1, జులై 2026, బుధవారం

సమస్యా పూరణ జులై 2026

విద్యావంతుల కెల్లం 
జోద్యం బే మున్న దిందు సుస్పష్టముగా 
వేద్యం బనసూయా సతి
నాద్యంత రహితుఁ డొక శిశువై యర్చించెన్                                                      63. 

ఉద్యత్పాద పయోరుహుండు నవనోద్యోగుండు  నీలాంగక
ప్రద్యోతుండు వటచ్ఛదమ్ము పయిఁ బారావార మం దుండి లో
కాద్యంతమ్మున మూరి విష్ణువు  నిజాస్యాంగుష్ఠుఁడై ప్రీతిమై 
యాద్యంతంబులు లేని వాఁడు శిశువై యర్చించె నాశాంతమున్                            62. 

గంభీరమ్ముగఁ గ్రమ్మఁగ 
నంభోధర సంచయమ్ము లాకాశమునన్ 
జృంభిత మేఘ కృశీకృత 
శుంభద్భానుప్రభలు రజోరస మొసఁగెన్                                                          61. 

అంభోజాక్షున కైన  నెన్నఁగ నలంఘ్యమ్ముల్ సతీవాక్కులే 
యంభోజాక్షి యొసంగ శాపమును రోషాక్రాంత మాయా మహా 
స్తంభం బుద్భవ మంది యడ్డముగ విస్తారమ్ముగా నిల్వఁగా 
శుంభద్భాను మయూఖ కోటి విత తాస్తో కాంధకారం బిడెన్                                 60. 

రే వగలు కాచు చుండును 
సేవ లొసంగు నిరతమ్ము క్షేమం బరయుం 
గావునఁ దల్లికి మించిన 
దేవుఁడు లేఁడని పలికి మదిం బూజింతున్                                                       59. 

తావు నొసంగఁ డెన్నఁడును ద్రాతయె తా నని నేర నేరికిన్ 
దైవమ మాన వాకృతినిఁ దప్పక కాచును భక్త కోటినిం 
గావు మటంచు వేఁడ నర కాయము భక్తిని రాని యట్టి యే 
దేవుఁడు లేఁడు లేఁడని మదిం గడు నమ్ముచుఁ గొల్తు భక్తితో                                  58.    

సన్మతి నారాధింపక 
విన్మా నారాయణాది విగ్రహ గణ రా
జన్మందిరములఁ బౌరుం
డున్మత్తుం డైన నృపతి యుద్దండుండౌ                                                             57. 

సన్మార్గాచర ణాభిలాషుఁ డిల నిస్వార్థుండు నిత్యమ్ము కిం
చిన్మాత్రుం డన నర్థ హీన మగు సంక్షిప్తమ్ముగం బల్కినన్ 
సన్మానమ్ముల దండనమ్ములను సచ్చారిత్రుఁ డత్యంత ధ
ర్మోన్మత్తుం డగు రాజు పాలనములో నుద్దండుఁడై వెల్గెనే                                       56. 

సింధు సమానుఁడు కరుణన్ 
బంధింప నిజ సతి నసుర వమ్మయి యుండన్ 
సంధి వధియించి వర గ
ర్వాంధుం, బరిమార్చెను రఘురాముఁడు కరుణన్                                              55. 

కంధర సన్నిభాంగుఁడు నృకాంత కుమారుఁడు జానకీ సతీ 
బంధన తప్త మానసుఁడు వహ్ని దహించి వనిం గబంధ దో
ర్బంధితుఁ డా కబంధు ఘన రాక్షసు శక్రద శాప తప్తు జ్ఞా
నాంధుని సంహరించెఁ గరుణార్ద్ర మనస్కుఁడు రాముఁ డయ్యెడన్                          54. 

అలవోక సేయ దృఢముగ 
సలసల కాఁగంగ నాయసపు గొడ్డలినిన్
సలిలమ్మున వెస ముంచిన  
జలమున, మండి యనలమున, శైత్యము నందెన్                                               53.  

కలువల మిత్రుఁ డైన నిసి కాంతుఁడు మెల్లగ నస్తమింపఁగా 
వలవల యేడ్వ ముడ్చికొని వాడఁగ రమ్యత రోత్పలమ్ములే 
చలనము లేక సుంత దివసమ్మున భాస్కరుఁ డంతఁ దోఁపఁగాఁ 
జలమున మండి యగ్నిఁ బడి, శైత్యము నందెఁ బయోరుహద్యుతుల్                        52. 
[తోఁపఁగాన్ + చలమున = తోఁపఁగాఁ జలమున; కలువలు యేడ్చుచుండ 
వాని (పయోరుహపు) వెలుగులు చల్లఁబడినవి]  ] 

సంసరమ్ములు చర్విత చర్వణములు  
సాగు చుండును దరములు వేగముగను 
బుట్టి యంచితముగ నింకఁ బుడమిఁ బెరిఁగి 
విద్య నేర్చి కొల్వుఁ గొనుట పెండ్లి కొఱకె                                                              51. 

విద్యాభ్యాసము చక్కఁ బూర్తి యయినన్ వీక్షింతు నంచంటివే 
యుద్యోగమ్ము లభింప నొప్పు  నని నీ వుత్సాహివై పల్కితే 
చోద్యం బిప్పుడు సెప్ప నేమి కలదో శోధింపఁగా నేలయా 
విద్యల్ నేర్చితి వీవు కొల్వు దొరికెన్బెండ్లాడ జాగెందుకో                                          50. 

నమ్మ వమ్మ కొమ్మ! క్రమ్మును మైకమ్ము 
రమ్ము రమ్ము కాదు వమ్ము సొమ్ము 
నెమ్మి సొమ్మసిల్ల నిమ్ముగ నెత్తి వా
రమ్ముఁ గ్రోల సుఖము ప్రాప్త మగును                                                                 49. 
[వారము = కల్లు కుండ] 

ఇమ్ముగ రోగ బాధలను నెన్నఁడు నందక యుందు రిష్ట సా
దమ్ములఁ దృప్తి సెందుచు సతమ్ము చరింతురు మేని బల్మినిం  
గమ్మగ నుండు నా పొదుఁగు కమ్రపు క్షీరము ప్రీతి తోడఁ దో
రమ్మునుఁ ద్రాగు వారలకె ప్రాప్తము లౌను సుఖమ్ము లీ భువిన్                                 48. 

ధరణి శివ నామధేయు లెందఱు వసింప  
రందు నిందు నిశ్చయముగ నెందు నైన 
నంచితమ్ముగ వివరింప నందు నొకఁడు 
శివుఁడు గిరిరాట్సుతా పాద సేవకుండు                                                              47. 

ఉవిదల కున్న యస్త్ర మది యుగ్రపు టల్కయె యన్న సత్యమే 
యవును ద్రిమూర్తు లైన సతు లల్గిన దాసులు కాక యుందురే 
తివిరి నిశార్థ వేళను సతిం గరుణింపు మటంచు వేఁడుచున్  
శివుఁడు నమస్కరించెఁ బద సేవకుఁడై తన భార్య గౌరికిన్                                       46. 

ఆ హర భక్తులకున్ ధన 
దాహ మొకింతయును లేదు తథ్యము నిత్యం 
బాహా సంతృప్తు లయిన 
నా హితు లర్థప్రియు లన నమ్మరు విజ్ఞుల్                                                           45. 

ధన మది యెంత యున్న ధన దాహము తీరదు లోభి కెన్నఁడున్ 
వనజ దళాక్షునిన్ మదిని వారక తల్చుచు నిత్య హర్యుపా
సనమున మున్గు చుండుదురు సాధు జనుల్ కడు బీద వార లై
నను హితు లర్థ కాము లన నమ్మరు పండితు లెల్ల వేళలన్                                     44. 

మాను మనుమానము దురభి
మానం బది లేని వాఁడు మండిత సభలో 
మానక, యితండు సమ్య
గ్జ్ఞానము లేనట్టి వాఁడె? గౌరవ మందున్                                                              43. 

వీనుల విందుగాఁ గవిత విశ్వము నందు వచించు వాఁ డహో 
కానఁడు గౌరవమ్మును సుఖప్రద జీవన మైన నెన్నఁడున్  
మానిని! పండితబ్రువుఁడు మానిత రాడ్వరుఁ డైనఁ జాలు వా
గ్జ్ఞానవిహీనుఁడే ఘనుఁడు గౌరవనీయుఁడు సంఘ మందునన్                                  42. 

ఓపిక వహించి యించుక
యాపక నిరతమ్ము మిత్రమా విను రేపున్
మాపు నడరి పగవారల
కాపదఁ దొలఁగించు వాఁడె యరి యన నొప్పున్                                                    41. 

పాప మటంచు నెంచకయె వంచకు చందము తోఁప నేరికిం 
జూపుల కంద కుండఁ బరిశోధన సేసి వినూత్న పద్ధతుల్ 
కోపము నూని డెందమునఁ గొండొక వ్యక్తికిఁ దన్ను ద్రోయఁగా 
నాపద లోన సాయపడు నట్టి జనుండె విరోధి యౌనుగా                                        40. 

తాపముల నుండి నన్నిలఁ  
గాపాడఁగ సంతతమ్ము కరుణాకరు నా
కాపఁగ నాపద లెల్ల వి
రూపము లేనట్టి వాని రూపునుఁ గొలుతున్                                                        39.  

పాప వినాశ నార్థ మయి పంకజ గర్భుని దీనవత్సలున్ 
స్థాపిత విశ్వ సంచయుని సన్నుతి సేయుచు భక్త లోక స
ల్లాపుని లోక పాలకుని రమ్య సహస్ర సహస్ర రూపునిన్ 
రూపము లేని వాని శుభ రూపమునే మది నిల్పి కొల్చెదన్                                     38. 

మున్ను బాధింప మువ్వురు మూరి తనను 
దిక్కు తోచక యుండఁగ నక్కజముగ 
బాధితుఁ డొకఁడు నశియించు వంత లనుచుఁ,      
దల్లిదండ్రులు మరణింపఁ దనయుఁ, డలరె                                                          37. 

కలవే యిట్టివి సంభవింప భువిలోఁ గా నేర వెన్నండహో 
కలి కాలమ్మునఁ బూర్వ కాలముననే కానోపు నెందేనియుం 
దలఁపన్ వింతయె కాఁగ నిర్వురును బ్రత్యక్షమ్ము సప్రాణులై 
తలిదండ్రుల్ గతియించినన్ సుతుఁడు మోదం బందె సంతుష్టుఁడై                            36. 

అవ్యాజప్రేమ సెలగ 
ద్రవ్యార్జన పద్ధతుల నరప్రవరుఁ డహో  
నవ్యము లగు బోధనముల 
ద్రవ్య రహితుఁడె తొలఁగించె దారిద్ర్యమ్మున్                                                         35. 

నవ్యాపూర్వ విశేష మయ్య వినుమా నా పల్కు వాక్యమ్ములన్ 
భవ్యాంతఃకరణుండు దానరతుఁడుం బద్మాక్ష భక్తుండు దా 
నవ్యాజప్రతిభా లసత్పురుషుఁ డన్యాయార్జితం బైనదౌ 
ద్రవ్యం బింతయు లేని వాఁడె గరిమన్ దారిద్ర్యముం బాపెఁగా                                  34. 

మించి యుమను నపహరించె నట శివుఁడు  
యతివఁ గృష్ణుఁ డడరి యాహరించె 
నబల దొంగిలించె నలరి పృథ్వీరాజు  
స్త్రీల నపహరింప మేలు గలుగు                                                                       33. 

ఆ లంకేశుఁడు సీతఁ గొన్న వినమే యా నీచుఁ డేమయ్యెనో 
బేలన్ ద్రోవదిఁ గొన్న సైంధవుని లబ్ధిన్ మున్ను వీక్షింపమే 
లోలాక్షిం జెఱపట్ట నేఁ డతని నాలోకింపఁ దెల్లం బహో 
స్త్రీలన్ మ్రుచ్చిలు వాని కెయ్యెడల నెంతేన్ మేలు గల్గున్ గదా                                  32. 

నీతు లందు విశ్వాసము చూత మన్న 
లేక యున్నఁ గరుణ సుంత లేక యున్న 
నేఁడు స్వార్థమే మితిమీఱ నిండుకొనఁగ 
విశ్వ మానవ సేవయే వేదన నిడె                                                                     31. 

భాస్వరమ్మను బోలి మండెఁ బ్రపంచ దేశము లక్కటా
నశ్వరం బగు నిట్టు లున్న ఘనప్రపంచము సర్వమున్    
శాశ్వతమ్మని నమ్మి రాజ్యము సర్వ దుర్గుణ సార్వభౌ
మేశ్వరుల్ కట మిన్నకుండిన నెల్ల చోటులఁ గల్ల కా 
విశ్వ మానవ సేవ మిక్కిలి వేదనన్ మిగిలించెలే                                                  30. 

క్షణమున నాశ్చర్యముగా 
నణు వణువును జూచుచుండ నాశల నెల్లన్ 
గణణీయమ్ముగ రౌద్రము,
రణమున, రస గంధ మెసఁగె రమ్యతరముగా                                                     29. 

పణ మోహము జన  నిష్కా
రణ మాత్సర్యము శరణ నర విసర్జన ధా
రణ మాదిగ దుర్గుణ వా
రణమున, రస గంధ మెసఁగె రమ్యతరముగా                                                     28. 

వ్రణముల బాధ నోర్చుచును బన్నుగ నొండొరు లందు నున్న దు
ర్గుణముల నెల్లఁ జాటుచును గొల్లలు కొల్లలు తీవ్రముల్ రుషా
ఫణితుల వాడి బద్ధ పరిపంథులు తిట్టఁ బరస్పరమ్మునున్ 
రణమునఁ బద్య గంధ రస రాగము లొప్పెను రమ్య పద్ధతిన్                                   27. 

ఇంపార వారసత్వపు
టంపకముల నెట్టి యక్ర మార్జిత మింకం 
గొంపల నెల్లను గూల్చిన 
సంపాదన లేని వాఁడె సౌఖ్యం బందున్                                                                26. 

వినుఁడీ యెల్లరు నగ్న సత్యమును సంవేద్యమ్ముఁ దా మంత్రి యై 
యనునిత్యమ్మును గార్యభారమున  నత్యంతమ్ము శుష్కింపఁగా 
జనకుం డర్థము రాజకీయముననే సాధింపఁగా బిడ్డకున్  
ధన సంపాదన లేని వానికె కదా దక్కున్ సుఖంబుల్ భువిన్                                      25. 

నలుదెసలు రేఁగక మునుపె 
పిలువుమ జన సంచయమ్ము వెదచల్లుమ వే 
సలిలము, మన నిమ్మా బ
చ్చలి, మలలోఁ జిచ్చు రేఁగెఁ  జల్లార్చుటకే                                                               24. 

తెలిపెదఁ ద్రోవ పిమ్మట యతిప్రవరా యిట విశ్రమింపుమా  
వలచిన నీరజాక్షులను భావజు పా లొనరింప న్యాయమే 
చెలువుఁడ యిమ్ము కౌఁగిలినిఁ, జెన్నుగ రేఁగఁగఁ గామ తాపమే 
చలిమల లోన రేఁగినవి జ్వాలలు, చల్లఁదనంబుఁ గూర్పఁగన్                                       23. 

అవనిఁ దురకల దైవము శివము లొసఁగు 
నా తురుష్కులకుఁ గనుక నతని శివుఁ డ
నంగ నొప్పు భక్తిని నంతరంగ మందు 
శివునిఁ బూజింప నొప్పు మసీదు నందు                                                                 22. 

అవని శివార్చ నార్హము లనంతము లయ్య గణించి చూడఁ గా
నివి పరికింప శూన్యములె నిక్కముగా వల దిందు శంకలే 
చెవులకుఁ గంటకమ్ము లివి చెప్పిన మానవుఁ డే తురుష్కుఁడో 
శివునకుఁ బూజ సేయఁగ మసీ దొకటే తగినట్టి స్థానమౌ                                              21. 

ప్రేమ నొలికించి లాలింపఁ బ్రీతి తోడ 
భర్తలకు భయపడ వలె భార్య లెల్ల 
నిత్య మనురాగమును జూపు నెలఁత లైన 
భార్యలకు భయపడ వలె భర్త లెల్ల                                                                         20. 

ఆర్య విసర్జనీయములె యా ద్వివిధమ్ములు సంతతమ్ము నౌ
దార్య మొకింత లేని యెడ దంపతు లిర్వురు నేడ్వఁగా వలెన్ 
భార్యల కేడ్వఁగాఁ దగును భర్తలు నిచ్చలుఁ గొట్టఁగా వలెన్   
భార్యలు గొట్టఁగా వలెను భర్తలు నిచ్చలు నేడ్వఁగాఁ దగున్                                           19. 

ఆ మరునిన్ గెలిపింపఁగ 
వామాక్షిని నీశ్వరుండు, ఫలిత నిజ మహా 
కాముఁడు దగ్ధం బైనను 
గాముఁడు, పార్వతిని భార్యగాఁ గైకొనియెన్                                                              18. 

లేమ తపః ఫలం బది గరీయ మనన్యము నాగభూషణుం
డేమఱ కుండఁ గోరఁగ నగేంద్రుఁ డొసంగిన స్వీయ సమ్మతిన్ 
భీమ రుషా ప్రచోదిత సు భీకర ఫాల విలోచన జ్వల
త్కాముఁడు పార్వతీ సతినిఁ గైకొనియెం దన ధర్మపత్నిగన్                                            17. 

దిక్తటములు తిరుగఁ దిరుగ 
భుక్తికి నన్నము దొరకమి పురమున నెందున్ 
రిక్తోదర విప్రునిచే
భక్తునిచే భంగపడెను భర్గుఁడు కాశిన్                                                                       16. 

ముక్తి నొసంగు లింగ వర మూర్తియె పాశుప తాస్త్ర రాజ మా 
సక్తి నొసంగఁ బార్థునకు సత్వము ధైర్య పరాక్రమమ్ములన్ 
రక్తిఁ బరీక్ష సేయఁగ నరణ్యము దూఱఁ ద్యజించి వీటినిన్,
భక్తుని చేత శంకరుఁడు భంగపడెన్, వర కాశికాపురిన్                                                   15.  

కారము పయిఁ గరము మమకార ముండుఁ  
దెనుఁగు వారికిఁ బరికింపఁ దెల్లముగను 
గీ డొసంగును మితి మీఱ వీడుఁ డన్న 
నావకాయను రోసెద రాంధ్ర జనులు                                                                          14. 

పోవ రెన్నఁడు సుంత యైనను ముట్టకుండఁగ భక్ష్యముం 
ద్రోవ లందును గార్య శాలలఁ దోఁట లందును వీడులన్ 
రేవు లందును  గీము లందును రేపు మాపులు ప్రీతిమై 
యావకాయను రోయు వారలె యాంధ్రు లంచు గణించెదన్                                              13. 
[‌రోయు = వెదకు] 

మఱచి పోయి తాను మర్మమ్ము లెల్లను 
మద్య మొసఁగి నట్టి మత్తు లోన 
నిజము లెల్లఁ బలుక నిశ్శంక నిత్యము 
త్రాగి నట్టి వాఁడె ధన్య జీవి                                                                                       12. 

భోగములం ద్యజించి కడు మోహ మొసంగెడు ప్రాణ హానియౌ 
త్రాగుడు మాని శ్రీ హరి పదద్వయ చింతన నామ డోల లం
దూఁగుచు సంతతమ్ము పురుషోత్తమ భక్తి రసామృతమ్మునుం 
ద్రాగిన వాని జీవితమె ధన్య మగున్ భువి లోనఁ జూడఁగన్                                              11. 

వినుత గంభీర భావము విగత మైన 
శుద్ధ శబ్ద లాలిత్యము శూన్య మైన 
భాషఁ బరికింపఁ జక్కని శ్లేష లేని
పద్య మల్లఁడు సత్కవిత్వమ్ముఁ జెప్పు                                                                         10. 

విద్యా భోగము పూర్వ పుణ్య ఫలమే వీక్షింప నెవ్వారికిం 
జోద్యం బెవ్విధిఁ గాంచ లేము సుమి సంశోధింప సుంతైన సం
వేద్యంబౌ నిది కాళిమాత దయ ప్రాప్తింపంగ నెన్నండునుం 
బద్యం బల్లుట రాని వాఁడె సుకవిత్వం బల్లు మెచ్చన్ జనుల్                                               9.  

డెందమునఁ గపటమునకు సందు నీని 
స్వచ్ఛ మైనట్టి సద్భక్తి సమ్మతమ్ము 
మేలి ముదము నొసఁగు నాకుఁ జాలు నయ్య 
చాలు పూజ లనెను శంకరుండు వినవె                                                                           8.  
[చాలు = వరుస] 

మూలము పూర్వ కర్మ తతి భోజన వేళ యతిక్రమింపఁగా 
వాలిన నీరసమ్మున నపారపు టాఁకలి కాగ లేక పోఁ 
గాలము దాపురింప నరకాంతుఁ డొకండు త్రినేత్ర నాముఁడే 
చాలిఁకఁ బూజలంచుఁ గడు జాలిగ వేడెను శంకరుం డటన్                                                  7.  

సవనాచరణము మర్త్యుల 
కవశ్యమౌ నని వచింపఁ గాదనఁ గలమే 
వ్యవసాయార్థం బా పా
శవ సాన్నిధ్యము నరులకు సంపత్కరమౌ                                                                         6. 
[పాశవము = పశువులకు సంబంధించినది] 

అవనీ లోకము వెల్గు చున్న దొకటై న్యాయార్జనార్థమ్మునై 
భువనవ్రాత విహారమే తనర సంపూర్ణమ్ము విశ్వాగ్ర్య భూ
ధవ సాన్నిధ్యము లబ్ధమై వఱలఁ దథ్యం బెన్న వ్యాపార సా
శవ సాన్నిధ్యముఁ గోరుకొమ్ము నరుఁడా సాధ్యం బగుం బెన్నిధుల్                                            5. 
[స+ఆశవ సాన్నిధ్యము = సాశవ సాన్నిధ్యము; ఆశవము = శీఘ్రత] 

రశ్ములు వెదజల్ల వలెను
గాశ్మీరమున ననయమ్ము కమనీయముగా 
వేశ్మము నతిక్ర మించినఁ 
గాశ్మీరము మోక్ష మిచ్చుఁ గద యెల్లరకున్                                                                         4. 

రశ్మివ్రాత విరాజి సన్నిభము చక్రం బంత, రాజత్కఠో
రాశ్మాభాత్ములునై దయా రహితులై యత్యాశ జృంభింపఁగా
వేశ్మాక్రాంత మనోవికారు లయి నిర్భీతిం బ్రవేశింపఁగాఁ 
గాశ్మీరమ్ము, సమస్త లోకులకు మోక్షం బిచ్చు నెల్లప్పుడున్                                                     3. 

నాతిని వీక్షించి యెడఁద 
నాతతముగఁ బ్రేమ యడర నాత్రము తోడం 
జేతులు మోడ్చి యడిగి తన  
మాతనుఁ బెండ్లాడుటకుఁ గుమారుఁడు వచ్చెన్                                                                   2. 

నాతి చరామి యంచును సనాతన ధర్మము నెంచి ప్రీతిమై 
భీత మృగాక్షి చంద్రముఖి బింబ నిభాధర మించి సద్గుణ
వ్రాతయె మేనకోడ లవివాహిత సుందరి ముద్దరాలు లే
మా! తనుఁ బెండ్లియాడఁగఁ గుమారుఁడు వచ్చె నలంకృతాంగుఁడై                                            1. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి