1, జూన్ 2016, బుధవారం

సమస్యాపూరణ_జూన్ 2016

సతత సదంగనా దృఢ సుసంగత మానిత వారిజాక్షులున్
వితత మనోవికాస పరివేష్టిత భాసిత సుందరాననుల్
గతభవ పుణ్యభావ పరికల్పిత పావన భర్తృపాద సం
పతితులె పుణ్యజీవులని వాదనఁ జేసెద రంగనామణుల్                  60

అతియని యెంచక మదిని స
తతము వొగిడి తిరుగుచు నిజ దార పనుపులన్
మితి మీరక సతి భాషణ
పతితులె పుణ్యపురుషులని వాదింత్రు సతుల్                               59

సయ్యాటలఁ గడు నేర్పరి
వయ్యారమ్ము లొలుకుచు వివాహమ్మున కై
యియ్యకొని వలచిన గడుసు
దయ్యమ్మే భార్య యయిన దక్కును సుఖముల్                             58

దయ్యమ కారణమ్ముగద ధారుణి నద్భుత ప్రాణి కోటికిన్
దయ్యమ సూత్రధారి మహదండ సురక్షిత నాట్య వేదికన్
దయ్యమ తల్లి తండ్రి ఘనదాతయు  త్రాతయు జీవ రాశికిన్
దయ్యమె భార్య యైనపుడు దక్కును భర్తకు సర్వసౌఖ్యముల్           57

కయ్యము దీర్ప దైత్యులకు కశ్యప సూనుల కెల్ల విష్ణువే
చయ్యన మోహ మోహినిగ సంభవ మొందె సుధా నిమిత్తమై
యయ్యుర గాంక భాసితున కాసలు రేగెను బొంద భార్యగన్
దయ్యమె భార్య యైనపుడు దక్కును భర్తకు సర్వసౌఖ్యముల్           56
[దయ్యము = దేవత] 

క్షీరసముద్ర సంభవము కీలనికాశ హలాహలమ్మునున్
నీరము భంగి కంఠమున నేర్పునఁ బెట్టి భయార్త దీనుల
న్నారితిఁ దీర్చి గాచిన దయామయు నివ్విధిఁ జెప్ప నొప్పునే
భైరవుఁ డిచ్చుచుండు నశుభంబులు నమ్మిన భక్తకోటికిన్                 55
[భైరవుడు = శివుడు]

రాక్షసుడు భీమ కాయుడు రౌద్రు డవనిఁ
గ్రూరు డెంచ విష్ణ్వారాధకుల సహింప
నోర్వ డెన్నడు మునులకు నుద్భటముగ
భైరవుం డిచ్చు నశుభముల్ భక్తులకును                                          54      
[భైరవుడు = భయంకరుడు]

తద్దయు భాను తాపమున ధారుణి మండుచు నున్నవేళలన్
గ్రద్దన నన్ని దిక్కులను గ్రమ్ము కొనంగ దురంత మేఘమి
ప్పొద్దున నద్భుతమ్ముగను బొల్పుగ మ్రోగెను మేఘ ఘర్జనల్
మద్దెల లెన్నియో గగనమధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్                  53

అద్దివమున మేఘమ్ములు
సద్దులు సేయుచు నురుముల సాగుచు నుండన్
ముద్దుగ నేనంటి నపుడు
మద్దెలలే మ్రోగె గగనమధ్యము నందున్                                             52

అవనీ భారము దీర్పఁ  బుట్టు నిల మాహాత్మ్యంబునన్ విష్ణువే
సవనాధీశుడు లోకపాలకుడు తత్సన్నామ సంకీర్తనల్
భవతోయాంబుధి దాట నావలట సంప్రాప్తింప నిత్యమ్ము కే
శవసందర్శన మిచ్చు పుణ్యముల సత్సంపత్తులన్ మిత్రమా!                51

సవనమ్ము లేల సేయగ
భవసాగర మీద గాఢ భక్తిని హరినిన్
కవనములఁ బొగడ నగుఁ గే
శవసందర్శనము పుణ్యసంపద లిచ్చున్                                           50

ఆలోచింపగ నొక్కవేళ నొక టర్హంబై ప్రవర్తిల్లునే
బాలారిష్టము లుండ వింక నొసగం బాలన్ ప్రభాతమ్మునం
గాలాతీతము గాగ నెండను బడిం గందంగ దాహార్తి తాఁ
బాలన్ వీడి ముదంబుతోడుత పయఃపానంబు సేయం దగున్             49

మూల మమిషము మనస్తా
పాలకుఁ బరికించి చూడఁ బ్రమదమ్ముగఁ  గో
పాలను దుస్సహ సంతా
పాలను విడి చేయు క్షీరపానము మేలౌ                                           48

వీత ధృతీప్సితార్తి ఘన పీడిత మానస భూరి  గోపికా
వ్రాతము లోన వర్తిలు విలాస విహార విలోలుఁ గృష్ణుని
న్నాతత బాహు విక్రమ మహాబల సుందర రూపు దానవా
రాతినిఁ గాంచి కాంత యనురక్తినిఁ బొందె మనోజకేళికై                        47

చిరకాలానికి స్వదేశము వస్తున్న కూతురునకు విమానాశ్రయములో
 స్వాగతము పల్కు సందర్భము: 
తల్లి తండ్రి వచ్చి తనయకు నచ్చట
నింటి వంటకమ్ము లీయఁ బ్రీతి,
స్వంత వారిఁ గనిన పరమ మోదమె గద
రా, తినిఁ గని కాంత రక్తి నందె                                                            46          

భరతుని జన్మ మూల మట పావన కౌశికు పారవశ్యమే
వరుణుని కామ తాపమున వర్ధిలె కుంభ భవుం డగస్త్యుడున్
కరమరు దా పరాశరుని కామమ మూలము వ్యాస జన్మకున్
తరుణుల వాలుచూపులను దాటఁగ ధాతకునైన శక్యమే                          45

సుర యక్ష రాక్షసులకు
న్నరివీర భయంకర సుగుణాఢ్య రణోద్దం
డ రఘు వరుల, మది నేదల
తరుణుల, చూపులను దాట ధాతకు వశమే                                          44        
[సూర్యులుగా వారిని నే దలతును, లేక కోపముచే ఎర్రబడిన వారు]

అనఘాత్మపఠిత విష్ణు క
థనముల మెత్తురె నితాంత తామస జనులున్
జన పదములఁ జని యెవ్విధి
శునకము సంపంగిపూల శోభను మెచ్చున్                                              43

ఘనుడా శంకరు భక్తపాలన క్రియా కాంక్షా రతుం డాతనిన్
మన మందింపుగ నిల్పిమోదమున సంభావించు దామంబుల
న్ననిశమ్మున్  ద్విగుణీకృతం బయిన,కంఠాలంకృతస్నిగ్ధ, మీ
శుని సంపంగి సుమాల శోభలను మెచ్చున్ మేలు మేలంచుఁ దాన్               42

సుర ముని వందిత! భార్గవ
విరామ! సీతాపహరణ విద్రోహి కనం
బరమాసుర నీచుండిలఁ,
గరుణాపాథోనిధి! దశకంఠుం డనఁగన్                                                         41

వరుణాదిత్య సమప్రభుండు నిజ సద్భ్రా తృశ్రియాఘ్నుండిలన్
తరుణోద్రేక విమోహ కామ భర చిత్తక్షోభ తప్తాంగుడున్
మరణామానుష సంఘ బాహ్య వర దుర్మత్తుండు దుష్టుండు ని
ష్కరుణా సాగరు డన్న నొప్పు దశ దుష్కంఠుండు చిత్రంబుగన్                        40

చల్లగ సర్వ లోకములు సౌఖ్యము నొందగఁ గోరి సన్మతిన్
రల్లక వేష్టి తాంగియు నలంకరణోచిత యజ్ఞ జంతువుం,
దల్లడమంది చిత్తమునఁ దా శకునమ్మునుఁ జూచి తోలి యా
పిల్లినిఁ,  జంపె సద్ద్విజుఁడు వేదమతమ్ముగ యజ్ఞవాటికన్                                 39

జల్లు కురిపింప జగతినిఁ
గల్లకపటములెరుగని మఖంపుఁ బశువునున్
మల్లెల హార మునిచి, మా
పిల్లిని, సద్ద్విజుఁడు చంపె వేదోక్తముగన్                                               38
[మాపు+ఇల్లిని=మాపిల్లిని; మాపు = రాత్రి; ఇల్లిని= ఉపవాసమున
మాపిల్లిని యనిన క్రితము రాత్రి యుపవాసముండి యని భావము. ]

రామ! భద్రాచల విశాల ధామ! దనుజ
ర్దనక్రియా నిపుణైక మండన వర!
దాశరధి! జనక సుత హృదయ విహార!
సుజన పూజిత! ప్రణతులు సుందర ముఖ!                                        37

బల్లిదమైన వంశమునఁ బద్మభవాంచిత కీర్తివంతము
న్నుల్లము రంజిలన్నొక మహోన్నత సద్గుణు ప్రీతిపాత్రమౌ
చెల్లికి భార్యకున్ మరియు సిగ్గిలు కోడల కిష్టమైన మే
నల్లుఁడ నయ్యెదన్ సుతుఁడ నయ్యెద ప్రాణవిభుండ నయ్యెదన్              36

తల్లడపడ నేల మదినిఁ
గల్లయె బంధుత్వము లిలఁ గాలము దీరన్
వెల్లువ లెల్ల భవమ్ములు
నల్లుఁడఁ బుత్రుండ మగఁడ నయ్యెద వరుసన్                          35

ఆ ఘన వాతాతప కృత
మేఘ కదంబావకీర్ణ  మిశ్రిత జలమున్
మేఘ పథమున సుమామ
మా ఘన సామరదినకరు లవని నొసగరే                                   34

ఆ వనమందయోనిజకు నర్క సమానులు నుద్భవించి రా
పావనమైన సూర్యకుల పార్థులు తండ్రిని మించు శూరులుం
జూవె మహారథుల్ లవకుశుల్, మరి వైరుల కెల్ల నిత్యమున్
రావణుఁడున్ విభీషణుఁడు, రాముని పుత్రులు ధర్మవర్తనుల్       33                    

ఇన కులాబ్ధి సోములు ధరణీశ సుతులు
కుశలవులు మహావీరులు, కువలయమున
శత్రు రాజులకును హరిస్వప్ను లనగ
రావణ విభీషణులు,  రఘురాము సుతులు                                  32
[ రావణుఁడు = హింసించు వాడు; విభీషణుఁడు = భయంకరమైన వాడు]

నిషిద్ధాక్షరము - క (క, దాని గుణితములు, అది సంయుక్తమైన అక్షరములు) :
విపరీతము గాదె తలుపఁ
గృపఁ జూడఁ  గుచేలుని నిడి హృదయమ్మందున్
విపులమ్ముగ గోవిందుడు
చిపిటాశనుడై యొసగెను సిరి సంపదలన్                                    31

విపరీత దరిద్రుండును
దపోనిరతుడు నిజసఖుడు దననుం జూడన్
విపులమ్ముగ గోవిందుడు
చిపిటాశనుడై యొసగెను సిరి సంపదలన్                                    30
తరళము:
ధరణి దేవుడు నిత్య సత్య పథమ్ము వాడు సుధాముడుం
బరగె మాధవు బాల్యమిత్రు డపార పుణ్య ఫలమ్మునన్
వరదుఁ జూడగ నేగ యిచ్చె నపార సంపద లంతటన్
గురు మహత్వము చాటగన్నడుగుల్ తమిం దిని వెన్నుడున్            29

నీ శర మెక్కుపెట్టి యిక నిల్చి దురాత్మునిఁ జంపఁ గోరినన్
పాశుపతమ్ము వేసి హరి పార్థునిఁ, జంపెను, నిర్దయాత్ముఁడై
యీశుని చేత దుష్ట వర మింపుగఁ బొందిన,  సైంధవాధమున్            28
ఆ శక్రసూను దుష్టుని
నీ శరణాగతి రవిజుడు నింపుగ వేడన్
దాశరధి యతని గళమునఁ
బాశుపతము వేసి, హరియె పార్థునిఁ జంపెన్                                  27

[పాశుపతము = బకపుష్పము (అవిసెపువ్వు); పార్థుడు = రాజు]

గదభి నుత ధర్మ సత్యాను చరిత త
న్మయుల కాలవాలమ యిది రత్న
భూషితాంబుధి వృతము విమల పుణ్య భూ
మి మన భారతావని మరువకుము                                                26

దవ్వుల నుంచు రక్కసుల దర్ప మడంచి  విధేయ మిత్రుడున్
నవ్వు మొగంబు వాడు మన నందకుమారుని రత్నభూషితం ,
బెవ్వని పాదపద్మముల నింపుగ గొల్చెడి ప్రాణమిత్రు డా
కవ్వడి, తేరు టెక్కెమున గారుడరూపము శోభఁ గూర్చెడిన్                 25
                             
రాక్షసాంతకుడు సుజన రక్షకుండు
రుక్మిణీ వల్లభుడు సుందరుండు ఘనుడు
గోపికా మనోహారి, తాఁ గూర్మి సఖుడు
కవ్వడి, రథపతాకాన గరుడుఁ డుండు                                               24            

రాక్షసాంతకుడు సుజన రక్షకుండు
రుక్మిణీ వల్లభుడు సుందరుండు ఘనుడు
గోపికామనోహారి, యే కుజనులకును
కవ్విడి, రథపతాకాన గరుడుఁ డుండు                                             23
[కవ్వు+ఇడి=కవ్విడి = అపహరింపలేని; కవ్వు=అపహరించు]

విను మబ్బుర మిది వాన
ఘనకేతను డర్జునుండు గాండీవి ననిం
గన గుండెలు జల్లు మనవె
యనిశము నభయవరద బిరుదాంకితు డతడున్                              22

భ్రుకుటుల్ ప్రస్ఫుటరీతినిం బరగ శార్దూలౌఘ మందుం, గకా
వికలై పారగ నెల్ల జంతువులు దుర్భీతిన్ దిగంతంబులన్
వికటారావములుం జెలంగ వని నావేశంబునన్, వ్యాఘ్ర శా
బక ముద్వృత్తిని జింక ప్రాణముఁ గొనెం బాపంబుగా నెంచదే                  21

జగతినిఁ బరి కింప నగుపడు సత్యము
జీవి కశన మగును జీవి యొండు
వింధ్యు డొక్క డడవి వింటి విడిచిన యం
బకము రేగి జింక ప్రాణముఁ గొనె                                                        20

మేత మేయు చుండఁ బ్రీతిఁ గురంగము
వీపు పైన నెక్కె వింతఁ గొంగ
వానిఁ జూచి బోయ బాణము వేసి స
బకము రేగి జింక ప్రాణముఁ గొనె                                                         19

భోగ విలాస లాలసులు మూర్ఖుల పల్కులు  గావె చూడ, హృ
ద్రోగము ఖండితం బగును దూరము వారవె సంకటమ్ములున్
రాగసుధారసాకలిత రామజపంబునఁ, బల్కరా దిటన్
భాగవతమ్ము మానవులఁ బాపముఁ జేయఁగఁ బ్రోత్సహించురా!               18

వేగమ యిచ్చును పుణ్యము
భాగవతము,  ప్రోత్సహించుఁ బాపముఁ జేయన్
రేగగ వికారము మదిని
సాగెడు వికృతంపు దుష్ట సాహిత్యమిలన్                                                17

శుష్మం బొప్పు ధనంజయోగ్రపు ధనుస్సుం జూచి విభ్రాంతులై
శ్లేష్మంబందునఁ బడ్డ యీగలన నిశ్చేష్టాంతరంగంబునన్
గ్రీష్మంబంది ధరేశులుంజనిన సత్కీర్తిన్ నరుండుం దనన్
భీష్మాచార్యుఁడు, పాండవుల్ వొగడఁగాఁ,  బెండ్లాడె పాంచాలినిన్                  16
[శుష్మము = తేజస్సు]

మత్స్య యంత్రము భేదించ మహిమ నరుడు
తల్లి పంపు వమ్ముఁ జనక వల్లె యనుచు
పాండవు లొకని పిదప నొకండు, పొగడ
భీష్ముఁడు,  ద్రుపదనందనన్ బెండ్లియాడె                                                  15

మురియం దారలు నాకమందు నిట నంభోరాశు లుప్పొంగగం
బరమప్రీతిని వెన్నెలంగని తమిం బాడం జకోరమ్ములుం
బరువం బందున నున్న కన్యలన సంభావింప కల్హారముల్
సరసీజాతము లుల్లసిల్లి విరియన్ జంద్రుండు వెల్గెన్ దివిన్                           14

కెరటము లుప్పొంగఁ గడలి
దొరతనమున తారల మది దొంగిలి నెమ్మిన్
విరివిగ నెల్లెడఁ గలువలు
సరసీజాతములు విరియఁ జంద్రుఁడు వెల్గెన్                                                13

శృతి సూక్త్యాదర ణార్హ చంద్రముఖి నిశ్శేషాఘ విధ్వంసియున్
నత పాకారి ముఖామృతాశిగణ వీణా గాన సంభావ్య సై
కత రమ్యస్థల హర్షయున్ సుజన శోకక్షీణ సద్భాతి భా
రతి పాదాలకు మ్రొక్కి యీ కవన సామ్రాజ్యాన పేరొందుమా                           12

సతతము సత్కవి కృత స
న్నుత కావ్య పఠనము లందు తుష్ట మనమున
న్నతులిత భక్తిని యా భా
రతిపాదారాధనఁ గవిరాజువు గమ్మా!                                                            11

నవ భావాయత ధర్మ వేద్యముగ సన్మార్గమ్ము బోధింపగన్
శ్రవనానందముఁ గూర్చు శబ్దముల ప్రజ్ఞా పాట వాధిక్యతన్
వివృతంబై మధురార్థ సంహితము గావింపంగ లేకున్నయుం
గవితల్ వ్రాసి పఠించినంతఁ గవి సత్కారమ్ములన్ బొందునే?                            10

విష్ణు చరితముఁ గీర్తించు విద్య విద్య
కన్ననింపుగ నుతియించు కవిత కవిత
భక్తి మనమున నలరార ముక్తి కొఱకు
కవితఁ జెప్పిన కవికి సత్కారమేల?                                                                9

ముంచన్ శుద్ధ విశాలమౌ ప్రకృతినిన్ మూఢాత్ములున్ ముష్కరుల్
పంచం జేరి దురాశఁ జిక్కియు సదా భంజింప వృక్షంబులన్
కాంచన్ నిక్కము దైవ కల్పితములే కల్పాంతమున్ వేగ ర
మ్మంచుం గొండలు మండుచున్న వవిగో మాహేంద్రనీలద్యుతిన్                        8

ఘన ఘనావృత మైన గగనముఁ దాకు
కొండ శిఖరమ్ముల మెరయ మెండు గాను
చారు శంపా లతిక లంత జ్వాల లనగ
మంచు మల యింద్రనీలమై మండుచుండె                                                   7

తరుణుడు పంతముం గొనుచుఁ దా నొనరించును యజ్ఞ వేదికల్
హరణము వేగ వాడు నరకాసురు భీకరు లోక కంటకున్
ధరణిజుఁ గ్రూరు నుగ్రుడును దాపస ఘాతకుఁ జంప సత్యభా
మ రణమునందు తోడ్పడెను మాధవుఁ డెంతయొ మోదమందఁగన్                 6

మాదు తనయ పెండ్లి మహనీయ మౌనిక
సంతసమ్మున మరి సలుప వలదె
వరునకీయఁ బ్రీతి బంధువర్గము సర్వ
మరణ మందు  తోడు మా ధవునకు                                                                5
[సర్వము+అరణము;  అరణము = కట్నము; ధవుడు = పతి]

శ్రీకాకుత్స్థ కులాభి రాముడు జనశ్రేయోభిలాషుండునున్
రాకాచంద్ర నిభాననుండు విలసద్రాజాంగ సంశోభితున్
లోకైకారి వరాంతకుండు రఘువీరున్ మేఘవర్ణుం, దను
శ్రీ, కృష్ణుంగని సిగ్గుతోడ వడిఁ బాఱెన్ సీత పూఁదోటలోన్                                      4
[కృష్ణుడు = నల్లని వాడు]
[తనుశ్రీ = తనువు నందు శ్రీ గలవాడు;  విలసద్రాజాంగ సంశోభితుడు = ప్రకాశమానమైన యవయువములు గలవాడు.] 
పరమేశ్వరుని జటాజూటమునుండి గంగా దేవి ప్రవహిస్తున్న సందర్భము: 
నాకప్రపాతమున్ సలి
లాకరము నుమేశ మూర్ధ రంజిత మతియున్
కాకోలగ్రీవు, నుత
శ్రీకృష్ణునిఁ జూచి సీత సిగ్గిలి పాఱెన్                                                                      3
[సీత = గంగ]

ప్రేమ మయంపు లోకమిది ద్వేషము వీడియు నిత్యముం బరం
ధాముని భక్తిఁ గొల్చుచు నుదారత దీనుల నుద్ధ రించుచున్
సామ గుణంబునం బనులఁ జల్పుచు నిర్మల వృత్తి నుండి ని
ష్కాముఁడవైన ముక్తియె సుఖంబుగ దక్కును లోక మౌననన్                                2

ఇంద్రాది దేవతలు మన్మధుని నీశ్వరునికి పార్వతి మీద ప్రేమ పుట్టింప వేడుకొను సందర్భము:
పార్వతీపరమేశ్వర పావన పరి
ణయము జేయ పూనుకొనుము రయమున నిలఁ
జూడ సామాన్యుడవు గావు సుమ్మి నీవు
కాముఁడవు ముక్తి దక్కుట కడు సులభము                                                         1
[కాముడు = మన్మధుడు]

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి