె కాదు సుమ్ము నీ 
ముదిమినిఁ బెండ్లి యాడవలె ముగ్ధను షోడశ వర్ష బాలికన్                                  45. 

ఉల్లము లలర నిద్రిల నెల్లవారు  
చల్ల వలయు సుమమ్ములు సక్కఁగాను 
వెల్లి విరియ  వాసన లట మల్లె లింక
నల్లు లున్నట్టి మంచమే నయము సుమ్ము                                                        44. 
[ఇంకన్ + అల్లులు =ఇంక నల్లులు; అల్లి = అల్లి పువ్వు]  

సత్కృప నూని యెల్లరకు శయ్యలొసంగ నెడంద నెంచినన్ 
మత్కృత మైన విన్నపము మన్నన సేయుమ భూత లాధినా
థోత్కర మంతకున్ బుధవ రోత్తమ విన్మ సఖా సదా వినా 
మత్కుణ పూర్ణ తల్పమె సుమా సుఖ నిద్ర నొసంగు నెప్పుడున్                              43. 

సామజ రథ తురగ భట
స్తోమ బల సమేతుఁ డయ్యు దుర్జయుఁ డైనన్ 
భామాభుఁ బరాజిత సం
గ్రామునిఁ గని నవ్వి రట ధరాపతు లెల్లన్                                                          42. 

భీమత రోది తోన్మదితు విప్ర కులోద్భవు నత్తఱిం బరం
ధామ పదాబ్జ తత్పరు సదా భజనా రతునిన్ సమగ్ర   సం
క్షేమ సుఖాంత రాత్ముని నిమీళిత నేత్రు నిరంత రాంత రా
రామునిఁ గాంచి నవ్విరి ధరావిభు లెల్ల సభాంతరమ్మునన్                                     41. 
[నిరంతర+అంతర+ఆరాముని =  నిరంతరము తనలోఁ దా నానందించు వానిని] 

నీదు బాధఁ గాంచ నాదు డెంద మెరియు 
వేచి చూడు మయ్య వేఁగకుండఁ 
దొంద రేల శత్రు బృందమ్ము నెల్లను  
నిందఁ జేసెద విని నీవు మెచ్చ                                                                        40. 

ఎంద ఱెందఱు పూజ సేయరె యెన్ని భంగుల భక్తిమై 
యిందిరాధవ సంతతమ్ము మహీతలమ్మున నిన్ను నే 
సుంద రార్థ సమేత మచ్యుత స్తోత్ర గర్భిత మింపుగా 
నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్                                        39. 

వాసికి నెక్కె ఘనమ్ముగ 
భాసిలఁ గావ్యమ్ము లెన్నొ భరతావనిలో 
నీసునఁ గొందఱు కా దన 
బాసలలోఁ దెలుఁగు ఘనమ, వట్టిదె సుమ్మీ                                                        38.  
[ఘనమ  = ఘనమే] 

దుందుడు కొప్ప వెక్కసము దుష్ట పదమ్ములు వాడ వింతగాఁ  
గుందదె తెన్గు తల్లి యెద ఘోర తరమ్ముగ మున్ను త్రాగి రన్ 
చందము నేతులం దమి భృశమ్ముగఁ దాతలు నేఁడు నక్కటా 
కొందఱు బాస లందుఁ దెలుఁగున్ ఘన మందురు నమ్మఁబోకుమా                            37. 

శార్ఙ్గముఁ గొను మన శార్ఙ్గము 
గీర్ఙ్గము నాకేల యంచుఁ గినుక సెలంగన్ 
శార్ఙ్గ సమానమ్ముఁ దనదు 
శార్ఙ్గముఁ గొని శివుఁడు వచ్చె శైలజ తోడన్                                                       36.  

శార్ఙ్గిణ మైన పట్టుదల శక్తిని మించెడు నట్టి వానినిన్ 
శార్ఙ్గ ధరాత్మ మిత్రునిఁ ప్రశస్థ నిషంగిఁ బరీక్ష సేయఁగా 
భార్ఙ్గ కళా శరీరు నరుఁ బార్థునిఁ జిత్ర మహో పినాక మన్ 
శార్ఙ్గముఁ దాల్చి శంకరుఁడు శైలజతోఁ జనుదెంచె వింతగన్                                    35. 
[శృంగిణమునకు (పొట్టేలు) సంబంధించినది   శార్ఙ్గిణము; భృంగమునకు 
సంబంధించినది భార్ఙ్గము; శృంగమునకు సంబంధించినది శార్ఙ్గము, విల్లు] 

జీవితము రణరంగము దేవుఁ డిచ్చి 
నట్టిది నరలోకమ్మున కవని లోనఁ 
బుట్టినది మొదలు సతము గిట్టు వఱకు 
వేలకొలఁది సమస్యలు విసుగు రాదు                                                                34.  

ఆలముగాఁ దలంచి మది హర్ష సమన్వితమై చెలంగ నొ
డ్డోలగ మందు గౌరవము నొంద భృశమ్ము బుధాలి మెచ్చఁగా 
మేలి పరిష్కరింపు లిడ మేధ నవశ్యము ప్రోత్సహింపఁగా 
వేల సమస్య లిచ్చినను వేసరిలం గవి మిత్రు లొప్పరే                                             33. 

హరి కాఁగ స్వీయ పుత్రుఁడు 
పరమాత్ముని కార్య భంగ వారణమున కా
తరుణము వసుదేవునకున్ 
ఖర పదములె మోక్ష దాయకమ్ము లగుఁ గదా                                                       32. 

హరి నామస్మరణం బొసంగును సతం బానంద మెవ్వారికిన్ 
హరి సంకీర్తన మెల్ల వారికినిఁ బాపౌఘమ్ములం బాపఁగన్ 
నర సందోహము వొందఁ గ్లిష్ట తర సందర్భమ్ము ఖండేందు శే
ఖర పాదంబులె మోక్ష దాయకములౌఁ గా దందురా పండితుల్                                  31. 

కృప నూని వీడు మింక ని
రుపయోగము లయ్య యిల మహోగ్ర తపమ్ముల్ 
విపరీత ఫలము లొసఁగిన 
నపకీర్తినిఁ గూర్చు విద్య లన్ని జనులకున్                                                            30. 

సుపరిచితమ్ము నానుడి పశుప్రతి విద్య నెఱుంగకున్న ని
ట్టి పలుకు సుప్రసిద్ధము సుఁడీ జన వాసము లందు వింటిరే 
శపథము సేసి సెప్పుదును సంపద లున్నను నేరకున్నచో 
యపయశ మందఁజేయుఁ గద యందఱకున్ మన విద్య లన్నియున్                          29. 

ఎక్కసక్కెము లాడఁగ మిక్కుటముగ 
నివ్వటిల్ల నెడఁదఁ గిన్క యెవ్వ రైన
నరుల నిందించు వేళల యందు వీడి 
బూతులం బల్కు వారలే పుణ్యజనులు                                                              28. 

జోత లొసంగి వందలు విశుద్ధ మనమ్ముల మోడ్చి చేతులే 
యాతత భక్తి తోడ వినయమ్ముగ  నింపుగఁ బ్రస్తుతించుచున్, 
నాతి చరామి యంచు నని న్యాయము తప్పక సంచరింపఁగాఁ   
బూతులఁ, బల్కు వారలనె పుణ్యచరిత్రు లటంచు మెత్తురే                                       27. 
[పూతుఁడు = పవిత్రుఁడు] 

అరయ నేక పత్నీ వ్రతుఁ డతఁడు నిజము  
తల్లిపై నతనికి భక్తి తద్ద కలదు 
పేరు రాముఁడు దాటఁడు దార పలుకు 
నారి నారి నడుమ రాముఁ డౌర నలిఁగె                                                                26. 

ఏరికి నైనఁ గర్మ ఫల మెవ్విధి నైన భరింపఁగా వలెం  
గారణ మైరి యాండ్రు నిజ కాయము సన్నగిలం గ్రమమ్మునన్ 
వారక యిర్వ దేడుగుర భామలఁ దారలఁ  బెండ్లియాడఁగా  
నారికి నారికిన్ నడుమ నల్గెడి వాఁడన రామ! చంద్రుఁడౌ                                          25. 

ఔరా రాజ తిరస్కృతు 
దారుణ దారిద్ర్య మందుఁ దపియించెడు నా 
ఘోరావస్థస్థితు నా
చారుం గని నంతఁ గలిగె సంతాపమ్మే                                                                  24. 

లేరే యన్యులు దేశ పాలకులు  గాలింపంగ నా దేశ మం 
దౌరా యీతఁ డొకండు దక్క మఱి దేశాధ్యక్ష పీఠార్హులే  
క్రూరాంతఃకరణుం గృపా రహితు నుగ్రున్ ఘోర ధూర్తున్ దు రా
చారుం గాంచితి నా మనమ్మున నిరాశా నిస్పృహల్ నిండఁగన్                                  23. 

సంస్కరింపఁబడ సుర భాష వితతమ్ము 
నేర్పె సంస్కారము జనుల కోర్పు తోడఁ 
గనుమఱుఁ గయి పుడమిని నిక్కాల మందు  
సంస్కృతము చెడఁగొట్టెను సంస్కృతి నయొ                                                        22. 

సంస్కృతి పల్కు భాష పయి సంతత మూనిక నూన వింతయే 
పుంస్కపి యంజనీసతి సుపుత్రుఁడు వ్యాకరణప్రవీణుఁడే 
సంస్కరణమ్ము లాతని వశమ్ములె పౌర తృణీకృతంపు టా 
సంస్కృత భాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్                                    21. 

నృవరప్రవరుఁడు సమయ
మ్ము వృథ యగును దలఁచిన  సతముం గావఁగ నీ
యవని నరుదెంచు నని మది
నెవఁడో యెవ్వఁడొ యెవండొ యెవఁడో యెవఁడో                                                     20. 

శివు వింటిన్ విఱిచెన్ నరుం డొకఁ డనం జిత్రమ్ముగా రాముఁడే 
యవనిం గూల్చి రనంగ వీరు నభిమన్యాఖ్యున్ రుషం బార్థుఁడే 
రవముప్పొంగ సుయోధనుండు విని మల్లశ్రేష్ఠు చా వార్చిరే 
యెవఁ డెవ్వాఁడొ యెవండొ యెవ్వఁడొ యతం డెవ్వాఁడొ యెవ్వం డొకో                        19. 

ఎండ కాయు నన్న మెండుగ వర్షించు 
నబ్బురముగ దేశ మందు నంత 
వాన వచ్చు నన్న వరదలు వచ్చు నా
కాశవాణి సతముఁ గల్ల లాడు                                                                             18. 

లేశ మైనను సత్య మాడదు రిత్త పల్కులు వెక్కసం 
బాశ మూరెడు చేత లౌర నిరర్థకమ్ములు నిత్యముం 
గాశ దేశము సుప్రసిద్ధము కాదు భారత మందు నా
కాశ వాణి నిరంతరమ్మును గల్లలే పలుకుం గదా                                                       17. 

దీపమ్ములు సద్భక్తిని
ధూపమ్ములఁ జూపి యతి మృదు మధుర సరణిం 
బాపక్షయ కీర్తనములు 
శ్రీపతిఁ గని యైదు పదిగఁ జేయరె భక్తుల్                                                                 16. 

తాపము వీడి నిగ్రహము తద్దయు నిష్ఠ వహించి యాత్మలోఁ 
బాప వినాశ నార్థ మిల భక్తినిఁ బన్నుగఁ జేయ నొప్పు నో 
పాప దశోపచారములు పంచ మహాగ్నులు సంతతమ్మునున్ 
శ్రీపతిఁ గాంచి యైదు పదిఁ జేయరె భక్తులు శాంతచిత్తులై                                              15. 

వజ్రం బొక బొగ్గే యట 
వజ్రముఁ బొడి సేసి యంత వారిఁ గలిపినన్ 
వజ్రి దయ యున్న నెంతటి 
వజ్రము సంస్కారమున ద్రవంబుగ మాఱున్                                                               14. 

వజ్రికిఁ గల్గ దుఃఖములు స్వర్గము వీడి వసించి యుండె వా
గ్వజ్రము నెల్ల వీడి నిజ గర్వము వీడి ప్రభుత్వ హీనుఁడై 
వజ్ర సమాన మానసుఁడు వంతలఁ జిక్కిన మెత్తనౌగదా 
వజ్రము సంస్కరించిన ద్రవంబుగ మాఱును లోక పూజ్యమై                                            13. 

సద్గురుని బోధనము లవశ్యములు సుమ్ము 
ముక్తి మార్గము కనుగొను భక్తులకును 
సంత తాచంచల మయిన సంయమి వరు 
ప్రణయమునఁ దోఁచె సుందర ప్రణవ ఘోష                                                                  12. 
[ప్రణయము = ప్రార్థన] 

గుణ మగు భక్తి యెల్లరకుఁ గోరకె మోక్ష మొసంగు భూత స
ద్గణముల ఱేని పైన నిలఁ దథ్యము తప్పక విశ్వసింపుమా 
ఫణి వర దివ్య భూషణునిపై ననునిత్యము నిందుమౌళిపైఁ
బ్రణయము నందుఁ దోఁచెఁ బ్రణవం బదిగో మకరాంక రేఖయై                                            11. 
[ప్రణయము = విశ్వాసము] 

తమకమ్మున నొకపరి జం
గమయ్య పరిహాస మాడెఁ గైలాసమునం 
గ్రమముగఁ బ్రణయక్రీడల 
నుమ శంకరుఁ డయ్యె శూలి యుమగా మారెన్                                                              10. 

సర్వ జగత్ప్రజావలికి సంశయ హీనము తల్లిదండ్రులే 
నుర్వి నుమా మహేశ్వరులహో యొక దేహము దాల్చి రింపుగా 
శర్వుని యర్థ భాగమును శాంకరి వొందఁగఁ జూచు వారికిం 
బార్వతి యయ్యె శంకరుఁడు పార్వతి శంకరుఁ డయ్యెఁ జయ్యనన్                                        9. 

విమల హరిశ్చంద్రునకు వ
నములోఁ గన్యా ద్వయము కనంబడ నేలా 
రమణులు కోరుట యాఱడి 
సుమ మాలయె మృత్యు వయ్యె శోకింప జనుల్                                                               8. 

సమముల్కత్తికి సత్కవీశ్వరు గిరల్ సత్యమ్ము వీక్షింపఁ బా
దమునం దత్తఱిఁ దప్త మానసుఁ డహో తా పెట్టి యాఱింటఁ గ్రు
ద్ధ మతిన్ వేములవాడ భీమ కవి  సంధానింపఁగా శాప వా
క్సుమమాలా కృతి మృత్యు వయ్యెఁ బ్రజలన్ శోకంబునన్ ముంచుచున్                                  7. 

నిడ్సుల్ వెట్టకు గాడ్సే
గీడ్సే యని కపట రీతి గిర లిబ్భంగిన్ 
బుడ్సై పోదువు నరుఁడా 
గాడ్సేయె మహాత్ముఁ డనెను ఘనుఁ డన్నదొరై                                                                    6. 
[నిడ్సు = నిడుసు , పెద్ద ధ్వని; బుడ్సు = బుడుసు, సన్నము]  

తొడ్సుల్ లేని విధమ్ము వాక్కు లన సంతోషమ్ము వాటిల్లునే 
గడ్సుల్ గాక పరుల్ వచింతురె యిటుల్ కాఠిన్య వాక్యమ్ములే 
యడ్సుం జల్లఁగ నేల నేత పయి నన్యాయమ్ముగా నివ్విధిన్
గాడ్సే కన్న మహాత్ముఁ డెవ్వఁడని వ్యాఖ్యానించె నన్నాదొరై                                                    5. 
[తొడ్సు = తొడుసు, సంబంధము; గడ్సు = గడుసు; అడ్సు = అడుసు] 

విధ్వంసకారి రణమున 
విధ్వంసక వీర రిపుల వీరత్వమునన్ 
విధ్వంస కాభిమన్యుఁడు
విధ్వంసముఁ జేయఁ బొగడె విశ్వం బతనిన్                                                                       4.  

వ్యధ్వమ్ముల్ నశియించె బాల్యపు వివాహమ్ముల్ క్షయించెం గదా 
సాధ్వీ రత్నము భర్తతోఁ జన దహో చావంగ జీవించు నేఁ
డధ్వర్యమ్ములఁ జంపరే నరుల మూఢాచార భావమ్ములన్ 
విధ్వంసమ్మును జేసె మానవుఁ డహో విశ్వమ్ము గీర్తింపఁగన్                                                    3. 

ఆహా దార కిడె నెడమ 
దేహము పంచాననుండు తృప్తుండై సం
దేహము తగదయ్యా యర 
దేహము లేనట్టి వాఁడె తేజోమయుఁడౌ                                                                               2. 

ఊహ కెఱుంగ రాక సకలోచ్చ చరాచర రమ్య జీవ సం
దోహ నిజాంతరంగములఁ దూఱి వసించు సహస్ర మూర్ధుఁడే   
మోహ మొకింత లేక యెదఁ బుష్కర నాభుని యున్కి పైన సం
దేహము లేని వాఁడె ఘన తేజము నంది వెలుంగు నంతటన్                                                   1. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి