1, మే 2016, ఆదివారం

సమస్యాపూరణ_మే2016

అనితర సాధ్యు డంచు నత డాలము నందు నరుండు భీష్మునిం
దునుముగ నెంచి ధర్మమును దూరము జేసి శిఖండిఁ బేడినిం
దన రధ మందు నుంచగను దర్పము మీర పరాక్ర మింపగన్
వనితయె మీసమంటి తగఁ బల్కెను పంతము దీరు నిత్తరిన్                 37

కనియా భీష్ముని నుగ్రయుద్ధమున మేఁ గంపింప భీభత్సుడు
న్ననివార్యంబుగఁ గష్ట కాలమున నయ్యంబన్ శిఖండిన్ వడిం
దన సాహాయ్యము సేయ గోరి యరదం బందుంచ రోషంబునన్
వనితారత్నము మీస మంటి పలికెన్ వాల్లభ్య మొప్పారఁగన్                36

ఆవుని చంపబోవు నొక కటిక వాని యాయుధము (బాణము) పట్టుకొని యొక మానవతా వాది వలదని చెప్పు సందర్భము: 
కటిక వాని నొకని గాంచి కరుణ మీర
వాని యత్నమాపగ నొక మానవుండు
వినుము తెలియదె వధియింపగను నిట పశు
వనిత మీసమ్ము నంటి తాఁ బలికె నిట్లు                                   35
[పశువు +అనితము+ఈస+అమ్ము; 
అనితము =పొందబడనిది;  ఈస = అల్పము; అమ్ము = బాణము]                                

ధృతి సంసక్త విశుద్ద చిత్త ఘను డుద్రేకార్త సంరంభియై
జితమాత్సర్య గుణుండు కైక సుతు డాశ్రీరామ సత్పాదుకల్,
శతకోటిప్రణతుల్ చరించి, కొని యాజ్ఞాపించె శత్రుఘ్నునిన్
వ్రతపీఠమ్మునఁ బాదరక్ష లిడుమా భక్తిన్ బ్రపూజింపఁగన్           34

సతతము శుభ్రత పాటిం
చు తగిన రీతి తనుమధ్య సూడుము నేనుం
చితి యెత్తుగ నచ్చట సు
వ్రత! పీఠము పైనఁ బాదరక్షల నిడుమా                              33

వరముల నెపం బిడుచుఁ గలవరపడఁ బతి
కైక,కుత్సిత చిత్త యేకైక దృష్టిఁ
బుత్రు డుద్దండ సార్వభౌముం డగునని
భరతుఁ ,డంపె రాముని వనవాసమునకు                             32

సద్యఃఫల దాయకములు
విద్యాధికుల కవనౌఘ విజ్ఞాన నిధుల్
హృద్యముగ నిగూఢార్థపు
పద్యములను వ్రాయవలెను పదుగురు రోయన్                      31
[రోయు = వెదకు]

మారుని కన్నతండ్రి సుకుమారుడు వారిజనేత్రుఁ గృష్ణు దు
ర్వార పరాక్ర మాసదృశ భండన దుర్జయు నత్తరిన్ శిరో
భారము ప్రజ్వరిల్లగను భర్తను దాపెను సత్యభామయే
కారణమేమి లేక నిజ కాంతుని దూఱరె కాంత లెల్లరున్             30

మురిపెముగఁ బెండ్లి సేయగఁ బుట్టినిల్లు
వీడ నొంటరి యత్తింట వికసితప్ర
ణయని చీటికి మాటికి నవ్య వధువు
కారణము లేక దూఱును కాంత పతిని                                      29

కుమ్మరి పురుగు తిరుగు పంకమ్ము నందు
నిర్మలముగఁ దమ్మి దళము నీరు వదలు
నెల్ల నాత్మలు పరమాత్మయే యనంగ
పరమభాగవతులు సానివాడ నుంద్రు                                          28

ధారుణి జననీ ప్రేమకు
మారెక్కడ మాఱుతల్లి మాతయు నగునే
దారుణ విమాతఁ గల్గిన
నారికిఁ దన పుట్టినిల్లు నరకమ్ము గదా                                          27

ప్రీతిని నీరము తెండన
నాతత వీర్యాతిశయులు నట యక్ష కృతా
చేతనులగుటన్ సిగ్గిలి
భీతిల్లిరి ధర్మజుఁ గని భీమార్జునులే                                               26

“హా తండ్రీ” యని వీడి బాణములు ద్రోణాచార్యు లావేదనన్
భీతింజెందిరి ధర్మనందనుని సంవీక్షించి, భీమార్జునుల్
చాతుర్యంబుగ సంజ్ఞలీయఁ గని ధృష్టద్యుమ్ను డత్యుగ్రతన్
వీతప్రాణునిఁ జేసె ద్రోణునని గంభీరాస్త్ర ఘాతంబునన్                        25

సునిశిత వాక్చాతుర్యత
మన మార్తిం జెందు నుడుకు మాటల కరకుం
దనము పతులు,  హాస్యంబున
కని, కరముం జూపఁ దగదు కాంతలపైనన్.                                      24

లలిత వదనుండు కృష్ణుండు లక్ష్మణుండు
పల్లె పల్లెల నున్నట్టి బాలు రెల్ల
నాశనమయిరి కంసాధి నాయకుల చ
లవ, కుశులు,  మేనమామలు  లక్ష్మణునకు.                                   23
 [ లక్ష్మణుండు = శ్రీమంతుడు;  కుశులు = పాపులు;   కంసాధి నేతల,  కుశులు,  మేనమామలు: రాజస బహువచనము.]

తన్ను మించిన ధన్విని కన్ను చెదరి
కొల్లగొట్టించె కవ్వడి వల్ల మాలి
నట్టి విడు పేకలవ్యుడు నిట్టె యొసగె
ఉత్తరుం డర్జునునకంటె నుత్తముండు.                                               22

కనఁ జక్కని రూపమ్మును
విన నింపగు మాటలఁ దనివి నొసంగుచు మో
మున మోము మోదముగ, నిజ
మను, మానించెడు పతి గల యతివ సుఖించున్.                               21
[నిజము+అనుము+ఆనించెడు]

వనజనాభ సేవ యొసగు స్వర్గ నిధులు
నిత్య మిద్ధర జరిగెడు సత్య మిదియ
యర్చనల పేర దేవాలయమ్ము లందు
దొంగ పదసేవఁ జేయ నిధుల్ లభించు.                                                20

సమనీల వర్ణ దృఢ వి
క్రమ దేహద్యుమ్న ఘోర కర్కశ మృగముల్
ద్రుమ శాద్వల గోత్ర నికా
యము నెక్కి లులాయములు విహారము సల్పున్.                                19

కాలాతీతాలోలా
హేలావేశాతిరోష హేమాభాక్షుల్
డోలాయమాన  కాంతల్
పూలను సిగలోనఁ దురుము పొలతులు గలరే.                                       18

కాలము మారెం గలినిన్
శీల వతులకు నలివేణి చిరుసిగ యాయెన్
మాలలు కలలోన నలిగె
పూలను సిగలోనఁ దురుము పొలతులు గలరే.                                       17

ధైర్యము జూపి యిద్ధర సదా చరియించు మనుష్యుడింక నౌ
దార్యము మిన్ను ముట్టగ నితంబిను లెల్లరు మాననీయులే
కార్యము కాదు మత్తిలి యకారణ మిట్లు వచింప నేరికిన్
భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భమయ్యెడిన్.                      16            

ఆర్యులు వార లిద్దరు సదాగమ భాసిత పుణ్య మూర్తులున్
భార్యయు భర్తయయ్యు నన పత్యులు జేసిన దాన ధర్మ స
త్కార్యము లన్ని నిండు ఫలితమ్ము లొసంగెను సంతసంబుగన్
భార్యకు, మీసముల్ మొలిచె బాపురె భర్తకు, గర్భమయ్యెడిన్.                      15

కంటి గలలోన నొకనాడు తొంటి యట్ల
చూడ చక్కని రూపమ్ము, చుక్కలకును
ఱేడు, సతులట యిరువది యేడు! రామ!
రామ! చంద్రుండు శయనించె రంభతోడ.                                 14

పెక్కు చిక్కుల స్రుక్కుచు దిక్కు లేక
యక్కసు మనము నందునఁ బిక్కటిల్ల
రక్కసుడు రాజ్య మేలంగ నుక్కు దక్కి
తొలుత మ్రొక్కంగవలె నెల్ల దుర్జనులకు.                                  13

పంకజ నాభుని ఘన నా
మాంక తనువు డంబరీషు డనఘుండట ని
శ్సంకాత్ముడు నారాయణ
కింకరుఁడే రాజయి ఘనకీర్తినిఁ బొందెన్.                                    12

పాతివ్రత్య గరిమమది
వీతము గాక ననిలాంశ వీరుని హనుమన్
ధాతృవర ప్రసాదమునం
గోతిని పెండ్లాడి నాతి కొమరునిఁ బడసెన్.                                   11

కాపురుషుల సాంగత్యము పాప మొసగు
చెఱచు సద్గుణముల నెల్ల పఱచు సుఖము
వారి విడిచి వర్తిలి ముదమార జూప
మాట నిలు కడ లేకున్న మాన్యుఁ డగును.                                10

పర్వ దినము లందు పరిణయ వేళలఁ
బూజ లందు జనులు తేజ మలర
నగ్ని హోత్ర మందు ననువుగ నానెయ్యి
నీరు జల్లినంత నిప్పు రగిలె.
[నీరు = అల్పము]                                                                   9

మాన ధనముల హరియించు మద్య మెపుడు
చదువు సంధ్యలున్న ఫలిత మది గన మిల
సత్వ హారి సురా పాన సంజనితము
గీతను పఠియించు నరుఁడు కోతి యగును.                                 8

కాల ధర్మంబిది జనుల కేల చింత
రైతునకు నైన క్షేత్రంపు దాత కైన
చాలు నంచును నిర్దిష్ట కాలమున క
మతము మారని జనులకు హితము లేదు.                                 7

మండు టెండ లందు నుండిన నిజ శిరం
బెండు, మునుఁగు నినుపగుండు, దేలు
కుట్టు, గాలి వీచు దట్టమై విన్పట్టె

నిట్లు వేరు వేర నిండ్ల వింత                                                         6

సమస్య: అక్కను ప్రేమించి పెండ్లియాడె ముదమునన్.
ప్రక్కింటి సుందరిం గని
చిక్కి మరుని తాపమునకు క్షేమ మరసి తా
జక్క ననిపి యత్తింటికి
నక్కను,  ప్రేమించి పెండ్లియాడె ముదమునన్.                             5

అన్య వృత్తు లన్నిసన్యసించెను మడి
మాన్యము లవి యవ్వ శూన్యము లట
పుణ్య పురుషు డత డపణ్యమ్ము దైన్యమ్ము
ధాన్యముఁ గని రైతు తల్లడిల్లె.                                                      4

తాప హరణము సురేంద్ర వ
నోపమ విద్యుద్విహీన ముత్సవ విశ్రాం
తోప వనస్థిత సమ్య
గ్దీపాలంకృత గృహమునఁ దిమిరము నిండెన్.
[దీపము = తీగ]                                                                        3

అయ్య నుయ్యి గొయ్యి యని నియ్య కొనరయ్య
యయ్య వారి యింటి దెయ్య మనుచు
దుయ్య బట్ట బాలు డయ్య సయ్యాటలఁ
గొయ్య గుఱ్ఱ మెక్కి కయ్య మాడె.                                                   2

సర్వ భూత హితుండు నఖర్వ విష్ణు
భక్తుడును బద్మజ సుతుండు పావనుండు
లోక సంచారు నారదు రూప కలహ
కార మది లోక కళ్యాణ కారకమ్ము.                                                1

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి